"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

27 ఆగ, 2011

నిద్ర పోతున్న వారిని లేప గలం,నిద్ర నటిస్తున్న వాళ్ళని ???

          నా స్నేహితురాలు రమణి తన ఇంట్లో, సాయంత్రాలు, ఒక చిన్న బడి నడుపుతోంది, తన మాటల్లో, ఏడో తరగతి చదువుతున్న అమ్మాయి, తెలుగు అక్షరాలు కూడా రాయలేక పోతోంది, చదవ లేక పోతోంది. ఏడో తరగతి, మన పిల్లలు ఈపాటికి ఐ ఐ టి  కాన్సెప్ట్ కోచింగ్ అంటూ డిగ్రీ వారు చదివే పుస్తకాలు చదివి పడేస్తూంటారు.

ఎక్కడ ఉంది తేడా? అంతరం?? వారు చదివేది ప్రభుత్వ బడులలో, మన పిల్లలు చదివేది, వేలకి వేలు కట్టే ప్రైవేటు స్కూళ్ళ లో ప్రభుత్వ బడులని నిర్వీర్య పరిచే ప్రైవేటు స్కూల్స్ కి ఎడపెడా గుర్తింపు లు మంజూరు చేస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయులను అనేక ఇతర పనులకు ఉపయోగించుకుంటూ, కనీస అవసరాలు అయిన ఒక బోర్డు, ఒక టెక్స్ట్ బుక్,   మంచి నీరు కుళాయి, ఒక మరుగు సౌకర్యం, ఆడపిల్లలకి వేరుగా, ఇంకా ఒక మధ్యాన్న భోజనం, ఒక చక్కని చదువు వాతావరణం, ఇవేమీ ఉండవు. ఆకలి తో వస్తారు పిల్లలు, గోల గోల గా అరుపులు కేకలు, టీచరు  ఉంటే ఉంటారు, లేక పోతే లేదు..ఇలాంటి పరిస్థితి లలో చదువు ప్రాముఖ్యం అంతంత మాత్రమే!
ప్రభుత్వ బడులు ని బాగుపరచడం తక్షణ కర్తవ్యమ్ కాగా, పిల్లలని ప్రైవేటు బడులలోకి పంపడమే, ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు రిక్షా లాగే కార్మికుడు కూడా అప్పు చేసి అయినా ప్రైవేటు బడి లోనే తన పిల్లలని పంపుతున్నాడు. నాలుగు అక్షరాలూ అయిన వస్తాయి అని, తన లాగ కష్టపడ కూడదు అని.

ఏవో పథకాలు పేరు చెప్పి (ఏదో ఒకటి కాదు లెండి, ఒక్క పేరే) కొన్ని ప్రైవేటు వ్యక్తుల ఖజానా నింపడమే ధ్యేయం గా ఫీజు రీమ్బుర్సేమేంట్ అనే ఒక స్కీం మంజూరు అయింది. దాని వల్ల పేద పిల్లలు కూడా చదువు కోగలరు అని అంటున్నారు. కాని, అసలు పునాది లేకుండా భవనం కట్టినట్టు, అక్షరం ముక్క రాకపోయినా పెద్ద చదువులు ఎలా చదువు తారు? ప్రభుత్వ బడులు ని మెరుగు పరిచి, ఉపాధ్య్యయులకు   ప్రోత్సహాకాలు  ఇచ్చి, పిల్లలకి,  పోషకాలుతో కూడిన మధ్యాన్నభోజనాలుపెట్టించి, ఉపాధ్యాయుల్ని బాధ్యులని చేస్తూ , మార్గ దర్శకాలు రచించి, ప్రాధమిక విద్య కి 
అత్యంత ప్రాముఖ్యత  ఇస్తూ , ఎన్నో ఎన్నెన్నో చేయాలి.
నిర్భంద ప్రాధమిక విద్య అనే చట్టం వచ్చింది..ట..మనకి సరిపడా ఉపాధాయులు ఉన్నారా ? అసలు??
ఉన్న బడులని మూసేయకుండా వాటిని చక్కగా నడిపిస్తే చాలు.
మన ప్రభుత్వాలు ఈ విషయాలు తెలియకా??
అందుకే అన్నాను,నిద్ర పోతున్న వారిని లేప గలం,నిద్ర నటిస్తున్న వాళ్ళని లేప గలమా??
ప్రాధమిక విద్య అందరి ప్రాధమిక హక్కు..నేటి బాలలే, రేపటి పౌరులు అని ఊరికినే నినదించడం కాదు, అందు కోసం..నాలుగు అడుగులు ముందుకు వేయాలి,ముందు ఒక్క అడుగు తో మొదలు పెట్టాలి.
వీధి, వీధి కి ఒక సార దుకాణం కాదు ఒక బడి కావాలి.
ఆడుతూ, పాడుతూ,పిల్లలు చదువు ని ఆనందం గా ఆస్వాదించాలి.
చదువు అంటే మార్కులు కాదు, చదువే..అని నమ్మే బడులు..రావాలి.
చదువు కే ఓటు అన్న వారికే నా వోట్ ..
చదువు పిల్లల ప్రాధమిక హాక్కు..కలిసి సాధించుదాం.కదలి రండి. ఇది నా శత బ్లాగ్ టపా.లో విన్నపం.
రమణి..నా స్నేహితురాలి కి ఇది అంకితం,మాటల్లో కాదు ,చేతల్లో చూపిస్తున్న నా స్నేహితురాలు. 

