"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

31 జన, 2013

నాకూ ఒక కల ఉంది.

ఎక్కడ నీ ఆత్మ స్వేచ్చా గానం 
పాడుతుందో ,అక్కడ 
అక్కడ జీవించాలి అని 
ఎవరు అన్నారు?

ఇక్కడ స్వేచ్చ అంటే గొలుసులు 
మతం పేరున ఒకటి 
కులం పేరున ఒకటి,
లైంగిక వివక్ష అంటూ మరొకటి 

ఇన్ని గొలుసులు కాళ్ళకి 
మెడ కి , అలంకారం అంటూ 
నమ్మించి వేసారు..
అసలు ఊపిరి ,మాట 

ఆడకుండా వేసిన గొలుసు 
ఒకటి ఉంది,కనపడుండా 
ఈ మాట ,అనకు,
ఈ పాట పాడకు ,
ఈ సినిమా చూడకు..
ఈ సినిమా తీయకు..

కుడి ,ఎడమ ఎటు 
తిప్పి చూసినా నల్లటి 
గోడ ఒకటి కనపడుతుంది 
నువ్వు ఏమి రాసినా 
ఆ గోడ పీల్చుకుంటూ 

నల్లటి విషాన్ని నీపై 
కక్కుతుంది, అదే మరి 
పెద్ద గోడ, పెద్ద దిక్కు 
పెద్దలకి పెద్దమ్మ దిక్కు..

మతం ,కులం ,ఇంకా 
ఎన్ని గోడలు కట్టినా 
స్వాగతం, విడి పోయి 
బతుకుదాం..మనం 

ఇదే మన గీతం ఇప్పుడు 
మతాలుగా ,కులాలు గా 
విడిపోయి చుట్టూ ,బలమయిన 
దుర్భేధ్యమయిన గోడలు 

కట్టుకుందాం ,మనకింకేమి 
పోయేదు లేదు, ఒక్క జీవం తప్ప..
సత్యం ,శివం ,సుందరం ..
ఎవరు వారు? ఏ కులం వారు?

అని అడిగే కూడలి లో 
నిస్సిగ్గుగా నిల్చుని ఉన్నాం..
ఆలోచన , కారుణ్యం 
ఎండిపోయిన నదులు ..

మన పాప భూమిలో ఇప్పుడు 
ఇంకా పెద్ద గా కోల్పోయేది 
ఏమి లేదు, రండి..రండి,
విడి విడి గా ఎవరి ద్వీపం 

వారు నిర్మించుకుందాం..
ఎవరి పాము పుట్టలు వారు 
పెరట్లో ,పాలు పోసి పెంచే 
విష సర్పాలు ఈ సంకెళ్ళు 

నాకూ ఒక్క స్వప్నం ఉంది..
నాకూ ఒక కల ఉంది,
ఈ సంకెళ్ళు ఖణేల్ ఖణేల్ 
మని విడిపోయినట్టు 

ఈ గొలుసులు తెగి పడి 
ఆ దారిలో పువ్వులు 
పూసినట్టు, ఆ నదులు 
ఇంకిన చారల లో తల్లి 

పాలు లాంటి కరుణ ఉబికి 
ప్రవహించినట్టు, మనుషులు 
చేతులు చేతులు కట్టుకుని 
మానవత్వం రన్ ల రన్నింగ్ 

చేస్తున్నట్ట్టు..నాకూ ఒక కల ఉంది..
నాకూ ఒక స్వప్నం ఉంది..
రేపటి ఒక వేకువ కోసం..ఈనాడు 
కనే ఈ కల ..కల్లేనా ...కలా..ఎలా??








30 జన, 2013

చెట్టే నా ఆదర్శం ..చెట్టే..

నేను అలా నడుచుకుంటూ 
ఊరు చివర కి చేరా,నాగరికత అంచున ,అడవి 
దారి మొదలయ్యే చోటు..

జర జరా జారుతున్న రోడ్డు కటూ ,ఇటూ ,అమ్మ 
ఆశీర్వాదం లా దట్టం గా అలుముకున్న చెట్లు..

ఆకాశానికి ,భూమికి మధ్య పచ్చని జాబులు 
నిరంతరం ఏవో ఊసులు పంచుకుంటూ ఉంటాయి మరి..

చిక్కటి చీకటి అజ్ఞానం లా పరుచుకుంది, అమావాస్య కాబోలు.
ఆకులు సడి సన్నగిల్లి, ఆఖరి పిట్ట ఊసులూ ఆగిపోయాయి..
నగరం నాకు ఒంటరితనం పంచింది, ఈ చెట్టు ఊసులు 
నేర్పుతోంది..విను ,విను నేను పంపే సందేశం విను 
ఆకాశం నీలి రంగు ని తుంపి పువ్వుల్లా ,నా జడ లో తురుముకుంటాను, 

అప్పుడప్పుడు చందమామ పువ్వు ,చల్లగా చామంతి లా పూస్తుంది
నా కొమ్మల మధ్య, ప్రతి ఉదయం ఎర్రని బంతి నా ఆకుల మధ్య 
చిక్కుకుని, బాగున్నావా అంటూ పలకరించి సరే మరి అని 
సెలవు తీసుకుంటుంది సాయంత్రానికి , అపురూప స్నేహం మాది,
ఎప్పుడూ ఏమీ ఆశించడు ..నిత్యం అదే పలకరింపు 
నాన్న లా భుజం తడుతూ..నేను ఎప్పుడూ ఒంటరి అనుకోను..

కింద నేల ,ఎక్కెడెక్కడి చేమ తెచ్చి నా గొంతు లో పోస్తుంది 
అచ్చం అమ్మ పోసే పాలు లా అనుక్షణం నా క్షేమమే ,తలుస్తూ..
నేను మెల్ల మెల్ల గా సేద తీరేను.చెట్టు ,అనాది గా చెపుతున్న 
అనగనగా కథలు ,చెవిలో ప్రియం గా వినబడుతూ ..
తటాలున ఎందుకో పైకి చూసేను, ఆకాశం చెట్టు కి 
పూసిన తారలు కనిపించాయి,ఎంత అందమో ,కాని ఎంత దూరమో 
అనుకునే లోపల, చెట్టు దయగా నాకు చూపించింది ,తనలోని 
ఆకాశం ని, ఒళ్లంతా మిణుగుర్లు ధరించింది ,ఒక్కసారి నాకు 
గగుర్పాటు , అమ్మో, ఆకాశమే నా చేతికి అందే దూరం లో 
మిణుగుర్లు మిల మిలా మెరుస్తూ ఫకాలున నవ్వుతున్నట్టు తోచింది..

వెర్రి మానవుడా , అని. కూర్చున్న కొమ్మ నే నరుక్కునే పిచ్చి వాడా?
అని పక పకా నవ్వుతున్నాయి..అదిగో ,చెట్టు ,ఆకులు ,మిణుగుర్లు ...

నేను నా నాగరికత వేపు..వెనక్కి అడుగులు ...ముందుకా 
ఈ అడుగులు నిజం గా ?వెనక్కా? చెట్టు స్థిరం గా అక్కడే..

చెట్టు స్థిరం గా అక్కడే..నాకు సందేశం ..నాకు  ఊరట..
నాకు ఆదేశం , నాకు ఆశీర్వాదం  చెట్టే నా ఆదర్శం ..చెట్టే..


29 జన, 2013

మున్ని బద్నాం హుయి.

మున్ని బద్నాం హుయి..
పాప మెలికలు తిరుగుతూ 
అచ్చం ఆమె లాగే ,అమ్మ కి 
మురిపం, నాన్న కళ్ళు 
ఆమె కే అంకితం ఆ బొమ్మ కే ..

అంగుళం ,అంగుళం కొలిచే 
కళ్ళు, మెచ్చే కళ్ళు ఆమె పై,
చొలి కె పీచె క్యా హాయ్ అని 
ప్రశ్నించే ఒంటి హొయలు.

మగవారి గడ్డం గీసుకునే 
బ్లేడ్ కయినా ఆమె ఉండాల్సిందే 
లుంగీ ,అయినా ,కాళ్ళకి చెప్పు 
అయినా ఆమె చెప్పాల్సిందే ..

ఆమె ఇంక వంటింట్లో పాత 
కాలెండర్ లో లక్ష్మి దేవి కాదు ,
చేతిలో పద్మాలుతో లక్ష్మి ని 
పెంచే లక్ష్మి కాదు..ఆమె ఇప్పుడు 

అడుగడుగునా నిన్ను 
ఆకర్షిస్తూ , వెంటాడుతూ 
నడి వీధిలో నిలబడ్డ ఆమె 
ఇప్పుడు, గాలి చొరబడని 

నాలుగు గోడల ఇరుకు 
మధ్య నిండి ,స్వేచ్చగా ఒళ్ళు 
విరుచుకుంటూ ,ఆమె..
కళ్ళు పైకి అతికించి ఈమె 

అతికించిన ఆనాటి ఆమె 
కాదు ఈమె..స్వేచ్చ అంటే 
ఇలాగే..మరి..ఒక్కసారి స్వేచ్చ అంటే 
ఇలాగే, పంజరం లోంచి 

పారిపోయిన చిలక కి 
వేటగాడి వల ఒక వింత 
ఆకర్షణ , గిల గిల కొట్టుకుని 
కళ్ళు మూసే అరక్షణం ముందు 

గ్రహిస్తుంది, స్వేచ్చ కూడా 
ఒక బాధ్యత అని, ఒక పోరాటం అని..
ఆమె కూడా గ్రహిస్తుంది..ఈ వెలుగు 
కలల ని హరించే కాంక్ష వెలుగు అని..

