"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

20 డిసెం, 2009

ఆ గదిలోనే....ఆమె ..

ఆ గదిలోనే,
ఒక నవ యవ్వన యువతీ, హంస లాగా తెల్లని గౌను వేసుకుని, కూని రాగాలు తీస్తూ, లేడి లాగా పరుగులు తీస్తూ , అందరికి సేవలు అందిస్తూ తిరిగింది
ఆ గది లోనే,
మరో నవ యవ్వన యువకుడు, రోగాలు నయం చేసే డాక్టర్ తో చూపులు కలిపింది ,
ఆ గది లోనే,
ముసి ముసి నవ్వులు తో ,చూపులు కలిపి, ఆత్మీయ ,అనురాగ స్పర్శ తో, తనువు పులకరించింది , ఊహలు ,ఆశల పందిరులు వేశింది,
ఆ గది లోనే,
ఒక ప్రేమ పొదరిల్లు కి సోపానాలు, ఒక చిట్టి పాప కోసం, వెచ్చని ఊయలలు, మదిలో అల్లుకున్నది,
ఆ గదిలోనే,
ఆ గది లోనే,
ఒక, అర్ధ రాత్రి, ఒక రాక్షస  రాత్రి, ఒక నిశి రాత్రి, ఒక మానవ పిశాచం , పాశవిక బలం తో, ఒక గొంతు నులిమింది ,
ఆ గది లోనే,
ఆమె, ఒక మానవిత , ఒక సేవ మనస్కురాలు, అదే ఆమె తప్పా??? అదే హాస్పిటల్ లో పని చేసే ఒక వార్డ్ బాయ్ ఆమె కలలు, ఆమె జీవితం, ఆమె లో జీవాన్ని క్రురంగా నలిపి పారేసాడు,
ఆ గదిలోనే,
ముప్ఫై ఆరేళ్ళు గా, ఒక మంచం మీద, చేతులు కొంకర్లు పోయి, కాళ్ళు వంకర పోయి,నోరు  మూగ బోయి, ఒక నిర్జీవ, నిస్చేతన ,అవస్థ లో, ఒక సమాధి లో ఉన్నదీ,
ఆ గది లోనే,
ఆడ వాళ్ళు అంటే అలుసు గా, మగ వాళ్ళు ని పెంచే యీ సమాజం లో, ఆమె ఒక సవాలు గా నిలిచింది , తన ప్రాణం , తనకు ఒక బరువు గా తయారు అయి, చేతులు, కాళ్ళు, సర్వ అవయ వాలు, నిస్చేతనం గా ,ఒక  vegetable లాగ, ఊపిరి పీలుస్తోంది,
ఆ గది లోనే,
ఎందు కమ్మా నువ్వు చని పోతాను అని కోర్టు ని పర్మిషన్ అడిగావు.. ఎక్కడ ఉండమ్మా నీలో జీవం  ఇంకా??
ఆ గది లోనే,
నువ్వు ఉండాలి అమ్మ, యీ సమాజం సిగ్గు తో తల దించు కునేలా, మానవత్వం అంటే, మగ వాళ్ళే కాదు, ఆడ వాళ్ళు కూడా ఉంటారు, ఆడ వాళ్ళు మనుషులే, జీవించే హక్కు, కలలు కనే హక్కు, నడిచే హక్కు, ఊపిరి పీల్చుకునే హక్కు, మాకు ఉంది అని చెప్పడానికి,
ఆ గది లోనే,
నువ్వు జీవించు అమ్మ, యీ సమాజం ని ఎడమ కాలి తో తన్ని, ఆ మంచం మీద ఊపిరి పీలుస్తూ, జీవించు అమ్మా.
ఆ గదిలోనే..
నీ ప్రాణం, నీ జీవితం, నీ హక్కు..
ఆ గది లోనే, జీవించు అమ్మ..
సభ్య సమాజం తల దిన్చుకుంటుంది, నువ్వు తలఎత్తి  జీవించు అమ్మ,
ఆ గదిలోనే....

16 డిసెం, 2009

సినిమాలు, నగలు,మరపు...

సినిమాల్లో అసలు సినిమా కన్నా, ముందు చూపించే సినిమా ఆడ్స్  ఎంత బాగుంటాయో?? ఒకే టికెట్ మీద బోలెడు  సినేమాలు చూసిన ఆనందం వేస్తుంది. అందులో ఇంగ్లీష్ సినమాలు అయితే మరి బాగుంటాయి. ఒకటో, పదో, చూపిస్తారు. యీ సినిమాలు అన్నీ తప్పక చూడాల్సిందే అనుకుంటాము. బయటకి రాగానే మర్చి పోతాము. ధగ ధగ లాడే బంగారం కొట్టుకి  వెళ్తే ,  ఏ  నగ చూసినా ఎంత బాగుందో, యీ సారికి, యీ చిన్న పోగులు, తో సరి గాని, వచ్చే సరి, బోలెడు డబ్బు తెచ్చి యీ నగ ఎలాగైనా కొనాలి అనుకుంటాము. బయటకి రాగానే మర్చి పోతాము . ఇంకా చీరల షాప్ కి వెళ్ళితే,  వెయ్యి రూపాయల చీర కోసం వెళ్ళితే ,రెండు వేల చీర నచ్చుతుంది ఎన్ని చీరలో , నచ్చిన వన్ని కొనడానికి మళ్లీ రావాలని అనుకుంటాము. బయటకి రాగానే మర్చి పోతాము. పత్రిక లో వంటలు చదివి ,అన్నీ చేసేసి ఇంట్లో వాళ్ళని మెప్పించాలి అనుకుంటాము. పుస్తకం మూసేయగానే మర్చి పోతాము ఇంట్లో వాళ్ళు దణ్ణం పెట్టుకుంటారు రహస్యంగా..టీవీ లో వంటలు చూసి చేసేయడం ఇంకా సులువు, అనుకుంటాం.. అమ్మయ్యా. టీవీ ఆఫ్ చేయగానే, మళ్లీ అన్నీ మర్చిపోతాం. యీ మరుపు మనకి చాల మేలు చేస్తుంది. అప్పటి కప్పుడు ఎన్నో అనుకుంటాం. మరో రోజు కి మర్చిపోతాం  లేక పోతే, మనం రోజు సినిమాలు, నగలు, బట్టలు అంటూ పిచ్చి పట్టించే వాళ్ళం కదా..


ఇలాగే ఆస్తా టీవీ లో రామ్దేవ్ యోగ చూస్తూ, మనం రోజు ఇంకా తెల్ల వారే లేచి, ప్రాణాయమం   చేయాలి, ఆసనాలు వెయ్యాలి అనుకుంటాం. టీవీ ఆఫ్ చేసి మరిచి పోతాం. అందరు  బీచ్ రోడ్ లో ఎంత బాగా నడుస్తున్నారో , ఎంత మంచిదో నడక అని పొద్దున్నే అనుకుంటాం, సాయం త్రానికి , మళ్లీ మరిచి పోతాం. మనం ఏమి చేయగలం.. మరపు మనకి ఒక వరం మరి.. లేక పోతే ఒక్కసారి ఆలోచించండి.. రోజు సినిమాలు, నగలు, బట్టల కోట్లు, వంటలే మరి...


ఇంకా అమ్మ నాయనో, జనవరి ఒకటి వస్తుంది. కొత్త డైరీలు కొని, కొత్త కలం కొని,  రంగు రంగు లలో, కొత్త సంవత్సర నిర్ణయాలు రాయాలి. సినిమాలు తక్కువ చూడాలి, నగలు వ్యామోహం, వదిలేయాలి, బీరువాల్లో ఖాళీ లేదు ,కొత్త చీరలు కొనడం తగ్గించాలి, కొత్త వంటలు నేర్చుకుని ఇంట్లో వండి పడేసి, హోటల్లు కి వెళ్ళడం తగ్గించాలి..హమ్మ, హబ్బ.. బరువు పెరిగింది, బరువు తగ్గించాలి.. టైలరు  ముందు పరువు పోతోంది, మీటర్ న్నర కావాలిట ఇప్పుడు..యోగ చేయాలి, నడవాలి ,  తిండి  తగ్గించాలి,ఒక ప్పది కేజీల బరువు తగ్గాలి, అన్నిటి కన్నా ముందు,  రోజు సూర్యోదయం చూడాలి, ఇలాగ, పోద్దేకే దాక నిద్ర మానేయాలి...హా హవులింతలు  వస్తున్నాయి. .. నిద్ర ఎంత సుఖామో అని పాడేయడం మానేయాలి, నిద్రే దరిద్రం ట.. పొద్దున్నే లేవాలంటే, రాత్రి ఇంకా పెందరాలే మంచం ఎక్కేయాలి, ఇంకా మొత్తం.. జీవన విధానమే మార్చు కోవాలి ట.
ఇంకా ఉడికించిన కూరలు తినేయాలి, నెయ్యి, నూనే మానేసి.. సగం హాని వాటి వల్లే ట. అవేం చేసేయో పాపం. ఇంకా రాజు గారు మా టీవీ లో చెప్పినట్టు, ఉప్పు లేని భోజనం, రోజు ఆకూ కూరలు, కారట్టు లే ఫలహారం ట,కాఫ్ఫీ లు, టీలు మానేసి, మంచి నీళ్ళు తాగాలిట. ఉండ గలిగితే ఉపవాసం ఉండాలిట, వారాని కి ఒక్క రోజు, అప్పుడే మూడూ మారు ఆకలి వేస్తోంది, యీ రోజు, ఇవ్వన్ని చేస్తే, సగానికి  కి సగం తగ్గుతాను .. నన్ను నేను బ్రెయిన్ వాష్ చేసుకుని , ఇవన్ని మంచివి అని తల కి ఎక్కించుకుని, ఇదిగో, యీ జనవరి ఫస్ట్ నుండి  అన్నీ త్రికరణ శుద్ధి గా చేస్తాను అని డైరీ లో రాసుకున్నాను..
యధా ప్రకారం, మనకి వరమైన మరపు, మనలని రక్షిస్తుంది, మళ్లీ జనవరి ఫస్టు వరకు....
లేక పోతే, సినిమాలు, నగలు, బట్టలు అని సతా యించే వాళ్ళం కదా, మన మరుపే  మనకి వరం అంటాను...అందుకే మరి.....ఉండనా    మరి..

