"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

29 సెప్టెం, 2011

అతడు

నేను నా బ్లాగ్స్ కి వచ్చే స్పందన చూసి, అతడు సినిమా లో త్రిష లా , గొప్ప గా  మురిసి పోతున్నాను. ఇంతలో..తథాస్తు ..అన్నారు దేవతలు..ఇంకేముంది , ఆ సినిమా ఏ వచ్చేసింది. మాకు వచ్చే పుంజీడు చానల్స్ లో, మా టీ. వి .ఒకటి, ఈ టీ.వి.కాకుండా..

ఇందులో  మాస్,బాస్,కింగ్, జోష్ ,అంటూ మార్చి, మార్చి అవే వేస్తూ ఉంటారు.అందులో పదో,వందో సారో చూసేసిన సినిమా  'అతడు ఎందుకో...చాల నచ్చేసింది.

చిన్నాపుడే, బాట్ ,బాల్ పట్టుకుని ఆడుకునే వయసు లో, బొడ్లో ఒక గన్ పెట్టుకుని , తనకి అడ్డు వచ్చే వారందరినీ సిన్మా భాష లో వేసేస్తూ ఉంటాడు, పెద్ద వాడు అయి, మహేష్ బాబు అయాక, చార్మినార్ ఏరియా లో,ఒకడిని, అడ్డం గా ఒక చిన్న చాకు బెట్టి, కెలికి కెలికి చంపేస్తాడు..

మొదటి సారి చూసినప్పుడు, ఎప్పుడో చూసిన ఇంగ్లీష్ మూవి  అస్సాస్సిన్..గుర్తు వచ్చి, బాబోయ్ ..రక్తం సినిమా రా బాబు,నేరక పోయి వచ్చాను..అని చింతిస్తూ. మళ్లీ, మన మహేష్ బాబు గ్లామర్ గుర్తు వచ్చి, సీట్ కి అతుక్కు పోయాను.
ఇంతలో, ఏదో ఒక హత్య చేసో, చేయబోయో, మిస్ అయి, చేసింగ్ సీన్ లో, ఓ పెద్ద అంతస్తులున్న మేడ ఎక్కి, దాని మీద నుంచి దూకి, ఎలాగో ....గో..ఓ రన్నింగ్ రైలు లో అదే మీద పడతాడు. ఏమిటి ఈ  దర్శకుడు కి ఇంత తల తిక్క అనుకున్నాను, నా లాగే, కదులుతున్న రైలు లోకి ఎలా ఎంటర్ అయాడు అబ్బా అని ఓ సింగెల్ సీట్ లో కూర్చున్న అబ్బాయి అనుకున్నట్టు  చూపించేడు...ఓహో..అనుకున్నాను..మరీ  తింగరి..కాదేమో లే..
పార్థు..ఎప్పుడో ఇంటి నుంచి పారిపోయిన పార్థు తాత గారింటికి వస్తున్నాడు...ఒక చిన్న పరిచయం ,జీవితం ని ఎలా మలుపు తిప్పుతుందో ...ఇంకా అక్కడి నుంచి రక్తాలు, గన్ లు పోయి...
పువ్వులు, ప్రేమలు  బాంధవ్యాలు, ఆట పాటలు, గోరు ముద్దలు, చిలిపి ముద్దులు, మండువా ఇంటి నిండా చుట్టాలు, పాత స్నేహితులు, జాతరలు, తాత గారితో చెస్ ఆటలు, బ్రహ్మనందం కామెడి లు, చిన్న పిల్లల అలర్లు,ఇంకా ఇంకా ఎన్నో..సుందర , హృద్య మైన సీన్లు.
మనమూ, ఓహో, ఎంత మంచి వాడో, పాపం..అలా ఎందుకయాడో, అని ఊ..ఫీల్ అయి, మహేష్ బాబు ట్రాన్స్ లోకి వెళ్లి పోతాం.
మనమే కాదండోయ్ ..కథ లో, త్రిష..కి కూడా..ఎంత బాగుందో, చక్కగా లంగా ఓణి ల లో,ముద్దోస్తో ఉంటుంది, నాకే ఇలాగ ఉంటే...మరి హీరో కి ఎలాగో ఉండాలి కదా..

టెక్స్ట్ బుక్ లో ఉండే అన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తుంది..అంటే దొంగ చూపులు చూడ్డం, నడిచే దారిలో కాళ్ళకి అడ్డం గా కూర్చుని లైన్ వేయడం..అబ్బ నాకు కూడా ఈ భాష వస్తోంది ఏమిటి?? అతని ని చూస్తున్న ఆడ పిల్లలని అందరిని, లైన్ లోంచి పక్కకి తప్పించడం, తలుపు సందు లోంచి, నన్ను చూస్తున్నాడా? లేదా అని తను చూడడం..గాలికి ఎగిరే కర్టెన్లు తో పాటు.. ఊహల్లో కి వెళ్లి డ్యుఎట్ పాడడం....
అతని పక్కనే నిల్చుని పనులన్నీ చేసుకుంటూ కవ్వించడం..ఒకటి కాదు మహా ప్రభో..ఒక చిన్న ఆడ పిల్ల తూకం వేస్తె,పాతిక కేజీల బరువుండే.. మెదడు లో ఇన్ని ఊహలా  అవురా అనిపించి..మళ్లీ, మన చిన్నతనం లోకి తీసుకు వెళ్ళింది.
ఇంతకీ పూరి, అదే త్రిష కి తను చాల అందగత్తె ని గాఢమైన నమ్మకం..అందుకే..పాపం..తన అక్క కి పెళ్లి చూపులకి ఇంట్లో నే, కూర్చుని, పెళ్లి వారి  కళ్ళ పడ కుండా ,వంటిట్లో ఏదో తింటూ..ఏదో గంత కు తగ్గ బొంత, అభిషేకో, హ్రితిక్ రోషనో..దొరుకుతాడు..అని లెవెల్ ..లో ఉంటే..పూరి, నువ్వు అంత అందగత్తె వి, ఏమీ కావు, చిన్న కళ్ళు, పెద్ద తెలుపు కూడా కాదు..అంటూ మహేష్ బాబు ఏడిపించే డవిలోగ్ ..తరువాత..పూరి నోట్లో ఒక పూరి తో..వాః అనిపించేడు..త్రివిక్రమ్..
వర్షం పడుతుందా? పూరి అందం కి ఏం తక్కువ..అనే సీన్ ..మళ్లీ ఇంకో పాట...పాటలు కూడా బాగుంటాయి ..తన అందం మీద అతి నమ్మకం..వాడెవడో..నా చెయ్యి పట్టుకున్నాడు..అంటూ పట్టుకు వెళ్లి, ఓ చిన్న వీధి రౌడీలను చూపించడం..పెద్ద ,పెద్ద కిల్లింగ్ కాంట్రాక్ట్ లు తీసుకునే..హీరో..విసురు గా ఓ పేర్చి ఉన్న గోడే అనుకోండి, గట్టిగ ఓ పంచ్ ఇవ్వడం..భలే పంచ్..
ఎన్నో సిన్మాల్లో స్పూఫ్ కూడా అయిపొయింది..
యేసు క్రీస్తు లాగ..సిలువ పోస్ లో..త్యాగానికి ప్రతిరూపం లాగ..మన కిల్లెర్ హీరో..తాత గారి ముందు మోకరిల్లడం..అది ఒక కీలకమైన సీనే..
నువ్వు, మా పొలంని  ఆక్రమణ ల నించి కాపాడినపుడు ,అడగలేదు, పాతిక ఏళ్ళ కుర్రాడు, పది లక్షలు ఎలా సంపాదించాడు ? అని అడగ లేదు..అని తాత గారు.. నాజర్ మాటలు కూడా..క్లాప్స్ పడే సీన్..  ..
బయటకి వచ్చి, తాత గారు ఇచ్చిన బారెల్ గన్ పట్టుకుని, యుద్ధానికి అదే climax సీన్ కి వెలుతూ ఉంటె.. పూరి.." నేనూ వస్తాను"..
మహేష్..అదే పార్ధూ..అదే.." నేనే వస్తాను"
క్లుప్తం గా మాట్లాడి ,ఏక్షన్ ఎక్కువ చేసే మహేష్ కి ఎంత కరెక్ట్ గా రాసాడో..మాటలు.. త్రివిక్రమ్..
ప్రకాష్ రాజ్ డిటెక్షన్  ..ఎత్తు పై ఎత్తులు..
అబ్బ, చాలు బాబూ..ఇది ఎప్పటిదో..పాత సినిమా ..ఏమిటి అంత బిల్డప్ ..అని జుట్టు పీక్కున్తున్నారా??
ఏమిటో నండి..చెప్పెను కదా పూరి లాగ , నా బ్లాగ్స్ నాకే నచ్చేస్తున్నాయి.
ఎవరో..పక్కనే మహేష్ బాబు లాగే..
రాసిందే రాస్తావు..నువ్వు బాగుంది అనుకుంటే చాలా? అంత సీను  లేదు..అని గాలి తీసే  స్తున్నారు..
 ఓహో..టీ కావాలిట.'.అతడు 'కూడా నాకు నచ్చిన సినిమా అండి..ఈ మధ్య కాలం లో హీరోయిన్ ని ఇంత అందం గా చూపించిన సినిమా ఇంకొకటి లేదు..మళ్లీ..మా టీ వి. వ్వాళ్ళు ఎప్పుడు వేస్తారో???
చివారఖరి మాట..మనలో మనం ..ఆ రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ సినిమా పాత్రలను అందరిని తెచ్చి, ఈ ప్రేమ పూరక మండువా లోగిలి, జాయింట్ ఫ్యామిలీ ఇంట్లో తెచ్చి పడేస్తే పోతుందేమో??
ఎందుకు ఇంకా ఆ నరుక్కోడాలు , చంపు కోడాలు?? ట్రై చేయొచ్చు కదా..

పెళ్లి కాని పిల్లలు..లో హీరో లు..సూర్య కాంతం-రమణ రెడ్డి లే

అవునండి..ఈ సినిమా లో హీరో అయిదుగురు ఆడ పిల్లల తల్లి తండ్రులు..సూర్య కాంతం-రమణ రెడ్డి..లే..నాకు ఎంత నచ్చేరో? ఇది కూడా పాత  సినిమా..ఈ టీ వి. లో వచ్చిందే ..ఇది కూడా వచ్చి,ముప్ఫై ,నలభై ఏళ్ళు అయి ఉంటుంది.
ఆడ పిల్లల తండ్రి అంటే, ఏమిటో,పెద్ద బరువు తల మీద పెట్టుకున్నట్టు, భారంగా, దిగులు గా ఉండే సినిమా తండ్రుల ని చూసాం..తల్లి కూడా ,ఏమండి, పిల్లలకి పెళ్లి చేయండి, అని బ్యాక్ గ్రౌండ్ మ్యూసిక్  లాగ పాడుతూ ఉంటుంది. కానీ ఇందు లో..

పిల్లలందరికి వాళ్లకి ఇష్టమైన చదువులు అప్పు చేసి మరి చదివిస్తాడు, రమణ రెడ్డి, తండ్రి గా..అబ్బ నాకెంత నచ్చిందో? పెద్ద అమ్మాయి ఎం ఏ,పీ హెచ్ డి అని గర్వం గా చెప్పుకుంటుంది. రెండో అమ్మాయి సంగీత సరస్వతి, మూడో అమ్మాయి నాట్య మయూరి, నాలుగో అమ్మాయి,ఆటల్లో బెస్ట్.ఐదో ఆఖరి అమ్మాయి ,చదువుకుని, ఉద్యోగం చేస్తూ ఉంటుంది. హీరోయిన్ జమున.

ఇంక తల్లి పాత్ర లో సూర్య కాంతం..సంతాన లక్ష్మి గా అదర గొట్టింది. పిల్లలు తో ఒక పెళ్లి కి వెళ్ళిన సన్నివేశం లో, ఏమిటమ్మా ..మీ పిల్లలికి పెళ్లి ఎప్పుడు చేస్తావు? అని అమ్మలక్కలు అడిగితే.. మీకెందుకు?? నా పిల్లలు, నా ఇష్టం..అని సూర్య కాంతం గయ్యాళి గొంతు తో అడిగే సరికి, ఇంట్లో సోఫా లో కూర్చుని సినిమా చూస్తున్న నాకు ..కేయ్య్ మని ఈల వేసి, చప్పట్లు కొట్టాలి అనిపించింది.

అవును లే, మీ ఆఖరి అమ్మాయి ఉద్యోగం చేసి, మిమ్మలిని పోషిస్తోంది కదా, పెళ్లి ఎందుకు చేస్తారు?అని సన్నాయి నొక్కులు నొక్కితే, ఆ అమ్మలక్కలు, హాయ్ ..అని పెద్ద గొంతు తో మీద పడి పోయి, తన దైన శైలి లో చేతులు తిప్పుతూ, ఏం మీకేంటి సంబంధం? మీరేమైనా పోషిస్తున్నారా? మమ్మలిని..పదండి, పదండి, నేనింక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, పిల్లలూ..అని ఒక్క మాట తో, విదిలించి పడేసి, నిష్క్రమిస్తుంది, తన సంతానం తో.
కాని, నా మనసు లో ప్రతిష్టించు కున్నాను..అసలే సూర్య కాంతం వీర ఫ్యాన్ ని.

మామూలు రొటీన్ సినిమాల్లో, ఇలాంటి సీన్ ల లో.తల్లి గుడ్ల నీరు నింపుకుని,అవమాన భారం తో, చీర కొంగు నోట్లో కుక్కుకుని ,పారి పోతుంది. శెభాష్..సి .వి. రావ్.. దర్శక మహాశయుడు.

పిల్లలు మాకు ఇష్ట మైన వారినే చేసుకుంటాం, అల్లా టప్పావాళ్ళని కాదు ,అని భీష్మించుకుని కూర్చుంటారు, ఏ సంబంధం తెచ్చినా తిప్పి కొట్టేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి లో, జగ్గయ్య జమున ని, చూసి ప్రేమించి, అక్క లందరికి పెళ్లి చేసే బాధ్యత తన నెత్తి మీద వేసుకుంటాడు.
తండ్రి గా రమణారెడ్డి,అద్భుతం..ఆ పాత్ర, ఆ నటన.

జగ్గయ్య ని ఆమోదించి, అతని ప్రయత్నాలకు సహా కారం అందిస్తాడు..నూరు అబద్ధాలు ఆడి,పెళ్లి అంటారు కదా, ఈ అమ్మాయిలకి సరి జోడు లని కుదర్చడం లో, తన పిల్ల ల  అభిష్టాలు ,నెర వేరుస్తూ,భార్య సూర్య కాంతం మాట కి విలువ నిస్తూ,ఒక్కో సారి మందలిస్తూ, హబ్బ ..మధ్య తరగతి తండ్రి పడే కష్టాలని ,అవలీలగా మోసే తండ్రి పాత్ర..
చివరాఖరికి ,జగ్గయ్య కుదిర్చిన జత గాళ్ళు, అసలు రంగు తెలిసి, పిల్లలు వద్దు పొమ్మంటే, ఇన్నాళ్ళు ఓపిక గా ఉన్న తండ్రి,ఒక్క సారి,పిల్లల మీద  చేతి కర్ర ఎత్తి, ఇన్నాళ్ళు ఓపిక గా మీ ఆటలు సహించాను, ఇంక చాలు, ఈ పెళ్ళిళ్ళు మీరు చేసుకోవలసిందే, అని దండ ప్రయోగం చేసిన సన్నివేశం, నేను ఒప్పను అనే భార్య మీద కూడా అదే ప్రయోగం..
తండ్రి గా ఎంత ముద్దు చేసినా పిల్లలు, దారి తప్పుతూంటే, దండం ఉపయోగించే తండ్రి..
నలుగురు ఆడ పిల్లలిని ,ఎంత కావాలంటే అంత చదువు లు చదివించిన ,మా నాన్న గారే గుర్తు వచ్చారు.పెద్దగ ఆస్తి పాస్తులు  లేక పోయినా, అందరూ పెళ్ళిళ్ళు, అని గోల పెడుతున్నా, నా పిల్లలే నా ఆస్తి అంటూ గర్వం గా తిరిగిన మా నాన్న గారు..అందరికి తగిన సంబంధాలు, చదువులు తరువాతే అయ్యాయి అనుకోండి.
ఇంత చక్కని తల్లి తండ్రులు ఉన్న పిల్లలు ఎంత అదృష్ట వంతులో కదా..జగ్గయ్య ఇన్నాళ్ళకి హీరో గా కనిపించాడు, ఎప్పుడూ సెకండ్ హీరో కదా, పాటలు కూడా బాగున్నాయి..
దూకుడు, కందిరీగులు, ఊసరవెల్లులు ఉన్నాయి కాని, ఇలాంటి ఆర్ద్రత నిండిన సినిమాలు ఉన్నాయా ఇప్పుడు?
సినిమా చూసి, ఇలా మనసులో సంతోషాన్ని నింపి,జ్ఞాపకాల తెరలను అలవోకగా రెప రెప లాడించ గల ,సినిమాలు ఎక్కడ ఉన్నాయి?
అందుకే ఈ పాత సినిమాలే అయినా,ఆపాత మధురాలు.