ఆకాశం లో కూడా నల్లటి బిలాలు 
ఉంటాయి, నిన్ను మింగేసే, కాంతి 
నే మింగేసే బిలాలు, మరి అందుకే 
ఒక్క సారి..నేల మీద కి దృష్టి 

మరలించి..ఆన్చి, ఆన్చి, 
నేల కి అడుగు ఆన్చి ,అడుగు వేయి..
మట్టి ,నేల ఎప్పుడూ మోసం చేయవు ..
అవును ,నేలా మట్టి ఎప్పుడూ మోసం 
చేయవు..

రికార్డింగ్ డాన్స్ అని కట్టడి చేసి,
టీ వి లో విచ్చలివిడిగా అనుమతించే 
ఈ డాన్సులు చూసి..రాసిన 
ఒక చిన్న వేదన స్రవంతి ఇది.










25 జన, 2013

స్త్రీ

అమ్మా ....బాత్ రూం లోంచి అరుపులు..
సంధ్య గుండె ఒక్క క్షణం ఆగిపోయింది..
ఈ క్షణమే తను భయపడుతున్న క్షణం  .. ఒళ్లంతా గజ గజ ..ఒక వణుకు పాకింది.
'సన్నిధి' కూతురు అమ్మా అని పిలిచిన ప్రతి సారి ,ఇలాగే జరుగుతుంది.
దుబాయ్ లో ఉన్నాము మేము..రోజూ ఏదో ఒక సంఘటన.. పేపర్ లో చదవడం..లేదా ఎవరో చెప్పడం..అనలేని, వినలేని వార్త లు..నోటి తో పలక లేని భయంకర మైన విషయాలు.

తన కూతురు ,మల్లెలు ,మందారాలు కుప్ప పోసినట్టు ,చక్కని అందమయిన  విగ్రహం..కళ్ళు చెదిరే అందం కాక పోయినా ,నిండుగా ఆకట్టు కునేటట్టు గా ఉంటుంది..ఇంకా పదేళ్ళే ..అప్పుడే పన్నెండు ,పదమూడు ఏళ్ళ అమ్మాయిలాగా ..

సన్నిధి ..ఏమయింది...ఎందుకలా ??అరుస్తావు? ఇప్పుడేమయింది..

అయింది...అనుకున్నదే అయింది..ఇంక ఈ చిన్న పిల్ల, మొన్న ,మొన్నే కళ్ళు తెరిచి, నా మొహం లోకి చూసి, నాకు అంతులేని ఆనందం కలిగించిన నా బంగారు పాప ,అప్పుడే మొగ్గ వికసించే వయసు లోకి ప్రవేశించింది.

అమ్మ గా నాకు సంతోషం కలిగించే విషయమే అయినా, ఏదో తెలియని భయం తో ఒళ్ళు జలదరించింది.

ఇంక ఆ రోజు నిండి నా ఒళ్ళంతా కళ్ళే, అనుక్షణం నా చిన్నారి కి ఏదో అవుతుందేమో అని , ప్రకాష్ కి ఎలా చెప్పను? నా భయాలు, నన్ను కుదిపి వేసే పీడ కలాలు? నీదంతా చాదస్తం..నీదంతా విపరీతం అంటాడు.

స్కూల్ బస్సు ఏడు గంటలకి ,మా ఇంటి ముందు ఆపుతారు, ఒక ఆరేడు మంది పిల్లలు ఎక్కుతారు. మా ఇంటి ముందు బస్సు స్టాప్ లో.

నేను కూడా సన్నిధి తో పాటు, ఏదో  పని ఉన్నట్టు వెళ్ళడం మొదలు పెట్టెను, మొదట్లో, నిజమే అనుకుంది, ఒక వారం రోజుల్లో అర్ధం అయింది, అమ్మా, నేను ఇంత పెద్ద దాన్ని, ఆరో తరగతి చదువుతున్నాను, ఇంకా ఏమిటమా? చిన్న పిల్లలాగా చూస్తావు? 

ఇంటి ముందు ఆగే బస్సు ఎక్కించడం ఏమిటి? అందరూ నవ్వుతున్నారు..

నవ్వితే నవ్వని, వాళ్ళ కేమిటి తెలుసు? నాకు తెలుసు ,ఈ దుబాయ్ లో ఎన్ని వింటున్నాము? నువ్వు చిన్న పిల్లవిరా..నీకు అర్ధం అవదు..

అంత కన్నా ఎలా చెప్పను?

ఎలా వివరించను? నా భయాలని..

స్కూల్ కి వేసుకునే డ్రెస్ కూడా ఒక అంగుళం కిందకే కుట్టిస్తాను..అప్పుడప్పుడు గొడవ పెడుతుంది..అమ్మా.ఏమిటమ్మా? మరి ఇంత పోడుగేమిటి ? అందరూ నవ్వుతున్నారు..

నవ్వితే నవ్వని ..అని తోసి పడేసాను..
అమ్మ మా ఫ్రెండ్ నవ్య పుట్టిన రోజు అమ్మా..నేను వెళ్ళాలి, ప్లీస్ అమ్మా అంటూ బ్రతిమాలింది.

కాదు కూడదు అంటే గొడవ, నేను నిన్ను దింపి వస్తాను, మళ్లీ నిన్ను తీసుకుని రావడానికి ఒక గంట లో వస్తాను ..అలా అయితేనే ఒప్పుకుంటాను అని నా అమ్మ స్టాంప్ అధారిటి ఉపయోగించి , ఒప్పించాను.

ఒక్కోసారి ,ఏమిటి నేను ఇంత విపరీతం గా ఆలోచిస్తున్నాను ఏమిటి? 
అనుకుంటాను..అలా అనుకున్న మర్నాడే ,పేపర్ లో ఏదో వార్త కనపడుతుంది ..నేను చేసేది సరి అయినదే అనిపిస్తుంది.

పుట్టిన రోజు పార్టి కి వెళ్లి వచ్చేక ,సన్నిధి చాలా ముభావం గా కనిపించింది. ఎంత అడిగినా ,ఏం లేదమ్మా , అంటూ తోసి పుచ్చింది.

మూడో రోజు అనుకుంటా, చెప్పింది, తను వేసుకునే పొడవయిన డ్రెస్ గురించి ,రక రకాల కామెంట్స్ చేసి, ఏడిపించారు ట ..పోనీలే సన్నీ, నువ్వు బాధ పడకు, అంతా మా అమ్మ ఎంపిక అని తప్పు అంతా నామీదే పెట్టు..

"నన్ను ఎన్ని అనుకున్న నాకు ఏమి కాదు, ఏమి అనిపించదు..

సన్నిధి, ఇది నీకు ఇప్పుడు అర్ధం కాదు లే అమ్మా.".

నా ఆరోగ్యం లో ఏవో మార్పులు..అస్తమాను ,ఏదో జరిగి పోతుంది, నా పాప కి ఏదో కీడు కలుగుతుంది, బయట అందరూ, తోడేళ్ళు, పులులు, సింహాలు, మగ వారే ..ఆ మొహాల తో తిరుగుతున్నారు..
అలాంటి అడవిలో ,నా చిట్టి తల్లిని నేను ఎలా వదలను? 
తిండి సయించదు, నిద్ర పట్టదు ..నా పాప ని నేను రక్షించు కోగాలనా?

పక్కింటి కి వెళితే అక్కడ అంకెల్ ..ఉంటాడు, ఎదురింటికి వెళితే అక్కడా వారి అబ్బాయి, పది హేడు ఏళ్ళ అబ్బాయి, చుట్టాలింటికి వెళితే, అక్కడ మరో తాత గారుంటారు..ఎంత మంది నిండి కాపాడ గలను? నా పువ్వు పాప ని..

నాకు తీవ్రమయిన అనారోగ్యం ..ఆసుపత్రి లో అన్ని పరీక్షలు జరిగాయి, ప్రకాష్ విసిగి పోతున్నాడు, ఆఫీసు కి సెలవు పెట్టి ,నన్ను ఆసుపత్రి కి తీసుకు వెళ్ళడం, ఆ పరీక్ష ఫలితాలు కోసం ఎదురు చూడడం..అలసి పోయాడు ప్రకాష్ కూడా..ఒక రోజు, బలహీనమయిన గొంతు తో, నా భయాలన్నీ చెప్పేను ..నిర్ఘాంత పోయాడు. 

"సంధ్యా ,ఇలాంటి భయాలతో మనం ఇక్కడ మన పాప ని పెంచలేం  పద, మనం ఇండియా వెళ్లి పోదాం..పోనీ ,అక్కడ అయితే నీకు ధైర్యం గా ఉంటుంది, మన వాళ్ళు అందరూ ఉంటారు..ఏమంటావు" ?

"ప్రకాష్, నీకేమయినా మతి పోయిందా? అక్కడ జరిగే వార్తలు వింటున్నావు కదా...మన దేశం లో అయితే కోర్టులు , వాయిదాలు అంటూ అసలు శిక్ష ఎప్పుడు పడుతుందో తెలీదు..ఇక్కడ చూడు, మొన్న వాడి ని ఉరి తీసేసారు, అంత ఒక నెల లో అయిపొయింది విచారణ, శిక్ష"

"కాని,..సంధ్యా. ఇతను రేపు పొద్దున్న అమాయకుడు అని తెలిసిన తెలియవచ్చు, పోయిన ప్రాణం తిరిగి రాదు కదా, అతను ఇక్కడ పని చేసే ఎక్ష్ పాట్..అంటే, వేరే దేశస్తుడు, పైగా పేద వాడు, అతనికి అన్యాయం జరిగిందేమో కూడా, మనం ఏం చెప్పలేం."

