"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

22 డిసెం, 2018

మరి కొన్ని మాటల మూటలు


చెట్టుకి వేలాడుతూ
చంద్రుడు
చిన్ననాటి ముచ్చట్లు
గుర్తు వచ్చాయేమో..

మబ్బులు అటూ ఇటూ
పరుగులు తీస్తూ
పోస్టుమాన్ ఆట
అడుకుంటున్నాయి..

గాలి ఈలలు వేస్తూ
గోల గోల చేస్తోంది
లాంగ్ బెల్ కొట్టాక
పిల్లల అల్లరి గుర్తు చేస్తూ ..

ఓ మొగ్గ వికసించే
పక్క పూవుని చూసి
అక్క మీద అలిగిన చెల్లి లాగా
మొహం ఎఱ్ఱబరుచుకుంది.

కాలి కింద నలిగే
గడ్డి పూవు తలచింది దయగా
నయమే నాకో ముల్లు
కాపలా లేదు , గులాబీ లాగా ..

మల్లెలు మాట్లాడుకునే మాటలు
ఏముంటాయో ? మాలలుగా
మళ్ళీ కలుసుకుని చెప్పుకుందామా 
లేదా విడిపోయి విడి పూలు గా ఉంటామా  ?

గులాబీలు , చామంతులు
ఎందుకో ఎప్పుడూ కలుసుకోవు
గులాబీ పెళుసు అని
చామంతి ఘనం అని చెప్పుకుంటాయేమో..

మరువం కలిపిన మల్లెమాల
తలలో చేరి పోటీ పడ్డాయి
నువ్వా నేనా గొప్ప పరిమళం అని
మర్నాటికి వాడి పోయి నేల పడ్డాయి.

చంద్రుడి నీల కిరణం
ఒకటి సూటిగా చేరి నీలి
కలువతో చెప్పిన ముచ్చట్లు
ఏవో సరస్సు వింటూనే ఉంది.
రాత్రి అంతా.

ఆకాశం వెండి చీర
ధరించి , చుక్కలుతో
చమ్కీలు కుట్టుకుంది
తెల్లవారేసరికి రాలి పోయాయి ..అయ్యో.

రాత్రి ఆడిన ఆటలు చాలు
ఇక పోయి పడుకో అంటూ చంద్రుడిని
అదిలించి , ధగధగలాడుతూ
పట్టు పంచె సవిరించుకుంటూ సూరీడు.

వసంత లక్ష్మి
ఉబుసుపోక రాసుకున్న మాటలు
విశాఖపట్నం
22 12 2018.

11 డిసెం, 2018

హేమంతం


నా కిటికిలొంచి నాకు చంద్రుడు కనిపించి
కుశలం అడుగుతున్నాడు ..
కింద నల్లటి చీకటి దుప్పటి కప్పుకున్న సముద్రం
పైన పలచటి మబ్బు చీర ధరించి ఆకాశం ..
అమ్మ బోర్లించిన వెండి బువ్వ పళ్ళెం లా చల్లగా చంద్రుడు
అమ్మ ఆరేసిన చీర మీద ఒడియాల్లాగా మిణుకు మిణుకుమంటూ తారలూ ..
సన్నగా మెలి పెడుతూ చెవి అమ్మ కసిరే మాటల్లా కోస్తూ చల్లని రివ్వున ఇంకా చలి గాలి కాని గిలి గాలి ..

శీతా కాలం మరి ఆ చివర ,ఆ వీధి చివరే ఆగింది బిడియంగా ,
ప్రేమ నిండిన పెళ్ళి కూతురి లా మొహం దించుకుని ..
మెల్లగా ,శుభంగా అడుగు పెట్టమ్మా ! అని మరి ఆహ్వానించాలా !!
ఆయత్తమవుతున్నాం ... అందుకే ,చిట్టి చామంతులూ , బొద్దు బంతి పూలూ , ముద్దు ముద్దు రంగుల పూలు ..అలంకరించి ధరిణికి ..

ఆకశాన ఎవరి కబురో అందాలి మరి ఋతువుల రాణి .ఊరికే వస్తుందా?
పిలిస్తే వస్తుందా ? పిలవాలా అసలు ..
గుమ్మం వరకూ వచ్చిన వారికి ఇంకా పిలుపులేమిటి ? అని అశ్రద్ధ చేయకు సుమీ ..మనింటికి వచ్చిన మన పిల్లైనా సరే , ఆహ్వానించాల్సిందే ..