25 ఆగ, 2011

కాగితం మీద కాకుండా ,నిజం గా అబివృద్ధి చెందిన దేశం

నిన్నే ఒక వార్త చదివాను, గల్ఫ్ లో పని చేసే వారికి , వారిని ప్రలోభ పరిచి, బ్యాంకు లు, వారికి  క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారుట..ఇంక వాళ్ళు ఆ కార్డులు తో విపరీతం గా ఖర్చు పెడుతూ, స్వదేశం లో ఉన్న పిల్లల చదువులకూ , వారికి చక్కని భవిష్యత్తు ఇవ్వాలని, వారికి వేలు ,లక్షలూ పంపిస్తూ, చివరకు వారు ఇక్కడ జైలు పాలు అవుతున్నారుట..ఏవేవో ఆశలు తో, కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి తప్పించాలని, కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయాలని, లేదా కుటుంబ పెద్ద అనారోగ్యానికి అయే అప్పులు తీర్చడం కోసమో, ఆడ వారే ఇక్కడకి రావడం ఎక్కువ అయిపొయింది.

నేను చదివిన వార్త ఫిలిప్పీన్స్ దేశాస్తులకి సంబంధించినది. మన దేశం కి కూడా ఇది వర్తిస్తుంది. మన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ,ఇలాంటి ఎందఱో స్త్రీలు కనిపిస్తారు. ఇమ్మిగ్రేషన్ ఫోరం నింపమని అడుగు తారు. కనీసం సంతకం కూడా పెట్ట లేని వారు, ఇక్కడికి ఏ పని చేయడానికి వస్తారో ఊహించ వచ్చు..
ఇక్కడ దేశస్తులకు, వారి ఇంట్లో ఇంటి పని చేయడానికో, వారి పిల్లల పని చేయడాని కో, ఒక చిన్న గది ఇస్తారు, ఇరవై నాలుగు గంటలు, వారి పిలుపులకి తయారు గా ఉండాలి.అదృష్టం బాగుంటే, మంచి గా చూసుకునే యజమానులు దొరుకు తారు..లేదా..వారి బాధ ,వ్యధ, గుండెలు పిండేస్తాయి. ఎందుకు ఇంత దూరం వస్తారు, అయిన వారందిరిని వదులు కుని, అని అడిగితే,ఉన్న ఊరులో ఇలాంటి పనులు చేయలేం కదా అంటారు,పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోలేక అంటారు.

