"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

17 ఆగ, 2013

నేనసలే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ .

నా నాలుగు గోడల ఎడారి మధ్య కూర్చుని 
తోటలు పెంచేస్తూ , అడవుల మధ్య తిరుగుతూ 
పువ్వులు దోసేట్లోకి తెమ్పుకుంటూ ,సిగ్గు లేని 
కలల అరువు జీవితం బ్రతికేస్తాను. 

వసంత ఋతువును  నా గోడ పై 
ఒక గొంగలి పాకుతూ తెస్తుంది, 
ఆపై సీతాకోక చిలుక గా మారడం 
నేను ఊహిస్తూ రంగులు అద్దుతాను. 

గల గల పారే సెలయేరులు, జలపాతాలు 
నా స్క్రీన్ మీద ముచ్చటైన బొమ్మలు 
సంగీతం , సాహిత్యం లేని సంగీతం వాటికి 
అద్ది, అవధులు లేని పారవశ్యం , అనుభవం నా సొంతం . 

కాళ్ళు కదకుండా ప్రపంచ పటం మీద విహారాలు 
కళ్ళు చెదిరి, కళ్ళ నీళ్లు తో నిండుతాయి ,
ఆనందం పట్టలేక, కళ్ళు నీళ్ళు తుడిచే స్నేహాలు 
ఆ పెట్టె లోనే, మనసు ఖాళి గది ,ఎప్పుడూ .. 

జ్ఞాపకాలు ,గుర్తులు , అనుబంధాలు 
డస్తర్ పెట్టి తుడిపేసి ,ఎప్పటికప్పుడు నల్ల బోర్డు 
నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోవడం ఒక ఆర్ట్ ,
నేనందులో మాస్టర్ , నేనసలే  మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ . 





14 ఆగ, 2013

చదువు కొందాం రండి ,చదువు కొందాం రండి

చదువు కొందాం రండి ,చదువు కొందాం రండి 
పలకల పై అ ,ఆ ,లు ఎగరేసి పాట పాడుతారు 
ఎవరు ఎక్కువ పాట పాడితే వారిదే చదువు శాల 
చిన్న చిన్న పిల్లలు ఆకలి కడుపులు చేతితో పట్టుకుని 
చదువు కొంటారు, చదువుకోడానికి మరి వీలు లేక . 

అమ్మ అంట్లు తోముతుంది నాన్న వాచ్ మాన్ ,
అమ్మా ఆకలి అంటే బడి కి వెళ్ళు ,బువ్వ పెడతారు 
అంటూ తోలింది, పళ్ళెం లో ఉడికి ఉడకని అన్నం ,
మారు అడిగితే నెత్తి మీద మొట్టికాయలు, మీ అబ్బ సొత్తా ? 
అని తిట్లు దండకాలు, చదువుకొంటాం మేం చదువు కొంటాం . 

పుస్తకాలు ముట్టినట్టు , తలాడించేం ,నాలుగో తరగతి కి ఇంకా 
అ ఆ లు రాలేదాని వీపు మోత మోగించే మాస్టర్లు ,
ఎప్పుడైనా మరి చదువు చెప్పారా ? ఉచితం అంటే ఇంతే
అన్నారు, మరి చదువు కొంటున్నాం కదా అంటే ,అది మా జీతాలు 
మీ చదువుకి ఏవి జీతాలు ? 

పై మాస్టారు తనిఖి కి వచ్చి ,పెద్ద అయి ఏమవుతారు ?
అని అడిగితే అందరం మాస్టర్లు అని చెప్పెమ్.. సంతోషించి 
ఎందుకురా అంటే రెండు పూటలా మరి పిల్లల అన్నం తినొచ్చు కదా 
అని గట్టిగా అరిచేం , ఏమో మరి అందరూ మమ్మల్ని మెచ్చుకోలేదు సరికదా 

ఈ ఉచిత బడి పిల్లలకి ఎంత ఆకలో ఎంత బలుపో అన్చెప్పి 
మా వీపులు వాయించి, మాస్టర్లు చింత బరికలు తో తోళ్ళుఊడకొట్టారు 
అమ్మ బడి వద్దే ,నేను ఇళ్ళల్లో పని చేసి, అన్నం తింటానే అని ఏడిస్తే 
అమ్మ ఏమంది , చదువు కుంటే నీ బువ్వ నువ్వే సంపాదిస్తావు ,ఎంగిలి కూడు వద్దురా అంది . 

అందుకే చదువు కొనే బడి లో చదువుకుంటాను ,నేను చదువుకుంటాను . 

8 ఆగ, 2013

నా అక్షరాల పక్షులు ..