శోభాయమానంగా అలంకరించిన గృహం కాదనుకునే రాణి కలదా ? ఇలపై ..
మన ఇల పై ..

పూల దారి ఏర్పరిచాను , చెట్టు ఆకులు రాల్చి ,ఒత్తున ఆకుల దారీ పరిచింది ..
ఆకుపచ్చని ఆకులూ రంగులద్దుకున్నాయి ..ఈ మహోత్సవం లో
తామూ పాలు పంచుకోవాలని ..
రాలిన ఆకులకే మాత్రం దిగులూ బొగులూ లేదు ..
తమ జీవితం ధన్య మయాయయని ఒక పులకింత తప్ప ..

శీతాకాలం ఆసన్న మవుతోంది , ప్రభూ అని నలు దిశలా ప్రభలు ఎత్తుకున్నట్టు సంధ్యాకాశం రంగుల హంగులు ఆరబోస్తోంది ..

మరి మనం సమాయత్తం అవుదామా ?
ఈ ఆఖరి శిశిర రాత్రి పారవశ్యానికి ?
హేమంత ప్రభువు పంపించిన కానుకలు
స్వాగతిస్తూ చాపుదామా హృదయ గవాక్షాల తలుపులు ?

చంద్రుడు నా కిటికీ ముందు స్థిరంగా నిలిచి
ఇలా ఎన్ని కబుర్లు చెప్పాడో ..ఈ హేమంత చంద్రుడు ..
ఉదయం సూర్యోదయానికి ముందే ..
ఈ సమాగమానికి ..నా హృది అదుపు తప్పిస్తూ
ఈ రాత్రికి మరి సెలవు తీసుకోనా ? 

6 డిసెం, 2018

అనుకున్నదొకటి ..అయిందొకటి



              ఈ ఆదివారం అయినా ఈనాడు అనుబంధంలో కథ , హిందూలో కల్పనాశర్మ వ్యాసం చదివేయాలి అన్న నా చిన్న చిన్న ఆశకి గంట కొట్టేస్తూ ఫోన్‌ కర్కశంగా మోగింది . ట్రింగ్ మంటూ . అవును అవి లాండ్ లైన్‌ మాత్రమే ఉన్న రోజులు . ఎప్పటికైనా ఈనాడు ఆదివారం అనుబంధంలో నా కథ చూసుకోవాలని ఎంత ఆశో ,కథకి వేసిన బొమ్మ కింద నా పేరు రచయిత్రి  సి. వకుళ అని చూసుకోవాలని కలలు కంటూ ఉంటాను. ఐతే అది ఉత్త పగటి కల ,నువ్వు అసలే పగలు ఎక్కువ నిద్రపోతావు.  నీ పేరు వకుళ అని కాదు  అసలు ఊర్మిళ అని  ఉండాల్సింది అంటూ ఆటలు పట్టిస్తారు , పిల్లలూ ,వారి నాన్న కూడ కలిసిపోయి! అదేమిటో కానీ ఈ విషయంలో వాళ్ళందరూ ఒకటైపోతారు .

      నా కథ లంటే అందరికీ వేళాకోళమే . " అమ్మా ! నువ్వు పుట్టినప్పటి నుంచి చదివేస్తున్నంత మాత్రాన ,రచయిత్రివి అయిపోలేవు. రచయిత్రిగా నువ్వు  పుట్టాలి అమ్మా ! " అంటూ పెద్దవాడు నన్ను ఏడిపిస్తాడు అయినా సరే ,నా ఆశ చచ్చిపోలేదు .  దానికి మటుకు నీళ్ళు పోసి అలా బతికిస్తున్నాను.  ఎందుకంటే మా ఇంట్లో చిన్న మొక్క అయినా బతకదు అదేమిటో మరి ? మనకి మొక్కలు అచ్చిరావు అని మా అమ్మ తరచు వాడే మాటే నేనూ వాడేస్తాను ..అసలు విషయం నాకు నీళ్ళు పోయాలంటే ..హ్మం ..చెప్పేస్తున్నా (ఎవరైనా అంటే ఊరుకోను కానీ..) నాకు బద్ధకం ఎక్కువ . అందుకే మా ఇంట్లో పచ్చదనమూ అవీ జాంతా నై ..

