"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

18 డిసెం, 2013

అరకు లోయ

అరకు లోయలో కూలిన శిఖరమ్.. 
అనంత గిరి లో పండిన కాఫీ బెర్రీలు 
సువిశాలమయిన మైదానాలు 
ఇక చాలు లెమ్మని ,భూమి 
పైకి లేచి, తూర్పు కనుమలు గా 
విస్తరించింది, అరకు ఆ కొండల లో 
పూసిన ఓ అడవి పువ్వు. 

అలుపెరగని కొండ దారులు 
మెలికలు తిరిగే నది కి పోటి యా ?
ఏ మలుపులో  ఏ అందం కి 
మూర్చపోతామో , జాగ్రత్త .. 
ఒక కోణం లో అడవి దట్టం గా 
సూర్యుడి వెలుగు కి చెక్ చెపుతూ 
మరో కోణం, మరో కొండ దాటి మరో 
మలుపు తిరిగితే పచ్చగా పరుచుకున్న 
ఏటవాలు వ్యవసాయం, 
కొప్పున ఒక అడవి పువ్వు, 
చుట్టూ కట్టిన ఒకే చెంగావి చీర 
మెరిసే కళ్ళు, స్వచమైన గుండె 
ఆ అడవి కన్య మేకప్పు .. 
వీపు మీద  బరువు తో ,వడి వడి గా 
అడుగులు, మన వాహనం రొప్పుతూ .. 


కళ్ళు అందాలు చూసి చూసి ,చుట్టూ 
హృదయం విచ్చుకుంటుంది .. 
ఒళ్ళు తేలిపోతూ , అవును గాలి కొండ 
మీద ఆగి, కాసేపు మనమూ నిజం గా 
మేఘాల మధ్య తేలి పొవచ్చు. 
అప్పుడప్పుడు దయ తలిచి 
నాలుగు అక్షింతలు వేసే పెద్ద వాళ్ళ లాగా 
గబగబా నాలుగు వర్షం చినుకులో 
ఇంకా ఎక్కువ ప్రేమ మన మీద ఉంటె 
దబ దబ పెద్ద వర్షమో కురిసి, తడిపి 
జీవితం అంటే ఇదే, ఏ భయమూ, భక్తీ లేని 
పారవస్యం , ఏ ఆలోచన లేని 
నిశ్చింత ,ఆ కొండ మనకి ఒక 
నిశ్చల స్థితి కి తీసుకు వెళుతుంది ,,
ఇంకొంచం పైకి వెళితే , చుక్కలు 
అందుతాయేమో , ఇంకా పైకి వెళదాం 
అంటూ వెర్రి ఆవేశం, వెర్రి నమ్మకం .. 

అదే గాలి కొండ .. 
అరకు కి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల 
దూరం లో ఉంటుంది ఈ గాలి కొండ . 
అన్నిటికన్నా ఎత్తయిన కొండ ఇది 
అరకు కి వెళ్ళే దారిలో ... 


ఇంకా చాపరాయి.. 
ఘరులు గిరుల పై నించి ,
అమ్మా మేము ఆడుకుని వస్తాం అంటూ 
అల్లరి చిల్లర గా పరుగులు తీస్తూ ,ఉరకలు వేసే 
పిల్లల ఆట పాటలు గుర్తు చేస్తాయి ..
సర్రున జారే జారుడు బల్ల మీద పిల్లలు .
నీటి తో పాటూ ..జారుతూ ..
నేను ..అమ్మని ..నిశ్చలం గా ఒడ్డున 
నా లో పసితనం ఎప్పుడు అమ్మ తనం గా 
మారిందో ..ఏమో ....

అరకు ఎన్ని సార్లు వెళ్ళామో ..
మొట్ట మొదటి సారి , నిష్పూచీ యవ్వనం లో ,
పరుగులు తీస్తూ ్వాన లో తడుస్తూ , కొండలని 
ఎక్కేయ గలం అనే అమేయమైన గుండెలు నిండా 
ధైర్యం అప్పుడు ..పాటలు ..మాటలు ..పాటలు ..
అన్ని కలగలిపి .ఒక సంగీతం నిండింది మాలో 
ఇప్పుడు జీవన సంగీతం కదా ..అది మాలో .. 

ఒకటా రెండా ..ఎన్నో ఎన్నెన్నొ ..
జడి వాన లో కురుస్తున్నాయి . 
వాన వెలిసాక మరి కొన్ని ..











12 నవం, 2013

సైట్ థిరెసా హై స్కూలు

ఏలూరు విజ విహార్ సెంటెర్ తెలియని వారెవరు ? ఇప్పుడుందో ,లేదో ,మరి .విజా విహార్ లో మినపట్టు మా 

ఇంట్లో అందరికీ ..భలే ఇష్టం..చుట్టాలు వస్తే , ఇంటిల్లిపాదికీ ఒక రోజు ,విజా విహార్ లో మినపట్టు తినిపించడం 

మా ఇంటి ఆనవాయితీ అయిపోయింది ..

ఒక పక్క అశొక్ నగర్ రోడ్డు ,మరో ప్రక్కా ఇంకం టాక్స్ ఆఫీసు రోడ్డు , తిన్నగా రా రా పేట ( రామచంద్ర 


రావు పేట ) కి దారి తీస్తున్న జంక్షం లో మరో నాలుగో వైపు దారి తీస్తే ,ఒక దరి ప్రభుత్వ ఆసుపత్రి , మరీ అంత 

గొప్ప ,ఘన చరిత్ర లేదు లెండి ..


ఆ ఆసుపత్రి ఎదురుగా మా స్కూలు ..సైట్ థిరెసా హై స్కూలు ...ఆడపిల్లల బడి ..


ఆరో తరగతి మొదలు ..డిగ్రీ వరకూ అక్కడే ..అంటే షుమారు పదేళ్ళు నా జీవితం లో గడిచిన ప్రదేశం అది 

..చదువు ,బుద్దులు , స్నేహాలు , ఆరాధనలు , ఆరాటాలు ,నేర్పించిన బడి అది ..


సిమెంటు రంగు భవనాలు , మూడు వైపులా ,మూడు అంతస్తుల భవనాలు , పెద్ద గోడ , బడి ఆవరణ చుట్టూ , 

విశలమైన మైదానం ,దారి కిరు వైపులా గానుగ చెట్లు ,ఆ పూలు నేల మీద రాలితే ,అవి నేల కనిపించనత దట్టం 

గా పూల తివాసీ పరిచేవి ..

ఆ పూలు ని చేతులతో మలుస్తూ ..బడి మధ్య లో ఇచ్చే ఇంటెర్వల్ లో ..పేర్లు రాసుకోవడం ఒక జ్నాపకం ..


ఇంకా నాలుగు గడులు మట్టి లో గీసుకుని ఉప్పు ఆట ఆడ్డం మరో బాల్య స్మృతి ..

అందరి కన్నా ముందు గేట్లు తెరిచే సమయానికి ఉండి, గేట్లు తెరిపించి , నల్ల బోర్డు మీద ' థాట్ ఫర్ టుడే 'అని 

ఒక మంచి మాట ఏదైనా వ్రాయడం నాదే బాధ్యత ..ముందు అందుకే వెళ్ళడం ..ఇండియం ఎక్ష్ప్రెస్స్ వార్తా పతిక ( 
దిన ) నుండి కాపి ..ఇప్పట్లొ దీనినే కాపి అండ్ పేస్ట్ అంటారు కదా ..

విమలా టీచర్ ..అనే తిట్లు పాటల్లా గా ..

దయ్యాలు ,పిశచాలు ..అంటూ శుభ్రమైన ఆంగ్ల భాష లో తిట్లు ..


ఫిష్ మార్కెట్ ..సరే సరి ...అది మామూలు పర్యాయ పదం మాకోసం ..

నిర్మలా టీచర్ ..ఇంగ్లిష్ టీచర్ ..' వెం ఐ వస్ డూయింగ్ మై బీ ఎడ్ ' తో మొదలు అయేవి ..ఆమె పా్ఠాలు ..

ఆవిడ అంటే నాకు ఆరాధన ..అప్పట్లో ..వీలు అయినప్పుడు అలా ..ఒక గులాబి పువ్వు ఇచ్చేదాన్ని ..

లీనా టీచర్ సైంస్ కి , గిరి వర రాజ కుమారి మాథ్స్ కి ..

అందరూ లీలగా కాదు ,కాదు ..బాగా గుర్తు ఉన్నారు ..

చాలా ఆప్యాయం గా , చూసుకుని ,చక్కని చదువు సంధ్యలు నేర్పించారు మాకు ..

నాగ మణి టీచర్, తెలుగు టీచర్ .. రాధామణి అన్నా నాకు ప్రత్యేక అభిమానం ..

ఆవిడే నన్ను ఈ బడిలొ వేసారు ..ఆరో తరగతి లో ..