స్త్రీలు,ఇంటికే పరిమితం, ఇదే మన సంస్కృతి, అంటూ చెప్పే కబుర్లు ఏమయాయో,దేశాంతరాలు పంపించి, ఆ ధనం తో, ఇంటిని నడిపే మగ వారు ని నేడు చూస్తున్నాం..ఇంక ఆడ దక్షత లేని ,ఆ కుటుంబాలు ,ఎలా నడుస్తాయో ఊహించలేం. మగవారికి ఒక తోడూ,మన ప్రభుత్వం వారు దయ గా పోసే సారా..అ తరువాత వచ్చే రోగాలు, రోష్టులు ఇంకో కథ, వ్యధ..ఇక్కడ ఒళ్ళు గుల్ల చేసుకుని కష్ట పడే స్త్రీ కి మిగిలేది, దూరం అయిపోయిన కుటుంబ సభ్యుల ,తరగని కోరికల  చిట్టా..ఒక అంతు లేని కథ ..కథ నాయిక లా ఒక ఒంటరి జీవితం.
మన దేశ ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి.. ఇలాంటి పనులకు యింక వీసాలు ఇవ్వకూడదు. ఏజెంట్లు వేసే వల లో పడి పోతున్న స్త్రీలకూ, ఒక వెసులుబాటు కల్పించాలి.ఎయిర్ పోర్ట్ ల లో,మన దేశ అధికారులు,ఇలాంటి స్త్రీలను గుర్తించి, వారిని హెచ్చరించాలి, వారికీ ఒక భద్రత , ఒక ఉపాధి పధకం సూచించాలి. ఇవి ,వింటే, మన దేశం లో ఇలాంటివి జరగవు అంటారు.కాని,ఇక్కడ మన దేశ పరువు తాకట్టు పెట్టినట్టు అని పిస్తుంది. ఒకరి ఇంట్లో పని చేయడం తప్పు కాదు,కాని, కట్టు బానిస ల లాగ,ఒక పేద దేశ స్త్రీలను మేము పోషిస్తున్నాం అన్నట్టు భావించే ఒక ధనిక దేశం కుటుంబానికి పని చేయడం..మన దేశం ఇంత గొప్ప ,అంత పవిత్రం అని చెప్పుకునే వాళ్ళం, సిగ్గు తో తల వంచుకునేల ఉంటాయి..ఇక్కడ స్త్రీల కథలు.

కొన్ని దేశాల ప్రభుత్వాలు ఇలాంటి పనులకి, తమ దేశస్తులను పంపించటం లేదు. మన పొరుగు దేశాలు కొన్నిఇలాంటి  నిర్ణయాలు తీసుకున్నాయి. మన దేశం మటుకు ,మాటల్లో చెప్పుకునే గొప్పలు, చేతల్లో చూపించటం లేదు.

పాస్ పోర్ట్, సివిల్ ఐ .డి .లు ఎవరి చేతిలోనో ఉంటాయి.సంవత్స రానికి , కొంత సొమ్ము ,వారికి కట్టాల్సిందే. వీళ్ళు కష్ట పడి సంపా దించిన దాంట్లో ,ఎవరికో వాటా..ఇది కాక ఇంటికి పంపించాలి, ఇక్కడ వీళ్ళు ఏదో లక్షలు సంపాదిస్తున్నారు అని, వారి భ్రమ.ఆ భ్రమ ని నిజం చేయడానికి ,ఇక్కడ వీరు పడే కష్టం, నిద్ర లేని రాత్రులు ,లో కార్చిన కన్నీరు, ఇవి దేవుడు కే తెలుసు.

మూడేళ్ళకో, అయిదేళ్లకో, లేదా యింక     కొంత మంది ఏ పదేళ్లకో..వెల్ల గలుగుతారు..వారి దేశానికి.చిన్న పిల్లలు, పెద్ద వారు అయి పోతారు, పిల్లలికి పెళ్ళిళ్ళు అయి పోతాయి,మనవళ్లు, మనవరాళ్ళు పుడతారు, అన్ని ఫోన్ ల లోనే వింటారు,ఊహించు కుంటారు. ఏవో ఫోటోలు చూస్తారు, ఏవో కబుర్లు తెలుసు కుంటారు.