28 సెప్టెం, 2011

పాదాల వద్ద చోటు ..అనే గుండమ్మ కథ

హమ్మయా ..చివరాఖరికి సరోజని తెచ్చి మావగారి కాళ్ళ మీద పడేసారు. యావత్ ఆంధ్ర ఊపిరి పీల్చుకుంది. పాటలు ఎంత బాగుంటాయో? బ్రదర్ అంటూ..అగ్ర నటులిద్దరూ చేయి, చేయి పట్టుకుని ,షేక్ హాండ్స్ఇచ్చుకుని, ఇద్దరి అభిమాన సంఘాల వారిని  చల్ల బరిచారు..ఎప్పుడో, అవును, నలభై ఏళ్ల క్రితం తీసిన సినిమా..యాభై ఏళ్ళు కూడా నేమో..తొందర పడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు,లేచింది ,నిద్ర లేచింది, మహిళా లోకం అంటూ పాడేసారు..ఇప్పటికి అదే పరిస్థితి.
ఏం చదువు కున్నావు? అంటే గొంతు వరకు అంటుంది..సరోజ.
పరిచయం చేస్తే నమస్కారం అనా అనదు ..సరోజ.
పాపం ,పొద్దున్నే లేచి, కాఫీ అంటూ అరిచే గారబాల పిల్ల..జమున.
తెల్ల వర ఝామునే లేచి, ఇంటెడు చాకిరి చేసే మంచి పనిమంతురాలు..లక్ష్మి..మన చూడ చక్కని, నా అభిమాన సావిత్రి.
కోడళ్ళు ని చేసుకోవాలని వస్తాడు..ఎస్ వి ఆర్ గారు.
ఎవరైనా పనిమంతులనే కోరుకుంటారు కదా..కాని, ఈ కుటుంబంతో పూర్వ పరిచయం ఇలా అయింది ..మరి ఎలాగా?
సరోజకి బుద్ధి చెప్పే పని భుజం మీద వేసుకుని, ఏ ఎన్ ఆర్ ..ముందు ప్రేమికుడు గా, మంచివాడు గా నటించి, తరువాత తాగుబోతు,  చెడు అలవాట్లు ఉన్నవాడుగా  చివరకి ఇంటి దొంగ గా కూడా నటించి, జమున తల్లి గుండమ్మని బాధ పెట్టి, భయ పెట్టి, సరోజ ని తన వెంట ఇల్లు వదిలి వచ్చేటట్టు చేస్తాడు.
కట్టుబట్టల తో, వచ్చి, మట్టి పని చేసి, పొయ్యి ముట్టని అమ్మాయి, వంటలు చేసి పెట్టి, ఇవన్ని,ఆడుతూ పాడుతూ..నెలాఖరికి జీతం కోసం..మావ గారి ముందు చేయి చాపేసరికి, నేను ఒక్క సారిగా..సరోజ అదే జమున ఫ్యాన్ అయిపోయాను.
భర్తే  దైవం అనుకుని, అతని వెంట నడిచిన అమ్మాయి లో ఏమిటి కనీ పించిందో? తప్పు.నా కయితే అందరూ అలా కుట్ర పన్ని, పాపం ఆ అమ్మాయిని అలా బాధ పెట్టడం నాకు సుతారమూ నచ్చలేదు.
ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం..తీసిన సినిమా..అవ్వ ఇప్పుడా ఈవిడ రివ్యు ..అని బుగ్గలు నొక్కుకున్న సరే..
చదువుకున్న ,తల పొగరు సరోజ కే నా ఓటు.
ఎక్కడ ఉన్నా , ఎప్పుడు అయినా సరే..ఆ మాత్రం..పొగరు, వగరు..ఉండాల్సినే..ఆడ పిల్లలికి. అదే ఆత్మ విశ్వాసం అంటాను నేను. సాహా చర్యం కే నా ఓటు. కాళ్ళ దగర మటుకు కాదు. ఒక్క యుగళ గీతం, ఒక అందాల బొమ్మ హీరోయిన్ పాత్ర సినిమాల్లో. ఇంకా ఎన్నాళ్ళో.
నిజం గా మహిళా లోకం లేస్తే..ఏమవుతుందో..ఈ దేశం?
ఎవెర్ గ్రీన్ సినిమా లలో ఒక్కటి అయిన గుండమ్మ కథ ఇప్పుడే (అంతకు ముందు చాలా సార్లు)ఈ టీ. వి. లో..చూసి..రాసిన లేట్ గా కూసిన కోయిల గీతం ఇది.







బొమ్మల కొలువు..దసరా పండగ..

రంగు రంగుల బొమ్మలు, మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు, తల  ఆడిస్తూ నాట్యం చేసే బుట్ట బొమ్మలు, పిట్టలు, పొలానికి వెళ్ళే రైతు, అతని భార్య, తిరగలి తిప్పుతూ స్త్రీ  బొమ్మ, వేలి  కింద గోవర్ధన గిరి ఎత్తిన కృష్ణుడి బొమ్మ, దశావతారాలు, ఎన్ని రకాల బొమ్మలో? మన దేశీ కళాకారుల చేతిలో లాఘవం గా రూపు దిద్దు కున్న బొమ్మలు, ఎంత అందంగా మనసుని ఆకట్టుకుని  ఆహ్లాద పరుస్తాయి. మన పల్లె ప్రజల  తీరు తెన్నులు, వారి రోజు వారి పనులు  వారి వృత్తి  పనులు అన్నీ బొమ్మల్లో ఆవిష్కరిస్తారు.

మన దేశం లో ఎనభై శాతం ప్రజలు పల్లెల్లో నివసిస్తారు.. అధిక శాతం పొలం పని, మిగిలిన వారు చేతి పనులు , లేదా చేనేత పనులు లలో నిమగ్న మై ఉంటారు. ఈ వృత్తి పనులు ,వంశ పారంపర్యం గా కుటుంబాల కి ఆధారం గా నిలిచి ఉన్నాయి. మట్టి తో, లేదా చెట్టు లనుండి లభ్యమయ్యే చెక్క తో చేసే ఈ బొమ్మలు సజీవం గా కని పించడానికి , వారు వాడే ప్రకృతి నించి లభించే రంగులు ఒక కారణం. భూమి కి దగ్గర గా బ్రతికే వీరి జీవన విధానం మరో కారణం.

ఏటి కొప్పాక బొమ్మలు , కొండ పల్లి బొమ్మలు, మన రాష్ట్రం లో తయారు అయే ముచ్చటైన బొమ్మలు. లక్క పిడతలు తో ,చిన్న చిన్న బువ్వలు వండి,ఇంటిల్ల పాది కి,అన్నాలు పెట్టే బాల్య స్మృతులు ఎంత మధుర మైనవి.తిరుపతి వెళితే, పెద్దలకి పుణ్యం, చిన్న పిల్లలికో నల్లగా నిగ నిగ లాడే చేయంత పొడుగు ఉన్న చందనం బొమ్మలు, ఒకటి ఆడ, మరోటి మొగ..ఇంక మనం వాటికి చంకి ,చంకి పరికిణీలు, జుబ్బాలు కట్టి..వాటికి పెళ్లి చేయడం..అబ్బ ..ఎంత సందడో.(ఇప్పటి బార్బీ డాల్స్ వీటి ముందు దిగ దుడుపు).

ఏ పుణ్య క్షేత్రం కి వెళ్ళినా ,అక్కడి బజారు లో దొరికే, బొమ్మలు, ఫోటోలు, దేవుడి బొమ్మలు, పూజ సామాను, ఇవి కొనుక్కు వస్తాం. మన లాంటి యాత్రికుల నే నమ్ముకుని ఉంటారు కదా అని, నేను పదే, పదే కొంటూ ఉంటాను.

ఇంకా ఇవి కాక ఏ సప్తాహం లాంటి వో అయితే, ఇంక ఎన్ని రకాల మట్టి బొమ్మలో, చేతిలో మురళి తో, చిరునవ్వుతో చేయంత కృష్ణుడు, పాకుతున్న బాల కృష్ణుడు, తంబూర మీటుతూ,పరవశం లో ఉండే మీరా,చేతిలో విల్లుతో అందాల రాముడు,పక్కనే లక్ష్మణుడు, సిగ్గుల మొగ్గ సీత, కాళ్ళ దగ్గర నమ్మిన బంటు హనుమంతు, ఒకటేంటి మన పురాణ గాధలలో బొమ్మలన్నీ అక్కడే..కూడా బెట్టిన డబ్బులన్నీ అక్కడే అయిపోయేవి.

ఇప్పుడయితే, ఇవన్ని మన లేపాక్షి లో ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి.కానీ, మా చిన్నతనం లో సంవత్సరానికి ఒక్కసారే ఈ సప్తాహం లో దొరికేవి.లేదా రామ కోటి అని ఇంకో సారి జరిగే ఉత్సవం లో దొరికేవి.

ఇవి కాక ,రక రకాల జంతువుల బొమ్మలు ..పక్షులు, బొమ్మలు..ఎన్నో,ఎన్నెన్నో..
ఇంక ఈ బొమ్మలు అన్ని అందరికి చూపించే రోజు కూడా ఒకటి ఉండాలి కదా..దసరా వచ్చిందంటే..
పెట్టెల్లో సర్ది పెట్టిన బొమ్మలు అన్ని తీసి, దులిపి,ఇంట్లో ఉన్న పెట్టెలు,బల్లలు, మెట్లు మెట్లు గా అమర్చి, నాన్నగారి పట్టు పంచో,అమ్మ పట్టు చీరో, వాటి మీద కప్పి,మూడో ,ఐదో మెట్లు గా అమిర్చి , ఆ పై బొమ్మలు అమర్చడమే...నలుగురం..ఆడ పిల్లలు ఉన్న మా  ఇల్లు...అల్లరి,తగువులు ,అలకలు, తో కళ కళ లాడుతూ , నలుగురం కొత్త బట్టలు వేసుకుని,రిబ్బన్లు కట్టుకున్న జడలతో ,మేము నలుగురం ఇంట్లో తిరుగుతూ ఉంటే, మా ఇల్లే ఒక బొమ్మల కొలువు లాగుండేది.


మన రాష్ట్రం లో మనం దసరా కి చేసుకుంటే,మన పొరుగు రాష్ట్రం తమిళ్ నాడు లో బొమ్మల కొలువు సంక్రాంతి కి చేసుకుంటారు. తమిళులు వారి సంస్కృతిని చక్కగా మర్చిపోకుండా ఆచరిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఇంటిటికి కాక పోయిన వీధికి ఒకటైన ఉంటాయి..ఈ బొమ్మల కొలువులు.మన ఆంధ్ర లో తరిగిపోతున్నట్టు అనిపిస్తోంది.
అమెరికాలో ఉండే మా చెల్లెలు మటుకు దసరాకి తను లేపాక్షిలో ఎటేటా కొని పట్టుకు వెళ్ళే దశావతారాలు, కొండ పల్లి, ఏటి కొప్పాక ,ఎక్ష్హి బిషన్ లో కొనుక్కున్న ఇతర బొమ్మలు అన్ని అమర్చి తన కూతురుకి చెప్తూ ,చూపిస్తూ  మన సంస్కృతీ నిలబెడుతోంది.
ఇద్దరు అబ్బాయిలు ఉన్న మా ఇంట్లో,నా సంగతంటారా ..మా డ్రాయింగ్ రూం లో ఉండే గాజు అలమరాల నిండా ఇవే బొమ్మలు..వీధి లో కనిపించే ,పేవ్ మెంట్ మీద అమ్మే బొమ్మలు, వచ్చి, మా ఇంట్లో కూర్చుంటాయి.ఇంక ఎక్కడ పెడతావు?అన్ని నిండి పోయాయి కదా అంటే..అందుకే కదా ,ఇంకా పెద్ద ఇల్లు..అంటున్నాను..ఉండేది ఇద్దరం..పిల్లలు బయటకి వెళ్లి పోయారు ఇంకా నాకు, నీకు,ఈ బొమ్మలికి, పుస్తకాలి కీనా ఇంకో ఇల్లు..అని అరిస్తోటల్ లాగా చింతన భంగిమ లో..ఆయన.

26 సెప్టెం, 2011

నవతరం.ఈతరం...

"అమ్మా."సిద్ధూ పిలుపు కి దీక్షగా " మీ టీ వి. " లో వనితల కార్యక్రమం చూస్తున్న నేను  తల తిప్పి ఏమిటి? అన్నట్టు చూపులతోనే ప్రశ్నించేను  అమ్మా ఇంత ఇంట్రెస్ట్ గా చూస్తున్న కార్యక్రమం ఏమిటా అని సిద్ధూ కూడా టీ వి లో వస్తున్నా ఆ కార్యక్రమాన్ని చూడ సాగాడు.  నేను  చూస్తున్న కార్యక్రమం మధ్యాన్నం ఇంట్లో ఉండే వనితల కోసం స్పెషల్ గా రూపొందించినది. ఈ రోజు అందులో భాగంగా చక్కగా, చూడ ముచ్చటగా ,రంగు రంగుల చీరల్లో అందం గా అలంకరించు కుని ,అందమైన తల కట్టు, మేకప్ ల తో ముగ్గురు వనితలు ఓ  బల్ల  వెనుక నిలబడి ఉన్నారు.వారి ముందు, ఆ బల్ల మీద వారి "ఆయుధాలు" అమర్చి ఉన్నాయి. యాంఖర్ వీరిని పరిచయం చేస్తూంటే , ఆ ముగ్గురు వనితలు చిరునవ్వుతో, చేతులు జోడించి అందుకున్నారు. ఎంత అందం గా ఉన్నారో? వారి అలంకరణ, చీరల రంగు, మాచింగ్ ..అని మైమరిచి చూస్తున్నాను.

ఇంక, ఒకరి తరువాత ఒకరు "చిట్కాలు " చెప్పడం మొదలు పెట్టేరు. చీమలు చంపడం ఎలా? అని ఒకరు,బొద్దింకలు ని ఎలా సమూలంగా నాశనం చేయాలి, అని ఇంకొకరు, ఇంకా ఎలుకలు, బల్లులు,తేళ్ళు ,పాములు, ఇంకా...ఇలాంటి..జీవాలని ఎలా నాశనం చేయాలో, మన ఇళ్ళని,మన ని ఎలా రక్షించు కోవాలో, ఇలా,ఒకరి తరువాత ఒకరు, ఆ అందమైన వనితలు వివరిస్తున్నారు.

సిద్ధూ ఒళ్ళు జలదరించింది.అమ్మ వేపు చూసాడు, తన్మయత్వం లో మునిగి పోయి ఉంది, ఇదేమిటి ? అమ్మ కి ఏమీ అనిపించడం లేదా? చేతిలో " సేవ్ ది ప్లానెట్ " అని హెడ్డింగ్ ఉన్న పేపర్ వైపు చూస్తూ, అమ్మా అంటూ చేత్తో కుదిపాడు. ఈ లోకం లోకి వచ్చాను.
"ఏమిట్రా"??  ..
" మనకి అడ్డుగా ఉన్న ప్రతి జీవి ని  చంపేయడం ఏంటమ్మా" ? ఇంకా ఆ అందాల అతివల ఆకర్షణలో నే ఉన్నాను..".ఏంట్రా..? నీ గోల"
"అదేనమ్మా చెప్పను కదా, రేపు నేను సేవ్ ది ప్లానెట్ అనే డిబేట్ లో పాల్గొనాలి కదా " అన్ని టికి నా  సాయం కావాలి సిద్ధూ కి...
"అయితే, ఆ ఎస్సే పుస్తకాలు పట్టుకు రా, లేకపోతే ఇంటర్నెట్ లో వెదుకుదాం.."  " అది కాదు అమ్మా ! మన ఇంట్లో ,మన చుట్టూ మనం ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాము అనేది  వివరించాలి"
"సరే, అయితే నువ్వే అలోచించి చెప్పు, నేను వింటాను"
" నువ్వు  ముందు గా ఉదయాన్నేబ్రష్  చేసుకొనేటప్పుడు ,కొళాయి మూసి ఉంచాలి,అలా తెరచి, ఉన్నందు వల్ల ఎంత నీరు వృధా అవుతుందో తెలుసా, "

" ఊ! ఊ!!సరే " అసహనం గా, " తరువాత మనింట్లో బల్బ్స్  ని మార్చాలి, ఎనేర్జి సవింగ్ బల్బ్స్  అమర్చు కోవాలి, పగలు సహజ మైన వెలుతురూ వచ్చేలా తలుపులు తెరుచు కొని , ఈ ట్యూబ్ లైట్ ని ఆఫ్ చేయాలి "
అంటూ లేచి ఆ గదిలో వెలుగుతున్న లైట్ ని ఆఫ్ చేసాడు.