11 డిసెం, 2009

మన ఇల్లే స్వర్గం.

దూర ,దూర ప్రయాణాలు చేసి, కొండల ఒడ్డున, సముద్రం తీరాన గల, మా ఊరు చేరగానే, మనసు, మల్లెలు తాకినంత మత్తుగా  ఎందుకు అవుతుందో? ఇంకా ఆ రోడ్డు మలుపు తిరిగి, ఆ అప్పు మీద నుంచి లోతుకి కనిపించే ఆ నీలి కాన్వాస్ , గంభిరంగా, ఇంట్లో పెద్దవాళ్ళ లాగా పల రిస్తుంది, బాగున్నావా అంటూ..రోడ్ద్ అంత కొత్త గా అనిపిస్తుంది ఒకసారి, తెలిసిన దే కదా, అని ఇంకో సారి, యీ వీధి మలుపులో బడ్డి కొట్టు అలాగే ఉంది, ఆకూ కూరలు వాళ్ళు అలాగే అరుస్తున్నారు, పని వాళ్ళు అలాగే ఒక ఇంటి నుండి ఒక ఇంటికి పరుగులు పెడుతున్నారు,వాచ్ మాన్, పలకరింపులు,
తలుపులు తెరచి ఇంట్లో అడుగు పెడితే,చందనం కలిపినా సువాసన తో, ఇల్లు పలకరించింది.. జ్ఞాపకాల చందనం అనుకుంటాను..ఇల్లు అలాగే ఉంది.. అది ఏమి మారుతుంది.. నిశ్సబ్దంగా అన్నిటినీ పరిశీలించే గోడల సమూహం కదా.. అనుకున్నాను, నేనే పలకరించాను, నేనే .. వచ్చింది నేనే అని చెప్పాలి కదా. ఇంతలో కరెంటు పోయింది, దోమలు కుట్టి మరి పలకరించాయి.. పాతరక్తం వాసన కి ఆనందిస్తూ..ఇరవై నాలుగు గంటలు ఏసీ , తెల్లని స్వచ్చ  మైన గోడలు, బాదర బంది   లేని ఇల్లు, బిల్లులు తో మనకు సంబంధ మే లేదు.. అయినా. ఎందుకు ఇక్కడికి పరుగులు పెట్టి రావాలని అనిపిస్తుంది. కరెంటు  పోతుంది, బిల్లులు కట్టాలి, పెట్రోల్ డబ్బులు పెట్టి పోయించాలి,రోడ్డు సరే సరి. ట్రాఫ్ఫిక్ రూల్స్ పుస్తకాల్లో ఉంటాయి. మండే ఎండలు, కారే చమటలు, ఒకటే ఉక్కపోత, రాష్ట్ర బంద్ లు , రైళ్ళు లేట్, ఫ్లిఘ్త్స్ లేట్, సమయం అంటే లేఖే లేదు, యీ దేశం, యీ రాష్ట్రం, యీ ఊరు ఇంకా మారవు అని తిట్టుకుంటాను, అయిన, యీ ఊరే నా ఇల్లు అని పిస్తుంది.
ఈ గాలి,  ఈ పలక రింపులు , ఈ మట్టి, ఈవాసన, ఈ కొండలు, ఈ నిశ్చింత,ఈ సముద్రం, ఈ నీలం, ఈ మనుషులు, ఈ ప్రేమలు, ఈ స్నేహాలు, ఈ బంధాలు, ఈఊరు.. నా ఊరు..
ఇంట్లో కరెంటు లేదు, నా మొహం మటుకు వెలిగి పోతోంది.
మన ఇల్లే స్వర్గం.. అని పాట ఏదిఐన  ఉందా పాడుకుందాం...

3 డిసెం, 2009

వలస పక్షులం .

అర్ధరాత్రి  వస్తారు, ఈ వలస పక్షులు.. కలల ను సాకారం చేసుకోవడానికి దూర తీరాలు, వెళతారు ,మూడేళ్ళు కి ఒకసారి, మనసు మళ్ళుతుంది. అమ్మ ని చూడాలి, జన్మ భూమి ని చూడాలని, స్నేహితులు ని పలకరించాలి, తమ విజయాలు ని అందరి తో పంచు కోవాలని. పెద్ద, పెద్ద సూట్కేస్ లు మోసుకుంటూ వస్తారు, ఐ పాడ్లు, బాగులు, పెన్నులు,పూసలు, ఇంకా ఏవేవో మోసుకుని వస్తారు అందరికి తల ఒక గిఫ్ట్. ఖాళీ  అయిన వాటిని మళ్లీ నింపాలి కదా పచ్చళ్ళు  పొడులు, స్వీట్స్ తో. ఇది ఒక నిరంతర ఇచ్చి  పుచ్చుకోవడం..
ఇంక మొదలు ...ఉరుకులు పరుగులు, చుట్టాల ఇంటికి, దూర బంధువుల పెళ్ళిళ్ళు, దగ్గర బంధువుల పుట్టిన రోజులు, అమెరికా కెమెరా కన్ను లో అందరు పడాలి కదా, ఇంకా బజార్లులు కి రోజు పరుగులు, అర్ధ రాత్రి  వరకు షాపింగ్, బట్టల షాపింగ్, బంగారం షాపింగ్,చెప్పుల షాపింగ్,గిఫ్ట్స్ షాపింగ్,స్టీలు గిన్నెలు, కుక్కర్  గిన్నెలు,   కాఫీ ఫిల్టర్లు, తెలుగు కథల పుస్తకాలు, సీడీలు ,పచ్చళ్ళ ప్యాకింగ్, ఇంకా ముఖ్యం గా   టై లర్  చుట్టూ ప్రదక్షణలు, ఇంకా ఇండియా లో టైలర్లు కి ఇంత ప్రాముఖ్యం ఉందా అని తెలుసుకుంటారు. వీసా, పాస్ పోర్ట్,టికెట్ ఉండడం కాదు, ఈ టైలర్ సమయానికి నీ డ్రెస్సులు, జాకెట్లు ఇవ్వడం మీద ఉంది, నీ ప్రయాణం అని కూడా తెలుసు కుంటారు. రోజూ , దేవుడు ని పొద్దున్నే వేడుకుంటారు, నా బట్టలు సమయానికి వచ్చేలా చేయి స్వామి అని, నీ ఉద్యోగం కోసం కూడా అంత ప్రార్ధించి ఉండవు. ఒకొక్క సమయం లో ఒక్కొక్కరు కి ఎంత ప్రాధాన్యం వస్తుందో, నీకు అర్ధం అవుతుంది. టైలర్ అని తక్కువగా ఇంకెప్పుడు చూడవు..మధ్యలో, తిరుపతో, ఇంకో దేముడు తోనో నువ్వు చేసుకున్న ఒప్పందం  గుర్తు వస్తుంది. చిలుకూరి బాలాజీ చుట్టూ ప్రదక్షణలు ఉన్నాయి.. ఎలాగు..ఇంకా , చిన్న చిన్న కష్టాలు కి చిన్న చిన్న దేముడు లతో మొక్కులు ఉన్నాయి, నువ్వు చదివిన స్కూల్ టీచరులు ని కలవాలి, వీలు అయితే, నువ్వు పుట్టిన పల్లెటూరో, చిన్న ఊరో వెళ్లి, నీ ఫేస్ బుక్  ఫ్రెండ్స్ కోసం ఫోటోలు తీయాలి, ఇంకా, ఊటీ వెళ్ళాలి, లేదా అరకు వెళ్ళాలి, పిల్లలు ఉంటే తాజ్ మహల్ చూపించాలి, రాజధాని ఢిల్లీలో తిప్పవద్దూ .. షిరిడి, శ్రీశైలం.. అన్నీ ఈనెల లోపే..
ఇంత లో , ఈ దుమ్ము, వేడి కి జ్వరాలు, దగ్గులు వస్తాయి, ఈ ఇండియా ఎప్పుడూ బాగు పడుతుందో, అనుకుంటూ, ఇబ్బంది పడతావు, వీధి చివర డాక్టర్ ఫరవాలేదా, అపోలో కి వెళ్ళాలా  అని ఆలోచిస్తూ ఉండే లోపు  నీ లీవ్ అయిపోతుంది..
అమ్మో అప్పుడే అయిపొయింది, ఇంకా ఏలూరు పిన్ని ,బెజవాడ అత్తా, రాజమండ్రి మావయ్యల ను చూడనే లేదు, ఏమి అంటారో? ఒక్క తెలుగు సినిమా ధియేటర్ లో చూడాలి అనుకున్న.. ఫ్రెండ్స్ తో పార్టీ అనుకున్నా..బీచ్ లో లాంగ్ డ్రైవ్ అనుకున్నా, ట్యాంక్ బండ్  మీద ఐస్ క్రీం అనుకున్నా, మూడు ఏళ్ళు ఎన్ని కలలు కన్నాము ..
అప్పుడే, సామాను  ప్యాక్ చేసుకునే టైం వచ్చింది. అమ్మబాబోయ్ , ఈ సామాను అంతా ఎలా సర్దడం? ఎంత బరువో? అమ్మో నేను కూడా ఇంత పెరిగాను, నా జీన్స్  లోకి పడతానా? మళ్లీ ఎప్పుడూ వస్తానో, మళ్లీ ఎప్పుడూ తిరుగు తానో ఈ వీదుల్లో, ఈ ఆటో ల లో, ఈ కిక్కిరిసిన సజీవ రోడ్డులు మీద ?  ఎలా వదిలి వెళ్ళడం, నేను పుట్టి పెరిగిన ఊరు , దుమ్ము ధూళి ఉన్న ఈ మట్టి వాసన ఎంత బాగుంటుంది? ఈ భూమి ని వదలి ఎలా వెళ్ళడం? కాని అక్కడ రోడ్డులు ఎంత బాగుంటాయి, గాలి ఎంత స్వచ్చం గా ఉంటుంది, డాల్లర్లు,సుఖాలు ,గుర్తు వస్తాయి.
ఈ దేశం లో పుట్టాను, అక్కడ ఎక్కడో బతుకుతున్నాం, ఇక్కడ జ్ఞాపకాలు కావాలి, ఇక్కడ ప్రేమలు కావాలి, ఇక్కడ మట్టి వాసన కావలి, ఇక్కడ సంస్కృతి కావలి, ఇక్కడ పండుగలు, ఇక్కడ దేముడులు కావాలి.. కాని, అక్కడ డాలర్లు  కావాలి..
అన్నిటిని వదులుకుని మళ్లీ అర్ధ రాత్రి ఎక్కుతాము .... ఇక్కడ అర్ధ రాత్రి ,కాని అక్కడ ఇంకా ఉదయమే కదా..
మళ్లీ , మళ్లీ, వస్తూ పోతూ  ఉంటాము వలస పక్షులం కదా..