"సంధ్యా ! మీరు నలుగురు ఆడ పిల్లలు, మీరు ఎలా పెరిగారు.. మర్చిపోయావా? "
"అవును..ప్రకాష్, నేనూ అదే అనుకుంటాను, మేం అందరి ఇళ్ళకి వెళ్లి ,అబ్బాయిల తో సమానం గా ఆడే వాళ్ళం, చెట్లు ఎక్కే వాళ్ళం, క్రికెట్ ఆడే వాళ్ళం, సైకెల్ తొక్కుకుంటూ, స్కూల్ కి వెళ్ళే వాళ్ళం..కాని, ఎంత ధైర్యం గా ఉండేది మాకు, అమ్మ వాళ్లకి కూడా నిశ్చింత, చుట్టూ పక్కల అందరూ తెలిసిన వాళ్ళే"

ఊపిరి పీల్చుకుని, " అమ్మ ఎప్పుడూ ,వంటింట్లో పనులతో బిజి ,మా చదువులు మేం చదువుకునే వాళ్ళం, ఎప్పుడూ ,చదువుకోవే అని చెప్పిన గుర్తే లేదు"

"కానీ ,ఇప్పుడో, ఎంత టెన్షన్, ఈ  చదువుల టెన్షన్, నాకు మన చిట్టి తల్లి మీద చాల నమ్మకం, బాగా చదువుకుంటుంది, ఆ విషయం లో నాకు బెంగే లేదు, వద్దే అన్నా రాత్రి మేలుకుని చదువుతుంది, అయినా ఒక్క పాప తో సరిపెట్టి ,తప్పు చేసేమేమో ప్రకాష్.."

"ఇంకేమిటి? నీ బెంగ, మన సన్నిధి కి యే  కీడు వాటిల్లదు, నేను చెబుతున్నాను ,నువ్వు ధైర్యం గా ఉండు ,సంధ్యా, ఇక్కడ ఉండే ఉద్యోగ బాధ్యతలు, కష్టాలు ,నీకు తెలుసు గా, నువ్వు కూడా ఇలా బెంగలతో ,నాకు మరింత కష్టం తెచ్చి పెట్టకు, ప్లీస్ ఇది నా విన్నపం " అని ప్రకాష్ మృదువు గా కోరేడు నన్ను..

కొన్ని రోజులు నేను కోలుకున్నట్టే ఉన్నాను..ఇంతలో మరో సంఘటన ,మా వీధి లోనే, ఒక మెయిడ్ ని ,కొంత మంది పట్ట పగలు ,నడుస్తున్న కార్ లోకి లాక్కు వెళ్లి, ఆమె ని రకరకాలు గా హింసించి దారుణం గా చంపి పడేసారు..అని..

నాకు పూర్తిగా మనశ్శాంతి కరవయింది, సన్నిధి మీద విసుక్కోవడం ఎక్కువ అయింది, స్కూల్ బస్సు రావడం ఒక్క పది నిముషాలు ఆలస్యం అవుతే చాలు, నాకు ఇంక బి పి పెరిగి, తల తిరగడం, తల నొప్పి, విపరీతం గా రావడం, ఎవరికీ చెప్పకుండా నాలో నేనే భరిస్తున్నాను..ఎవరికీ, ఏం చెప్పను ఈ దిన దిన గండం..దిన దిన టెన్షన్ ...గురించి..

పెద్ద క్లాస్ లోకి రావడం తో ట్యూషన్ తప్పనిసరి అయింది. వీధి చివర నాలుగు బ్లాక్స్ ,అవతల ,మహిళా టీచరే , కాని ,ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ఒదిలి పెట్టాను, ఒక గంట లో హాజరు అక్కడ నేను.

అక్కడ మరెవ్వరు అమ్మలు ఇలా, నాలా రావటం లేదు, ఇది నాలో ఏమయినా రోగమా? నిజం గా అనిపించింది, సన్నిధి కూడా చాల గడవ పెట్టింది. "అమ్మా నన్ను ,నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు..నువ్వు ఇలా నన్ను దించడం అది ,ఇంకా చాలు అమ్మా" అని..

సరే అని ఒప్పుకున్నాను, నువ్వు ఈ మోబైల్ ,పట్టుకు వెళ్ళు, మీ టీచర్ ,తలుపు తీయగానే, నాకు ఒక మిస్సెడ్ కాల్ ఇవ్వు, నువ్వు ఒక్క రోజు మర్చి పోయినా ,నేను వెంటనే  వచ్చే  వచేస్తాను ,నా సంగతి నీకు తెలుసు కదా ..

ఇష్టం లేక పోయినా ,నా మొండితనం తెలిసి ఒప్పుకుంది, సన్నిధి కి తెలుసు అమ్మ బస్సు స్టాప్ వరకూ వచ్చి ఎక్కించక పోయినా, అమ్మ ,కింద సెల్లార్ లోనే తన బస్సు కదిలే వరకూ వేచి ఉంటుంది అని, ఒక్కోసారి కోపం, విసుగు వస్తాయి, కాని అమ్మ కదా, నా కోసమే ఈ తాపత్రయం అని మళ్లీ సద్దుకుంటుంది.

ఒక రోజు..ఆ రోజు సంధ్య ఎప్పటికి మర్చి పోలేదు..

సన్నిధి మామూలుగానే వచ్చింది స్కూల్ నించి..

"అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి, కూర్చో అంటూ కూర్చో బెట్టి,
అమ్మ ఇవాళ మాకు  సైన్స్ క్లాస్స్ లో ,మా శరీర మార్పులు గురించి, సృష్టి కార్యం గురించి చెప్పేరు, అదే, పిల్లలు ఎలా పుడతారో "అని, నా మొహం లో మారే రంగులు ని చూస్తూ ,చెపుతోంది.

"అమ్మ నువ్వు ,ఎందుకు భయపడుతున్నావో , నాకు ఇప్పుడు బాగా అర్ధం అయింది, కాని ,ఇంకొకటి కూడా నాకు బాగా తెలిసింది, మన శరీరం లో భాగం కి ఏదయినా ఘటన లో, దెబ్బ తగిలితే మనం ఎలా వైద్యం చేసుకుని కోలుకుంటాం అమ్మా..ఇది కూడా అంతే.."
నా శరీరం ని నా ఇష్టం లేకుండా , బలవంతం గా టచ్ చేస్తే ,ఏం చేయాలో ,నాకు బాగా తెలుసు..నా బలం అంతా ఉపయోగించి పోరాడుతాను.."

"ఒక వేళ ,జరగకూడనిది ఏమయినా జరిగితే అది దురదృష్టం..నా తప్పేమీ లేదు అందులో, అది ఒక దుర్ఘటన ..నా ప్రమేయం లేకుండా జరిగిన దాడి అది, ఒక టెర్రరిస్ట్ దాడి లాంటిది..అది, వాడికి మరణ శిక్ష పడే వరకూ పోరాడుతాను నేను.."

నా శరీరం ఏమి మైల పడి పోదు, నా కారక్టర్ కూడా ఏమి పోదు, పోయింది ఆ అత్యాచారం చేసిన వాడి శీలం..నాది కాదు. ఇంక నేను ఈ హింస ,రోజు రోజు, నీ కాపలా, నా భయం, నా శీలం గురించి ,ఎవరో చేసే దుర్జన్యం గురించి భయం తో ,ఇంకా ఇలా రోజు చస్తూ ,నేను బ్రతక లేనమ్మా.."

అంటూ భోరున ఏడ్చింది...నేను నిస్చేష్టు రాలినయాను..

నా కూతురేనా? నేను దానిని ఎంత హింస పెట్టేను, కనిపించని భూతం గురించి గజ గజ వణికి పోతూ, దానికి జీవితమంటే భయం, భయం అని నేర్పించాను, నేను ఒక తల్లినేనా అసలు..

ఈ రోజు అదే ఒక తల్లి లాగ నాకు ధైర్యం అంటే ఏమిటో నేర్పించింది, 
జీవితం అందరికి ఒక్కటే ,స్త్రీ కాబట్టి ,నీకు కొర జీవితం ఏమి ఇవ్వలేదు, అందరికి సృష్టి ఒక్కలాగే ఒకే జీవితం ఇచ్చింది.

నా భయాలు, దిగుళ్ళు, నా చిన్న ఊహలు అన్ని ఓఫ్ అని ఎగిరి పోయినట్టయింది..

నా పాప ,సన్నిధి ,నాకు కళ్ళు తెరిపించింది..నేను ఒక సగాన్ని, ఆకాశం లో సగాన్ని..నేను స్త్రీ ని...నా జీవితానికి నేనే అర్ధాన్ని, నేనే ఒక సంపూర్ణ స్త్రీ శక్తి ని..అని. ...

ఆ రోజు నించి ,నా అనారోగ్య సమస్యలు చేతి తో తీసినట్టు పోయాయని వేరే చెప్పాలా? 










24 జన, 2013

కంది పప్పు పచ్చడి ....జ్ఞాపకాలు


ఇప్పుడే ఈ టీ వి లో కంది పప్పు పచ్చడి ..చూసి, నోరు ఊరి, స్టవ్ మీద అన్నం పడేసాను..కంది పప్పు ,మేరప కాయలు, వేయించి వచ్చెను, అది చల్లారే లోపల , ఈ పోస్ట్.

రోజూ రెండు ఎండు పుల్కాలు ..ఒక కూర, మజిగ, కొంచం సలాడ్ ఇది భోజనం.

చిన్నప్పుడు హరయించుకునే శక్తీ ,రాళ్ళని కూడా, అప్పుడు రేషన్ బియ్యం, తూచి, తూచి కొండం,ఇప్పుడు చేతి నిండా డబ్బు ఉన్నా, తినలేము..కాలరీల కొలత ఇప్పుడు.

ఇంతకి, మా ఇంట్లో ఆరుగురం పిల్లలం, అమ్మ ,నాన్న, పని వాళ్ళు ఇద్దరు, మా అమ్మ చుట్టూ ,తిరిగే వాళ్ళు, ఇంకా ఇంటికి వచ్చి పోయే చుట్టాలు, మా స్నేహితులు, ఇంత మందికి ,మేం మాట్లాడుకుంటూ కూర్చుంటే ,అమ్మ ,పదండి అన్నాలు తినండి అంటే లేవడమే, చెప్పకర్లేదు..నోరు విప్పి.

