"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

18 జూన్, 2015

కవిత్వం ...


కవిత్వం చిక్కగా
కాఫీ డికాషను లాగా
దిగిపోతే
తట్టుకోలేము
చేదు ,వగరు ..మాకు రుచించవు
ఆకలి ,అత్యాచారాలు తప్ప
మరో ఊసే లేదా మీకు ?
సూర్యుడూ సముద్రం ఉన్నారు కదండీ
వర్ణనకి మంచి అలంకారలూ
గాఢ కవిత్వం
మెదడు ని చిన్నాభిన్నం చేసి
కాక్టైల్ తాగినంత కిక్ ఇస్తుంది
హాంగ్ ఓవర్ నుంచి
కోలుకోడానికి మరి కొన్ని జన్మలు
పట్టవచ్చు ..
కవిత్వం తాగిన మొహం
చూసారా అసలు ఎప్పుడైనా ?
వెన్నెల తాగిన వాని మొహమో
అడవి లో తప్పిపోయిన వాడి మొహమో
నక్షత్రాల లెక్క లో నిమగ్నమైన వాడినో
ఇదిగో ప్రపంచం అంచుకి వెళ్ళొస్తా
అంటూ బయలు దేరిన వాడి వెనక చూపో
అసలేం చూడ లేదా ?
ఐతే మీరు కవిత్వం
చదవలేదు .ఊహించలేరు కూడా
అలా కాసేపు నాలుగు గోడల
బయట బయలు లో
మెత్తగా నడిచి రండి ..
దుమ్మూ ధూళీ
పేడా పెంటా అబ్బే అలా ముక్కు
మూసుకుని కాదు ..
కాళ్ళు తడవాలి ..
అప్పుడే కవిత్వం ..ఊసు ఎత్తాలి
అలా పోయి వద్దాం రండి
మనకింకా మరో జన్మ సమయం ఉంది ..
వసంత లక్ష్మి 27-05-15

నాగరికత


సముద్రంలో మత్స్య కారుడి
మథనం వల నిండిందా లేదా అని
నైలాను వల అయినా కాక పోయినా
ఒక్క చిల్లు ఉన్నా ..ఫలితం సున్న
సూటి గా వాడి గా ఎన్నో
సమస్యలు ఉన్నా
మన బుర్ర లో ఓ చిల్లు ఉందేమో
ఎప్పటికప్పుడు అలా ఖాళీ చేస్తూ
లేకపోతే బ్రతకగలమా ?
వార్త పత్రిక లో వార్త జీవిత కాలం
ఒక రోజుట ,మనమెంత ?
కజ్జికాయలు నములుతూ ఉంటే
అన్ని మర్చిపోవచ్చు ..
ఆహారం ఒంటికి బలమే కాదు
మైమరుపు ,మతిమరుపూ పుష్టిగా
పదండి ముందుకు ఫ్రీ వై ఫై కోసం
పోరాడుదాం ..ఇంతకు మించి అఫ్రో్డిసియాక్స్
ఏం ఉన్నాయి ? సెల్ఫీ ల సెక్సీ మాయ లో
విచ్చలివిడిగా కలిసే పోరాడుదాం ..
ప్రభుత్వలే కూలనీ
పాలన లే మారనీ
వై ఫై ఒక్కటి ఇస్తే చాలు
మా స్వర్గాలేవో మేమే సృష్టించుకుంటాం ..
హిప్పి కల్చరు పోయిందిట
ఎవరన్నారు ?
మున్నెన్నడూ ఇంత మత్తులో
జోగుతున్న భద్రలోకాన్ని చూడలేదు
బ్రహ్మం గారు చెప్పే ఉంటారు ..
కలి కాలం కి అరి కాలి ముల్లు
అక్లీస్ హీల్ ఈ నెట్ చివరి మొనే
సముద్రాల ఒడ్డున నాగరికత నిర్మాణాలే కాదు
కూలిన జాడలూ ఉన్నాయి ..
చరిత్ర ఏం చెప్పిందీ ? కాదు
ఏం నేర్చుకున్నాం ?
చరిత్ర నుంచి నేర్చుకుని
బాగు పడ్డ జాతే లేదుట .
సరే మరి
సెల్ఫీ కాఫీ తో
తీసుకునే టైం అయింది ..