1 డిసెం, 2009

నీ పుట్టుక లోనే, నీ భవిష్యత్తు...

నీ పుట్టుకే నీ భవిష్యత్తు నంతా నిర్ణయిస్తుంది, అందులో మన గొప్పతనం, ఏది లేదు అనే చెప్పవచ్చు.నువ్వు ఒక మధ్య తరగతి , మామూలు కుటుంబంలో పుట్టినా నీకు తిండి కి లోటు ఉండదు, మూడో  ఏడు రాగానే బడి లో వేస్తారు, నీ అంతట నువ్వు పని గట్టుకుని చదువు మానేస్తే తప్ప, నువ్వు చదవగలిగినంత నీ తండ్రి, నిన్ను అప్పు చేసి అయినా చదివిస్తాడు . అర్ధ రాత్రి ఇంటికి వచ్చినా నీకు కంచం లో అన్నం ఉంటుంది. నీ తాత గారు, సైకిల్ తొక్కి పని లోకి వెళితే, నీ తండ్రి స్కూటర్ మీద వెళతాడు , నువ్వు ఒక చిన్న మారుతీ కార్ కొనుక్కుంటావు..ఇవి అన్ని  చెప్పడానికి జ్యోతిష్యం  రానక్కర లేదు.
నువ్వు పుట్టిన  కుటుంబం నీ చరిత్ర చెబుతుంది.
ఇంకొకడు, ఒక చెప్పులు కుట్టే ఒక చర్మకారుడి  ఇంట్లోనో, లేక ఒక చేపలు పట్టే ఒక జాలరి ఇంట్లోనో పుట్టాడు, లేదా అడవి లో నివసించే ఒక గిరిజనుడి ఇంట్లో పుట్టాడు, వాడి జాతకం చెప్పడం అంత తేలిక కాదు.
 ప్రతి రోజు ఒక గండమే . బతికి మూడు ఏళ్ళు రావడమే వాడి అదృష్టం. మూడు ఏళ్ళు వచ్చాక  ఏమి చేస్తారు.. బడి లో మటుకు పడేయరు,   మన పిల్లాడి కి లాగా, వీడికి ఇంకా మూడు పూటలా అన్నం ఎలా పెట్టాలి అని ఆలోచనలో పడతారు ఈ లోపల వాడు , అరుగు ల మీద, రోడ్ మీద, చెత్త కుప్పల మీద, అడవి లోనో, సముద్రం అలల మీదో ,ఆడుకుంటూ, పెద్ద పిల్లలని చూస్తూ  పెరుగు తాడు, బడి లో పడేయడమా?? పని లోకి పంపడమా  ? అని ఆలోచన లో పడతారు, ఎక్కడో ఏదో విని, చూసి, వాడికి చదువు అనే పని నచ్చితే , బడికి వెళ్ళతాడు ,  లేక పోతే, బడి అంటే శిక్ష అనుకుని  ఎగ్గొడతారు, బడి కి వెళ్ళిన, ప్రభుత్వ పాఠశాల లో, మాస్టర్లు ఉండరు, ఆడింది ఆట, పాడింది పాట గా పెరుగుతారు. పదో తరగతి ఒక పెద్ద గండం.
అది గట్టెక్కడం ఒక పెద్ద ఘనకార్యం. మళ్లీ, మామూలు గానే, పని లో పడేద్దాం అంటాడు  తండ్రి. ఇంకా ఎవరు చదివిస్తారు? గంజి పోయడమే కష్టం అంటాడు. అతనికి చదువు అంటే ఇంకా ఇష్ఠం  మిగిలితే, ప్రభుత్వ హాస్టల్ లో ఉండి  చదువుతాను అంటాడు, పిల్లవాడు గట్టిగ కోరుకోవాలి, సీట్ దొరకాలి, ఊరి కి మరీ  దూరం గా ఉండకూడదు, ఇన్ని బాలారిష్టాలు దాటితే, మళ్లీ చదువు మొదలు అవుతుంది.
 పుస్తకాలు ఉండవు, స్నానం కి నీళ్ళు ఉంటే మహా భాగ్యం,రెండు పూటలా తిండి పెడితే, ఇంకో భాగ్యం, ప్రభుత్వ అతిథులు కదా, ఎవరికీ చెందరు. మన ఇళ్ళల్లో, పిల్లలు అన్నం వదిలేస్తారు.అమ్మ లు కుక్కి, కుక్కి పెడతారు.
ఆ హాస్టల్స్ లో   వాళ్ళకి ఆ అన్నమే పరవాన్నం.చీమలు పట్టిన, పురుగులు పట్టిన అన్నం, దోమలు పట్టి పీడించే రాత్రులు, అలుసు గా పీడించే పెద్ద ఇళ్ళ పిల్లలు, మీకు అన్నీ ఫ్రీ కదా అని ఏడిపించే పిల్లలు, మీకు మార్కులు రాక పోయిన ఫరవా లేదు, సీటులు గారంటీ అనే మాస్టారులు, వోటులు కోసమే పనికి వచ్చే ఈ పథకాలు లో మాకు వచ్చే ఏ ఉపయోగం గురించి మీరు అంత మమ్మల్ని కట్టకట్టుకుని ఏడిపిస్తున్నారు, అని ఆ పిల్లవాడు, రాత్రి నిద్దరలో ఏడుస్తాడు, ఈ సమస్యల  మధ్య పూట గడవడమే కష్ఠంగా ఎంసెట్ లు, అవీ రాయలి. సీటులు సంపాదించినా మళ్లీ ఫీసులు, పుస్తకాలు, హాస్టల్ , పురుగు లు పట్టిన అన్నం తింటూ,నాలుగు ఏళ్ళు చదవాలి ఒక ఇంజినీరు  అవడానికి. అడుగడుగునా, అనుమానాలే, అవమానలే, ఈ అబ్బాయికి. వీడి భవిష్యతు చెప్పడం.. చాల కష్ఠ మైన పనే.
ఇదే ఒక మామూలు  మధ్య తరగతి పెద్దింటి పిల్లాడికి, మారుతి కొంటాడా ఫోర్డ్ కొంటాడా ? వాడు పెద్ద వాడు అయి  అని చెప్పడం .. ఒక కష్టం  కాదు, వాడు, పుడితే, ఇదీ నిజం అవుతుంది...
చెప్పాను  కదా, నీ గొప్పతనం కాదు, నీ పుట్టుక గొప్పతనం అంతా
నీ పుట్టుక లోనే, నీ భవిష్యత్తు అంతా ఉంది.
ఆక్సిడెంట్ గా మనం ఒక కుటుంబం లో పుడతాం ..ఏదో, ఒక గొప్ప కులం అని సంబర పడి పోవడానికి ,మన గొప్ప తనం ఏమి లేదు.
ఇది గ్రహించి మెలిగితే, ఎవరూ తక్కువ కారు..అని తెలుస్తుంది.
ఇవాల్టికి కూడా రెండు గ్లాసుల పధ్ధతి ఉండి అని తెలిసి, అంబేద్కర్ విగ్రహానికి ఒక వాడి పోయే పూల దండ ఒకటి వేస్తె సరి పోదు..
ఇంకా ఏదో చేయాలి, చాల చాల చేయాలి. అవును అరవై ఏళ్ళు చాలవు ఇంతటితో సరిపోదు వారికి ఇంకా సంపూర్ణ న్యాయం జరిగే వరకూ .. ఈ రెసెర్వెషన్లు కొనసాగాలి .



28 నవం, 2009

మనుషుల్లో రెండు రకాలు..