కాంసెర్ అనే వ్యాధి అని తెలిసి , ఏది రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది అనే బాధ తో ..గుండె ఆగి 

పోయారు అని తెలిసిన రోజు ..ఎంత బాధ కలిగిందో ..

రాగయుక్తం గా పద్యం చదివి , ప్రతి పదార్ధం చెపితే ఆమె ..పది కి పది మర్కులు పడిపోతాయని ఇంక గారంటీ .. 

అంత గొప్ప టీచర్ ఆవిడ ..

సంగీతం మాస్టరు ,డాంసు మాస్టారు ..కోరాడ గారు .. అందరూ ..మాకు సంగీత నృత్యాలు చెప్పడానికి 

ప్రయత్నించేరు ...పార్వతి టీచర్ ..ఆవిడ మంచి నాట్యం నేర్పించేవారు ..

స్కూల్ ఫీస్ సమ్వ్త్సరానికి ..ముప్పై నలభై రూపాయలు ..అంతే ..



ఎనిమిదొ తరగతి లో మద్రాసు ,తిరుపతి , కి విజ్నాన యాత్ర కి తీసుకు వెళ్ళేరు .. ఒక ప్రైవేట్ బస్ ..రావల్సిన 

సమయం కంటే ...ఆలెసం గా రావడం ...తర్వాత ..మా పిల్లలల కల కలం ..హడావిడి . ఆ సరదా యత్ర అంతా 

ఇంకా గుర్తే నాకు ..

బడి అంటే ఉత్సాహం ...టీచర్లు అంటే భయ భక్తులు , ప్రేమ ,ఆరాధన ..

స్నేహితురాళ్ల తో మైత్రి , కబుర్ల కోలాహలం ..

అన్నీ వేడుక లా తోస్తున్నాయి ఇప్పుడు ..

మేము చదివన ఈ బడి ..ప్లాటినం జుబిలీ ..అంటే 75 ఏళ్ళ పండగ చేసుకుంటొం దిట ..వచ్చే నెల 7 న ..

నేను అక్కడ ఉంటే తప్పకుండా వెళ్ళి ఉండే దాన్ని ..

ఎందుకో మరి , ఇన్ని సార్లు ఏలూరు వెళ్ళినా ఎప్పుడూ మా స్కూల్ కి వెళ్ళ లేదు ..

అంతటి అనుబంధం ఉన్నా ..ఎందుకని మేము వెళ్ళ లేదు అని ఇప్పుడు అనిపిస్తోంది ..

అందరూ మారి పోయారు , మనలని గుర్తు పట్టే వారు లేరని ?? ఒక భావంం ఏమో ?

మా అత్తగారు కూడా ఇదే బడి లో మాథ్స్ టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు .. 

మా ఆడపడుచు నేను ..ఇదే బడి , ఇక్కడే మా స్నేహం కి ఆరంభం ..

చదువు ,సంస్కారం . విద్య బుద్దులు నేర్పిన మా బడి కి ..

అభినందనలు ..శుభాభినందనలు ..

పిల్లలు మారి పోతారు , టీచర్లు విశ్రిిస్తూ ఉంటారు ..

కానీ ..చదువు ని నేర్పే ఆ బడి ఆవరణ లో విద్యా కుసుమాలు మటుకు ఇంకా అలా వికసిస్తూనే ఉంటాయి ..


ఆ విద్య వనంం లో మరిని సుమాలు ,నిరంతరం ..తరంం తరం వికసించాలని 

మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ...వసంత లక్ష్మి .పి.

6 నవం, 2013

ఆక్రమించుకో నీ స్థానం ని ..

రెండు దేశాల మధ్య యుద్ధమా ??
పదండి ...స్త్రీలని అగౌరవ పరుచుదాం ..
రెండు జాతుల మధ్య పగలు ,ప్రతీకారాలా ??
అందరు కలిసి ఉమ్మడిగా ఇరు వేపులా మహిళలు ,పసి పిల్లలైనా సరే
వదొలుద్దు ..వివస్త్రలని చేసి...
రెండు మతాల మధ్య హోరా హోరీ
అగ్ని కీలలు రగిలాయా ??
మూల మూల దాక్కున్న ఆడ వారిని లాక్కు రండి ..
వారిని మగ ప్రతాపానికి బలి చేయండి ..మీసాలు మెలి తిప్పండి ..
స్త్రీలు ,పసి పిల్లలు ..
వీరే ..ప్రతి యుద్ధం , మత కలహాలు , కుల తగాదాలు , వర్గ పోరాటాలు
కి బలి పశువులు ..
మేం మిమ్మల్ని రక్షిస్తాం ..మేం మిమ్మల్ని కాపాడే మగ మహరాజులం ..
మీరు సన్నజాజి తీగలు ,మీరు అబల లు అంటూ నమ్మించి
మీలో మీరు కలహ పడి , వీధి కెక్కి మమ్మల్ని ఎందుకు
వీధి లోకి లాగి , మా మీద చూపిస్తారు ప్రతాపం ?

గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ..
అమ్మా ,చెల్లి ,చెలి , పాపా ..ఇంక చాలు
ఎవరినీ నమ్మకు ..
ఆవులా నంగిలా , ప్రశాంతం గా ఉన్న ఈ మగ పుంగవుడేనా
ఈ రగుల్తున్న అగ్ని కీలల మధ్య ,
మీద పడే పులిలా మారి పోయాడు ..
మన ప్రక్కింటి మావయ్య ,కదూ ..
ఇదేమిటి ఇలా చేస్తున్నాడు ? నీ కులం వేరు,
నీ మతం వేరు ..అంటూ నన్ను ఆక్రమిస్తున్నాడు ..

నా నేరం ఏమిటి ?
అంతా నాశనం అయి పోయింది ..
కాలిపోయిన ఇళ్లకి ఇంత , విరిగిన అవయవాలకి ఇంత అంటూ ప్రకటించేరు ..
ఇంక ఆ హోమం లో ఆహుతయిన మగ వారికి లక్ష లు
నా మానం ..అంటూ నేను ముందుకి వచ్చి ఎన్నడూ
ప్రకటించను అని వారందరికీ తెలుసు .

ఎన్నాళ్ళు ..ఎన్నేళ్ళు ??
ఎన్ని శతాబ్దాలు ? ఎన్ని తరాలు ?
రాణి పద్మిని కాలం నుండి ..ఈ నాటి వరకూ .
ఇదే చరిత్ర ..మానవులు అంటే మగ వాడు ..
ఆడ వారి మీదే వారి ప్రతాపం ..

తిరగ బడు ,నోరు విప్పు ..
నిశ్శబ్దం ఇంక నీ భాష కారాదు ..
అమ్మో ! లేచింది అంటూ ..వెక్కిరిస్తారు ,
అవహేళన చేస్తారు , బరి తెగించింది అంటారు..
నీ భాష మర్యాద కరం గా లేదు అంటారు ..
చరిత్ర తిరగ రాసి ..
స్త్రీ ల స్థానం ..ఈ భూమి మీద ..
ఆక్రమించుకో ..ఆక్రమించుకో నీ స్థానం ని ..

22 అక్టో, 2013

స్మృతులు ఎన్ని రకాలు ?


చిన్నప్పుడు అయిపోతుందేమో అని దాచుకున్న పీచు మిఠాయి లా
కొన్ని దాచుకున్నా ,కరిగి పోతాయి ,
తరవాత తిందామని దాచుకున్న పీచు మిఠాయి అణిగి పోయినట్టు ..
మస్తిష్కం లో ఎన్నో పొరలు ట.. దాగుడు మూతలు ఆడుకుంటూ దొంగ కి దొరకకుండా
దాక్కున్న చోటు నుంచి ఎవరూ వచ్చి ఇదిగో అంటూ పట్టుకోక పోతే కలిగే
అసహనం ఈ దాక్కున్న జ్ణాపకం  వచ్చీ రాకుండా ఏడిపిస్తూ ఉంటే ..

మరి కొన్ని అమ్మ కొంగున ముడి వేసి దాచుకున్న చిల్లర కోసం ఇల్లంతా వెతుకుతున్న
ఘటన లాగా ,ముడి బిగుసుకు పోయి ఊడి రానివి ..
అదిగో ,అల్లదిగో ఆ చెట్టు మీదనే నువ్వు చివర వరకూ వెళ్ళి పోయి కొమ్మ అల్లాడుతూ ఉంటే
భయం తో బిగుసుకు పోయిన ముడి లాంటి జ్ణాపకం ..ముడి విడదీస్తున్నావు అనుకుంటాను
బిగదీసుకుంటున్నట్టు తెలియదా నీకు ??

