"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

20 సెప్టెం, 2013

' చివరి గుడిసె '

ఒక్క పుస్తకం మనలో ఎంత మార్పు తీసుకు వస్తుందో చెప్పాలంటే  డాక్టర్ కేసవరెడ్డి గారి నవల ' చివరి గుడిసె ' చదవాలి .. 
నా జీవితం అంతకుముందు ఆ తరువాత ..లా అయిపొయింది ఇప్పుడు , ఈ పుస్తకం చదవక ముందు , చదివిన తరువాత , 
చిన్న పుస్తకం, ప్రతి పదం ఉలి తో చెక్కి ,సూది బాణం చేసి, నా మస్తిష్కానికి గురి చూసి విడిచినట్టు ,ఒక ఉలికి పాటు, ఒక ఉనికి పాటు . 
చిన్న పుస్తకం లో ఒక్క వ్యర్ధ మైన పదం లేదు, అలా అని తూకం ఏమి వేయలేదు ,అంతా అలా సరిపడా , అంత కుదువ గా ఎలా వ్రాయ గలిగారో ?
ఎంత నిశిత పరిశీలన? ఎంత తర్కం ? ఎంత ప్రేమ మనుషుల మీద .. 
చులాగా అలా మన కళ్ళ ముందు ఈ సమాజం లో నడుస్తున్న దోపిడీ, అన్యాయం , నిరంకుశతా , ఈ రాజ్యం అంటే ఎవరో అంతా విడమర్చి చెప్పేశారు , ఇంకా నువ్వు కళ్ళు మూసుకుని, నా రాజ్యం సుభిక్షం ,నా ప్రజలు తోబుట్టువులు లాంటి వారు అంటూ మభ్య పెట్టలేవు . 

ఎక్కడినించి పుడుతుంది ఈ క్రౌర్యమ్ ? ఎక్కడినించి ? 
అధికారం నించి,  రాజ్యాధికారం నించి .. 
ఊరు చివర ,సరి అయిన కప్పు కూడా లేని ఇంట్లో ఉన్న ఇద్దరు యానాది వారు, ఒకరు తండ్రి, పుట్టినప్పటి నిండి తనదైన కులవ్రత్తి లో ఎలుకలు ,ఉడుతలు ,పాములు వలేసి పట్టుకుని ,కడుపు నింపుకునే తండ్రి ఒకరు, ఆ కుల వ్రత్తి క్షీణ దశ కి నిదర్సనం గా ఇంతెత్తు విగ్రహపుష్టి ఉన్నా ,ఇంచుక ధైర్యం గుండె లో లేని పిరికి గొడ్డు కొడుకు .. 

ఎప్పుడో బ్రిటిష్ వారు ఇచ్చిన రెండెకరాలు పొలం ,ఊరు మన్నెం గారి ఖాతా లో  పోయింది, యానాది పుట్టినప్పుడే దొంగ, వాడి కుల వృత్తే దొంగతనం అంటూ రాయించి , పొలం లాక్కున్నాడు ఊరి మన్నెం అంటే రాజ్యమ్.. 
దొంగ అని ముద్ర వేయించి ,తరిమి కొట్ట్టినా ,తనదైన ఒక చిన్న పూరి గుడిసె లో జీవనం కొనసాగిస్తున్న తండ్రి కొడుకుల కి ఆ నాలుగు మెతుకులు దక్కని దైన్యమ్.. 

అంతా ఒక్క రోజు లోనే ..సూర్యుడు ఉదయిస్తూ ,ఈ యానాది తండ్రి కొడుకుల లో ఒక ఆశ వెలిగిస్తాడు .. 

ఆ సూర్యుడు అస్తమించి మళ్లీ ఉదయించే లోపలే , వీరిరువురి జీవితం అస్తమిస్తుంది .. 

ఆ ఒక్క రోజు లో జరిగినది . క్లుప్తం గా చెప్పాలంటే మానవుడి చరిత్ర. 
ఆ ఒక్క రోజులో గుండెలు పిండేసే విషాదం ఉంది .. 
నా ఇల్లు పదిలం, నా కుటుంబం క్షేమం అని నేను ఇంకా గుండెల మీద చెయ్యి వేసుకుని నిశ్చింత గా పడుకోలేను . 
నా కలలని కూడా తస్కరించే వారున్నారు .. 
ఈ రాజ్యం లో నీ స్థానం ఏమిటి ? నీ జేవనం ఎంత ధర్మం ?
అని ఆలోచిస్తావు నువ్వు. 

గన్నులు కాదు ,ఇలాంటి పుస్తకాలు పెట్టండి యువకుల చేతిలో .. 
పబ్బులు , మాల్టి ప్లెక్ష్ లు వదిలి , కరయచరణ మార్గాలు ఆలోచిస్తారు .. 
ఒంటి లో ప్రవహించేది ఇన్నాళ్ళు నీళ్ళు అనుకున్నాం ,వేడి రక్తం అని ఎరుక వస్తుంది .. 