మనుషుల్లో రెండు రకాలు ఉంటారని.. నాకు అనిపించింది, ఆడ, మగా ఇది కాదు లెండి. మంచి, చెడు ఇది కూడా కాదు, ఇంక ఏమిటి? అంటున్నారా?
నా ఉద్దేశం లో, మామిడి పళ్ళు ని ఇష్తం గా, స్వర్గం కొంచం దూరం లో ఉన్నామని అనుకుంటూ, తినేవాళ్ళు, మామిడి పండు తిన మంటే, పుల్లని చింత కాయని తినమని చెప్పిన్నట్టు మొహం పెట్టె వాళ్ళు ఉన్నారు.మామిడి పండు ఇష్టం లేని వల్ల ?? ఉన్నారు, ఉన్నారు..అలాగే, వర్షం వచ్చింది అంటే, మనసు లో గెంతులు వేసి, ఒక పకోడీ లా పళ్ళెం , ఒక పుస్తకం పట్టుకుని, స్వర్గం అంటే ఇదే , ఇదే అని పాడుకునే వాల్లు, అబ్బ, పాడు వర్షం వచ్చింది, మన ప్రోగ్రాం అంత పాడు చేసింది అని తిట్టు కునేవాళ్ళు, ఉన్నారు, ఉన్నారు. ఎండా కాస్తే, అమ్మయ్య, ఈ రోజు, సూర్య దేముడు కరుణించాడు అని దణ్ణం పెట్టుకునే వాళ్ళు, బబొఇ, ఎండా అని నుదురు చిట్లించి, అసీ లో కూర్చు నే వాళ్ళు, ఉన్నారు, ఉన్నారు. చలి కాలం వస్తే, ముడుచుకు పోయే వాళ్లు ఉంటారు, ఎంత బాగుందో, చల్లని వాతావరణం అని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు.
ఇలాగ చెపితే, ఎన్నో ఉదాహరణలు. మనుషులు రెండు రకాలు.. అని చెప్పడానికి. కష్తాలు వస్తే కుంగి పోయి, నాకే ఎన్ని కష్తాలు ఎందుకు దేముడా? అని కుంగి పోయేవారు.. పోనిలీ, చిన్న కష్తం తో పోయింది ,అని సంతో శిన్చేవాళ్ళు ఉన్నారు. అలాగే, సంతోషం వచ్చినా పట్టలేని వాళ్లు, చలించని వాళ్లు, ఉంటారు. కోపం వస్తే.. ఉగ్ర రూపం లో కనిపించి, ప్రపంచం మీద అంత చూపించే వాళ్లు ఒకరు, లోపల కోపాన్ని అంతా దాచుకుని, శివుడు గరల్లన్ని మింగినాట్టు, పైకి సరళం గా నవ్వుతు ఉండేవాల్ల్లు ఉంటారు. మీరు ఎవరైనా కావచ్చు, ఈ రెండు రకాల్లు లో ఎవరైనా కావచ్చు.
అందరు, పువ్వులని, ప్రేమిస్తారు, మల్లె పూవులు ని ఆస్వాదించని వాల్లుంతర? ఏమో, నాకు రోజా పువ్వులే ఇష్తం, మల్లె పువ్వులు వద్దు అనే వాళ్లు నాకు కానీ పించ లేదు. ఆకాశం లో విరిసే రంగుల హరి విల్లు ని, పిల్లల బోసి నవ్వులని, నది ప్రవాహం ని, జలపాతం గర్జన ని, సముద్రం లో అలలు ని,చందమామ లో చల్ల దానాన్ని, పున్నమి వేలుగులిని, వెండి వెన్నెలని, మండుటెండ లో చల్లని చెట్టు నీదని అందరూ ఆశ్వదిస్తారు.. రెండు రకాలు గా ఉండరు.. ఇక్కడ.. ఇవి అందరకి ఆనందాన్ని ఇచ్చే, సార్వ జననీయ అందాలూ..
చలం చెప్పినట్టు, ప్రపంచం లో కష్తాలు అన్నీ శ్రీ శ్రీ వి, నా కష్తాలు అన్నే ప్రపంచనివి అనే దేవుల పల్లి ...వీరు మటుకు రెండు రకాలే.. మీరు ఈ రకమో, మీకు తెలీదు, మీతో నివసించే మీ భాగాస్వము ని అడగండి. ఖచితం గా చెపుతుంది.. నేను ఎ రకమో..నేను అడగాలి...

25 నవం, 2009

లేమి,కలిమి..అన్నీ ఇక్కడే..

ఇవ్వాళ ఒక వార్త సంకలనం చదివాను, పేరు, రంజన్, ఉండేది చెన్నై లో, అతని ఉద్యోగం అన్నా నగర్ లో- వాన అయిన, ఎండా అయిన ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ,ఒక రోడ్డు చివర నిలుచుని, కారులు పార్కింగ్ చేయించడం, డబ్బులు వసూలు చేయడం, పది హేడు సంవత్సరాల  నుండి ఇదే ఉద్యోగం, వాన లో రైన్ కోట్  వేసుకుని వస్తాడు ట .ఇంకో రాణి, కూడా ఇదే వృత్తి లో మూడు వేలు సంపాదిస్తున్నది   ట.. తన పిల్లల ని స్కూల్ కి కూడా పంపిస్తోంది. ఉద్యోగ భద్రత, ఇంక్రేమేంట్, ప్రమోషన్, సిక్ లీవ్, హాలిడే లు లేవు, ఆదివారాలు కూడా లేవు. ఏమిటి ఈ ఉద్యోగాలు. వీటిని ఉద్యోగం అనాలా ? కడుపు నింపేందుకు చేసే, కనీస ప్రయత్నాలు? అనాలా? వాళ్ళ   ఊరుల్లో ఈమాత్రం కూడా సంపాదించే అవకాసం లేదు అంటున్నారు. ఇక్కడ గల్ఫ్ లో కనీస జీతాలకు, ఇంట్లో ఉండే మైడ్స్ గా ఎందుకు వస్తారు? అను కునే దాన్ని.పిల్లల మూతులు తుడుస్తూ, బుర్గేర్లు అందిస్తూ, వెనక , వెనక నడుస్తూ, నిస్తేజం గా చూస్తూ, ఈ ధనవంతుల ఇంట్లో ఊడిగం ఎందుకు చేస్తారు? దేశం కానీ దేశం లో, కొత్త భాష, కొత్త ఆచారాలు, కొత్త మనుషులు ,అన్నింటిని ఎదురుకుని , మన దేశం లో ఉన్నతన పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం ఎంత కష్ట పడుతున్నారు, ఈ మైడ్స్. మన ప్రభుత్వం ఎందుకు కనీస కూడు, గుడ్డ, నీడ అందించ లేక పోతోంది. ఏమిటి ఈ ప్రజల బ్రతుకులు?
ఒక వేపు, కనీస జీతం తో, కష్ట పడే వాళ్ళు, కష్ట పది    పని చేద్దాము అన్నా, పనిదొరకని వాళ్ళు,ఏదోలాగా బ్రతకడానికి విదేశాలకు వలస వెళ్ళే వాళ్ళు.. మన దేశం జనాభా మనకి వరం అంటున్నారు, సెల్ ఫోన్లు ,సబ్బులు,కారులు అమ్మే మల్టీ నేషనల్ కంపెనీలు మన జనాభా మన ప్రగతి కి శాపం అంటున్నారు ప్రభుత్వాలు.
ఎక్కడుంది లోపం? ఎందుకు మన దేశ ప్రజలు ఇంత కనీస అవసరాలు తీర్చుకునే పరిస్థితి లో లేరు? అదే పేపర్ లో ఇంకో పేజి లో, విండోస్ ని అందం గా కర్తెన్లు  లు ,లేసులు తో అలంకరించు కోవడం ఉంది. అంబానీ లా కోట్లు కోసం యుద్ధం కూడా ఉంది.
కలిమి, లేమి అంత ఇక్కడే ఉంది. లేమి చాల ఎక్కువు గా ఉంది. కలిమి చాల తక్కువే..
ఎక్కడో ఏదో లెక్క తప్పింది.

24 నవం, 2009

కనిపించే హింస.. కనిపించని గాయాలు.

సుకుమారమైన స్త్రీ శరీరాన్ని, సిగేరీట్ పీకలతో కాలిస్తే, ఆడ పిల్ల పుట్టిందని, కాళ్ళతో తన్నితే, అన్నం మాడిందని మొహం మీద కొడితే, జీతం తెచ్చి చేతిలో పెట్టమని ,చేతిలో వాతలు పెడితే, తాగుడు మానేయండి అని చెప్పినందుకు ,బండ బూతులు తిడితే, ఒంట్లో బాగో లేదు అన్నందుకు ఒంటి ని నలిపెస్తే, కన్న వారింటికి వెల్లతాను అన్నందుకు , తల కి కన్నం పడేలా కొడితే, పడేవి కని పించే గాయాలు, నేను ఉద్యగం చేస్తాను అంటే, నీకు ఎవరు ఇస్తారు?.. నీకు వంట చేయడం రాదు, ఆవిడ దగ్గర నేర్చుకో పక్కింటావిడ ని ఆవిడ మొగుడు కూడా ఇలాగే అంటాడుట , నేను ఎంతో కష్త పడి సంపాదిస్తున్నాను , మీరు పడి పడి తింటున్నారు, మీరు కష్త పడితే తెలుస్తుంది, ఒక్క రోజు నేను లేక పోతే గడవదు, మీకు తిండి ఎవరు  పెడతారు, నేను ఆఫీసు లో పడే కష్టం మీకు తెలుసా, ఇంట్లో కూర్చుని తినే వాళ్ళకి ఏమి తెలుస్తుంది, నేను కాబట్టి ఆ ఆఫీసురు దగ్గర పని చేస్తున్నాను, వేరే ఎవరైనా అయితే..ఆ టీవీ అలా చూస్తూ కూర్చో క పోతే , ఏది అయిన నాలుగు డబ్బులు వచ్చే పని చేయ వచ్చు కదా,అసలు డబ్బు విలువ మీకు తెలుసా? పిల్లలు ని పెంచడం వచ్చా? చూసి నేర్చుకో.. ఎవరిని అంటుంది, కళ్ళలో నీరు తిరుగు తుండగా, ఎదురు ప్రశ్నలు వేస్తావు, అందుకే నాకు మంట, ఇల్లు ఒక నరకం..
నేను చాల మంచి వాడిని, నిన్ను కట్నం లేకుండా చేసుకున్నాను, నా అంత మంచి అల్లుడు దొరకడం, మీ నాన్న అదృష్తం, నాకు మీరు దొరకడం నా దురదృష్తం.. ఏమిటీ గొనుగు తున్నావు, ఏమి లేదు, మీరు ఆఫీసు కి వెళ్ళండి, మేము తరిస్తాం... ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అబ్బాయికి జ్వరం, మీకు ఇన్స్పెక్తిఒన్ ఆఫీసులో , కాని ఇంట్లో ఎవరు ఉంటారు? మీరే.. మీ ఆఫీసు మరీ అంత గొప్పదేమీ కాదు కదా. అస్తమాను సెలవులు పెడితే ఆఫీసర్ కి లోకువ, అందుకే, ఆడ వాళ్ళు ఇంట్లో కూర్చో వాలి, ఉద్యోగో అంటారు, సెలవులు పెడతారు.. ఆఫీసురు మగవాడే   కదా..
ఆఫీసు లో ఉద్యోగమూ బాగా చేయాలి, సెలవలు పెట్టకూడదు, ఇంట్లో పను లన్ని చేయాలి, పిల్లలకి చదువు బాగా చెప్పాలి, ఎప్పుడు నవ్వుతూ  ఉండాలి, ఇల్లంతా అద్దంలా ఉండాలి, చుట్టాలు వస్తే, పిండి వంటలు వండి, ఊరంతా తిప్పాలి, అత్తగారిని బాగా చూసుకోవాలి.. ఇంకా శయనేషు  రంభ వగైరా ఉండనే ఉన్నాయి..
అమ్మయ్య.. చాల బాగా చేస్తున్నాను, అవును మరి ,నేను నీకు ఇంత సాయం చేస్తున్నాను కాబట్టి..గట్టిగ మాట్లాడితే సూర్య కాంతం.. గయ్యల్లి , అని పేరులు, ఊరుకుంటే, చాకిరీ, చీదరింపులు.అమ్మ, పాపా, తల్లి, చిన్ని, చిట్టి తల్లి అని పిలి పించుకున్న రోజులు గుర్తు వస్తాయి. మనసు అంతా పిందెస్తూ న్నట్టు బాధ, ఎవరితో చెప్పుకోవడం? నీకు ఇంక జీవితం అంత అత్తిల్లె.. ఇంక వెనక్కి రాకు అని చెప్పి పంపించారు.ఈ చాకిరీ చేయ లేక, ఈ మాటలు పద లేక, అర్ధాంతరం గా జీవితం ముగించేవారు ఒకరు, పిచ్చి వాళ్ళు అయి పోయినవారు కొందరు, మానసిక మైన బాధ అంత శరీరం మీద చూపించి, పేరు లేని జబ్బు తో బాధ పడే వాళ్ళు ఇంకొకరు, ఎందఱో, ఎందఱో, ఎందఱో కనిపించే హింస, కనిపించని హింస.. దాచుకున్న గాయాలతో.. ఎందఱో ,ఎందఱో, ఎందఱో.. స్త్రీ మూర్తులు.
పురుషులందు పుణ్య పురుషులు వేరయా..వారందరికీ నా అభివందనాలు.