పెద్దవాడు -  ‘నాకు ఏ ట్యూషన్లూ వద్దు, అమ్మానే చదువుకుంటాగా’  అని అంటే వినకుండా  ‘అందరూ ఇక్కడే చదివి పెద్ద ఇంజనీర్లు అయిపోయారుట్రా’  అంటూ నేనే ఈ కోచింగ్లో పెట్టాను , దాంతో ఆదివారం అయినా వాడు ఇంట్లో ,సమయానికి లేకుండా పోయాడు .

నా రెండో   సుపుత్రుడు   మంచి నిద్ర ఇప్పుడే పడుతుందమ్మా , నన్ను ఇలా పొద్దున్నే తొమ్మిదింటికే ఎందుకు లేపావు ?’  అంటూ చిందులు వేస్తాడు ..

ఇక మా ఆయనన అంటారా  ? హు  – అసలు  ఉన్నప్పుడే సాయం లేదు.ఇక ఊరులో లేనాయన  గురించి  యేమనుకుంటాం ?ఉన్నా, అదిగో ఏ పని చేసినా ఒంకలు పెడతావు. ఐనా ఈ పెద్ద గిన్నెలో పాలు కాస్తే ఏమయిందిట ? ఇప్పుడు ఏం కొంపలు మునిగాయి ? ఏమీ మునగలేదు కానీ   అది అన్నం గిన్నె. అది మళ్ళీ తోముకోవాలి  ఇప్పుడు ,అని పళ్ళు నూరుకున్నా లాభం ఉండదు . నేను అనే మాటలకి చీమ అయినా కుట్టదు ఎందుకో మరి . ఆ మాటంటే , ‘ చీమల్లేవుగా మనింట్లో ’ అంటూ నవ్వుతాడు  ప్రభాకర్ , నాకు ఒళ్ళు మండేలా . సెంసాఫ్ హూమర్కేం తక్కువ లేదు , ఇంట్లో పని చెప్పక పోతే చాలు   ఆయనంత సరదా మనిషి  ఉండరు ప్రపంచంంలో .

ఇలాంటి ఇంట్లో నా కథలూ కావ్యాలు ఎలా జరుగుతాయి i  మరి? అప్పటికీ నా శాయశక్తులా మూడు పుస్తకాలు, ఆరు వార్తా పత్రికలు రోజంతా చదువుతూనే ఉంటా. నా కోరికని బ్రతికించుకుంటూ పచ్చగా ..

ఇంతకీ ఆ ట్రింగ్ మనే గంట నా గుండెల్లో ధడ్ ధడ్ మని రైళ్ళు పరుగులు పెట్టించింది ,ఎందుకంటే, దానికోసం రింగ్ రింగ్ అంటూ వెనక్కి వెళ్ళాలి నలుపు తెలుపుల ఫ్లాష్ బాక్లోకి ...ఇదిగో వెళుతున్నా ..

ప్రభాకర్ వారింటికి ఒకసారి డిన్నర్ కి వెళ్ళి వచ్చి ,ఎన్ని రోజులు రాత్రులు వర్ణించి చెప్పాడు అంటే ,నాకు ఆశా దేవి అంటే పరమ చిరాకు పుట్టేసింది . వాళ్ళ బాస్ భార్య పేరు అదే.  ఆవిడ వండిన వంట , సద్దుకున్న ఇల్లు గురించి మెచ్చుకున్నప్పుడల్లా ,మన ఇల్లు చూడు ,నీ వంట చూడు అని అన్యాపదేశంగా నా ఇంటిని ,వంటని దెప్పుతున్నట్టు ఫీల్ అయిపోయి ,ఆ విషయమై పెద్ద యుద్ధాలు కూడా అయి ఆఖరుకి ,మరెప్పుడూ ఆ ఊసు ఎత్తనని ఒక శాంతి ఒప్పందం జరిగాక , సమరం ముగిసింది .

ఈ ఆదివారం ఏమయిందంటే  -  ప్రభాకర్ నుంచి వచ్చిన ఫోన్‌  వచ్చింది . ఆ ఆశా దేవి , ఆవిడ గారి   భర్తా వస్తున్నారుట మా ఇంటికి . ఏదో పెళ్ళికి దిగారట .  సమయం ఉంది కదా ,మన ప్రభాకర్ ఇంటికి కూడా వెళదాం అని ముచ్చట పడ్డారుట , వాళ్ళూ ఏ  క్షణం లోనైనా వస్తారు  కాబట్టి , అప్పటికే  నే చేయవల్సిన పనులు గుర్తు వచ్చి సరే అంటూ ఫోన్‌ పెట్టి ..’పరుగులు తీయాలి’ అనుకుంటూ కూలబడ్డాను ఇలా సోఫాలో .

