"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

30 సెప్టెం, 2012

ఒప్పుకున్నారు !!!

నేను మా అమ్మ పొట్టలో కాళ్ళు ముడుచుకుని, నా మానాన నేను ,కళ్ళు మూసుకుని ఎప్పుడెప్పుడు ఈ వెలుగు నీ ,ఈ లోకాన్ని,ఈ సుందర జీవితాన్నీ ,కళ్ళు తెరిచి చూస్తానా? అని తపస్సు చేస్తూంటే ..ఒప్పుకున్నారు.

నాకు ఊపిరి పీల్చుకోడానికి అనుమతి ఇచ్చి , ఈ వెలుగు లోకి,ఈ లోకం లోకి, ఈ సుందర మయ ప్రపంచం లోకి అడుగు పెట్టడానికి ఒప్పుకున్నారు..ట ..

అమ్మ కళ్ళల్లో  చీకటి ని, బయట ఆపరేషను బల్ల మీద వెలుగు ని కలిపిన మసక చీకట్లో కి, సంధ్య వేళ లో ,ఉషా కిరణం లా ప్రవేశించానని ,అమ్మ అప్పుడెప్పుడో ముద్దు చేస్తూ చెప్పింది, ఉష కిరణం అనే పేరు పెట్టడానికి అందరూ ఒప్పుకున్నారు అని.

అసలే కరువు రోజులు, అత్తెసరు జీతం, మాస్టారి ఉద్యోగం,దీనికి పాల డబ్బాల ఖర్చు ఒకటా? అని విసుక్కున్న ఇంట్లో వాళ్లకి అమ్మ ఏం చెప్పిందో? మరి వాళ్లకి అబ్బాయే కావాలి ట ..నాకు పాలు పట్టడానికి ,ప్రాణం నిలప దానికి ఒప్పుకున్నారు.

అమ్మ మాటలు,పాటలు, అమ్మతో చిరు ఆటలే , నా ప్రధమ చదువు.అవలీల గా అప్ప చెపుతున్న మాటలు, పాటలు చూసి, మురిసిన అమ్మ 'బడి'అంటే, ఆడపిల్ల కి చదువెందుకు ? అని అనేలోపల ,'ఉచితం' అన్న ఒక్క మాట వినిపించి ,నన్ను బడి లో వేయడానికి ఒప్పుకున్నారు.

ఎలాగో, అలాగే పెరిగాను.మా ఇంటి ముందున్న సన్నజాజి మొక్క కి నీరు పోస్తూ, అది అల్లుకుంటున్న పందిరి ని కడుతూ ,ఎంత ఎదిగి పోయిందో అని అమ్మ ఆశ్చర్య పోయింది ట ,అంతలో పూలు అందుకుంటున్న నన్ను చూసి.

మంచి మార్కులతో మెరిట్ లో పాస్ అయినందుకు ,పిలిచి కాలేజ్ లో సీట్ ఇస్తారు అంటే, అది మగ ,ఆడ కలిసి చదివే కాలేజ్ కదా ? అని ప్రశ్నించి, విచారించి, మళ్లీ ఉచితం..మీ అమ్మాయి కి చదువు అన్న మంత్రం పని చేసి ,నన్ను చదివించ దానికి ఒప్పుకున్నారు..

ఇంజనేరింగ్ లు అవి మనకెందుకు అనడం తో,ప్రతిభ ఉన్నా, బుద్ధి గా డిగ్రీ కాలేజ్ లో బి ఏ చదువుకుంటాను అంటే ఒప్పుకున్నారు.

కాలేజ్ చదువు తో పాటు ,కంపూటర్ చదువు , మంచి ఉద్యోగం వస్తుంది నాన్నా  అంటే ఒప్పుకున్నారు..

అన్నట్టే ఉద్యోగం వచ్చింది, నేను మిమ్మలిని పోషిస్తా నాన్నా, అమ్మా అంటే కాదు ,ఆడ పిల్లవి, పెళ్లి చేసుకో ..అన్నారు..నేను ఒప్పుకున్నాను.

చదువు, ఉద్యోగం ,అందం చూసి ఎవరో ఒకరు వచ్చారు పెళ్లి చేసుకోవడానికి ,ఉద్యోగం చేసే 'పిల్ల' అనే అర్హత ఉన్నందుకు ,కట్నం లో కన్సెషను దొరికింది.నీకు ఇష్టమేనా ? అని అడగ నైన అడగకుండా నాన్న ఒప్పుకున్నారు.

అందరూ ఒప్పుకున్నారు..పెళ్లి జరిగింది.
ఉన్న ఊరు లోనే ఉద్యోగం. కాపరం పెట్టాం.పెళ్లి అయిన ఉద్యోగం చేయ దానికి ఒప్పుకున్నారు. 

జీతం వాళ్ళ చేతిలో పెట్టి ,బస్సు పాస్ నా చేతిలో పెట్టి, ఇంట్లో పని కి ఆటంకం లేదు అన్న షరతు తో ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు.

ఇంటికి ,ఆరు గంటల కి రావాలి, ఉద్యోగ స్థలం లో మగ వారి తో అనవసర మాటలు కూడదు, కాంటీన్ ల లో తినడాలు, అనవసర ఖర్చులు అనేవి పై షరతులు...పెట్టి నేను ఉద్యోగం చేసి, జీతం తెచ్చి వారి చేతికి ఇచ్చేటట్టు ఒప్పుకున్నారు.

నాలో చురుకు,నిజాయితీ ,ప్రతిభ చూసి, కంపనీ నన్ను ప్రమోట్ చేసింది, జీతం పెరిగింది. దానికి ఒప్పుకున్నారు..

కాని, ఒక షరతు, పని ఎక్కువయింది. రాత్రి ఎనిమిది దాటుతోంది, నేను ఇంటికి వచ్చే సరికి. పని లో కష్టం పెరిగింది, ఇది దాటితే ఇంకా పెద్ద మానేజర్ పోస్ట్ ఇస్తారుట ..దీనికి ఒప్పుకోలేదు.

నీ సేవలు మీ కంపనీ కేనా ? ఇంటి పని ఎవరు చేస్తారు? అని నిల దీసారు?

పుట్టుక ముందు నించి, అణిగి, అణిగి, తొక్కి పెట్టి ఉన్న నా నిస్సహాయత ..న ఆక్రోశం ,నా క్రోధం ఆ రోజు లావా ల ఉప్పొంగింది.

ఆ రోజు నేను ఒప్పుకోలేదు.

నాకు నా ఉద్యోగం కావాలి, నా స్వాతంత్ర్యం కావలి, నా బ్రతుకు కావలి, నా ఆశలు నెర వేరాలి, నా కలలు ,నిజం కావాలి..

నేను ఒప్పుకును, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను..

మీరు ఒప్పుకున్నా ,లేకున్నా, ఇది నా జీవితం..అని ఒక అడుగు ముందుకు వేసాను..

గుండెల నిండా ధైర్యం ,స్థైర్యం ఈ ఉషా  కిరణం ..దారి వెలుగు వేపే..ఇంక.




27 సెప్టెం, 2012

నా ఇల్లు

హరిణి కిటికీ నించి బయటకి చూస్తోంది, ప్రశాంతం గా ఉన్న రోడ్డు , నీడ నిస్తూ విస్తరించిన పెద్ద గుల్ మొహర్ చెట్టు ,ఎర్రర్రని పూలు తో నిండి ,ఆకులు పచ్చ రంగు లోకి తిరిగి, నేడో,రేపో, రాలి పోవడానికి సిద్ధం అవుతూ ఉన్నాయి.


నూతన వధువు గా అడుగు పెట్టిన ఈ ఇంట్లో, నాకు నచ్చినది, తోడు ఇస్తున్నది, నా కెంతో ఇష్టమయిన ఈ గుల్మొహర్ చెట్టే..


ఆకాష్ ఆఫీసు కి వెళ్లి పోయాడు..
లేచి ,ఇంక పనులు చేసుకోవాలి..


ఎన్ని రోజులు, ఏళ్ళు పడుతుందో..మరి ఇది నా ఇల్లు అనుకోవడానికి. నిట్టురుస్తూ లేచింది..


ఏదో వెతుక్కునట్టే ఉంది ,ఈ ఇంట్లో, నా గది అంటూ ఏమి లేదు ఇంకా..
బట్టలు ఎక్కడ పెట్టు కోవాలో, నా పుస్తకాలు ఏ అలమర లో సద్దు కోవాలో, ఇంకా నేను ఎన్నో ఏళ్ల నించి ఎంతో ఇష్టం గా దాచు కున్న పాటల సీ డి లు..

అసలు,పెళ్లి అయి , ఈ ఇంటికి బయలు దేరి వస్తున్నప్పుడే మొదలయింది ఈ సమస్య.ఏమేమి సర్దు కోవాలి, నా వస్తువులు ఏమేమిటి తెచ్చుకోవాలి..అని.

అమ్మ "అలా కాదే హరీ , నువ్వు ముందు ముఖ్యమయిన బట్టలు, చీరలు,నీ సూట్లు,రోజూ ఇంట్లో కట్టుకునే బట్టలు, ఇవి సద్దుకో చాలు..మిగిలినవి ,మెల్ల మెల్ల గా తీసుకు వెళ్ళ వచ్చు లే .."

అని నచ్చ చెప్పింది, అమ్మ ఏమిటమ్మా ,నేను ఇలా మిమ్మలిని, నా ఇంటిని వదిలి ఎలా వెళ్ళాను? అని బిక్క మొహం పెట్టి కూర్చుంటే..

ఆకాష్ ..చాల మంచి వాడే, పెద్దలు చూసిన సంబంధమే కాని, ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉన్నారే, అని స్నేహితులు, చుట్టాలు అందరూ అనడమే..నాకు ఎలాంటి సమస్య లేదు..

లేదా అంటే ఉంది..నాకు రాత్రి మంచం ఎక్కాక ,చేతిలో ఒక పుస్తకం పట్టుకుంటే కాని నిదుర రాదు, పక్కనే మంద్ర స్వరం లో పాటలు వింటూంటే..హ్మ్మం..అది నా గది, నా నిద్ర..కార్యక్రమం..

ఇక్కడ అదేమీ కుదరటం లేదు, పాటలు అంటే, ఏమిటి ఏదో సౌండ్ ఆపేయ్ పడుకుందాం..పద,పద, మళ్లీ ఉదయమే లేచి, ఆఫీస్ వెళ్ళాలి, అంటూ తొందర పెట్టే భర్త..

కాదు అని ఎలా ? అనగలను..మనసులో ఇంకా అమ్మ చేసిన హిత బోధ గంట మోగినట్టు వినిపిస్తూనే ఉంది.

అక్కడ,అంటే అత్త వారింట్లో ,మన ఇంట్లో లా కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండ దానికి, ఉదయమే లేవాలి, నీకు అసలే ఉదయం నిద్ర ఎక్కువ, రాత్రి ఎంత సేపయినా నిశా చరి లా మేలుకుంటావు , పగలు నిద్ర పోతావు, మన ఇంట్లో కాబట్టి సరి పోయింది, అక్కడ అత్తగారుంటారు..

హ్మ్మం..నాకే నా ఈ హిత బోధ అంతా..కోడలు వస్తే ఎలా ఉండాలో ,తన కోడుకు కి ఎవరయినా చెప్పి ఉంటారా?

పెళ్లి అయి ,ఆరు నెలలు అయింది, ఇంక,కొత్త కోడలు హోదా నెమ్మదిగా ,పోయి, అత్తా గారింటి పద్దతులు కి అలవాటు పడుతోంది.