"సిద్ధూ ,మనింట్లో వెలుతురు ఎలా వస్తుంది? చుట్టూ గోడలే, ఈ ఫ్లాట్స్ లోకి వెలుతురు ఎలా వస్తుంది. చీకటి గా ఉంటే,నాకు ఇష్టం లేదు.."

"అమ్మా! ట్యూబ్ లైట్ బదులు CFL బల్బ్స్ పెట్టాలి, "సరే,సరే,మనిన్ట్లోవి తర్వాత చూద్దాం. నువ్వు నీ డిబేట్ లో మాట్లాడే విషయాలు ఇంకా చెప్పు"..

సిద్ధూ.." అమ్మా ,మనం ఇంకా చాలా చేయాలి. మొక్కలు నాటాలి, నాటి, వాటిని చెట్లుగా, పెంచాలి..మన ఇంటి చుట్టూ వర్షం నీరు ని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి, అడవులని ఇష్టం వచ్చినట్టు నరక కూడదు.మొన్న శ్రీకాకుళం దగ్గర ఊర్లోనికి ఏనుగులు గుంపులు వచ్చాయన్న వార్తా చదివేవు కదా" అంటూ చెప్పుకు పోతున్నాడు.

"దానికి మనమేం చేస్తాం?"
"పేపర్ వేస్ట్ చేయకూడదు, ఒక్క పేపర్ కోసం ఎన్ని చెట్లు బలి అవుతాయో తెలుసా అమ్మా??"
వీడికి న్యూస్ పేపర్ చదవడం నేర్పింది నేనే. కాని, వీడిప్పుడు నన్నే మించి పోయాడు." ఇంకా కార్బన్ ఏమిషన్స్ వెదజల్లే  పెర్ఫుమ్స్ ,స్ప్రే లు వాడడం ఆపేయాలి..కార్బన్ ఫుట్ ప్రింట్స్ ..యు నో .."

ఎనిమిదో తరగతి చదువుతున్న సిద్ధూ , పుస్తకాల్లో పాఠాలని, గట్టిగా నమ్మి, ఆచరించే పసి మనసు తో ఉన్నాడు.మంచిదే..నేను  ఎలాగు ,మాట ఒకటి, ఆచరణ మరోటి చేసే నడి వయసు లో ఉన్నాను..

"అమ్మా, ఇందాక ఆ టీ వి ప్రోగ్రాం చూడు. వాళ్ళు అన్నిటిని అలా చంపేయ మంటున్నారు ..అదేమిటమ్మా ..ఈ ప్లానెట్ ఒక్క మనుషులదేనా? వాటికి కూడా జీవించే హక్కు ఉంది కదా!" అనాలోచితం గా తల ఊపేను.
ఈ భూమి మీద అన్ని జీవ రాసులకి హక్కుంది..అన్ని జీవ రాసులు మనిషి కోసం, మానవుడి ఆనందం కోసమేనా? మనకి ఉపయోగపడటం కోసమేనా?" ఆవేశంగా ఊగిపోతూ..సిద్ధూ .

సిద్ధూ మామ్మల్స్ గురించి పాతం విన్న రోజు " ఆవు, గేదెల పాలు వాటి పిల్లల కోసం కదా! మనం ఎందుకు తాగుతున్నాం?" అని అడగడం గుర్తు వచ్చింది.

ఏదో సమాధానం తో సర్ది చెప్పింది, ఆ రోజు. సిద్ధార్థ అని పేరు పెట్టిన్నందుకు తన పేరు సార్ధకం చేసుకున్నాడు..అని మురిసి పోయి, పొంగి పోవడం గుర్తు వచ్చింది.ఇలాంటి అనుమానాలు వస్తూండడం వల్ల, వాడి కోసం నేనూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను.

డోర్ బెల్ మోగింది.."నేను తీస్తాను" అంటూ సిద్ధూ లేచి తలుపు తెరిచి, "మైంట్నేన్సు బిల్ అమ్మా..,వాచ్ మాన్ ఇచ్చాడు " అని బిల్ అందించాడు.

రెండు వందల రూపాయలు తగ్గింది..ఆశర్యం..ఆనందం..ఇదంతా మేం అందరిని ఒప్పించి, ఎవరికీ వారి నీటి ఉపయోగం బట్టి ,బిల్ వచ్చేలా వాటర్ మీటర్ లు అమర్చాం. ముందు కొంచం ఖర్చు అనిపించినా, ఫలితం వెంటనే కనిపిస్తోంది .

అందరు నీటి వాడకం తగ్గించి, పొడుపు గా నీళ్ళు వాడడం వల్లే ఖర్చు తగ్గింది. సిద్ధూ కూడా ఈ  విషయాన్ని గమనించాడు.

"అమ్మా ! మీటర్  లేనప్పుడు, అందరు ,బాధ్యత లేకుండా వాడి, నీటిని వృధా చేస్సారు, ఈ ప్లానెట్ కూడా అంటే నమ్మా ! ఎవరికీ వారు స్వార్ధం తో దుర్వినయోగం చేస్తున్నారు. దీనికి విరుగుడు, ఎవరికి వారు విజ్ఞ్ఞానం అనే మీటర్ సంపాదించు కోవడమే..ఆ ..ఆ..ఆచరణ కూడా ముఖ్యమే అనుకో..ఈ విజ్ఞానపు మీటర్ ఎప్పుడూ ఆన్ లో ఉంచితే మన ప్లానెట్ వనరులు కూడా ఇలాగే ఆదా అవుతాయి .".

సిద్దార్ద మాటలతో ఆలోచనలో పడ్డాను. ఎంత చిన్న విషయం, కాని ఎంత పెద్ద మార్పు ని తీసుకు వస్తుంది. మనందరం విచక్షణ తో ,ప్రవర్తించే రోజు వస్తుందా? సిద్ధూ లాంటి భావి  పవురల కైనా మనం ఈ ప్లానెట్ ని మిగులుస్తామా?

" నాకు మంచి పాయింట్ దొరికిందమ్మా.." అన్న సిద్ధూ అరుపుతో ..ఈ ప్లానెట్ మీదకి, అదే మా ఫ్లాట్ లోని గది లోకి వచ్చాను.


నా మొట్టమొదటి ప్రింట్ లో చూసుకున్న కథ..కువైట్ తెలుగు కళా సమితి వారి మగజినె లో ప్రచురిం పబడింది. చిన్న పిల్లల కథ లా ఉన్న..కాకి పిల్ల కాకి ముద్దు..అని మళ్లీ పబ్లిష్ చేస్తున్నాను..నా బ్లాగ్ పోస్ట్స్ లో.

21 సెప్టెం, 2011

పాడుతా తీయగా..

అబ్బే ..నేనేమీ పాడ బోవటం లేదు, మాకేమి ఫ్యామిలీ పాట కూడా లేదు..ఎప్పుడో, ఓ యాభై ఏళ్ళ క్రితం, నా స్నేహితురాలు కళ్యాణి చూసి, ఇంస్పిర్ అయి, సంగీతం మాస్టారు ఇంటికి వెళ్లి, అవి ,ఇవి, మాట్లాడుతూ ,తీసుకు వెళ్ళిన కొబ్బరి కాయ ముచిక, తల పీకేసాను, పని లేక, అది చూసి, అయన, అయ్యో, సరస్వతి దేవి కి ఇలాంటి మొండి కొబ్బరి కాయ కొట్టకూడదు అమ్మ..రేపు రా పోనీ, అనేసారు..అప్పు రేపు, లాగ, ఆ రేపు ఇప్పటికి రాలేదు. దాంతో ,నా పాడబోయిన పాట పురిట్లోనే ..

నా టపా పాడుతా తీయగా గురించే..చక్కటి పిల్లలు, పట్టు పరికిణీలు, తల లో పువ్వులతో ,నగా- నట్రాలతో అలంకరించుకుని, అబ్బాయిలు, మైనారిటీ ఏ ఇక్కడ, మెరిసే శేర్వాని ల లో, కూర్చుని, ఒక్క పుస్తకం .కాని, పేపర్ గాని చేతిలో లేకుండా, మొత్తం పాట అంతా, అస్ ఇట్ అస్ గా అంటే, వినడానికి మనకి సినిమా లో పాట లాగే ఉంటుంది. అలా పాడేస్తున్నారు..పాట అంతా  విని ,ఎంత బాగుందో, అని నేను మురిసి పోయినంత సేపు పట్టదు. జడ్జ్ ఎస్ పి బి. గారు, మొదలు పెడతారు.

ఆరోహణ లో, చిన్న అపస్వరం, ముళ్ళు అంటే చాలదా,ముల్లులు ఏమిటి? పిల్లలేకేం తెలుసు, కవి గారు అలా రాసారు మరి, ఒక చిన్న జీర, వచ్చింది, ఇంకా మార్దవం గా, ఇంకా సుతి మెత్తగా, ఇంకా ఫీలింగ్ తో, ఇంకా ....
నిజమే జడ్జ్ గా అయన అలా అనాలేమో, కాని, నాకు మటుకు, ప్రతి వారు ,ఎంతో చక్కగా పాడేరు అని తోస్తుంది. ఆ పిల్లలు ఏమనుకుంటున్నారో ,నాకు తెలియదు కాని, ఎలిమ్నేషణ్, నిష్క్రమణ ,అంటూ ఉంటే, నాకు కళ్ళు తడి అయిపోతాయి.

మాకు డిగ్రీ లో. తీయని పాటలు పాడే బాల అనే స్నేహితురాలు ఉండేది. ఇప్పుడు ఉంది కానీ,ఎక్కడో, కలుసుకుని ఎన్నో ఏళ్ళు అయింది. నడిచే రేడియో ఆమె..బాలా ఈ పాట పాడవా?అని అడగ్గానే, గొంతు సవిరించుకుని పాడేసేది..అంటే, క్లాస్ లో వినిపించే సుత్తి పాఠాలు అలసట అంతా మాయం అయేది. నాకు ,ఎక్కడో విన్న పాట గుర్తు ఉండేది, అంటే, ఈ రోజు ఏదో కొత్తగా ఉంది, అంటూ పాడుతాడు, అని భావం మటుకు చెపితే చాలు, తను పాట అందుకుని పాడేసేది. అంటే లిరిక్స్ లో అంత వీక్ అన్న మాట మనం అంటే నేను .

అలాంటిది, ఇంతింత పిల్లలు ,ఎప్పడెప్పడివో పాటలు, నా చిన్నప్పటి పాటలు, చక్కగా నేర్చుకుని ,తు. చ తప్పకుండా కోరస్ తో సహా పాడుతూంటే ,ఇంకా తప్పు లేన్నేడమా..

అసలు ఇలా ఫస్ట్, సెకండ్ అంటూ ఎంపిక చేయాలా? మనం కూడా ,ఈ ఎన్నికనే ,అంటే ఈ ఎలిమ్నేషణ్ ,ని అందరం మనసు మూలల్లో ,ఆనందిస్తున్నమా?  ఇదో పెర్వెర్తెద్ ఆనందం మనకి.

ఆ పిల్లల మనసుల్లో ఎంత  ఆందోళనో ,ఆ పిల్ల తల్లి తండ్రి కి ఇంకెంత బాధో, ఇదేమి ఎలిమినేషన్ కాదు, అంటే మీరు బాగా పాడ లేదు అని కాదు.. అని ఒక కొసరు ఓదార్పు మాట, ఆ చిన్నారి కళ్ళ లలో నీళ్ళు ని ఆపగలిగే మాట ఏనా? మీరు మరి సున్నితం ..జీవితం లో ఎన్నో గెలుపు ఓటములు ఉంటాయి..ఇప్పుడు ఇది ఒక పాఠం.అంటారు.కొందరు. నేను ఒప్పుకోను.

తరగతి లో ఫస్ట్ రాక పోతే, నాకు తల కొట్టేసినట్టు అయి, చాల విశ్వాసం తగ్గినటు అనిపించేది..ఇప్పటికి ,నాకు అలాగే ఉంటుంది, అంటే ఏది చేసినా,అర కొర కాకుండా , నా మనసు ,ఆత్మ దృష్టి పెట్టి చేస్తాను.. నాకు కాక ఇంకెవరికి? అని ఉక్రోషం గా ముక్కు ,కళ్ళు తుడుచుకుంటాను.

ఈ వయసు లో నాకే ఇలాగ ఉంటే, చిన్న పిల్లలికి ఎలా ఉంటుంది..దీనితో బాటు, పెద్దల మధ్య జరిగే, పోలిటిక్స్ జరిగింది అన్న ఊరడింపు మాటలు,  నిర్ణయాలు ఎప్పుడో జరిగి పోయి ఉంటాయి, అని ఓడిన వారు అనే మాటలు, లాంటి పెద్ద వారి లోకం లోకి, ఈ పిల్లలు ఘబాలున , తమకి సంబంధ లేని లోకం లోకి వచ్చినట్టు లేదూ..

నాకయితే, ఇప్పుడు పాడుతున్న ఆరుగురో, ఏడుగు రో ,అందరికి, ఒక ప్రైజ్ ఇస్తే బాగుండును అని పిస్తుంది. చివరి వరకు లాగి, ఈ పిల్లలిని ఇంత హింసించాలా ?

నా కెంతో ఇష్ట మైన ఈ కార్య క్రమానికి వన్నె తెచ్చేది, ఈ చిన్న కోయిల ల కుహు కుహు ..మనే పాటలే, కోయిల పాటల్లో జీర ,అప స్వరాలు కూడా నాకు బాగుంటాయి లెండి, అంటే మనది కొంచం, అల్లా ఉద్దిన్ టైప్ చెవి, పెద్దగా శృతి, లాంటివి తెలియవు.

మధ్యలో ,ఈ పెద్ద వాళ్ళ ,మాటలే, చిన్న అప స్వరం లాగ, పంటి కింది రాయి లాగ..తోస్తాయి.
మరి మీరేం అంటారో...హూ ..అబ్బే పాట కాదు, ఖూని రాగం.

20 సెప్టెం, 2011

బ్రాండ్ పవర్..

ప్రతి వస్తువు కి ఒక ఉపయోగం ,ఒక పరమార్ధం ఉంటాయి, కాని, అవి, ప్రజలకు చేరాలంటే ,ఒక బ్రాండ్ పవర్ ఉండాల్సిందే. ఆ మాట కొస్తే,మన భారత దేశం కి ఉన్న బ్రాండ్ ..సాధు ,సన్యాసులు ..ఇప్పుడు కొత్తగా యోగ చేరింది. అక్కడి..విదేశాల లో .. విపరీతమైన వస్తు వినియోగం, మానవ సంబంధాల్లో అస్థిరత, అలజడి తో విసిగి పోయి ...ఏదో మానసిక , స్పిరిచుఅల్ , శాంతి కోసం మన భారత దేశం ,వస్తున్నారు ఎందఱో. ఏ పర్వత సానువు లలో చూసినా , అలుపెరగా కుండా,మన గుడులు , పవిత్ర స్థలాలు ,తిరిగే విదేసేయులు కనిపిస్తారు.ఇదే మన బ్రాండ్ పవర్.

అదే వస్తు వినియోగం, ధన సంపాదన ఆకర్షణ లో మన దేశస్తులు ,విదేశాలకి పయనం అవుతున్నారు, అది వారి బ్రాండ్ పవర్.