ఇంత మందికి రోజూ పప్పు, ఉండాల్సిందే, ఆరు కిలోల పప్పు కొనేవాళ్ళం, నెల ఖరుకి, డబ్బాలు బోర్లించడమే..

బస్తా బియ్యం, ఆరు లీటర్ల పాలు, ఏమిటి సత్రమా? ఇల్లా, అవును అన్నపూర్ణమ్మ సత్రం అంటారు, మా అమ్మ పేరు రాధ అయినా, మా మామ్మ గారి పేరు ..అన్నపూర్ణ మరి..ఆ వారసత్వం.

కంది పప్పు, లేని రోజు, మేం అందరం, దానికి ముందు తినడానికి  చేసిన కొత్తిమెర కారమో, వెల్లుల్లి కారమో, కరివేపాకు పోడొ , లేదా నిమ్మ కాయ పచ్చడి, అంటే ఇవన్ని ఆపిటిసేర్స్ ట ,ఎప్పుడూ ఆవురావురం అంటూ ఉండే వారం, మాకెందుకు అంటే, అది కూడా ఒక అడహరువు గా కడుపు నింపుతుంది అని అమ్మ ప్లాన్ కాబోలు, 

మేం అందరం ఈ లోపల మొదటి అన్నాల ముద్దలు తినేస్తే, మా తమ్ముడు మటుకు పళ్ళెం తోసేసి, నేను తినను అని పెంకి వేషాలు వేసేవాడు.. అప్పుడు అమ్మ వాడికి ఒక్కడికి ,వేడి వేడి అన్నం లో పంచదార వేసి, ఆ పై, ఒక చెంచాడు నెయ్యి పోసి, తిను అనేసేది, మాకందరికీ ,ఏడుపే మరి..

తొందర పడి ,ఈ కారాలు కి లొంగి పోయామే..అని..
పప్పు జ్ఞాపకాలు ఇన్నేనా? అంటే ఇంకా చాలా ఉన్నాయి..
కంది పప్పు పచడి ,కాస్త నాలుక్కి తగల గానే, ఇంకా కొన్ని జ్ఞాపకాలు తన్నుకుని వస్తాయి..
ఉంటాను మరి, పచ్చడి నూరు కోవాలి..

22 జన, 2013

మౌనం ... ఘనీభవించి ,పెద్ద పెద్ద మంచు పలక

మౌనం ...
ఘనీభవించి ,పెద్ద పెద్ద మంచు పలక 
ప్రాంతాల అసమానత ,చిచ్చు 
రగిలి ,రగిలి ,రావణ కాష్టం లాగ 
వేడి తగిలినా, ఈ మంచు పలక కరగదు.

నడి రోడ్డు మీద స్త్రీ ని, మాన భంగం 
చేసి, ప్రాణాలు పీల్చి , మానం మీద బట్ట 
కూడా ఊడ దీసి, వెర్రి తలలు వేసిన 
మనవ మృగం వికటాట్టహాసం , చెవులని 
చిల్లులు పొడుస్తూ ఉంటే ..మౌనమ్ ,మంచు పలక 
మరింత ఘనీభవించి ,నిస్తేజం గా చూపులు 
ఆకాసానికో ,వీపుకో అతికించి , 
నిస్తేజం గా, సినిమా హాల్ తెర మీద బొమ్మ ,
వార్త పేపర్ లోనో ఒక వార్త..ఇంటి గోడ మీద 
చిన్నదృశ్య  పెట్టె లో ఒక వినోదం క్షణం లా 

రోడ్డు మీద ఆకలికి ,సొలసి పడి పోయిన 
ముదుసలి కి, మందు బాబేమో అని 
పేరు పెట్టి, వాడి ఖర్మ, అని వాహనాల లో 
బిరా బిరా పోతాం..ఒక్క పూట ఆకలి కి 
ఓర్వలేని మనం..ఆకలి చావులా?
బిర్యాని ఆఖరి ముద్ద నోట్లో పడేసుకంటూ 
నోరు పుక్కిలిస్తాం...మంచు పలక ఘనీభావిస్తూ 

ఉంటుంది..ఒక మంచు పలక మన మధ్య..
అయినా ,మనం తప్పించుకుని ,తప్పించుకుని 
హలో, హలో కుశలమా అని సెల్ ల లో 
పలక రించు కుంటూ ,పోలో మని పోతూ 
ఉంటాం, రోజు రోజు కి, మంచు పలక 
హిమాలయాల అంత ఎత్తై , కాళ్ళకి ,కళ్ళకి 
అడ్డు వస్తూ మనుషులని నొక్కేస్తూ ఉంటుంది 

మంచు పలక లు, నలు చదరం గా ,
గదులు గదులు గా..కుంచించు కు పోతూ,
అయినా , రోజు కి ఇన్ని గంటలు ఇస్తే చాలు,
ఇంతింత జీతాలు ఇస్తే చాలు, మాకు 
ఇంకేమి వద్దు, ఏమిటి ఘోరాలా?
మేమూ వెలిగించేం కదా, మిణుకు మిణుకు 
మనే కొవ్వొత్తులు, ఒక నిరసన గొంతు లో..

మంచు పలకలు, విరివిగా పరచుకుని 
భూమి ఒక మంచు గోళం అయింది ..
ఇంకా శబ్దం , మొదలు అవలేదు, ఇంకా సృష్టి 
కి ఆరంభం అవలేదు, అంతా చలనం లేని మంచు 
ఒక్క కిరణం, ఒక్క శబ్దం, ఒక్క పలుకు,
ఒక్క అరుపు, ఒక్క కేక, ఒక్క తీక్ష్ణ ,చురుకు మనే 
స్పృహ ,ఎక్కడయినా మొదలయితే ...

ఈ మంచు పలక ని బద్దలు కొట్టవచ్చు..
కాని ,ఇప్పట్లో ఏమి ఆ ఊహే లేదు..
రండి, ఈ మంచు పలకల మధ్య ,
శరీరాల వేడి రగిలించుకుంటూ , శబ్దం లేకుండా 
మౌనం దీక్ష ని, అల్లుకుంటూ , మానవ జాతి ,నర జాతి 
ఎలా కుంచించుకు పోతోందో చూస్తూ ఉందాం..

ఈ మంచు పలకలే ,
మన గుండె అంచులు గా మలిచాం..
మేం చలి గుండె ని తెల్లని రక్త నాలాలతో 
నడుపుతాం..మేమే మంచు పలకలం, అసలు..
ఇంకా వేరే సందేహమా? 
శబ్దం ఉంటే , నిరసన గళం అంటూ ఉంటే 
ఎప్పుడో ఈ మంచు పలక పగిలేది కాదా?






19 జన, 2013

పాప్ కోరన్ డే ట ,


ఇవాళ ,పాప్ కోరన్ డే ట ,ఇప్పుడే తెలిసింది.
నా టీ వి ,ఈ టీ వి లో ఫ్రీజ్ అయిపోతుంది..పగలు.
సుమ చెప్పింది ఇప్పుడే, సినిమాలు పాప్ కోరన్ తోనే చూస్తున్నాము ట ...
మనమేమయినా అడిగామా? 
ఈ కల్చర్ ,దిగుమతి అయింది, ఇంకెక్కడ నించి,
మంచి నీళ్ళు లాగ , పెప్సీలు కోక్ లు తాగే దేశం నించి.
మన చిన్నప్పుడు, రూపాయి యాభై పైసలు కి కుర్చీ క్లాస్స్, 
ఒక కలర్ సోడా, ఒక పది పైసలు ,అవేమిటి అని అడక్కండి,
తరవాత ,తరవాత ,పది రూపాయలు, పోనీ ఇరవై ,ఆ పై ఏభై .
అమ్మో అని గుండెల మీద చేయి వేసుకుని, పర్సులు తెరిచే వాళ్ళం..ఇంకా గుర్తే, జగదాంబా అన్నిటి కన్నా ఎక్కువే ,కాని ,అక్కడ చూస్తె ,సినిమా ఎంత బాగుంటుందో అని, పర్సుని 
బుజ్జగించే వాళ్ళం..

ఇప్పుడో, అక్షరాల ,వంద, కాదు ఆ పై ఇంకో పాతిక ..ట ..
ఆ పై, ఒక పేపర్ కప్ లో వేడి బ్రౌన్ కలర్ నీళ్ళు ,అదేనండి కాఫీ ,అక్షరాల ,యాభై రూపాయలు..

ఇంకా ,మనం అడుగు సినిమా హాల్ వేపు పడుతూ ఉంటె, 
ఘుమ ఘుమ లాడే ,ఈ పాప్ .కార్న్ ...మనాల్ని ముక్కు పట్టుకుని పిలుస్తుంది, ఒక పెద్ద కాగితం పొట్లం లో ,ఇన్ని పోసి, నిర్దాక్షిణ్యం గా ఒక అర వంద లాక్కుంటాడు..

మనం ,మన పెద్ద వానిటీ బాగ్ లో ,ఎందుకయినా పంటి కిందకి పనికి వస్తుంది ,సినిమా బోర్ కొడితే ,ఇవయినా లాగించ వచ్చు ,అని మహా ముందు చూపు తో తెచ్చుకున్నవి, రక్షక భటు రాండ్రు ,మహా లాఘవం గా లాక్కుని, తినేయారు లెండి, దాచి పెడ తారుట ....ప్రైవసీ మీద దాడి కాదూ ...

ఇన్ని భద్రతా వలయాలు దాటి, ఇప్పుడు ఈ సినిమాలు ఇక్కడే ఈ స్క్రీన్ ల మీదే ఎందుకు చూడవలె..??