...వసంత లక్ష్మి ..27-05-15
Unlike · Comment · Share

సాయంకాలాలు


మధ్యాన్నం వండిన ఎండ
నంతా నీడలు మింగేస్తూ
మూల మూల గిన్నెలు
ఖాళీ చేస్తున్నాయి
మూల మూల పగటి
వెలుతురి గిన్నెలు
ఆవురావురు మంటూ
పిల్లలూ లేగ దూడలూ
పాల కోసమో
తెల్లని వెన్నెల కోసమో
రాతిరి వెలుతురి కోసమో
అమ్మ అవని పొదుగు ని
ఆశ్రయిస్తున్నారు .
రాత్రి మనం చేసే గానా బజానా కి
బయానా అంటూ చుక్కల
ధన రాశులు కుమ్మరిస్తున్నాడు
ఆకసాన మాయా చంద్రుడు
సాయంకాలం
ఆ సంధ్యా కాలం
సంధ్య కాంతుల
మిస మిసలని
పంచుకుంటూ
చెలిమి కూరిములు
చలమల వద్ద
దాహం తీర్చుకుంటూ
చెలికాండ్రు ..చెలులూ
సాయంత్రం
అందంగా ముస్తాబయింది మరి
ఏ విభుని దర్శనం కోసమో !
వసంత లక్ష్మి

పరిభ్రమణ



సాయంత్రాలు మబ్బులు
ఇళ్ళు వెతుక్కుంటూ 
అటూ ఇటూ పరుగులు 
పెడుతూ 
మా ఇంటి ముందు 
ఏదో ముచ్చట్లు గుర్తు 
చేసుకుంటూ ఆగితే 
నీకు కబురు పంపిస్తా 
అంతా కుశలమే అని .

పూలు రంగు ముస్తాబు 
కావిస్తూ  గాలి హత్తుకుంటే 
సన్నని పరిమళాలు కానుకగా 
గాలికి వదిలితే 
అదే నా సందేశం అనుకో 
ఈరోజుకి సన్నజాజులు 
ఎన్నిక చేసా నీ కోసం .

అలుపెరగని అలలు 
తీరంతో చేసే సందడి 
ఉల్లాసం ఉత్సాహం నింపింది 
మనసులో ,ఆ తుప్పర 
చల్లదనం నీ మేని కి గంధంగా
పూయనా మరి ఈ రాతిరికి 

నక్షత్రాలు చీకటి ఆకాశంతో 
చేసుకున్న బాసలూ ఊసులూ 
తెల్లవారక ముందే 
చేరేస్తాను నీ చెవికి 
ఆ నీరవ నిశ్శబ్ద సంగీతం 
నిన్ను తాకి రాగాలు పోతుంది 

ప్రకృతి సమస్తం తల ఒగ్గి 
వినయంగా అర్ధిస్తూ ఉంది 
మనం ఇద్దరం కలిసి మమేకంగా 
ఈ పొద్దుకి రంగులు అద్దాలని 
సూర్యుడినో  చంద్రుడినో 
నీలోనే సమస్త విశ్వం విశ్రమిస్తూ 
పరిభ్రమిస్తూ నన్ను విభ్రమపరుస్తూ 

పిపీలకమైనా 
మరి ఏ జీవం అయినా 
నర్తించాల్సిందే 
ఈ ఉదయపు సాయంత్రపు 
నీడల తెర పై 
ఆసక్తికరంగా 
పరిభ్రమణ ఒక్క గ్రహాలకేనా ? 
జీవ రాశిలన్నిటికీ కాదూ ! 

