"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

22 అక్టో, 2013

స్మృతులు ఎన్ని రకాలు ?


చిన్నప్పుడు అయిపోతుందేమో అని దాచుకున్న పీచు మిఠాయి లా
కొన్ని దాచుకున్నా ,కరిగి పోతాయి ,
తరవాత తిందామని దాచుకున్న పీచు మిఠాయి అణిగి పోయినట్టు ..
మస్తిష్కం లో ఎన్నో పొరలు ట.. దాగుడు మూతలు ఆడుకుంటూ దొంగ కి దొరకకుండా
దాక్కున్న చోటు నుంచి ఎవరూ వచ్చి ఇదిగో అంటూ పట్టుకోక పోతే కలిగే
అసహనం ఈ దాక్కున్న జ్ణాపకం  వచ్చీ రాకుండా ఏడిపిస్తూ ఉంటే ..

మరి కొన్ని అమ్మ కొంగున ముడి వేసి దాచుకున్న చిల్లర కోసం ఇల్లంతా వెతుకుతున్న
ఘటన లాగా ,ముడి బిగుసుకు పోయి ఊడి రానివి ..
అదిగో ,అల్లదిగో ఆ చెట్టు మీదనే నువ్వు చివర వరకూ వెళ్ళి పోయి కొమ్మ అల్లాడుతూ ఉంటే
భయం తో బిగుసుకు పోయిన ముడి లాంటి జ్ణాపకం ..ముడి విడదీస్తున్నావు అనుకుంటాను
బిగదీసుకుంటున్నట్టు తెలియదా నీకు ??

సముద్రం ఒడ్డు న ఇసుకలో కాళ్ళు ఈడుస్తూ కొన్ని పగిలి పోయిన జంట గవ్వలు ,
ఆల్చిప్పల పై చిప్పలు ,తేలిక రంగులు , హరివిల్లు లోవి అంటించుకున్నట్టు , మురిపం గా రంగులు
సొంతం చేసుకునే కల ల రోజులు గుర్తు గా సొంతం చేసుకున్న ఆల్చిప్పలు
గుండ్రం గా ఉన్న రాళ్ళు అంటే ఎంత మోజు ? అన్నీ జీవితం లో అలా మృదువుగా , సిమ్మెట్రీ తో
ఉంటాయని కొండంత ఆశ కాదూ .. ఆఖరికి , గట్టిగా ఉన్నవే రాళ్ళు అని తెలుసుకోలేదూ !?

చీరలకి కూడా జేబులు ఉండాలని ,ఆ జేబుల్లో  కన్నీళ్ళు తో తడిసిన చేరుమాళ్ళు , వెనక్కి తిరిగి వచ్చిన
ఉత్తరాలు , ప్రేమలు , స్నేహాలు , తరగతి మారుతూ ఉంటే మారి పోయే స్నేహాలు , కొన్ని ,కోరికలు తీరినా ఎందుకని కలగదు సంతోషం అనే అయోమయాలు ...పడేయొచ్చు ..మా లేడీస్ బాగ్స్ సరిపోవా ?

సరిపోవు .. అంతే ..

కొన్ని జ్ణాపకాలు ,స్మృతులు , గుర్తులు కి ఎన్ని పొరలూ సరిపోవు అంతే ..
ఒక చిన్న గడ్డి పోచ ,ఒక రుమాలో ,ఒక అట్ట పెట్టో ,ఒక చిన్న పూసల గొలుసో ..ఆలంబన గా
గుచ్చు కుంటాం ..

ఎన్ని స్మృతులో .ఎన్నీన్ని గుర్తులో ..అన్నిటికీ ఒక్క జీవితం ..సరిపోతుందా ? ఏమో ??


8 అక్టో, 2013

నా రెక్కలు విప్పుకున్న రోజు.

అందరి ఆడ పిల్లల్లా గే నేను ఎదుగు తున్నప్పుడు ,నాలోనూ  ఆత్మ విశ్వాసం శూన్యం అని చెప్పవచ్చు.నా ప్రతిభ మీద నాకు నమ్మకం లేదు, నా శక్తీ సామర్ధ్యాల మీద అప నమ్మకం, మొత్తం గా నా మీద నాకే విలువ లేదు.మంచి మార్కులు వస్తే తరగతి లో, అది అదృష్టం అనే నా నమ్మకం..నేను ఎంతో స్నేహ శీలిని ,అందరితో యిట్టె స్నేహం చేస్తాను ,కాని, నాలో ఏదో వ్యధ, నా గురించి వారు పూర్తిగా తెలుసుకున్న రోజు ,నాతో స్నేహం వదిలేస్తారని ,ఒక వ్యధ..ఒక వేళ ,అంతా సవ్యం గా జరిగితే ,నేను సరి అయిన సమయం లో, సరి అయిన చోటు ఉండడం వల్లే అలా జరిగింది అని సరి పెట్టుకుంటాను.ప్రశంసలు  ,అభినందనలు నాకు సరి పడవు.

