"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

31 డిసెం, 2010

మన ముందు తరానికి, ఒక ఎడారి కాదు, ఒక పూదోట నిద్దాం....

ఇదేంటి అప్పుడే ఒక దశాబ్దం గడిచి పోయిందా? ఈ ఇరవై ఒక్క శతాబ్దం లో? ఇలా పరుగులు పెడుతోందేమిటి కాలం..
ఉందిలే మంచి కాలం ముందు ముందు నా..అంటూ శ్రీ శ్రీ గారు ఎంత ఆశ తో రాసారో?కానీ ఇదేమిటి, మంచి అనేది, భూతద్దం తో వెతక వలసిన సూక్ష్మ మైన పదార్ధం అయిపొయింది. మన పిల్లలకు మనం అందిస్తున్న ఈ ప్రపంచం ఎందుకిలా వెల వెల బోతోంది? సూర్యోదయాలు అవుతున్నాయి, కాని, దట్టమైన మబ్బులు పట్టిన ఆకాశం లో. వసంతాలు వస్తున్నాయి, కానీ, రంగులు అద్దుకుని , హరిత పల్లవం గా కాదు. ఏవో కలుషిత గాలులు, రంగులని ,కాంతులని రాత్రికి రాత్రి, దగా చేసి, దోచేస్తున్నాయి. గ్రీష్మ తాపం ఇంక , నదులని ,సెలఏరులని,  పీల్చేసి, ఇంకా, ఇంకా, చాలదు, అన్నట్టు, చండ ప్రచండం గా సూర్యుడు మూడో కన్ను తెరిచి నట్టు, భగ భగ మని మండి పడుతున్నాడు. వర్ష రుతువు, నేనేమి తక్కువా?అన్నట్టు, నింగి, నేల ఏకం చేస్తూ, ఆకాశం భోరున ఏడుస్తున్నట్టు, నదులని పొంగించి, కడలి అలలు తో చెలగాటాలు ఆడించి, పొలాలు, పంటలు, వరద నీటిలో ముంచి, నా తో పెట్టుకుంటారా? అంటూ, సవాల్ చేస్తున్నది.
ఇంక హిమ వంతుడి వంతు. ప్రకృతి అంతా పోటీ పడి, మానవుల మీద ఆధిపత్యం చూపుతున్నాయా అన్నట్టుంది. విమానాశ్రయాలు, నగరాలు, రైళ్ళు, రహ దారులు, ఇంత ఎత్తు మంచు తో నిండి, ఏదీ మీ ప్రతాపం చూపండి ఇప్పుడు అంటూ సవాల్ విసురుతున్నాయి.
అంతా మనం చేసుకున్నదే. నువ్వు భూమి నుండి తీసుకున్నది ఇవ్వగలి గితేనే తీసుకో, అన్న ప్ర ప్రధమ ధర్మం మరచి, మన ఇష్టం వచ్చినట్టు, ఏక దృష్టి తో, మన స్వార్ధం కోసం, మన స్వ ప్రయోజనాలు కోసం, ఎవరి ఇష్థం వచ్చినట్టు, వారు భూమిని, ఎడ పెడా... చెరిచాం, నిస్సిగ్గుగా.. చెరిచాం. ఆ దుష్ఫలితాలు నేడు చూస్తున్నాం. 
ప్రభుత్వం దే బాధ్యత. అని ఎవరి నో నిందిస్తాం. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే కదా ,మనలని పాలిస్తున్నాయి. అడవిలు , సముద్ర తీరాలు, కొండలు, కోనలు, దేనిని వదలం. మన గొయ్యి మనమే తవ్వుకుంటూ, ఎక్కడికి వచ్చాం.. మనం.. రెండు వేల పదకొండు అనే నూతన సంవత్సర సంరభానికి ఆహ్వానం పలక డానికి.