నమస్సులు సమస్త 
విశ్వ పరిభ్రమణా శక్తులకు 
తాండవం చేసేది ఒక్క శివుడేనా 
నా మనహ్ తటాకం లో 
మునకలు వేసే కోరికల నృత్యమూ 
తాండవమే .. 

మనిషి జీవిక 
ప్రేమికగా రూపు 
దిద్దుకుంటూ 
మానస సరోవరంలో 
కమలంలా 
పురి విప్పుతూ 
ఎన్నెన్ని విభ్రమలు 
ఎన్నెన్ని విస్ఫోటనా 
చిత్త భ్రమలూ 
మరెన్ని తాపసీ 
తరుణాలూ 
దర్శించుకుంటుంది 

మనిషీ ..మానసీ 
తాపసీ , మానినీ 
నీకు నా 
ఆలింగనాలు ..
నా నీడ ని నేను 
తాకిన ఈ క్షణంలో 
నాకు నేను చేసుకున్న 
ఆలింగనాలు .. 
ఎంత గాఢమైన బందమో ఇది 
ఇదే సత్యం అట 
ఇదే మోహనమైన సత్యం 
ఇదే సుందర చైతన్యం 
ఇదే నన్ను నేను 
ఆవిష్కరించుకున్న క్షణమూ 
మరు జన్మమూ.. 


వసంత లక్ష్మి 

వాన వచ్చే ముందు ...


నీలాకాశం మాయం అవుతుంది
ఎక్కడినుంచో వచ్చిన నీటి మబ్బులు
నీలి రంగుని పీల్చి
దట్టమైన మబ్బు రంగులోకి
మారుస్తాయి
పల్చటి నీలి రంగు ప్రమేయమేమీ లేదు
పింజెలు గా తిరగాడిన మేఘాలూ
మరి మాయమయ్యాయి నిన్నటిలోకి
అప్రమేయ ఆనందమా ?
అంతు పట్టని ధుఖమా ?
వాన వచ్చే ముందు
పట్టే మబ్బులకేం తెలుసు
తను రాల్చే నీటి ధారలు
ఏ రైతు కంటి కన్నీరు కారణమో
ఏ పసిపిల్ల కేరింతలకో
ఏ నవ వధూవరుల ముసిముసి నవ్వులకో
ఏ గృహిణి పరుగులో ,
ఏ మనిషి అంతరంగం ఆల్చిప్ప లో
మేలిమి ముత్యమో ? ఆ చినుకు ప్రయాణం
ఎవరికి ఎరుక ?
వాన వచ్చే ముందు
పట్టిన ముసురు ఒక్క గాలి దుమారం
ముందు వీగిపోవచ్చు
నిన్నటి వాగ్విదాం ,ఇవాళ్టి చిరు పలకరింపుతో
కొట్టుకుపోయినట్టు
వాన ఎక్కడ ఎలా కురుస్తుందో
ఎందుకో ఎవరికీ అర్ధం కాని ఒక పెద్ద మిస్టరీ
కన్నీరు ఆడవారికే ఎందుకు ? అన్నది కూడా
చెట్లూ వాగులూ పిపీలకాదులూ
ప్రార్ధిస్తాయా ? వాన కోసం
ఏమో పూలు పూయించి
చిరు కెరటాలు కదిలించి
అటు ఇటూ కదిలే అతి చిన్న ప్రాణులు
ఏ కార్యాచరణమైనా పూజే కదా
త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరించే కార్యం ఏదైనా
వానలు అందుకే అడగని వరాలు
మనం కోరితే వచ్చాయని మురిసిపోకు
మనం ఏం వ్రతాలు ఆచరించామని ?
వాన వచ్చే ముందు
మబ్బు కీ తెలియదు ,ఏ ప్రాంతం ఏ భాష ? అని
వాన వచ్చే ముందు ..
మబ్బులు మబ్బులు మబ్బులు
గుంపులు గానే వస్తాయి .
చినుకు చినుకు చినుకు్లుగా
విడిపోతాయి ,
మానవ సమూహం లో వ్యక్తి ప్రతీకలా
వాన వచ్చే ముందు
నువ్వు నువ్వు గా ఎదురు రా !
వాన వచ్చే ముందు ..
నువ్వు నువ్వుగా తడిసి ముద్దై పోడానికి తయారుకా
కన్నీరు అంతా బయటకి ఒంపేస్తే
ఆఖరున మిగిలేది తడి కనుల ప్రశాంతత
ఆ అనుభవం మటుకు నీకు నీవు ఎప్పుడూ
దూరం చేసుకోకు ..
వాన వచ్చే ముందు
నువ్వు ఏం చేస్తున్నావు ?
సమాయత్తం అవుతున్నావా ??
వాన వచ్చే సూచనలు వస్తున్నాయి మరి .
వసంత లక్ష్మి .
16-06-15 .