నా మంచం నించి ఇన్ని రోజులు అమ్మ వాళ్ళింట్లో,కుడి వేపు దిగడం అలవాటు ,అంటే అప్పుడు నేను ఒక్కర్తినే కదా..ఇప్పుడు ఎడమ వేపు, అంటే గోడ వేపు దిగాలి, లేవగానే, పరుగులు పెట్టి ఆకాష్ కి డబ్బాలు అందించాలి ,ఉదయం టిఫిన్ తినడానికి కూడా సమయం ఉండదు ,మరి, మధ్యాన్నం భోజనానికి ,ఒక చిన్న డబ్బా..ఇవి అమిర్చేసరికి వంట సమయం..

విశ్రాంతి గా కూర్చుని ,హిందూ వార్త పేపర్ చదివేది ఎప్పుడు? అమ్మ వాళ్ళింట్లో ,తమ్ముడు తో ,నాన్న తో పోటి పడి ,ముందు పేపర్ చదివితే కాని,రోజు మొదలయేది కాదు.

అసలు కాఫీ ఒక చేతిలో, హిందూ పేపర్ మరో చేతిలో..మగ వాళ్ళకేనా ?ఆ సుఖం? ఉక్రోషం తో ఉడికి పోతుంది ఒక్కో రోజు..

నీకు అంతగా చదవాలని ఉంటే ,ఇంకో అరగంట ముందు లేస్తే సరి, పనులు త్వరగా అయిపోతాయి, నీకు ప్రశాంతం గా పేపర్ చదువుకునే సమయం దొరుకుతుంది..

అని నీతులు, హు,ఆ సలహాలు వినడం కన్నా..పేపర్ ఏ మధ్యాన్నమో చదవడమో నయం.

ఇలా ,ప్రతి చిన్న విషయం లోను, నేనే మారాను ,అని పించింది..అందరూ ఇంతేనా?

అత్తగారు, మావగారు ఉన్నారు..కొంచం సర్దు కోవాలి, అని అమ్మ ఏమాత్రం అసంతృప్తి ప్రకటించినా నాకు క్లాసు..

నిన్న ,నా చిన్నప్పటి స్నేహితురాలు పద్మ వచ్చింది.

నాకు అయితే మొహం వికసించి, ఆనందం తన్ను కు వచ్చింది..చెయ్యి పట్టుకుని గట్టిగా వదల లేదు, అబ్బా చేయి వదలవే..హరీ ...నీ ప్రేమ చాల గొప్పదే కాని, నా చెయ్యి నొప్పి ...అనే వరకు అంత గట్టిగా పట్టు కున్నానని నాకే తెలియదు.

ఏదో నీటిలో కొట్టుకుపోతున్న వారి కి ఊతం దొరికి నట్టు..

పద్మ..కూర్చోవే, ఏమిటో అందరూ నన్ను మర్చి పోయారా? నీకు పెళ్లి అయి ,ఈ ఊర్లోనే ఉన్నావు కానీ, ఎప్పుడూ ఫోన్ అయినా చేయవేమ్టి ? నీ సంగతులేమిటి?

అంటూ ఊపిరి సలపనీయకుండా అడుగుతూ ఉంటే ..ముందు కొంచం మంచి నీళ్ళు అయిన ఇస్తావ? అనేసరికి  అయ్యో అంటూ పరుగు పెట్టి, గ్లాసులో మంచి నీళ్ళు ఇచ్చి,

ఊ..నీ కబుర్లు చెప్పు, అంటే నీ కబుర్లు చెప్పు అని ఇద్దరం ఒకేసారి అంటూ,చిన్న పిల్లల్లాగా ఒక్కసారి గట్టిగా నవ్వుకున్నాం.
నాకు..చాలా చెప్పాలనే ఉంది..మా అత్తగారు వాళ్ళ గది లో పడుకున్నారు..లేస్తారేమో పద,నా గది లో కూర్చుందాం.అంటూ తీసుకు వెళ్ళి ఒక కుర్చీ  వేసి, కూర్చో బెట్టాను..

అదేమిటో..ఇంకా ఇది నా ఇల్లు అనిపించటం లేదు, మా ఇంట్లో అయితే,పద్మ నేను మంచం ఎక్కి కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే,అమ్మ ఒక సారి, మంచి నీళ్ళ గ్లాసు తో వచ్చి, పద్మా ,బాగున్నావా? అని పలకరించి, మరో అర గంట అయేసరికి హరీ ,ఉత్త కబుర్లేనా? అని కాఫీ కప్పులు ఇస్తే ,తాగి మంచం పక్కనే కింద కాఫీ కప్పులు పెట్టి, ఇంకో గంట అయేక అమ్మా,తినడానికి ఏమయినా పెట్టవే? అంటే ఇదిగో పకోడీలు వేసాను, అంత బద్ధకం అయితే ఎలా..వచ్చి తీసుకో, రెండు ప్లేట్స్ లో పెట్టేను ,అంటే గునుస్తూ వెళ్లి ,పెద్ద పని చేసినట్టు పోస్ ఇచ్చి..రావడం..గుర్తు వచ్చి, నాకయితే సిగ్గేసింది.

డిగ్రీ చదువుతున్నాను ,అంత చిన్న దాన్నేం కాదు, అయినా అమ్మ కూడా అంత ముద్దు చేసిందేమిటో? అంత అమ్మదే తప్పు ..అన్నట్టు..మళ్లీ నవ్వు వచ్చింది..తనకే.

పద్మ తన కబుర్లు చెప్పమంటే..ఏమిటో డల్ గా అయిపొయింది అనిపించింది ..ఇంత లోనే ,అత్తగారు లేచిన చప్పుడు.

ఉండు పద్మా..టీ కలుపుతాను..అని లేచి వెళ్లి, టీ  కలిపి ఒక ప్లేట్ లో బిస్కెట్ ,స్వీట్ పెట్టి తీసుకు వచ్చేను ..
మా అత్త గారి ని పలకరించి, మాట్లాడుతూ ఉంది, టీ తాగగానే వెంటనే బయలు దేరింది..నేను విస్తు పోయాను, అదేమిటే, కూర్చో, ఇంకా ఏమి మాట్లాడు కొనే లేదు అంటే, మళ్లీ ఇంకోసారి వస్తాను ..ప్లీస్ ,హరి..ఏం అనుకోకు.

నాకేమిటో అయోమయం గా అనిపించింది. పెళ్లి అయితే ఇంత గా మారి పోతారా? ఒకఆడపిల్ల జీవితం లో ఇన్ని పెను మార్పులు వస్తాయా??ఇది ఇలాగే సాగుతూ ఉంటుందా??

గంటలు ,గంటలు చెప్పుకునే మేము ఇలా అయిపోయేం ఏమిటో??
నేను నా కొత్త ఇంటికి అలవాటు పడుతున్నాను.మా అత్తగారు ,మెల్లిగా ఇంటి పని, నాకు అప్ప చెప్పి, పురాణాలు, గుడులు అంటూ బయటే ఎక్కువ తిరుగుతున్నారు. మావగారు చాల నెమ్మది.ఆయన కి టైం కి భోజనం పెడితే చాలు..ఇంకేమి పెద్ద గా పట్టించు కోరు.

నేనే ఇంకా ఏమి నిర్ణయించు కోలేదు, డిగ్రీ చదివాను, ఇంకా చదువు కోవాలా? లేక పోతే ఏదయినా ఉద్యోగం చేయాలా? ఒక్క సారి ,నా జీవన గమనం మారి పోయింది..

నా భవిష్యత్తు ఏమిటో? అంటా అగమ్య గోచరం గా ఉంది..

ఒక రోజు అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను.

నా పుస్తకాలు, పాటలు, నా జ్ఞాపకాలు ఎన్నో అక్కడ వదిలి వచ్చేసాను కదా..
అమ్మ హరి రా రా..నీ పుస్తకాలు లేకుండా నువ్వు ఇంకా ఎన్ని రోజులున్దగలవు?అనుకుంటూనే ఉన్నాను..నేనే వద్దాం అంటే ఏది వీలు పడడం లేదు..అంటూ ఏదో మాట్లాడేస్తోంది..

నాకేదో కొత్త గా అనిపిస్తోంది. నా గది లో ఏం మార్పులు చేసారా? అని చూస్తూ ఉంటాను..నా మంచం అలాగే ఉంది మధ్యాన్నం కాసేపు ,నా గదిలో నడుం వాలుస్తాను అనే అమ్మ ని అలాగే చూస్తూ, ప్రేమగా చేయి పట్టుకున్నాను..

ఎంటే ,అంతా బాగానే ఉందా?? ఎందుకలా డల్ గా ఉంటున్నావు నీ పై చదువు గురించి చెప్పవా ?ఆకాష్ మంచి వాడే ,అర్ధం చేసుకుంటాడు..ఏమిటో తొందర పడి పోయామా? అందరూ మంచి...

అమ్మ నేను ఇప్పుడే చెపుతున్నాను..నువ్వు నా దగ్గర కూడా ఉండాలి. నేను ఏదో వేరు అయిపోయినట్టు అలా చూడకండి, మీ ఇల్లు అంటూ వేరు గా మాట్లాడకండి..నేను ఎప్పటికి మీ హరిణి ని, ఎప్పుడయినా మీ ఇంటికి వస్తాను..

అని ఏమిటో ఆవేశం గా మాట్లాడేసాను..కళ్ళు ఎర్ర బడి పోయాయి..
అమ్మ కి గాబరా వేసి ఏమిటో ఇవాళ మాట్లాడుతున్నావు..నీకు తెలుసా? మన పద్మ వాళ్ళ అమ్మ ,సీత కనిపించింది ,బజారు లో..

ఎలా ఉంది అమ్మా? తను..అమ్మ చెప్పినది విని నేను ఆశ్చర్య పోయాను, ఇలాగ కూడా ఉంటారా మనుషులు??

పద్మ ని ఎక్కడికి వెల్ల నివ్వరుట ..ఎవరో ఒకరు నీడ లాగ తోడూ ఉండాలి ట ,వీళ్ళు వెళ్ళినా కాపలా గా ఒకరు ఉంటారుట ,ఏం మాట్లాడు కుంటారో అని, ఆ అబ్బాయి కూడా ఏమి మాటాడుట ,మా అమ్మ వాళ్ళు ఏం చెప్పిన వినాల్సిందే అంటూ పద్మ కే హిత బోధ చేస్తాడుట ..

నిర్ఘాంత  పోయాను..ఇలాంటి మనుషులు కూడా ఉంటారు అని తెలీదు..నాకింత వరకు అందరూ మా అమ్మ ,నాన్న లాగే మంచి వాళ్ళే దొరికారు.

చాల అదృష్టమే అనుకుంటూ..
అమ్మా. నేను బయలు దేరుతాను.. నా సామాన్లు ఇక్కడే ఉండని ,మా ఇంట్లో జాగా లేదు ,ఎక్కడ పెట్టాను ఇవన్ని?

భోజనం చేసి వెళ్ళవే అన్నా వినిపించు కోకుండా..బయలు దేరి పోయాను..
రోడ్ మీదకి వచ్చి బస్ కోసం నిలుచుంటే..

నేను ఏమన్నాను..మా ఇంట్లో..అని..

ఎంత సులభం గా అనేసాను..మా ఇల్లు అని..

ఆరు నెలలు కాలేదు ఇంకా..అప్పుడే నా ఇల్లు అయిపోయిందా..