సముద్రం ఒడ్డు న ఇసుకలో కాళ్ళు ఈడుస్తూ కొన్ని పగిలి పోయిన జంట గవ్వలు ,
ఆల్చిప్పల పై చిప్పలు ,తేలిక రంగులు , హరివిల్లు లోవి అంటించుకున్నట్టు , మురిపం గా రంగులు
సొంతం చేసుకునే కల ల రోజులు గుర్తు గా సొంతం చేసుకున్న ఆల్చిప్పలు
గుండ్రం గా ఉన్న రాళ్ళు అంటే ఎంత మోజు ? అన్నీ జీవితం లో అలా మృదువుగా , సిమ్మెట్రీ తో
ఉంటాయని కొండంత ఆశ కాదూ .. ఆఖరికి , గట్టిగా ఉన్నవే రాళ్ళు అని తెలుసుకోలేదూ !?

చీరలకి కూడా జేబులు ఉండాలని ,ఆ జేబుల్లో  కన్నీళ్ళు తో తడిసిన చేరుమాళ్ళు , వెనక్కి తిరిగి వచ్చిన
ఉత్తరాలు , ప్రేమలు , స్నేహాలు , తరగతి మారుతూ ఉంటే మారి పోయే స్నేహాలు , కొన్ని ,కోరికలు తీరినా ఎందుకని కలగదు సంతోషం అనే అయోమయాలు ...పడేయొచ్చు ..మా లేడీస్ బాగ్స్ సరిపోవా ?

సరిపోవు .. అంతే ..

కొన్ని జ్ణాపకాలు ,స్మృతులు , గుర్తులు కి ఎన్ని పొరలూ సరిపోవు అంతే ..
ఒక చిన్న గడ్డి పోచ ,ఒక రుమాలో ,ఒక అట్ట పెట్టో ,ఒక చిన్న పూసల గొలుసో ..ఆలంబన గా
గుచ్చు కుంటాం ..

ఎన్ని స్మృతులో .ఎన్నీన్ని గుర్తులో ..అన్నిటికీ ఒక్క జీవితం ..సరిపోతుందా ? ఏమో ??


8 అక్టో, 2013

నా రెక్కలు విప్పుకున్న రోజు.

అందరి ఆడ పిల్లల్లా గే నేను ఎదుగు తున్నప్పుడు ,నాలోనూ  ఆత్మ విశ్వాసం శూన్యం అని చెప్పవచ్చు.నా ప్రతిభ మీద నాకు నమ్మకం లేదు, నా శక్తీ సామర్ధ్యాల మీద అప నమ్మకం, మొత్తం గా నా మీద నాకే విలువ లేదు.మంచి మార్కులు వస్తే తరగతి లో, అది అదృష్టం అనే నా నమ్మకం..నేను ఎంతో స్నేహ శీలిని ,అందరితో యిట్టె స్నేహం చేస్తాను ,కాని, నాలో ఏదో వ్యధ, నా గురించి వారు పూర్తిగా తెలుసుకున్న రోజు ,నాతో స్నేహం వదిలేస్తారని ,ఒక వ్యధ..ఒక వేళ ,అంతా సవ్యం గా జరిగితే ,నేను సరి అయిన సమయం లో, సరి అయిన చోటు ఉండడం వల్లే అలా జరిగింది అని సరి పెట్టుకుంటాను.ప్రశంసలు  ,అభినందనలు నాకు సరి పడవు.

నేను ఎన్నుకున్న వి కూడా నా మీద నాకు ఉన్న విలువ ని బట్టి ఉండేవి.యవ్వనం లో నాలాగే ఒక అతి తక్కువ ఆత్మ విశ్వాసం ఉన్న యువకుడి తో ఆకర్షణ లో పడి పోయాను.హింసాత్మక మైన అతని ధోరణి కాని, వైరుధ్యాల తో నిండిన మా ప్రేమ కలాపం కాని, లెక్క పెట్టక, నేను అతని  ని వివాహం ఆడ డానికే ఒప్పుకున్నాను..

అతని తో ఏడు అడుగులు వేసే క్షణం లో కూడా ,నా తండ్రి నా చెవిలో "ఇప్పటికయినా ఆలోచించ మ్మా ..స్యు....నీ మనసు మార్చుకో ,మించి పోయింది ఏమి లేదు" అంటూ నన్ను వారించ డానికి ప్రయత్నించారు.నా కుటుంబాని  కి అర్ధం అయింది, నేను చేస్తున్నది ఘోరమయిన తప్పిదం అని, నాకు కూడా అతి త్వర లోనే ,కొన్ని వారా ల లోనే ఆ విషయం అర్ధం అయింది.

నా మీద హింస కొన్ని ఏళ్ళు సాగింది. నా శరీరం నిండా  ఎన్నో బలమయిన గాయాలు , ఒళ్ళంతా పచ్చి పుండై, ఆసుపత్రి పాలై ..నానా అవస్థలు పడ్డాను. జీవితం అంతా..పోలిసు సైరన్లు ,ఆసుపత్రి లో పరీక్షలు, రిపోర్టులు ,ఫ్యామిలీ  కోర్టు లో హాజరులు తో నిండిన ఒక కలగోలుపు ,అలుక్కుపోయిన దృశ్యం  లాగ అయిపొయింది.కాని నేను ఆ బాంధవ్యాన్ని వదల లేక, మార్పు వస్తుంది, మా సహజీవనం లో ఏదో మార్పు వస్తుందని ఓర్పు గా మళ్లీ ,మళ్లీ వెళుతూనే ఉన్నాను..ఆ జీవితం లోకి.

మా జీవితం లోకి ఇద్దరు పిల్లలు.. ఆడ పిల్లలు పుట్టేరు  ఒక్కో రాత్రి ,ఆ చిన్నారులు నా మెడ చుట్టూ వేసిన మెత్తటి చేతులు, నా చెంప కి ఆనించిన 
వారి బూరి బుగ్గలు, "అంతా బాగానే ఉంటుంది అమ్మా" అనే వారి చిట్టి పలుకు లే నాకు ఆసరా గా నిలిచేవి..ఆ రాత్రి కి..కాని, నాకు తెలుసు, 
అంతా ఏమీ బాగోలేదు, ఇలా కుదరదు, నేను మార్పు కి సిద్ధం కావాలి, నా కోసం కాక పోయినా ,నా బంగారు చిట్టి తల్లులు కోసమయినా ,వారి రక్షణ కోసమయినా మార్పు తప్పదు ..అని నాకు అర్ధం అయింది.

ఆ సమయం లోనే మార్పు కి అవకాసం కలిగింది.  నా ఉద్యోగ రీత్యా నేను కొన్ని వృత్తి నిపుణత ని పెంచే గోష్టులు లో పాల్గొనడం జరిగింది. అందు లో ఒక వక్త కలలని సాకారం ఎలా చేసు కోవాలి అనే విషయం మీద మాట్ల్లడేరు. నాకు అది కష్టం ,అని తెలుసు, మంచి భవిష్యత్తు ఉందని నాకు   కల కనడమే అసాధ్యం ...కాని, ఆ సందేశం లో ఏదో ఉంది నాకోసం అనిపించింది..అందుకే విన్నాను.

ఆమె మమ్మలిని రెండు బలమయిన ప్రశ్నలు అడిగింది. "మీరు కోరుకున్నది, మీరు  కావాలి అనుకున్నది ,మీరు చేయ గలిగినది ,అసాధ్యం కానిది కోరుకో మంటే ,మీరు ఏం చేస్తారు? మీరు కల గంటున్న ఆదర్శ మయిన జీవితం కోసం మీరు ధైర్యం గా ఎలాంటి కల కంటారు?"..ఆ క్షణం లోనే నా జీవితం మలుపు తిరిగింది.నేనూ కలలు కనడం మొదలు పెట్టాను.

నేను నా పిల్ల ల తో ఒక కొత్త గృహం లోకి మారి పోయినట్టు, ఆ ధైర్యం నాకు కలిగినట్టు..ఒక కొత్త జీవితం మొదలు పెడు తున్నట్టు ,ఒక కల ,ఒక ఊహ నాలో..మొదటి సారిగా..నాకు, నా పిల్ల లకి సుందర భవిష్యత్తు కల కన్నాను.
నేను ఒక అంతర్జాతీయ వక్త ని కాగలనని ,అందరిని ఉత్తేజ పరిచే వక్త ,నన్ను ప్రేరేపించిన ఆమె లాగే నేను కూడా అందరిని ఉత్తేజ పరుస్తూ ఉపన్యాసాలు ఇవ్వాలని కల కన్నాను.అందరిని ఉత్తేజ పరిచే నా కథ రాయడం కూడా ,నా కళ్ళ ముందు కదలాడింది .