17 జూన్, 2015

నా ప్రయాణం లోదృశ్య మాలిక

'లేడీ ' కి లేచిందే ప్రయాణం ట
స్నేహితురాలు అమెరికా నుంచి వచ్చాను
కలుద్దాం వసంతా అంటే సరే ..అని
ఇంట్లోంచి పారిపోయే హీరోయిన్‌ టైప్ లో
ఒక చిన్న భుజ సంచి లో చిన్నా చితకా సామానూ
చీరలూ గట్రా సద్దుకుని , వెళ్ళి వస్తానే చెల్లి అంటూ
రైలు స్టేషను కి ప్రయాణం అయి
రత్నాచల్ టికెట్ కొనుక్కుని ,ఎక్కి కూర్చున్నాను .
అది రెసెర్వేషనూ పెట్టె అని తెలిసినా ,తెలియనట్టు
అదో చిద్విలాస ధోరణి , అన్ని తెలిసినా తెలియనట్టూ
పైగా పై ముచ్చట ఏంటంటే ,ఎవరైనా వస్తూంటే ఇటు వేపు
మీకు రెసెర్వేషను ఉందా ? అని ఒక చూపు తో ఆపేయడం ..
అబ్బా బాల కృష్ణ రైలు ఆపేస్తే లేదు కానీ నేను మహా ఇలా
ప్రయాణీకుల్ని ఆపలేనా ? అని యత్నించి ..సఫలీకృతమయ్యాను ..
అంతే ,నా బలం నాకు తెలియదు ..నా నటనా బలం ..
అని తబ్బి ముబ్బై పోయాను అనుకోండి .
బయలుదేరాను , రైలు కూ అంది అంటూ
నిముషానికో పది పనికి మాలిన ఎసెమ్మెస్ లు
పంపిస్తూ ,అబ్బ ఎంత పచ్చ్దాదన మో అంటూ ఫోటోలు తీస్తూ ఉంటే
చార్జింగ్ ఇంఫ్లేషం లో రూపాయి విలువ లా అధపాతాళానికి పడ్పోయింది ..
అమ్మో అని దాని పీక నులిమి ఊపిరి ఆపేసి ,అన్ని క్రిమినల్ అలోచనలే
ఇంక వీధి బయటకి అంటే కిటికీ లోంచి నాకు కనిపించే
పచ్చని ప్రపంచం లోకి చూడ్డం మొదలుపెట్టాను ..
అనకాపల్లి దాటేసరికి పక్కన ఇద్దరు కూర్చున్నా ,నన్ను ఎవరూ ఇంక
కదపలేరు అని అనుకునేసరికి నిశ్చింత గా , జబర్దస్తి గా కూర్చున్నాను .
ప్రపంచాన్ని జయించిన మహ రాజుకి కూడా అంత సంతృప్తి ,గర్వం ఉండవేమో
సుమండీ ..
అనుకోని సుఖాలు సంపదలూ ఇవే ..అనుకోని ప్రయాణం లో నీకంటూ ఒక
సీటు దోరకడం ..
హడావిడి ప్రయాణమ్లో ,భోజనం మాట ,అంత కన్నా ముఖ్యం చేతికి ఒక పుస్తకం మాటా మర్చిపోయాను .
ఇంక నాకు కాలక్షేపం ..ఆ కిటికీ యే .
ఎప్పుడూ ,ఈ మధ్య ఏసీ ల లో ప్రయాణం కళ్ళకి గంతలు కట్టినట్టు ..
అవును అలాగే కదా జీవిస్తున్నాను ..మరి ..
కళ్ళూ విప్పార్చి , మనసు లో తలపులు కూడా బాహాటం గా తెరిచి పెట్టి