మంచి సౌండ్ ,పిచ్తర్ ,,అని..
 ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ పాప్కారన్ నిండా ,కలోరీలు తప్ప ఇంకేమి కాదు..ఉప్పు, వెన్న..పైగా బోలెడు ఖర్చు కి ఖర్చు..

అయినా వినం మేం ,అంటారా..భరించండి..

అయినా, మనలో మాట..భలే ఉంటుంది,  పాప్ కార్న్ , 
వద్దు ,వద్దు, మన మర మరాల మిక్ష్తర్ ..ఓర జంతికలు 
తో నే సినిమాలు చూడాలని ....కంకణం కట్టుకుని ,ఈ ఐ నొక్ష్ 
ధియేటర్ ల దాష్టీకం కి చెల్లు చెప్పే సమయం కోసం ఎదురు చూద్దాం..

నోళ్ళు కట్టుకని, ఈ దీక్ష లో పాల్గొనే వాళ్ళు అందరూ ,
వారి ,వారి జంతికల పొట్లాలు పట్టుకుని, మాఊరు కి, బీచ్ రోడ్ కి వచేయండి ...మీదే ఆలీసం..

16 జన, 2013

స్వేచ్చ

నీకు ఎంత స్వేచ్చ నిచ్చాను?
నీకు చదువు చెప్పించాం..
నీకు తమ్ముడి తో సమానం గా చదువు చెప్పించాం..
నీకు పెళ్లి చేస్తాం..మేమే ..ఈ లోగా నువ్వు తొందర పడకు 
అంటే నీకు ఎందుకంత కోపం?
అంటే మేము నీ క్షేమం కోరే వాళ్లమే కదా..
నీ బాధ ఏమిటి ఇప్పుడు??
అమ్మా, నాన్నా, 
నాకు స్వేచ్చే నివ్వడం..చదువు నివ్వడం..
నన్ను తమ్ముడితో సమానం గా పెంచడం..
ఇవన్ని మీరు నాకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడితే..
నాకు మీరు ఇవ్వడం కాదు..
నాకు గా కావాలి..
ఒక ఆడ పిల్లలా కాదు, ఒక మనిషి లాగ చూడండి ముందు..
పుట్టినప్పటి నించి, 

శ్వేతా, అలా గెంతకే, అలా ఆడకే ,మగ పిల్లల తో సమానం గా అలా చెట్లు ఎక్కకే. ..ఇదిగో కూర్చుని సంగీతం నేర్చుకో, లేక పోతే కారంస్ ఆడుకో, నేను ఆడతాను..
తమ్ముడి తో పోటీ ,ఏమిటి?
అమ్మా..నేను వెళుతున్నాను, స్కూల్ కి, ఇదిగో ఒక్క క్షణం ఆగు, నేను వచ్చి ఎక్కిస్తాను బస్సు.
అమ్మా, నేను పెద్ద దాన్ని అయాను, బస్సు స్టాప్ వరకు వెళ్ళగలను అమ్మా, అయినా ,నా కన్నా చిన్నవాడు, వాడు ముందే వెళ్ళిపోతాడు ఒక గంట, వాడికి తోడూ వెళ్ళవు, నాకెందుకు అమ్మా, ఈ తోడూ?

నీకు తెలీదే శ్వేతా ..నువ్వు ఆడపిల్లవు..అన్న అన్ని మాటలు నాకు వినపడ్డాయిలే అమ్మా..
నాకు టెన్నిస్ ఆట భలే ఇష్టం అమ్మా, నేను మా స్కూల్ లో చంపియన్ ని, నేను అకాడెమి కి వెళ్లి ఇంకా బాగా నేర్చుకుంటాను నాన్నా..
ఎక్కడ ? ఫలానా చోట, చాల దూరం కదా అమ్మా..నిన్ను పొద్దున్నే దింపడం ,మాకు వీలవదు శ్వేతా..
నాన్నా, నేను సిటీ బస్సు లో వెళతాను, లేక పోతే చిన్న మోపెడ్ బండి కొని ఇవ్వండి..

అమ్మో ,అంత పొద్దున్నే ,రోడ్లు ఖాలీ గా ఉంటాయి, నీకు తెలీదే ,రోజులు బాగో లేవు. బాగా చదువు కో!
చక్కగా మంచి కాలేజ్ లో సీట్ సంపాదించుకో, చదువు ఉంటె చాలు ,మంచి సంబంధాలు వస్తాయి..
పెద్ద ఉద్యోగం వస్తుంది ,అని మాట వరసకి కూడా అనలేదు అమ్మా నువ్వు.
తమ్ముడు స్కేటింగ్ నేర్చుకుంటాను అంటే సరే అన్నారు..

నా టెన్నిస్ కి ఎన్ని ఆటంకాలు..
నా చదువు కి ఇంట్లోనే, కాని తమ్ముడి ని ట్యూషన్ కి పంపించారు.
ఇలా, ప్రతి విషయమ లో నేను ఏదో ఒక తేడా ,ఒక వివక్ష అనుభవిస్తూనే ఉన్నాను..

అమ్మా, నువ్వు కూడా ,నీ ఇష్టం ఏమిటో ఎప్పుడూ చెప్పావు, నాన్న గారి మనసు లో మాట పైకి చెబితే ,అదే నీ మాట అంటావు.
నన్ను విజ్ఞాన యాత్ర కి పంపమని అడిగితే, ముందు ,నువ్వు చాల ఉత్సాహం చూపించావు, నాన్న గారు వచ్చి అమ్మో అంత దూరమా వద్దు అంటే, నాకే నచ్చ చెప్పావు.
ప్రతి క్షణం ,నా మనసులో పుట్టిన ఆశ ,కోరిక ,ని నేనే ఒక్కోసారి మనసులోనే చంపెసుకునే దాన్ని..
పైకి చెబితే ,అదినెరవేరుతుందో లేదో అని అనుమానం ..నన్నువెంటాడేది.

స్వేచ్చ  నివ్వడమా?

అమ్మా ఎవరో ఇస్తే వచ్చేది స్వేచ్చ కాదమ్మా..
నాన్న .చదువు ,నాకు వచ్చింది కాబట్టి చెప్పించేరు. నేను తమ్ముడి కన్నా తెలివయిన దాన్ని. అయినా ఉన్న ఊరు లోనే చదివిస్తారు అని నాకు తెలుసు, అందుకే నేను మరి గట్టిగా కష్ట పడి చదవ లేదు..నాకు ఐ ఐ టి లో వస్తే పంపించేవారా?
లేదు..అందుకే నేను చదవ లేదు..
నా స్వేచ్చ , కి చాల సంకెళ్ళు ,కనిపించేవి కొన్ని, కన పడనవి కొన్ని.. 
అమ్మా, నాన్నా, నా పెళ్లి విషయం లో మటుకు ,ఎవరి ప్రమేయం వద్దు, నేను ఉద్యోగం చేసి, నాకు నచ్చిన వాడిని నేను చేసుకుంటాను..
ఒక వేళ ,నా నిర్ణయం సరి కాక పోతే ,నేనే దాన్నిని సరి దిద్దుకుంటాను.
పెళ్ళే జీవితం కాదు, నాకు తెలుసు ,సహచర్యం అవసరమే, కాని, దాని కోసం ,నా జీవితాన్ని ఫణం పెట్టాను..
అమ్మా ,ఇంకా ఇచ్చిన స్వేచ్చ చాలు, నేను ఇంకా తీసుకుంటాను అమ్మా, స్వేచ్చ ని నేనే తీసుకుంటున్నాను..
నా బాధ్యత తో...సరేనా అమ్మా..
కాలం మారాలి, మారుతుంది..శ్వేత మనసులో ఒక చిరు ఆశ, ఒక పెను  నిరాశ ని దూరం చేస్తూ..

14 జన, 2013

బోలో నేటి యువత కి జై..

మనం ఇంతే..
మనం ఇంతే,
సినిమా హీరోలే 
మన ఆరాధ్య దైవాలు.

వాడి సినిమా హిట్ 
అయితే పండగ ..
అదే ఫట్ అయితే 
దిగులు కమ్ముకుని ఏడుపే ..

హీరో ఒంటి మీద ఈగ 
వాలినా ,మనకి ఏనుగు తో 
తొక్కించిన బాధ..
కట్ అవుట్ లకి పాల 
అభిషేకాలు , నూట పదహారు 
కొబ్బరి కాయలు, వాడి క్షేమం 
గురించి కొడతాం..

ఇంట్లో అమ్మ నాలుగు 
రోజుల నించి ,జ్వరం తో 
మూలుగుతోంది, అయతే ఏమిటి ట ?
బోర్డర్ లో సైనికుల తల కోసి 
అంగాంగం కత్తి కొక ఖండం గా 

పడేస్తే ,మన కేమిటి ?
ఆహా మన కేమిటి ?
మన ఇల్లు పదిలం ,మన 
ఉద్యోగం బహు పదిలం.
మన నిరుద్యోగం ,పోనీ 
ఏమయినా వదులుతుందా?

ఇవతల వంద రోజుల 
పండగ దగ్గర పడుతోంది,
ఎన్నని చేయాలి? మీకేమయినా 
తెలుసా మా బాధ అసలు..

ఈ ఏడాదికి అతి పెద్ద హిట్ 
మా హీరో దే కాక పోతే ,నా తల 
తీసి నేను ఎక్కడ పెట్టుకోవాలి..
మీకేం తెలుసనీ..ఆహా ఏం తెలుసనీ..

సుభాష్ ఆ? వాడేవాడు ? ఏ 
సినిమా లో హీరో? కాదా ? అయితే 
నాకేం పని..వివెకానందా ? ఇంత 
పెద్ద పేరు ఉంటే ,ఎప్పటికి హీరో 
కాలేడు , చిన్నగా, మహేష్, 
వెంకటేష్, నాని ఇలా ఉండాలి 
పేర్లు..మీకు ఈ మాత్రం కూడా 
తెలిదా? అమాయకులు..