ఇక ,అప్పుడు నా విజయానికి ఒక సాకారం ఇచ్చే సమయం ఆసన్న మయింది. నన్ను నేను ఒక మంచి ఎర్రటి దుస్తులు ధరించి, లెదర్ బ్రీఫ్ కేస్ పట్టుకుని, విమానం ఎక్కుతూ , ఊహించు కున్నాను. అది ,నిజానికి ఒక అసాధ్యమయిన ఊహే, ఆ సమయం లో మంచి దుస్తులు కొనే స్తోమతే లేదు నాకు.

కాని, నాకు అర్ధం అయింది ,నేను ఇప్పుడు కనే కల,నా పంచెంద్రియాలని సంతృప్తి పరచాలని. ఒక బ్రేఫ్ కేస్ లు అమ్మే దుకాణం కి వెళ్లి, నన్ను నేను ఆ బ్రీఫ్ కేస్ చేతి లో పట్టుకుని, అద్దం  లో చూసుకున్నాను,ఎలా ఉన్నాను?  ఆ తోలు తో చేసిన పెట్టె వాసన ని ఆఘ్రాణించాను, ఎలా ఉంటుంది ఆ వాసన? ఎర్రటి (సూట్ )దుస్తులు ధరించి నన్ను నేను చూసుకున్నాను. ఇదే కాదు, ఒక ఫోటో కూడా సంపాదించాను, ఎర్రటి సూట్ వేసుకుని,  లెదర్ బ్రీఫ్ కేస్ పట్టుకుని చేతిలో ,విమానం ఎక్కుతున్నా ఒక యువతి బొమ్మని.ఇక ఆ బొమ్మ ని నాకు రోజూ కనిపించే ఒక ప్రదేశం లో, నాకు ఎదురుగా తగిలించు కున్నాను..నా కల కి సజీవ రూపం గా  నిలిచింది ఆమె ,ఆ బొమ్మ..

మెల్లగా మార్పు కి శ్రీకారం చుట్టేను ..పిల్ల ల తో ఒక చిన్న అపార్ట్ మెంట్ లోకి మారేను.వారానికి  98 డాలర్లు అద్దె , వేరుసెనగ వెన్నె తినే వాళ్ళం ఎక్కువగా, ఇంకా ఒక డొక్కు కారు లో తిరగే వాళ్ళం. కాని, మొదటి సారిగా ,స్వేచ్చ ని అనుభవించాం.. స్వేచ్చ ,భద్రత..నా అమ్మకాల వృత్తి చేస్తూ, సర్వ శక్తి తో ,నా " అసాధ్యం అయిన కల" పై కూడా కేంద్రీకరించాను ..నా దృష్టి నంతా.

చివరికి ఒక రోజు, ఒక పిలుపు ఫోన్ లో, వచ్చింది, నన్ను మా కంపని వార్షిక సమావేశం లో మాట్లాడ మని..నేను ఒప్పుకున్నాను, ఆ ఉపన్యాసం మా సమావేశం లో  ,చాల విజయ వంతం అయింది .ఇది ఆరంభం, నాకు పదోన్నతి లభించి, నన్ను జాతీయ అమ్మకాల( సేల్స్ ) శిక్షకు రాలి గా చేసారు. నేను నా సొంత వక్తృత్వ సంస్థ స్థాపించేను , ప్రపంచం లో ఎన్నో దేశాలు పర్యటిన్చేను. నా " అసాధ్యమయిన కల " సుసాధ్య మయింది.

నా నమ్మకం ఏమిటంటే అన్ని కలలు ,సాధ్యం అవుతాయి. నువ్వు నీ 
w.i.n.g.s. అంటే  రెక్కలు చాచాలి.
నీలోని యోగ్యత ని నమ్మడం....(w), నీ లోపలి చూపు అంటే ప్రావిణ్యం ని నమ్మడం ,(I ), నిన్ను నువ్వు సృజించుకోవడం (N),  నీ ముందు ఒక గమ్యం నిర్దేశించు కోవడం (G),  నీ సొంత వ్యూహం ని రచించు కోవడం (S )..
అంతే ఇక అప్పుడు నీ అసాధ్యమయిన కల లు సాకారం దాల్చి ,నిజాలు అవుతాయి. 














2 అక్టో, 2013

నాకు రాజకీయాలు వద్దు..

తామరాకు మీద నీటి బొట్టులా 
నాకు ఏమీ అంటకుండా ఈ ప్రాపంచిక విషయాలు 
బ్రతికేయాలని రోజూ అనుకుటాను , అనుకోవడం కాదు 

నేను నడిపే నాలుగు చక్రాల బండికి ,నల్లటద్దాలు వేసి ,
నాలుగు రోడ్ల కూడలి లో బిచ్చగాళ్ళ అడుక్కునే చేతులు 
కనపడకుండా ,ఎదురుగా అంతులేని వాహనాల వెనక భాగాలు చూస్తూ ..
వాహనం నడిపేందుకు కావల్సిన ఇంథనం , అయిదు వందల రూపాయలకి 
అయిదు లీటర్లు కూడా రావా ? ఐతే సరే , రేపు మరో వంద ఎక్కువ పెడతా జేబులో 

ఏమిటి ,ఇదంతా కూడా రాజకీయాలేనా ? ఎక్కడో అమెరికా లో ద్రవ్య నిధి లోపమా ?
ఇక్కడ నా జేబు కి చిల్లు పడడమా ? ఇదంతా రాజకీయమేనా ?
నాన్సెన్స్ .. వార్త పత్రిక లో ముందు స్పోర్ట్స్, తరవాత సినిమా విశేషాలు ,చూసి 
విసిరి కొట్టెస్తాను వార్త పత్రిక .. నాకెందుకు రాజకీయాలు ? 

మా ఇంటి చుట్టూ చూసారా హై వోల్టేజ్ కరెంట్ తీగలు ..
మా ఇంట్లోకి యే దొంగా రాలేడు, నలు దిశెలా కమెరా కన్నుల కాపలా .
ఇంక రాజకీయాలు ఎలా తొంగి అయినా చూడలేవు ..కాస్కోండి ..
నా ఇల్లే స్వర్గం ..నా పిల్లలు ,నా భార్యలు...ఒహ్ సారి భార్యా నా స్వర్గం ..
ఇందులో ఎవరూ నా ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా గాలి కి కూడా అనుమతి లేదు . 

ఏమండీ ,మీరిచ్చిన వంద రూపాయల నోటు తో ఒక్క ఉల్లిపాయలే కొనగలిగాను ,
మరి కూర ఏం చేయమంటారు ? హహ్. 
ఎవరో అరుస్తున్నారు , వీధిలో ఉల్లిపాయల ధరలని దించలేని ప్రభుత్వం దిగి పోవాలి ,చా 
అన్నిటికీ వీధి కెక్కుతారు , అలగా జనం ,ఇదిగో మరో వంద ,,మరో కూర కొని వండు 
నాకు కూర లేనిదే ముద్ద దిగదు అని తెలుసు కదా .. 
అయినా అదేమిటి ? మొన్న తెచ్చిన కాష్ అప్పుడే అయిపోయింది పర్సులో 
అప్పటికీ ,భార్య దుబారా చేయదు, ఆమె చేతిలో అందుకే కాష్ ఉంచను కదా ?

కొంపదీసి ఇదంతా రాజకీయమా ??? నన్ను అలజడి పరిచే ,నా గుప్పెట్లొ ,నా అధికారం లో లేని ఈ పరిస్థితులు ?
కొంపదీసి రాజకీయమా ?? అమ్మో . మా ఇంట్లోకి వచ్చేసింది.. పెద్ద తాళం వేసేయాలి ..
నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నా మానాన నన్ను వదిలేయండి.. నాకు రాజకీయాలు వద్దు.. 


20 సెప్టెం, 2013

' చివరి గుడిసె '

ఒక్క పుస్తకం మనలో ఎంత మార్పు తీసుకు వస్తుందో చెప్పాలంటే  డాక్టర్ కేసవరెడ్డి గారి నవల ' చివరి గుడిసె ' చదవాలి .. 
నా జీవితం అంతకుముందు ఆ తరువాత ..లా అయిపొయింది ఇప్పుడు , ఈ పుస్తకం చదవక ముందు , చదివిన తరువాత , 
చిన్న పుస్తకం, ప్రతి పదం ఉలి తో చెక్కి ,సూది బాణం చేసి, నా మస్తిష్కానికి గురి చూసి విడిచినట్టు ,ఒక ఉలికి పాటు, ఒక ఉనికి పాటు . 
చిన్న పుస్తకం లో ఒక్క వ్యర్ధ మైన పదం లేదు, అలా అని తూకం ఏమి వేయలేదు ,అంతా అలా సరిపడా , అంత కుదువ గా ఎలా వ్రాయ గలిగారో ?
ఎంత నిశిత పరిశీలన? ఎంత తర్కం ? ఎంత ప్రేమ మనుషుల మీద .. 
చులాగా అలా మన కళ్ళ ముందు ఈ సమాజం లో నడుస్తున్న దోపిడీ, అన్యాయం , నిరంకుశతా , ఈ రాజ్యం అంటే ఎవరో అంతా విడమర్చి చెప్పేశారు , ఇంకా నువ్వు కళ్ళు మూసుకుని, నా రాజ్యం సుభిక్షం ,నా ప్రజలు తోబుట్టువులు లాంటి వారు అంటూ మభ్య పెట్టలేవు . 