అబ్సెంటీ మెంబెర్ అంటే కనిపించని ఇంటి సభ్యులు ..అన్న మాట వీళ్ళు..వందల్లో కాదు, వేలల్లో ఉన్నారు.మన దేశం ఎందుకు వీరికి కాస్తంత భద్రత, ఉనికి, చేయాలి అనుకునే వారికి పని, ఎందుకు చూపించేలేక పోతోంది? ఈ చదువు లేని వాళ్ళు యింక ఎందుకు ఉన్నారు? మన విద్య వ్యవస్థ ,అందరికి ఎందుకు విద్య అందించ లేక పోతోంది?

ఎప్పటికి మనం ,కాగితం మీద కాకుండా ,నిజం గా అబివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోగలం గర్వం గా??

మూడేళ్ళ  తరువాత ,తన దేశం వెళ్లి, మూడు నెలలు ఉండి, పెళ్లి చేసుకుని, నవ వధువు ని వదిలి మళ్లీ ఈ దేశం వచ్చి , ఫోన్ లో మాట్లాడుతూ, సొమ్ము పంపిస్తూ,సంసారం చేసే ఒక ఎక్ష్ పాట్ .వ్యథ ,కథ కాదు..నిజం..

ఇలాంటి ఎందఱో ,కథలు వింటే, మనం ఎంత అదృష్ట వంతులమో ,ఎప్పుడు కావాలి అంటే, అప్పుడు మా ఊరు వెళ్లి పోగలను నేను, అయినా ఏదో లోటు ..నాకు అని ఊహించు కుంటూ బాధ పడే.. నేను ఎంత మూర్ఖురాలిని..

మన దేశం ..సస్య శ్యామలాం..అని పాడు కోవడమే కాదు, నిజం గా సమృద్ధి గా, ఆకలి తెలియని దేశం అవుతుందని ఆశించడం అత్యశా???

భారతీయులు అందరు, పని వారు గా ,పర దేశం వెళ్ళే వారికి, మన దేశం లోనే పని దొరికే శుభ దినం కోసం పని చేయాలి. ఆకలి తో అలమ్టించని ప్రజా నీకం తో బలమైన దేశం గా అవతరించాలి , అని చేతులు కలిపి నడవాలి. రెప రెప లాడే మన జాతీయ పతాకం నీడలో, ఒక్క కన్నీరు చుక్క కూడా పడ కూడదు..

పర దేశం లో ఉంటూ , ఇక్కడ పని చేసే ఆడ వారిని చూస్తూ, ఏమి చేయ లేక , మన దేశం లో ప్రజలే కదా వీరు కూడా ,అయిన ఇంత అంతరం ఎలా ఏర్పడింది? అని ఎన్నో జవాబు లేని ప్రశ్నల కి జవాబు వెతుకు తూ..ఈ పోస్ట్.

24 ఆగ, 2011

అమ్మ కి వందనం తో..

అమ్మా !! ఆకలి!!! ఇదిగో టూ మినిట్స్ ..అంటూ మాగ్గి నూడ్లేస్ వండే అమ్మ..అమ్మా ... దాహం అంటే ఫ్రిడ్జ్ లోంచి కూల్ డ్రింక్ ఇచ్చే అమ్మ,స్కూల్ లో పోటీ పడుతూ చదవ డానికి ఇంకేదో డ్రింక్ కలిపే  అమ్మలు, మనం  టీ వి లో చూస్తున్నాం రోజూ..మా చిన్నప్పుడి రోజులు గుర్తు వచ్చేయి..