పాటలు, డాన్సులు లేని సినిమాలు!!

అమ్మా,మన సినిమాల్లో ఏంటి అమ్మా అలాగా పాటలు పాడి డాన్సులు చేస్తారు ,మనం అలాగా ఎప్పుడు చేయం కదా అమ్మా అని ,మా అబ్బాయి అడిగాడు ,నన్ను ఒకసారి. ఇంగ్లీష్ సినిమాలు, చాల బాగుంటాయి అని వాడి నమ్మకం. సినిమా ఒక దృశ్య కావ్యం రా బాబు, మనకి అందం గా కనిపించి ,మనం ఎప్పుడు వెళ్ళని స్విట్జెర్లాండ్ , నయాగరా, ఊటీ, కొడైకనల్ అన్నిటిని మనకి చూపిస్తారు కదరా పది రూపాయిల టికెట్ తో(ఇప్పుడు వంద రూపాయిలు ) అన్నాను. అయిన, అమెరికా లో హీరోలు ప్రపంచాన్ని అంతా , ఒక చేత్తో హీరోయిన్ ని పట్టుకుని, ఇంకో చేత్తో రక్షి స్తున్నట్టు చూపించరా?అంటే వాడు ఒప్పుకో లేదు. చాల బాగుంటాయి అని వాడి ఘట్టి నమ్మకం.
పాటలు లేని, డాన్సులు లేని సినిమా ఊహించుకుంటే.. ఎంత చప్పగా ఉందొ? ఉప్పు లేని కూర లాగా? ఆరోగ్యానికి మంచిదే కాని, ఉప్పు లేని కూర రోజు తినగలమా, మన గలమా?
నీవేనా నను వలచినది ? అని,మన  మనసున మల్లెలలు మాల లూగెనే అంటూ అనుభూతి పొంద గలమా..దేవులపల్లి, శ్రీశ్రీ, నారాయణ రెడ్డి, వేటూరి, ఆరుద్ర, కష్త  పడి  రాసిన భావాలు మన సొంతం చేసుకుని, సందర్భాన్ని బట్టి , పాడు కుని ఉండే వాళ్ళమా? మిస్సమ్మ లో సావిత్రి పాట లేకుండా చేసిన డాన్స్ ఎంత బాగుంటుంది, మనకి అచ్చం  అలాంటి రాజ కుమారి కలలు రాలేదూ ? ఒక గుమ్మం లో ఊటీ, లో న్చి వెళ్లి, ఇంకో ఫ్రేం  లో, రాజస్తాన్ ఎడారులలో రావడం మనకి ఏమి హస్చర్యం గా ఉండదు. ఒకే రోజు లో ఊటీ ని, సహారా ని చూపించే ఎన్నో సందర్భాలు మన ఇంట్లో నే ఉంటాయి. నువ్వు ఎంత మంచిదానివి అన్నప్పుడు, ఊటీ లో ఉన్నట్టు, ఈ కూర ఏమిటి ఇలా తగలడింది అన్నప్పుడు సహారా లోను ఉన్నట్టు అనిపించదూ??అదీ కొంచం రంగుల్లో చూపిస్తారు.. ప్పది రూపయలికీ..ఒక్క రోజు కనిపించక , మరో రోజు కనిపించే సరికి, మనం ప్రేమించే వాళ్ళు, మనసు, చేసే నాట్యమే కదా వాళ్ళు చూపించేది .రాఘవేంద్రరావు అయితే, బిందెలు, గిన్నెలు, కూడా ఉంటాయి.. మన వంటిల్లు ని గుర్తు చేస్తూ..ఊహల్లో తేలిపోతూంటే , మబ్బుల్లో కి ఉండదూ మనకి??? ఇంక ఏదైనా శుభ వార్త విన్నప్పుడు, మా అబ్బాయి కి ఫస్ట్ క్లాసు వచ్చింది లాంటి వి,ఎగిరి  గెంతేయమూ? .. అదే కొంచం ఎక్కువ చేస్తారు మన సినిమాల్లో ..అన్నా ,మా అబ్బాయి ఒప్పుకోలేదు.
ఇప్పుడు అమెరికాలో, లండన్లో  మన డాన్సులు చేయడం డబ్బులు తీసుకుని నేరిపిస్తున్నారుట     .. అన్నాను, అయిన, వాడు .. ఊహు.. అన్నాడు తల ఆడిస్తూ..
ఐశ్వర్య రాయి ,ఐటెం డాన్స్ చేసింది, అభిషేక్ ని పెళ్లి చేసుకుంది. అమితాబ్ ని ఆకట్టు కుంది. మాధురి తో పోటిగా , కథ ని మార్చి, ఐశ్వర్య రాయి తో డాన్స్ చేయించాడు, సంజయ్ లీల భంసరి, దేవ దాసు, కొత్త సినిమాలో..సెవెన్ వన్దేర్స్ తో మన ఐశ్వర్య వొండేర్  ని కలిపి డాన్స్ లు చేయించారు, కదిలే రైలు మీద, షారుక్ ఖాన్ తో, మల్లికా ని కలిపి చయ్య చయ్య మని మణిరత్నం.కూడా చేయించాడు.. ఎంత బాగుంటుందో?? అని పరవశించి పోతే, కదిలే రైలు మీద డాన్స్ ఏమిటమ్మా , కేసు పెట్టాలి, సేఫ్టీ  లేకుండా, ఈ గెంతులు తీసినందుకు అన్నాడు.అక్షయ కుమార్ కోట్లు సంపందించాడు ఇలా గెంతులు వేసి, దేవానంద్ గైడ్  లో వహీదా రెహమాన్ తనకి దక్కదని తెలిసిన కూడా, పెద్ద పెద్ద సెట్టింగులు తో, అద్భుత మైన డాన్సులు చేయించాడు. దేవేనంద్ చూపించిన పచ్చని , చల్లని ప్రదేశములు  ఎన్నో? ఎంత అందం  గా ఉంటుందో ప్రతి ఫ్రేం  అన్నాన్నేను, తన్మయత్వం తో..బర్మన్  గారి సంగీతం తో కిషోర్  కుమార్ పాడిన పాటలు, రఫీ  పాడిన  ,ప్రేమ గీతాలు , ఇష్క్  అంటూ మధురం గా పలికే రఫీ , లేకపోతే ఈ ప్రపంచం  ఒక చెవిటి   ప్రపంచం లాగా ఉండదూ??? అయినా  ఒకప్పుడు, రేడియో   , ఇప్పుడు ఈ  టీ వి వాళ్ళు ఎలా నింపుతారు  గంటలు , ఈ పాటలు, డాన్సులు లేక పోతే..
అమ్మా అంటూ గావు  కేక , తుళ్ళి  పడ్డాను .. షాక్  కొట్టినట్టు , ఊటీ లోంచి    ఎడారి  లో పడ్డట్టు  అయింది. ఏమిటి రా అంటూ అరిచాను ..
అమ్మా ఇదుగో  చూడు, చాల గ్రేట్  అమ్మా .. యు  ట్యూబ్  లో చూడు, వీళ్ళు    ఐస్  స్కేటింగ్   చేస్తున్నారు , మన హిందీ  పాటలు కి.. గజరా  రే  , ఇంకా పాటలుకి .


హమ్మయ్య .. శంఖం  లో పోస్తే  తీర్థం  అయింది. వాళ్ళు చేస్తే.. అదే ఆ అమెరికా వాళ్ళు , మా అబ్బాయి ఒప్పుకున్నాడు , ఎంత గ్రేట్  ఓ , మన పాటలు, డాన్సులు.
యాహూ !!! రాకింగ్ !!!!!

23 నవం, 2009

పెద్ద గీత, చిన్న గీత.

దేవుడా, దేవుడా.. అమెరికా లో విమానాలు నీళ్ళ మీద కూడా దింపుతారట.  ఇండియా లో నేల మీద కూడా కొంచం ముందు కు వెళ్లి   దింపుతారట .ఇన్ని సార్లు, అటు, ఇటు తిరుగు తున్నాము..
దేవుడా, దేవుడా, హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ ట, మా ఊరులో, డెంగు జ్వరాలు ట, పెద్ద వాడి కి ఉజ్జోగం ట, చిన్న వాడి కి ఫస్ట్ క్లాసు మార్కులు ట, సంవత్సరం పొడుగునా ఎండలు ట, పవర్ కట్లు ట, పెట్రోల్ ధర మళ్లీ పెంచేరుట ,కార్ కి రిపైర్లు వేలల్లో అవుతాయట,  కొత్త కార్ కొనుక్కోమని ఇన్సురన్సు వల్ల సలహాలు ట, రోడ్స్ అధ్వాన్నం గా ఉన్నాయి ట, మొన్న కురిసిన ఒకే ఒక వర్షానికి కార్ కి మళ్లీ టైర్ లు  మార్చాలి ట, ఇంటి పన్ను పెంచేసారు ట, కరెంటు బిల్ చూస్తే ,గుండె దడ వచ్చిందట, అప్పోల్లో కి వెళ్ళితే ఇంతేను ట, ఇంకా, అమ్మో  ఎన్ని   కష్టాలో.. దేవుడా, దేవుడా..