నా ముందు పరుగులు తిస్తున్న దృశ్య మాలిక లని చూస్తూ ఎంత హాయిని పొందానో
నేనో నలభై ఏళ్ళు వెనక్కి ప్రయాణం చేసి , చిన్న తనం లోకి వెళ్ళి పోయానా అనిపించింది
కొండలు నిశ్చలంగా ఎన్నాళ్ళ్ నుంచో అవే రూపు
ఏమీ మారలేదు , తూరుపు కనుమలు మాకు పెద్ద దిక్కులాగా
కంటి చూపు మేరా లేత పచ్చదనం లో పొలాలు
ఆరారా మధ్య మధ్యలో పొడవైన కొబ్బరి చెట్లు ఈత చెట్లు
తల పై కిరీటం ధరించిన మహ రాజుల్లాగా
ఎర్ర్రని పూల చెట్టు , ఆకాశానికి ఎత్తి హారతి ఇస్తున్నట్టు పూసింది
మరో చెట్టు ముకుళిత హస్తం తో దణ్ణం పెడుతున్నట్టు ,ఆకాశానికో ,ఆపై దేవుడికో
పూల వందనం చేస్తూ ,
ఎర్రటి నేల ని దున్ని చదును చేస్తున్న రైతు కూలీలు
ఒంటి పై ఒక్కటే వస్త్రం ..ధరించి
స్వేదం చిందించే వాడికి ఎన్ని వస్త్రాలు కావాలి ?
తడి మడి లో నీటి గదులు , విత్తుకి ఆయత్తం అవుతూ
తెల్ల నీటి కొంగలు ఆ నీటి మడుగులో కొంగ జపం చేస్తూ
పురుగూ పుట్రా , కోసమే ఆ ఒంటి కాల తపస్సు ..
ఇంతలో ఏదో మరో జంట కొంగ పిలుపు పై
ఘమ్మని లేచి రెక్కలు ఘాడించి ఒక్క ఉదుటున
ఆకాశంలోకి గెలుపు పరుగుల హడావిడీ ..
రైలు పెట్టె లో కి అలవోకగా దృష్టి జారిస్తే
కలగాపులగపు కోడి పెట్టలు అమ్మకానికి ఓ బుట్ట కింద
మూత పెట్టి కూర్చోబెట్టినట్టూ
అమ్మీ ,ఓ అత్తా ,పిల్లా , అంటూ పిలుపులతో హోరెత్తిస్తూ
నలిగిపోయిన కనకాంబర దండలు వేలాడుతూ ,
మధ్య మధ్యలో కుట్టిన మల్లెల దండలు మటుకు ఇంకా
తళ తళ లాడ్తూ ,పెళ్ళి కూతురి కళ్ళ ల్లా గా
ఆషాడ మాసానికి లాక్కుని వెళుతున్న కూతురా ?
చిన్న బెదురో , చిన్న బెంగో , ఆ చీర కొంగున దోపి
నాన్నలు అమ్మి భుజాన ఓ చేయి దన్నుగా ,
అన్నవరమ్లో పెళ్ళి జంటలు కూడిక గా , నలిగి పోయిన పట్టు చీరలు
మాయని పసుపు తాళి , మెడలో మెరుస్తూ ..
కూసింత సర్దుకో , ఇలా రా అలా జొరబడు అంటూ
కూరిమి నేర్పిస్తున్న రైలు పెట్టె
మధ్యలో మధ్యలో డబ్బా నిండా పప్పులు పోసి
అటూ ఇటూ కదిపి సద్దినట్టు , ఝట్కాయిస్తోంది ,
ఒకరి పై ఒకర్ని పడేస్తూ అదో తమాషా ...హమేషా