ప్రశాంత ఉషోదయాలు, లేత  ఎండలు, మామిడి పళ్ళ వేసవులు, మల్లెపూల గుబాళింపులు,  తీగ లాగా, జల్లు, జల్లున కురిసే, వర్షాలు, ఒక్క గొడుగు కింద ఇద్దరం నడుస్తూ, తడిసే, చిలిపి వర్ష రాత్రులు, పిల్ల కాలువలు లో పరుగులు తీసే కాగితపు  పడవలు, ఆకాశం లో అంద మైన హరివిల్లులు, దాని మీద నడవాలని రహస్య కోరికలు, వానా వానా వల్లప్ప అంటూ ముద్దుగా టప టప లాడిస్తూ చేతులు, ఆడుకునే ముద్దు గారే పిల్లలు, సాయంత్రం వర్షానికి , చేదోడు, వేడి వేడి పకోడీలు, చెలి చెంత, ఈ ముసురు లో ఒక సినిమా ఓ, ఒక పుస్తకమో, ఒక కబుర్ల కోలాహలమో, ఇంక చలి, చిన చిన్న గా మొదలు అయి, ఒక వెచ్చని ఎండ, తో కరిగి, భోగి మంట లకు జడిసి, సంక్రాంతి  సంబరాల తో కరిగి, ఇంటింటా ముత్యాల ముగ్గులు తో మెరిపించి, అంద మైన చలి కాలం, బద్ధకపు పొద్దు చలి కాలం, మళ్లీ, వసంతం ,చివుర్లు చిగిరించి, రంగుల ,కాంతుల పుష్పాలతో కను విందు చేసే వసంతం.. ఈ కాలాలు కావాలి నాకు. 
అంతే కాని, ఇలా నిస్తేజం గా, నిట్టురుస్తూ, మధ్య లో విలపిస్తూ, ఆక్రోశిస్తూ, అంతలో ప్రచండ రూపం చూపించే.. ఈ కాలం నాకు వద్దు. 
ఈ శతాబ్దం చివరకు మనం ఏం మిగులుస్తాం, మన పిల్లలికి, పిల్లల పిల్లలకి, అంటే, కనిపించే ఎడారి దృశ్యం నన్ను భయ పెడుతోంది, 
ఈ దశాబ్ది, చివరి రోజు , గుమ్మం లో నిల్చున్న నాకు, మలి  దశాబ్దం లో అడుగు పెట్టాలంటే...ఒక ఆలోచన, ఒక కలవరం, ఒక  కలవరపాటు.
వెనక్కి తిరిగి వెళిపోవాలి, అనే కోరిక ని చంపుకుని, ఈ దశాబ్దం , వసుధ కి అంకితం అని ఒట్టు పెట్టుకుని, నువ్వు తిరిగి ఇవ్వలేని దానిని ,ఖర్చు పెట్టకు అనే మంత్రం జపం చేస్తూ, మాటలు చేతలు ఒక్కటి అయ్యే రోజుల కోసం , భూమిని పరి రక్షించే ప్రభుత్వం కే నా పవిత్ర మైన ఓటు, ఈసారి, అందు కోసం ఉద్యమిస్తాం, ఉద్యమాలకి చేయూత  నిస్తాం,  అని ఇలా, ఏవేవో చెప్పి, మనసుకి, నెమ్మదిగా అడుగు వేస్తున్నాను. 
ముందు ఒక మొక్క నాటు, అని బుద్ధి హెచ్చరించింది  . ఇదే నా నూతన దశాబ్ది నిర్ణయం .. ఇంకేమి కాదు.. భూభారం తగ్గించే ప్రయత్నం, లో భాగం గా ఓ ప్పది కేజీలు తగ్గడం కూడా  ఉంది, కాని, అది ఒక రహస్య నిర్ణయం. 
ఇంక మీరు ఏం చేసుకున్న, చేసు కోక పోయినా భూమి ని ఒక పచ్చ రంగులో అలంకరించే ప్రయత్నం మటుకు చేయండి, ప్లీస్..
మన ముందు తరానికి, ఒక ఎడారి కాదు, ఒక పూదోట నిద్దాం..మీరేమంటారు  ?

9 డిసెం, 2010

అనుకోని సెలవు.. లు.