ఎక్కడినించి పుడుతుంది ఈ క్రౌర్యమ్ ? ఎక్కడినించి ? 
అధికారం నించి,  రాజ్యాధికారం నించి .. 
ఊరు చివర ,సరి అయిన కప్పు కూడా లేని ఇంట్లో ఉన్న ఇద్దరు యానాది వారు, ఒకరు తండ్రి, పుట్టినప్పటి నిండి తనదైన కులవ్రత్తి లో ఎలుకలు ,ఉడుతలు ,పాములు వలేసి పట్టుకుని ,కడుపు నింపుకునే తండ్రి ఒకరు, ఆ కుల వ్రత్తి క్షీణ దశ కి నిదర్సనం గా ఇంతెత్తు విగ్రహపుష్టి ఉన్నా ,ఇంచుక ధైర్యం గుండె లో లేని పిరికి గొడ్డు కొడుకు .. 

ఎప్పుడో బ్రిటిష్ వారు ఇచ్చిన రెండెకరాలు పొలం ,ఊరు మన్నెం గారి ఖాతా లో  పోయింది, యానాది పుట్టినప్పుడే దొంగ, వాడి కుల వృత్తే దొంగతనం అంటూ రాయించి , పొలం లాక్కున్నాడు ఊరి మన్నెం అంటే రాజ్యమ్.. 
దొంగ అని ముద్ర వేయించి ,తరిమి కొట్ట్టినా ,తనదైన ఒక చిన్న పూరి గుడిసె లో జీవనం కొనసాగిస్తున్న తండ్రి కొడుకుల కి ఆ నాలుగు మెతుకులు దక్కని దైన్యమ్.. 

అంతా ఒక్క రోజు లోనే ..సూర్యుడు ఉదయిస్తూ ,ఈ యానాది తండ్రి కొడుకుల లో ఒక ఆశ వెలిగిస్తాడు .. 

ఆ సూర్యుడు అస్తమించి మళ్లీ ఉదయించే లోపలే , వీరిరువురి జీవితం అస్తమిస్తుంది .. 

ఆ ఒక్క రోజు లో జరిగినది . క్లుప్తం గా చెప్పాలంటే మానవుడి చరిత్ర. 
ఆ ఒక్క రోజులో గుండెలు పిండేసే విషాదం ఉంది .. 
నా ఇల్లు పదిలం, నా కుటుంబం క్షేమం అని నేను ఇంకా గుండెల మీద చెయ్యి వేసుకుని నిశ్చింత గా పడుకోలేను . 
నా కలలని కూడా తస్కరించే వారున్నారు .. 
ఈ రాజ్యం లో నీ స్థానం ఏమిటి ? నీ జేవనం ఎంత ధర్మం ?
అని ఆలోచిస్తావు నువ్వు. 

గన్నులు కాదు ,ఇలాంటి పుస్తకాలు పెట్టండి యువకుల చేతిలో .. 
పబ్బులు , మాల్టి ప్లెక్ష్ లు వదిలి , కరయచరణ మార్గాలు ఆలోచిస్తారు .. 
ఒంటి లో ప్రవహించేది ఇన్నాళ్ళు నీళ్ళు అనుకున్నాం ,వేడి రక్తం అని ఎరుక వస్తుంది .. 

ఆలోచన అంటూ మొదలవుతే , ఆపగలమా ??
ఆ పాదాలు నడక ఆపగలమా ? ఆ శ్రంఖలాలు తెమ్పుకుని రాకుండా ఆపగలమా ?? 

నేను ఈ రోజు చదివిన ఈ చిన్న పుస్తకం నా లో కలిగించిన వేదన , విభ్రమం , ఆలోచన , విరామం , కసి, ఏవగింపు , కదలిక , ఉత్కంట , ఊరడింపు ,మనిషి మీద నమ్మకం .. సడిలి పోతోంది, వస్తోంది . ద్వేది భావం తో , ఎన్ని రకాల భావా ల తో ఒక పరి పూర్ణ మనిషి లా అనిపిస్తున్నాను .. 
ఈ ఎరుక కలిగించిన ఈ చిన్న పుస్తకం ...చివరి గుడిసె .. రచయిత కేశవరెడ్డి 
గారికి ,జీవితాంతం ..మరి మాటలే లేవు .. 






3 సెప్టెం, 2013

ఆశే , అత్యాశే .. కదా ..కాదా.. ??

ఎడారి లో విత్తనాలు జల్లుతూ 
సముద్రాల అంచులకి చేరాను 
నాకు కుదరైన చోటున కూర్చుని 
ఏది నేను పెంచిన తోట అంటూ 
వెతికి చూసాను ,అదే కదా మరి 
అత్యాశ అంటే ... 

అమాయకత్వం ,అజ్ఞానం రెండూ 
పీట వేసుకుని కూర్చున్న మస్తిష్కం నాది 
ఎప్పటికప్పుడు మరుపు 
ఎప్పటికి కానరాని మెరుపు ,
మనుషులు కి రెండు మొహాలుట 
అంటూ ఎన్నిసార్లు చెప్పినా నాకు నచ్చిన 
ఒక్క మొహమే నేను ఎంచుకుంటాను . 

చదువు సంధ్య అంటారు కదా ? ఏది మరి సంధ్య 
అంటూ నిరంతరం వెతికే మూర్ఖురాలిని నేను 
కాళ్ళకి చక్రాలు అంటూ కూర్చునే ప్రపంచాన్ని 
పరమార్సించే బద్ధకస్తరాలుని నేను .. 

నా ప్రపంచం అంతా నాలోనే బంధించి 
ఎప్పటికప్పుడు విశ్వం లా విస్తరిస్తూ ఉండాలని 
మేలుకునే కలలు కనే నేను , 
ఈ జగతి లో నేనొక ఓటమి ఉదాహరణ .. 

నాకంటూ ఏమి ఆస్తులూ , పాస్తులూ అసలేం లేవు 
కొన్ని స్నేహాలు ,మరి కాసిన్ని ప్రేమలూ 
హ్రదయ కవాటం లో ఇంకా బహిర్గతం కాని రహస్య కోరికలు 
చదివిన పుస్తకాల లో పాత్రలు నా బంధువులు ,
పిలవకుండానే వచ్చి నా ఆలొచనల పేరంటం లో 
తాంబూలం పుచ్చుకుంటారు . 

నా చుట్టూ ,మరిన్ని విత్తనాలు చల్లుకుంటూ 
ఊహల సేద్యం చేసే చదువుకున్న స్త్రీ ని నేను 
నా ఆలోచనల విత్తనాలు వెదజల్లకుండా , నేను 
మరి ఈ విశ్వం ని విడిచి పెట్టను. 

నా పేరు తలుచుకుంటే , వసంతం లో పూసే పూలే కాదు 
నిరంతరం పెదవి పై పూచే చిరు నవ్వు పులకింత కావాలి 
ఎంత ఆశ ? మరి నీ చేతులు ఇంత మెత్తగా ,పూలు లాగ?
చేతులు కదుములు కట్టి, పాదాలు గట్టి మట్టి లాగ 
అప్పుడు కదా నువ్వు నాటిన విత్తనాలు ,ఫలించేది ?

అవును కదా ,మట్టి వాసన అంటని ,పక్కా భవంతులు 
మేడలు , డాబాలు మావి, ఎక్కడా ఒక్క పిసరు మట్టి అంటదు 
మట్టి వాసన, వర్షం పడిన తరవాత వచ్చే మట్టి వాసన 
కిలోల లెక్క కొనుక్కుని ,బీరువాలో బీగం వేసి దాచుకుంటాం . 

అయినా సరే ,నాకు ఆశే ,నా చుట్టూ ఒక తోట ఆరు కాలాలు 
విరి పూలతో నిండి ,పరిమళాలు వెదజల్లి ,ఆరు మైళ్ళ అవతల 
వాని నైనా ఆకర్షించి ,ఈ పూదోట నా పూదోట ,
మది అందరిదీ కలలు ,కోరికల ,కథల ఊహల తో నింపుతుందని .. 

ఆశే , అత్యాశే .. కదా ..కాదా.. ?? 


17 ఆగ, 2013

నేనసలే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ .

నా నాలుగు గోడల ఎడారి మధ్య కూర్చుని 
తోటలు పెంచేస్తూ , అడవుల మధ్య తిరుగుతూ 
పువ్వులు దోసేట్లోకి తెమ్పుకుంటూ ,సిగ్గు లేని 
కలల అరువు జీవితం బ్రతికేస్తాను. 

