"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

26 ఆగ, 2015

జీవన యానం


సముద్రం చారలు చారలు గా
నీటిని పరుచుకుంటూ
తపస్సు చేస్తున్న మునిలా మౌనంగా
తనలో తను చూసుకుంటూ
ఆమడ దూరం నుంచి
ఏకాగ్రతతో ఆకలి తపస్సు చే్స్తున్న
సముద్ర పక్షి దృష్టికి మిల మిలా మెరుస్తున్న
మత్స్యం మటుకు కనిపించింది ..
ఒడ్డున నా మటుకు నేను
పొడి కాళ్ళని చూసుకుంటూ
సముద్రం లోతుని కొలిచే ప్రయత్నం చేస్తూ
వృధా దృక్కులు ప్రసరిస్తూ నేను
ఎవరి ఆశలు వారివి
ఎవరి కలలూ ఎవరి ఒడ్డులూ వారివే
ఈ సాగరం మనం ఎలా ఈదుతామో
మన ఇష్టమే , ఒడ్డునే నిలుచుని
దూర తీరాల ప్రయాణాలకి మనం
తెర చాపలు ఎత్తుకుంటూ ..
అపహాస్యం ఏమీ లేదు .. అంతా
ఎంత గాలికి అంత ప్రాప్తం ..
ఏ తీరానికి ఎవరు ప్రాప్తమో ,
ఎవరు కనగలరు ? జీవనయానం లో .

మనసు చేసే గారడీ

కొన్ని కుందేళ్ళు
నా చేతిలోకి
అలా వస్తాయి
మెత్తగా కూర్చుని
దువ్వించుకుంటూ
నాకసలు పెంపుడు
జంతువులంటే ఇష్టం లేదు
ఇల్లంతా వదిలే బొచ్చు అంటే
చాలా అసహ్యమూనూ
ఈ కుందెలెలాగో వచ్చి
కూర్చుంది ,ఒళ్ళో కూడా
కూర్చుని ముద్దు చేయించుకుంది
నాకిష్టం లేని పనులు నేను
కొన్ని ఎందుకు చేస్తానో ఎలా చేస్తానో !
అందరికీ నా కుందేలు చూపించాక
నేను కుందేలని మాయం చేసేయగలను .
అవును నాకు అన్ని విద్యలూ వచ్చు ..
లేని దాన్ని ఉన్నట్టూ
ఉన్న దాన్ని లేనట్టూ
నా బుర్రలో ఎన్ని మాజిక్ ట్రిక్కులో
నే నెంతమాయల మంత్ర గెత్తెనో .
ఇదిగో మీ ఒళ్ళో కుందేలు ,
మీరూ ముద్దు చేయండి ఇంక ..

జీవన యాత్ర

సుదూరంగా కొండలు విశ్రాంతిగా
దిగంతాల గీతల వేపు ఆర్తిగా తడుముతూ చూపులు
మైదానాల మధ్య చివుర్లూ , చెట్లూ గాలి వీవెన పంపిస్తూ
అలవోకగా నర్తించే చెరువు అలలకి చురుకుదనం అద్దుతూ
ఒడ్డు గతాల స్మృతులని నెమరు వేస్తూ ,
లంగరు వేసిన పడవల కథలకై అర్రులు చాస్తూ ..
వారిద్దరూ ఆదిమ మానవుల జంట
అనంత కాలం లో ఉత్తర దిక్కు తార చెప్పిన గుర్తుల
ఆధారంగా ఎప్పుడూ ఎరగని తీరాల రేవు కై
సముద్ర యానం అంత యాతనగా అలసి సొలసి పోతూ ..
యాత్ర ఫలితం పుణ్యమో పురుషార్ధమో కాదు
కేవలం తీరం కనుక్కోడమే ..
తీరాల వెంట పాద ముద్రలు వేస్తూ నాగరికత
అలుక్కుంటూ వెళ్ళడమే , ఎప్పుడో మళ్ళీ యాత్ర అనుభవం
మానవులని ఆకర్షించి దీపం పురుగులా నలిపేస్తూ ఉంటుంది .
అయినా తప్పదు ,ఒక యాత్ర ,ఒక తీరం ..
మానవ జాతి చరిత్ర సమస్తం యాత్రా ఫలితమే కదా ..
ఈరోజుకీ ఒడ్డున లంగరు వేద్దామా ! హ్మం ..