ఆలోచన అంటూ మొదలవుతే , ఆపగలమా ??
ఆ పాదాలు నడక ఆపగలమా ? ఆ శ్రంఖలాలు తెమ్పుకుని రాకుండా ఆపగలమా ?? 

నేను ఈ రోజు చదివిన ఈ చిన్న పుస్తకం నా లో కలిగించిన వేదన , విభ్రమం , ఆలోచన , విరామం , కసి, ఏవగింపు , కదలిక , ఉత్కంట , ఊరడింపు ,మనిషి మీద నమ్మకం .. సడిలి పోతోంది, వస్తోంది . ద్వేది భావం తో , ఎన్ని రకాల భావా ల తో ఒక పరి పూర్ణ మనిషి లా అనిపిస్తున్నాను .. 
ఈ ఎరుక కలిగించిన ఈ చిన్న పుస్తకం ...చివరి గుడిసె .. రచయిత కేశవరెడ్డి 
గారికి ,జీవితాంతం ..మరి మాటలే లేవు .. 






3 సెప్టెం, 2013

ఆశే , అత్యాశే .. కదా ..కాదా.. ??

ఎడారి లో విత్తనాలు జల్లుతూ 
సముద్రాల అంచులకి చేరాను 
నాకు కుదరైన చోటున కూర్చుని 
ఏది నేను పెంచిన తోట అంటూ 
వెతికి చూసాను ,అదే కదా మరి 
అత్యాశ అంటే ... 

అమాయకత్వం ,అజ్ఞానం రెండూ 
పీట వేసుకుని కూర్చున్న మస్తిష్కం నాది 
ఎప్పటికప్పుడు మరుపు 
ఎప్పటికి కానరాని మెరుపు ,
మనుషులు కి రెండు మొహాలుట 
అంటూ ఎన్నిసార్లు చెప్పినా నాకు నచ్చిన 
ఒక్క మొహమే నేను ఎంచుకుంటాను . 

చదువు సంధ్య అంటారు కదా ? ఏది మరి సంధ్య 
అంటూ నిరంతరం వెతికే మూర్ఖురాలిని నేను 
కాళ్ళకి చక్రాలు అంటూ కూర్చునే ప్రపంచాన్ని 
పరమార్సించే బద్ధకస్తరాలుని నేను .. 

నా ప్రపంచం అంతా నాలోనే బంధించి 
ఎప్పటికప్పుడు విశ్వం లా విస్తరిస్తూ ఉండాలని 
మేలుకునే కలలు కనే నేను , 
ఈ జగతి లో నేనొక ఓటమి ఉదాహరణ .. 

నాకంటూ ఏమి ఆస్తులూ , పాస్తులూ అసలేం లేవు 
కొన్ని స్నేహాలు ,మరి కాసిన్ని ప్రేమలూ 
హ్రదయ కవాటం లో ఇంకా బహిర్గతం కాని రహస్య కోరికలు 
చదివిన పుస్తకాల లో పాత్రలు నా బంధువులు ,
పిలవకుండానే వచ్చి నా ఆలొచనల పేరంటం లో 
తాంబూలం పుచ్చుకుంటారు . 

నా చుట్టూ ,మరిన్ని విత్తనాలు చల్లుకుంటూ 
ఊహల సేద్యం చేసే చదువుకున్న స్త్రీ ని నేను 
నా ఆలోచనల విత్తనాలు వెదజల్లకుండా , నేను 
మరి ఈ విశ్వం ని విడిచి పెట్టను. 

నా పేరు తలుచుకుంటే , వసంతం లో పూసే పూలే కాదు 
నిరంతరం పెదవి పై పూచే చిరు నవ్వు పులకింత కావాలి 
ఎంత ఆశ ? మరి నీ చేతులు ఇంత మెత్తగా ,పూలు లాగ?
చేతులు కదుములు కట్టి, పాదాలు గట్టి మట్టి లాగ 
అప్పుడు కదా నువ్వు నాటిన విత్తనాలు ,ఫలించేది ?

అవును కదా ,మట్టి వాసన అంటని ,పక్కా భవంతులు 
మేడలు , డాబాలు మావి, ఎక్కడా ఒక్క పిసరు మట్టి అంటదు 
మట్టి వాసన, వర్షం పడిన తరవాత వచ్చే మట్టి వాసన 
కిలోల లెక్క కొనుక్కుని ,బీరువాలో బీగం వేసి దాచుకుంటాం . 

అయినా సరే ,నాకు ఆశే ,నా చుట్టూ ఒక తోట ఆరు కాలాలు 
విరి పూలతో నిండి ,పరిమళాలు వెదజల్లి ,ఆరు మైళ్ళ అవతల 
వాని నైనా ఆకర్షించి ,ఈ పూదోట నా పూదోట ,
మది అందరిదీ కలలు ,కోరికల ,కథల ఊహల తో నింపుతుందని .. 

ఆశే , అత్యాశే .. కదా ..కాదా.. ??