వసంత ఋతువును  నా గోడ పై 
ఒక గొంగలి పాకుతూ తెస్తుంది, 
ఆపై సీతాకోక చిలుక గా మారడం 
నేను ఊహిస్తూ రంగులు అద్దుతాను. 

గల గల పారే సెలయేరులు, జలపాతాలు 
నా స్క్రీన్ మీద ముచ్చటైన బొమ్మలు 
సంగీతం , సాహిత్యం లేని సంగీతం వాటికి 
అద్ది, అవధులు లేని పారవశ్యం , అనుభవం నా సొంతం . 

కాళ్ళు కదకుండా ప్రపంచ పటం మీద విహారాలు 
కళ్ళు చెదిరి, కళ్ళ నీళ్లు తో నిండుతాయి ,
ఆనందం పట్టలేక, కళ్ళు నీళ్ళు తుడిచే స్నేహాలు 
ఆ పెట్టె లోనే, మనసు ఖాళి గది ,ఎప్పుడూ .. 

జ్ఞాపకాలు ,గుర్తులు , అనుబంధాలు 
డస్తర్ పెట్టి తుడిపేసి ,ఎప్పటికప్పుడు నల్ల బోర్డు 
నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోవడం ఒక ఆర్ట్ ,
నేనందులో మాస్టర్ , నేనసలే  మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ . 





14 ఆగ, 2013

చదువు కొందాం రండి ,చదువు కొందాం రండి

చదువు కొందాం రండి ,చదువు కొందాం రండి 
పలకల పై అ ,ఆ ,లు ఎగరేసి పాట పాడుతారు 
ఎవరు ఎక్కువ పాట పాడితే వారిదే చదువు శాల 
చిన్న చిన్న పిల్లలు ఆకలి కడుపులు చేతితో పట్టుకుని 
చదువు కొంటారు, చదువుకోడానికి మరి వీలు లేక . 

అమ్మ అంట్లు తోముతుంది నాన్న వాచ్ మాన్ ,
అమ్మా ఆకలి అంటే బడి కి వెళ్ళు ,బువ్వ పెడతారు 
అంటూ తోలింది, పళ్ళెం లో ఉడికి ఉడకని అన్నం ,
మారు అడిగితే నెత్తి మీద మొట్టికాయలు, మీ అబ్బ సొత్తా ? 
అని తిట్లు దండకాలు, చదువుకొంటాం మేం చదువు కొంటాం . 

పుస్తకాలు ముట్టినట్టు , తలాడించేం ,నాలుగో తరగతి కి ఇంకా 
అ ఆ లు రాలేదాని వీపు మోత మోగించే మాస్టర్లు ,
ఎప్పుడైనా మరి చదువు చెప్పారా ? ఉచితం అంటే ఇంతే
అన్నారు, మరి చదువు కొంటున్నాం కదా అంటే ,అది మా జీతాలు 
మీ చదువుకి ఏవి జీతాలు ? 

పై మాస్టారు తనిఖి కి వచ్చి ,పెద్ద అయి ఏమవుతారు ?
అని అడిగితే అందరం మాస్టర్లు అని చెప్పెమ్.. సంతోషించి 
ఎందుకురా అంటే రెండు పూటలా మరి పిల్లల అన్నం తినొచ్చు కదా 
అని గట్టిగా అరిచేం , ఏమో మరి అందరూ మమ్మల్ని మెచ్చుకోలేదు సరికదా 

ఈ ఉచిత బడి పిల్లలకి ఎంత ఆకలో ఎంత బలుపో అన్చెప్పి 
మా వీపులు వాయించి, మాస్టర్లు చింత బరికలు తో తోళ్ళుఊడకొట్టారు 
అమ్మ బడి వద్దే ,నేను ఇళ్ళల్లో పని చేసి, అన్నం తింటానే అని ఏడిస్తే 
అమ్మ ఏమంది , చదువు కుంటే నీ బువ్వ నువ్వే సంపాదిస్తావు ,ఎంగిలి కూడు వద్దురా అంది . 

అందుకే చదువు కొనే బడి లో చదువుకుంటాను ,నేను చదువుకుంటాను . 

8 ఆగ, 2013

నా అక్షరాల పక్షులు ..

పిడికిలి బిగించి పెట్టాను 
రెక్కలు విరిచి , ఊహలు తెంపి 
స్వేచ్చ ,స్వేచ్చ అంటూ ఎగరాలనే 
పక్షుల రెక్కలు.. 
రంగు రంగులు అద్ది ముచ్చటగా 
ఖరీదయిన గింజలు నోటి కి అందించి 
అందమైన పంజరం ఊచలు కి 
బంగారం రంగు పై పూత  పూసి ,
అయినా అదేం బడాయో ,
ఎప్పుడూ స్వేచ్చ స్వేచ్చ అంటూ 
కువ కువ లాడి , బుర్ర తినేస్తాయి . 

కలలో కూడా అవే ,
పక్షులు పక్షులు పక్షులు 
రెక్కలు విప్పి మొహం మీద కొట్టి 
నీకింకా అర్ధం కాదా ?
అవును నువ్వు మనిషి కదా 
నీకు ,నీకు మెచ్చే మాటే వినిపిస్తుంది 
మా మాటలు, కూతలు నీకు 
కాకోఫోని నీకు , నీ భాష లో నీకు 
అర్ధం అయేలా ఎలా చెప్పం ?

మాకు ఆ పంజరం బ్రతుకు వద్దు 
నీ పోషణ ,నీ ముద్దు ముచ్చట్లు 
మాకు వెగటు , మా రెక్కల మీద ఎగరని 
మాకు ఎగరడం వచ్చనే మర్చిపొయామ్.. 
ఆఖరి బ్రతుకు పోరాటం గా ఇదే మా 
ప్రయత్నం అంటూ, నా ఒంటి నిండా మూకుమ్మిడిగా 
రెట్టలు రెట్టలు రెట్టలు వేసేసరికి ,ఛి ఛి ఛి అంటూ 
పిడికిలి తెరిచి , ఊహల కి రెక్కలు ఇచ్చాను 
అవును రెక్కలిచాను ,అవి పక్షులై ,
నింగి కి ఎగరడం నా కళ్ళారా చూసాను . 
అవును నేను చూసాను ,నా అక్షరాల పక్షులు .. 




5 ఆగ, 2013

పిలుపు మొదలయింది ..

తన తలపే తనువు ని తరువు చేస్తుంది, 
అనుకోకుండా వసంతం వచ్చి పడి పోతుంది 
ఏమాత్రం సమయం ఇవ్వదు, 
వసంతం అంటే ఎన్ని ఏర్పాట్లు . 
చిగురించాలి 
మొగ్గలు ముకుళించాలి 
మొగ్గలు సిగ్గులై ఎర్రెర్రని రేకులవాలి 
పూలు వికసించే సంగీతం వినిపించాలి 

అవును పూలు సంగీతం ఆలపిస్తాయి 
తల ఊపుతూ గాలి కి ఒక సన్నని పాట అల్లుకుంటాయి ,
ప్రకృతి చెవి యోగ్గి హర్షిస్తూ వింటుంది .. 
ఒక్క అపస్వరమూ ఉండదు, సామ వేదంకి రూపం ఇచ్చినట్టు 

పూలు పాడే గీతం వసంతం 
మరి ఎందుకో కబురు కన్నా ముందే వచ్చి చేరింది 
తనువూ ఆత్మల  సంగమం కి 
సమయం సందర్భం ఎందుకని శోచిందేమో
ఊహల మొగ్గల సిగ్గులు ఇంకా మొదలవలేనే లేదు 

ఎదురుచూపులు  రాల్చిన ఆకులు ఇంకా రాలుతూనే ఉన్నాయి,
ఎన్ని రంగులో ఎన్ని చిన్నేలో ..
ఒక్కోసారి సమాగమం కన్నా ఎదురుచూపులే హాయి తోస్తాయి,
ఆకులు రాల్చడం లో తరువు కి ఒక హాయి 
నూతన చివురులు చిరునవ్వు ని మోలిపిస్తాయి , 
మోము యోగ ముద్ర దాలుస్తుంది , 
పూర్వ సంగమం సాక్షాత్కరిస్తుంది 
ఆ మాదుర్యం తలుచుకుని ,తలుచుకుని అనుభవించేది ,
ఒక్క క్షణమో ఒక్క రోజో కాదు 
జీవిత కాలం కి సరిపడా ఆత్మా అవలోకనం .. 