తల నొప్పి అంటే అమృతాంజనం, జలుబు, అంటే విక్స్, దగ్గు అంటే గ్లైకొడిన్, చిన్న పిల్లలికి అజీర్ణం అంటే   గ్రిప్ వాటర్ బట్టలు ఉతికే పౌడర్ అంటే సర్ఫ్..బట్టలు ఉతికే పౌడర్ కి ఇంకో మాటే అయిపొయింది, సర్ఫ్ అనే మాట. ఇంకే కొత్త బ్రాండ్ వచ్చినా సర్ఫ్ పొడి ఇవ్వండి అనే అడిగే వాళ్ళం ..

ఇంకా చోకాలేట్ అంటే కాడ్బురిస్ , కూల్ డ్రింక్ అంటే కోకో కోలా..ఇలా బ్రాండ్ పవేర్ లే ఇవన్ని. ఎంతో జాగ్రత్తగా ,ఏళ్ళు తరబడి, క్వాలిటీ , అడ్వెర్ టిస్ మెంట్ తో నిలబెట్టిన బ్రాండ్స్ ఇవి. ఈ బ్రాండ్స్ తయారు చేయడానికి వెనక ఎంత మందిదో శ్రమ ,ఆలోచన, వ్యూహం ఉంటాయి.
ఈ మధ్యే మన దేశం ..లోని వైవిధ్యం, సుసంపన్న మైన , సువిశాల మైన మన సుందర భారతం , అతి పురాతన మైనా, చెక్కు చెదరని ఆలయ సంపదలు,  పులకింప చేసే నదులు, నది తీరాలు, హంపి, హోయసల, అజంతా ,ఎల్లోరా , రామప్ప , కొనరాక్, ఖజురహో, ఓహో, ఎన్ని సుందర  విగ్రహాలు, శతాబ్దాలుగా చెక్కు చెదరని హొయలు, సొగసులు , ప్రపంచం లోనే వింతల్లో ఒకటైన వింత , అందమైన వింత, యమునా నది తీరాన వెలిసిన తాజ్ మహల్ , వేల సంవత్సరాల క్రితమే వేల ,వేల విద్యార్ధులతో విలసిల్లిన నలందా, నాగార్జున విశ్వ విద్యాలయాల అడుగు జాడలు కనిపించే వేద భూమి, ఈ పవిత్ర భారత దేశం ..గొప్పదనాని ఇనుమడింప చేసే ..స్లోగన్.. ఇంక్రెడిబెల్ ఇండియా ..అనే స్లోగన్.

ఇదే బ్రాండ్ పవర్. మన భారత్ దేశానికి వచ్చే యాత్రికుల  సంఖ్య ని ఇబ్బడి ముబ్బడి చేసింది. చినీయులు, జపనీయులు, బుద్ధుడి అడుగు జాడలు వెతుక్కుంటూ, యూరోప్ దేశం నుండి, మన సముద్ర తీరాల లో మునకలు వేస్తూ,  చల్లని దేశాల నుంచి మన వెచ్చని సముద్ర తీరాలు  లో టాన్ అయేందుకు, మన సాదు, యోగి పురుషుల సాంగత్యం లో స్వాంతన ,పొంద దానికి, ఎందఱో, ఎంత మందో విదేశీ యాత్రికులు వస్తున్నారు..
ఇంక్రెడిబెల్ ఇండియా అని మురిసి పోతూ ,ముచ్చటించు కుంటూ, వెనక్కి వెళుతున్నారు.
అది బ్రాండ్ పవర్ ఒక్కటే కాదు, మన దేశం గొప్పతనం అంటారా? మన దేశం ..అంటే తెలియని వారి కి కూడా ,ఈ స్లోగన్ ఆకర్షించింది.. అంటారు.

ఏదైనా బ్రాండ్ తాయారు చేయడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది.

మహాత్మా గాంధీ అంటే నిరాహార దీక్ష , సత్యం, అహింస ..అని,

నెహ్రు అంటే, శాంతి కాముకుడు, అలీన దేశాల కూటమి అని,

లాల్ బహదూర్ శాస్త్రి అంటే..జై కిసాన్,జై జవాన్..అని...ఇప్పుడు  మర్చి పోయేరు కాని,
ఇందిరా గాంధి అంటే ఐరన్ లేడి ,అని,

ఇలాగ ఎన్నో ఉదాహరణలు.

కాని, ఒక్క పదిహేను రోజుల్లో కూడా బ్రాండ్ తాయారు అవుతుందని, అది ఎంతో పవర్ ఫుల్ గా..అని ఊహించలేదు ఎవ్వరూ..

అదే,అన్న హజారే బ్రాండ్.. లక్షల మందిని, లంచాలు, ప్రభుత్వ అలసత్వం, చూసి, విసిగి పోయిన, పెద్దలు, పిల్లలు, మధ్య తరగతి, పై తరగతి, కింద తరగతి, చదువు కున్న వారు, చదువు కోలేని వారు, చదువు రాని వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వారూ, వీరూ, అని లేదు, అందరిని, భారతీయులన్దిరిని , కదిలించింది, ..మన దేశం లోనే కాదు, విదేశాల్లో ఉన్న మన దేశస్తులు, కూడా ఇందులో భాగం అయిపోయారు.
అన్నా హజారే ..టోపీలు, అన్నా హజారే బాండ్స్,అన్నా మాటలు, నినాదాలు, అన్ని ఒక బ్రాండ్ ..పవర్ఫుల్ బ్రాండ్ ఏర్పడింది.

ఈ బ్రాండ్ ,ప్రజలు తాయారు చేసిన బ్రాండ్.. చిర కాలం నిలిచే బ్రాండ్ అవుతుందని ఆశిస్తూ..



19 సెప్టెం, 2011

జనావాసం లో ద్వీపాలు.

 వినూత్న అలసటతో నిట్టూర్చింది . ఒకటా రెండా ఆరేడు నెలల నుంచి ఈ ఫ్లాట్ ని అలంకరించడానికి ఎంత శ్రమ పడింది? పాలు ఒలికినట్టు కనిపించే తెల్లని పాలరాయి నేల , మచ్చ లేని తెల్లని పాల రాయి కోసం ఊరంతా తిరిగి, ఎక్కడా నచ్చక , చివరికి, రాజస్థాన్ నించి తెప్పించింది , స్వయంగా మాట్లాడి వారితో. అలాగే, వంటింట్లో నల్లని గ్రనైట్ వేయించింది. కిటికీలకి గాజు తలుపులు, అన్నీ సూపర్ క్వాలిటీ. లక్షలు, లక్షలు ఖర్చు అయాయి. కానీ  చివరకి ఇల్లంతా చూసుకుంటే ఎంత అందంగా ఉందొ? అని మురిసిపోయింది . 

కిచెన్లో లేటెస్ట్ అల్మారా లు, నాలుగు పొయ్యిల స్టవ్. పెద్ద  బీరువా అంత ఫ్రిజ్, అంతా  తను  అనుకున్నట్టే ..భాస్కర్ ,పిల్లలు సంతోషించేరు.  కానీ " ఇంత శ్రమ ఎందుకు ? ఇంత చక్కని ఇల్లు ఇలాగే మెరుస్తూ ఉంటుందా ఎల్లకాలం ?  దీనినిలాగే మెరిపిస్తూ ఉంచాలంటే , నువ్వు ఎంత కష్ట పడాలో? ఎందుకు నీ  శ్రమ ,కాలం ఇలా ఇంటి మీద పెడతావు? ఇంకేదైనా ఉపయోగపడే పని చేసుకో, నీకు ఇష్టమైన కథలు రాసుకో, పుస్తకాలు చదువుకోవచ్చు కదా  " అన్నాడు భాస్కర్.

" అన్నీ చేస్తాను, కాని ఇది నా కల, నా డ్రీమ్ ,భాస్కర్ నీకు తెలుసుగా "  అంటే ఏం చెప్పలేక పోయాడు.
వెతికి వెతికి మంచి బిల్డర్ని చూసుకుని ,   విడివిడిగా ఇళ్లు  ఉండే   గేటెడ్ ఆవరణలో ఇల్లు ఎంచుకున్నారు. చుట్టూ ప్రహరి గోడ, ఎవరి ఇల్లు వారిదే, ఫ్లాట్స్ లాగ కాదు, ఇంటి చుట్టూ తోట, సాయంత్రం నడవడానికి చక్కని పార్క్, మధ్యలో ఆకు పచ్చని లాన్స్    ఎంత బాగుందో?

నెల, నెల కట్ట వలసిన ఈ ఏం ఐ ,యాభై వేలు, అయితేనేం, మెల్లగా తీరుస్తాం. ఇంత మంచి డ్రీం హౌస్ ఫ్రీ గా రాదు కదా..వినూత్నకి సంతోషం కట్టలు తెగి పొంగింది ..గృహ ప్రవేశం నాడు, అందరు మెచ్చుకుని, ఎంత బాగుంది వినూత్న మీ ఇల్లు ..నీ పేరు లాగే, మీ ఇల్లు కూడా నూతనం గా ,వినుత్నం గా ఉంది, నీదే క్రెడిట్ అంతా..అంటుంటే ద్రిష్టి తగులు తుందేమో, అని నమ్మకాలు లేక పోయినా ,ఏదో భయంగా కూడా అనిపించింది.
మెల్లగా కొత్త ఇంట్లో కొత్త వాతావరణంలో అందరూ అలవాటు పడుతున్నారు.

ఉదయం నుంచి, ఇల్లంతా దులిపి, తుడిచి, వంట చేసి అలసి పోయింది. సాయంత్రం నాలుగు అయింది. ఇంకా బబ్లూ, పింకి రాలేదేమిటి స్కూల్ నుంచి అని కంగారుపడుతోంది వినూత్న .ఈ కొత్త ఇల్లు , స్కూల్ కి చాల దూరం అయిపోయింది, బస్సులో వెళుతున్నారు . మునుపయితే, దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు.

ఇంతలో గేట్ దగ్గర నుంచి ఫోన్. ఫోన్ తీసింది , బబ్లూ " అమ్మా! కొత్త వాచ్ మాన్ అమ్మా, నువ్వు ఫోన్లొ చెపితే కాని, మమ్మల్ని లోపలి రానివ్వడుట..అబ్బ ఏమిటమ్మా బోర్ పాత ఇల్లే బాగుండేది " అంటూ విసుక్కున్నాడు . వాడి ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు మరి. చిన్నపిల్లలు ఇంతలో సర్దు కుంటారు ,ఫర్వా లేదు అని సర్ది చెప్పుకుంటూ.. వాచ్ మాన్.. మా పిల్లలే..వదులు లోపలి ..అని గట్టిగ చెప్పింది. " సరే అమ్మా.. సారీ అమ్మా, మా జాగ్రత్త లో మేం ఉండాలి కదా" అన్నాడు .

కొత్త ఉత్సాహం తగ్గి , వారం అయేసరికి, పని మనిషి లేకపోతే కష్టం అనిపించింది, ఇంటెడు పని చేయడం. వాచ్ మాన్కి చెపితే లక్ష్మిని తీసుకువచ్చాడు. నెమ్మదిగా బాగానే ఉంది. హమ్మయ్య..

ఇదిగో మరి, ఈ పనులు అన్ని చేయాలి, గిన్నెలు తోమడం, ఇల్లు తడి గుడ్డ తో వత్తడం, దానికి ముందు ఇల్లు డస్టింగ్ చేయాలి, అంటే, ఈ సోఫాలు ,అలమారాలు, అన్ని పొడి గుడ్డ తో తుడవాలి, బట్టలు మషిన్  నించి తీసి అరేయాలి , మొక్కలుకి నీళ్ళు పోయాలి..జీతం..ఎనిమిది వందలు..కుదరదు అమ్మా..అమ్మో, వెయ్యే..సరే, మరి నాగాలు పెట్టకు..అని అపురూపమైన తన ఇంటిని ,ఈమె  చేతిలో పెడుతున్నాను. అని గిల గిల లాడిపోయింది వినూత్న . నాకైతే నా ఇల్లు అని నాకు ప్రాణం, ఈమె  ఒక ఇంటి పని కని పెట్టి ,దగ్గరుండి చేయుంచుకోవాలి.
అని మనసులో అనుకుంది.

లక్ష్మి పనిమంతురాలే, చక్కగా ఇబ్బంది పెట్టకుండా పని చేస్తోంది. ఫర్వాలేదు.
రోజూ సాయంత్రం, పిల్లలిని ఆడు కోమని పంపించి, తను కూడా వాకింగ్ చేస్తోంది. ఈ ఇళ్ళ చుట్టూ ,ఒక్కసారి నడిస్తే చాలు, అరమైలు నడిచినట్టు లెక్క అనుకుంటూ.

ఇళ్ళకి వెనక ఓ  గేట్ ఉంది, అది ఎప్పుడూ మూసే ఉంటుంది. ఎవరైనా అటు వేపు నుంచి వస్తే, ఒక గంట  ఉంటుంది, అది కొడితే వాచ్ మాన్ వచ్చి తలుపు తీస్తాడు. అటు నించి వెళితే ,చిన్న బజారు వస్తుంది, కూరలు అవి దొరుకు తాయి. అక్కడ, ఫ్రెష్ గా..వారానికి ఒక్కసారి వెళ్లి కొనుక్కుని వస్తూంతుంది 

ఈ రోజూ అటు వెళుతూంటే, ఓ నాలుగు పాకలు కనిపించాయి. అవి ఎంత దారుణం గా ఉన్నాయి అంటే, మధ్యలో ఒక మురుగు గుంట, చుట్టూ నాలుగు పోలితీన్ షీట్స్ కప్పిన అట్ట పెట్టె లాంటి గోడలు, సగం బట్టలు తో ,ముక్కు తుడుచు కుంటూ చంటి పిల్లలు..

అబ్బ,ఇదేంటి ,మా స్వర్గం లాంటి ఇళ్ళ పక్కన ఈ నరకం..చ..ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి తప్పవు కాబోలు, బాబోయ్ ,ఇలాగే వదిలేస్తే ,కాన్సెర్ లాగ పెరిగి, ఒక పెద్ద స్లమ్ తయారు అవుతుంది , ఊరుకుంటే లాభం లేదు అని కంగారు పడింది వినూత్న .

తరువాత నెల రోజులు వినూత్న చేయని ప్రయత్నం లేదు. రోటరీలో తెలిసిన పెద్దల ద్వారా, మున్సిపాలిటీకి అర్జీ పెట్టించి, ఈ స్లమ్స్ఇక్కడ నుంచి తీసేయాలి ,కావాలంటే వేరే చోట ,చిన్న ఇల్లు ఇవ్వండి..అంతే గాని, ఎన్నో లక్షలు వెచ్చించి కట్టుకున్న ఈ స్వర్గం లాంటి మా ఇళ్ళ ముందు ,ఇలా దిష్టి పిడతల్లగా ఈ పాకలు, ఇవి ముదిరి ,మా ఇళ్ళ విలువ పడిపోకముందే, తీయించండి అని గొడవ చేసి, మొత్తానికి అక్కడ నుంచి తీయించారు..మున్సిపాలిటీ.

అమ్మయ్య , ఒక మంచి పని చేసాను అని సంతృప్తి పడింది.

మర్నాడు ఉదయం పది అయింది ఇంకా రాలేదు లక్ష్మి. ఇదేమిటి? రోజూ ఎనిమిది కల్లా వచ్చేదే, పదకొండు అయింది ఇంకా రాలేదు , నాగాలు పెట్టడం మొదలు అయింది , లోకువ అయిపోయాను, ఈ లక్ష్మికి అని కంగారు పడుతూ ఇంటర్ కమ్ ఫోన్లో, లక్ష్మిని తీసుకువచ్చిన వాచ్మాన్ కి ఫోన్ చేసింది, వినూత్న .

ఏమైంది లక్ష్మి ఇంకా రాలేదు, ఈ వేళ?

అమ్మా ! వెనక గేట్ దగ్గర వాళ్ళు వేసుకున్న పాకలు, కూల్చేశారు కదా అమ్మా , పిల్లలతో ,ఊరు బయట ఎక్కడో ఇల్లు ఇస్తారంట, అక్కడ ఎలా ఉంటుంది? ఉన్న సామాన్లు పట్టుకుని, ఇంకో కాలని  వెతుక్కుంటూ వెళ్లి పోయిందండి అమ్మా ! వాళ్ళ ఊర్లో కూడా పొలం పనులు లేక ఇలా వచ్చిండమ్మా ,మా ఊరే , మొగుడు లేడు ,ఇంటి పనులు చేసుకుని ,ఇద్దరు పిల్లల్ని పోషిస్తోంది. ఇల్లు దూరం అయింది కదా అమ్మా ఇప్పుడు మరి వస్తుందో లేదో??