నా మనసులో , ఆ ఆలోచనే లేదు.కాని తరతరాలు గా నూరి పోసిన భావాలు ఎక్కడికి పోతాయి?

అమ్మో ఇంట్లో కూర్చుంటే ,ఇలాగే తయారు అవుతాను నేను..

ఆ సంవత్సరమే పీ జీ లో చేరి, మూడేళ్ళలో లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించాను ..మా ఊరు లోనే.

నా పుస్తకాలు, నా పాటలు ,నా జ్ఞాపకాలు ,అమ్మ ఇంటి నిండి నేను ,మరి ఏ నాడు వెనక్కి తెచ్చుకోలేదు..

నేను పుట్టి పెరిగిన ఇల్లు అది, పెళ్లి అయాక నేను వచ్చిన ఇల్లు అది..అంతే,నాకు రెండు ఇళ్లు..

పద్మ ఒక సారి నన్ను అడిగింది, నాకు రెండు ఇళ్లు అంటావు, ఇప్పుడు పద్మ నా కొలీగ్ కూడా..నీకు నిజం గా ఏదయినా కష్టం వస్తే నువ్వు ఎక్కడికి వెళతావు?అంతా బాగున్నప్పుడు ,అందరూ బాగానే ఉంటారు,నా లాగే ఇల్లు వదిలి వచ్చిన వారికి "నా ఇల్లు " అనేది ఉండాలి అందరికి ,అంటే మన ఆడ వాళ్లకి..

ఇది నిజం గా నిజమేనా?? నా ఇల్లు ...ఏమిటోఈ రెండు ఇళ్ళ లలో..??
అంతా బాగుంటుంది..ఎందుకు బాగుండదు..అని మనసు ని చిక్క బెట్టుకుంటూ హరిణి ఇంట్లో అడుగు పెట్టింది..















21 సెప్టెం, 2012

ఆఖరి ఖత్ ..సినిమా పేరు

ఆఖరి ఖత్ ..సినిమా పేరు..రాజేష్ ఖాన్నా ,అప్పటికి ఇంకా సూపర్ స్టార్ కాదు, యువకుడు, అందమయిన వాడు, నటన అంటే ఇష్టం తో,నటించడానికి వచ్చినవాడు..
నేను ఇంకా హై స్కూల్ ..రమా మహల్ (ఏలూరు ) పక్క సందు లో,లేడీస్ గెట్ ఈ వీధి లోకి తెరుచుకునేది,అక్కడ ఉండే వాళ్ళం , పాటలు అన్ని వినపడేవి మాకు..దసరా బుల్లోడు సినిమా సూపెర్ హిట్ కదా,బండ్లు కట్టుకుని వచ్చి, చుట్టుపక్కల పల్లెటూళ్ళు నించి, మా వీధి లోనే ఆపడం ,ఇంకా గుర్తే నాకు.
మా అమ్మగారు ,ముందు ఈ సినిమా చూసి  వచ్చి, ఎర్ర బడ్డ కళ్ళు తుడుచు కుంటూ, రాత్రి అన్నాలు పెడుతూ, ఈ సినిమా కథ చెప్పేసి, మమ్మల్ని కూడా వెళ్ళమని ,మర్నాడు ,డబ్బులు ప్లస్ పెర్మిషన్ ఇచ్చేసారు.
ఇంకా ఈ సినిమా కథ..
ఫస్ట్ సీన్ లో ఒక చిన్న బాబు, బంటి ట వాడి పేరు..బాబు అమ్మ ,బొంబాయి రోడ్ల మీద తిరుగుతూ కనిపిస్తారు. ఇంక ఈ బాబు, వయసు ఏడాది మీద సగం..నడక వచ్చు కాని..అమ్మ..దూద్..అంటే పాలు తప్ప ఇంకో మాట రాదు.
అమ్మ గా వేసిన ఆవిడ పేరు ఇంద్రనిల్ ముఖర్జీ ..పేరు ఎంత బాగుందో ,ఆవిడా నటన కూడా..అంతే..అందం గా ఉంటుంది..
ఈ సినిమాలో అందరూ ఎంత బాగా నటించేరు అంటే, ఇది ఒక సినిమా లా లేదు, ఎవరిదో ఒకరి కథ, మన కళ్ళ ముందు చూస్తున్నట్టు, దానికి మనమే సాక్షం అన్నట్టు..ఎంత గా హత్తుకుంది అంటే..ఈ సినిమా చూసి ఓ నలభై ఏళ్ళు అయినా ,ఇంకా నా కళ్ళు మూసుకుంటే ,ఆ సీన్లు ప్రత్యక్షం అవుతునాయి.
బొంబాయి మహా నగరం లో ఒక అమ్మ,ఒక పసివాడు..ఎవరూ లేరు, ఏమవుంది వీరికి అని ఆత్రుత మనకి,మొదలు అవుతుంది ..మహా నగరం ,తన మానాన తను ఉంటుంది నిర్దయగా , వడి వడి గా పరుగులు తీస్తూ అందరూ ఎవరి పనుల లో వారు ...
తల్లి ,వారిని ,వీరిని అడుక్కుని ఆ డబ్బులతో చిన్న వాడికి ,పాలు అవి కొనడం, ఎందుకు వీరు ఇలా ఉన్నారు? రోడ్డు ఎక్కి అనుకునే లోపల ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది .
రాజేష్ ఖన్న ఒక శిల్పి, ఒక కళా కారుడు ,హిమచల్ ప్రదేశ్ కులు వాలీ లోసరదాగా సెలవు లకి వెళ్లి ,అక్కడ విర బూసిన తోటల మధ్య ,ఒక పువ్వు లాగ అందమయిన అమ్మాయిని చూస్తాడు ,ఆమె పాట కూడా వింటాడు .
'బహారో ,మేర జీవన్ భి సవరో..కోయి ......' అనే పాట ...నలుపు,తెలుపు సినిమా అయినా ఆ తోట సొగసు అంతా మనసుకి ఘాటుగా ,మల్లె పూవులా వాసన లా అలుముకుంటుంది ..
గోవింద్ హీరో పేరు..ప్రేమిస్తాడు. ఆర్ కుచ్ దేర్ తెహేర్.. ఆర్ కుచ్ నా జా ....
ఎంత రొమాంటిక్ పాట ..పాటలు అన్ని ఎంత బాగుంటాయో ..
మన మైదానం లోంచి వెళ్లి, అక్కడ కొండ ల లో నివసించే అందమయిన అమ్మాయిలని ప్రేమించడం ,తరువాత మోసం చేయడం అనేది యుగ యుగాలుగా నడుస్తున్న సత్యం ..
ఒక చిన్న గుడి లో, అమ్మ వారి విగ్రహం అంటే కొండ దేవత సాక్షి గా పెళ్లి జరుగుతుంది ఇద్దరికీ హీరో, ముంబాయ్ వచ్చేస్తాడు ..
అమ్మాయి అమ్మ అవుతుంది..ముద్దులొలికే బాబు పుడతాడు ..ఆమె రాసే ఉత్తరాలకి జాబు లేదు ..ఆవిడకి ఆరోగ్యం పాడవుతుంది ..ఇంట్లో సవితి తల్లి.ఎన్ని కష్టాలో?
ఆ చిన్న పిల్లాడిని భుజం మీద వేసుకుని గోవింద్ ని కలవాలని కోటి ఆశలతో వస్తుంది. ఈ లోపల గోవింద్ ఒక కళాకారుడి గా మంచి పేరు సంపాదించు కుంటాడు హై సొసైటీ లో తిరుగుతూ ఉంటాడు.
అడవి లో అందాల పిల్ల, భార్య మరుగున పడి  పోతుంది...ఆమె రాసిన ఉత్తరాలు ఇంటి బయట పోస్ట్ బాక్స్ లో పడి ఉంటాయి ...
గోవింద్ ఈ అందాల కొండ పిల్ల విగ్రహం ఒకటి చెక్కుతాడు...ముమ్మూర్తుల ఆమె బొమ్మే.మనసులో చోటు ఉంది కాని భార్య గా పక్కన స్థానం లేదు..
