"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 ఫిబ్ర, 2013

ఎడారి లో పక్షి గానం ...

ఇక్కడ ఈ ఎడారిలో కూడా
ఏవో పక్షులు ..దారి తప్పి
మా ఇంటి ముందు సిమెంటు
ఆర్చీల బాల్కొని లో తల
దాచుకుని పూర్వ స్మ్రుతి
పచ్చదనం ,తలుచుకుని
కిచ కిచ మంటూ ఏవో
కథలు ,కబుర్లు మోసుకు
వస్తాయి.. మరు భూమిలో
కూడా జీవం ,ఎప్పటికప్పుడు
చివిరిస్తూ ఉంటుంది ..

ఇండియా లో ... 
మా ఎత్తైన భవనం కి నీరు
అందించే గొట్టాల పగుల
మధ్య ఒక పచ్చని రావి
మొక్కో, మర్రి మొక్కో
వేరులు వేసి, ఆకాశానికి
భూమికి మధ్య నిచ్చెన లా
పచ్చని నిచ్చెన లా
పెరుగుతూ, నాకు ఏదో
ఓదార్పు నిస్తూ ఉంటుంది ..
నీ జీవితం వృధా కాదు..
ఏదో ఒక సత్సంకల్పం
ఎప్పుడో నీలో ,ఆ ఎడారి
గుండె లోనో, లేక
ఆ నిర్వేద ఎత్తైన ఇటికెల
మేడ మధ్య లో నో
ఎప్పుడో ,ఎప్పుడో
ఓ మారు కలగక 
తప్పదు అని ఒక 
సంకల్ప బలమే లేకుంటే 
నేనూ ఒక ఎడారి నే 
మనసు లోపల కూడా 
వెలిసిపోయిన ,రంగులు 
వెలిసిపోయిన ఎడారినే .. 

ప్రకృతి ఎప్పుడూ మెత్తటి 
బడి , పాఠాలు నేర్పుతూనే 
ఉంటుంది, నీ మనసు 
పలక ఖాళి గా ఉంచితే 
చాలు.. గజిబిజి జీవిత 
అనుభవాల గీతాలు 
చెరిపి, ఎప్పటికప్పుడు 
కొత్త పలక చేసుకో నీ 
మనసు.. అప్పుడే ఇంక
నువ్వు నిరంతరం విద్యార్ది వి
పలక ,బలపం పట్టుకుని 
జీవిత పాఠశాల లో 
ఎప్పటికి విద్యార్ధి గా ఉండడమే 
నా కోరిక, నా ఆశ .. 

ప్రకృతి ఒడి పాశాల లో 
నేను ఎప్పటికి విద్యార్దినే .. 
పిట్టలు, చెట్లు ,మబ్బులు 
నాకు ఏవో స్వేచ్చ సందేశాలు
స్వార్ధం మానమని.. 
ఏవో చెపుతూనే ఉన్నాయి .. 
మనసు ద్వారాలు మూసుకుని 
నేనే ..ఎప్పటికీ ..లాస్ట్ బెంచ్ 
విద్యార్ధిని.. 
నేను ఎప్పటికైనా కళ్ళు 
తెరిచిన విద్యార్ధి నవుతానా? 

ఎడారి లో పక్షి ,
జీవం లేని గోడ ల 
మధ్య పెరిగిన లేత చిగురు 
నాకు ఏవో సందేశాలు ,
పాఠాలు .బోధిస్తూ .. 
నా మనసు గోడ ఎప్పుడు 
పగులుతుందో ?
నా ఆరిపోయిన ఆశ 
ఎడారి లో ఏ పక్షి గానం 
ఎప్పుడు వినిపిస్తుందో 
అని నిరంతరం ఎదురుచూపే 
నా జీవితం .. నా జీవితం .. 
















26 ఫిబ్ర, 2013

అమ్మ ని కాలేను.. ఎప్పటికి ... నీలా ..

నిద్ర రాని రాత్రి ఎప్పుడో నిన్ను కరచుకుని 
అమ్మా ,కథ చెప్పవా ? నా చిన్నతనం కథ అంటే .. 
నువ్వేం చెప్పావ్? ఒక్క క్షణం నిన్ను వదలక 
తిరిగే దాన్ని ..అమ్మ అడుగుల ధ్వనే నా 
గుండెల చప్పుడు గా నెనెరుగుదును.. 

పాలు తాగి, ఒక్క క్షణమయినా అమ్మకి 
అన్నం తినే సమయం కూడా ఇవ్వక 
విసర్జన కార్యక్రమాలు కూడా అప్పుడే 
మొదలుపెట్టినప్పుడు అమ్మ ,తినే 
అన్నం ,వదిలిపెట్టి ,చేయి తుడుచుకుంటూ 
వచ్చి, నన్ను కడిగి, ముద్దు కూడా చేసేది .. 

నా అడుగు లు తప్పి ,
నేను కింద పడినప్పుడు అమ్మ నన్ను 
కాస్తుందని ధీమా,
నా కలల కి  కూడా 
కాపలా కాసే అమ్మ ఉందని .. 
నిశ్చింత .. 
ఎవరో యువకుడి కోసం 
నా చేయి అందిస్తే ,అమ్మ పడిన 
బెంగ ,కడుపులో బాధ .. 
చెయ్యి వదిలి, వెనక్కి వస్తే అమ్మ 
ఉంటుంది ,నాకోసం అమ్మ ఉంటుంది 
అన్న సత్యమ్.. ఎంత సుందరం . 

పరీక్షలని ,జ్వరాలు అని 
అన్నం తినక పోతే అమ్మ పడిన 
బాధ, నా నోట్లో ఒక ముద్ద పెట్టే వరకు 
ఎలా తిరిగేవో రంగుల రాట్నం లా 
నా చుట్టూ ,ఇంకా నాకు గుర్తే .. 
నా ఆకలి ,నా కన్నా ముందే నీకు 
ఎలా తెలిసింది అని నాకెప్పుడు 
ఆశ్చర్యమే ,అమ్మ కి మూడో కన్ను 
అని నాకు నమ్మకం . 

అలాంటి అమ్మ ఇప్పుడు 
పార్కిన్సొంస్ జబ్బు తో చేయి 
వణుకుతూ , నీమీద ఆధార పడ్డానే 
నీకెంత భారం? అంటే .. 
నాకు ఎంత బాధో?