పిడికిలి బిగించి పెట్టాను 
రెక్కలు విరిచి , ఊహలు తెంపి 
స్వేచ్చ ,స్వేచ్చ అంటూ ఎగరాలనే 
పక్షుల రెక్కలు.. 
రంగు రంగులు అద్ది ముచ్చటగా 
ఖరీదయిన గింజలు నోటి కి అందించి 
అందమైన పంజరం ఊచలు కి 
బంగారం రంగు పై పూత  పూసి ,
అయినా అదేం బడాయో ,
ఎప్పుడూ స్వేచ్చ స్వేచ్చ అంటూ 
కువ కువ లాడి , బుర్ర తినేస్తాయి . 

కలలో కూడా అవే ,
పక్షులు పక్షులు పక్షులు 
రెక్కలు విప్పి మొహం మీద కొట్టి 
నీకింకా అర్ధం కాదా ?
అవును నువ్వు మనిషి కదా 
నీకు ,నీకు మెచ్చే మాటే వినిపిస్తుంది 
మా మాటలు, కూతలు నీకు 
కాకోఫోని నీకు , నీ భాష లో నీకు 
అర్ధం అయేలా ఎలా చెప్పం ?

మాకు ఆ పంజరం బ్రతుకు వద్దు 
నీ పోషణ ,నీ ముద్దు ముచ్చట్లు 
మాకు వెగటు , మా రెక్కల మీద ఎగరని 
మాకు ఎగరడం వచ్చనే మర్చిపొయామ్.. 
ఆఖరి బ్రతుకు పోరాటం గా ఇదే మా 
ప్రయత్నం అంటూ, నా ఒంటి నిండా మూకుమ్మిడిగా 
రెట్టలు రెట్టలు రెట్టలు వేసేసరికి ,ఛి ఛి ఛి అంటూ 
పిడికిలి తెరిచి , ఊహల కి రెక్కలు ఇచ్చాను 
అవును రెక్కలిచాను ,అవి పక్షులై ,
నింగి కి ఎగరడం నా కళ్ళారా చూసాను . 
అవును నేను చూసాను ,నా అక్షరాల పక్షులు .. 




5 ఆగ, 2013

పిలుపు మొదలయింది ..

తన తలపే తనువు ని తరువు చేస్తుంది, 
అనుకోకుండా వసంతం వచ్చి పడి పోతుంది 
ఏమాత్రం సమయం ఇవ్వదు, 
వసంతం అంటే ఎన్ని ఏర్పాట్లు . 
చిగురించాలి 
మొగ్గలు ముకుళించాలి 
మొగ్గలు సిగ్గులై ఎర్రెర్రని రేకులవాలి 
పూలు వికసించే సంగీతం వినిపించాలి 

అవును పూలు సంగీతం ఆలపిస్తాయి 
తల ఊపుతూ గాలి కి ఒక సన్నని పాట అల్లుకుంటాయి ,
ప్రకృతి చెవి యోగ్గి హర్షిస్తూ వింటుంది .. 
ఒక్క అపస్వరమూ ఉండదు, సామ వేదంకి రూపం ఇచ్చినట్టు 

పూలు పాడే గీతం వసంతం 
మరి ఎందుకో కబురు కన్నా ముందే వచ్చి చేరింది 
తనువూ ఆత్మల  సంగమం కి 
సమయం సందర్భం ఎందుకని శోచిందేమో
ఊహల మొగ్గల సిగ్గులు ఇంకా మొదలవలేనే లేదు 

ఎదురుచూపులు  రాల్చిన ఆకులు ఇంకా రాలుతూనే ఉన్నాయి,
ఎన్ని రంగులో ఎన్ని చిన్నేలో ..
ఒక్కోసారి సమాగమం కన్నా ఎదురుచూపులే హాయి తోస్తాయి,
ఆకులు రాల్చడం లో తరువు కి ఒక హాయి 
నూతన చివురులు చిరునవ్వు ని మోలిపిస్తాయి , 
మోము యోగ ముద్ర దాలుస్తుంది , 
పూర్వ సంగమం సాక్షాత్కరిస్తుంది 
ఆ మాదుర్యం తలుచుకుని ,తలుచుకుని అనుభవించేది ,
ఒక్క క్షణమో ఒక్క రోజో కాదు 
జీవిత కాలం కి సరిపడా ఆత్మా అవలోకనం .. 

అందుకే , 
నా తనువూ ,ఈ సమాగమం 
ఈ వసంతం కి ఇంకా సమాయత్తం అవలేదు 

ఒక యుగమైనా ఒక లిప్త పాటు అయినా 
నాకు ఇంకా సమయం కావాలి, 
ఎదురు చూపుల అనంతమయిన హాయి 
ఇంకా ,ఇంకా నన్ను అనుభవించనీ ,
తొందరపెట్టకు నన్ను తొందరించకు 

చివురించమని పుష్పించమని 
ఉనికి స్థిరీకరించమని 
నన్ను ఎప్పుడు మరి 
తొందర పెట్టకు .. 