మూడు పూటలా అన్నం తినే బడికి  కాని కాలేజ్కి కాని ,వెళ్ళే వాళ్ళం.అమ్మ ఇంట్లో ఒకటో కృష్ణుడు,మూడో కృష్ణుడు, లాగ నాలుగు అయిదు అన్నాలు వండి వార్చి,వేడి వేడి గా అందరికి పెట్టేది.ముందు ఉదయాన్నే గ్లాస్సుడు కాఫీ తాగి, చదువుకుని లేచి, బడికి వెళ్ళే  వేళ కి,ఒకటో అన్నం రెడీ అయేది.అందులో కి ఒక కొత్తిమీర కారం లాంటి రుచికర మైన appetiserlu ఉండేవి,ఇంక బడి కి  ఒక పెద్ద కారేజి వచ్చేది.అందులో నలుగురం ..మా అక్క చెల్లెళ్ళకు ..సరి పడ అన్నాలు,కూరలు,చిన్న గిన్నె లో నెయ్యి తో సహా నాలుగు కంచాలు ,సమస్తం..ఉండేవి.ఇంటికి చేరేసరికి మళ్లీ గ్లాస్సుడు కాఫీ,మళ్లీ ఏదో టిఫిన్ ,మళ్లీ రాత్రి కి అన్నం..మొత్తానికి అన్న ప్రాణులం మేం.. మా ఏలూరు అక్క చెల్లెళ్ళం ..అందుకే,మొదట్లో ఎవరైనా భోజనం లో చపాతీలో ,పూరిలో పెడితే, శుభ్రం గా కడుపు నిండి పోయినా ఏక కంఠం తో ,ఇంక ఏమిటి కావాలి అంటే, అన్నం అని ముక్త కంఠం తో అరిచే వాళ్ళం.అన్నం ప్రాణులం..ఇప్పుడు,బరువు తగ్గాలని,ఆరోగ్యం అని,ఒకటో రెండో పుల్కాలు,హుహ్,ఒక్క చుక్క నూనె చుక్క కూడా అంటని కాల్చిన పుల్కాలు, ఇంక ఏదో గడ్డి ..ఆకులూ అలమలు..హుహ్..ఏమిటో ఈ కర్మ..ఇప్పుడు పిల్లలు తినే పిడ్జాలు, బర్గేర్లు, మాగ్గి నూడ్లేస్, తాగే కూల్ డ్రింకులు చూస్తోంటే,రేపు వీళ్ళు ఏం తింటారు? మనమే ఇలా బరువు అనుకుంటూ అవస్థ పడుతున్నాం కదా..వీళ్ళ గతి ఏమిటి?

అన్ని ఫాస్ట్ ..ఫుడ్ కూడా ఫాస్ట్ ఏనట ? ఫ్రిజ్ లో నుంచి తీయడం ,వేడి చేయడం..ఇంక మన జంతికలు,చేగోడీలు, పప్పుండలు, పకోడీలు, బొబ్బట్లు,బూరెలు, పులిహోరలు, చక్ర పొంగళ్ళు,ఏమి పోతాయి?అన్నట్టు మా ఇంట్లో నాలుగు రకాల జంతికల గొట్టాలు ఉన్నాయి, కాని, ఏదీ ఇప్పటివరకు వాడ లేదు,మరి మాలతి చందూర్ అన్ని కేజీ లెక్కన కొలతలు ఇచ్చారు, అంత తినే వాళ్ళు మన ఇంట్లో లేరు, అమ్మో చెయ్యి నొప్పి పెట్టదూ , అని ఇంకో కారణం వెతికి ఇప్పటి వరకూ ,ఈ స్వగృహ నో,బెజవాడ వారినో,నమ్ము కున్నాను. మా పిల్లలికి కనీసం ఆ రుచులు తెలుసు, కాని ముందు ముందు..ఎలాగో?
జంతికలు, చేగోడీలు కిఎవరైనా పేటెంట్ తీసు కున్నారా?లేక పోతే ఉండండి ఉండండి.. నేను లైన్ లో ఉన్నాను.

కొన్ని లక్షల అన్నాలు వండిన అమ్మకి జోహార్..అన్నం కి సరి మరి ఇంకేది రాదు..భుక్తాయాసం వచ్చే పెళ్లి భోయనం చేసినా సరే, ఇంట్లో పెరుగు వేసిన ,ఆవ కాయో ,మాగాయో నంచుకుని తినే అన్నం రుచే వేరు.
 సమస్త అన్నం ప్రానుల్లారా ఏకం కండి,పోయేదేమీ లేదు మన కి, వచ్చేది,ఓ చిన్న బోజ్జే..
అమ్మ కి వందనం తో..అన్నం రుచి మప్పిన అమ్మకి వందనం ..తో..శిరస్సు వంచి..(పొట్ట వల్ల నడుం వంగదు కాని,తల వంచగలను) ..