ఆనాడు అమ్మ నాకు మురిపెం తో 
చేసిన సేవ లన్నిటికీ ... 
నేను ఇప్పుడు ఋణం తీర్చుకుంటున్నాను 
అది నాకే దక్కిన అదృ ష్టం .. మిగిలిన 
పిల్లలు ,అక్కలు, అన్నలు ఉన్నారు .. 
ఇది నాకే దొరికిన అదృ ష్టం.. 

ముఖం కడిగి, స్నానం చేయించి 
చీర కట్టి, తల దువ్వి ,అన్నం తినిపించి 
సిగ్గు పడితే వద్దు అని అన్ని పనులు 
చేస్తూ, నిన్ను కూర్చోబెట్టి నేను సేవలు 
చేస్తున్నాను ,అని అనుకున్నాను .. 

నా పనుల లో పడి ,ఒక రోజు నేను 
నీకు సమయానికి అన్నమే పెట్టలేదు 
నా పని, నా లోకం, నా ఉద్యోగం లో 
అయినా నువ్వు ఆకలి,అన్నం పెట్టవే 
అని అడగలేదు .. అవును అమ్మ వి .. 

నేను అమ్మ ఋణం తీర్చు కుంటున్నాని 
మురిసి పోయానే కాని ,
నువ్వు సహజంగా ప్రేమతో చేసిన 
పనులు ,నేను ఋణం అనుకుని చేస్తున్నాను .. 
ఉండదా మరి ఈ తేడా?

అంత క్షమా ,అంత దయ ,అంత ప్రేమ 
లేదే అమ్మ నాకు, నీలాగా 
అన్నం పెట్టవే ,ఆకలి వేస్తోంది అని 
నాకు గుర్తు చెయవే అమ్మా.. 
నాకు నా ఆకలి కూడా నువ్వే చూస్తావు 
అని నిర్లక్ష్యమ్.. నన్ను క్షమించి 
ఆకలేస్తోంది ,అన్నం పెట్టవే అని 
నోరు తెరిచి అడగవే ...నేను నీ 
కూతురునే కాని, ఎప్పటికి నీలా 
అమ్మ ని కాలేను.. ఎప్పటికి ... 



నా స్నేహితురాలు తన అమ్మ కి చేస్తున్న సేవ కి అంకితం ..ఈ చిన్న కవిత. 









25 ఫిబ్ర, 2013

నాకున్న రెండు చేతులూ

అడవి గర్భం లో అన్నలు 
అంచున ఖాఖీలు 
ఆడే తుపాకి ఆట లో 
ఎవరికి ఏ తూటా రాసి 
పెట్టి ఉందో ,ఎవరికి తెలుసు.. 

ఎవరి కోసమో ఆ యుద్ధం 
ఎవరికి వారు ఇది మా 
ధర్మ యుద్ధం అని గొప్పలు 
పోతారు, మధ్యలో నలిగిన
ప్రాణులు ,ఎవరో వారికి 
పెద్ద పేరూ, ఊరూ ఉండదు .. 

వారి కోసం ఎవరూ స్మ్రుతి 
చిహ్నాలు కట్టరు, వారికి ఒక 
నివాళి , అశ్రు తర్పణం 
లాంటివేం ఉండవు .. 
చదరంగం బల్ల మీద మంత్రులు 
వేసే ఎత్తు పై ఎత్తు కి పడి పోయే
మామూలు బంటులు వీరే ... 

పక్కన ఒక నల్ల పెట్టె లో 
పడేసి మూత పెట్టేస్తాం .. ఆఖరున 
రాజో ,రాజు తరపున మంత్రో 
గెలిచాక అవతలి శిబిరం పై 
వారి విజయ విన్యాసాలు చూసి 
జేజే లు కొట్టేందుకు మళ్లీ 
ఆ నల్ల పెట్టె లో పడేసిన 
మృత దేహాల చెంతనే పడుండాలి .. 

అదే మరి యుద్ధ నీతి.. 
ఆ ప్రాంతాన్ని జయిస్తావు ..కాని 
అక్కడ జీవాలు అప్పటికే 
నశించి ఉంటాయి .. 
అయినా నువ్వు ఎగర వేసే 
విజయ పతాకం లో ఎర్రెర్రని 
మరకలు కి తిరుగు లేదు 

ఇంక ఈ జిహాదిల గోల ఏమిటో 
చిదిమిన దేహాల మధ్య పరుండి 
ఏ కలలు కంటున్నవో ?
నిదుర ఎలా పడుతుందో?
పళ్ళెం లో ఎముకల దొంతర 
విరిగిన చేతులు వడ్డిస్తే 
తినగలవా? ఏ దేవుడు అడిగాడో ?
ఈ మానవ దేహాల ప్రసాదం?

నా ఇల్లు, నా నిద్ర ,నా ఆకలి 
నా కలలూ కాజేసే ఈ రాజ్యం ,
ఏ రాజ్యమూ నాకొద్దు.. 
అని చివరి సారిగా నాకున్న 
ఈ రెండు చేతులూ ఎత్తి 
మొక్కుతున్నా ...చివరి సారి 
నాకున్న రెండు చేతులూ 
ఏ క్షణం లో ఇవి ఊడి పడతాయో ..... 



22 ఫిబ్ర, 2013

ది ఎండ్

మెత్తని ,నున్నని రోడ్డు 
సర్రన .................కార్ 
నడుపుతున్నది అతనే 
మెత్తని నున్నని రోడ్ 
సర్ ..... సర్ర్ న కార్ 
కుదుపులు ,ఎత్తుపల్లాలు 
కంకర ముళ్ళబాట ... 
కఠినం గా బర్ర్ న కార్ 
అదే క్షణం లో, అదో క్షణం లో 
ఏక్సిడెంట్ ,హటా త్సంఘటన . 
మగత లో పెళ్లి సన్నాయి 
లోషను వాసన గదిలో 
కళ్ళు తెరిస్తే 
ఇద్దరు పిల్లలు. 
ఏక్సిడెంట్ .... పిల్లల్ని పెట్టింది . 
అక్కడ్తో తేరుకుని 
క్లచ్ లాగి బ్రేక్ వేసాడు . 
అయినా అంత లోనే 
అయిపొయింది, ఫుల్ స్టాప్ !
finished.
ది ఎండ్ .. 
సమాప్తి ----
జీవితానికి సమాప్తి 
ఎండ్ ..... 