‘ఎక్కడనించి  మొదలుపెట్టాలి ‘ అని ఆలోచిస్తూ మొదటి అడుగుగా ఎగురుతున్న వార్తా పత్రిక లని అన్నీ కలగలిపి బీరువా తెలుపు తెరిచి అందులో పడేసాను, ఈ వారం కూడా నా కోరిక తీరలేదు అనుకుని నిట్టురుస్తూ ..

నేనసలే పెద్ద పనిమంతురాలిని కాదు అని చెప్పానా ! ఆ పై నాది జాలి గుండె, పని వారికీ కావాలి సెలవు అని నమ్మి, ఆదివారం సెలవిచ్చేసాను పనిమనిషికి. దాంతో సింక్ నిండా గిన్నెలు నా రాక కోసం ఎదురు చూస్తూ పడి ఉన్నాయి .

నిన్న యోగా ( ఈ మధ్యే మొదలు పెట్టాను లెండి ) చేస్తూ ,హాల్ మధ్యలో పడుకుని ,తల పైకెత్తి చూస్తే ఏమిటో మసక మసక గా కనిపించిది . ఏమిట అని కళ్ళ జోడు పెట్టుకుని చూస్తే ,ఈవిడ మన జోలికి రాదు లే అని ధైర్యం గా అల్లుకున్న సాలి గూళ్ళూ   ఈ మధ్యనేగా  పండక్కి (అంటే ఆరు నెలలయిందేమో)  తుడిపించానే .. అబ్బ ఈ ఇంటికి ఎంత చేసినా సరిపోదు , దీర్ఘం గా నిట్టూర్చాను .

పాతది ఇచ్చి గుండ్రం గా ఎంత బాగుందో అని ముచ్చట పడి కొన్న వాక్యూం క్లినర్ అలా దుమ్ము పట్టి పడి ఉంది ఆ మూల. వాడొచ్చు కదా!  ప్రభాకర్ గొంతు సిన్మా లో లా వెనక నించి వినిపించింది ..’ ఆ నాకూ తెలుసు ..చేతులు పీకవూ !’

‘వెయ్యి రూపాయలు కట్టి నేర్చుకున్నావు ఆ ఏరోబిక్స్ . డబ్బు వేస్ట్ .’

ఓహో . ఇంట్లో ఈ పనులు చేస్తే చాలని కాబోలు ఈయన గారి అభిప్రాయం . చా ఇలాంటివన్నీ ఆడ వారిని ఇంటికి కట్టి పడెసేందుకు వాడే  పద జాలం ..ఏం? పోనీ  నువ్వు చేయ వచ్చుగా  ఆ క్లీనింగేదో ,ముచ్చటగా ! వేల రూపాయులు పోసి కొన్నందుకు ? అట్టేట్టా ? అంతే మరి.  ఆ పైన ఆ  ఊసు బంద్ .

ఎక్కడని మొదలు పెట్టాలి ? సింక్లో ముందు తేలికగా ఉన్న కంచాలు ,గ్లాసులు , కడిగి పెట్టి , మిగిలినవి బయట బుట్ట లో నీళ్ళు పోసి నాన పెట్టా. అదేమిటో మనం తోమితే ఇన్నేసి కనిపిస్తాయి ,పని మనిషి అలా వచ్చి ఇలా తోమేస్తుంది అదేమి వింతో కదూ ?  అయినా ఇన్ని అంట్ల గిన్నెలు అసలు ఎలా అయాయి ? హమ్మో . ఇక్కడే కూర్చుంటె ఎలా అనుకుంటూ. అక్కడ నుంచి  కదిలా .  భోజనాలకి వస్తారా ? ఫ్రిజ్ తలుపు తెరిచి తొంగి చూస్తే ఏవొ కొన్ని కూరలు కనిపించాయి ఏదో ఒకటి ఆలోచిద్దాం ముందు తరిగి పెట్టుకుందాం అని నాలుగు రకాల కూరలు తరిగి పడేసాను .