18 ఆగ, 2015

కవి హృదయం


కవి హృదయం అని ఒకటి 
ఉంటుందా ? అని నాకెప్పుడూ అనుమానం ..
మాటలని గుండె కవాటంలో బిగించి పెడతారా ?
వేళ్ళ చివర నృత్యాలని బంధించి పెడతారా ?
ఆకశాన ఒక మబ్బు విడిచి వెళుతుంది
ఒళ్ళో పిల్లాడిని లాలించినట్టు
ఊహలు పిలకలేసి మొలుస్తాయి ,చిట్టి చిట్టి
పిలకలు చుట్టూ పేర్చుకుని అరటి మొక్క లా
హరితం గా లేత పల్లవం గా ..
ఇంక మాటలు బొమ్మల కొలువు లో
బొమ్మలలాగా మెట్లు మెట్లుగా పరవడమే తరువాయి
కొన్ని తల లూపుతూ కొండ పల్లి బొమ్మ లా వచ్చి
కూర్చుంటాయి ,మరి కొన్ని మేత మేసే ఆవు బొమ్మలు
నడిచినట్టూ ఎటో వెళ్ళి పోతూ ఉంటాయి ..
పూల పరిమళమూ ఉండదు ,
వెన్నెల లేపనమూ ఉండదు ,
అన్నీ మనసు అద్దం మీద పరుచుకున్న
చిత్ర విచిత్రాలు , నాకే ఆశ్చర్యం ఏ దేశ
దిమ్మరులు ఈ పదాలు ఎలా వస్తాయి ? అని .
మందారాల మకరందాలు
మల్లెల సుపరిమళాలు పూయిస్తాను
నా ఇంటి ముందు పెరట్లో ,
నాకసలు పెరడే లేదు ,అయినా సరే ..
ఆకలి దప్పులు ఊసే తెలియదు
అక్షరాల అన్నం వడ్డిస్తూ ఉంటే
ఎవరి చేతి పుస్తకానికో
ఈ నల్లటి ఆవగింజల్లాంటి సేద్యం ?
కవితలా ? కథలా ? ఏమో
మబ్బులు వర్షం కురిపిస్తాయా ?
దేశాంతరం పారి పోతాయా ?
ఎవరికి తెలుసు ..
ఇవాళ పండగ అని పుష్పించదు
పూవు ,ఇవాళ పుష్పించిన పూవునే
నువ్వు ఏరి కో్రుతావు .. పూజకి
నీలో జన్మించిన అక్షరాలకి నువ్వు
కారణం కాదు , కాలాల శోధన లో
కనుగున్న ప్రహేళిక నీ రాతలు .
ఎవరికోసమో అని రాయవు ,
ఎవరి కోసమో కల గనవు ..
ఎవరో ఒకరు చదువుతారు అన్న స్పృహ
కల ముందు వచ్చే మెలకువ లాగా
పలచగా ఆవరించుకుని ,మేలి ముసుగు లో
నిన్ను ఆకర్షిస్తూ , అయోమయంకి గురి చేస్తూ
ఎన్నో ఎన్నెన్నో అక్షరాలు ..
రక్త ప్రవాహం లో ధమనుల మధ్య
ప్రవహిస్తూ అస్తిమత పరుస్తూ ఉంటాయి .
నీ ఆంతర్యం నిన్ను నిలవనీయదు
నీ మనసెప్పుడూ నీకు విరోధి లా
యుద్ధాలు జరుగు్తున్నా ,వెన్నెల చమక్కుల
మీదే రాస్తావు కవిత్వం , ఎందుకంటే నీవు
చీకటి రాత్రి ని నీలో దాచుకున్నావు ,
వెన్నెల కాంతి ని ఎప్పుడూ అరువు తెచ్చుకుంటూ ఉంటావు ..
నీ అక్షరాలు నిన్ను
ఆవహించే శాంతి
నిన్ను ప్రేరేపించే అశాంతి
నిన్ను నిలువునా దగ్ధ పరచే అగ్ని కీలా కాంతి
గ్రహాల మధ్య కాలంని కొలిచే కాలమాని
నీ అక్షరాలు కాంతి వేగం తో
నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ఒక
సముద్ర ద్వీపం లాగా విసిరేస్తాయి ..
వంతెనలు వారధులూ వేసుకుంటూ
ఆ అక్షర జాలం తో నే
నే తిరిగి తిరిగి వస్తూంటాను ..మీ ముందుకి
అక్షర దీప కాంతి వెలుతురులో దారి
వెతుకుతూ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను .

6 ఆగ, 2015

పూలు కాలిన వాసన ..