బడి లో ఇవాళ ,హోం వర్క్ ఇచ్చిన టీచర్ వస్తుందా, దేవుడా, దేవుడా.. ఆ బాగా చదివే బడాయి పిల్ల గుర్తు చేయకుండా ఉంటే బాగుండును.. మార్కులు తక్కువ వచ్చేయని ఇప్పుడే చెప్పయాలా  ఇంక రిపోర్ట్ కార్డు ఇచ్చాక చూసు కోవచ్చు, దేవుడా, దేవుడా, ఇంక కొంచం మార్కులు కలపవా ??

ఇవాళ బడి త్వరగా ,సెలవు ఇచ్చేస్తే బాగుండును, ఏఎనార్ సినిమ కి వెళ్ళాలి, టికెట్స్ దొరకవు ఎలాగా? దేవుడా దేవుడా?? లెంపలు వేసుకుంటా , ఎవరైనా పోతే బాగుండును.. అయ్యో పాపం.. పాపం.. అమ్మ ఆ విరిగిపోయిన కప్ చూసి ఉంటుందా? ఇంట్లో, మంచి కప్పులు లేవంటే, నాన్న గారు హైదరాబాదు నుంచి తెచ్చారు, పొద్దున్నే చెయ్యి జారి, పగిలి పోయింది, ఇవాళ తన్నులే, తిట్లే.. తమ్ముడు నా పెన్ దాచేసేడని కోపం వచ్చి, వాడి పుస్తకం గూట్లోంచి తీసి, బీరువాలో  పడేసింది,బుద్ది చెప్పాలని, వాడు బడి మానేసి, ఇంట్లో అల్లరి చేస్తే, అమ్మ నన్ను ఎంత తిడుతుందో.. పెద్ద దానివి నీకు బుద్ది లేదా అని.. దేవుడా దేవుడా ,నాకే ఎందుకు ఇన్ని కష్టాలు.
ఇంకో రోజు కల, ఒక పరీక్ష అనుకుని ఇంకొ కటి చదువుకుని వెళ్ళింది, ఇంగ్లీష్ అనుకుంటే, లెక్కలు పరీక్ష, దేవుడా, దేవుడా, అనుకుంటే, కల అని మెలకువ వచ్చింది.. అమ్మయ్య దేవుడు విన్నాడు ఇవాళ, పబ్లిక్ పరీక్షా, హాల్ టికెట్ మర్చి పోయాను, దేవుడా , దేవుడా అని ఏడుస్తుంటే, టీచర్ నన్ను ఓదార్చారు. రేపు, తీసుకు వచ్చి ,చూపించ మన్నారు. ఇది కూడా కల ఏనా , నిజామా.. నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి.
ఇంట్లో పని చేయవు అని అమ్మ తిట్లు, తమ్ముడు తో తగవులు, ఎప్పుడు వాడినే ఎందుకు సపోర్ట్ చేస్తారు? అక్క గా ఎందుకు పుట్టించావు దేవుడా, దేవుడా?? నా పుట్టిన రోజు కి కొత్త గవును  కొంటారో కొనరో.. అసలే నెల  మధ్యలో, కొనక పోతే, బడి మానేస్తాను కాని, వెళ్ళను, దేవుడా, దేవుడా, ఇవాళ నాకు నాన్న గారి చేతిలో.. బాబోయ్  దెబ్బలు తప్పవు, కొత్త  గా కొని ఇచ్చిన గవును కి  గుచ్చి పెట్టుకున్నాను, పైన కేప్, మిగిలింది, కింద నుంచి పెన్ ఎక్కడో పోయింది, ముందే ఏడుపు వస్తోంది, ఎంతో ఖారిడయానది.. ఎంత బుద్ది లేదు నాకు, సరదా లేదు, కొనక, కొనక, మంచి పెన్ కొంటె, ఇలా పడేసాను, ఇంక జన్మ లో నాకు పెన్ కొనరు, దేవుడా, దేవుడా, నా పెన్ నాకు దొరికేలా చేయి, ఇంక ఎప్పుడు ఏమి అడగను..

చిన్నప్పటి కష్టాలు అన్నీ దేవుడు తీర్చి నట్టే ఉన్నాడు, ఇంత పెద్ద యాను  కదా, ఎవరి చేతిలో దెబ్బలు తినకుండా.. కానీ, ఇప్పుడు ఈ కష్టాలు .. ఎవరు తీరుస్తారు?

దేవుడా, దేవుడా, ప్రపంచం అంత కష్టాలే.. ఎన్నని తీరుస్తావు? దేవుడా, దేవుడా...

పుట్టిన రోజులు..

దూరదర్సన్ లో వేదిక మీద, సమాజం మీద సినిమాల ప్రభావం ఉంది అనీ లేదు అనీ వాదించు కుంటున్నారు.. మొన్ననే ఒక పుట్టిన రోజు ఫంక్షన్ కి వెళ్లి వచ్చాం. అక్కడ అంద మైన అమ్మాయలు, మన్ని ఆహ్వానించి, కూర్చో బెట్టి, ఆట పాట లతో అలరించి, కేకు కట్ చేయించి, ఫోటోలు తీసి, బఫే భోజనాలు తినిపించి, పిల్లలకు, రిటర్న్ గిఫ్త్స్ ఇచ్చి ,త త చెప్పారు.. బయలు దేరుతూ.. పుట్టినరోజు విషెస్ చెప్పడం మరచి పోయాము అని ,వాళ్ళని వెతుక్కుని, విషెస్ చెప్పి అర్ధ రాత్రి, బయట పడ్డాము.ఎవరు, ఎవరి కోసం చేసారో, ఎవరి పుట్టిన రోజో .. హోటల్ వాళ్ళు బతకాలిగా!!
మా చిన్నప్పటి పుట్టిన రోజులు గుర్తు వచ్చా యి , దారి పొడుగునా,
ఈ నెలలో , మన పుట్టిన రోజు అని మనకి ఒకటే ఆనందం.అమ్మలకి కంగారు, ఏదో స్పెషల్ చేయాలిగా, నాన్నలకి ఇంకో కంగారు, నెల మధ్యలో, కొత్త గౌను కొనాలి గా. స్కూల్ లో ఫ్రెండ్స్ కి హడావిడి, ఎలా చెప్పాలి విషెస్, అని, పుట్టిన రోజు అమ్మాయి కి మటుకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం, తానూ ఇంకో సంవత్సరం పెద్ద అవుతుంది, ఆ ఒక్క రోజు అందరు ముచ్చట గా చూస్తారు.స్కూల్ లో క్లాసు టీచర్ అందరి చేత బర్త్డే పాట పాడించేది. క్లాసు లో చోకలతెస్ పంచడము తక్కువే..అందరు, విషెస్ చెప్పక, ఇంటర్వల్ లో ఆటలు ఆడుకోవడం, ఆ ఒక్క రోజు , ఉనిఫోరం లేకుండా, కోత గూఉను లో ,వేరే గా స్పెషల్ గా ఉండడం, ఇంటికి ,ముఖ్యమైన ,ఇష్టమైన , దగ్గరి ఫ్రెండ్స్ వచ్చి ,అమ్మ వండిన, జంతికలు, స్వీట్.. ప్లేట్ లో పెట్టుకుని తినేసే, చాల సేపు, హోం వర్క్ కూడా మర్చి పోయి, ఆడుకోవడం.. మళ్లీ ఎప్పుడు వస్తుంది, ఇంత గొప్ప రోజు, సంవత్సరం కా అని కలలు కంటూ ,నిద్ర పోవడం.. అవే మా పుట్టిన రోజు ముచ్చట్లు.
హిందీ సినిమా లో చూసామో, తెలుగు వాళ్ళు కాపీ కొట్టారో, బల్లోన్స్ తగిలించి, పాటలు పడుతూ, పిఅనో మీద, కేకు కట్ చేయడం.. అదో పెద్ద పార్టీ లాగా హడావిడి చేయడం చూసాం.. ఎన్నో సినిమాల్లో. మనం కూడా.. ఎప్పుడు అలాగా చేయాలనీ అనుకున్నామో, ఎప్పుడు ఎవరు మొదలు పెట్టారో...ఇప్పుడు కేకు లేని బర్త్డే పార్టీ లేదు.. అది కూడా అర్ధ రాత్రి , ఫ్రినేడ్స్ అందరు కలసి, ఇంట్లోనో, ఒక్కోసారి, రోడ్ మీదో, అరుపులు ,కేకలు తో హడావిడి చేయడం మామూలు అయి పోయింది. మనం చిన్నప్పుడు ఎంత సరదాగా చేసుకున్నామే ,చెపితే నమ్మలేరు. కేకు , కొవ్వతలు లేని పార్టీ !! అని హస్చర్య పోతారు.
చిన్న పిల్లలం కలవడం, కొత్త డ్రెస్ వేసు కోవడం, దేవుడు కి దణ్ణం పెట్టుకుని , పెద్ద వాళ్ళకి కూడా దణ్ణం పెట్టి, అక్సిన్తలు వేయించు కోవడం , ఒక్కోసారి, వాళ్ళు, ఏవో నోటులు, మన చేతిలో పెట్టడం, దానితో, ప్రపంచాన్ని కోనేయ వచ్చు అని నమ్మేయడం, పాటలు పాడుకోవడం, ఆటలు ఆడుకోవడం, ఇంట్లో పెద్ద వాళ్ళు ,ఒక కన్ను వేసి , మధ్యలో హేచారిస్తూ.. రేపటి స్కూల్ గురించి గుర్తు చేసి, ఇంక చాలు అనడం, అయ్యో , ఈ రాత్రి అవకుండా, ఆపితే దేవుడు ఎంత బాగుంటుంది అని మద్యలో ప్రార్ధించడం..ఆ ఒక్క రోజు మనమే రానులం, మహా రానులం.. లాగా అద్భుతం గా, గొప్పగా, గడచినా ఆ పుట్టిన రోజులు ఎంత మధుర మైనవి.
ఇలాగ ,ఎవరో, పాటలు పాడి, ఎవరో ఆటలు ఆడించి, ఏదో హోటల్ లో ,ఈ పార్టీస్ ను చూస్తే.. అమృతం తాగి, ఒక కోరిక కోరుకుని, మళ్లీ మన పుట్టిన రోజులు పొందాలని అని పించటం లేదు..
సినిమాల ప్రభావం ..ఉంది .. ఉంది.. ఉంది...