అందుకే , 
నా తనువూ ,ఈ సమాగమం 
ఈ వసంతం కి ఇంకా సమాయత్తం అవలేదు 

ఒక యుగమైనా ఒక లిప్త పాటు అయినా 
నాకు ఇంకా సమయం కావాలి, 
ఎదురు చూపుల అనంతమయిన హాయి 
ఇంకా ,ఇంకా నన్ను అనుభవించనీ ,
తొందరపెట్టకు నన్ను తొందరించకు 

చివురించమని పుష్పించమని 
ఉనికి స్థిరీకరించమని 
నన్ను ఎప్పుడు మరి 
తొందర పెట్టకు .. 

సృష్టి కార్యం ఎప్పుడూ నిదానం గా , 
కళ్ళు వెలుతురు కోసం కలలు కన్నట్టు , 
పసి తనం మనసుని వీడనట్టు 
నిదానం గా జరగాల్సిందే .. 

సమస్త సృష్టి కి ఒక్కో క్షణం రాసి పెట్టి ఉంటుంది 
ఆ క్షణం 
ఆ లిప్త పాటు కోసం ఒదిగి ఒదిగి, 
తల్లి పొట్టలో పిండం లాగ తపస్సు చేయాలి ,
తొందర పడిన ప్రతి చర్య చిద్రమే , వద్దు .  
నీ సమయం, నీ ఉనికి సంతకం 
ఇక్కడే ఎక్కడో రాసి పెట్టె ఉంటుంది . 
ప్రతి చర్య కి ప్రతిచర్య అని ఊరికే అనలెదు. 

వసంతమా అందుకే 
తొందర పడకు 
తొందర పెట్టకు 
తరువు తరువు కి కబుర్ల సందేశాలు అందించుకొని 
కరువు తీరా కబుర్లాడుకొని 
ఏ రోజు ఏ మాను నేల కూలుతుందో ,
యుగయుగాలు గా రచిస్తున్న కథ మరి 
ఎన్ని చరిత్రలు దాగున్నాయో ఆకు ,ఆకు లోనూ ,మనకేమి ఎరుక 
నింపాదిగా ఎదురుచూపు కి రూపం వచ్చినట్టు చెట్టు , 
యుగయుగాలుగా ఆకాశం కప్పు కింద గాలి తో సయ్యా ట లాడుతూ 
తన కథ ని సుదూరం గా 
చెట్టు పంపే ఎన్ని సందేశాల టపాలు చేరవేసిందో  గాలి 

ఇంత కథ ఉంది ముందు వెనక 
వసంతమా కాసేపు విరామించు ,
కాసేపు నిదానించు , 
కాస్తంత సమయమివ్వు, 
యుగాంతమో, క్షణ కాలమో నీ పిలుపు నీకు వస్తుంది .
పిలుపు ఎక్కడో మొదలయింది .. 
అవును పిలుపు ..పిలుపే .. మొదలయింది ... 

























4 ఆగ, 2013

పచ్చని చెట్టు చెప్పిన కథ

ఆకు ఆకు కి ఒక కథ ఒక కాలక్షేపం ట,
ఒక్క సూర్యుని కిరణమైనా తాకదా నన్ను అంటూ తొందరింత 
అటు జరుగు సుమ్మి ,నా వంతు కాదా ,ఈ వేళ? అంటూ 
అలకతో ముడుచుకుని, అంతలో తేరుకుని, విప్పారి ,
సతత హరిత పత్రాన్ని ఆ వెలుగు ప్రభువుకి అప్పగించి 
సూటైన కాంతి స్పర్శ కి పులకించి ,మరో మారు ప్రణమిల్లిన 
ఆ చిన్ని ఆకు ,జగమంత ఎంత సుందరం ,అంటూ తిలకించి 
కనుచూపు మేర లో ఒక్క నీటి మబ్బు కనిపించదే?
ఈ దుమ్ము ధూళి ని శుభ్ర పరిచే చిక్కటి నీటి ధార ఏది ?
తలారా స్నానించి పులకిత పత్రం గా వెలుగొందాలి కదా 
ఆకు ఆకు కి ఒక తపన ,ఒక తపస్సు. 

నీలి ఆకాశం నిప్పులు చిందుతూ 
పచ్చదనం ని నాకేస్తోంది ,తన మంటల కి ఆజ్యం గా 
నీడ కోసం నరుడి కి ఎండ కంతులే కానుక ,
ఒక్క చెట్టు అయినా మిగల్చరేం ? అంటూ 
రుస రుస లాడుతూ మనిషి , ఎవరో ఆ ఒక్కడు 
తను మటుకు కాదు కాబోలు ?? 
ఎంత మూర్ఖుడో అంటూ జల జల ఎండిన ఆకులు 
విదిల్చి ,మౌనమ్ గా తను పోయే లోగా రెండు 
మొక్కలు నాటే వారెవరు ? అంటూ దిక్కులు చూస్తూ 
పచ్చని చెట్టు చెప్పిన కథ ,వినే వారున్నారా ?? 

29 జులై, 2013

నాలో నేను ..

ఆకలి ఒక నిజం .
తెల్లని అన్నం మిధ్య 
అనుకుంటూ రెండు గుండ్రని 
ఎండిన గోధుమ చపాతీలు 
వంక దిగులుగా చూసాను . 

ఆరోగ్యం నిజం ,
కమ్మని ,రుచే మిధ్య 
అన్ని చంపుకో ,ఈశ్వరుడు 
కనిపిస్తాడు , అవును పట్టపగలే 
చుక్కలు ,దేవుడు కనిపించారు . 

నీ ఇష్టం వచ్చినవి తిను 
ఆ మెత్తని మెత్త వదిలి రెండు కాళ్ళ 
మీద నిలుచో, ఏది ఒక్కసారి అలా 
నాలుగు అడుగులు వేయి, మరో 
నాలుగు అంటూ నన్ను ప్రేరేపించి
చతికిల పడ్డారు వారే.. 

ఏదో ఒక కారెట్ దొరకక పోతుందా 
ఈ గుర్రాన్ని నడిపించడానికి అని 
జుట్టు పీకేసుకున్నారు అందరూ 
వెతకలేక ,పాపం జుట్టు మొలిపించాలి 
ఇంకా ఇప్పుడు నేనే .. 

నా ఇల్లు, నా మెత్తని సోఫా ,నా స్వర్గం 
ఎందుకు నేను కదలాలి ?
స్వర్గం కోసమే కదా అందరూ తపస్సు 
నాకు ఇక్కడే ,హాయిగా దొరికింది గా 
అసలేం ప్రయత్నం లేకుండా .. 

అయితే సరే, నీ ఖర్మ.. 
అయితే సరే మీ ఖర్మ.. 
నాకైతే ఓకే .. 
మీకేంటి ట?? 
సరే మరి ఉంటా టా టా బై బై
సరదాగా కాసేపు ... 
నాలో నేను .. 


27 జులై, 2013

మనసు

మనసు చెప్పే కబుర్లు 
ఎప్పటికి తరగవు ,
చెవులు మూసుకున్నా ,
పనులు చేస్తున్నా ,ఈ మనసు 
ఉత్త వాగుడుకాయ లాగ ,నిర్విరామం గా 
అలా ఏదో ఒకటి అంటూ వుంటుంది, నువ్వు 
విన్నా ,వినకపోయినా ,సంబంధం లేదు . 

నువ్వు చేసేది ఒకటి ,చెప్పేది ఒకటి 
అంటూ వెక్కిరిస్తుంది , 
నీ పొట్టలో పుట్టిన ఊహ పట్టేసుకుంటుంది ,
ఇహి ఇహి అంటూ నవ్వి, కోపం తెప్పిస్తుంది 
నీ మీద నీకే ,ఇదిగో అలాంటప్పుడే 
అమ్మ మీదో, అత్తమీదో, దుత్త మీదో నా కోపం 
అంతా చూపిస్తా, ఫెడిమని ఒక్కటి ఈడ్చి కొట్టాలని 
పిచ్చి కోపం వస్తుంది, వెధవ మనసు కి రూపం లేదే ,
ఎంత బాధో, ఇది వర్ణించలేను ... 

నా మీద నాకెంత ప్రేమో, ఎంత మోహమో 
వేలెత్తి చూపిస్తుంది, ఆ వేలు విరిచేయాలని వెర్రి ఆవేశం 
ఉత్త చాతకానితనం అంటూ ఎగిరి పడి నవ్వుతుంది ,
మనసు లేని తనం ఎంత హాయో అని చింతిస్తాను ,
నీ చింత నేను తీరుస్తాను, ఒక్కసారి నా ఉనికి మర్చిపో 
అని సవాలు చేస్తుంది, నేను ఉక్కిరిబిక్కిరి అయి 
నా ఓటమి అంగీకరించి , చేతులెత్తేస్తాను . 