దేశం కోసం త్యాగం ఆ?
సినిమా పేరు అదే అయితే ,
నే ముందే చెప్పగలను ,
అట్టర్ ఫ్లాప్ ..ఈ బొమ్మ నడవదు..
కనీసం ఒక్క ఐటెం డాన్సు అయినా 
లేకుండా ఈ దేశం లో సినిమా 
నడవదు..నేను ,ఫలానా 
హీరో వీర అభిమానీ ..నే చెపుతున్నా 
గా రాసుకో..

అయినా ఏమిటంట ? దేశం..
నాకేం ఇచ్చింది..ఆహా చెప్పండి 
సారూ, అమ్మా. నాకేం ఇచ్చింది అసలు..
ఒక మూడంతస్తుల ఇల్లు ఇచ్సిందా ?
ఒక బెంజ్ కారు ఇచ్సిండా? పోనీ 
సరి అయిన ,లక్ష రూపాయల జీతం 
ఉద్యోగం ఇచ్చిండా? ఏమిటి ఈ బోడి 
దేశం ,దేశం అంటూ కేకలు..

ఆపండేహే .....ఈ పాట అందుకోండి.
మంచి బీటు, మంచి ఫాస్టూ ..మంచి 
స్టెప్స్ ..హు...ఇదే కదా లైఫ్ ..ఎహె 
దేశం, త్యాగం ,జానతా నాయి..

బోలో నేటి యువత కి జై..

12 జన, 2013

సంక్రాతి పండగ....

తెలి తెలి మంచు బిందువులు 
నులి వెచ్చని సూర్య కిరణాల కి 
కరిగి పోతూ, ఒక వెండి మెరుపు 
కాంతి కాన్క గా సమర్పించాయి..

నిలువెల్లా మంచు దుప్పటి కప్పుకున్న 
ధరణి, కాంతి చిల్లుల మధ్య నించి తొంగి 
చూస్తోంది , నిజం గా నిద్ర లేచే సమయం 
ఆసన్నమయిందా ? అంటూ..

ఎర్రెర్రని ,కాంతి గోళం, మకర రాశి లో కి 
ప్రవేశం అట, అంటూ భూగోళం గిర గిర 
తిరుగుతూ చెప్పుకుంటోంది, అవునుట 
అంటూ చామంతులూ, బంతి పూల 
అమ్మలక్కలు విరబూసిన మొహాలతో 
కబుర్లు ఆడుకుంటున్నాయి ..వినబడ లేదా?

ఇంటికి చేరిన పంట, చెంత కి చేరిన చెలి 
వెచ్చని చలి , గోడ మీద అద్దిన గొబ్బెమ్మలు 
తెల్లవారితే భోగి అని హరిదాసు అరుపులు ,
ఇంటి లో చేరిన కంప ,రండి రండి వేయాలి 
భోగి మంట, కక్షలు ,కార్పణ్యాలు పిడకలు 
చేసి పడేయండి, కాస్త అసూయ, ద్వేషాలు 
దిష్టి తీసి పడేయండి, మంటల్లో కాలి పోయేలా 

చుక్కలు ,చుక్కలు ,చుక్కలు ,హ్మ్మం..
ఆకాశం కిందకి దిగిందా? కాదే 
మా ఇంటి ముందు రంగ వల్లులు 
పసుపు, ఎరుపు, తెలుపు, 
ఎన్ని కలలో ,అన్ని రంగులు..

షడ్రుచుల పిండి వంటలు, బావ ల 
పరాచకాలు, మరదళ్ల అల్లరి ఆట లు,
నాన్నల జీరాడే పంచల , హుందా తనం,
అమ్మ పట్టు చీర కొంగు హంగులు,
పిల్లల ఆశల లాగ ఎగిరే గాలి పటాలు 

అబ్బ బ్బ ..మా పల్లె టూరుల 
పండగ హడావిడి చూడాల్సిందే..
ఎక్కడెక్కడో పట్టణాల లో ,
ఉరుకులు పరుగుల హడావిడి 
ఉద్యోగాల కొలువులు చేసుకునే వారు,
దిన కూలి పనులో, ఇంటి పనులు 
చేసుకునే వారు కూడా ,మా ఊరు 
మా పండగ అంటూ ఇంటికి పరుగులు 
తీసే సంబరాల సమయం..ఈ పండగ.

మన సంస్కృతీ ,సంప్రదాయం అంటూ 
ఉన్నాయా అసలు అని ప్రశ్నించే వారికి 
చూపించండి ,పండగ సంబరాలు ..
సంక్రాతి పండగ తర తరాల గా 
అందరూ కల్సి చేసుకునే పండగే మరి..




8 జన, 2013

మిథునం, ఒక అందమయిన జీవన్ మాధుర్య కల...

భార్య సహాయము  తో కొన సాగే భవ సాగర తరణం..
నవరసమాన సమరసమాన సహకార మేలనం..
మిథునం..
ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం..
అరవై దాటిన ఆలు మగల అనురాగామ్రుత మధనం..
గృహస్త ధర్మం సగర్వం గా తానేగారేసిన జయ కేతనం..
మిథునం..
మిథునం ముందు చదివి, మా శ్రీ రమణే ..శ్రీ రమణే నా రాసేడు ??సారి రాసేరు అని హస్చర్య పడి పోయి, మీరూ చదివారా? మీరు చదివారా? అంటూ పుస్తకం వాయినాల వ్రతం ఒక్కటి ఆచరించి, తెలిసిన వారందరికీ ,ఇచ్చి చదివించి, మళ్లీ మరో సారి చదివేసి..అబ్బా...అంటూ మురిసి పోయి, ఇదేంటి ??అవును మర్చిపోయా ,తెలుగు వాడు కదా,అందుకే ఏమి అవార్డులు గట్రా రాలేదు ..అని నిట్టుర్చిన గుర్తు.
ఇది జరిగి ..ఎన్నేళ్ళు అయింది...చాలా చాలా..ఏళ్ళ క్రితం..

మళ్లీ ఇదిగో ఇప్పుడు విన్నాను..అంటే ఎన్నారై లు పూనుకున్నారని మన దాకా వస్తుందో లేదో ..అని ఏదో డౌటూ ..సినిమా తీసేరని ..భరణి దర్శకుడు అని...ఏవో మధ్య ,మధ్యలో కబుర్లు చెవిలో పడ్డాయి.

ఇదిగో వచ్చింది ట ..మన ఊరులోకే..మన విశాఖ కే ..ఒక ఆదివారం ,మధ్యాన్నం, నేను సినిమా లు చూడను, నేను తెలుగు సినిమాలు అస్సలే చూడను అని ఒట్టు పెట్టుకున్ననా సహచరుడిని ముందు బతిమాలి, తరవాత బెదిరించి, సెలవుల తర్వాత మొదటి రోజు బడి కి వెళుతున్న పిల్లాడిలా చేతులు కట్టుకుని, నా వెంటే బయలు దేరదీశాను..

మధ్య దారిలోనే, మాకు మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది..మా మరిది అంటే ..మహా సినిమా క్రిటిక్ నించి, తప్పకుండా చూడవలసిన చిత్రం ఇది, మీరు చూసి మరో వంద మందికి ,కూడా చెప్పండి, అనిన్ను ..దానితో ,కొంచం హుషారు గా పడ్డాయి అడుగులు.

నాకు గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి..ఈ సినిమా బాగో లేకపోతే నాకు పడే అక్షింతలు తలుచుకుంటూ..
అదేమిటో, ఆ సినిమా ఏదో నేనే తీసినట్టు, ఏమిటా రక్తాలు? ఏమిటా హింస? ఏమిటి  వాడా హీరో? ఆ .........రాయలేని పదాలు....ఆ హీరోయిన్  కి ఏమయింది..అంత చిన్న బట్టలు వేసుకుందేమిటి? అంతా నాదే తప్పు...అలా అక్షింతలు వేయించుకుని ,కొన్నాళ్ళ వరకు సినిమా వైరాగ్యం తెచ్చుకుంటాను నేను....అబ్బే..అదెన్ని  రోజులు...అర పూట..అంటున్నారా? అదే మరి, ఆంధ్రుల మై ఉండి ,సినిమాలు చూడక పోతే అవ్వా..ఎంత చిన్నతనం..మన పేరు కి..

ఇంతకి...సినిమా సంగతి కి వద్దాం..

ఏసుదాస్ గారి గాత్రం...లో పైన రాసిన పాట ప్రారంభం అయింది...హమ్మ యా, ఓపెనింగ్ బాగానే ఉంది..అని నేను  సీట్ వెనక్కి కూర్చుని స్థిమిత పడ్డాను.

ఒక పెద్ద తోట, అందులో ఒక పెంకుటిల్లు..అరె ఇదేమిటి ? నా కల లో ఇల్లు లా ఉందే ...అప్పాదాసు...ఓహో మన పాడుతా తీయగా బాలు ..అదేలెండి...మన కి తెలిసిన బాలు..

లక్ష్మి ..ఓహో జూలీ ...లో హీరోయిన్....అబ్బాబా..అంత వెనక్కి వెళ్ళకు ,పోనీ నిన్నే పెళ్ళాడుతా లో నాగ్ కి అమ్మా..ఆ.ఆవిడే..లక్ష్మి..అండి బాబూ.హుష్ అరవకు..అందరూ నిన్నే చూస్తున్నారు..

అదే మరి, సినిమా ల వార్తలు అబ్బ అని నొసలు చిట్లిస్తే ..ఇలాగె ఉంటుంది, బొత్తిగా సినిమా నోలేజ్ నిల్ ..మరి..

ఎన్నార్, ఎన్టీర్ ,శోభన్ బాబు కృష్ణ ,సావిత్రి, జమున..వీటి దగ్గరే ఆగి పోతే ఇలాగే ఉంటుంది మరి..హ్మ్మ్మం...