ఆఖరి గా ఆమె ఒక ఖత్ అంటే ఒక జాబు రాసి పడేస్తుంది.తనకి ఆరోగ్యం అంతంత మాత్రం అని కొడుకు ని దగ్గర తీసుకోమని.
ఈ ఆఖరి ఖత్ చదువుతాడు.గోవింద్..పిల్లవాడు అనేసరికి తండ్రి హృదయం పొంగి పోరులుతుంది ..ఎలా గయినా తల్లి ని, బాబు ని కలవాలని , కార్ వేసుకుని బయలు దేరుతాడు ..మహా నగరం, బొంబాయి మహా నగరం..లో ఎక్కడ ని వెదుకుతాడు?
ఈ లోపల ,ఈవిడ బాబు తో రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది..అగమ్యం గా..ఒక చోట పెద్ద కర్రల అడితి కనిపిస్తుంది బాబు ని ఆడిస్తూ ఆమె, ఆ పొడుగాటి వెదురు కర్రల మధ్య దాక్కుంటూ ఆడుతూ ఉంటుంది..
ఆ బాబు, మా ! మా ! అంటూ వెతుక్కుంటూ ,తిరుగుతూ ఉంటే ,మనకి గుండె తరుక్కు పోతుంది..ఒక్కసారి వెళ్లి ఎత్తుకుందామా? అనిపిస్తుంది ..
అలా ఆడుకుంటూ ,ఆమె ఒక చోట కూర్చుని ,అలా  ఒరిగి పోతుంది. చని పోయింది.ఆ మహానగరం లో ఒక మాటలైనా రాని ,ముద్దులొలుకు చిన్న బాబు..మా ! మా అంటూ తట్టి లేపుతాడు..లేవదు 
అందరికి కన్నీళ్ళు ...
అలా నడవడం మొదలు పెడతాడు. ఆ బాబు..ఎవరూ పట్టించు కోరు ..అందరు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ కాళ్ళ మధ్య లోంచి వీడు ,ఈ పిల్లాడిని ఒక్కరూ ఎత్తుకోరు. నడుస్తూ ఉంటాడు, ఆకలి వేస్తే ఏడుస్తూ ఉంటాడు..మా మా..అంటూ..
గుండె ద్రవించి పోతుంది..
ఒక చోట, ఒక రైల్వే గెట్ మాన్..దగ్గరకి తీస్తాడు కాని, భార్య అప్పటికే గంపెడు పిల్లలు ఉన్నారు అని చెప్పి తరిమేస్తుంది..నిర్దాక్షిణ్యం గా..
మనమూ అంతే లెండి 
ఒక రోజు కన్నయ్య గుడి  లో ప్రసాదం తింటాడు ఒక సారి ,గుప్పెడు నిద్ర మాత్రలు మింగి రైల్ పట్టాల మధ్య పడుకుంటాడు..చిన్న బిళ్ళలాగ   తోచి తినేసాడు పాపం ..
మన గుండె చప్పుడు రెట్టింపు అవుతుంది..
మంచి నిద్ర లో మేలుకుని ,ఏడుస్తే అప్పుడే ఆగేట్ మాన్ రక్షిస్తాడు.
ఇలా ఆ బాబు వెనక కెమెరా నడుస్తూ ఉంటుంది..
ప్రపంచం ఎంత కఠినమయినదో అనుకుంటాం.మనం కూడా అందులో భాగమే అని తెలుసు కోలేక 
ఈ లోగా గోవింద్ ,పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తాడు , తన భార్య ,పిల్లాడు  ,బొంబాయి నగరం లో తప్పి పోయి తిరుగుతున్నారు అని..
మనం అనవలసిన మాటలు అన్ని, ఆ పోలీసాయన అడుగుతాడు.
నీ భార్య అయితే రోడ్ మీద ఎందుకుంది పోటో కూడా లేదా ? చిన్న పిల్లాడి తో ఆమె ఎందుకు అలా బయట తిరుగు తోంది? నీ  బాధ్యతా ఎంత ? అంటూ చివాట్లు పెడతాడు.
తను తయారు చేసిన విగ్రహం కి ఫోటో తీసి ఇస్తాడు, వెతక మని.
చనిపోయి రోడ్ మీద పడి ఉన్న ఆమె ని పోలీసులకి అప్పగిస్తారు. ఈ ఫోటో చూసి గోవింద్ ని పిలుస్తారు.చూసి గుర్తు పట్టి, చాల బాధ పడి ,విలపిస్తాడు ..
హమ్మయా ,హీరో కి ,కూడా హృదయం ఉంది అన్న మాట అని మనకి కొంత శాంతి ఎందుకో హీరో అంటే పూర్తి గా చెడ్డ వాడు గా చూడలేం మనం..సినిమా గ్రామర్ కి వ్యతిరేకం ..మింగుడు పడదు ..
ఇంక, ఈ పసి వాడు, తండ్రి ని చేరాలి ..ఎలా?? అని ఉత్కంఠ ..
ఈ పాల బుగ్గల పసి వాడు, మట్టి కొట్టుకు పోయి, అమ్మ ఆదరణ లేక ,ఆకలి తో ఏడుస్తూ, ఒక గుమ్మం లో పాల సీసా చూస్తాడు. అప్పట్లో సీసాలు పెట్టేవారు. ఇప్పటి లాగ పాకెట్ కాదు.
దూద్ .అనుకుంటూ ,వెళ్లి ,ఎత్తి పడేస్తాడు అలా ఏడ్చుకుంటూ ఇంట్లో కి వెళ్లి ,అక్కడ ఉన్న అమ్మ విగ్రహం చూసి, జరా జరా ,బిరా బిరా నడుచు కుంటూ ,పాక్కుంటూ ఆ బొమ్మ ని పట్టుకుని మా..మా..అంటూ ఏడుస్తూ ,లేపుతూ ఉంటాడు.
ఇంకా మనకి ఒక్క సారి, రిలీఫ్ తో కళ్ళ ల్లోంచి నీళ్ళు వరద లాగ తన్నుకు వచ్చేసి అమ్మో సినిమా అయిపోతే అందరూ చూస్తారు అని కర్చీఫ్ తో తుడుచు కుంటూ..పై నించి ఆశీర్వదిస్తున్న అమ్మ మొహం బాబూ అని హత్తుకున్న గోవింద్, రాజేష్ ఖానా పశ్చాత్తాపం ,ప్రేమ ,కల గలిపిన అందమయిన మొహం ,మనసులో నిక్షిప్తం చేసుకునే లోగా లైట్లు వెలిగాయి..
అందరూ కళ్ళు తుడుచు కుంటూ, ఇంకా సినిమా మైకం నించి కదల కుండా కూర్చుని కనిపిస్తారు..
అద్భుత మయిన దర్సకత్వం.చేతన్ ఆనంద్ అని నటుడు దేవ్ ఆనంద్ అన్న..
వినటానికి హాయిగా ,మనకి మాత్రమే ,మన కోసమే పాడుతున్నార? అనిపించే ఖయ్యం సంగీతం..
ముద్దులికే హీరోయిన్ సహజ సౌందర్యం ముంబాయి మహా నగరం ఒక పాత్ర గా ఒక కాన్వాస్ మీద రూపొందించిన మనసు ని దోచేసే సినిమా ఇది..
చూడని వారు యు ట్యూబ్ లో చూడండి 
పాటలు,  నటన,  కథ అన్ని సరళం గా ఎంత బాగున్నాయో ..చూసి ఆనందించండి ..
ఉంటాను మరి,నాకు గుర్తు ఉన్న కథ ఇది, వెనక ముందు..నలభై ఏళ్ళు పైన అయింది ..తప్పులున్నాయేమో తెలియదు.
ఆఖరి ఖత్ ....రాజేష్ ఖాన్న ఎందుకు సూపర్ స్టార్ అయ్యాడో ..తెలిపే సినిమా ..ఇది ఆఖరి మాట..ఆఖరి బాత్ ..మరి..