పాపా,అక్క,భార్య,తల్లి...లేని రోజు ..ఎడారే కదా..

చిన్న చిన్న పిలకలు వేసుకుని ,గంపెడు పుస్తకాలు మోసు కుంటూ వెళ్ళే ఒక చిన్న పిల్ల,
అమ్మ కి బుల్లి బుల్లి చేతులతో సాయం చేయడానికి ప్రయత్నించే బుల్లి బుల్లి చేతులు,
ఆ చేతులతోనే తమ్ముడు కి స్నానం చేయించే అమ్మకి నీళ్లు అందించే అక్క చేతులు,
ఇంటికి, అలసిన నాన్న , ఇంటికి రాగానే, మంచి నీళ్లు అందించే కూతురి చేతులు,
అద్దం లో అందమైన తన మొహం చూసుకుంటూ ,పౌడర్ రాసుకుంటూ , మురిసి పోయే ముచ్చటైన చేతులు,
అన్నం వడ్డించే చేతులు.. పండగ కి ముగ్గులు పెట్టే  చేతులు ,చేలో పంటలని కోసే చేతులు,
చీర కట్టుకుని ,పైట  వేసుకునే చేతులు , ఇల్లు అలికే చేతులు, అక్షరాలు దిద్దే చేతులు,
అక్షరాలు దిద్దించే చేతులు, సైకిల్ తొక్కే చేతులు, కళ్లు మూసు కుని దొంగాట ఆడే   చేతులు,
అమ్మని చుట్టుకుని ముద్దులు గుడిచే  చేతులు, అమ్మాయి చేతులు, అందమైన చేతులు,
ఈ చేతులు, ఈ అమ్మాయలు మనకి ఇంక కనిపించక పోతే???
మన దేశం లో ప్రతి సంవత్సరం , మూడు లక్షల మంది ఆడ గర్భస్థ శిశువులని చంపేస్తున్నారు .
పుట్టక ముందే చంపేయడానికి వాళ్ళు చేసిన నేరం ఏమిటి???
ఇది అన్నిటి కన్నా ఘోరమైన హత్య, పాపం.
ఏమి చేయాలి మనం.. ఇది ఆపడానికి..
మనం ఆడపిల్లల మని గర్వ పడాలి, గర్వ పడేలా, మన పిల్లలని పెంచాలి. అడ పిల్లలు ఎందు లోను తక్కువ కారు అని ఎలుగెత్తి  చెప్పాలి. మన లో తర తర లు గా పాతు కు పోయిన అపోహలు ని తొలగించుకోవాలి. ఆడపిల్లలు కి సమానం గా స్వేచ్చ , అధికారం , గురవం ఇవ్వాలి.
మన లోను ఉన్నా న్యూనత భావాలను తొలగిం చుకోవాలి.
ఆడవారూ.. మీరు సగం కాదు.. మీరు సంపూర్ణం.
మీరు ఆకాశం, భూమి కాదు, మీరు ఒక స్పందించే, ఆలోచించే హృదయం,ఒక మెదడు, ఒక శరీరం, ఒక దృష్టి, ఒక చేయూత, ఒక నిలకడ..ఒక సూర్యుడు, ఒక శక్తీ.
ఈ ఆడపిల్లలే లేని దేశం ఉహించు కొండి.
అది ఒక ఎడారి.. మెలకువ తెచ్చుకుంటారా . ఇప్పటికైనా ???

22 నవం, 2009

మా సోషలిస్ట్ అమ్ముమ్మ

కథ ని చెప్పడం, నేనే ఎడిట్ చేసుకోవడం , నేనే పబ్లిష్ చేసుకోవడం..నేనే చదవడం ..ప్రమాదం లో పడకుండా ,ఏవో ప్రయత్నాలు చేస్తున్నాను  లెండి. నన్ను గురించి కథ రాయవు? అంటూ చాల మంది కుముదంలు,నేనో  అంటూ ఇంక ఏవో సందర్భాలు క్యూ కట్టాయి. అన్నిటిని కాదంటూ, ఏమే వసంత ఏమిటి రాస్తున్నావు అంటూ చొరబడింది. మా అమ్ముమ్మ అందరు అమ్ముమ్మలు మనవ రాళ్ళకు ,ఏదో ఒక బంగారం గొలుసో, గాజో ఇస్తారు ,వాళ్ళ జ్ఞాపకం గా. మా అమ్ముమ్మ మాకు, పువ్వులు, పిచ్చి పువ్వులైనా  సరే, రాళ్ళూ రప్పలు, పూసలు, పిచ్చి దండలు వీటిని ప్రేమించడం ఇచ్చింది, తన గుర్తుగా.
ఏ  పువ్వు చూసినా  ఎంత బాగుందో అని ,తెంపుకుని రావడం మా అమ్ముమ్మ ప్రత్యేకత.అవి వేరే వాళ్ళ ఇంట్లోవి, అదే మా కలత. అయితే ఏమిటీ అని దిక్కరించడమే తన లో గొప్ప. మంచి నీళ్లు తాగే గ్లాసులు , ఖాళీ  అయిన బోర్నవీటా  సీసాలు తన పువ్వులికి ఆరామాలు. పువ్వులే కాదు మధ్యలో, పచ్చ గా రెమ్మలు ,తొంగి చూస్తుంటాయి. ఇకేబన అందాలూ ఆవిష్కరించ బడ్డాయి, కాని తాగడానికి గ్లాసు ఏదీ , అని అరిచే వాళ్ళు ..
గుండ్రటి రాళ్ళూ ని ఎంచి, ఎంచి, ఒక మూల పరిచి ఒక పార్క్ తయారు చేసేది ఇంట్లో . గుండ్రటి రాళ్ళూ ,చేతిలో ఎంత బాగుంటాయో .. కాలం చెక్కిన శిల్పాలు కదా..ఎప్పుడు పడితే అప్పుడు బయటకి వెళ్లి పోవడం, గూట్లో ఉన్న చిల్లర తో ఏవో పూసలు , కొనుక్కుని వచ్చి, ఇదిగో ఇది నీకే అని ఆ రోజు నచ్చిన మనవరాలు కి ఇవ్వడం తన గొప్పతనం. తనకి, ఎప్పుడు ఎవరు నచ్చుతారో  , ఎందుకో, ఎవరు చెప్పలేరు.. దేవుడు లాగ  అన్నా మాట. నచ్చింది   చేయడం, ఎవరిని  లెక్క  పెట్టక పోవడం, ఏదో వెర్రి శక్తి  తో బలంగా తన కి నచ్చినట్టు  ఉండేది. మేము ఆట బొమ్మలం తనకి.. నచ్చితే  ఆడుకునేది, లేకపోతే పోమ్మనేది.మనకీ  అలాగా ఉండాలని ఉంటుంది కానీ, మర్యాద ముసుగు కప్పుకున్నాం  కదా, ఉండలేము మనం అలాగా.
తన వాళ్ళు అందరు , అంటే, తన మనవలు, మనవరాళ్ళు, చాల గొప్ప వాళ్ళు, ఐదో క్లాసు  పాస్ అయినా  ఎంత గొప్పో, మాకు ఎంత గొప్ప గా ఉండేది. అమ్ముమ్మ అలా పొగుడుతూ ఉంటే , చిన్న పిల్లలం కదా, ఇప్పుడు ఎవరు అంటారు, నువ్వు ఇంత గొప్పదానివి  అని, మనకి మనం తప్ప. అందం గా ఉంటే చాలు, అదీను, తెల్లగా  యే  కులం, వర్ణం అయిన ఫరవా లేదు, మన పిల్లలికి చేసుకుంటే.. అని అమ్మల కోపానికి గురి అయేది.. దొంగ చూపులు చూసే మనవరాలు కి బాగానే ఉండేవి  అమ్ముమ్మ మాటలు.
అందరికి పేరులు పెట్టడం, వడ్రంగి వాడు లా ఉన్నాడు అని ఒక అల్లుడు ని,కాల్చిన వంకాయ లా ఉన్నాడని ఇంకొకరు, జామ  కాయలా  ఉన్నాడు  అని   పొగడడం నచ్చితే, మాకు అన్ని ఇలాంటి రౌడి బుద్దులు  నేర్పింది మా అమ్ముమ్మే..
కొన్ని రోజులు, రకరకాల ,రంగు రంగుల కాగితాలు ని తెచ్చి ఒక గది అంత నింపింది. స్టేషనరీ సెక్షన్ లోంచి కదలని నా కాళ్ళా  కి ఇంత కథ ఉందా    ? అని ఇప్పుడు అనిపిస్తోంది. ప్రకృతి అంత నిండి ఉన్న రంగులు, పువ్వులు, రాళ్ళు, రప్పలు, పూసలు, రెమ్మలు, అన్నిటిని ప్రేమించడం నేర్పింది మా అమ్ముమ్మ.
అందం ఎక్కడ ఉన్నా ఆస్వాదించాలి, పక్కింట్లో పువ్వులు అయితేనేం. మన ఇంట్లో కి తెచ్చు కోవడమే, నచ్చాయి కదా నీకు.. అనే  మా సోషలిస్ట్ అమ్ముమ్మ ని ఎవరు మాత్రం మిస్ అవరు.
అందుకీ నేను పువ్వులు పెంచను , కోసుకుంటాను... హాయ్ హాయ్..

మా బాదాం చెట్టు చెప్పే కథ.