రాసింది 20-11-75. 
గమనించగలరు. 

21 ఫిబ్ర, 2013

తెల్ల సిరా సాక్షి గా

తెల్లని నా చేతికి 
నల్లటి సిరా మరక 
ఎంత విదిలించుకున్నా 
వదలదేం ?

అదిగో ఆ నీలి ఆకలి రంగు 
ఇదిగో ఈ ఎర్రటి క్రోధం రంగు 
అవేమి వద్దు అని తెల్లటి సిరా 
ఒంపుకున్నాను నా కలం లొ.. 

అక్షరాలూ అలా పరుచుకుంటూ 
వెళతాను ,నేల మీద టైల్స్ లాగ 
కుదురుగా, నలుపలకలు గా 
మరకలు గట్రా లేకుండా, 
ఆసిడ్ పోసినా చెరగవు ట .. 
ఈ అక్షరాలూ, నేను పోసిన 
ఈ అక్షరాల మడులు ... 

నా లోకం లో పూసిన పూలు 
నా లోకం లో వేసిన మారాకులు 
నాకుంటే చాలు, ఏమిటో 
అతివృష్టి ,అనావృష్టి ట 
నాకెందుకు .. ఆ వికృతి అందాలు .. 

నేను పూట పూట కూ 
నా కలం లో సిరా మారుస్తాను .. 
నవ్యత , నాణ్యత ఇవే మరి 
నా చిరునామా.. 

పేదలు, పీడితులు ,
అన్నార్తులూ , ఏమిటో అంతా 
మీడియా మిధ్య.. 
ఇరవై లక్షల కార్లు రోడ్డు 
మీద జాగా కోసం ఒరుసు కుంటున్నాయి 
ఏమిటో ,ఏదో అంటారు, అంతా మీ మాయ ..

నన్ను ఒక్క మాట అన్నా పడను 
నా మాట అంత నిఖార్సు .. ఏమనుకున్నారో?
పదహారణాల తెలుగు పలుకు నాది .. 
తప్పులు ,ఒప్పులు ,మీ దృష్టి దోషమే .. 
ఒప్పుకోండి  ... 

నా కలం లో నింపిన 
తెల్ల సిరా సాక్షి గా 
నా అక్షరాలు .. 
గిర గిర దొర్లే నాణేల 
గల గలలు... గచ్చు మీద 
ఖని మనే ఆ శబ్దం కోసమే 
ఈ మాటలు, ఈ కవితలు.. 






19 ఫిబ్ర, 2013

మర్యాద ముసుగు

మర్యాద ముసుగు జారనీకు 
ఎంత తుడిచినా ,కన్నీటి 
జాడలు ఇంకిన ఆ జాడలు ..
చెప్పెస్తాయేమో ...మేకప్ సరిచెయ్..

ఎంత దాచినా ,నీ శరీరం బరువు 
పెరిగి , కళ్ళు ఉబ్బి, నిలకడ లేని 
కుదురు లేని మనసు ని కట్టడి 
చేస్తూ, దొరికి పోతావు..కట్టడి చెయ్యి..

మర్యాద ముసుగు జారనీకు..
నీ చీర కొంగు ,చుట్టూ తిప్పి 
గట్టిగా బిగించు, ఒక్క అడుగు కూడా 
జారకు, అదిగో, అక్కడే జాగ్రత్త..

నీ అడుగు గట్టిగా నేల మీదే ,ఇక్కడే 
ఈ నేల ,ఈ చదును చేసిన నేల ,ఈ 
గట్టి నేల మీదే వేయాలని, ముందే 
అంతా తయారు చేసి పెట్టేం...

భద్ర మహిళ లు నడిచే దారి ఇదే 
వంకాయలే కాదు ,మీరు కూడా 
కుళ్ళి పోతాయి, చెడిపోతారు..
కంచె కి కాపలా ఉండాల్సిందే..

తల వంచి, మెడ దించి, ఒళ్ళు 
అప్పచెప్పి, నోరు మూసుకుని 
ఇంకా ఏమిటో? మర్చిపోయాను...
గాలి, నీరు, అన్నం ,బట్టలు ఇస్తాం..

ఇంకా ఏమిటి ఏదో గొణుగుతారు ?
మర్యాద ముసుగు వేసుకోండి..ఆ 
మా మర్యాద కూడా మీరే మరి 
కాపాడాలి...ఏం ఆ మాత్రం చేయలేరా?

మా కోసం..మేం అన్ని ఇస్తాం కూడా..
మీకు ఏం కావాలో చెపితే అన్ని మేమే 
ఇస్తాం కదా,తిన్నది అరక్క అలా 
ఎందుకు వీధికి ఎక్కుతారు? ఏమో 

మర్యాద ముసుగు జార నీయకు ..
మరి మర్యాద ముసుగు జారనీయకు..
ఓ మహిళా, ఓ వనిత..ఓ భోళా  స్త్రీ..
నీ మర్యాద ముసుగు...తొలగించకు..

ప్రశ్నార్ధకం

ఇంటి నించి బయలు దేరాను,
జేబు లో పెన్ను, పర్సు 
పై జేబులో ఒక సెల్లు ..ఇది 
లేకుండా అంగుళం కదలలేను ..

ఆఖరున నా మొహానికి ఒక 
ప్రశ్నార్ధకం తగిలించుకున్నాను..
ఇది లేకుండా కూడా నేను ఒక్క 
అడుగు ముందుకు వేయను..


జీతం పెరగదేం ? ఖర్చు తో పాటు..
నా చదువు కి తగ్గ ఉద్యోగమో?
అన్ని ప్రశ్నలే..ఇంట్లో కూడా 
నా మాట చెల్లదేం ? మా ఇంట్లో ..

సాయంత్రం టీ పార్టీ ట , ఆఫీసు 
లో నాకన్నా జూనియరే ,అప్పుడే 
ప్రమోషను..నాకెందుకు రాదో?
ఏమో మరి..నా మొహం అంతే ట ...

అక్కడ కే ,వెళ్ళాను జేబు లో 
పర్సు, పెన్ను, సెల్లు పెట్టుకుని..
మళ్లీ వెనక్కి వచ్చి ఈ ప్రశ్న మొహం 
కూడా తగిలించుకున్నాను..

