"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 అక్టో, 2015

ఏవో కొన్ని ఊసులు ..ఇలా ...

సీతాకోక చిలుకలు
నా చుట్టూ గుండ్రంగా
తిరుగుతూ ఒక్కో రంగూ
రాల్చేసుకున్నాయి ..
నా కలలేమో ..అవి ..
ఆకాశం లో పక్షులు
వరుసగా వరుసలు కడుతూ
తూర్పు దిక్కున
సూర్యుడికి సందేశం మోస్తూ
కిరణాలు ఆకుల మధ్య నుంచి
జారి నేల మీద ముగ్గులు పరిచి
నేలమ్మకి జేజేలు పలుకుతూ
వినమ్రంగా ..
ఆకాశం కొన్ని రంగులు
దాచుకుంది , రహస్యంగా
సాయం సంధ్య కై
పరిచి విస్మయ పరచాలని ..
తోటలో పూలు రంగు హంగుగా
వెల్లి విరిసి ..
మోహనంగా ఎదురు చూస్తూ
ఆ మధుర గాయం కోసం .
అలలు అలలు గా
ఎగిసి పడుతూ , ఎన్ని యుగాలుగా
అలసి పోయినా , తీరాలు
అందవూ , ప్రాప్తమూ పొందవు .
పసి పిల్ల నవ్వులా
ఎగిసిపడ్డ నవ్వు
ఎదిగిన బిడ్డలో
కలిసి మురిసిపోయింది ..
పన్నీరు చల్లితే
గాలి సుమధురం అవుతుందా ?
పెదవుల స్పర్శ తగలాలి కానీ
వెదురు వేణువు అవదూ ...
అన్ని మతాలూ చేర్చేవి
ఆ స్వర్గ ధామ గుమ్మం వరకే
నీకుందా మరి ఆ తాళం చెవి
వెతుక్కో ఇప్పుడే !
జీవన దారి లో పారేసుకున్న
సంపదలు మణి మాణిక్యాలూ
దొరికేను ఆ తోట లో .
నీ మనసు పూసే ఆ తోటలో ..
మైమరిపించే కోకిల గానం
వినిపించే తోట లోకి వచ్చావా ?
నువ్వేం తెచ్చావు ?
సవిరించుకున్న నీ గుండెని తెచ్చావా ?
వెను వెంటనే
వెను తిరిగి పారిపోయే నీ
పీడ కలని ఈ రేవులో పాతేయ్
ఇక్కడ ఈ పాపాల రేవులో .. మరి మొలవదు .
దయ్యమూ దేవుడూ
కలిసి నివసించే ఆ అంతకరణలో
ఎన్నెన్ని గులాబీలూ ,ఎన్ని ముళ్ళూ ..
అన్నీ ఒక్క చెట్టుకే ..

జ్ఞాపకాల పెట్టె ..


వెనక్కి వెనక్కి చూస్తూ నడుస్తూ
ముందుకు కదిలాను ..
నా జ్ఞాపకాల నీడలు నా వెంట ఉన్నాయా లేవా అని ..
అవి భద్రంగా ఆభరణాల పెట్టెలో
చెల్లా చదరుగా పడేసిన నగల లాగా
కొంచం మెరుస్తూ , కొన్ని మెరవక పోయినా అలవాటుగా ధరించేవి
కొన్ని ఊరికే పడి ఉండేవి ..
ఎవరూ ఎత్తుకుపోలేరు ఈ సంపద నా నుంచి ..
అలా తీరుబడిగా వడి వడి నడకలలో
కొన్ని పారేసుకుందామని పయనిస్తాను
సాయంకాలపు నీడల్లాగా ..
దొంగల్లా నా వెంటే ..ఎప్పటికీ పారేసుకోలేను అవి .
కాలంకి ఇంక అప్పచెపుతాను ఆ పని
సవ్వడి చేయక , కాళ్ళ కింద నుండి జారే
సముద్రం ఒడ్డున నీటిలా ...
సల్లగా జారిపోతాయేమో అని ఆశ ..
నిగూఢంగా అడవిలో దట్టమైన
పిచ్చి మొక్కల్లాగా అల్లుకుని ,చిక్కుకుని కొన్ని ..
విడదీస్తూ దీస్తూ కాలం వేసే చిక్కులు మరి కొన్ని
కూడిస్తూ , ఎప్పటికీ ఎడ తెగక పారే ఏరు లా ఈ జ్ఞాపకాలు ..
సెలయేరులా పారుతూ , ఏ ఒడ్డుకీ చేరని ఏరు ..ఏరులూ ..
ఈ జ్ఞాపకాలు ..
ఎన్నని మోయను ? ఎన్నని పారేయను ?
శూన్యంగా మిగిలేవు సుమీ అని హెచ్చరికలు
యే ఒక్కటని ఎంచేను ? ఏవని చించేయను ?
కలశం నిండా తొణికిస లాడే నీరుతో ..
కదిలే నేను ..ఎప్పటికీ తొణకను ,బెణకను అని
ప్రమాణాలు చేస్తూ ..ఇలా ముందుకే మరి పయనాలు చేస్తూ
నిండు కుండ లా నేను ..
నిండు కుండలా నేను ..