మొన్న అనుకోకుండా ఒక రోజు సెలవు దొరికింది మాకు, ఈ దేశం కొత్త సంవత్సరం.. పండుగ ట. హిజ్ర అంటారు. ఆరోజు ఎంత సంతోషమో? అనుకోకుండా ఇలాగ సెలవు వస్తే.. అంతే  పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తు వచ్చాయి.
మేం ఎం ఎస్ సీ,చదువు కున్నప్పటి మాట ఆంధ్ర  యూనివెర్సిటీ లో, అంటే ఒక ముప్ఫై ఏళ్ల క్రితం మాట. ఏలూరు నుండి  వచ్చిన వాళ్ళం అందరు ఒక పెద్ద గ్రూపు గా తిరిగే వాళ్ళం. వేరే వేరే డిపార్టుమెంటు లు అయినా సరే, హాస్టల్ లో అందరం ఒకే జట్టు. ఇలాగ క్లాస్సులు మొదలు అయాయో లేదో, యూనివెర్సిటీ లో గొడవలు మొదలు అయాయి.
ఆ రోజుల్లో కూడా గొడవలా ? అనే వారికి నాకు ఒక విజ్ఞాపన గుర్తు వస్తోంది, కోడలు అడుగుతోంది, అత్తగారిని, మీది ప్రేమ వివాహమా? అని ఆశ్చర్యం గా.. ప్రేమ ఏదో ఒక తరం వారి సొత్తు అయినట్టు, మనకి ఎప్పుడో లైలా మజ్ను, ఇంక మాట్లాడితే రుక్మిణి కల్యాణం కూడా ఉంది, మన పురాణాల్లో, ప్రేమించు కోవడం అది పెద్దలు ఒప్పుకోవడం అనేది అనాదిగా ఉంది. మనకి..సరే ఇది పిట్ట కథ అసలు కథలో.
తరగతులు బంద్.. బాగానే ఉంది, హాస్టల్ లో టైం కి టిఫిన్ లాగించేసి, బీచ్ రోడ్ మీద పడే వాళ్ళం. ఆర్కే బీచ్ పార్క్, క్వాలిటీ ఐస్ క్రీమ్ అమ్మే వారు కాబట్టి, క్వాలిటీ బీచ్ పార్క్ అని   కూడా అనేవారు, అక్కడ కూర్చుని, సముద్రం వేపు చూస్తూ ,విరిగి పడే అలలు, అలుపు లేకుండా గంటలు, గంటలు చూసే వాళ్ళం. అలలు కే అలపు వచ్చేది, ఏమిటి ఈ అమ్మాయిలు ఎంత సేపు ఇక్కడ కూర్చుంటారు, వీరికి ఇంకేమి పని లేదా అని. మాకు ఇంకేమి పని లేదు కదా..అలలు కి పోటి కూడా పెట్టే వాళ్ళం. ఏ అల అయితే మధ్యలో విరిగి పోకుండా ఎంత పొడుగ్గా వస్తుందో? లేదా ఎంత ఎత్తుకి   ఎగిరి విరిగి పడుతుందో?  అబ్బే ఇదేం పోటీ అనే గుంటూర్ వాళ్ళు కూడా కాసేపు అక్కడ కూర్చునే సరికి  ఇదిగో ఎంత పెద్ద కెరటమో? ఎక్కడ విరిగి పోలేదు, ఇదే అన్నిటికన్నా పెద్దది..అని అరుచు కుంటూ, సముద్రుడి కి మా నవ్వులు, కేరింతలు ప్రైజ్ లు గా ఇచ్చి, ఆకలి తో మాడిపోతుంటే, మళ్లీ మా హాస్టల్ వేపు నడిచే వాళ్ళం. హాస్టల్ మెట్లు దిగితే బీచ్ రోడ్. ఇంత అందమైన హాస్టల్ ఇంక ఎక్కడ ఉండదు. మన ఇంట్లో వాళ్ల  అందిరిని వదిలి వచ్చాం   అని  దిగులు    మరిపించ డానికి సముద్ర ఘోష మనసుకి ఊరటగా తోడూ గా ఉండేది. 