ఒక పెద్ద అరుగు  దాన్ని కాపాడుతూ నేను ఒక పెద్ద బాదాం చెట్టు. ఎప్పుడు చూసినా, గలగలా మని ఒకటే మాటలు, నన్ను నిద్ర పోనివ్వకుండా  ఒకటే    మాటలు. ఒకరా, ఇద్దరా నలుగురు ఆడ పిల్లలు,వాళ్ళ స్నేహితురాళ్ళూ,తలో మూల కూర్చుని ఒకటే కబుర్లు. కాఫీలు, టిఫిన్లు, కబుర్లు అన్నీ అక్కడే ఆ అరుగు మీదే. నా నీడనే . నాకు చాల రహస్యాలు తెలుసు. వాళ్ళ భయాలు, బెంగాలు, నవ్వులు, తుళ్ళింతలు, స్నేహాల లోతులు, అనుమానాలు,అనుబంధాలు, ప్రేమలు,విడిపోవాడాలు, అక్క చెల్లెళ్ళ కబుర్లు,కలహాలు, కలసి పోవడాలు, తమ్ముళ్ళు తో తగవులు, చెల్లళ్ళ కి  అన్నయ్య తో గొడవలు, ఒకే పెన్ను కోసం కీచులాటలు ఇంకో రబ్బర్ కోసం సాగులాటలు, నా చెట్టు నుంచి కాయలు కోస్తూ , ఒక అమ్మాయి పడిపోయింది పాపం, పన్ను కూడా విరిగింది.
అప్పుడు, ఆ అబ్బాయి  అరిచాడు, అమ్మా , రేణు పడిపోయింది, పన్ను విరిగింది అంటూ నాకు చాల నవ్వు వచ్చింది. మగ పిల్లలు కూడా ఉన్నారు లెండి ఆ ఇంట్లో, ఇద్దరు, కానీ వాళ్ళ మాటలు ఈ ఆడపిల్లల నయాగరా హోరు లో వినిపించేవి కావు. ఇలాగ అప్పుడప్పుడు నవ్వించేవాడు, వాళ్ళని ఏడిపించి.ఇంకో అబ్బాయి కారంస్ బోర్డు మీద ఎక్కి కూర్చుని ఆడేవాడు, ఎప్పుడు నేనే గెలవాలని గోల చేసేవాడు, ఆఖరి వాడు కదా అని ఊరుకుంటీ, అని అక్కలు గొడవ..
మంచాలు మీద పడుకోవడం, చదువుకోవడం, పరీక్షలని బెంగలు , టీలు తాగడం, రాత్రి ఆకలని అమ్మని లేపడం.. అన్ని చూస్తూనే వుండే దాన్ని.
ఒక రోజు, ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి అనుకుంటా,  నా చెట్టు నీడలో ,మంచం మీద పడుకుని, పైకి ఆకాశం లోకి చూస్తూ, ఏదో చలం పుస్తకం లో లాగా ఆకాశం ముక్కలు చేసినట్టు , ఎంత బాగుందో ,అని మురిసి పోతుంటే, ఇంక చెల్లెళ్ళు చేరారు, మేము చూస్తాం అంటూ
అదిగో ఇప్పుడు చూడు ఆ మబ్బు ఎంత బాగుందో? ఇదిగో ఈ మబ్బు చూడు ఇంకా బాగుంది అంటూ మురిసి పోతున్నారు. నేను కూడా చూస్తున్నాను కదా , మామూలు గా ఆకాశం ,అందులో మబ్బులు ఏముంది గొప్ప ,  అదే మాట అన్నాడు ,ఆ పెద్ద అబ్బాయి.
సరే, వచ్చి చేరాడు, తను కూడా అలాగే మంచం పైన వాలి, పైకి చూసాడు..
అదిగో అక్క ఎంత బాగుందో అని వంత పాడాడు.
అందరు ఎంత నవ్వారో??? నేను నవ్వాను.
మబ్బులో, ఆకాశామో, నక్షత్రమో , చందమామో ,ఈ అబ్బాయి ని పిలిచింది , వెళ్ళాడుట..
ఈ పిల్లలని మరి ఎప్పుడు చూస్తానో???

21 నవం, 2009

ఇంటికి సున్నం..

డియర్ ఫెలో బ్లోగ్గేర్స్,ఫ్రెండ్స్,సిస్టర్స్,
ద్వితీయ విఘ్నం అయింది . కానీ , నేను వదలను నేను .
ఇక్కడ కువైట్ లో మా ఇంటికి సున్నం, అనకూడదు పైంట్స్  వేస్తున్నారు. ఇది నన్ను'  మా ఊరు '  అనుకునే ఏలూరు లోకి  లాక్కుని  వెళ్ళింది. రామకృష్ణాపురం లో ఉన్న రోజులు అవి , పండగ ముందు సున్నాలు పని మొదలు పెట్టారు.ఇంట్లోని సామాను అంత తెచ్చి పెద్ద అరుగు మీద పడేసారు. మంచాల మీద పరుపులు, దాని మీద దుప్పట్లు,బల్లలు మీద పుస్తకాలు, కుప్ప పోసిన బట్టలు, చదువు కి గుడ్ బయ్ అన్నట్టు, చిందర వందర గా పడేసిన పుస్తకాలు, డబ్బాలు , సీసాలు, గిన్నెలు, కంచాలు,సమస్తం బయట పడేసి , రోడ్ ఎక్కినట్టు కూర్చున్నాం అందరు.
చీకు చింతా  లేదు, అస్త వ్యస్తం లో ఆనందాన్ని సంపూర్ణం గా అనుభవించే బాల్యం. పోయిన పెన్సిల్స్, పెన్నులు, కాకి ఎత్తుకు పోయింది అనుకున్నా నేతి గిన్నెలు, పని మనిషి పట్టు కు పోయిందని అనుమానించిన బుల్లి గిన్నెలు,గాలి కి ఎగిరి పోయింది అనుకున్నా గౌనులు, పోయింది అనుకున్న ఒంటి బంగారం చెవి రింగు, ఎన్నో , ఎన్నెన్నో దొరికాయి మాకు ఆ గుట్ట గా పోసిన వస్తు సముదాయం లో..
మళ్లీ, మళ్లీ, అలా ఎప్పుడయినా అనిపించిందా అని ఆలోచిస్తే ,అలాంటి  ఇంకో సందర్భం ఏది గుర్తు రావటం లేదు.
అస్తవ్యస్తం గా బతకటం లో కూడా ఆనందం ఉంది కదా..
అప్పుడప్పుడు అలా జీవించి చూద్దామా? ఇవాళ  ఇది చేయాలి, రేపు అది చేయాలి, ఎల్లుండి ఇంకోటి చేయాలి.. అబ్బ బ్బా .. ఆగండి
జీవితాన్ని ఇంకో లాగా కూడా జీవించండి . మధ్యాన్నం లేచి, పెసరట్టు తిని, రెండు షోస్  సినిమాస్ బుల్లి తెఱ కాదు, పెద్ద తెఱ మీద చూసి,పాని పూరీలు తిని, ఐస్ క్రీంస్  తో స్వస్తి చెప్పి, అర్ధ రాత్రి.. ఇంటికి చేరి..
రేపటి గురించి భయంతో కాదు, నిర్భయం తో ఒక్క రోజు ఉండ గలమా?
మన వల్ల కాదు లెండి , ఇక్కడి పని వాళ్ళు ఇంత పని మంతం గా ఇలా పనులు చేస్తే, మనకు ఇంక ఏమి జ్ఞాపకాలు, గుర్తులు ఉంటాయి..
మీరు గమనించారో లేదో, జ్ఞాపకాలన్నీ , అస్తవ్యస్త రోజులు, క్షణాలే...  అంతా బాగుంటే అది ఒక జ్ఞాపకం ,అవుతుందా? ఒక మామూలు రోజు, ఒక మరుగున పడ్డ రోజు.. ఒక జీవిత కాలం అవుతుంది.
ఇది మా ఇంటికి సున్నం కథ.

19 నవం, 2009

డియర్ ఫెలో బ్లోగ్గేర్స్,
నన్ను నేను ఆహ్వానించు కుంటున్నాను, ఈ మాయ ప్రపంచం లోకి.
ఏదో ఆవేశం, ఏదో ఉత్సాహం, నా బాధ ప్రపంచాని కి చెప్పాలని, మరి ఇంకేదో బాధ, ప్రపంచం బాధ పంచుకోవాలని. నా ఆలోచనలు , నా ఉహాలు, నా కలలు.. అన్నీ మీతోనే ఎందుకు పంచుకోవాలి? అని అడిగితే, సర్వ బ్లోగర్స్ ఐక్యం అవ్వండి అంటూ పిలుపు నిచ్చి , ప్రభంజనం సృష్టిస్తా .
మరి నా అస్తిత్వం ఏమిటో, ఎప్పడిదో, మీకు అర్ధ మయే ఉంటుంది.
శ్రీ శ్రీ కవిత్వం లో ఉర్రుత లూగి, చలం ని ప్రేమించి, దేవులపల్లి వారి కవిత్వం తాగి, అమృత సిద్ధి పొంది, నా అక్షరాలు, వెన్నెలలో ఆడుకునే ఆడ పిల్లలు అని మురిసి పోయి, కుటుంబరావు తో కబుర్లు, చదువు పంచుకుని, పురాణం సీతతో ముచ్చటలు ఆడుకుని, శ్రీ రమణ తో నవ్వుకుని, యండమూరి సేరియల్స్ కోసం ఎదురు చూసి, యద్దనపూడి ని చదివి ఆనందించి
అందరిలాగే పెరిగిన మామూలు ఆడపిల్లను, ఇప్పుడు ఒక అమ్మను, ఒక ఇంటి కి , ఒక వ్యక్తి కి ,అంకిత మయిన అమ్మను, ఒక స్త్రీ ను, ఒక ఉహల గని ని...
ఏదో తాపత్రయం. ఒక విసుగు, ఒక లాలస, ఒక కోరిక, ఒక పోరాటం, ఒక జిజ్ఞాస, ఒక బలం, ఒక నిరుత్సాహం, ఒక తుళ్ళింత, ఒక విప్లవ గాలి, ఒక పదునైన బాణం, ఒక ఒంటరి బాట, ఒక కల, ఒక దుస్వప్నం, ఒక కథ.. ఇది అది అనీ కాదు, నా కథ అంత మీకు చెప్పాలని ఒకటే ఉబలాటం.
ఈ కోరిక నన్ను ఊపేస్తోంది, ఇక ఆగదు, అని గట్టిగ నిర్ణ యించుకుని ఇది మొదలు పెట్టాను

ఇంక మీదే ఆలస్యం. నా బ్లాగ్ ఇదుగో మొదలు , శుభం కార్డు పడింది అని లేచి పోకండి.
కథ అంత ముందే ఉంది, ఇవాల్టికి సెలవా  మరి