హుహ్ నిట్టూర్చింది వినూత్న  నా స్వర్గం లాంటి ఇల్లు తుడిచి, అద్దంలాగా మెరిపించే లక్ష్మి కి నరకం లాంటి ఇల్లు కూడా లేకుండా చేసేనా? భాస్కర్ ఏమంటాడో? ఏమిటి నేను ఇలా తయారు అయ్యాను, ఇంత స్వార్ధం గా..

నా ఇల్లు ఒక్కటే స్వర్గం , అదే మా కాలోనీ పేరు , అయితే చాలా??

నా చుట్టూ ఉన్న నరకం నుంచి ఎంత దూరం పారి పోగలను..

హుహ్,ఇంకో పని మనిషి దొరికే వరకు, నేనే చీపురు పట్టుకోవాలి , తప్పదు, పద పద వినుత్నా , 
అబ్బ ఈ దేశం ఎప్పుడు బాగు పడుతుందో? ఏమో? అంటూ నిట్టూర్చింది , వినూత్న.


18 సెప్టెం, 2011

ఐదో నెంబర్ ఫ్లాట్

సునీత ఆటో దిగి  ఆటో వాడికి డబ్బులిచ్చి, సంచులు మోసుకుంటూ పైకి వెళుతోంది. రెండో అంతస్తు లో ఉంది ఆమె ఫ్లాట్. సంచులు ఒకటో అంతస్తుకి చేరేసరికే బరువు అయిపోయాయి. కూరలు, కరాచివాలాలో పిల్లలికి కావాల్సిన తినుబండారాలు, ఇంకా ఏవో డబ్బాలు, పాకెట్స్, ఒక నెల రోజులకి సరిపడా..కాని ఏదో ఒకటి మర్చిపోవడం, మళ్లీ, మళ్లీ, వెళ్ళడం ఆమెకు  అలవాటే.

అమ్మాయ్ ..షాపింగ్ చేసి వస్తున్నావా? పిల్లలికేనా?? ఇంకా ఏం కొన్నావు? బాబోయ్ ..ఈవిడని తప్పించుకోవడం చాల కష్టం  ఎప్పుడు కనిపించినా ఇలాగే అడుగుతుంది. పల్లెటూరు బుద్ధులు.."ఆ..ఎప్పుడూ ఉండేవే ..కొత్తగా ఏం లేవండి. " ,ఆవిడ రా అమ్మా అని పిలుస్తుంది.

కాని, సునీత  ఎప్పటికప్పుడు ఆవిడకీ  నాకూ కామన్గా కబుర్లు ఏముంటాయి..తరువాత వస్తాను అండీ అని  తప్పించుకుంటుంది.మనసులో అయ్యో పాపం అనిపించినా.. వయసులో వ్యత్యాసం, ఏదో పల్లెటూరు చాదస్తం అని కొంత విసుగు . 

చేతిలో సంచులు బరువు అనిపించినా ఎక్కడా ఆగకుండా తన  ఫ్లాట్ లోకి వెళ్లి, అమ్మయ్య అని నిట్టూర్చి ,కూరలు తీసి ప్లాస్టిక్ సంచుల్లో సర్ది, సరుకులు అల్మారాలలో సర్ది, ఊపిరి పీల్చుకుంది సునీత . కాఫీ తాగుతూ, ఇంక పిల్లలు వచ్చేవరకు విశ్రాంతి , అని టీ వి ఆన్ చేసి వార్తలు వింటూ కూర్చుంది . 

ఇంతలో, కింద నించి, ఏవో ఏడుపులు వినిపించాయి, ఎవరైనా పిల్లలు దెబ్బలు తగిలించు కున్నారా? ఎవరి పిల్లలో అని ఆందోళనతో కిందికి దిగుతూండగా ఏడుపులు ఐదో నెంబర్ నుంచే బంగారమ్మ గారి ఫ్లాట్ నుంచి అని తెలిసింది . 

ఆయన,అంటే బంగారమ్మ గారి భర్త రాజు గారు, బంధువులతో కలిసి ఉత్తరదేశ యాత్ర  వెళ్లి పది రోజులు అవుతోంది.  " నా మందులు, గొడవలతో నేను రాలేను "  అని ఈవిడ ఇంట్లో ఉండిపోయారు అని  వాచ్ మాన్ చెప్పిన మాట గుర్తు వచ్చింది సునీత 
కి .  అప్పటికే  నలుగురైదుగురు చేరారు. సునీతకేమీ  అర్ధం  కాలేదు , ఎదురింటి పంకజం చెప్పింది, రాజు గారు, ఉత్తర కాశిలో గుండె పోటుతో మరణించారని. అయ్యో ! 

ఒక గంటలో కావాల్సిన వారందరూ వచ్చేసారు., " నాకు చివరి చూపు ప్రాప్తం లేదు "  అంటూ, అక్కడే అన్ని చేసేయమని బంగారమ్మగారు చెప్పడంతో అన్ని కార్యక్రమాలు అక్కడే చేసి వచ్చారు బంధువులు పదో రోజుకి.
ఈ పది రోజులు వచ్చేపోయేవారి హడావిడితో  ఐదో నంబర్ ఫ్లాట్ సందడిగా ఉండడం   పద మూడో రోజుకి అందరు వెళ్లి పోవడం గమనించిన సునీత  ఈవిడకిక ఒంటరితనమే అనుకుని బాధపడింది . 

బంగారమ్మగారు మటుకు తన ఇంట్లో నుంచి తను ఎక్కడికి కదలనని చేప్పేసారుట పిల్లలతో.
కొడుకులు, కూతుళ్ళు, ఎంత బ్రతిమాలినా ఆవిడ పంతం పట్టినట్టు ఒక్కటే మాట, "నేను నా ఇంట్లో ఉంటాను, రాజు గారి పెన్షను  వస్తుంది.నేను ఎవరి మీద ఆధార పడను " అని. ఈ వివరాలన్నీ  వాచ్ మానో ఎవరో ఒకరు  సునీత చెవిన వేస్తూ ఉండేవారు . 

నెల రోజులు ఇట్టె గడిచిపోయాయి , సునీత సంచులు మోసుకుని వస్తూ, ఐదో నెంబర్ ఫ్లాట్ బెల్ కొట్టింది , తనంతట తనే ఆశ్చర్యంగా .. 

తలుపులు తీసారు బంగారమ్మ .టీ. వి. పెట్టుకుని తెలుగు సినిమా చూస్తున్నారు. అంతకు  ముందు ఎప్పుడూ ఇంగ్లీష్ వార్తలు వినిపించేవి వాళ్ళింట్లో.

" ఎలా ఉన్నారండి? ఏమైనా కావాలి అంటే  చెప్పెండి, "  " ఎలాగు  వెళుతూ ఉంటాను కదా  " అంటూ సునీత మొదటిసారి మాటలు కలిపింది ,ఆత్మీయంగా . 

" మీకు ఒక్కరూ బోర్ కొట్టటం లేదా? ఎలా ఉన్నారు?  అంకుల్  లేకుండా "  ??అంటూ ఆగి పోయింది ,సందిగ్ధంగా . 

 " ఫర్వాలేదమ్మా నిజం చెప్పాలంటే, ఆయన ఏదో ఊరు వెళ్లినట్టుంది కానీ, ఆయన లేరు అని పించటం లేదు  నాకు . నాకు పద్నాలుగేళ్లకే పెళ్లి అయింది. ఆయనికి ఇరవై అయిదు..నాకేమో చిన్న పిల్ల సరదాలు, ఆయనకేమో ఉద్యోగం వ్యాపకాలు తప్ప ఏమి పట్టదు.
నాకు తెలుగు సినిమాలు, పాటలు ఎంత ఇష్టమో? ఆయనికి చికాకు, ఏముంది ఆ పాటలలో ..ఆ సినిమాలన్ని ఒక్కలాగే ఉంటాయి, హాయిగా ఇంగ్లీష్ సినిమాలు చూడు అనే వారు. కేబల్  కనక్షన్  కూడా లేదు, ఈయన ఉద్యోగ విరమణ తరువాత ఇంట్లోనే ఉండి నన్ను కాల్చుకు తిన్నారనుకో , "  అంటూ పైట కొంగుతో కళ్ళు ఒత్తుకున్నారామె . 
"ఆయనికిష్టమైన కూరలే వండాలి, పక్కింటికి వెళ్లి కబుర్లు చెప్పకూడదు, ఫోన్ బిల్ మూడు వందలు దాటకూడదు, ఇలాగ ఈయన పని చేసే కాలేజ్ లో కుర్రాళ్ళుని అదుపులోపెట్టినట్టే  నన్ను కూడా, అడక్కు అమ్మా ,నాకెంతో ఇష్టమైన కూరలు వండుకుని తిని ఎంతకాలం అయిందో? నాకు నిన్ను చూస్తే ముచ్చట గా ఉండేది , నీ కిష్టమైనవన్ని నువ్వలా కొనుక్కుని రావడం చూస్తూ ఉంటే " సునీత చున్నితో కంట తడి అద్దుకుంది. 

" ఇప్పుడు నాకు డబ్బులకు లోటు లేదు, కొడుకు దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వండి పెట్టింది నేను తినాలి, వాళ్ళ టైములు అవీ నాకు సరిపడవు. నాకు ఇప్పుడు ఏ లోటూ లేదు.
యాభై ఏళ్ళ తరువాత నా బ్రతుకు నేను బ్రతకడానికి నాకు స్వేచ్చ  వచ్చింది. ఇది వదులు కోలేను. పెద్ద పెద్ద మాటలు నాకు రావు గాని, నాకు స్వతంత్రం వచ్చింది. నా బతుకు నేను నా ఇష్టం తో హాయిగా బతుకు తాను." 
కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ లేచింది సునీత . 

ఆవిడ పల్లెటూరని ఏదో చిన్న చూపు కాని ఎంత పెద్ద మనసో !  ఎంత చక్కని మాట చెప్పారో.. ఒకరిని ఒకరు నొప్పించ కుండా, ఒప్పించు కుంటూ, పరస్పరం ప్రేమతో మెలగాలి , కాని అధికారంతో కాదు అని.
సంచులు మోసుకుంటూ, సునీత ఐదో నెంబర్ ఫ్లాట్ దగ్గర ఆగి పలకరిస్తుంది ,ఇప్పుడు . 




కార్పోరేట్ విష సంస్కృతి..

 ఇవాళే కూడలి లో ఈ విషయం విన్నాను. చిన్నారి గీత ప్రియ. ,ఎడబాటు తట్టుకోలేక, పాప తల్లి తండ్రులు, ఆదిలక్ష్మి-లెనిన్ గార్లు ఆత్మ హత్య ప్రయత్నం చేసారు అని,ఇది ,నిజం గా గుండెలు పిండేసే సత్యం.
లెనిన్ గారు పోయారని, ఆది లక్ష్మి గారు కోలుకుంటున్నారు అని.

ఒక స్కూల్ కూడా నడిపే వీరు,ఈ కార్పోరేట్ కాలేజ్ లో ఎందుకు జాయిన్ చేసారు మీ పాపని.? ఈ కాలేజ్ లు వల్ల జరిగే నష్టాలు ,మనం చూస్తూనే ఉన్నాం. వారికి చదువు కన్నా ముందు ఒక పోటి తత్త్వం మప్పుతారు. మొదటి నెల లోనే, పరీక్సలు పెట్టి, వందకి వంద మార్కులు వచ్చిన వారి నందరిని, ఒక సేక్షున్ లో వేస్తారు.ఇంక వారికే బాగా చెప్పే మాస్టర్లు,మిగిలిన వారిని పరీక్షలు పెట్టి, మార్కులు చూపించి, మీరు ఎందుకు పనికి రారు అని వారిలో ఆత్మ న్యూనత పెరిగేలా,ఆత్మ విశ్వాసం కోల్పోయేలా ,పదే పదే ,ఒకే విషయాన్ని చెపుతూ, ఎవరేజ్ గా చదివే పిల్లలిని బాగా చదివిస్తారనే కదా ,ఈ కాలేజ్ లలో ,వేలకి వేలు ఫీజు కట్టి జాయిన్ చేస్తారు.

వీల్లందిరిని విడిగా ఒక సేక్షున్ లో పడేసి, చదువు చెప్పడం మానేసి, పరీక్షలు తో చంపుతారు. అని తెలుసు,కాని, ఇలా నిజం  గా చంపేస్తారా ? నాకు కళ్ళ లలో నుంచి నీళ్ళు కారి పోతున్నాయి.
విద్య ని అందించ వలసిన ప్రభుత్వాలు ఇలా ,చదువు కొట్లు, అంగడి లు, ఖరీదు కు కొనే చదువు కొట్టాలు పెట్టడానికి అనుమతులు ఎందుకు ఇస్తారు? విద్య ప్రాధమిక హక్కు, అనేది కేవలం కాగితం మీద రాత లేన?

మధ్య తరగతి పిల్లలికి, చదువే ఆధారం..ఒక ఆధారం ఇచ్చే చదువు, ఒక ఇంజినీరింగ్ చదువే అన్నం పెడుతుందని, లక్షల్లో జీతాలు వస్తాయి అని, విదేశాల్లో ఉన్నత విద్య చదివి, ఇంకా బాగా పైకి రాగలం అని నమ్మి, ఎన్నో ఆశలతో ,ఈ కార్పోరేట్ కాలేజ్ లో జాయిన్ అవుతారు.

వారిని అనలేం,పిల్లలు బాగా  పైకి రావాలని ,వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు.
ఈ కార్పోరేట్ దగా నించి విముక్తి లేదా? ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లు ఎందుకు సరి పదా లేవు? ఎందుకు ,మంచి మాస్టర్లు ని వేసు కోరు? విద్య లోనే ఇంత అవినీతి.

చీడ పట్టేసింది, ఈ విద్య వృక్షం కి, ఈ విష ఫలాలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం,

బలవంత మరణాలు, తల్లి తండ్రులకి పుత్ర శోకం మిగల్చడం, లేదా,  బుర్రలు వేడి ఎక్కే బలవంతపు చదువు ల నుండి విరామం కోసం, బైకుల మీద ,అతి వేగం తో నడిపి, ప్రాణాలు కోల్పోడం, లేదా కాళ్లు చేతులు విరగూట్టుకోవడం, లేదా పనికి మాలిన నెట్ విషాని ,తలకి ఎక్కించుకుని, అమ్మాయిలను ఏడిపించడం లాంటి రాక్షస ప్రవ్రుత్తి తో, ఒక పనికి మాలిన జాతి ని తయారు చేసే వికృత కోర్ప్రేట్ సంస్థలు కి ఎవరు చరమ గీతం..పాడుతారో?

ఎవరి బాధ్యతో?? ప్రభుత్వం.. ఒక నిద్ర పోతున్న ఎద్దు..దానిని ఎవరు అంకుశం తో పోడుస్తారో?

ఎవరికీ వారు, ఇలా చేతులు ముడుచు కుని, దేవుడా? అని ఇలా ప్రాణాలు పోతున్న గీత ప్రియ లను, వారి అమ్మ నాన్న లని చూస్తూ , చేతులు ముడుచుకుని, కళ్ళు మూసుకుని, మనం ఇలా సిగ్గు లేకుండా గడపాల్సిందే..

యథా రాజా తదా ప్రజా..

లెనిన్, గీత ప్రియ ఆత్మ లకి శాంతి కలగాలని,

చదువు  ఒక నరకం కాదు, అని వెలుగు నిచ్చే చదువు ఒకటి ఉన్నదని ,ఆ లోకం లోనైనా తెలుస్తుందని, భార మైన మనసు తో, ఈ టపా ఆమె కి అంకితం.

15 సెప్టెం, 2011

ఇది కూడా ఒక ....దీనికి పేరు ఉంది ట.

నేను ఎప్పుడో ఒక్కసారి చూస్తే చాలు గుర్తు పెట్టుకుని, మళ్లీ ఆ ఇంటికి, రెండో సారి ,చక చక బండి నడుపుకుంటూ వెళ్లి పోగలను, నేనే నడపాలి స్కూటర్ అయిన కార్ అయినా.అంటే ఏవో కొండ గుర్తులు పెట్టుకుంటాను, ఇదిగో ఇక్కడ ఓ కొట్టుంది,ఇక్కడ ఓ ఇస్త్రి బండి ఉంది, ఈ మూల ఈ గుడి ఉంది..ఇలా అన్న మాట. అదిగో పక్క నుంచి ఏవో అభ్యంతర కేకలు వినబడుతున్నాయి. మొన్న యేర్పాల్ లో మా మావయ్య కొడుకు ఇంటికి ఇలాగే అన్నావు, అర గంట తిరిగాం అక్కడికి అక్కడే, సరే నేనేం చెయ్యను, అది ఒక కొత్తగా వస్తున్నా కాలనీ, అన్ని కొండ గుర్తులు మారి పోయాయి మరి.