తీరా మోసి, అక్కడ చూద్దును కదా..
అక్కడ అందరూ, నాలాగే ,ఇలాగే 
ప్రశ్నార్ధకాలు మొహం లో తగిలించేరు 
గొళ్ళే ల్లాగ...భలే ఉన్నారు..వింత గా..

ఈ ప్రశ్నార్ధకాల మాస్కులు కూడా 
అమ్ముతారుట ...భలే ఫ్రీ గా వస్తూంటే 
కొనడం ఎందుకో? నాకు ఎంత బాగా 
నప్పిందో ఈ ప్రశ్నార్ధకం..ఇలా ఉంటే 

చాలు మొహం, మనం ఇంకేం చేయక్కర్లేదు 
నా చేతిలో లేని దాని కోసం ,నేనేఁ చేస్తాను 
అని సద్ది పెట్టుకుంటూ ఏళ్ళు ఏళ్ళు 
గడిపెయోచ్చు, జస్ట్ ఇది ధరించి..

ఈ ప్రశ్నార్ధకం  మొహానికి ధరించి..
ఇంక నిస్సుగ్గు గా నేను అన్ని 
భరించేయ వచ్చు..ఇంటికి వచ్చి 
ఇలా గోడ మీద చిలక్కోయ్యి కి 
తగిలించ వచ్చు..

నేను తగిలించి ,గోడకి, అటు తిరిగేనొ 
లేదో, అదేనో, మరి అలాంటిదే ఇంకోటో 
తగిలించుకుని ,నా భార్య వచ్చి పక్కన 
పడుకుంది, ఇది ఇంక అంతే ,
ప్రశ్నా ర్ధకాలు కలిసిన రాత్రి...అంతే...ఇది అంతే...


మైదానం



ఒక బీరువా, ఒక కుర్చీ ,ఒక 
గోలెం లో ప్లాస్టిక్ మొక్క లాగ 
తన ఇంట్లో గోడకి వేలాడి పడి 
ఉండే పెళ్లి ఫోటో ఫ్రేం లాగ 
ఎక్కడ ఉండి పోతానో ..
జీవితాంతం నేను ఎక్కడ 
ఉండి పోతానో, ఒక ఫ్రేం లో 

అని ..నాకూ మెలకువే ..
రాజేశ్వరి కి అమీర్ దొరికేడు ..
మొహం, క్షణికం..తూ అంటూ 
ఉమ్మేసారు..అయినా వారు 
మైదానం అంచులు చూసారు..

చీకటింటి గదులు, 
పిడికిట బిగించిన మదులు 
నలిపివేసే కామ కోరికలు 
తెల్లారిన రాత్రులు ..

ఇంకానా అని ఏ క్షణం 
మెలకువ వస్తుందో అని 
అను క్షణం మెలకువ ,స్పృహ 
అనుక్షణం ఒక నిరీక్షణ..

నన్ను బంధించిన గొలుసులు 
ఏమిటా అని ఒక రోజు చూసాను..
ఫకాలున నవ్వు వచ్చింది, ఊరికే 
ఇలా అంటే విరిగి పోయేవే ,పెద్ద 

గట్టి సంకెళ్ళు కావే, అయినా 
ఏమిటో ,ఇలా ఉన్నాను..కాపలా 
కుక్క లాగ విశ్వాసం గా, ఇంత అన్నం 
అంత ప్రేమ పంచుతున్నారని కాబోలు..

ఏమిటో నేను ఇలా నన్ను నేను 
బంధించుకున్నాను..
ఎప్పుడో ఒక విశాల మైదానం లోకి 
పారిపోకుండా నన్ను ఆపగలరా?
ఎన్ని కాపలాలు పెట్టినా..

మైదానం లోని విశాలత్వం..
మైదానం లో విశృంఖలత ..
మైదానం లోని నిరాడంబరత ..
మైదానం లో నగ్నత ,అన్ని, అన్ని 

నన్ను చిటికెలు వేసి..
కవ్విస్తూ, సవాలు చేస్తూ, 
నిన్ను నువ్వు బంధ విముక్తి 
చేసుకో గలవా? అని అను క్షణం ..

ఇదిగో ,ఈ క్షణం..వస్తోంది 
అని నిరంతరం ఎదురు చూపులు 
వాకిలి గుమ్మానికి అతికించి..
మైదానం పిలుపు కోసం..అనుక్షణం..

ఒక పిచ్చి మనసు ని నేను..














17 ఫిబ్ర, 2013

కాలం...

కాలం చేసే 
గాయం ...కాలమే 
తీరిస్తుంది..అంటే 
నిజమే అని నమ్మి..

ఏటి గట్టున 
కాపలా కూర్చున్నాను 
కాలం ,ఏరు లాగ 
ప్రవాహం..

జ్ఞాపకాల గులక రాళ్ళు 
ఒకటి ఒకటి గా ఏటి లోకి 
విసిరేసా .బుడుమ్గమని 
మునిగి పోయి, తేలాయి 
ఏమిటో..నా మనసు సరసు లో..

కాలం..వింతలు కోకొల్లలు 
ఇప్పుడేగా నేను పుట్టేను ..
అంత లోనే ఈ వార్ధక్యం ఏమిటి?
నేనే నా కోరుకున్నాను ?

ఎప్పుడెప్పుడు పెద్ద వాడిని 
అయి, అంతా నేనే సొంత 
నిర్ణయాలు చేయాలని..
అమ్మా ,నాన్నా ఇలా చేయి 
కన్నా అని చెప్పే కాలం ఎంత 
హాయో, ఇప్పుడే తెలిసింది..

కాలం ఇంత నిర్దయి..
నిన్నటి ఆనందం ని 
నిముషంలో జ్ఞాపకం 
చేస్తుంది..అయ్యో.ఆ క్షణం 

ఇంకా అనుభవించనే లేదే...
కాలం ఎంత కఠినం ..
మొన్నటి శోకం ని ..
అనునిత్యం తోడు గా ఇస్తుందేం ?

కాలం మనది కావాలి 
అంటే ఏం చెయ్యాలో నేర్పించే 
పాఠశాల ఎక్కడుందో?
ఎవరయినా చెపుతారా?