18 సెప్టెం, 2012

ఈ పాట వెనక కథ ఇదే.....చివరికి మిగిలేది సినిమా

చివరికి మిగిలేది??
ఈ పేరు తో సినిమా ,నవల రెండూ ఉన్నాయి..రెండూ నాకు ఇష్టమయినవే.
చివరికి మిగిలేది సినిమా చూస్తూ , కర్చీఫ్ లు తడిపేసి ,పిండేసిన రోజు ఇంకా గుర్తే..అయితే మేం  విశాఖ పట్నం ఆంధ్ర యూనివెర్సిటీ లో చదువుతున్న రోజులలో మేం చూసినన్ని సినిమాలు, మళ్లీ జీవితం లో ఎప్పుడూ చూడలేదు.అలాంటి ,నిష్పుచి , కేరేజట్ ,మేమే ఈ ప్రపంచానికి అధిపతులు, మేమే ఈ ప్రపంచానికి పథ నిర్దేశం చేసే యువతీ యువకులం అని నిర్ద్వందం గా నమ్మి, ప్రేమించడం అంటే ,ఒక మనిషి నే కాదు ,సమస్త ప్రపంచాన్ని...
రావి శాస్త్రి , శ్రీ శ్రీ, దేవులపల్లి, కొ కు.చలం, బుచ్చిబాబు, రంగనాయకమ్మ,బీన దేవి, వీరందరూ మా గుండెల్లో కూర్చుని, ఇలా మాట్లాడు, ఇలా చేయి అని చేయి పట్టుకుని నడిపించి నట్టుండేది.
పర్సులో డబ్బులు నిల్ .దిల్ నిండా ధైర్యం ఫుల్.
అదే ఆ బంగారు రోజుల సబ్ హెడింగ్. బంగారు రోజులు రాసిన కవన శర్మ గారి కి గుర్తు గా..
నీ దగ్గర ఒక పది నా దగ్గర ఓ పది, వెరసి ఇరవై, చలో మార్నింగ్ షో ,అంటూ,జగదాంబ కి పదకొండు బస్సు ఎక్కి, అంటే నడుచు కుంటూ వెళ్లి పోవడం, ఒక మంచి సినిమా చూసి, వీర ఆవేశం తో మళ్లీ ,అప్ ఎక్కి నడుచుకుంటూ వచ్చి,హాస్టల్ లో ,అడుగు న మిగిలి పోయిన నాలుగు అన్నం  మెతుకులే ,పరమాన్నం గా తినేసి,సినిమా పారవశ్యం లో మునిగి పోవడం..
అలా ఒక రోజు చిత్రాలయ లో చివరికి మిగిలేది ? అనే అద్భుతమయిన సినిమా,అందులో సావిత్రి నటన ఇంకా అద్భుతం అని విని ,బయలుదేరి వెళ్ళాం,పద కొండు గంటల షోకి.
ఆ సినిమా ఒక సారి చూసేం..లేదా కథ విన్నాం..కాబట్టి సరిపోయింది.
లేక పోతే, ఆ రోజు, చిత్రాలయ సినిమా రీల్స్ వేసే అతని కి హాంగ్ ఓవరో ఏమో,లేదా తిక్కో, రీల్స్ అన్ని కలిపేసి, ముందుగా సావిత్రి కథ, ఆవిడ కి మతి చలించడం అంత ముందు చూపించేడు, తరవాత, మిగిలిన కథ, అంతా  అవక తవక అన్న మాట.
మాకు ఆ రోజు బాపు కార్టూన్..ఇంత అవక తవక సినిమా నేను ఎప్పుడూ చూడలేదు ...అనుకుంటాడు..తెర మీద భశుం ...అని ఉంటుంది కార్డు.
ఆ కార్టూన్..నిజం గా అనుభవం అయింది..కర్చీఫ్ లు తడిసి పోతాయి అనుకుంటే ,నవ్వులే నవ్వులు..అందరం..
అసలు సినిమా కథ ఇది.
సావిత్రి ఒక ఆసుపత్రి లో నర్సు గా పని చేస్తూ ఉంటుంది. ఆ హాస్పిటల్,మానసిక చికిత్సాలయం. ఆమె తన పని ఎంతో ఇష్టం గా చేస్తూ,అందరికి ప్రేమ పాత్రురాలు గా ఉంటుంది.
ఆసుపత్రి పెద్ద ,మానసిక చికిత్స కి కొత్త పద్ధతులు అవలంబించాలి,అని రక రకాలు గా పరిశోధన లు చేసి, చివరికి ఒక పద్ధతి .... అదే, ప్రేమ అనే మందు వాడాలని ..ఒక నిర్ణయం కి వస్తాడు.
అతనికి ,నిత్యం చిరు నవ్వుతో, అందరిని ప్రేమ గా పలకరించే మన సావిత్రి ,నర్సు పాత్ర లో, అందుకు తగునని ,ఆమె ని అడుగుతాడు..ఈ వైద్యం నువ్వు చేయ గలవా?
ఇంతలో , ఒక మానసిక రోగి కాంతా రావు ను తీసుకు వస్తారు,చికిత్స కోసం.అతను ఒక కవి.ఒక చక్కని కవి. పాటలు, పద్యాలు  రాసుకునే ఒక కళల కాణాచి. అతని కళల లోకం లో, ధనం , కాసులు కి చోటు లేదు..
ఈ కళాకారుడు తన మరదలు ని మన్స్ఫూర్తి గా ప్రేమిస్తాడు..ఆమె నే ఊహించుకుని పాటలు కడతాడు, నృత్యాలు ఊహించుకుంటాడు. అయితే మరదలు మటుకు ఈ ప్రపంచం అంతా కాసుల మాయం, ధనం లేకుంటే ప్రేమ తింటూ బతకలేం అని భావన తో, అతని ప్రేమ ని అంగీకరించదు ..ఈ తృనీకరణ భరించ లేని ఆ సున్నిత మనస్కుడు ,మతి స్థిమితం తప్పి,పిచ్చి వాడయిపోతాడు.
పిచ్చి ,పిచ్చి గా అరుస్తూ, పుస్తకాల లో పుటలు చిమ్పూస్తూ ఉండే  కాంతా రావు ని ఆ ఆసుపత్రి కి తీసుకు వచ్చి జేర్పిస్తారు..తల్లి తండ్రులు..
ఇంకా ఆ ఆసుపత్రి పెద్ద కి సంతోషం..అతను ఆలోచిస్తున్న ,చికిత్స విధానం ని ప్రయోగించ డానికి ఒక మానసిక రోగి దొరికాడు అని.
సావిత్రి ని పిలిచి, తన ఆలోచన చెప్పి, ఆమెని ఒప్పిస్తాడు. ఆమె ఒప్పుకోదు ..ముందు.నేను ఒక స్త్రీ ని, ఇలా ప్రేమ ని నటించడం అది ఎలా? ఒక మగవాని తో ప్రేమ నటించడం అదీ ,ఈ సంఘం ఎలా ఒప్పుకుంటుంది? నా భవిష్యత్తు ఏమవుతుంది? అనే ఆమె ప్రశ్న ల ని ,ఇది ఒక చికిత్స విధానం ,నర్సు గా ఇది నీ విధి నిర్వహణ తప్ప ఇంకేమి కాదు..అని ఒప్పిస్తాడు.
ఇంక  మొదలు అవుతుంది. కాంతా రావు, చిన్న పిల్లాడిలా మారాం చేస్తూ ఉంటాడు.పుస్తకాలు అంటేనే ద్వేషం.ఈ పుస్తక రచన నచ్చకే కదా, అతను తన ప్రేమ ను కోల్పోయేడు ..అందుకే..
సావిత్రి ,తన చల్లని చిరు నవ్వుతో, ప్రేమ తో, అతని కి సేవలు చేస్తూ, పాటలు కూడా పాడుతూ, అతని కి మళ్లీ ప్రేమ అంటే ఏమిటో రుచి చూపిస్తూ, తనే అతని ప్రేమ లో పడిపోతుంది.
నాకయితే..ఆ ఆసుపత్రి పెద్ద( హెడ్ ) అంటే ఎంత కోపమో ..ఏమిటి అర్ధం పర్ధం లేని చికిత్స లు? మనసు తో ఆడుకోవడమా?
సావిత్రి పాత్ర చూసి మనసు కరిగి పోతుంది..
ఒక పక్క కాంతా రావు పాత్ర , సావిత్రి ఒక్క నిముషం కనిపించ క పోతే ,పేచీలు పెట్టి, మందు వేసుకొను, ఆమె వచ్చి ఇస్తేనే మందు అంటూ, ఎంత గా ఆధార పడిపోతాడో..మనకి విసుగు వస్తూ ఉంటుంది..
కొంప తీసి ఇతను కూడా నిజం గా ప్రేమించేస్తున్నడా ? మన సావిత్రి నర్సు పాత్ర ని..మనం లీనం అయిపోయాం కదా ఆ పాత్ర లో..
అతన్ని బుజ్జగించి, పుస్తకాలు చదివించి, చెల్లా చెదరు గా పడి ఉన్న అతని కవిత్వం అంతా ఒక పుస్తకం గా ప్రచురింప చేస్తుంది..ఆమె..అప్పటికే అతని ప్రేమలో  పూర్తి గా మునిగి ఉన్న మన సావిత్రి ..
ఆ పుస్తకం ఒక పెద్ద హిట్..అంటే, ఎన్నో బిరుదులూ ప్రశంశలు..
దానితో పాటు డబ్బు..వచ్చి పడతాయి..
దానితో..పాటు..మరదలు.నా బావ అంటూ వెనక్కి వస్తుంది..
ఈ లోపల ,ప్రేమ తో పిచ్చి తగ్గించే కొత్త ,సరి కొత్త చికిత్స విధానం పని చేసి, మానసిక రోగి, కాస్తా..మామూలు మనిషి అయిపోయేడు ..
మరదలి ని చూసి, ఉత్సాహం తో పొంగి పోయేడు, గతం అంతా మర్చి పోయిన ఈ రోగి, ఇప్పుడు మరదలి ప్రేమ ని పూర్తి గా ఆస్వాదిస్తూ, అసలు తనని ఇలా చేసిన సావిత్రి ని ఒక మామూలు నర్సు గా మాత్రమే గుర్తిస్తాడు.
అయింది,అనుకున్న దంతా అయింది..సావిత్రి, మన పిచ్చి పిల్ల ,సావిత్రి, మనసు వేయి ముక్కలయింది. నిజ జీవితం లో కూడా ఆమె ప్రేమని వాడుకున్న ఒక హీరో మనకి గుర్తు వచ్చి, మనం కూడా కన్నీరు మున్నేరు అవుతాం..
ఏ కట కటా ల గదిలో కాంతా రావును ముందు బంధించి పెట్టారో,అదే గదిలో,ఇప్పుడు సావిత్రి..ఒకప్పుడు,ప్రేమ స్పదురాలు, ఒక నర్సు, ఒక స్త్రీ, ఇప్పుడు ఒక రోగి, ఒక మానసిక చికిత్స రోగ బాధితురాలు.
అవును, మన ఆసుపత్రి పెద్ద చెప్పిన రోగ చికిత్స విధానం సఫలమయి ,ఆ చికిత్స కి సాధనం అయిన ఒక స్త్రీ మూర్తి కి, ఒక ప్రేమ మూర్తి కి మతి చలించింది.
ఇది సఫలమా? విజయమా? అప జయమా??
చివరికి ఏం మిగిలింది..???
ఒక పగిలిన హృదయం మిగిలింది, ఒక స్త్రీ చేసిన త్యాగం మిగిలింది..
నువ్వు త్యాగ మూర్తి వి, నువ్వు ప్రేమ మూర్తివి అని పొగిడి, స్త్రీ ని ఎలా వాడు కుంటారో? స్త్రీ ఎంత అమాయకం గా తన మనసుని ఒక మగ వానికి ఎందుకు ,ఎలా అర్పిస్తుందో? ఆ ప్రేమ విఫలం అయితే, ఆమె కి చికిత్స గా మళ్లీ ,ఎవరు ప్రేమ ని పంచుతారు ??అన్ని ప్రశ్నలే..
చివరికి మిగిలేది ? ఒక గుండెలు పిండే దృశ్య కావ్యం..
అందానికి అందం నేనే..అనే పాట ఒక్కటే గుర్తు ఉంది, పాత్రల్ పేర్లు గుర్తు లేవు, సావిత్రి నటన ఒక్కటే అలా మనసులో ఒక చెక్కు చదరనీ రూపం తో గుర్తుండి పోయింది.
ఇలాంటి కథ తో నే, చంద్ర మోహన్ తన సొంత సినిమా ఒకటి తీసేడు, మనసే ...అన్న పేరు..పూర్తి పేరు గుర్తు రావటం లేదు.
కాని, సావిత్రి కి ఎవరూ సాటి రారు కదా..హిందీ లో కూడా ఉంది ట , ఈ సినిమా..కాని, తెలుగు లో సావిత్రి ని చూసిన కళ్ళ తో ,ఇంకెవరిని చూడలేం కదా..
అందానికి అందం నేనే, జీవన మకరందం నేనే..అనే గొప్ప ,తీయని పాట ,ఈ సినిమా లోదే..ఈ పాట ,నిన్న విన్నాకే ఈ సినిమా గుర్తు వచ్చింది..అదే ఈ పోస్ట్ వెనక కథ..
ఈ పాట వెనక కథ ఇదే..సెలవ్ మరి..ఇప్పటికి..