అదే ఎవరో నడుపుతూంటే పక్కన కూర్చుని, గుర్తులు చెప్పమంటే, అంటే..నా పక్కన కూర్చునేది తరచుగా ఒక్కరే, పద, పద, ఇదే రోడ్ ,చక్కగా వచ్చాం ఇక్కడి వరకు,ఇంక ఒక సందు లోకి తిరగాలి, ఇటు తిరుగు, ఇటు, ఇటు, అంటూ ఉండగానే,అటు తిప్పేసాడు...అయ్యో అయ్యయ్యో, ఇటు కాదు అటు, అన్నానా?అని కెవ్వు కెవ్వు అని కేకలు.
నేను రోడ్ చూస్తూ నడుపుతున్ననా కార్, నువ్వు ఇటు అంటే నాకేం తెలుస్తుంది,లెఫ్ట్, రైట్ ,చెప్పవచ్చు కదా..అదిగో మరి అక్కడే వస్తుంది తంటా..నాకు లెఫ్ట్ అంటే వాచ్ పెట్టుకునే చెయ్యి,ఇంకోటి కుడి.అది కూడా పూర్తిగా నా కళ్ళ ముందు పెట్టుకుని చెయ్యి,వాచ్ చూసుకుని, లెఫ్ట్ అని ధ్రువీకరించుకుని ..హు ..అప్పుడే చెప్పగలను లెఫ్ట్ ..లెఫ్ట్ అని,ఇదంతా కనీసం క్షణం లో వెయ్యో వంతులో జరగ దానికి నేనేమి ,యండమూరి నవల లో హీరో ని కాదు కదా..అందుకే నేను, ఒక సంకేత భాష కని పెట్టేసా...నాకు దగ్గరగా ,నా వేపు ఉండే మలుపు, "ఇటు" ,మరో వేపు ఉన్న మలుపే, "అటు."..

ఇంత చిన్న విషయం అర్ధం చేసుకోరూ, ఈ మగవాళ్ళు. అన్నిటికి ఒకటే నస..

కాని, నేను ఎప్పుడు మర్చి పోను.,ఒకసారి చూసిన ఇల్లు...మరి..సరిగ్గా ఫాలో అవాలి ,నా సంకేతాల భాష,
ఇంక హైదరాబాద్ లో, మనకి కావాల్సిన వారు ,ఒకరు, విజయవాడ కి కూసింత దూరం లో ఉంటే, ఇంకొకరు, బెంగుళూరు కో,ముంబై కో వెల్ల వలసిన దారి లో ఎక్కడో ఉంటారు. సరే ,మరి ఉన్న నాలుగు రోజుల్లో అందరిని చూసి, పలకరించి రావాలి కదా, ఈ కాల్ టాక్సీ లు వచ్చాక ,భలే సులువు అయింది.
సరే,  అంబర్ పేట్ నుంచి అత్తా పూర్ వెళ్ళాలి. టాక్సీ కి ఫోన్ చేస్తాను.
అంబర్పేట్ నుంచి ..భయ్యా..ఇదొకటి నేర్చుకున్నాను...సరే, ఎక్కడ, అదే, పెట్రోల్ బంక్ పక్కనే, అపార్ట్ మెంట్స్..సరే, లేఫ్ట?  రైట్ ఆ ..ఏమిటి లెఫ్ట్? అదే రోడ్ కి,

ఊ, శ్రీ రమణ దగ్గర తిరిగేయాలి..నేను..అదే లెఫ్ట్ ఆ? రైట్ కా?

హు..హు..పెట్రోల్ బంక్ అని చెప్పాను కదా..

నువ్వు ఎటు నించి వస్తావు భయ్యా??

ఎలాగో ఒకలాగా టాపిక్ మార్చేయాలి, పోలిస్ లైన్స్ ఉన్నాయా? అక్కడే

అదే. లెఫ్ట్ ఆ.. రైట్ కా??

అబ్బ..బ్రహ్మానందం కామెడి లాగుందే..అన్నిటికి ఒక్కటే ప్రశ్నే అడుగుతాడేమిటి??ఈ భయ్యా..ఇలా లాభం లేదని, తమిళనాడు లో మనం ఎలా చదువు రాని వాళ్ళ లాగ, పక్కనే ఉన్న తంబి ని ఈ బస్సు ఎక్కడికి వెళుతుంది?అని అడుగుతామో ----అన్ని తమిళం లో రాసి ఉంటాయి మరి----పక్కనే ఉన్న వారికి ఫోన్ ఇచ్చేసి,నువ్వే చెప్పు అని, భయ్యా కి ఇంకా నా అటు-ఇటు సంకేతాల భాష రాదు కదా.

ఇంక అత్తాపూర్ వెళ్ళాలి, ఎలా రావాలే అంటే, 143 పిల్లర్ దగ్గర తిరిగి,అక్కడినుంచి, లోపలి వచ్చి,రైట్ కి తిరగాలి,అలా కాదే,అక్కడ ఉన్న షాప్స్ చెప్పు, కొండ గుర్తులు చెప్పు, ఊ ,అయితే, నారాయణ కాలేజ్ దగ్గర ప్లేసేంట్ పార్క్ బోర్డ్ ఉంటుంది, లోపలి వస్తే, ఒక పార్క్ ఉంటుంది, ఇలా చెపితే ఏముంది, నేల మీద కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు ,మీ ఇంటికి ఓ గంటలో వచ్చేస్తాను.

సరే, నిశ్చింతగా కూర్చున్నాను టాక్సీ లో, అదిగో లోపలి వచ్చేసాం, భయ్యా..ఎటు వెళ్ళాలి మాడం?  అటు కాదు ఇటు,అని నాలుక కరచుకుని, లెఫ్ట్ ,రైట్ చెప్పాల్సిందే అనుకుంటూ, చెయ్యి చూసుకున్నాను...రెండు చేతులకి గాజులు. ఎంతో ఇష్ట పడి కొనుక్కున్నాను కదా అని రెండు చేతులకి తలో అర డజాను మాచింగ్ గాజులు ఎక్కించాను..ఇంక చెప్పాల్సింది, ఏముంది, అన్నం తినే  ఏక్షన్ రిప్లే చేసుకుని, చేతికి .అది రైట్ ,మరోటి .లెఫ్ట్..అని ధ్రువీకరించి, లెఫ్ట్ తిరుగు అని చెప్ప దానికి, సెకన్లలో, వెయ్యో వంతు కాదు, వెయ్యి సెకన్లు అయినట్టుంది.సరిగ్గా గంటన్నర కి చేరాం.. మరి.

ఇంకొకటి గమనించాను,నేను, ఈ ఆటో భయ్యాలు, ఎటు పక్క ,తిరుగుతారో, ఆ  దేముడు కే తెలియాలి,సడన్ గా "అటు" తిప్పేస్తారు..సీదా గా వెలుతున్నవాళ్ళు. ఏమిటి? సిగ్నల్ చూపించవా? అని వెనక నుంచి ఎవరో అరుస్తాడు.ఆటో భయ్యా ఒక చిన్న చిటికెన వేలు, బయట పెట్టాడు. అంటే ....అటు తిరుగు తున్నానే కదా అర్ధం. వీళ్ళ సంకేతాల భాష ఇది అన్న మాట.

ఇంతకీ..ఇదంతా ,నా ఒక్కర్దానికేనేమో అనుకునే దాన్ని.

ఈ మధ్య హిందూ పేపర్ లో చదివాను. ఈ  అవస్థ కు directionally challenged అని ఒక పేరు కూడా ఉందిట.

అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాల మంది ఉన్నారన్నమాట.

పోనీలే చిన్న గా తీరిపోయింది, అసలు పెద్ద మెదడు షేమమే లెండి.

నా లాంటి వారు ,ఇంకా ఎవరైనా ఉంటే, వారందిరికి అంకితం..అటు-ఇటు అనే భాష తెల్సిన వాళ్ళందరం ఏకం అవుదాం..ఇటు రండి..ఇటు..ఇటు..అటు కాదు.




14 సెప్టెం, 2011

రిమోట్ మీ చేతిలోకి తీసుకోండి...

అన్నాచెల్లెళ్ళు,పెళ్లి పందిరి, కన్య దానం, చంద్ర ముఖి, ఈ పేరులు వింటే మనకి ఏవో పాత సినిమా పేర్లు గుర్తు వస్తాయి. ఈ పేరుల మీద ఇప్పుడు వస్తున్న టీ వి సీరియల్ సు చూస్తే..మనం ఎక్కడికి వెళుతున్నాం? ముందుకా? ఇంకో యుగం వెనక్కా అని అనుమానం వస్తుంది.
చిన్న పిల్లలికి పెళ్లి చేయడం, ఆ సమస్యలు, ఇప్పుడు    అవి అవసరమా? మనకి. ఎప్పుడో వందేళ్ళ క్రితమే, వీరేశలింగం గారి  దయ వల్ల, ఆడపిల్లలు కి ఇప్పుడు, కనీసం ఇరవై ఏళ్ళ వరకు చదువులు చెప్పిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ,వెనక్కి వెళ్లి  చిన్నారి పెళ్లి కూతురు అని, కడవల కొద్ది, ఏడుపులు కన్నీళ్లు, ఇవి సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని ఆలోచించరా? ఎప్పుడో, నాలుగు వందల ఎపిసోడెస్ తరువాత ,ఎవరో మారుతారు, ఈ లోపల ,జరగవలసిన హాని జరగదా??

ఈ సీరియల్స్ లో విలన్లు అన్నిట్లో ఆడవారే..ఇంతింత బొట్టులు పెట్టుకుని, చూడ డానికే,భయంకరం గా ఉంటారు. స్త్రీలని కించ పరిచేలా ఉన్నాయి. ఈ పాత్రలు. వారికి ఇంకేమి పని లేనట్లు, ఎప్పుడూ ఏవో కుట్రలు ,కుతంత్రాలు రచిస్తూ ఉంటారు. నిజ జీవితం లో,ఎవరైనా మనకి ఇలా కనిపించారా? ఎక్కడైనా?
ప్రతి మనిషి లోనూ, మంచి- చెడు, పడుగు పేకల్లగా కలిపి ఉంటాయి. అందరి లో నూ ఏవో బలహీనతలు ఉంటాయి.ఈ రోజుల్లో స్త్రీలు, ఇంట, బయట,భర్త కి చేదోడు వాదోడుగా ,సహకరిస్తూ, పిల్లల చదువులు, వారి పెంపకం, అప్పుడప్పుడు వచ్చే చుట్టాలు, స్నేహితులు, చేతికి వచ్చే జీతాలకి, నెలకి అయ్యే ఖర్చులు కి సమన్వయము చేస్తూ, అనారోగ్య సమస్యలు వస్తే, వాటికి సమయం వెచ్చిస్తూ, కుటుంబం లో ఎవరికీ బాగో లేక పోయినా, తల్ల డిల్లి పోయి, డాక్టర్ ల చుట్టూ తిరుగుతూ, సవ్య సాచి లాగ, కుటుంబానికి ఒక ముఖ్య కేంద్రం గా, అంతా తానై, నడిపిస్తున్నారు.

అలాంటి స్త్రీలని కించ పరిచేలా ,ఉంటునాయి ..ఈ పాత్రలు. ఎంత సేపు, ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళను ,కుట్రలు  కుతంత్రాలు తో ,రాచి రంపాన పెట్టడం, ఇంట్లో నే ఇన్నేసి నగలు దింపేసుకుని, ఫుల్ మేకప్ తో, పట్టు చీరలు తో, రాత్రి కూడా అదే వేషం, ఒక అర్ధం, ఒక పరమార్ధం లేని ఈ సీరియల్స్ ని ఎలా ,ఎందుకు చూస్తున్నారో, నాకైతే అర్ధం కావటం లేదు.

చిన్నప్పుడు, అదే, కాలేజే లో అందరికి స్నేహాలు ఉంటాయి. ప్రేమలు, పెళ్లి వరకు అనుకోవడాలు ఉంటాయి.కాని, అనుకున్నవన్నీ జరగవు కదా, ఏ పదేళ్ళ తరువాతో కలుసుకుంటారు, ఇదిగో మా ఆయన, నా పిల్లలు, మీ ఆవిడా ఏది? అని పరిచయాలు చేసుకుంటారు. సరదా గా కాసేపు మాట్లాడుకుంటారు. ఇవన్ని ఎ ఎక్ష్హిబిశున్ లోనో జరుగుతాయి..మర్నాడే పిల్లాడి పరీక్ష సంగతి గుర్తు వస్తుంది..తరువాత కలుసుకుందాం, అని ఫోన్ నమ్బెర్లు పుచ్చుకుని, ఎవరి దారిన వారు చక్కా పోతారు.

ఇదే టీ వి సీరియల్ లో అయితే లాగి, లాగి, చాంతాడంత, ఏళ్ళు, ఏళ్ళు, నడిపిస్తారు, ఇంకా వివాహేతర సంబంధాలు, కుట్రలు, హత్యలు వరకు వెళ్ళిపోతుంది...నిజ జీవితం లో ఎప్పటికి ఇలా జరగవు అని నా నమ్మకం.

సమాజం లో చాల మంచే ఉంది. కొద్దిగా చెడు కూడా ఉంటుంది, కాని, దానినే పట్టుకుని, పెద్దది, చేసి, చూపిస్తోంటే, ఇదే నిజామా? మన లాగ మంచి వారికి చోటే లేదా ? అని అనుమానం తో అసహనం పెరిగి  పోతుంది.

ఉడాన్,హమ్ లాగ్, బునియాద్, అమ్ముమ్మ  . కం లాంటి మంచి సీరియల్స్ చూసి ఎంత హాయిగా ఆనందించాం,ఒకప్పుడు. ఎన్ని కథలు లేవు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కథలు ఒక స్క్రీన్ ప్లే అవసరం లేని దృశ్య కావ్యాలు.అమరావతి కథలు, టీ వి లో వచ్చాయి.,మళ్లీ ,మళ్లీ చూడాలని పిస్తుంది.

చలం , కొడవటిగంటి, బినా దేవి, మాలతీ చందూర్ లాంటి, మహా మహులు ఎందఱో రాసిన కథలు, నవలలు ఉన్నాయి. జనం చూస్తున్నారు, అంటే, ఎప్పుడు, చెడే ఆకర్షనీయం గా ఉంటుంది.
మన ప్రభుత్వమే, సారా తాగండి అంటూ సబ్సిడీలు ఇచ్చి  మరి తాగిస్తున్నారు.మరి ఇంక మీడియా ,ఒక వ్యాపార సంస్థ అయిపొయింది.ప్రజల, మంచి, క్షేమం, వాటికి అక్కర లేదు.

పోటీ తత్త్వం పెరిగి, ఒకరిని మించి మరి ఒకరు, కనీ విని ఎరుగని కథలని కల్పించి, వీక్షకుల తెలివి ని అపహాస్యం చేస్తున్నారు.ఇంక ..
ఈ రియాలిటీ షో ల గురించి ఎంత తక్కువ చెపితే అంతా మేలు.

సభ్య సమాజం ని ,తల కిందలు చేసి, పిల్లలని, టీ వి తెర పైకి లాగి, ఒక హద్దు- పద్దు లేని దృశ్య సమాహారాన్ని, మన కళ్ళ ముందే ఆవిష్కరిస్తూ ఉంటె,మనం శాబాష్ అని చప్పట్లు కొడుతున్నాం.ఇంత కంటే ఎం రాసినా , నేను నా పరిమితులు దాటినట్టు అవుతుంది.