కాలం మొహం లో పడి 
కాలం ఎలా గడుస్తోందో 
తెలీలేదు ,అచ్చం ప్రేమ లాగే 
తెలియని వ్యామోహమే 
సాక్షం ,మరేమీ లేదు..ఇంక..

కాలం ఒక యమపాశం 
అన్నారు, ఏమో తుది 
క్షణం రచించాక ,రాయడానికి 
నేనుండను .మరెలా ??

కాలం తో కబుర్లు ఆడుతూ 
నేను పెద్ద మనిషి నయాను..
నా చిన్నతనం లాక్కు న్నావు 
అని ఇప్పుడు పేచి పెడితే ఎలా?

కాలం ఒడి లో ఎప్పుడూ 
నిశ్చింతే ,అమ్మ ఒడి లా 
ఎప్పుడూ ఒక్క మాదిరే 
నిన్న ,నేడు ,రేపు..
ఎప్పుడూ ఒక్కటే కాలం..

నన్ను ఎవరు భయ పెట్టినా 
నేను ఊరుకోను, కాలం నా 
చుట్టం, నా స్నేహం, నా అండ..
నా ధైర్యం, నా సంపద..

కాలం తో నా చెలిమి 
ఈ నాటిది కాదు..
నేను కళ్ళు తెరిచిన రోజు 
తో మొదలు అయింది..

నన్ను నిస్పృహ లో 
ఓదార్చి, కాలం నేను 
ఉన్ననంటూ ,భుజం 
తట్టింది, నేను వదిలినా 
కాలం నా చెలిమి వదలదు..

నా నీడ, నా లోని ఆత్మ 
నా లోనే ఉన్న మరే ఇతర 
భావాలకి సాక్షి కాలమే 
అయినా మవునం గా 

ఉంటుంది, ప్రశ్నించదు 
నిలదీయదు , మంచి చెడు 
అంటూ వేలెత్తి చెప్పదు 
అన్నిటికి సాక్షి ..కాలమే..

కాలమే నాకు రక్ష..
కాలమే నాకు తోడూ నీడ..
అయినా ఎన్నడూ చూసి 
నట్టు లేదే..ఏమిటో ఈ వింత..

నా కలలు ...నివసించే 
చోటు కాలం..నా ఆశలు 
ఆకులు వేసే తోట కాలం..
నా మది నిండా పూసే 
కవితలు విశ్రమించే చోటు 
కాలం..నిత్యం నాతోనే ..

ఎంత వింత మొహం ..
ఎంత వింత స్నేహం..
ఎంత వింత జీవితం 
ఈ కాలం తో ప్రవాహం..

కాలం నా చుట్టం..
కాలం నా చుట్టూ 
కాలం నా లోనూ 
కాలం నా తోడై..

నేనే నా కాలం అంటే..
నాలోనే ఉందా అయితే 
నా మూర్ఖత్వం కి 
పరాకాష్ట  కాలం కోసం 
వెదుకులాట..అంతా 

నీ చుట్టూ ,నిన్ను తాకుతూ..
ఆ చివరి క్షణం వరకూ..
అలా ,మడుగు లో అలల 
స్పర్శ లా అనుభవించు ..అంతే 

మరి అడగకు ,చూడాలని..
అడగకు...కాలం ని చూడాలని 
వింత కోరికలు కోరకు..
నీ అంతం ,నువ్వే చూడకు...అంతే మరి..







7 ఫిబ్ర, 2013

నాకు రాజకీయాలు అంటే చిరాకు ...

ఆమె తన క్యూట్ ఇంటిలో బందీ 
ఈ పూల గుత్తి ఇలా అమర్చాలి 
ఈ సోఫా సెట్ ఇలాగే ,ఈ మూలే 
ఒక్క అంగుళం కదిలినా అంతా 
అపసవ్యం ..అసహనం..

పొద్దున్న హిందూ పేపర్ మధ్య 
బల్ల పై చక్కగా ..మడత నలగదు 
ఇల్లంతా ,అలా ఎగురుతూ ,నాకు 
నచ్చదు..నా ఇల్లు ఎంత క్యూట్ ..

నా పిల్లలు ఎంత క్యూట్ ..అల్లరి 
అంటే , ఏమిటమ్మా అంటారు..
కాళ్ళకి మట్టి అంటదు, బట్టలు 
నలగవు, చిరగవు..బుద్దిమంతులు ..

నాకు రాజకీయాలు అంటే చిరాకు 
ఏ పార్టీ అయినా ఒకటే నాకు ..
నా ఇంట్లో కి ఆ రాజకీయాలు 
తేకండి..నా ఇల్లు నా స్వర్గం..

నా స్నేహితులు అంతే , అంతా 
నా లాంటి వారే, ఏ వస్తువు కొన్నా 
దాని ఖరీదు బట్టే విలువ ..
ఆ మూలాన అమర్చిన పూల 

గుత్తి విలువ తెలుసా ? మీకు..
ఇంటి నిండా చెత్త పుస్తకాలు 
గుట్టలు ,గుట్టలు గా , నాకసలే 
ఇష్టం ఉండదు, కాఫీ బల్ల పుస్తకం 

ఒక్కటి చాలు ,వెయ్యో 
రెండు వేలో, మా ఇంట్లో పని 
చేసే మనిషి కూడా సినిమా 
స్టార్ లా అందం గా ఉంటుంది..

వంటిల్లు అసలు ఎప్పుడయినా 
వంట చేసాన? అన్నట్టు మెరిసి 
పోతూ ఉంటుంది, నాకంతే 
అంతా నీటు..క్లీను..

ఏమిటి ? గాస్ తెచ్చు కోడానికి 
ఆధార్ కార్డా ? ఆ లైన్ లో నేను 
ఇప్పుడు నిల్చోవాలా? అందరూ 
తప్పనిసరా? ఏమిటి ఈ కొత్త 

రూల్స్..అయినా ఎవరు పెట్టేరు 
ఇలాంటి పనికి రాని...పధకాలు..
ఎవరో..అదే నా రాజకీయాలు అంటే 
అవేనా ..మా ఇంట్లో కి రాజకీయాలు 

వద్దు అనుకున్నానే, ఇలా 
కిటికీ సందుల్లోంచి వంటిట్లోకి 
తోసుకుని వస్తున్నాయి ,పాడు 
రాజకీయాలు, నేను వద్దు అంటూనే 

ఉన్నాను, అయినా, నాకిష్టం లేదు 
అయినా ,ఏమిటి ,ఈ రాజకీయం 
ఇలా గాలి లా వ్యాపించి ,ఇలా 
నా ఇంటిని ,దుర్గంధమయం 

చేస్తోంది? ఇదిగో పని వాళ్ళు 
ఇలా వచ్చి, కొంచం డెట్టాల్ వేసి 
కడగండి, నా ఇల్లు ఒక స్వర్గం ,
నా ఇల్లు ఒక ద్వీపం..నన్ను ఏ 

శక్తి తాకలేదు, నన్ను ఏ రాజకీయం 
అంట లేదు, నేను ఇండియా లోనే 
మరో దేశాన్ని, నేను వేరు ,నా 
ప్రపంచం వేరు,అని చెప్పాలా..