చెవిలో ఎజుకేషణ్ జరిగి పోతోంది, పక్క సీటే ..పారిపోవ డానికి లేదు..

ఉదయం సిగ్నేచర్ ట్యూన్ తో ఆల్ ఇండియా రేడియో ...లో ప్రసారాలు ప్రారంభం ..అని ఒక పిలుపు నిచ్చింది..అంతే.. తను వాళ్ళింట్లోమర్ఫీ ,కి మా ఇంట్లో ఫిలిప్స్ రేడియో కి నేను వెళ్లి పోయాం ..ఆఫలం గా..

చుట్టూ మొక్కలు, చెట్లు, ఒక నుయ్యి,మా ఇంట్లో కూడా ఉండేది, ఆ నూతి నించి చిన్న కాలవ లో నీళ్ళు,ఆ నీళ్ళు ఒక్కో చెట్టు మడి దగ్గరకి వెళ్లి నీళ్ళు గలా గలా చేరడం..చేరి ఆప్యాయం గా మొదలు ని తడమడం, ఒక ఆవు, దాని పాలు పిండడం, మాకు అట్టే అలవాటు లేదు, పుట్టినప్పటినించి పాకెట్ పాలే..పాలు పాకెట్లో పుడుతాయి అని చాల రోజులు నమ్మకం..

ఇంక ఒక చెట్టు మీద నించి ఒళ్ళంతా  మట్టి పోసుకున్న మన అప్ప దాసు కోతి లాగ అవును, అచ్చం కోతి లాగే లక్ష్మి అదే, మన బుచ్చి లక్ష్మి పాత్రలు ప్రవేశం..

నురగ పాల తో, కాఫీ ఎలా తయారు చేయాలో ,చక్కగా చూపించేరు..నాకు అంత పట్టింపు లేదు కాని, కాఫీ ఎలా తయారు చేయాలో అని రకరకాల థియరీలు కల నా సహచరుడి కి భలే కాఫీ పాట ..నేను ఏమయినా నేర్చుకున్నానా? అని ఒక పక్క చూసే ఉంటాడు..నేను చూడ కుండా..

మనం మటుకు ,ఆ తోటల మధ్య మేం ఉంటే ,సప్పోస్ ఉంటే ,ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ..ఒక్క వారం రోజులు హాలిడే ఫర్వ లేదు, కాని నెట్, లేని ఇంట్లో నేనా? నేవ్వేర్..అని మనసులో ..

ఇంక ఆ అప్ప దాసు కి వేరే పని ఏం లేదా? అలా భోజనాలు మీద భోజనాలు లాగించడం తప్ప..అమ్మో ఎలా కాల్చుకు తింటున్నాడో?
హ్మ్మం...లోపలే..లోలోపల.గోంగూర పచ్చడి- ప్రియ పచ్చడి, పనస పొట్టు  కూర..మా అమ్మకే రాదు, నేనేం చేయగలను? సిమ్పెల్ గా అన్నం వండి, పప్పు లో ఏదో కలగూర పప్పు, కొన్ని కూరలు ,చారు మటుకు ఇంగువ పోపు వేసి పెట్టడం వరకూ నేర్చుకున్నాను..

సరే సాంబారు, మజ్జిగ పులుసు, మొత్తానికి గట్టెక్కి ,నాకు పీహెచ్డి వచ్చినట్టే అని గెంతేను కదా..

అలా ఏదో సామాన్యం గా సంసారం ఈదేస్తూ ఉన్న  తరుణం లో ఇలా రుచులు, మహా రుచులు అంటూ నన్ను వంటింటి గట్టు కి కట్టివేసే కుట్ర ఏమయినా ఉందా? ఏమిటి ? అని కొంచం హెచ్చరిక తో కూర్చున్నాను..

ఒకటే ఆటలు, ఈ అప్ప దాసు, అబ్బ ఒక్క చోట కూర్చోడు , తోటంతా గెంతులు, విహారం, భార్య ని ఒక్క క్షణం కూర్చో నివ్వడు ,వంటింట్లో గుమ్మం మీద తల పెట్టి ఒక్క క్షణం నడుం వాలిస్తే ,చిన్న పిల్లాడిలా బెల్లం ముక్క కోసం డబ్బాలు మీద పడేసు కుంటున్నాడు ..

అమ్మో, నాకు దిగులు ..నేను మళ్లీ అమ్మ నవాలా? మరి నేను ??నన్ను
ఎవరు లాలిస్తారు? నేను ఎక్కడ చిన్న పిల్ల లాగ అలగాలి..??

ఇల్లు పీకి పందిరి వేస్తాడు, పేరంటం కి వెళితే కర్ర పుచ్చుకుని ,కాపలా కూర్చుంటాడు..మరి ఇంకెప్పుడూ నన్ను వదిలి వెళ్ళకు .అంటాడు, పసి పిల్లాడిలా మారాం చేస్తూ..

అమ్మో, నాకు కాలు నిలవదే ..ఎంత సేపు, ఊరు మీద పడి తిరగాలని ,స్నేహితురాల్లని చూస్తే ,ప్రాణం లేచి వచ్చేస్తుంది..మరి నేను ఎలా??

అయిదుగురు అబ్బాయిలు ..మామిడి ,జామ అరటి, పనస, చెట్లు కి పిల్లల పేర్లు..పెట్టుకుని, పిలుస్తూ ఉంటారు.

పిల్లలు అమెరికా లో, ప్రాణాలు ఒకరి మీద ఒకరు పెట్టుకుని ,వీరు ఇద్దరూ ఇక్కడ మన దేశం లో, వారధి ఒక ఫోన్, అదీ ,అటక ఎక్కిన్చేస్తాడు..

ఆవిడ ఏమంత తక్కువ తింది ?

పోపు డబ్బా లో మొబైల్ ఫోన్ దాచుకుని ,కుశలం అడుగుతూ ఉంటుంది..
పిల్లల ధ్యాస కూడా ఇక్కడే, రమ్మంటూ ఉంటారు, కాని వీళ్ళు అక్కడికి వెళ్లరు, ఓపిక లేదు, వారు ఇక్కడికి రారు, తీరిక లేదు..

అంతా గ్లోబల్ విలేజ్ ట ..

చక్కని బుజ్జి దూడ పుడుతుంది, బుజ్జి ముండ కి ఓ పేరు పెట్టుకుని ,అపురూపం గా పెంచుతూ ఉంటారు..

వీరే ఒక బాల్య దంపతులు లాగ గిల్లి కజ్జాలు, ఆడుతూ ఉంటారు ,వీరికి ఒక పసి దూడ ..ప్రేమిన్చేవారికి ,ప్రేమించుకోడానికి ఎన్నో కారణాలు..
ఆకో, పువ్వో, మొగ్గో, వానో, గోవో, లేగ దూడో ..హ్మ్మ్ ..ఏదో ఒకటి.
బయట నించి ఎవరో ఒకరు, ఈ పచ్చని తోటలో కాయలు కోసమో, పువ్వుల కోసమో, కళ్ళు తెరుచుకునిచూస్తూ ఉంటారు..పిల్లలో ,పెద్ద వాళ్ళో, అబ్బే తొంగి అయినా చూడ నివ్వడు ..కర్ర పట్టుకుని కూర్చుని కాపలా ఈయన.అప్ప దాసు..

అంటే బయట ప్రపంచం తో సంబంధం లేకుండా నా? 
అమ్మో, నేను ఉండగలనా? అయినా ఇదేమి నాకోసమా ? ఏమిటి ..సినిమా అంతే కదా అంటూ గుండె చిక్క పెట్టుకున్నాను..
లక్ష్మి కో చెల్లెలు కథ, వింటాం..మనం ఆవిడ మాల కడుతూ చెప్పిన కథ..ఏది, మరో పాత్రే రానివ్వరు వీరిద్దరి మధ్య..

అమ్మో నా చెల్లెళ్ళ ని చూడకుండా ఏళ్ళు, ఏళ్ళు ఉండగలనా? అబ్బే..బొత్తిగా ఇలా ఉందేమిటి? నీరసం..నాకు..

పిల్లల కంటాలు ..బ్యాక్ గ్రౌండ్ లో వారి మాటలు  వింటాం, మనవడి కార్టూన్ కథ చూస్తాం..

ఇంకో ప్రాణం కనపడదు..నాకు పిచ్చెక్కేలా ఉంది..ప్రపంచం లో ఇలా ఎవరి తో సంబంధం లేకుండా ,నేను ,తనే లోకం లా బ్రతక గలమా??

అమ్మో..నాకు మా అత్త గుర్తు వచ్చింది. మా ఊరులోనే మా  మావయ్య తను ఉంటారు..పిల్లలు ఇలాగే దూరం గా..మావయ్య కి ఎవరు ఉన్నా ,లేక పోయినా ఫరవాలేదు ,కాని తనకి మనుషులు కావాలి, ఎవరు వెళ్ళినా ,ఆప్యాయం గా చేయి పట్టుకని ,దగ్గరగా కూర్చో బెట్టుకుని, ఎప్పటివో ,పాత సంగతులు అన్ని గుర్తు చేస్తూ, తెచ్చు కుంటూ, ఒక కాఫీ అయినా తాగందే వెళ్ల నివ్వదు.

ఆడవారికి ఎక్కువ మనుషులు కావాలి, మాట్లాడాలి, పంచు కోవాలి, పెంచుకోవాలి ప్రేమలూ.ఆప్యాయతలూ ..

సోషల్ బీయింగ్ అంటారు ..ఆడవారు..ఎక్కువ అలా ఉంటారు..

భార్య భర్తల మధ్య , ఎంత ప్రేమలు  ఉన్నా సరే, బయట ప్రపంచం కూడా కావాలి, ఆడవారికి ..

పిల్లలు, మనవలు, కోడళ్ళు , బంధువులు అందరూ వచ్చి పోతూ ఉంటేనే ,ఇల్లు సందడి ,సందడి ..కదా..