నేను ఎన్నుకున్న వి కూడా నా మీద నాకు ఉన్న విలువ ని బట్టి ఉండేవి.యవ్వనం లో నాలాగే ఒక అతి తక్కువ ఆత్మ విశ్వాసం ఉన్న యువకుడి తో ఆకర్షణ లో పడి పోయాను.హింసాత్మక మైన అతని ధోరణి కాని, వైరుధ్యాల తో నిండిన మా ప్రేమ కలాపం కాని, లెక్క పెట్టక, నేను అతని  ని వివాహం ఆడ డానికే ఒప్పుకున్నాను..

అతని తో ఏడు అడుగులు వేసే క్షణం లో కూడా ,నా తండ్రి నా చెవిలో "ఇప్పటికయినా ఆలోచించ మ్మా ..స్యు....నీ మనసు మార్చుకో ,మించి పోయింది ఏమి లేదు" అంటూ నన్ను వారించ డానికి ప్రయత్నించారు.నా కుటుంబాని  కి అర్ధం అయింది, నేను చేస్తున్నది ఘోరమయిన తప్పిదం అని, నాకు కూడా అతి త్వర లోనే ,కొన్ని వారా ల లోనే ఆ విషయం అర్ధం అయింది.

నా మీద హింస కొన్ని ఏళ్ళు సాగింది. నా శరీరం నిండా  ఎన్నో బలమయిన గాయాలు , ఒళ్ళంతా పచ్చి పుండై, ఆసుపత్రి పాలై ..నానా అవస్థలు పడ్డాను. జీవితం అంతా..పోలిసు సైరన్లు ,ఆసుపత్రి లో పరీక్షలు, రిపోర్టులు ,ఫ్యామిలీ  కోర్టు లో హాజరులు తో నిండిన ఒక కలగోలుపు ,అలుక్కుపోయిన దృశ్యం  లాగ అయిపొయింది.కాని నేను ఆ బాంధవ్యాన్ని వదల లేక, మార్పు వస్తుంది, మా సహజీవనం లో ఏదో మార్పు వస్తుందని ఓర్పు గా మళ్లీ ,మళ్లీ వెళుతూనే ఉన్నాను..ఆ జీవితం లోకి.

మా జీవితం లోకి ఇద్దరు పిల్లలు.. ఆడ పిల్లలు పుట్టేరు  ఒక్కో రాత్రి ,ఆ చిన్నారులు నా మెడ చుట్టూ వేసిన మెత్తటి చేతులు, నా చెంప కి ఆనించిన 
వారి బూరి బుగ్గలు, "అంతా బాగానే ఉంటుంది అమ్మా" అనే వారి చిట్టి పలుకు లే నాకు ఆసరా గా నిలిచేవి..ఆ రాత్రి కి..కాని, నాకు తెలుసు, 
అంతా ఏమీ బాగోలేదు, ఇలా కుదరదు, నేను మార్పు కి సిద్ధం కావాలి, నా కోసం కాక పోయినా ,నా బంగారు చిట్టి తల్లులు కోసమయినా ,వారి రక్షణ కోసమయినా మార్పు తప్పదు ..అని నాకు అర్ధం అయింది.

ఆ సమయం లోనే మార్పు కి అవకాసం కలిగింది.  నా ఉద్యోగ రీత్యా నేను కొన్ని వృత్తి నిపుణత ని పెంచే గోష్టులు లో పాల్గొనడం జరిగింది. అందు లో ఒక వక్త కలలని సాకారం ఎలా చేసు కోవాలి అనే విషయం మీద మాట్ల్లడేరు. నాకు అది కష్టం ,అని తెలుసు, మంచి భవిష్యత్తు ఉందని నాకు   కల కనడమే అసాధ్యం ...కాని, ఆ సందేశం లో ఏదో ఉంది నాకోసం అనిపించింది..అందుకే విన్నాను.