తోసుకుని, తోసుకుని ,ఇలా 
రాజకీయం చేయకండి నా 
మాటలని..నా స్వర్గం లో 
ఇలా విషాలు చిమ్మకండి ..

నా ఇంటి ని ఇలాగే 
క్లీన్ గా, నీట్ గా, తళ తళ 
మెరవనీయండి, ఆ రాజకీయం 
మురికి నాకు అంటించకండి..

చెప్పాగా, మేము వేరు ..
ఈ దేశం లో మరో దేశం మేము..
మా చుట్టూ కంచెలు వేసుకున్నాం 
చూడ లేదా? ఇంక దణ్ణం పొండి ..

మా ఆకుపచ్చ లాన్స్ 
మీ కాళ్ళ తో తోక్కేయకండి..
పొండి ,రాజకీయాలు ఇక్కడ 
మా దగ్గరకి రాకండి..

నా  క్యూట్ ఇంటి ని 
నన్ను వదిలేయండి ప్లీస్..
మేం మా దారిన మేం పోతాం..
మా జోలి కి రాకండి..

అంటూ ఒక స్వీట్ అమ్మ 
వేడుకుంది..సరే, పదండి..
ఓట్లు వేసే మామూలు జనం 
వద్దకు, పదండి..రాజకీయాలు 
కావాలి ట ..వాళ్ళకి..వాళ్ళకే..




5 ఫిబ్ర, 2013

సామాజిక రుగ్మత ...

తెల్లగా మెరిసిపో ..
జుట్టు నల్లగా ,మెత్తగా 
కాళ్ళకి ఈ చెప్పులు 
ఒంటికి ఈ బట్టలు..

అమ్మ ,కూతురు
ఒక్క లాగే అందం గా
ఈ బూస్ట్ తాగితే
నీకు లైఫ్ బూస్ట్..

అమ్మాయి పెళ్ళికి
అబ్బాయి చదువుకి
దాచండి, డబ్బు మా
బ్యాంకు లో...

ఇల్లు కట్టుకో ఇలా
పది మంది నిన్ను
మెచ్చుకోవాలిగా ..
అంటూ ప్రతి నిత్యం

ఊదరగొట్టే ఈ
ప్రకటనలే ,చిన్న తెర
పై... మనపై ఆధిక్యం
చేయట్లేదూ ??

మార్కెట్ శక్తులు అంటే
ఇవే, ఇవే, నువ్వు ఎలా
బ్రతకాలో, ఎలా మెలగాలో
ఎలా మనాలో ఇల పై..

చెవిలో ఇల్లు కట్టుకుని
పోరుతూ ఉంటాయి..
ఏదో ఒక నాడు ,నువ్వు
ఫలానా సోపు కావాలని

అనక పోతావా? అనిపించక
పోతారా? బలమయిన
పాము ని ,చీమలు ఏం
చేయగలవు? ఒట్టి చీమలు..

వరస క్రమం తప్పకుండా
అదే క్రమం లో మనమూ
ఒక నాడు, ముందు వాడు
కొన్నదే ,అదే మన మంచి

అనుకుని కొంటాము..
మన బుద్ధి ,అదిగో అలా
గోడ మీద మేకు కి
తగిలించి వస్తాం ,ఇలా

బజారుకి, కావాల్సింది
పర్సులో ఒక నో టో ,కార్డో
కాని ,ఆలోచించి కొనే వాడు
కాదు..పదండి ,సామూహిక

బజారు చేద్దాం...మన జనం
మనం మంది..మనం పంది ..
అని ఎవరయినా అంటే..
అలాగే కానీయండి ,అంటాం..

మనం అందరం ఒకే
మొహం ధరించి ,ఒకరిని
చూసి ఒకరం..నువ్వింతే
అంటే నువ్వింతే అనుకుంటూ

సామూహిక జోక్ అంటూ
మన మీద మనమే జోక్
అంటూ భలే నవ్వుకుంటాం..
మనం అంతే ,మనం ఒక

సామాజిక రుగ్మత అంటే
అదేదో, పెద్ద జబ్బేమి కాదు..
ఇలాగే ,నవ్వుకుంటూ ఉంటామే
అదే..అదే..అదే..హ్మ్మ్ ..అదే ..

4 ఫిబ్ర, 2013

నిర్భయ..

అడుగులు ముందుకే 
చూపులే వెనక్కి..
ఆ అబ్బాయి ఎవడో?
ఆ వెనక నున్న అంకల్ 
కి అదేం బుద్ది ,అలా 
ఇకలిస్తాడు ..చున్ని 
పక్కకి తోలిగిందా ??

హు,ఇవాళ జీన్స్ షర్టు 
కదా, అయినా ఏదో 
మర్చిపోయినట్టు ..
ఎప్పుడూ ఆడ పిల్లని 
చూడలేదా? ఏమిటా 
చూపులు, రెండు చక్రాలు 
గా చేసి, నా చెస్ట్ మీదకి 
విసిరి ,కోసేస్తున్నాడు ..
వెధవ చూపులతో..

అమ్మ పాలు తాగలేదా 
అయినా నేను కూడా 
ఎందుకు అలా పట్టించు 
కోవడం, నా దారి న నేను 
పోతాను, అదిగో నా బస్సు..

అమ్మో ,బస్సు ఫుల్ 
ఇవాళ కూడా నిల్చునే 
తప్పదు, పుస్తకాల సంచి 
గుండెకి హత్తుకుని, 
పాకెట్లో నించి పది 
రూపాయల కాగితం 
ఇచ్చినారాయణ   కాలేజ్ 
అంటూ టికెట్ కోసం చేయి 
చాపితే, ఒక అయిదు రూపాయల 
బిళ్ళ చేతిలో పెట్టి, చెయ్యి 
నిమిరాడు, యాభై ఏళ్ళ 
నడి వయసు కండక్టరు..