మనసు రంగు, రుచి, ప్రదేశం, ఎవరైనా కనిపెట్టారా? 
అసలు, అది లేని ఖాళి ని మటుకు కనిపెట్టగలం ..
సర్వం తెలిసిన వేదాంతు లో ,ఏమి తెలియని పిచ్చి వాళ్ళో 
అయి ఉంటారు, అవును నిజమ్. 
అందుకే మనసుతో చలించడం నాకు నయం . 
మనసు చెలిమి ఆఖరుకి తప్పని నిర్ణయం . 
చెప్పినా ,కొట్టినా వినని మనసు నీకే మరి సొంతం ,
లోపల ఎన్ని యుద్ధలవుతున్నా ,పైకి మటుకు చిరునవ్వు 
ధరించే నీ నటన మొత్తానికి అసమాన్యం అంటూ 
రంగం చుట్టూ చేరి కరతాళ ధ్వనులు ,నాకు మాత్రమే 
వినిపించే మనసు మాయ సవ్వడులు ... 


మనసు చేసే కుప్పిగెంతులు కి ఒక్కొక్క సారి 
పగలబడి నవ్వుతాను, ఎంత హాయి ఆ నవ్వు .. 
మనసు తో తప్పని ఈ ఆట పాటలు కదా 
నా చిన్నతనం , నా బంగారు బాల్యం . 
ఈ స్నేహం ,ఈ వైరం ,ఈ వైరుధ్యం మనసా 
నువ్వో అధ్బుతం.. అవును అధ్బుతం .. 





25 జులై, 2013

నిదురా నన్నావహించాలి ..

నిదుర బెదురు బెదురు గా 
అదురుతున్న అడుగులతో 
అడుగులో అడుగులై ,
అడిగి అడిగి, నిదుర పోవా ??నిదుర రాదా ???ఇంకా 
అంటూ బుజ్జగిస్తే .. 

నేను ఆవలించి, ఆవహించి 
కలల తపస్సు లో కళ్ళు మూసి 
ఇహ లోకం లో కరుదెంచి 
అప్పుడేనా అని కలవరించాలి ,
కల వరించాలి అంటూ నీలి కళ్ళ 
కింద నీలి జాడలు వెతుక్కుంటూ ఎటో 
తప్పిపోవాలి, అవును నిదుర జాడ అడుగు జాడ 
అప్పుడేనా ? అప్పుడేనా ???

ఎన్నెన్ని లోకాలని పలకరించాలి 
చిన్నారి కోరికలని పలవరించాలి 
నేను పెరిగి ఇప్పుడు నా అంత అయినప్పుడు 
ఏమేమి చేయాలని కుతుహుల పడ్డానో, 
ఆ పనులు ఇప్పుడు నేను ఎందుకు చేయనో ?
అంటూ వేదన పొందాలి, వెతలై పొంగాలి .. 

ఇలలో సాధ్యం కానివి కలలో సాధించే 
అసాధారణ అలసత్వం సమీపించాలి 
రేయి అప్పుడే ముగిసేనా ? కనులు తెరిస్తే 
పగలేనా ? పగిలిన కలలేనా ? అంటూ కన్ను మూయాలి ,
కన్నీరు పన్నీరుగా జలకమాడాలి , హాయిగా నిదుర ఒడిలో 
పవ్వలించాలి , కుటీరాలు కలలకై కట్టుకోవాలి ,
ఆ తలుపులు ఇంక మూసి, తాళం పార వేయాలి .. 

ఇంత తతంగం వెనక చెలి చేరినట్టు గా చేరికగా 
కలత నిదుర కమ్మని నిదురైపోవాలి , కమ్మని నిదుర లో 
గమ్మున, మరుజన్మ అంచులై పోవాలి ,ప్రతి ఉదయం పునర్జన్మేగా నీకు .. 
ఎన్నెన్ని జన్మల నిదురో అన్నట్టు ఈ నిదుర నిన్ను ఆవహించాలి .. 
నిదురా నన్నావహించాలి .. 


ఇదేనా మరి నా పరిచయం ??

అలలు ,కలలు పెనవేసి 
అల్లిన వలల ముసుగు నా పై 
తొంగి తొంగి కాసింత వెన్నెల 
చిలకరింత ,పలకరింత నా పై .. 

చిరు చిరు సవ్వడులు ,సుతిమెత్తగా 
చిన్మయ నాదం నింపుతూ నాలో 
మరి ఏవో గాఢ పరిమళాలు 
ఎద నిండా గుబాళింపులు సంపెంగలై... 

ఎద ఏవో తీరాల లంగరు వేసి 
కలవరింతల పలవరింతల ఒడ్డున 
మాటు వేసి, తీయని స్వరాల సరాగాలకై 
తిరిగి తిరిగి వెనుతిరిగి వెతుకుతూ రాగమై మూర్చిల్లుతూ.. 

ఇదేనా స్నేహ రాగం?
ఇదేనా మోహ గీతం?
ఇదేనా మనసు గేయం?
ఇదేనా మరి నా పరిచయం ?? 




16 జూన్, 2013

మీ పిల్లల కోసం , మీ కుటుంబం కోసం

నాన్న ఒక జ్ఞాపకమ్.. 
చీకట్లో ,చేతిలో ఒక సిగేరేట్ తో ఏమేమి 
ఆలోచిన్చేవరో ??
ఆరుగురు పిల్లలు, నలుగురు ఆడపిల్లలం 
నత్త నావా , రోజుకి నాలుగో ,ఆరో అన్నాలు వండి వార్చే అమ్మ ,
చిన్న ఉద్యోగం, చిన్న జీతం, కాని ఎప్పుడూ కళ్ళల్లో ఏదో కలల వెలుగు 
చదువు తాళం చెవి అన్ని కల ల ద్వారాలకి అని నమ్మకమ్.. 
ఎంత చదివితే అంత చదివించే నాన్న ఉన్నారని ధైర్యం .. మాకు . 

లోటు అంటే ఏమిటో తెలీదు , ఆకలి వేసి ,అమ్మా అన్నం అంటే ఏ వేళయినా పెట్టే అమ్మ, అన్నపూర్ణ ఇంట్లో .. 
అమ్మా అంటే ఏం కావాలి ? ఆకలి వేస్తోందా అంటూ పరుగున వచ్చే అమ్మ .. 
ఎలా తెచ్చేవారో, ఏం కష్ట పడే వారో? నెలాఖరు అయినా చెరగని చిరునవ్వే ,నాన్న ఆస్తి . 

మా చదువు ,మా స్నేహితులు ,మా కబుర్లు అన్ని తన సొంతం చేసుకున్న 
అమ్మ , నాన్న మా సంపద . 
దిగులు అంటే తెలియదు, కలిసి ఉండడం లో ఆనందం మాకు తెలుసు, 
ఇంటికి ఎవరు వచ్చినా , ముందు ఒక కప్పు కాఫీ , తరవాత అన్నం పడేసి వచ్చి కూర్చునే అమ్మా. 

పిల్లల్లో ఒక్కరై , మా స్నేహితులతో కబుర్లు , జోక్స్ , సమస్త ప్రపంచం లో కబుర్లు 
అందరిని మన వాళ్ళే అంటూ హత్తుకునే పెద్ద గుండె , 

ఎందుకో ,ఏమో ఆ సిగేరేట్ పొగ తో ఉక్కిరి బిక్కిరై, ఆనాడు మొరాయించింది , 
మరో ఆరు సార్లు పోరాడి గెలిచారు.. 
తెల్లవారు ఘామున ఏదో ఘడియ లో , మా పిల్లలని ,అమ్మ ని వదిలి ఎలా 
వెళ్ళ గలిగారో ? చాలా దిగులు పడి ఉంటారు , అయ్యో ఎలా ? అని.. 

ఎందుకో ,ఈ రోజు తండ్రి ని తలుచుకునే దినం అంటే కొండంత దిగులు వచ్చి కూర్చుంది గుండెల్లో .. 
మనవళ్ళు అంటే ఎంత ప్రేమో ? ఎంత అపురూపమో?

మా నాన్నగారి కి తగిన కూతుర్లం అని పేరు తెచుకునే ప్రయత్నమే ప్రతి రొజు.. 
మన వారిని మనం చూసుకోవాలి, అందరూ సౌఖ్యమ్ గా ఉండాలి ,
అనే ఆలోచనలు నిజం చేసుకుంటూ , నాన్నగారండి , అని ఇంత పొడుగ్గా పిలిచే వాళ్లం . .. 

ఏదో , తెలియని ఆశ ,అంతా చూస్తున్నారా ?పై నుంచి .. 
అనే ఆశిస్తూ .. ఒక దినం ,ఒక్క దినం కాదు, ఇది ప్రతి దినం జరిగే మథనం .. 

ఇలా ఎంత మందో ? మధ్యలో వెళ్ళిపోయినా నాన్నలు .. ఆ సిగేరేట్ చేతిలోది 
విసిరేయండి ..ఇదే నా విన్నపమ్.. మీ పిల్లల కోసం , మీ కుటుంబం కోసం