సృష్టి కార్యం ఎప్పుడూ నిదానం గా , 
కళ్ళు వెలుతురు కోసం కలలు కన్నట్టు , 
పసి తనం మనసుని వీడనట్టు 
నిదానం గా జరగాల్సిందే .. 

సమస్త సృష్టి కి ఒక్కో క్షణం రాసి పెట్టి ఉంటుంది 
ఆ క్షణం 
ఆ లిప్త పాటు కోసం ఒదిగి ఒదిగి, 
తల్లి పొట్టలో పిండం లాగ తపస్సు చేయాలి ,
తొందర పడిన ప్రతి చర్య చిద్రమే , వద్దు .  
నీ సమయం, నీ ఉనికి సంతకం 
ఇక్కడే ఎక్కడో రాసి పెట్టె ఉంటుంది . 
ప్రతి చర్య కి ప్రతిచర్య అని ఊరికే అనలెదు. 

వసంతమా అందుకే 
తొందర పడకు 
తొందర పెట్టకు 
తరువు తరువు కి కబుర్ల సందేశాలు అందించుకొని 
కరువు తీరా కబుర్లాడుకొని 
ఏ రోజు ఏ మాను నేల కూలుతుందో ,
యుగయుగాలు గా రచిస్తున్న కథ మరి 
ఎన్ని చరిత్రలు దాగున్నాయో ఆకు ,ఆకు లోనూ ,మనకేమి ఎరుక 
నింపాదిగా ఎదురుచూపు కి రూపం వచ్చినట్టు చెట్టు , 
యుగయుగాలుగా ఆకాశం కప్పు కింద గాలి తో సయ్యా ట లాడుతూ 
తన కథ ని సుదూరం గా 
చెట్టు పంపే ఎన్ని సందేశాల టపాలు చేరవేసిందో  గాలి 

ఇంత కథ ఉంది ముందు వెనక 
వసంతమా కాసేపు విరామించు ,
కాసేపు నిదానించు , 
కాస్తంత సమయమివ్వు, 
యుగాంతమో, క్షణ కాలమో నీ పిలుపు నీకు వస్తుంది .
పిలుపు ఎక్కడో మొదలయింది .. 
అవును పిలుపు ..పిలుపే .. మొదలయింది ... 

























4 ఆగ, 2013

పచ్చని చెట్టు చెప్పిన కథ

ఆకు ఆకు కి ఒక కథ ఒక కాలక్షేపం ట,
ఒక్క సూర్యుని కిరణమైనా తాకదా నన్ను అంటూ తొందరింత 
అటు జరుగు సుమ్మి ,నా వంతు కాదా ,ఈ వేళ? అంటూ 
అలకతో ముడుచుకుని, అంతలో తేరుకుని, విప్పారి ,
సతత హరిత పత్రాన్ని ఆ వెలుగు ప్రభువుకి అప్పగించి 
సూటైన కాంతి స్పర్శ కి పులకించి ,మరో మారు ప్రణమిల్లిన 
ఆ చిన్ని ఆకు ,జగమంత ఎంత సుందరం ,అంటూ తిలకించి 
కనుచూపు మేర లో ఒక్క నీటి మబ్బు కనిపించదే?
ఈ దుమ్ము ధూళి ని శుభ్ర పరిచే చిక్కటి నీటి ధార ఏది ?
తలారా స్నానించి పులకిత పత్రం గా వెలుగొందాలి కదా 
ఆకు ఆకు కి ఒక తపన ,ఒక తపస్సు. 

నీలి ఆకాశం నిప్పులు చిందుతూ 
పచ్చదనం ని నాకేస్తోంది ,తన మంటల కి ఆజ్యం గా 
నీడ కోసం నరుడి కి ఎండ కంతులే కానుక ,
ఒక్క చెట్టు అయినా మిగల్చరేం ? అంటూ 
రుస రుస లాడుతూ మనిషి , ఎవరో ఆ ఒక్కడు 
తను మటుకు కాదు కాబోలు ?? 
ఎంత మూర్ఖుడో అంటూ జల జల ఎండిన ఆకులు 
విదిల్చి ,మౌనమ్ గా తను పోయే లోగా రెండు 
మొక్కలు నాటే వారెవరు ? అంటూ దిక్కులు చూస్తూ 
పచ్చని చెట్టు చెప్పిన కథ ,వినే వారున్నారా ??