ఇక్కడ పూలు కాలిన వాసన
అంతటా కమ్ముకుంటోంది ,
భరించలేము
పారిపోండి ..
ఆడ దాని అంగాంగాలు
చిన్న సెల్ లో బంధించి
లాలీ పాప్ లాగా చీకుతున్న
అధమ జాతి
ఏలుతోంది , ఇక్కడ
పూలు కాలుతున్న వాసన
నలు దెశలా విష వాయువులా
కమ్ముతోంది .
సునామీలో ,
భయంకర ఎడారి గాలులో
సింధూ , హరప్పా,ద్వారకా నాగరికతలని
భూస్తాపితం చేసాయి అని తవ్వకాలు
చెపుతున్నాయి ..
ఇప్పుడు చేత్లో ఒక చిన్న సెల్లు
కలికాలానికి చరమ గీతం ఆలపిస్తోంది ,
ఎత్తుగా కట్టిన భవనాలు
కిందకి దూకి అంతమొందించుకోడానికే
శీలం ,పరువు అంటూ ఆడపిల్లలతో
సెక్సీ గేం ఆడించి ,అదో కొత్త గేమ్‌ ఆప్ ట
కోకాకోలాలా విష పానీయాలు సేవింప చేసి
సెలవంటూ సెలవు చీటీ రాయిస్తారు ,విషనాగులు .
కార్చిచ్చులు ,బడబాగ్నులు ఒక నాడు
సెల్లు ఫోం తో మజా అంటూ ,ప్రవహిస్తున్న
కుళ్ళు కామపు కంపు ఈ నాడు
కాన్‌సరు పట్టిన శరీరం లో
ఎదుగుతున్న వ్రణం లా
అజ్ఞానపు కాంపస్ లో పెరుగుతున్న వ్యాధి ఈ నాడు .
అమ్మ అయ్య మా కొద్దీ విష పురుగు అని
పురిట్లోనే వడ్ల గింజ వేసి
చంపేవారేమో , ఈ నాటి వాడి కామపు వాపు చూసి
కాంపస్ సరదా అంటే ప్రాణాలు ఎర వేయడమే అని
కొత్త మాట పంచుకుంటున్నారు వ్హాట్స్ అప్ప్ అంటూ ..
నాగరికత అంతంకి
గంట కొట్టి ప్రారంభించారు
మీకు వినబడిందో లేదో
ముఖ పత్ర స్టాటస్లూ అప్ డేట్ చేస్తూ
మనం కళ్ళు మూసుకుని ఉన్నాం ..
కాళ్ళ కింద భూమి
ప్రకంపిస్తోంది , వినండి అవి సెల్ ఫోన్‌
కొత్త ట్య్యున్లు కావు ,
అవి మానవ సమాజం చేసే
హాహా కారాలు ,
బాంధవ్యాలు ,బంధాలు అంటే
నిఘంటువుని అడగాల్సి వస్తోంది ,
పసి పాప ల కేరింతలులో ఏదో
ఫేస్ బుక్ ప్రొఫైల్ నీడ కనిపించటం లేదూ !
ఆడ పిల్లల కన్న తల్లితండ్రుల
కలలు ఎత్తుకుపోతు్న్న ఆ నరరూప
రాక్షసులెవరు ?
ఏ సమాజం చెట్టుకి పుట్టిన
కుక్క మూతి పిందెలు వీరు ?
ఏ విష ఎరువు పోసి పెంచిన
మాంసం తినే మొక్కలు వీరు ?
ఎవరీ నర హంతకులు ?
మధ్య తరగతి కోటి ఆశల బంధికానాలో
పెంచిన పౌల్ట్రీ చికెన్‌ చీకు ముక్కలా ?
పాలు కారే వయసులో పోసిన
డబ్బా పాలలో పడిన విషపు చుక్కలా ?
యూనియన్‌ కార్బైడ్ విష వాయువు
చిక్కగా వ్యాపించి లక్షల ప్రాణాలు
హరించిన జాతి ఆపద మరిచిపోయారా ?
అంత కన్నా పెను ఆపద పొంచి ఉంది ..
చదువు ఖార్ఖానాల లో
నలుచదరం గా కట్టి నాలుగేసి అంతస్తులు లేపి
కాంట్రకటర్లు నడిపే కళాశాల లో
పందెం గుర్రాలు వీళ్ళు ,
సంస్కారం చదువు అప్పుడెప్పుడో
ఉండ చుట్టి హాం ఫట్ చేసిన మాయా మాంత్రికుల
జాలం లో చిక్కుకున్న
ప్రాణం లేని కట్టే లు వీరు ,
మానవ నాగరికతకి అంతం
మానవులే ,
బెంజీన్‌ సింబల్ కనుక్కోడానికి
పాము తన తోక ని తాను తింటున్నట్టు
కలగన్నాడో శాస్తవేత్త ,
నేడు నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది
తన కడుపున పుట్టిన నర హంతకులని
తన చేత్తో చంపే తల్లి హృదయవిదారక
ముఖ చిత్రం ..అదే నా ముఖ పుస్తకపు కవర్ పేజీ
ఈ నాడు .
లైకులూ కామెంట్లూ పెట్టే ముందు , ఈ దుర్మారపు కుల ,మత , రాజకీయ కూటములు ని ప్రతి ఒక్కరూ ఖండిస్తాం అని శపధం చేయండి ..
రెండ్రోజుల్లో రెండు వార్తలు .అంతే నా ?
ఇద్దరు ఆడపిల్ల ల దుర్మరణం వెనక ఎందరి ఆశలు నేల రాలాయో !
అవును నాకు పూల తోటలు కాలుతున్న దుర్గంధం వస్తోంది ..భరించలేను ఇంక ..ఈ దుర్గంధం .పెకిలించాలి ఆ మూలాలని ..ఆ కారణాలని ..లేకపోతే ఎలా బ్రతుకుతాం మనం ?