ఇంక ఇల్లు సర్దడం  సంగతి చూడాలి అసలే వచ్చేది ఆశా దేవి. చాలా అందంగా కూడా ఉండే ఉంటుంది .ప్రభాకర్కి సౌందర్య ఆరాధనన   ఎక్కువ , నిట్టూర్చి  కొత్త వాక్యూం క్లీనర్ వాడే ముహూర్తం వచ్చింది అని దానిని లాక్కుంటూ వచ్చి , అన్ని అమర్చునికి ఆ సాలె గూడుల పని చూసా.  ఇంకా,  చాలా మూలలు ‘ మా సంగతో’  అంటు దుమ్ము ముఖాలతో అరచి చెప్పాయి. అదేదో  యాడ్లో  లాగా, పాలలో కారన్‌ ఫ్లేక్స్ తిని ఉన్నానేమో ,మహా హుషారుగా ,ఎంత బాగా పని చేస్తోందో అంటూ హాల్లో మార్బెల్ నేల ,సోఫా ల కిందా పైనా ,తివాసీ అన్నీ శుభ్రం   చేసి ,హమ్మయ్య అని నిట్టూర్చేసరికి , మరి నా సంగతేమిటి ? అంటూ చూసాయి ,ఎంత బాగున్నాయో అని ఇష్ట పడి కొన్న ప్లాస్టిక్ పూలు బూజు పూలుగా కనిపించేసరికి ,వాటికి కొళాయి కింద ఒక సారి తల స్నానం చేయించి , వాస్లని కూడా చేతి గుడ్డ తో తుడిచి..

అబ్బబ్బ . ఇంటి పని ఎంతకీ తెమలదేం ? గోడ  మీద ఉన్న కు ,కు  గడియారం  పదకొండు అయిందని చెప్పింది కు కు అంటూ అరచి . బాబోయ్ కాలం ఇలా ఆగిపోనీ అని పాడుకుంటూ వంటింట్లోకి జంప్ చేసి , కుకర్ లో అన్నం పప్పు పడేసి ,నాకు బాగా వచ్చిన సాంబారు చేద్దాం అని తరిగిన కూరలు పాన్‌ లో పడేసాను .  ఇంకా గదుల సంగతి చూద్దాం  అని పిల్లల గది లోకి అడుగు పెట్టాను . రాత్రి ఏమైనా టార్నడొ వచ్చిందేమో అన్నట్టు గా ఉంది ఆ గది పరిస్థితి ని చూస్తూంటే . గది నిండా దుప్పట్లు ,దిళ్ళూ  పుస్తకాలు చెల్లా చెదురుగా. నీ చిన్నప్పటి కబుర్లు చెప్పమ్మా అంటే మా చీకటి గది ఆట గురించి చెప్పాను. ఇంక అంతే. నేను నా గదిలో ,ప్రపంచం అంతా నిశ్చింత గా ఉంది అన్న భ్రమ లో చేతిలో ఒక పుస్తకం పట్టుకుని చదువుకునే సమయాన వీళ్ళిద్దరూ ఇలాంటి ఆటలు ఆడుకుంటారు ..

ఆ దుప్పట్ల మధ్య లోనే ఎక్కడో  మా చిన్న వాడు  ఉండే ఉంటాడు. సర్దడం అనే కార్యం ని కుదించి ‘ అన్నీ తోసేయడం’  అనే కార్యక్రమం లోకి దూకాను ..  కనిపించినవి కనిపించినట్టు  బీరువాలలోకి తోసేసాను.  ఇంత కన్నా ఏమీ చేయ లేం , బాబూ లేవరా ! అన్న నా పిలుపు సాంద్రత వాడికి సరిపోదు  అని తెలిసినా  నా ప్రయతం నేను చేసి విరమించుకున్నాను . ఎందుకంటే , ఇంకా,  ఇంకా  అరిచే ఓపిక నాకు లేదు.

మరో గది లోకి అడుగిడితే అంతా ఆదివారం ఆబిడ్స్ బజారులా ఉంది.  నాకు కావల్సిన పుస్తకం ఒకటి   కనిపించక , అలా  అన్ని పరిచింది నేనే అని గుర్తు వచ్చింది.  ఇది జరిగి వారం అయింది.  అయినా ఇలాగే ఉందా ? ఈ గది. ఎవరికీ పట్టదు. చా  అని విసుక్కుంటూ ఆ చెదురు మదురుగా పడి ఉన్న పుస్తకాలు అన్నీ వాటి బీరువాలోకి ఎక్కించాను . మధ్యలో తిలక్ కవిత్వం కనిపించి ఒక్కసారి అనుకుంటూ ఒక్క పది నిముషాలే అనుకున్నాను. ఇంతలో  ఏదో వాసన ..వంటింట్లోంచి మాడు పిలుపులు ,ముక్కుని పట్టి లాగాయి .

