"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

18 డిసెం, 2013

అరకు లోయ

అరకు లోయలో కూలిన శిఖరమ్.. 
అనంత గిరి లో పండిన కాఫీ బెర్రీలు 
సువిశాలమయిన మైదానాలు 
ఇక చాలు లెమ్మని ,భూమి 
పైకి లేచి, తూర్పు కనుమలు గా 
విస్తరించింది, అరకు ఆ కొండల లో 
పూసిన ఓ అడవి పువ్వు. 

అలుపెరగని కొండ దారులు 
మెలికలు తిరిగే నది కి పోటి యా ?
ఏ మలుపులో  ఏ అందం కి 
మూర్చపోతామో , జాగ్రత్త .. 
ఒక కోణం లో అడవి దట్టం గా 
సూర్యుడి వెలుగు కి చెక్ చెపుతూ 
మరో కోణం, మరో కొండ దాటి మరో 
మలుపు తిరిగితే పచ్చగా పరుచుకున్న 
ఏటవాలు వ్యవసాయం, 
కొప్పున ఒక అడవి పువ్వు, 
చుట్టూ కట్టిన ఒకే చెంగావి చీర 
మెరిసే కళ్ళు, స్వచమైన గుండె 
ఆ అడవి కన్య మేకప్పు .. 
వీపు మీద  బరువు తో ,వడి వడి గా 
అడుగులు, మన వాహనం రొప్పుతూ .. 


కళ్ళు అందాలు చూసి చూసి ,చుట్టూ 
హృదయం విచ్చుకుంటుంది .. 
ఒళ్ళు తేలిపోతూ , అవును గాలి కొండ 
మీద ఆగి, కాసేపు మనమూ నిజం గా 
మేఘాల మధ్య తేలి పొవచ్చు. 
అప్పుడప్పుడు దయ తలిచి 
నాలుగు అక్షింతలు వేసే పెద్ద వాళ్ళ లాగా 
గబగబా నాలుగు వర్షం చినుకులో 
ఇంకా ఎక్కువ ప్రేమ మన మీద ఉంటె 
దబ దబ పెద్ద వర్షమో కురిసి, తడిపి 
జీవితం అంటే ఇదే, ఏ భయమూ, భక్తీ లేని 
పారవస్యం , ఏ ఆలోచన లేని 
నిశ్చింత ,ఆ కొండ మనకి ఒక 
నిశ్చల స్థితి కి తీసుకు వెళుతుంది ,,
ఇంకొంచం పైకి వెళితే , చుక్కలు 
అందుతాయేమో , ఇంకా పైకి వెళదాం 
అంటూ వెర్రి ఆవేశం, వెర్రి నమ్మకం .. 

అదే గాలి కొండ .. 
అరకు కి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల 
దూరం లో ఉంటుంది ఈ గాలి కొండ . 
అన్నిటికన్నా ఎత్తయిన కొండ ఇది 
అరకు కి వెళ్ళే దారిలో ... 


ఇంకా చాపరాయి.. 
ఘరులు గిరుల పై నించి ,
అమ్మా మేము ఆడుకుని వస్తాం అంటూ 
అల్లరి చిల్లర గా పరుగులు తీస్తూ ,ఉరకలు వేసే 
పిల్లల ఆట పాటలు గుర్తు చేస్తాయి ..
సర్రున జారే జారుడు బల్ల మీద పిల్లలు .
నీటి తో పాటూ ..జారుతూ ..
నేను ..అమ్మని ..నిశ్చలం గా ఒడ్డున 
నా లో పసితనం ఎప్పుడు అమ్మ తనం గా 
మారిందో ..ఏమో ....

అరకు ఎన్ని సార్లు వెళ్ళామో ..
మొట్ట మొదటి సారి , నిష్పూచీ యవ్వనం లో ,
పరుగులు తీస్తూ ్వాన లో తడుస్తూ , కొండలని 
ఎక్కేయ గలం అనే అమేయమైన గుండెలు నిండా 
ధైర్యం అప్పుడు ..పాటలు ..మాటలు ..పాటలు ..
అన్ని కలగలిపి .ఒక సంగీతం నిండింది మాలో 
ఇప్పుడు జీవన సంగీతం కదా ..అది మాలో .. 

ఒకటా రెండా ..ఎన్నో ఎన్నెన్నొ ..
జడి వాన లో కురుస్తున్నాయి . 
వాన వెలిసాక మరి కొన్ని ..