చేతి మీద ఆసిడ్ పోసినట్టు 
మండింది, ఒక చూపు 
తీక్షణం గా వాడి వీపు ని 
తాకి, జారి పోయింది..
సిగ్గు లేని వాడికి ,చూపుల 
తిట్లు పడతాయా? వీడికి 
నా అంత కూతురు ఉంటుంది..

ఇంకా కళాశాల లో చెవులు 
మూసుకుని , సిగ్గు శరం 
మానం ,అవమానం ,మూట 
కట్టి సముద్రం లో పడేసి 
రావాల్సిందే...అయినా ఆ 
మలైకా , ఆ పడుకొనే అలా 
అందాలు పార పోస్తారు..
ఇంకా ఎందుకు మాలాంటి 
అమ్మాయిల మీద కూడా 
ఆ ఎంగిలి చూపులు?

అవి అందని దూరం 
అందాలు, ఇవి ఎదురుగా 
కనిపించే కమ్మని అందాలు 
అన్నాడు ఒకడు..
చూపులతో నే ఎంత 
తాగుతారో? సిగేరెట్టు ఆఖరి 
దమ్ము వరకు పీల్చినట్టు..

ఒళ్లంతా చిర చిర..ఏదో పుండు 
సలిపినట్టు బాధ..నా మానం 
ఎవరో దోచినట్టే..ఈ చూపుల 
స్పర్శ ఎంత చీదరో? అమ్మా..
నన్నెందుకు కన్నావమ్మా?

అమీబా , హైడ్రా ...తల 
లో ఆలోచనల హైడ్రా ..
అమీబా లో మారిపోతున్న 
అసహనం..రూపం..
ఈ శరీరం నాదేనా? నా సొంతమేనా?
ఏదో అరువు శరీరం ,అనిపిస్తోంది..

ఈ బరువు, ఈ బాధ, యే 
మూల నించి ఎక్కడికి 
పాకుతుందో..ఎక్కడ పడగ 
ఎత్తుతుందో? మధ్యలో ఈ 
నెలసరి బాధ ,ఒకటి, 
తునక తునకలు చేస్తూ,
ఎవరికీ అర్ధం అవుతుంది, 
ఈ చిరునవ్వు వెనక ,
కడుపు ని తిప్పేసే బాధ..

చూపులు, చూపులు 
తూట్లు పొడిచే చూపులు..
ముందుకి ఒంగి, ఉండలా 
చుట్టుకు పోవాలి అనిపిస్తుంది 
ఏమిటా గూని నడకా అనే 
అమ్మ కి తెలియదా? ఎందుకో?

ఇంటికి చేరే సరికి నిర్భయ 
కళ్ళు మూసింది, నిర్దయ 
లోకం నించి వెళ్ళిపోయింది 
నిర్ద్వందం గా ఛీ కొట్టి ,
విసిగి పోయి వెళ్ళిపోయింది.
అని వార్త..

నేను ..నేను...ఒక 
కన్ను మూయని నిర్భయ నే 
ఇంకా నేను నా సమరం 
కొనసాగిస్తున్నాను ...ప్రతి దినం 
నా ఒళ్ళు జ్వలిస్తూ, నశించి 
నిముషం ,నిముషం కొంచం కొంచం 
నిర్భయ గా జీవిస్తున్న నన్ను 
చూసారా ? మీరు..చూడండి ..











2 ఫిబ్ర, 2013

మరే..అలవాటు పడిపోతాం ట

ఒక సారి కట్టి విడిచిన కొత్త 
చీర, మడతలు పెడుతూ 
అబ్బ ,నలిగి పోయిందే 
అంటూ విసుగ్గా మొహం 
పెట్టి ,బీరువాలో పడేసాను..

కాలి కి చెప్పు ,సరే సరి, 
వాడుతూ ఉండండి, మీ 
పాదం కి సరిగ్గా సరి పోతుంది 
అంటూ ,అంటకట్టేడు, నేను 
చూసుకోవద్దూ, ఇప్పుడు 
కరుస్తున్నాయి,సరే చూద్దాం 
అని ఒక మూల దాచేను..

నిన్నటి ,గుబాళింపు మల్లె 
మాలేనా? అసహ్యం గా ఎలా 
ఉందో ? దారం ఒక్కటే వేలాడుతూ 
నాలుగు మాసిన పువ్వులు..
ఒక్క రాత్రేనా మల్లె జీవిత కాలం..
హు..నిట్టూర్పు .నా జీవితం  లాగే..

ఏమిటో ? ఎందుకో ? ఇలాగే 
ఉంటోంది, ప్రేమించి చేసుకున్న 
కాపురం, ఎవరి పోరు లేదు,
మాలో ను, పోట్లాటలు లేవు..
పెద్దగా, అంటే నాకు నీలం 
రంగు పెద్ద ఇష్టం లేదు అనగానే 
నేను లోపలి వెళ్లి చీర మార్చేస్తా మరి ..

నాకు గళ్ళ షర్టు భలే ఇష్టం 
అంటే అతను వేసుకున్న లేత 
గోధుమ రంగు షర్టు కేసి చూసి 
దీనికేం బాగానే ఉంది గా అంటూ
పద ,పద అంటూ నాకిష్టం లేని 
హిందీ సినిమా కి వెల్తామ్ .

ఏముంది ఆ తెలుగు సినిమాల్లో 
అంటూ క్రిటిక్ అయిపోతాడు..
ఏముందో, ఏమిటో మరి ఎందుకో 
నాకు తెలుగు సినిమాలే ఇష్టం..

నాకు ఇవాళ ఇంట్లో తినాలని లేదు..
పద ,పద మని తొందర పెట్టేడు.
ఇంట్లో వండిన వన్నీ ,రేపటికి సద్దె 
నాకు నీరసం గా ఉంది, బయట 
నించి ఏమయినా తెండి అంటే,
రోజూ బజారు తిండి, అందుకే 
ఆరోగ్యాలు ఇలా తగలడ్డాయి 
అంటూ రుసరుసలు..