నేను ఒక్కర్తినీ ఎన్ని విషయాలని i చూసుకోను.. అంటూ ఉక్రోషం తో ముక్కు పీలుస్తూ  ఒక్క ఉదుటున వెళ్ళా వంటింట్లో కి .

మరీ అంతా మగ వాళ్ళు ఇంటి నిండా ,ఒక్క ఆడ పిల్ల ఉంటే ఎంత సాయం గా ఉండేది ? అమ్మో ఈ మాట అనుకుంటే చాలు అమ్మ సతాయింపులు గుర్తు వచ్చేస్తాయి ,వద్దు ,పనులు అందరూ కలిసి చేసుకోవాలి. మగ పిల్లాడు అని ముద్దు చేయను. ఏదో చిన్న పిల్లలని ఇంకా పనులు చెప్పటం లేదు అంతే .. లేక పోతే వాళ్ళ నాన్న లాగే తయారవరూ ?

మాడి పోయిన వాటి నుండి పనికి వచ్చేవి వేరు చేసి , పూరీల కూర కోసం ఆలూ మళ్ళీ కుకర్ లో పడేసి ,సాంబారు , కొబ్బరి పచ్చడి , కొబ్బరి కోరు ఫ్రిజ్ లో ఉంది కొంచెం  నయం. పని తగ్గింది. కాబేజ్ కొబ్బరి కూర , ఎలెక్ట్రిక్ కుకర్ లో నాలుగు రకాల కూరల తో బిర్యాని ,దానిలోకి ఉల్లి తరుగు , రైతా కి . ఇలా నాలుగు చేతులతో ఎడా పెడా వంట కొంత అయింది అనిపించి , పాలు కూడా కాచి ఉంచాను ,నాకు వచ్చిన ఒకే ఒక స్వీట్ ,పాయసం చేద్దాం అని తీర్మా నించుకున్నాను నాకు నేనే .

నేను చూడని ,కలవని ఆశా దేవితో నాకు ఈ పోటీ ఏమిటొ. పోనీలే పిల్లలు ఆదివారం కదా , శుభ్రంగా తింటారు. ఎప్పుడు వస్తారో ఏమిటో. భోజనాల వేళకి వస్తే ఉంటాయి అనే కదా ఇదంతా చేయడం .

సరే ఆఖరుకి మా గది లోకి అడుగు పెట్టి , తుళ్ళి పడ్డాను . ఒక్క అంగుళం కూడా ఖాళీ లేదు ,ఇంత మతి మరుపేమిటి ? నాకు . నిన్నే కదా అలమారాలు సర్దు కుందామని అన్నీ తీసి బయట పెట్టి , గ్రిషాం పుస్తకం ఆఖరి పేజీలు చదువుతూ సోఫా లో నే నిద్ర పోయాను . అసలు నిజం ఏమిటంటే ఎప్పటికప్పుడు తర్వాత సద్దుకుందాం అని తోసేసిన బట్టల లోంచి చీర ఉంటే జాకెట్టు ఉండదు,కుర్తా ఉంటే చున్ని ఉండదు ,నా లాంటి వారే కాబోలు ఈ మిక్స్ అండ్ మాచ్ అనే కొత్త ఫాషన్‌ మొదలు పెట్టారు , ఇలా కాదని నిన్నే మంచి రొజని ముహూర్తం చూసి మొదలు పెట్టాను ,అబ్బే మంచి రోజు అంటే నాకు మూడ్ వచ్చిన రోజు అని అంతే .

ఇప్పుడు ఈ పని కూడా నా ! సరే పని లో పని అని , చీరలన్నీ బొత్తుగా ఒక వేపు, సల్వార్ సూట్స్ అన్నీ మరొక వేపు ,జాకెట్లు అన్ని ఇంకో అర లో ఇలా ముచ్చట గా సర్దుకుంటూ ఒక గంట గడిచిపోయింది . అమ్మా ..అన్నమా వాడి   కేకతో తుళ్ళి పడి,  లేచి ముందు పాలు తాగు . ఇవాళ్టి కి బ్రేక్ ఫాస్ట్  వొద్దు . ఇంక ఏకంగా భోజనం చేసేద్దువు గానీ.  అంటూ స్నానంచేయ మంటూ  వాడి ని  బాత్రూం లోకి తోసాను .