ఆగిన రైలు , కిందకి దిగిన జనం , హామ్మాయ్య
అని ఊపిరి పీల్చుకునే లోపు , నిండిన జనం ..
ఒక్క్ కాలు మీద సద్దుకోవయా రెండు కాళ్ళ మీద
నిలుచోడం ..ఈ ప్రభుత్వమ్లో ఓ షోకిలా దర్జా అన్నట్టు
గదమాయిస్తూ ..నేను నా సీటు లో మరింత నిండుగా సద్దుకున్నాను ..
ప్లాట్ఫార్మ్లు కదిలి పోతున్నాయి ..
జనాలు ని ఎక్కిస్తూ దింపేస్తూ .
ఆగని ప్లాట్ఫార్మ్లు ..అప్పుడే ఖాళీ అయిన విడిది ఇల్లులా
నిష్పూచిగా ,నిరామయంగా ..బద్ధకం గా ,కాస్త అల్సి సొలసి సేద తీరుతూ
చిన్న చిన్న ఊళ్ళు కదిలిపోయాయి
కాల గర్భం లోకా ? కాదు ..నా కనుచివర .వెంట
నర్సీపట్టణం రోడ్డు అని రాసి ఉన్న రైలు స్తేశ్హను ..
అదేమిటి ? రోడ్డు అని ఎందుకు ?
పిఠాపురం ..దేవులపల్లి గారు పుట్టిన దేవపురి
అన్నీ కదిలి వెల్ళి పోయాయి ..
నా ఊరు కాదు ఏదీ ..
'మా దేవుని మహా మందిరం 'అని హెడ్డింగ్ రాసి ఉన్నచిన్నగృహం
కింద వాక్యం లా సద్దుకున్న చిరు కుటుంబం రాజసంగా నులక మంచం పై పవ్వళించి
( నాకు నిజం గా కనిపించారు వీరు )
ఎంత సంతృప్తి ? ఆ ముఖాలలో ..
ఆకుపచ్చని పొలాలు
అప్పుడప్పుడు ముదురు ఆకుపచ్చ తోటలు గా
గోరింకలూ కోయిలలూ కీ మరి ఊళ్ళు అవి .
పొలాలు ధ్వంసించి ...ఎత్తైన కాలేజీ అంతస్తులు మరి కొన్ని చోట్ల
ఆ పిల్లలు కి పొలం దున్నడం అనే విద్య నేర్పిస్తే బాగుందును
ఆ భవనాలల లో అని ఒక ఆలోచన ..నన్ను కదిలించింది
ఏలూరు అని రాసి ఉన్న బోర్డు పలకరించింది
ఇంత చిన్న చూపా ? మా పై అంటూ
సిగ్గు తో తల దించుకుని ,ముభావంగా చేయి ఊపాను ..
విజయవాడ మరి నా గమ్యం కదా ఈ సారికి అని నచ్చ జెప్పుకుంటూ ..
సామల్ కోట లో నా సీటు అంటూ నా కోట ని
బద్దలు కొట్టడానికి ప్రయత్నలు జరిగాయి ట ..
అమ్మి కూసింత గట్టి ,అని లోపలే అనేసుకుని పాపం
నా ఊసు ఎత్తలేదు ..ఆహా ..ముఖ భంగిమ ఎంత ముఖ్యమో
దుర్గ గుడో ,గుణ దల గుడో
ఎత్తుగా కొండ పై దీపాల్ తోరణాలు
ముచట గా రా రమని పిలుస్తూ ..
అరగంట లేటు గా మొత్తnనకి
గమ్యం చేరింది ..
నా రైలు ..

15-06-15