ఇంకా అప్ప దాసు కి భార్య చెప్పే దాక్షారాం సమ్మంధం అంటే ఒళ్ళు మండి పోతూ ఉంటుంది..ఇన్నేళ్ళు అయినా తన కి మరో పోటీ ఉండేవారు అంటే ..ఒంటికి కారం రాసు కున్నట్టే.

ఆవిడకి అదో సరదా ..ఆయన ని ఏడిపించడం..ఆ తప్పిపోయిన సమ్మంధం పేరు చెప్పి..

పిల్లలు పెళ్లి పేరు చెప్పి వస్తాం అంటే, ఒళ్ళు విరుచుకుని ,ఎన్ని పిండి వంటలు చేస్తుందో .పాపం..అన్ని వెస్ట్ ..పెళ్లి అప్పటికి ఆగిపోతుంది.

ఇద్దరూ, తమ లోకం లో హాయిగానే ఉంటారు..
కాని, నాకే గుండె లో గాభరా పెరిగి పోతోంది.

బుచ్చి లక్ష్మి కి జ్వరం ..రాదూ మరి..అన్నేసి పనులు చేస్తూ కూర్చొంటే ..రోజంతా..

అంతకు ముందు, అప్ప దాసు భార్య కి చెప్పులు కుట్టడం, పరుపులు కి దూది ఏకడం, దగ్గర నించి అన్ని పనులు చేస్తూ కనిపిస్తాడు..

ఒక రకం గా వారిది ఒక ప్రపంచం..అందులో ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక భార్య ,ఒక భర్త, ఒక నారి, ఒక నరుడు, ఒక అర్ధ నారీశ్వర రూపం కలిగిన రూపం చరించే లోకం అది.

అందులో వారే పిల్లలు, వారే పెద్దలు, వారే ముదుసలి ప్రాణులు, వారే ఈ లోకాన పార్వతి పరమేశ్వరులు.

ఇది మన లాంటి మామూలు ప్రాణులు కి సాధ్యం అవునా??

ఇంటర్వెల్ లో కాఫీ కూడా అడగడం మర్చి పోయాను, ఈ బెంగ లో..

ఇవతల చూస్తే ,ఇన్నాళ్ళకి నాకు ఒక మంచి సినిమా చూపిస్తున్నావు అని ప్రశంసల జల్లు , నేను ఒక మూల బిక్క చచ్చి పోయి ఉన్నాను..

ఈ ఉత్సాహం తో ,నాకు ఏం కష్టం వస్తుందో?అని..

భార్య కి జ్వరం వస్తే, సేవలు చేస్తాడు, హ్మ్మం..చేయక తప్పుతుందా?

ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా? అని చీకట్లో నే మూతి తిప్పేను మూడు వంకలు..అసలే పాడుతా తీయగా లో ఏదో ఒక తాళం, స్రుతి అంటూ పిల్లల మనో భావాలు దెబ్బ తీస్తాడని, నాకు అదో కోపం ముందే ఉంది..

జాతకం లెక్కించి, ఆమె కి ప్రాణ గండం ఉందని భావించి, ఆమె కోరిక ప్రకారం లక్ష వత్తుల నోము జరిపిస్తాడు, పోనీ ,అప్పుడయినా నలుగురు ముత్తయిదవులు ని పిలిపిస్తాడా ? అది లేదు..ఏమిటో సంబడం..

ఆవిడ ప్రాణం ..జాతకాల లెక్క తప్పి, ప్రాణం పోసుకుంటుంది..

ఆయనే కుర్చీలో కూర్చుని ,అనాయాసం గా ప్రాణం వదిలిస్తాడు.

అంతే..మన హిందువుల లో భార్య ముందే పోవాలని కోరుకుంటుంది..కాని ఇక్కడ ఆమె, నేను లేక పోతే ,ఈయన ఎలా బతుకు తాడు? ఏ కోడలు వండి పెడుతుంది ,ఈయన రుచులు ? అని ఒక వంక బాధ పడినా, ఆయనే ముందు వెళ్లి పోవడమే ధర్మం అని ఓదార్పు పొందుతుంది.

నాకు మా మూడో నంబరు ఫ్లాట్ లో ఒకప్పుడు ఉండిన  భార్య భర్తలు గుర్తు వచ్చేరు, ఆవిడ ఎప్పుడూ అనేది, అందరూ, స్వార్ధం గా, ఏదో పసుపు కుంకుమలు అంటూ ఉంటారు, కాని, నేనే ముందు వెళిపోతే ,ఈయనకి ఇంత అన్నం ఎవరు పెడుతారు? కాలో ,చెయ్యో పడి పోతే ఎవరు చూస్తారు? అని ..అంటూ ఉండేవారు.

అల్లాగే జరిగింది కూడా చివరికి..

ఈ అర్ధ నారేస్వర అర్ధం లో ,నారి రూపమే చివరి వరకూ స్థైర్యం ,శక్తి కలిగిన రూపం అని నాకు తోచింది..

బయటకి వచ్చేకా మాటినీ తలనొప్పి, ఒక కాఫీ తో పోయినా, దేవుడా..ఇలాంటి భర్త నిజం గా ఉంటె ,నా దుంప తెమ్పే వాడు కదా అనుకుని, ఈ ఆదర్స నారి రూపం అతని మనసు నించి ఎలా తుడిపెయాలా ? అని రెండు రోజులు తీవ్రం గా ఆలోచించెను..

ఒక రాత్రి, నిద్ర మెలకువ కాని ఒక స్థితి లో అసలు విషయం అర్ధం అయింది.

ఈ మిధునం...ఒకరి కథ, ఒకరి కమామీషు కాదు, అందరూ ఇలా ఉండాలని కాదు..

ప్రతి దానికి ఒక వ్యాఖ్యానం, ఒక అర్ధం ,ఒక పరమార్ధం ఉంటాయి, స్నేహం అంటే ఇలా ఉండాలి, అని కొన్ని సినిమాలు వచ్చేయి..

అలాగ దాంపత్యం అంటే ఇలా ఉండాలి అని ,ఒక పరిపూర్ణ బంధం, అది, నువ్వు ..నేను అని కాక, మనం అని ఉండే బంధం..ఒకరికి నోచ్చితే ,మరొకరి కంట కన్నీరు కారుతుంది, ఒకరి సంతోషం మరొకరి మహా ఆనందం..ఒకరి కి ఆకలి, మరొకరి క్షుద్బాధ, ఒకరి అల్లరి, మరొకరి కి ముచ్చట, ఒకరి కాళ్ళ లలో ముళ్ళు, మరొకరి కంట్లో నీళ్ళు, ఒకరికి దాహం, మరొకరికి గొంతు ఎండి పోవడం..ఇలాగ తనువూ మనసు కలిసి పోయిన జంట మిదునాల కథ ఇది..

పుస్తకం చదివి ఊహించుకున్నదే కాని, ఎవరో అన్నట్టు, సాహిత్యం కి ఉన్న విలువ మహత్తరం..మనం ఊహాల్లో పండించుకుంటాం..ఆ ఊహ చిత్రం కి మరేది సాటి రాదు..

అయినా ఇది భరణి ..దర్శకుని గా మెప్పించిన దృశ్య కావ్యం..
మన తెలుగు రుచులు, తెలుగు భార్య భర్తల పిలుపులు, మన తెలుగు వంటలు, మన అమ్మ ,నాన్నల దాంపత్య జీవనం ఒక సారి చూపించిన సినిమా ఇది..

అంటే ,మనం ఇలాగే ఉండేవారం..నిదానం గా నడిచేవి రోజులు, జీవితం..నీళ్ళుఅంటే, ఇలా స్విచ్ వేస్తె వచ్చేవి కావు,  నూతి నించి తోడుకోవడం..ఎక్కడికయినా నడుచుకుని వెళ్ళేంత దూరం, అందరూ మనకి తెలిసిన వారే, మొహాలు, పేర్లు తో సహా..

రైల్లో ప్రయాణాలు, టికెట్ కోసం క్యూ లో నిల్చోవడం,ఎంత నెమ్మదిగా నడిచేది జీవితం..ఇప్పుడో ఉరుకులు ,పరుగులు..

ఎంత పరుగులు తీసినా ,ఏమిటో జీవన మాధుర్యం మటుకు ఒక్క ఇంచి కూడా పెరగదు..ఎందుకో??

అందుకే ఈ మిధునం నాకు నచ్చింది..నిజం గా నచ్చింది, బ్రాహ్మణ సినిమా అన్నా సరే, నచ్చింది..ఒక్కో క్షణమూ ఆస్వాదిస్తూ, ఒక్కో క్షణమూ, నీకోసం అంటూ, మన వాళ్ళు తపిస్తూ, ఒక్కో క్షణమూ ,సంతోషం జీవితం నూతి లోంచి తవ్వి ,తోడుకుంటూ..

అప్పాదాసు ,నూతి లోకి దూకి ,ఎన్నో వస్తువులు తీస్తాడు, కాకి పడేసిన నేతి గిన్నె, మిల్లి గరిట , భార్య కాలి పట్టా..

అది తోమి ఆమె కాలి కి అలంకరించే దృశ్యం నాకు చాలా చాల నచ్చింది..

మనం కూడా, ఎక్కడ పారేసుకున్నమో, మన జీవన మాధుర్యం అక్కడే వెదకాలి..నెట్ లో ను, మరో చోటా కాదు..

మిధునం ..ఒక్కోరిని ఒక్కో లాగ కదిలించ వచ్చు..ఒక్కోరికి ఒక్కో జీవన దృక్పథం ఉంటుంది, ఒక్కో ఆకాంక్ష ఉంటుంది..

ఎప్పటికయినా , మిథునం, ఒక అందమయిన జీవన్ మాధుర్య కల..కలే..మరి..