నా నీరసం పైకి ఎగిరి పోయి,
వంటిట్లో గిన్నెల మోత ,
తిరగమోత తప్పదు నాకు..
మనసులో నలత కి పేరే లేదు..

అమ్మో ,ఇంకా వందేళ్ళు కాపరమా ?
నీరసం అప్పుడే, నలిగిపోయిన చీర 
నయితే ఒక మూల పడేసాను..
కరిచే చెప్పు ని అటక ఎక్కించెను..
ఇంకా మల్లె మాల అయితే ఊడ్చిన 
కసవు లోకి చేరింది..ఈ పెళ్లి 

మంత్రం ని ఏం చేయాలి?
నిత్య నూతనం గా ఉండాలి ట ..
దీవెనెలు గుర్తు వచ్చాయి..
చప్పట్లు కయినా దాంపత్యానికయినా 
ముచ్చటగా రెండు చేతులు, 
రెండు మనసులు ఉండాలి కదా..

ఒక్క చేత్తో చప్పట్లు కొట్టినట్టు 
ఈ వోటి సంసారం కుండ లో 
తియ్యని నీళ్ళు ఎలా వస్తాయి?
అతలాకుతలం గా కుతకుత లాడింది 
మనసు, తెలియని బాధ తో 
నీరసించింది మనసు..

సంసారలన్నీ  ఇంతే అమ్మ 
తేల్చేసి చెప్పేసింది ,సినిమాల 
లాగ ఉండవే ,ఎప్పుడూ డ్యుఎట్ 
లో అవేవో ,పాడుకుంటూ ఉంటారా?
అవ్వ..సద్దుకుపోవాలి అంటూ 
అమ్మ గీతోపదేశం..

అదే ఆ సద్దుకు పోవడమే, 
ఆ సద్దుకు పోవడమే, ఎప్పుడూ 
నా వంతేనా ? అంటూ నొసలు 
చిట్లిస్తే .అదిగో అలా మొహం పెట్టకు 
అంటూ చివాట్లిసింది..

అదిగో అక్కడే మరి అమ్మ కి 
అతని కి తేడా? నా మనసులో 
పుట్టిన ,పుట్టబోయే ప్రతి 
ఆలోచన కి మాట రూపం ఇస్తుంది 
అమ్మ, మరి ఎందుకో? ఈయన 
మాటల్లో చెప్పినా అర్ధం చేసుకోడు?

మరి నేను ఇష్టపడ్డ అతనే గా?
నవ్వు వచ్చింది, వాడ గా వాడ గా 
పాదం కి సరిపోతాయి ,అని చెప్పుల 
షాప్ వాడు చెప్పినట్టు, కలిసి 
ఉండగా, ఉండగా,సరిపోతాడు 
నాకు అనుకున్నానా? నేను..
ఏమో ....అనుకున్నానేమో..
మూల పడేసిన చెప్పుల జత 
తిరిగి వాడడం మొదలు పెట్టింది..

అదో హాయి..ఆ కరవడమే ఒక 
హాయి..అంతే..ఎంతలో ..ఇంతలో 
చెప్పులు అలవాటు పడిపోతాయి ట ...
మరే..అలవాటు పడిపోతాం ట ..















1 ఫిబ్ర, 2013

ప్రేమలేఖ అంటే

సన్నజాజి తొడిమ కి తెలుసా 
తను మోసేది పరిమళం అని?
నిశి రాతిరి కి తెలుసా తను 
పూసేది నలుపు రంగు అని?

పుడమి ని తడిపే వాన చుక్క 
కి తెలుసా ,చుక్క చుక్క ..
పచ్చదనం కి ఊపిరి అని..
నల్ల ,నల్ల మబ్బులకేమి 
తెలుసు ,చమక్ చమక్ 
వెండి తీగలు మోస్తోందని..

మన్నించే మాట కి తెలుసా 
మన్నన  వెనువెంటే అని..
ప్రేమించే మనసుకి తెలుసా 
ప్రేమ కి కూడా ఒక మనసు 
ఉంటుందని, అప్పుడే ప్రేమ 
నిలిచే ఉంటుందని..

మాట ,మాట కి ఒక అర్ధం 
అలాగే ,మౌనం కి ఒక అర్ధం..
ఏ భాష అక్కరలేని మరో 
భాష..ఒక్క కంటి చూపు..
పెదవి ని దాటని ఒక 
చెలి చిరునవ్వు, పంటి 
కింద తొక్కిపెట్టిన చిరు 
చిరు హాసం..అదే మరి 
ఆమె భాష..అదే మరి నీకు 
ఆమె పంపే తోలి ప్రేమలేఖ..

కన్నులతో చెప్పిన 
పెదవులు పలకని తొలి 
ప్రేమ లేఖ ని అందుకున్న 
ఆమె వదనం లో నీకు 
అరచేతిలో చందమామ 
కనిపించిందా? అయితే 
సరే, కాసిన్ని తారలు కూడా 
తెంపి ఆమె నల్లని జడ నింపు..

ఆ వాలు జడ ఒక్కసారి 
విసిరితే ,నీ ఒళ్లేనే రాలుతాయి 
లే చుక్కలు, తారలు..
గోదావరి నది ఒమ్పులన్ని 
ఆమె మేని లో ఉన్నాయి నిజమే 
కాని, ఆమె కళ్ళ నిండి ఒక్క 
కన్నీరు చుక్క కారినా 
గోదావరి కి వరద ఒచ్చిన్నంత 
భీభత్సం , సరే మరి కాసుకో..

ప్రేమలేఖ అంటే ఏదో కాగితం 
కలం ,కాసింత పడి కట్టు 
పదాలు కాదబ్బాయ్..నీ 
మనసులో పూసిన ప్రతి 
సంతోషం ,ఆమె మనసులో 
ప్రతిఫలించాలి, ఆమె మనసులో 
నీ నవ్వే గుడిగంటలు కావాలి..

మాటలే అక్కర్లేని మనసు 
పుస్తకం లో రాయని మాటలు 
తోట పూయించే సన్నజాజి 
పరిమళం..తొడిమ కి తెలియని 
పరిమళం..పూవు కి ఎక్కడిదో?

అదే కదా ప్రేమతో ప్రేమ 
ని పూయించడం..ప్రేమ ప్రేమ ని 
ప్రేమించడం..మనసు ని 
పరిమళం తో నింపడం..