13 సెప్టెం, 2012

అటక లు సద్డడం

చాలా రోజులు.ఊహు కాదు, రెండేళ్ళు అయిందేమో?  మళ్లీ అటక సద్దుద్దాం అని తిథి ,వారం ,వర్జ్యం ..అంటే పిల్లలు లేనప్పుడు, భర్త ఊరులో లేనప్పుడు, బయట వారు ఎవరూ తలుపులు తట్టని ఒక ఆదివారం ,మొదలు పెట్టేను .
అటక అంటే ....ఒక దాపరికం..
మనకి అక్కర్లేని వస్తువులు, పాత అయిపోయినవి అయినా పడేయ లేనివి,పదును కోల్పోయిన పాత కత్తులు, ఏమో ఎప్పుడో పనికి వస్తాయి, అంటే మన ఇంట్లో ఏదయినా శుభ కార్యం అయితే, ఓ పది మందో, ఇరవై మందో వస్తే,రెండు కత్తి పీటలు ఉంటే , ఎంత ముందు చూపో ,అని నేను అనుకోవడమే..నీకు ఏ వస్తువు పడేయలేని బలహీనత ,అని వెక్కిరింపులు .
ఎవరో అన్నారు అని కాదు కాని, ఈ అటక మీదకి ఎక్కి చూస్తూంటే, ఏమిటి కలగల్పు ,చెత్త చెదారం..హు..లాభం లేదు, ఇవాళ అన్ని పడేయాల్సిందే..మా విసాపట్నం లో జరిగే ఏ వస్తు ప్రదర్శన (exhibition) నేను ,నా స్నేహితురాలు తోడు గా వెళ్లి,వంటింటి లో పనికి వచ్చే ,ఏ ఉపకరణం అయినా సరే,మా వంటల నైపుణ్యాన్ని పెంచేవి ఇవే అని ఘట్టి నమ్మకం తో కొని పడేసే వాళ్ళం..అయితే తరవాత ,తరవాత తెలిసింది, మా వంటల నైపుణ్యం కి తోడ్పడేవి..ఏమిటో? అడక్కండి..అది రహస్యం..
చక చకా బంగాళ దుంపలుని చిప్స్ లా కోసి పడేస్తుంది, అని ఓ హిందీ అబ్బాయి చేసి చూపిస్తూంటే,మేమూ కొన్నాం..అయితే మాకు ఇంట్లో మటుకు, అది, చేతులు చెక్కడానికే ఎక్కువ ఉపయోగ పడింది, మరీ ,ఇలా రక్తాలు కారుకుంటూ,వంటలు చేయాలా అని, మూడో ,నాలుగో వందలు పెట్టి కొన్నాం , డస్ట్ బిన్ లో ఎలా పడేస్తాం..ఇదిగో, ఇలా అటకెక్కింది.
ఇంకా మా అమ్మ వాడే  ఆ పాత నల్ల జంతికల గొట్టం ఏం బాగుంటుంది, కొంచం కొత్త గా వాడుదాం అని,ఒక తళ తళ లాడే స్టీల్ గొట్టం కొన్నాను, పిండి లో ఉప్పు ఎక్కువ వేసి,చేతులు నొప్పి పెడుతున్నది దీనితో, అని అది అటక మీదచేరింది, తన అక్క చెల్లళ్ళ తో  పాటు..అన్ని మరి, ఒకే చోట కొన్నవే కదా..
అబ్బ ఎన్ని రంగులో, ఎంత బాగుందో? అంటూ ముచ్చట పడి ,డేకోలాం అంటించిన చపాతీలు వత్తే పీట కొన్నాం..మంచి నీలం రంగు ఎంచుకుని..అమ్మా! మన గట్టు గ్రాన్యట్ రాయి కదా,వేరే ఏం పీట లు అక్కర్లేదు అనే మా అబ్బాయి జయంత్ ,మాట పెడ చెవిన పెట్టి..
నాలుగు నెలలు వాడానో లేదో,  అంటించిన డెకొలం, నీరు లోపలి వెళ్లి పోవడం వాళ్ళ కాబోలు,అప్పడం లాగ పైకి లేవడం ప్రారంభించింది.
అసలే మన చపాతీ లు భారత దేశం పటం లాగ వస్తాయి, ఇంకా ఈ పీట మీద వత్తితే ,అమెరిక పటం లా అయిపోయే ప్రమాదం ఉందని ,హమ్..చూస్తూ, చూస్తూ,బయట ఎలా పడేస్తాం..పోనీలే ఎప్పుడయినా..దీని కింద ఒక అండర్ లైన్ గీయండి, గవ్వలు అవి చేస్తే ,పనికి వస్తుంది..ఎప్పుడయినా చేసారా?అని అలా నిల దీయకండి..చేసుకున్న భర్తే ఇలాంటి ప్రశ్నలు వేయడం మానేసాడు. ఫలితం..ఇదిగో, ఇలా అటకెక్కింది..బుజ్జి ముండ..ఎంతబాగుందో? ఆకాశం నీలి రంగు..
అమ్మా ,అలా రంగులు చూసి కొనకమ్మా ,ఉపయోగం ఉంటుందో లేదో చూసి కొను, అని మా చిన్న వాడు, చిన్న వాడయినా నాకు కొంచం బుద్ధి ఎక్కించడానికి ప్రయత్నిస్తాడు..కాని, బలం కోసం సెలైన్ చేతికి ఎక్కించి నట్టు, బుద్ధి కూడా ఇలా మాటలతో ఎక్కించలేం ..అని హు..చిన్నవాడు కదా ఇంకా తెలియదు పాపం..
అదేమిటో ఈ ప్రదర్శన శాల లో, అందమయిన హిందీ అబ్బాయిలని పెట్టేస్తారు, ఆ కొట్ల మీద..ఉల్లిపాయలు కళ్ళ లలో నీళ్ళు రాకుండా ,ఎలా కోయాలో, చేసి చూపించేడు, నాలుగు పెద్ద ముక్కలు చేసి ,అందులో పడేస్తే చాలు ,చక చక, చిన్న చిన్న ముక్కల్లగా చేసి పడేస్తుంది.
ఇది మటుకు ,చాల ఉపయోగం..అని  పది మంది ని విచారించి, లోచించి,తీర్మానించి,   అందరూ మన లాంటి వాళ్ళే, కొనేసాను..భయం భయం గానే..
ఈ సారి, మంచి బేరమే..చాలా బాగా పని చేస్తోంది..ఉదయమే, పెసరట్లు పెట్టుకుని, ఆఖరున ఉల్లి పాయలు కోసే కార్యక్రమం పెట్టుకున్నా ..తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు ..అని ఊరికే అన లేదు పెద్దలు.
కరెంట్ కట్..కరెంట్ ఉంటే గాని పని చేయదు మరి. మన అంజలి కట్టర్ ,ఎప్పుడూ ఇలా చేయివ్వదు..అని మళ్లీ మన చేతి వాటం..అంటే ఇంకో అర్ధం లో..పైగా ఒక్క ఉల్లి పాయ ,ఒక నిముషం లో కోసి పడేసినా, ఆ పరికరం కడగడానికి అయిదు నిముషాలు పైగా పడుతుంది అని స్వయం గా పరిశీలించి ,తెలుసు కున్నాను..దాంట్లో ఉండే పదునయిన స్టీల్ బ్లేడ్ ని కూడా కడగ బోయి,మళ్లీ  మామూలే  వేళ్ళు కట్..
సరే ,ఉందిగా మన అటక ఇలాంటి వాటికే..క్షేమం గా కథ కంచి కి చేరినట్టు,అది కూడా తన గూడు చేరింది.
ఇంకా తోడుతూంటే ,జ్ఞాపకాలు ఊరినట్టు ,సామాన్లు అలా బయట పడుతూనే ఉన్నాయి.
కాఫీ చిక్కగా రావడానికి ఒక నాలుగు రకాల సైజుల ఫిల్టర్లు, ఇప్పుడు వాడేది,ఒక్కటి, కుక్కర్ గిన్నెలు దొంతర ఒకటో రెండో, ఇంకా స్టీలు గిన్నెలు ఎన్ని రకాలో, పోపు మూకుడు బుల్లి సైజు తో మొదలు, ఓ పది మంది కి సరిపడా ఓ పెద్ద మూకుడు వరకూ, అర డజను రకాలు, అలా దిగులు గా చూస్తూ మమ్మల్ని ఎప్పుడు వాడతావమ్మా?అంటూ..
ఇంకా చపాతీలు కాల్చడానికి ,కొన్న నాన్ స్టిక్ పెనాలు, స్టిక్ పేనాలు గా మారిపోయినవి ఉన్నాయి..మన వీర జవాన్లకి ,డాలు లాగా పనికి వస్తాయేమో అడగాలి..ఎలాగో ఒక లాగ ఉపయోగించడమే కదా నేటి మేటి సందేశం...అబ్బే..మా ఇంట్లో ఆ అవసరం లేదు లెండి, నిజం..మనది గాంధి గిరి, అహింసా వాదమే, మా సిద్ధాంతం.
మూతలు లేని సీసాలు, ఎప్పటికయినా వాటిలో మొక్కలు పెంచేసి, మా ఇల్లు బృందావనం చేసేయాలని నాకు ఒక రహస్య కోరిక..బయటకి చెపితే, అది ఒక జోక్ అయిపోతుంది.
నేను వనం, పూల వనం అంటూ పాటలు రాయగలను కాని, ఒక చెంబుడు నీళ్ళు పోయలేనంత బద్ధకం ..నాకు ..అని ఇంట్లో అందరికి అనుభవమే మరి, అందుకే కొన్ని రోజులు ఎడారిలో పెరిగే ముళ్ళ మొక్కలు పెంచుతాను అని ముచ్చట పడ్డాను, కాని, ఎవరో,అరిష్టం అంటూ భయ పెట్టేరు..ఆ మొక్కల కే..
ఈనాడు పేపర్ లో ఒక మూల ఫుడ్ ప్రాస్ సర్ ఫర్ సేల్ అని ఉంటె, పని లేని నేను వెళ్లి ,చాల ఊహల తో కొనుక్కుని వచ్చెను..అది మరీ .ముందు.అంటే చపాతీ పిండి కలపడం ఎలా? అన్న దగ్గరే, ఒక అరగంట ఆలోచించే రోజులప్పుడు .ఆ పరికరం తో యిట్టె కలిపేయవచ్చు చపాతీ పిండి అని ఏవేవో ఆశలు పెట్టి కొనిపించేరు.
ఈ లోపలే, నాకు చటుక్కున ఒక రోజు, సైకెల్ తొక్కడం ఎలా వస్తుందో, ఒక్క క్షణం లో ఆ బాలన్సు తెలిసి పోతుంది అలా ,ఒక రోజు, గోధుమ పిండి లో, నీళ్ళు పోసి కలిపితే ,అలా కలుపుతూ ఉంటె, పిండి రెడి అని ఒక సుముహుర్తాన తెలిసి పోయింది ఇంకా ఈ దెయ్యం లాంటి , చాల పెద్దది, లాప్ టాప్ రాక ముందు డెస్క్ టాప్ అంత పెద్దది, వంటింటి గట్టు మీద దీనికి జాగా ఏది? అన్న వంక తో, అట్ట పెట్టె తో సహా ,అటక ఎక్కి కూర్చుంది..
ఇలాంటి అట్ట పెట్టే ..ఇంకోటి..ఇది మటుకు నా తప్పు లేదు..
ఇలాగే ఈ నాడు పేపర్ లో చదివే, కేక్ లు ,పిజ్జాలు ,పిల్లలికి ఇంట్లో నే చేసి పెట్టేద్దాం అని ఒక మంచి ఊహ తో, వెళ్లి బేకింగ్  తరగతి లో చేరి మరి ,నేర్చుకున్నాను ..
ఒక సారి చేసేను..కూడా..ఇంట్లో ఉంటె ఎంత సుఖమో అని ఊహించి మరి కొనేసాను, ఒక పరికరం..దాంట్లో బేకింగ్, ఇంకా ఏవో గ్రిల్లింగ్ అవి కూడా చేయవచ్చుట..
ఈ లోపల హాట్ బ్రేడ్స్ అంటూ ఒక బేకరి ,తెరిచేసారు..అమ్మా..నువ్వు కష్ట పడకు అనేసారు పిల్లాలు..
సరే అని..పెట్టె తో సహా చేరింది ..ఈ అటక మీదే..
ఇదిగో, ఎప్పటికయినా మళ్లీ ,మా ఇంట్లో చిన్న పిల్లలు రాక పోతారా? అని ఒక కోరిక ..వాళ్లకి చేసి పెడదాం ..అని..
ఇంకా అటక సగమే అయింది.అమ్మో, నీరసం వస్తోంది..ఇంకా ఎప్పటివో..చాల వస్తువులే కూడాయి, ఇవేమయినా పిల్లలు పెడుతున్నాయా? ఏమిటి? అలాగుంది..ఇంత సంత..వసంతా..నీ పని అంతే .
మొదలు పెట్టెను పడేయాలి..కాని, ఏమిటో మొహం..ఈ పనికి రాని,పని చేయని వస్తువుల మీద కూడా ఇంత మోజు ఏమిటో? ఇవి నావి ,నా సొంతం..అని ఒక అధికారం..ఒక బలహీనత ..
ఆరు నెలలు వాడక పోతే, ఇంకా అది పనికి రాదు అని పడేయాలి ట ..అదీ రూల్ ..హోం రూల్..స్వీట్ హోమ రూల్..
లాప్ టాప్ లో కూడా ఈ సౌలభ్యం ఉంది, మనకి పనికి రానివి తీసుకు వెళ్ళి ,ఒక్క క్లిక్ తో ట్రాష్ బిన్ లో పడేయ వచ్చు..కాని, ఉంది ఒక మెలిక..మళ్లీ ,ఎప్పుడో ఒక రోజు, నాలిక్కర్చుకుని ,మనకి కావలి అంటే..బయటకి తీయవచ్చు..
చూసారా? మన మానవుల బలాలు, బలహీనతలు తెలిసిన వాళ్ళు కనుకే, ఈ ట్రాష్ బిన్..మళ్లీ  బయటకి తీయడం..అన్న సౌలభ్యం కలిపించేరు.
ఈ వంటిట్లో ,నిచ్చెన ఎక్కి ,నిల్చుని ,నిల్చుని నాకూ జ్ఞానోదయం అయింది..
నాకు అక్కర్లేని ,నచ్చని ,మనసు ని నొచ్చే విషయాలు, జ్ఞాపకాలు ,నేను ఎక్కడ దాస్తున్నాను..నా ఓటములు, నా  రహస్య ప్రేమలు..అందరికీ ఉంటా యి, బయటకి చెప్పలేనివి, ఒప్పుకోండి ...బాధపెట్టే  మాటలు, నేను మరొకరిని బాధించి బాధపడిన ఘటనలు, ఎక్కడ దాస్తున్నాను?
ఏ అటక మీద? ఏ మనసు అరల లో? చిన్న మెదడు లోనా? పెద్ద మెదడు లోనా?? ఎక్కడ దాస్తున్నాను..
మరి ఎందుకీ అవస్థ ? హాయిగా ఆదివారం టీ .వి. లో జెమిని సినిమా ఓ,మా సినిమా ఓ ఉంటుంది గా..సరే మరి దిగిపోతాను..
ఈ అటక లు సద్డడం ..ఎప్పుడూ ఏదో మనసు ని భారం చేస్తుంది..
అని నాకు నేనే సద్దుకుని ...మనసు ని సద్ది పుచ్చుకున్నాను..
చివరి మాట..మా ఇంట్లో ఈ నాడు పేపర్ మాన్పించేసారు....









4 సెప్టెం, 2012

మహా ప్రస్థానం అను..ఓ సాయంత్రం నడక కథ.