ఆమె మమ్మలిని రెండు బలమయిన ప్రశ్నలు అడిగింది. "మీరు కోరుకున్నది, మీరు  కావాలి అనుకున్నది ,మీరు చేయ గలిగినది ,అసాధ్యం కానిది కోరుకో మంటే ,మీరు ఏం చేస్తారు? మీరు కల గంటున్న ఆదర్శ మయిన జీవితం కోసం మీరు ధైర్యం గా ఎలాంటి కల కంటారు?"..ఆ క్షణం లోనే నా జీవితం మలుపు తిరిగింది.నేనూ కలలు కనడం మొదలు పెట్టాను.

నేను నా పిల్ల ల తో ఒక కొత్త గృహం లోకి మారి పోయినట్టు, ఆ ధైర్యం నాకు కలిగినట్టు..ఒక కొత్త జీవితం మొదలు పెడు తున్నట్టు ,ఒక కల ,ఒక ఊహ నాలో..మొదటి సారిగా..నాకు, నా పిల్ల లకి సుందర భవిష్యత్తు కల కన్నాను.
నేను ఒక అంతర్జాతీయ వక్త ని కాగలనని ,అందరిని ఉత్తేజ పరిచే వక్త ,నన్ను ప్రేరేపించిన ఆమె లాగే నేను కూడా అందరిని ఉత్తేజ పరుస్తూ ఉపన్యాసాలు ఇవ్వాలని కల కన్నాను.అందరిని ఉత్తేజ పరిచే నా కథ రాయడం కూడా ,నా కళ్ళ ముందు కదలాడింది .

ఇక ,అప్పుడు నా విజయానికి ఒక సాకారం ఇచ్చే సమయం ఆసన్న మయింది. నన్ను నేను ఒక మంచి ఎర్రటి దుస్తులు ధరించి, లెదర్ బ్రీఫ్ కేస్ పట్టుకుని, విమానం ఎక్కుతూ , ఊహించు కున్నాను. అది ,నిజానికి ఒక అసాధ్యమయిన ఊహే, ఆ సమయం లో మంచి దుస్తులు కొనే స్తోమతే లేదు నాకు.

కాని, నాకు అర్ధం అయింది ,నేను ఇప్పుడు కనే కల,నా పంచెంద్రియాలని సంతృప్తి పరచాలని. ఒక బ్రేఫ్ కేస్ లు అమ్మే దుకాణం కి వెళ్లి, నన్ను నేను ఆ బ్రీఫ్ కేస్ చేతి లో పట్టుకుని, అద్దం  లో చూసుకున్నాను,ఎలా ఉన్నాను?  ఆ తోలు తో చేసిన పెట్టె వాసన ని ఆఘ్రాణించాను, ఎలా ఉంటుంది ఆ వాసన? ఎర్రటి (సూట్ )దుస్తులు ధరించి నన్ను నేను చూసుకున్నాను. ఇదే కాదు, ఒక ఫోటో కూడా సంపాదించాను, ఎర్రటి సూట్ వేసుకుని,  లెదర్ బ్రీఫ్ కేస్ పట్టుకుని చేతిలో ,విమానం ఎక్కుతున్నా ఒక యువతి బొమ్మని.ఇక ఆ బొమ్మ ని నాకు రోజూ కనిపించే ఒక ప్రదేశం లో, నాకు ఎదురుగా తగిలించు కున్నాను..నా కల కి సజీవ రూపం గా  నిలిచింది ఆమె ,ఆ బొమ్మ..

మెల్లగా మార్పు కి శ్రీకారం చుట్టేను ..పిల్ల ల తో ఒక చిన్న అపార్ట్ మెంట్ లోకి మారేను.వారానికి  98 డాలర్లు అద్దె , వేరుసెనగ వెన్నె తినే వాళ్ళం ఎక్కువగా, ఇంకా ఒక డొక్కు కారు లో తిరగే వాళ్ళం. కాని, మొదటి సారిగా ,స్వేచ్చ ని అనుభవించాం.. స్వేచ్చ ,భద్రత..నా అమ్మకాల వృత్తి చేస్తూ, సర్వ శక్తి తో ,నా " అసాధ్యం అయిన కల" పై కూడా కేంద్రీకరించాను ..నా దృష్టి నంతా.

చివరికి ఒక రోజు, ఒక పిలుపు ఫోన్ లో, వచ్చింది, నన్ను మా కంపని వార్షిక సమావేశం లో మాట్లాడ మని..నేను ఒప్పుకున్నాను, ఆ ఉపన్యాసం మా సమావేశం లో  ,చాల విజయ వంతం అయింది .ఇది ఆరంభం, నాకు పదోన్నతి లభించి, నన్ను జాతీయ అమ్మకాల( సేల్స్ ) శిక్షకు రాలి గా చేసారు. నేను నా సొంత వక్తృత్వ సంస్థ స్థాపించేను , ప్రపంచం లో ఎన్నో దేశాలు పర్యటిన్చేను. నా " అసాధ్యమయిన కల " సుసాధ్య మయింది.