ఇంకా ఆ గొడవలు పెద్దవి అయి, హాస్టల్ మూసేశారు. ఇంటికి వెళ్ళి పొమ్మన్నారు. మాకు ఏమి పెద్ద సంతోషం వేయ లేదు, అప్పటికే, విశాఖ బీచ్ ని వదిలి, అంటే మా స్వేచ్చ ,స్వాతంత్రం, వదిలి, ఇంటికి, అదీ ఏలూరు లాంటి చిన్న కాలువలు ఉన్న ఊరు కి వెళ్ళా లంటే..అమ్మో ఎంత బాధో, అందులో స్నేహితురాళ్ళ సాంగత్యం వదిలి వెళ్ళడం.. 
ఏదో ఒక సంచి లో, నాలుగు చీరలు పడేసుకుని, పోలో మని స్టేషను కి వెళ్ళి, గోదావరి రైలు ఎక్కి కూర్చున్నాం. పద్నాలుగు రూపాయిల నలభై పైసలు టికెట్ ఖరీదు. ఏలూరుకి టికెట్ ఖరీదు, సరిగ్గా రెండు పదులు ఇరవై ఉన్నాయి పర్సు లో, తుని లో పకోడీ  లు, రాజ మండ్రి లో ఒక  కాఫీ తిని, తాగి, ఏలూరు స్తేషున్ నుంచి రిక్షా నాలుగో ,ఐదో రూపాయలకి బేరం ఆడి, ఇంటికి   వచ్చి, అమ్మా రిక్షా వాడికి డబ్బులు ఇవ్వు అమ్మా అంటే, నోరు తెరిచారు అందరు,  మొన్నే కదా వెళ్లావు, ఎం ఎస్ సీ అంటూ, తిరిగు టపా లో వచ్చేసావు ఏమిటి? అని.
అను కోకుండా వచ్చిన సెలవుల కథ ఇది. అలాగ మా మొదటి సంవత్సరం అంతా సెలవలే.. ఇంకొకసారి, మాకు మరునాడు సెమెస్టర్ ఎండ్ పరీక్ష. రోజూ కలుసుకుని కబుర్లు చెప్పుకునే ,నేను మా స్నేహితురాలు, నేను, రాత్రి రెండు వరకు, ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ, రేపు పరీక్ష ఎలాగైనా ఆగి పోవాలి, ఏదైనా సెలవు రావాలి, అని మిగిలిన రాత్రి అంతా ప్రార్ధించు కుంటూ, గట్టిగా మర్నాడు సెలవు వస్తుంది అని ఎందుకో నమ్మాం, కొంత మంది మా లాంటి క్లాస్స్ మేట్స్(మగ ) కూడా అధికారులని కల్సి ,సెలవుల మర్నాడే పరీక్ష పెట్టడం అమానుషం అని, పరీక్ష ఎలాగైనా ఆపేయాలని, చాలా ప్రయత్నించారు పాపం. కాని, ఎందుకో, అప్పుడు అధికారులు ఒప్పుకోలేదు, మామూలుగా నలుగురు కలిసి  అర్ధ రాత్రి, రిజిస్త్రార్   ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి, పరీక్షలు రాయం మేం రేపు అంటే ఒప్పుకునే వారు. చాల మంచి వాళ్ళే.. స్టూడెంట్స్ తో గొడవలు ఎందుకు అనుకునే వారు.  కాని ఆ రోజు ఒప్పుకోలేదు.
అలాగ రాని సెలవు వల్ల మేం  సప్ప్లేమేంట్ రాయాల్సి వచ్చింది. 
ఇంకా స్కూల్ లో కూడా ఇలాగే స్కూల్ కి సెలవు ఇస్తే.. ఎవరో పోయారానో, ఏదో కారణం ఉండేది, ఇంక ఆ రోజు పొందే ఆనందం   అంతా ఇంతా కాదు. కాలం మనకి ఒక రోజు బహుమతి గా ఇచ్చిందేమో మన మీద ప్రేమతో అని పించేది.ఎంత చిక్కని ఆనందమో అది.