సాయంత్రం అయిదయింది, ఆకాశం లో మబ్బులు చెల్లాచెదురుగా బడి వదిలాక ,ఎర్రగా కంది పోయి అలసిన మొహాలతో వెళ్ళే పిల్లల్లా పారిపోతున్నాయి.సూర్యుడు కూడా ఇంటికి వెళ్ళే తొందరలో ఆకాశం నిండా రకరకాల రంగులు పరుస్తునాడు. ఏ రంగో మరిచి పోయినట్టు.
ఇలాంటి అందమయిన సాయంకాలం లో బరువయిన ' పవర్ ' బూట్లు బిగించి, నడుంకట్టి బయలు దేరాను. నా సాయంకాలం విహరమనే evening walk కి .అలవాటయిన దారి, అలవాటు అయిన నడక, ఈ అలవాటుకే ఎన్నో ఆటంకాలు.
పరిచయమయిన మొహాలు చిన్నగా నవ్వుతున్నట్టు పెదిమలు సాగదీసి, పలకని హలో లు చెపుతున్నారు.కుక్క పిల్లలు  నడిపిస్తూంటే ! కొందరు, పసిపిల్లల పరుగులు వెనక నడుస్తూ కొందరు ,రకరకాల వాళ్ళు, వాళ్ళ మధ్యలో నేనూ, అడుగులు పడుతున్నాయి,కదం తోక్కుతున్నట్టు.
నా కోసమా? తన కోసమా? నా కోసమా? తన కోసమా?? రైలు  చక్రం రిథమిక్ పాట లాగ, ఇదే ప్రశ్నవెంటాడుతూ ఉంటుంది. ఎవరికోసం అయితేనేమి ,ఈ నడక కి గమ్యం లేదు కదా..అలిసేంత వరకూ నడక, తిరిగి వెనక్కి అదే దారిలో అడుగులు కొలవడం.
అదిగో, ముసలి కంపు ని యిలా గాలిలోకి వదిలేసి, యవ్వన పరిమళం తో వెనక్కి వెళ్ళాలని ఉవ్విల్లోరే అరవై దాటిన సమూహం..గుంపు, బట్ట తలలు, చేతి కర్రలు , కళ్ళజోళ్ళు, వాళ్ళ ఆభరణాలు.
వాజపాయ్ బాంబు  పేల్చాడండి!
పాకిస్తాన్ తో యుద్ధం తప్పదు!
ధరలేమిటి ఇలా మండి పోతున్నాయి,
ఈ అయిదవ పే కమీషన్ రావాలండి,
వస్తేనా?? 
మా అబ్బాయి ,కోడలు అమెరిక లో ఉద్యోగస్తులు. మనవడిని చూడాలని ఉంది, మా వంట మనిషి సెలవు పెట్టింది,
మా డ్రైవర్ కి రోగం..
మా ఇంటవిడికి బి పీ..హుమ్మ్ 
ఇవేం ఎండలండి బాబూ, అదే మా బెజవాడ ఎండ లయితేనా ?
ఈ విసాపట్నం లో జనం ఏం సుకుమారు లండి, 
వెన్నెల కూడా  వేడే వీళ్ళకి,
ఇదే మా ఊర్లో అయితేనా !!
ఇదే నే వెళ్ళిన అమెరికా  లో అయితే ఊస్తింగ్ ,కారణాలు చెప్పరు.
inefficiency ని ఒప్పుకోరుట(tolerate) చేయరుటండి ,అక్కడ రోడ్డు  పడుకోవచ్చుట ,అక్కడ గాలి, అక్కడ నీళ్ళు  ఇలా అనంతంగా సాగిపోతూంటాయి ..వీళ్ళ కబుర్లు.
ఈ కబుర్ల కోసమే, ఎంత దూరమయినా , ఎంత ఓపిక లేకపోయినా వస్తారు కాబోలు .అదో ప్రపంచం..ఆ ప్రపంచం లోకి వెళ్ళాలంటే,
వెళుతున్నాను..నేనూ వెళుతున్నాను, ఇంకొక్క ఇరవై, ఇరవై యా ? ఇరవై ఏనా?? మనసులో కూడా నిజం వయసు దాచుకుని తగ్గించు కోవడమే..హ్మం..ఎందుకో ఈ భయం..వయసు అంటే..
ముందుకు, ముందుకు పడుతున్నాయి అడుగులు, జోరుగా,హుషారుగా అనే అడుగులు. రిథమిక్ గా ,లయ తో ,మనసులో ఏదో  ఊపు,వస్తోంది..
వయసు తగ్గిపోతోంది సంవత్సరాలు వెనక్కి ,వెనక్కి వెళ్ళిపోయి ,అరే,ఎవరీమె ? నేను లా లేనే? సరే గుర్తు పట్టనట్టు నటిస్తే ఎలా?
నేనే ,నేనే!! అడుగులు ముందుకు పడుతున్నాయి, మనసెందుకు ఇలా వెనక్కి లాగుతుంది. గతం గతః తగం తప్ప ఏముంది? తవ్వుకోడానికి ? తవ్వొద్దు, ఇదిగో గోతులు .
బీచ్ రోడ్ లో గోతులు, జాగ్రత్తలు నేర్పడానికి జీవితం లో - ఒకసారి ,ఈ రోడ్డు మీద నడిపిస్తే సరి, గోతులుంటాయి  జాగ్రత్త. పడి పోతే లేవనెత్తే వారుంటారా?ఉండరా? ఉంటే వాళ్ళే మనకి బంధువులు, మిత్రులు నవ్వే వాళ్ళంతా శత్రువులు ..సిమ్పెల్ ..సులభమయిన లిట్ముస్ టెస్ట్.
సుమతి శతకం లో ఎప్పుడో చెప్పారు.
అబ్బా..యవ్వనంలోకి నిజం గా తొయ్యబద్డానా ! గుప్పున సన్నజాజుల పరిమళం తలనిండా పువ్వులే,ఉక్కిరిబిక్కిరిగా లేత ఘాటు సన్నజాజి పరిమళం, విరజాజులా?ఏవో జాజులు ..గట్టిగా వాసన పీల్చాను.
దాటుతున్నాను..చీకటిలో ఆడో ,మగో ,ఎవరో తెలియకుండా కలిసిపోతున్నారు.ఒకే ఆకారం గా గుసగుసలతో, అప్పుడే చీకటి పడుతోందా?
అబ్బే,గుసగుసలు కావు, వేగిన శేనక్కయాల వాసన,గుటుకు మని ,టక్ ,తక మని చప్పుడు చేసుకుంటూ తింటున్నారు ఇద్దరూ..
అందమయిన సాయంకాలం బీచ్ గట్టు మీద ,సన్నజాజులు తలలో పూయిన్చుకుని ,ఊహల స్వీట్ నథిన్గ్స్ నెమరు వేసుకోకుండా యిలా ,శెనగలు పంచుకుంటున్నారు..విరుచుకుంటూ, తింటున్నారు..
పక్కనే,మొక్క జొన్నలు అమ్మే చిన్నది, బాబు గారూ కారం రాయాలా?అనడగుతోంది. అనంతం గా అలుపు లేకుండా వచ్చి పడి ,విరిగి ,వెనక్కి వెళ్ళే ఆ అలల సౌందర్యానికి ,శరీరమంతా వెనక్కి తిప్పి కూర్చుని ,కారం రాసుకుని మొక్క జొన్న పొత్తులు తింటున్నారు.
పిల్లలు కనిపించగానే ,టంగ్ టంగ్ మని గంటలాడిస్తూ ఐసు క్రీమ్ హాయ్ టెక్ బండి వాడు,అందులోనే రెండు రకాల బళ్ళు ..
గోప్పోల్లకి ఒకటి, పేదోల్లకి ఒకటి.
రెండ్రూపాయల ఐసు ఫ్రూటు తింటున్నావా?హు..నీ అంతస్తు కి తగ్గదే..
పది హేడున్నర పెట్టి ,ఇంకో పుల్ల అయిసుక్రీం తింటున్నావా? హబ్బా గొప్పోడివే ,బాగా డబ్బులున్న వాళ్ళే ఇలాంటివి కొనగలరు, తినగలరు..
సింపెల్ యింకో లిట్మాస్ టెస్ట్ !గొప్పవాళ్ళ నుండి ,పేద వాళ్ళని విభజించడానికి యిదో తెలివయిన ,తేలికయిన పరీక్ష.
అంతా మేడీజీ ! మూడు రకాల ట అసలు.అందులో త్రిశంకు స్వర్గం లో ఇంకో క్లాసు ఉంది కదా ,అదే  మధ్య తరగతి.
ఏది తినడం?రెంరూపాయలదా ?పదిహేడు న్నరదా? ఆలోచించి, తేల్చు కోలేక ,ఇంకా ముందుకు పదండి రా యింకా మంచివి ఉంటాయి అక్కడ -అని తోస్తారు తండ్రులు ,తరువాత మర్చిపోతారు అన్న ఆశ తో.
సరే ,నేను ఏ రకమో ,కొంచం ఎగబారిన మధ్య ఎగువ తరగతా? ఏమో? ఈ బరువు ,ఈ నడకలు చూస్తే ఎగువ తరగతే నేమో?
ఏమీ పని లేక ,బోలెడు డబ్బుంటేనే కదా యిలా వాకింగ్ లు అవి చేస్తారు ,కరిగించుకోడానికి ,అదే కొవ్వు ..
అబ్బ ఏం మాటలు ..ఎందుకిలా నిన్ను నువ్వు హింసించుకుంటావు.సరే ,పద..ఇదిగో వచ్చాం..ఈ నాలుగు రోడ్లకూడలి.ఇటా ?అటా ?లెఫ్టా?రైట్ ఆ ?మధ్యలో ఉన్న ఈ అప్ ఎక్కడమా?మధ్యే మార్గం..ఎప్పుడో ఉన్నదే..
ఈ సింహాచలం కొండ లాంటి అప్ ఎక్కాలి..ఎక్కితే ఆ టీ వి టవర్ కనిపిస్తుంది . అదే మా ఇంటి వేలుపు అనుకుని ,మొక్కి వెనక్కి మళ్లీ డౌన్ దిగాలి .అప్పటికి ఎన్ని కాలరీలు ఖర్చు అవుతాయో?
పొద్దున్నే తాగిన కాఫీ లో పంచదార ఇచ్చినంత కాలరీలు.
అదిగో ,పాండురంగడి గుడి .సముద్రం లోంచి రోజూ పుట్టే సూర్యుడి కి దేవుడి దర్శనం లేకుండా ఈ పిచ్చుక గూళ్ళ భవనాలు ఆటంకం.
ఆయన మొహం మీదే బట్టలు కూడా ఆరేసారు దండాల మీద..
దాటిపోయాను  అడుగులు బరువుగా పడుతున్నాయి. ఎక్కుతున్నాను ,ఎక్కుతున్నాను పైకి ఎక్కుతున్నాను ఎంత పైకి వెళితే ,అంత క్రిందకి దిగిపోతాను ..ఇదేమయినా న్యూటన్ సిద్ధాంతమా? కాదు.. వక్రీకరణ ..
చిన్నప్పుడు చదివిన ఫిసిక్స్ ,వాటి జోలికి వెళ్ళకు ..ఎవరో తలకి మాసిన వాళ్ళు, కుళ్ళు బుద్ధి వాళ్ళు అంటారు.గొప్ప వాళ్ళని చూసి.మనలని గురించి కాదులే. కానీ,నేను ఎలాగా క్రిందకి దిగక తప్పాదు.ఎక్కలేను యింకా ,యింకా పైకి ఎక్కలేను. ఆయాసం ఇందులో ఏవయినా డబెల్ ఆర్ ట్రిబెల్ మీనింగ్ ఉందా?