నా నమ్మకం ఏమిటంటే అన్ని కలలు ,సాధ్యం అవుతాయి. నువ్వు నీ 
w.i.n.g.s. అంటే  రెక్కలు చాచాలి.
నీలోని యోగ్యత ని నమ్మడం....(w), నీ లోపలి చూపు అంటే ప్రావిణ్యం ని నమ్మడం ,(I ), నిన్ను నువ్వు సృజించుకోవడం (N),  నీ ముందు ఒక గమ్యం నిర్దేశించు కోవడం (G),  నీ సొంత వ్యూహం ని రచించు కోవడం (S )..
అంతే ఇక అప్పుడు నీ అసాధ్యమయిన కల లు సాకారం దాల్చి ,నిజాలు అవుతాయి. 














2 అక్టో, 2013

నాకు రాజకీయాలు వద్దు..

తామరాకు మీద నీటి బొట్టులా 
నాకు ఏమీ అంటకుండా ఈ ప్రాపంచిక విషయాలు 
బ్రతికేయాలని రోజూ అనుకుటాను , అనుకోవడం కాదు 

నేను నడిపే నాలుగు చక్రాల బండికి ,నల్లటద్దాలు వేసి ,
నాలుగు రోడ్ల కూడలి లో బిచ్చగాళ్ళ అడుక్కునే చేతులు 
కనపడకుండా ,ఎదురుగా అంతులేని వాహనాల వెనక భాగాలు చూస్తూ ..
వాహనం నడిపేందుకు కావల్సిన ఇంథనం , అయిదు వందల రూపాయలకి 
అయిదు లీటర్లు కూడా రావా ? ఐతే సరే , రేపు మరో వంద ఎక్కువ పెడతా జేబులో 

ఏమిటి ,ఇదంతా కూడా రాజకీయాలేనా ? ఎక్కడో అమెరికా లో ద్రవ్య నిధి లోపమా ?
ఇక్కడ నా జేబు కి చిల్లు పడడమా ? ఇదంతా రాజకీయమేనా ?
నాన్సెన్స్ .. వార్త పత్రిక లో ముందు స్పోర్ట్స్, తరవాత సినిమా విశేషాలు ,చూసి 
విసిరి కొట్టెస్తాను వార్త పత్రిక .. నాకెందుకు రాజకీయాలు ? 

మా ఇంటి చుట్టూ చూసారా హై వోల్టేజ్ కరెంట్ తీగలు ..
మా ఇంట్లోకి యే దొంగా రాలేడు, నలు దిశెలా కమెరా కన్నుల కాపలా .
ఇంక రాజకీయాలు ఎలా తొంగి అయినా చూడలేవు ..కాస్కోండి ..
నా ఇల్లే స్వర్గం ..నా పిల్లలు ,నా భార్యలు...ఒహ్ సారి భార్యా నా స్వర్గం ..
ఇందులో ఎవరూ నా ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా గాలి కి కూడా అనుమతి లేదు . 

ఏమండీ ,మీరిచ్చిన వంద రూపాయల నోటు తో ఒక్క ఉల్లిపాయలే కొనగలిగాను ,
మరి కూర ఏం చేయమంటారు ? హహ్. 
ఎవరో అరుస్తున్నారు , వీధిలో ఉల్లిపాయల ధరలని దించలేని ప్రభుత్వం దిగి పోవాలి ,చా 
అన్నిటికీ వీధి కెక్కుతారు , అలగా జనం ,ఇదిగో మరో వంద ,,మరో కూర కొని వండు 
నాకు కూర లేనిదే ముద్ద దిగదు అని తెలుసు కదా .. 
అయినా అదేమిటి ? మొన్న తెచ్చిన కాష్ అప్పుడే అయిపోయింది పర్సులో 
అప్పటికీ ,భార్య దుబారా చేయదు, ఆమె చేతిలో అందుకే కాష్ ఉంచను కదా ?

కొంపదీసి ఇదంతా రాజకీయమా ??? నన్ను అలజడి పరిచే ,నా గుప్పెట్లొ ,నా అధికారం లో లేని ఈ పరిస్థితులు ?
కొంపదీసి రాజకీయమా ?? అమ్మో . మా ఇంట్లోకి వచ్చేసింది.. పెద్ద తాళం వేసేయాలి ..
నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నా మానాన నన్ను వదిలేయండి.. నాకు రాజకీయాలు వద్దు..