ఇంక అర్ధ రాత్రి వచ్చే మాంత్రికుల, నాగ దేవత మహిమలు అంటూ వచ్చే ఈ సీరియల్స్ ప్రజల లో ఎన్ని మూఢ నమ్మకాలు ,పెంచి పోషిస్తున్నాయో, ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇప్పటికి, పల్లెటూర్ల లో, సరి అయిన ఆరోగ్య వసతులు లేక ,అనారోగ్యం చేస్తే, పూజలు, పూనకాలు, మందు పెట్టడాలు అంటూ, చిల్లర మోస గాళ్ళకి బలి అవుతున్నారు. ఈ మధ్యే ,అనుమానం తో కొట్టి చంపేసిన వార్తలు వింటున్నాం.
ఇవే వార్తలని మళ్లీ, అర్ధ రాత్రి, నేరాలు, ఘోరాలు అని చూపిస్తారు. మూఢ నమ్మకాలు,ఒక చెడు గాలి లాగా వ్యాపిస్తున్నాయి. టీ వి. ఒక పవర్ ఫుల్ మీడియా.

చూస్తున్నారు కాబట్టి, చూపిస్తున్నాం, అంటూ, నెపాలు వెతుక్కోవడం కాదు.
స్త్రీలు..మీరు .ఈ సీరియల్ కి బానిసలు కాకండి.మాకు ఇలాంటి విష సంస్కృతీ వద్దు అని చెప్పండి.

అందం,హుందాతనం,దయ,నేర్పరితనం,చదువు-సంస్కారం,స్నేహం, ప్రేమ , అన్నిటి చక్కని మిశ్రమం ..స్త్రీ.
కుళ్ళు,కుట్ర,కుతంత్రం,ఈర్ష్య, ద్వేషం, కఠినం, కుసంస్కారం...ఇవి మేం కాదు..అని
నిరూపించేలా మంచి కథ ,మంచి విలువలు ఉన్న సీరియల్స్ నే తీయమని చెప్పండి.
ఇంక ఏ వి చూపించినా, రిమోట్ మీ చేతిలోకి తీసుకోండి...

సమస్త ప్రపంచం కి చిన్న బిందువు అయిన మీ కుటుంబం కి కేంద్రం మీరే. మీ చేతిలోనే రిమోట్ ఉందని ఇంక నిరూపించండి మరి.

కొస మెరుపు.
యాద్రుచికం గా ఇప్పుడే,కూడలి లో ఒక పోస్ట్ చదివాను.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో పాత్రలు  ,పరిచయం చేస్తూ, ఆమె రాసిన దానిని బట్టి, పేరు లో ఉన్న ట్టు మరి అంత మూర్ఖం గా లేదని ,బాగుందని ,రాసారు.

అది ఒక్కటి ,మినహాయింపు. చాల సీరియల్స్ చాల దారుణం గా ఉంటున్నయనే నా నమ్మకం.

13 సెప్టెం, 2011

పొగ

తూరుపు ఇంకా తెల్లవారలేదు, తొలి సూర్య కిరణం ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నది,   ఈ ఊరు ,ఈ భూమి  తాక డానికి, ఊరు అంత గాఢ నిదుర లో ఉన్న వేళ, నరసయ్య , అతని భార్య రమణమ్మ లేచి, ఉదయం టిఫిన్ కి తయారీ మొదలు పెట్టేరు. రమణమ్మ రోటి లో పిండి రుబ్బుతూ , వాణీ,వాణీ, లే అమ్మా తెల్లవారు తోంది, ఆరింటి నుండి, వచ్చి పడి పోతారు. జనం,ఊపిరి సలపదు.లేచి,కాస్తంత మొహం కడుక్కుని,చే సాయం కి రా అమ్మా ..అంటూ సన్నగా ,సన సన్నగా నొక్కుతోంది, చిన్న పిల్ల, బడి కి పోవల్సిన పిల్ల ,ఇంకా పరికిణీల్లో తిరుగుతూ, కిల కిల మని ఆడుతూ, పాడుతూ తిరగ వలసిన పిల్ల..అంతా ఖర్మ కాక పోతే ఇలా అయ్యేదే ?

తమకంటూ ఒక చిన్న ఇల్లు, ఓ ఎకరం మడి చెక్క పెద్దలు ఇచ్చింది ఉండేది, అప్పు చేసి బావి తవ్వుకున్నాం, పంట చేతికి వచ్చేది, కూరగాయలు పండించి, కోళ్ళు పెంచి, ఇంట్లో అందరు తల ఒక పని చేస్తూ, అప్పులు నెత్తిన ఉన్న,మా ఇంట్లో మేమే మా కూడు తింటూ, హాయిగానే ఉండే వాళ్ళం.

ఇదిగో, అయిదేళ్లయింది.. మా ఊరికి ఈ అలుమినియం ఫ్యాక్టరీ పెట్టి, అబ్బాయి కి ఉద్యోగం, చదువు కి బడి, ఆసుపత్రి అని, ఏవేవో ఆశలు పెట్టి ,మా భూమి, అయిదు లక్షలు ఖరీదు ఇచ్చి పుచ్చుకున్నారు.

ఇదిగో వచ్చే, అదిగో పాయె,అన్నట్టు చేతి లోనుంచి నీళ్ళు లాగ పోయింది, అబ్బాయి చదువు చాలదు అన్నారు, బడి కి ఫీజు కట్టాలి అన్నారు, ఆసుపత్రి, అందులో పని చేసే వారికే అన్నారు. మాయ లా ,అంత మాయ లాగ అయిపొయింది.

ఏడకి పోతాం? ఉన్న ఊరు, కన్న తల్లి అన్నారు కదా, పంచాయితి పెద్దలు తో మొర పెట్టుకుంటే, ఈ టిఫిన్ హోటల్ పెట్టుకోమన్నారు. అకడ, ఇక్కడ అప్పు చేసి, ఇది మొదలు పెట్టేం. అబ్బాయి మటుకు పట్నం లో చదువు కుంటున్నాడు, ఇంక ఆడ పిల్ల చేతి కింద పనికి అని చదువు మన్పించెం..ఏడిచింది..నేను ఏడ్చాను.. 
ఏం చేస్తాం? ఏదో ఒక లాగ అబ్బాయి చదువు అయి అందు కుంటే, ...

పని లోకి వెళ్ళే వాళ్ళంతా టిఫిన్లు, టీ లు ఇక్కడే ..అన్నం ,కాస్తంత అధరువులు తో భోజనాలు ఇక్కడే,శుచి ,శుబ్రం గా చేస్తున్నాం కదా, ఇక్కడికే వస్తున్నారు.

నరసయ్య పొయ్యి వెలిగించి, పాలు ఎక్కించాడు, ఒక పక్క టీ డికాషను, మరో పొయ్యి మీద ఇడ్లి పాత్ర ఎక్కించి, చట్నే రుబ్బుతోంది. వాణీ లేచి, పల్లెలు, గ్లాస్సులు ,కడిగే పనిలో ఉంది.
ఫ్యాక్టరీ గోడ కి అనుకునే నాలుగు రాటలు పాతి, ఓ రేకు, దాని మీద ఓ ప్లాస్టిక్ షీటూ వేసి, నాలుగు బల్లలు, అటు, ఇటు వేసి, నరసయ్య హోటల్ అని పేరు లేక పోయినా అందరూ చెప్పుకుంటారు.

ఎప్పటి కప్పుడు ,కాష్ ఇచ్చేవాలు ఎంత మంది, మావా, అత్తా అంటూ, రేపు , మాపు అంటారు.
హుష్..ఎప్పటికి మా కష్టాలు తీరత యో?

మావా..స్త్రొంగ్ టీయా..ఒక్క ప్లేట్ ఇడ్డేన, మజ్యననికి ఏం వండు తావు అత్తో? అంటూ ఒక పక్క పలకరింపులు, చేతిలో రూపాయి పెట్టరు, ఎలా నడుపుతాం..ఏమిటో..ఇలాగ..

వాణీ ,పెద్ద పిల్ల అయితే, ఎలా? పెళ్లి ఎలా చేస్తాం?

ఫ్యాక్టరీ గోడ ,గేటు కి కొంచెం దూరం లోనే మా హోటల్. ఆ పక్కనే సైకిల్ స్టాండ్..దారి లో కాబట్టే, అందరూ తొంగి చూసి, ఓ టీ అయినా తాగి వెళతారు.

పదకొండు ..మధ్యాన్నం..ఎండ మండు తోంది.  ఓ గంట వెసులుబాటు.

పొయ్యి మంట తగ్గించి, బల్లలు సర్డుతున్నాం.

ప్యాంటు, చొక్కా లో ఆఫిసుర్ బాబులు నలుగురు వచ్చారు.

టీ అడుగు తారా? అయ్యో పొయ్యి ఇప్పుడే తగ్గించాం..పాలు కూడా లేవు.

నరసయ్య .బల్ల తుడిచి, కూర్చోండి ..బాబూ అన్నాడు.

ఊ ..ఊ కూర్చో డానికి రాలేదు , నీ పేరేమిటి?

నరసయ్య ..బాబయ్య.. ఈ ఫ్యాక్టరీ కి మా భూములు ఇచ్చాం అయ్యా,,పంచాయతి సారూ గారు కూడా ఒప్పేరు అయ్యా, ఈ హోటల్. అప్పు చేసి పెట్టేం, బ్యాంకు కాదు అయ్యా..అంటూ చెప్పుకు పోతున్నాడు.

ఊ సరే, సరే, ఏమిటి, ఈ పొగ,ఈ పొయ్యి, ఏమిటి ఈ కాలుష్యం? మా పని వాళ్ళ ఆరోగ్యం కి హాని కదా ఈ పొగలు, ఈ శుభ్రం లేని పళ్ళేలు, గ్లాస్సులు? ఎన్ని రోజులకి కడుగు తారో?

ఊ.తియ్యండి..ఈ హోటల్ ఇక్కడ తీయండి. వాతావరణ కాలుష్యం ఆపే సంస్థ నుండి వచ్చాం,

ఎవరిని అడిగి పెడతారో? ఛి, బుద్ధి లేదు, ఈ పల్లెటూరు జనానికి.

ఇదిగో ,నోటిసు.. వారం రోజుల్లో నువ్వు ఈ కొట్టు ఎత్తేయాలి.

లేక పోతే నీ మీద చర్యలు తప్పవు..అంటూ వెళ్ళిపోయారు.

నరసయ్య, రమణమ్మ ,నిర్ఘాంత పోయి,

ఫ్యాక్టరీ నుంచి వస్తున్న పొగ , రింగులు రింగులు గా తిరిగి.. తమ మీదకి భూతం లా చుట్టూ కున్నట్టు తోచింది.

ఆరిపోయిన పొయ్యి నుంచి లేచిన చిన్న పొగ వల్లేనేమో, కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి.


గమ్యం


                                                                 
నేను ఒక దారిలో నడుస్తున్నాను,
అలసట లేని, గమ్యం లేని దారి అది.
ఎటు చూసినా ఒక బూడిద రంగు ఆకాశం
వెన్నంటి వస్తుంది, రంగులే లేని తెఱ అది.
పూవులు పొడిగా , ఎప్పుడో వికసించి,ఇప్పుడు
రేకలు రాలుస్తున్నాయి.
ఎందుకో వెను తిరిగి చూస్తే, ఒక నీడ , ఒక ఆకారం
నన్ను కవ్విస్తూ ఉంటుంది.
ముందుకు రాదు, వెలుగు లోకి,
ఏదో గొణుగుతూ ,నలుగుతూ , ఏమిటో
దాని బాధ.

అడుగులు పరుగులు తీస్తున్న,
ముందుకు పోను, అక్కడే ఉంటాను,
ట్రెడ్ మిల్ మీద నడక లా
ఒక్క గజం నెల కూడా ముందుకి కదలదు,
ఒక్క వీసం బరువు కూడా తగ్గను
అయిన ఎందుకో పరుగులు తీస్తూ ఉంటాను.
ఆకాశం అందుకోవాలని, ఇంద్ర ధనుస్సు మీద
నడవాలని , ఏమి కోరికలు లేవు.

అచ్చంగా నన్ను నేను చూసుకోవాలని
ఎప్పుడో నేల మీద వదలిన గుర్తులు
కోసం వెదుకుతున్నాను.
ఇల్లు అలుకుతూ పేరు మరచిన ఈగ లాగా,
నా కోసం వెదుకుతున్నాను.
పిచ్చిదానా, పోయిన చోటే వెదకాలని
తెలియని అమాయకురాలివా నువ్వు.
నా గమ్యం నన్ను వెక్కిరిస్తోంది
నన్ను కవ్విస్తోంది.

నిన్ను నువ్వు ఒక గిఫ్ట్ లాగా,
ఎంటర్ అవాలి ఇంకో జీవితం లోకి  అని చదివాను.
నేను ఒక బహుమతినా? ఎవరికీ?
భూమి మీద భారం నా?
పచ్చ గా ,ఇన్ని ఆకులు పూయించ క పోయిన
ఫరవా లేదు, చంపేయకు..
అని నన్ను నేను దండించు కున్నాను,

దాని బదులు, ఇన్ని నీళ్ళు పోయా వచ్చుగా
అని ఎవరో అన్నారు, నీడే గొణిగింది
ఇలా అడుగులు వెయ్యి నీలో నీలోకి.
కదలని పరుగులు కాదు, కదిలించే పరుగులు
తీయి, యోగ, మెడిటేషన్ , నేర్పాయా ?
నిన్ను నీలో చూసుకోవడం? ఇలా ఎంత అయిన
రాయగలను, మీరు, పారిపోయే అంత వరకు....
 
నాలో నేను,నాతొ నేను..
 
 
 
 

వలస పక్షులు


రమేష్ తన సీట్ నంబరు చూసుకుని కూర్చోబోతున్నాడు. 
"బాబయా ! చూడండి,ఇదీ నేను ఎక్కడ కూర్చోవాలో ?," అంటూ ఓ కంఠం వినిపించింది. వెనక్కి తిరిగాడు. ఒక నడివయసు స్త్రీ ,ఒక మూట లాంటి సంచి పట్టుకుని తన వెనకే నిలుచుని ఉంది.


అమ్మో, తన ప్రక్కనే ఈవిడ, లోపల కిటికీ సీటు కూడా, తను ఆ ప్రక్కనే కూర్చోవాలి, మధ్య సీటులో ఇరుకుగా , కొద్దిగా అసహనంగా అనిపించింది. తప్పదు కదా ..
"ఇక్కడే." అని తెలుగులో చెప్పగానే ఆవిడ మొహం వికసించింది.


హమ్మయ్య అన్నట్టు నిట్టూర్చి ," ఈ సంచి కాస్త పై అరలో పెట్టండి బాబయా ! "
తప్పుతుందా అన్నట్టు చేతిలోకి తీసుకుని తన విలువయిన లాప్ టాప్ సంచి.. ఛ..ఛ అదే బాగ్ ప్రక్కనే పెట్టాడు. ఈ సంచి కూడా.
హైదరాబాద్ నుంచి కువైట్ వెళ్ళే విమానం అది.గల్ఫ్ కి వెళ్ళే డైరెక్ట్ విమానం అది.రమేష్ ఆవిడకి లోపల సీటు చూపించి ,తనూ ప్రక్కనే కూర్చున్నాడు. తెలుగు వాళ్ళే అని తెలియడంతో ఆవిడ ఇంకాస్త చనువుగా మాట్లాడుతుంది కాబోలు.అసలే ,తను తన చికాకులో తను ఉన్నాడు.


"మొదటి సారి బాబయా! ఈ విమానం ఎక్కడం, ఇలా మా ఊరు వదిలి వెళ్ళడం కూడా.." అదిగో అప్పుడే మొదలుపెట్టింది ఈవిడ..అనుకుంటూ రమేష్ లోలోపల విసుక్కున్నాడు
పావుగంటలో అందరూ ఎక్కి,సర్దుకోవడం అయింది. ఎయిర్ హోస్టెస్ టపటప మని పైన అరల తలుపులు మూసాక , ఎదురుగా  ఉన్న చిన్న టీవి తెఱ మీద ఇంకొక ఆవిడ వచ్చి బెల్ట్ పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు    చెప్పడం  మొదలు పెట్టింది. "ఏంటయా? ఏం చెపుతోంది పిల్ల ? ఆ టీ వి లో ?" అని ప్రక్కనుంచి ప్రశ్న ,అమాయకం గా.


బాబోయ్ ఇదేదో నా సహనానికి పరీక్షే అనుకుని మనసులో ,పైకి మటుకు ఓపిక గా కనిపిస్తూ, ఆవిడకి మళ్లీ తెలుగు లో చెప్పాడు.తలుపులు మూసి,నెమ్మదిగా విమానం కదలడం మొదలు అయింది.