ఛా ,దేవుడి గుడి ఎదురుగా ఏంటి!చెత్త అంతా ,ఒక్క క్షణం భక్తి తో కళ్ళు మూసుకో ,వేడుకో ,ప్రార్ధించు మొక్కు,తల దించు.
క్షణం లో వెయ్యో వంతు కూడా నేను ప్రార్ధించ లేను .నా తల లో దీపం చుట్టూ తిరిగే లక్షలాది పురుగుల్లా ఏవేవో ఆలోచనలు.వాటిల్లో భక్తి, దేవుడు లేనే లేడు .లేకుండా ఎలా తల ఒంచను?ఎలా మొక్కను? ఎలా వేడుకోవడం?
పెదవులు పలికితే చాలునా,మనసు లో నుండి పుట్టాలి కదా ,హిమాలయాల్లో ,కొండల్లో పుట్టే ఊట లాగే ,ఈ రాయి లోంచి కూడా ఎప్పుడో పుడుతుందేమో - ఆ క్షణం వరకు ఇలాగే  ,తల వంచకుండానే ,దొంగ చూపులు చూస్తూ దేవుడి వేపు వెళ్లి పోతాను.
గుడి దాటాను.బడి వస్తుందా? లేదు బ్యాంకు వచ్చింది.గుడి -చందాలు ,అవి దాచు కోడానికి బ్యాంకు అబ్బా ! ఎంత చక్కగా కుదిరింది, ఇంకా పైకి!వరసల్లో ఎవరో పేర్చినట్టు రక రకాల సైజు లలో ,రంగుల్లో కారులు .కారులు మేలా నా? కాదు ,కాదు, ఇక్కడే అయ్యేయాస్ ఆఫీసర్ ఇల్లు -ప్రక్కనే ,అదీ సంగతి.
యింకా ,ఇంకా పైకి..అడ్డ రోడ్డులు వస్తున్నాయి..వెనక్కి తిరగమని ఆహ్వానిస్తున్నాయి. ఎంత ఆయాసం వచ్చినా సరే,యింకా పైకే వెళతాను.ఆ టీ వి టవర్ దర్శనం చేసుకు తీరుతాను. తిరుపతి కొండకి భక్తులు నడిచి వెళ్ళ్రూ, అలాగే ..పట్టుదల,పంతం..
అబ్బా నేనేనా?ఎంత ధీరత్వం ,ఎంత చక్కని వ్యక్తిత్వం,పంతం పట్టిన వసంత ఎంత బాగుందో టైటిల్ ,సరే, ఏమిటా పిచ్చి వాగుడు? పద పద..
చీకటి ఒక్కసారి మూసేసింది.అజ్ఞానం లాగ..పాత సిమిలి మార్చాలి ,అంతా మార్చాలి ,విద్యా వ్యవస్థ మార్చాలి ! ఈ వ్యవస్థే మార్చాలి ,అంత మారాలి ,తల్ల కిందులై పోవాలి ,లేదా సరి సమానం అయిపోవాలి ,దున్నేయాలి నరికేయాలి పంచేయాలి ,రాజ్య మేలాలి ..
ఎప్పుడో విన్న గొంతుకలు ,నూతి లోంచి ,మనసు నూతి లోంచి,ఇంకా యీ మూల్గులు ఏమిటి?ఎప్పుడో గట్టిగా చెప్పుతో కొట్టి చంపేసాను కదా,తేలు ని చంపినట్టు ,యివి ఉత్త నీడల్లాంటి అరుపులు.యివి ఏం ప్రాణం లేని అరుపులే ,ఊరుకుంటే అవే చచ్చి పోతాయి ,వాటి మానాన అవే అరచి ,అరచి చచ్చినట్టు చచ్చురుకుంటాయి.
ఛ ! ఏంటో సాయంకాలం హుషారు లేదేంటి?యింకేం హుషారు ,చమటలు కారి జారుతోంది.చమటలు పట్టయా? హమ్మయ్య ఫలితం దక్కినట్టే.చీకట్లో ఏదో క్లబ్ ,కారులే తప్ప మనుషుల అలజడి లేదు. గుమ్మం దగ్గర ఏవో నీడలు, చిన్నగా మిణుగురుల్లా ఏంటా నిప్పులు.భయమా? నాకేం భయం.నాకా! భయమా!
ఇంకొంచం అప్ ఎక్కాలి.అమ్మయ్య వచ్చేస్తున్నాను ,దగ్గర కి వెళ్ళాను. డ్రైవర్ల బీడీ ల వెలుగులే ఆ మిణుగుర్లు.అమ్మయ్య,ఎంటో ఈ నిర్జన కాలని మనుషులే కనిపించరు.పద .పద..
యింక వెనక్కి తిరుగు.ఇదుగో ,ఇదిగిదుగో ...మలుపు ..ఆ మలుపు దగ్గరే ఎత్తుగా ,నిటారుగా ,గుడి గోపురం లాగ హై టెక్ బాబు గుడి లాగ టీ వి టవర్ ..హమ్మయ్య ,దగ్గరగా దర్శనం అయింది.ఇంక పద ,వెనక్కి ..వెనక్కా?ఎందుకంత వ్యంగ్యం ..వెనక్కా !! వెనక వెనక వెనక్కే,పద.
జర్రున అడుగులు జారిపోతున్నాయి.అంతా పల్లమే,నిజము పల్లెమెరుగు ..మధ్యలో ఏదో ఉందిలే..నేను ఎప్పుడూ నిజమే చెప్తాను.పల్లం లోకే వెళతాను.సిల్లీ ,వెరీ సిల్లీ ,యూ ఆర్ సిల్లీ ,ప్రెట్టి సిల్లీ ! యిదేమిటిలా అరిగిపోయిన రికార్డు లాగ ,ఊరికే ఆ పదం అలా నోట్లో నానుతూంటే  'పోలో'తింటున్నట్టు తిమ్మిరిగా బాగుంది.
వదుల్తుందిలే తిమ్మిరి..పద పద..యింటికి వెళ్ళాలి, చీకటి పడింది.మూడు బెడ్రూముల ఒంటరి ఫ్లాట్ లోకి వెళ్ళాలి పద,పద!దప, దప !!తప, తప..!!!అరే చాల దూరం వచ్చేసాను.ఎంత బాగుందో!యిలా ఎక్కడం,యిలా దిగిపోవడం..రోజూ యిలాగే ఎక్కాలి..ఈ విసాపట్నం ఉన్న అప్పులన్నీ ఎక్కాలి ..
ఆశీలుమెట్ట అప్పు,(డౌను ), సిరిపురం అప్పు (డౌను),కలెక్టరాఫీసు అప్పు (డౌను),రామ కృష్ణ మిషను అప్పు (డౌను),రామ్ నగర్ అప్పు (డౌను),అబ్బ ఎన్ని అప్పులో ?చక చక ఎక్కేస్తాను,చక చక దిగిపోతాను ,అప్పుడు ఎంచక్కా తయారు అవుతాను ,సన్నగా ,రివట లాగ, ఎవరూ పోల్చుకోలేనంతగా !!
ఎవరూ? నువ్వేనా !! అని అందరూ హస్చర్య పోతారు.అమ్మయ్య..కాళ్ళు ,పాదాలు ఉండి ,ఉండి యిలా చేక్కల్లా అయిపోతాయి ,పోట్లు, నా శరీరం బరువు కి తగ్గట్టు ,నా పాదాలు పాపం వెడల్పుగా పెరగ లేదు.
ప్రేస్సుర్ డెఫినిషన్ గుర్తుంది కదా..అంతా ఏరియా మీదే ఉంది.బరువు సమంగా సర్దుకుంటే బరువే ఉండదు.ఈ సన్నని పాదాలే పెరిగి అడ్డం గా..అబ్బ ఊరుకున్డూ !!వచ్చి రాని ఫిసిక్స్ చెప్పకు, ముందు నడువ్..
అబ్బ !అందమయిన సాయంత్రం ముదిరి రాత్రి అయిపొయింది.యింత వేగంగానా? శీతాకాలపు పొద్దు ,అబ్బ యింక మాట్లాడకు పద ,పద..
ఏరీ ,జనం అంతా ఏరీ ?యింకెక్కడ యింటికి వెళ్లి భోజనాలు గట్రా చేస్తారు, టీ వి ముందు కూర్చుని నీ పిల్లలు,బాబోయ్ పిల్లలు, ఇల్లు, భోజనాలు ,చదువు,నిద్రలు ఎన్ని పనులో ,పద..ఏమిటి ఈ పెళ్లి నడకలు..
సన్నజాజుల వాళ్ళ స్థానం లో రవుడి వెధవలు కూర్చున్నారు..ఏమిటో ఎలా తెలుసు నీకు? నాకు తెలుసు అంతే..ఆంటీ, ఆంటీ !!అని ఈలలు వేస్తున్నారు.పోనీ లెద్దు ,చిన్న పిల్లలు ,(ఏదో గుర్తింపు) వాళ్ళతో నాకేమిటి? అదిగో దూరం గా లైట్లు కనిపిస్తున్నాయి.
వందల మందే  ఉంటారు ,ఆ పిచ్చిక గూళ్ళలో ,అయినా అదేమిటో సందడే ఉండదు. మవునం గా మాట్లాడ్డం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లాగ ఉంటారు.ప్రక్క ఫ్లాట్ లో ఎవరో? మనకెందుకు? మౌనం ..ఏ భాష మరి.ఇరుగు ఫ్లాట్ లో బాబోయ్ ఎవరో? ఒక్క అంతస్తు ఎక్కువ సీఎల్లో కారు .వద్దు, మనకి పొత్తు పంతం ..వాళ్ళతో మౌనం ..మౌనం .మౌనం..రాజ్యమేలుతూ ఉంటుంది.
ఏం రాజ్యమో, ఎమో దగ్గర కొచ్చేస్తున్నాను..మా ఇంటికి..
కాల్చిన చేపలు, వండిన చికను, వండని కుళ్ళు కూరగాయల వాసన,అబ్బ ఎలా తింటారో? లొట్ట లేసుకుంటూ నువ్వు తిన్నట్టే ,మర్చి పోకు,క్రిందటి శనివారం అబ్బ..వద్దులే..గతం ,గతః పద,పద..దప దప ! అడుగులు ఎంత లయ గా పడుతున్నాయి.
ఆవేశం ,ఉద్రేకం, ఉరుకులు, పరుగులు, ఓ లయ ఉంది, ఓ చైతన్యం ఉంది..ఓ ,ఓ ఓ!!
అబ్బ ..పడి పోయాను, కాలు జారాను..చీకట్లో గోతి లో కాలు వేసి ,మడత పడి పడిపోయాను.చెయ్యి లేఫ్తూ, చెయ్యి రైటూ ,రెండూ బాగానే ఉన్నాయి.దూరం గా మనుషులు కనిపిస్తున్నారు. ఎవరూ రాలేదు.
చెయ్యి అందించలేదు. చెయ్యి అందించే వాళ్ళం దరిని పోగుట్టుకున్నావు..చెయ్యి అందించే వాళ్ళు దూరం లో ఉన్నారు.చెయ్యి అందించే వాళ్ళు రాలేరు. చెయ్యి అందించే వాళ్ళు పనిలో ఉన్నారు.వేరే పని లో ఉన్నారు. వాళ్ళ కిదే పనా?
నీకు మిత్రులు లేరు, శత్రువులు లేరు, ఎవరూ లేరు, నీ ఉనికే ఓ అసత్యం ..కాదు..నిజం కాదు..కాలు మండుతోంది ,లే ,లే,లే మరి..నీకు నువ్వే లేవాలి..నీకు నువ్వే లే, నీకు నువ్వే లే..అదే నిజం..
27 october 1998..లో  రాసిన   నా లో నేను ..చైతన్య స్రవంతి అనే స్టైల్ లో రాసేను ..అని అనుకున్నాను..అన్ని,ఆ రోజు నా మనసులో మాటలే..ఇలా ..