రోజూ బీచ్ రోడ్ పక్కనే కార్లో పరుగులు పెడతాను ఇప్పుడు. పక్కనే సముద్రం.. ఆశగా చూస్తూ ఉంటుంది, నేను గుర్తు ఉన్నానా ? అని ?మీ కబుర్లు, రహస్యాలు నాకు తెలుసులే అంటుంది. మొహం తిప్పుకుని, ఏవో సంపాదించాలి, ఏవో ఇల్లు కట్టుకోవాలి, నగలు కొనుక్కోవాలి, అంటూ, ఏమిటో? ఎక్కడికో ఈ పరుగులు? 
అలాగే  ఏ సీ చైర్ కార్ లో కూర్చుని, పర్సు లో వంద రూపాయిల నోట్లు, తునో, రాజ మండ్రో  , తెలీదు, ఆ రంగు అద్దాల కిటికీ ల నుంచి, ఇంట్లో నుంచి తెచ్చు కున్నా చపాతి, కూర, ఫ్లాస్క్ లో కాఫీ ,బయటవి కొని  తినాలంటే భయం,  ఏలూరు ఊరు కూడా రైలు లోంచే చూడడం, ఏ హైదరాబాద్ కో ప్రయాణం, అక్కడి నుంచి ఇంకా ఎత్తున విమానాల్లో ప్రయాణం దూర దేశాలకి, ఎంత సుఖమయం ప్రయాణం ఇప్పుడు, కాని సంతోషం కలిగించని ప్రయాణాలు ఇప్పుడు.
ఇంఫ్లేషన్   అంటారు, అంటే, ఇప్పుడు మనం చాలా డబ్బులు పెట్టినా దాని విలువ తగ్గి పోతుంది అని. మునుపు మనం ఇంకా ఎక్కువ కొన గలిగే వాళ్ళం ఇదే విలువ కి అని ఒక అర్ధం, అలాగ జీవితం లో కూడా ఇంఫ్లేషన్  వచ్చింది. మన చిన్నప్పుడు, హాయిగా అనుభవించే ఎన్నో క్షణాలు ఇప్పుడు అనుభ వించ లేక పోతున్నాం. ఇప్పుడు దేనికి లోటు లేదు, కాని, ఏదో  కనిపించని లోటు. ఇది అని చెప్పలేం. ఎవరికి వారికే  తెలుసు..
ఒక్క  అనుకోని సెలవు రోజు వచ్చి తీరుబడి గా కూర్చుంటే, తెలుస్తుంది. ఉరుకులు ,పరుగులు, జీవితం లో, ఒక ఆదివారం కూడా ఒక పని రోజు లాగే గడిచి పోతుంది, ఆ రోజు కి సరిపడా పనులు కనిపిస్తూ ఉంటాయి.
అలాగ కాదు, ఒక్క రోజు, సెలవు రాదు, కాని మనమే సెలవు తీసుకుని, అను కోకుండా ఒక రోజు, సెలవు పెట్టి, హాయిగా , ఒంటరి గానో, జంట గానో, కార్లు అవి పక్క పెట్టి, ఓ బస్సు ఎక్కి,  ఒక చివర నుంచి మరో చివర వరకు, ఊరు అంతా చూస్తూ, మనసుకి బాగా నచ్చిన పని చేస్తూ, ఆకలి, దప్పులు మర్చి పోయేలా, హాయిగా ఊరు అంతా మందే అనుకుని తిరగడం ..అబ్బ ఎంత బాగుంటుంది. పుల్ల ఐస్ క్రీమ్ తిన్నట్టు.  మామిడికాయ ముక్కల మీద ఉప్పు అద్ది తిన్నట్టు, నిప్పుల మీద కాల్చిన మొక్క జొన్నలు తిన్నట్టు, సముద్రం ఒడ్డున  ఇసక తో పిచుక గూళ్ళు కట్టినట్టు, నది లో నీళు దోసేళ్ళు తో తాగినట్టు.. చాలా, చాల బాగుంటుంది.
మాకు అనుకోకుండా సెలవు వచ్చింది.. మేం ఏం చేసాం ఆ రోజు.. అదే మరి.. చెప్పని ,రాయని  పోస్ట్.