అమ్మోయ్ కదులుతోంది !! అని చిన్న కేక పెట్టి, కిటికీ లోంచి చూస్తూ ,"అమ్మాయ్! జాగ్రత్త అమ్మా! చంటాడు జాగ్రత్త ,"అంటూ పైట తో కళ్ళు తుడుచుకుంటూ చేతులూపుతోంది.


రమేష్ ఈసారి ఎటో చూస్తూ ,ఈవిడ నా ప్రక్కనే కూర్చోవాలా?అని నిట్టూరుస్తూ ,ఒక్కసారి శోభ ,పిల్లలని తలుచోకోగానే ,అనుకోకుండా ,అతని కళ్ళూ చెమర్చాయి.


ఈ ఫ్లైట్ బయలు దేరే సమయం ,మరీ అటూ ఇటూ కాని అపరాత్రి సమయం ,మళ్లీ ఒక్కరే వెనక్కి వెళ్ళాలి ,చంటి వాడు బబ్లూ లేచి ఏడుపు మొదలు పెడితే ,ఈ శంషాబాద్ అంతా మారు మోగుతుంది. వాడు మరీ నాన్న కూచి. నన్ను వదలడు ఒక్క నిముషం కూడా,ఇంట్లో ఉన్న కాస్సేపు.


తనే రావద్దు అన్నాడు. వాళ్ళని ఎయిర్ పోర్ట్ కి. శోభ వస్తాననే అంది, పిల్లలని ఇంట్లో వదిలి పెట్టి, కానీ తను ఒప్పుకోలేదు.


ఈ రోజు నుంచి శోభ ఒక్కర్తి అన్నీ తానై చూసుకోవాలి. అమ్మాయి స్వాతి నాలుగో తరగతి చదువుతోంది, బబ్లూ అంటే సౌరభ్ మరీ చిన్న వాడు,మూడో ఏడు నడుస్తోంది. వీళ్ళని వదిలి, తను కూడా మొదటిసారి గల్ఫ్ వెళుతున్నాడు.


శోభ కి అస్సలు ఇష్థం లేదు, కానీ తనే ఒప్పించాడు.నాకు వచ్చే లక్ష రూపాయల జీతం తో ఎప్పటికి మా ఇంటి మీదున్న అప్పు తీరేనూ,అమ్మో ఇంకా ఎంత ఖర్చుందో ముందు ముందు.


పిల్లల స్కూలు ఫీసు వేలల్లో,ఇంటి మీద అప్పు, అదే మూడు బెడ్ రూం ల ఫ్లాట్ తెసుకున్నాం, అది తడిసి మోపడై నలభై లక్షలయింది. నెల నెలా ముప్ఫై వేలు, కట్టాలి,బ్యాంకు కి.మనం తిన్నా తినక పోయినా,ఇది కాక కారు మీద అప్పు,ఇంకా ఆరు నెలలు కట్టాలి.


ఏంటో ఉద్యోగం వచ్చినపుడు లక్ష రూపాయల జీతం అంటే ఏమిటో అనుకున్నాను, చాల పెద్ద జీతం అని. పెళ్లి అయింది.పిల్లలు పుట్టారు, ఇద్దరు ..జీతం పెరిగింది, ఈ పది ఏళ్ళల్లో, ఖర్చు కూడా అలాగే పెరిగింది. కట్టింగ్ లు పోను, చేతికి వచ్చే జీతం తో గడవడం ఎంత కష్టం గా ఉందో?


కంపెనీ లో అందరూ గల్ఫ్ కి వెళ్ళిపోతున్నారు ,ఆఖరికి తను కూడా అందరి మార్గం పట్టాడు. జీతం రెండున్నర లక్షలు,కానీ పన్నుల బాధ లేదు, తను వీలైనంత త్వరగా ఇంటి మీద అప్పు తీర్చేసి, వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ,ఈ లోపల శోభ ,పిల్లలు ఒక్కరూ ఉండాలి.

చూడాలి,అంతా బాగుంటే వాళ్ళనే అక్కడికి రమ్మన వచ్చు, కానీ ఎంతో ముచ్చట పడి కట్టుకున్న ఫ్లాట్, అద్దె కి ఇచ్చేయడమా? అమ్మో ! మనం అనుభవించకుండా ఎవరో ,ఆ ఇంట్లో ఉండడమా?


ఏదో అద్దె యింట్లో ఉన్నా సరి పోయేది, ఇప్పుడు ఈ ఇంటి కోసం, ఇంటినీ, ఇల్లాలు ని, పిల్లలని వదిలి ,ఇలా దేశం వదిలి వెళ్ళాల్సి వస్తోంది, వెంట పడి అప్పులిచ్చిన బ్యాంకు లని తిట్టుకున్నాడు కాసేపు.
ఏమిటో అంతా చికాకు గా ఉంది.
"బాబయా"!ప్రక్కన ఆవిడ పలకరింపు. ఈసారి విసుగు మొహం మీద కనిపించేలా చూసాడు, అటు.
అటు చూసే సరికి, ఆవిడ కళ్ళ లోంచి నీళ్ళు కారిపోతున్నాయి.
"బాబయా, నేను వెళ్ళ లేను, నా వల్ల కాదు, నా మనవడు నన్ను వదిలి పెట్టి ఉండలేదు," అంటూ ఏడుస్తోంది
నాకు కొంచం జాలి వేసింది, " ఏడవకండి" అన్నాడు. ఇంకేం మాట్లాడాలో అర్ధం కాలేదు.
ఆడవాళ్ళు ఇంత ఫ్రీ గా ఎలా ఏడుస్తారో? అని లోపల కొంచం అసూయగా ..అనుకున్నాడు.నేను అలా ఏడవలేను కదా బయటకి..

కళ్ళు తుడుచుకుంటూ ఆవిడ," బాబయా! మాది తణుకు దగ్గర చిన్న పల్లెటూరు, హై వే రోడ్డు మీద టిఫినీ దుకాణం అదే ఓటలు నడిపే వాళ్ళం, రోజుకీ అయిదారు వందలు మిగివేవి, ఖరుసు పోను..మా ఆయనకి తాగుడు మాప్పేరు, ఊరులో ఆసామీలు , కుల్లుబోతోల్లు ,కొత్త ఓటలు వచ్చి ,బిగినేస్స్ పడిపోయింది, అలవాట్లు మటుకు మిగిలేయి. నష్టాల్లో ఓటలు మూత పడింది.
పదారేల్లకే కూతురి పెళ్లి సేసాం, అల్లుడు కి కూలి పని,పట్నం లో,ఆడికీ ఒళ్ళు బలిసి ,మందు కి అలవాటు పడ్డాడు. మావా అల్లుళ్ళు కల్సి ఇద్దరూ తాగడ, తన్దనాలాడ్డం ,ఒళ్ళు గుల్ల చేసుకుంటే ,బాగు చేయించాను. ఆసుపత్రి కి తీసుకెళ్ళి, మనవడు కూడా పుట్టేసాడు.


మా తోటికోడలు గల్ఫ్ కి పనికత్తె గా వెళ్ళి ,డబ్బు పంపిస్తోంది.ఇక్కడి మొగోల్లకి ఇంక మా ఆయన ,అల్లుడు, నన్ను కూడా వెళ్ళమని పోరు మొదలు పెట్టారు. మా ఆయన సుస్తీకి ,ఆసుపత్రి ఖరుసుకి, అప్పు చేసాం..భూవి, పుట్రా, ఏమి మిగల్లేదు, ఈ మగోల్లు సరిగ్గా ఉంటే, సక్కగా మేం తల్లీ కూతుళ్ళు ,ఎలాగో ఆలాగు బతికేస్తాం, ఈ అప్పు తీర్చాల, నా టికెట్ తీయడానికి , ఖరుసు ఇంకో లచ్చ అయింది..


ఈ అప్పులన్నీ నేను తీర్చాల ఉప్పుడు. పిల్ల ఇంకా సిన్నది, మనవడు ఇంకా తల్లీ కొంగు వదలడు. అందర్నీ వదిలి, నేను ఇలా ఎలుతున్నాను, ఏమిటో ఈ బతుకులు? బాబయా??"

అంటూ కన్నీళ్ళతో తన కథ అంతా నాలుగు ముక్కల్లో చెప్పింది ఆమె.

నా గొంతు లో ఏదో అడ్డం పడింది. రెండు లక్షల అప్పు తెర్చడానికి ఆవిడ, రెండు లక్షల జీతం ఇస్తున్న ఉద్యోగం వదిలి నేను, ఈ దూర దేశాలకి బయలు దేరాం..బహుదూరపు బాటసారులం.


సహచరులే లేని ఒంటరి ప్రయాణం.


వలస పక్షులు కూడా ఏవో దూర తీరాల్ నుండి, అనుకూల వాతావరణం వెతుకుతూ వలస వస్తాయి, కానీ తిరిగి వెళ్ళిపోతాయి అవి, కాలం అనుకూలించ గానే..


కానీ మేమో??ఎప్పటికైనా వెళ్లగలమా?
స్టాప్..స్టాప్..వెనక్కి తిప్పండి.. ఈ ఫ్లైట్ ..నా శోభ,నా పిల్లల దగ్గరకి వెళ్ళాలి నేను .. అని అరవాలని ఉంది.
విమానం రెక్కలు విప్పుకుని, ఆకాశంలో ఎత్తుకి ఎగురుతూ, మబ్బుల్లోకి మాయమయింది.











.












4 సెప్టెం, 2011

మా ఇంట్లో వినాయక చవతి ..పండుగ

టి .వి లలో ఇదిగో వచ్చింది వినాయక చవతి ,అదిగో వచ్చేస్తోంది అని కౌంట్ డౌన్ చేస్తూ, పర్యావరణ కి హాని కలిగించని విగ్రహాలు ఎలా తయారు చేయాలో అని వివరిస్తూ, పిల్లలు కూడా సులువు గా తయారు చేయుచ్చు గా ..ఈ దేవుడు బొమ్మలని.ఒక పెద్ద పొట్ట, రెండు పెద్ద చెవులు,ఒక్కటే ఒక్క దంతం, నవ్వు పుట్టించేలా ఒక ముఖం ,ఒక మట్టి ముద్ద తో నైన చేయ వచ్చు. నాకు చిన్నప్పటి పాల వెల్లి,వేలాడ దీసిన మొక్క జొన్న కండెలు, వెలగ పండులు, బత్తాయి పండులు, అన్నీ గుర్తు వచ్చాయి. ఇక్కడ ఈ దేశం లో అవేమీ దొరకవు కదా...
ఈ రోజే ..వినాయక చవతి వచ్చేసింది. రాత్రి అనుకుంటూనే పడు కున్నాను..కాని,లేచే సరికి ఉదయం..ఏడు.
అవును..ఏడు గంటలయింది....

పండుగ రోజు కూడా ఇలాగేనా?? అనే అంతరాత్మ వాయిస్ ఓవర్ ను,ఒక్క మాట లైట్ తీసుకో అనే హైదరాబాదీ స్టైల్ లో పక్కకి పెట్టి, అన్నీ పనులు ఫాస్ట్ ఫార్వర్డ్ లో ..నాలుగు స్టవ్ ల మీద నాలుగు గిన్నెలు, మూకుడ్లు పడేసి, కూకెర్ విసెల్, గ్రయ్దర్ బర్ర్ మనే శబ్దాల మధ్య నేను గిర గిర తిరుగుతూ, ఒక పాయసం, (తెల్లనిది),ఒక పులిహోర,(పసుపు రంగు), ఒక ఉండ్రాళ్ళ నైవేద్యం, రెండు రకాలు అందులో, కొబ్బరి ,బెల్లం పాకం తో కూరింది ఒకటి, అవి లేని, మామూలు ఉండ్రాళ్ళు, ఒక టమాటో పచ్చడి, అన్నం..ఇవి చేసి, మరో పక్క దేవుడి గది లో ...
తమల పాకులు దొరకవు, పాల వెల్లి లేదు, పర్యావరణం కి హాని చేసే, చేయని విగ్రహాలు కూడా లేవు, ఇష్తం గా కొనుక్కున్న కొన్ని లేపాక్షి వినాయకుడి బొమ్మలు ఉన్నాయి.

విఘ్నం కలగకుండా చేసే పూజ కి ఇవి విఘ్నాలు కాదు కదా..లైట్ తీసుకో..బాక్ గ్రౌండ్ లో..అను కుంటూ,ఒక ఆకు పచ్చ పళ్ళెం లో, చిన్న పసుపు వినాయకుడి ని చేసి, పొద్దున్నే తెప్పించిన పువ్వులు,పత్రీ,ఇవి మటుకు దొరికాయి, మదీనా జిందాబాద్..ప్రమిదలు లో నూనె పోసి, వత్తులు వేసి, అరటి పళ్ళు దగ్గర పెట్టుకుని, వినాయకుడి బొమ్మలు చుట్టూ పువ్వులు అలంకరించి, ఇంకా ఏమిటి ఆలస్యం,ఉండ్రాళ్ళు ఎప్పుడు నైవేద్యం పెడతారు అనే వినాయకుడు ని మరి విసిగించ కుండా, మొదలు పెట్టాం పూజ.

ఎన్ని రకాలు గా వర్ణించారో,ఈ గణాధిపతి ని అను కుంటూ,చందన వాళ్ళు ఇచ్చిన పూజ పుస్తకం చదువుతూ ఉంటె,ఈ పేర్లు కనిపించాయి..మాచి పత్రం,బృహతి పత్రం,బిల్వ పత్రం,దూర్వ యుగ్మం,తులసి పత్రం,చూత పత్రం,కర వీర పత్రం,విష్ణు క్రాంత పత్రం, దాడిమి పత్రం,దేవదారు పత్రం, మరువక పత్రం,సింధు వార పత్రం,జాతి పత్రం,గండకి పత్రం,సామీ పత్రం,అశ్వత పత్రం,అర్జున పత్రం,అర్క పత్రం ...పూజ యామి..అంటూ..
అంటే,ఈ గజ కర్ణ యనుడు కి ఎంత పర్యావరణ స్పృహ ఉండేదో..అనుకున్నాం.

ఈ పత్రాలు,ఈ మొక్కలు,ఈ చెట్లు, వాటిని ఆశ్రయించి బతికే, మృగాలు, పక్షులు,పిపీలకాలు, ఈ వనం ని నమ్ముకున్న వానరులు,నరులు, ఆకులూ అలములకి జీవం అందించే మేఘాలు, శ్రవణం,భద్రపదాలు అంటే వర్షాలే కదా, అంతా సవ్యం గా, పర్యావరణం సమ తుల్యం గా ఉన్నట్టే కదా.

ఒక గజం ముఖం తో, ఒక మూషికం వాహనం గా , మనకి వనం కి,అదే అడవి కి ఉన్న సంబంధం ని ఎత్తి చెపుతున్నట్టు లేదూ.ఇంత మెసేజ్ ని అందించే ..చిన్ని గణేశ ను పూజించు కుంటే..
కొంచం జ్ఞానం సంపాదించినట్టు, ఒక వెలుగు మొహం లో.అది హారతి ఇచ్చన కర్పూరం వెలుగే..
కథ చదివే వరకూ, బుద్ధిగా ఉన్న మనసు, మూడు ప్రదక్షణ లు పూర్తీ చేసే సరికి, ప్రసాదం మీదికి వెళ్ళి పోయింది.

కొబ్బరి కాయ ఫ్రిజ్ లో ఉందని, ఇంకా పుస్తకం లో రాసిన పూజ సామగ్రి, అన్నిసమ కూర్చు కో లేదని ,దీపం లో నెయ్యి వేయాలని, ఇలాగ చాల గుర్తు వచ్చాయి...

ఈ సారికి, ఈ తప్పులు మన్నించమని, లెంపలు గట్టిగ వేసుకుని, మళ్లీ వచ్చే సంవత్సరం చక్కగా చేస్తాను పూజ,అనుకుంటూ,అయినా..పర్యావరణం సమ తుల్యం గా ఉండేలా చూసుకుంటే ..అంత కన్నా గొప్ప పూజ ఉంటుందా??

ఒక పని ప్రారంభించే ముందు , మనసులో ఒక ఉద్విగ్నత ,ఒక సందేహం, ఒక బెదురూ దట్టని మేఘాలు లాగ కమ్ము కుంటాయి, అవిఘ్నం కలిగించ కూడదని ఒక మూర్తి ని మనసులో ప్రతిష్టించు కుంటాం.
కోరుకుంటాం, అదే ఈ పూజ..

ఈ సారికి మా ఇంట్లో వినాయక చవతి పండుగ కబుర్లు..కథ ఇది..