అలమారాలో బట్టలు సర్దడం అయింది , నా అలంకరణ ల అలమారా తెరిస్తే .. అదీ అంతే   నానా రకాల సీసాలు డబ్బాలతో నిండి పోయి కనిపించింది . అన్ని కష్టాలు ఇలా ఒక్కసారే  అందరిలోనూ  నాకే ఎందుకు వస్తాయి ? ఇలా ఎందుకు ఉంది ? ఎప్పటికప్పుడు సర్దుతూనే  ఉన్నాగా ? అయినా , ఈ ఆశాదేవికి ఈ ఆదివారం నా ఇల్లే దొరికిందా  రావడానికి ? సందర్శించడానకి ??

ఖాళీ అయిపోయిన క్ర్రిం సీసాలు ,పౌడరు డబ్బాలు , పనికి రాని పోషక పదార్ధాల సీసాలు ,అబ్బే నాకోసం కాదు. రోజు రోజు కి తరిగి పోతున్న రూపాయి విలువ లాంటి నా జుట్టు కోసం . అటు జడా కాదు ,ఇటు పోనీ కాదు.  బాబ్డ్ అసలే కాదు నాలుగంటే నాలుగు రంగు వేసిన బాబ్డ్ అసలే కాదు నాలుగంటే నాలుగు రంగు వేసిన నల్లటి వెంట్రుకలు మిగిలాయి ,ఇంకా ఎందుకీ డబ్బాలు ,సీసాలు అన్నీ తీసి డస్ట్ బిన్‌ లో పడేసి కసి తీర్చుకున్నాను . అన్నిటికీ టైం ఉంటుంది అని అందుకే అంటారు ప్రభాకర్ ఎప్పటినించి చెపుతున్నాడు చైనా మన భూభాగం ఆక్రమించుకుంటున్నట్టు నువ్వు అన్ని అల మారాలు ఆక్రమించుకున్నావు . నా దువ్వెన ఎక్కడుందో వెతుక్కోడానికి అరగంట పడుతోంది నాకు . ఐనా ఇన్ని సీసాలు ,డబ్బాలు కొంటావు కానీ నువ్వు వాడడం ఎప్పుడూ చూడ లేదు ,"అవి ఎలా పని చేస్తాయో తెలీదు కదా ఇంకా ? ".నా జవాబు .. "ఎప్పుడు తెలుస్తుంది ? నువ్వు వాడితే నే కదా తెలిసేది ".అమ్మో , నా అందం కి హాని కలిగిస్తే ..ఇలా అనంతంగా సాగిపోతుంది ఆలోచనా స్రవంతి  , కానీ తెమలదు .. చివరికి చూసారా ,నాకు  జ్ఞానోదయం అయింది .అందరూ ఆ టైం కోసం ఎదురు చూడాలి అంతే . ఊరికే మాటలు అనేసి తొందర పెడితే అవుతుందా ? తెలుసుకోరూ ..

ఈ వైజాగ్ లో చల్ల గా ఉంటుంది అని మురిసిపోవడమే కానీ ,ఈ చమట ధారలు గురించి ఎవరూ చెప్పరు . జిడ్డు తయారు చేసే ఫాక్టరీ లా ఉంది నా ముఖం . తలంటి పోసుకుందాం అని మధ్యలో ఎప్పుడో ఫలానా నూనె పట్టించాను తలకి.  అది అంతా ముఖం మీదకి చేరి ,నా ముఖం ఆనవాలు నేనే పట్టలేకపోతున్నాను . ఇంక స్నానంకి వెళితే మంచిది ..

ఈ ఇంటి పని ,ఒంటి పని ఎంత చేసినా తెమలదు అంటుంది అమ్మ ..నిజమే ..

ట్రింగ్ ..ట్రింగ్ ..తలుపు పిలుపు మోగింది ..

బాబూ ! వీడు బాత్రూం లో దూరి న్నట్టున్నాడు ..

అబ్బ .. తప్పదు అనుకుని వెళ్ళి తలుపు తీసాను ..

అందంగా నేను ఊహించినట్టే ఆమే ఆశా దేవి , మాకు బాస్ , ఆవిడకి భర్త నిరంజన్‌ గారు ,గుమ్మం లో

ఉక్కిరి బిక్కిరి అయాను ..

మాడమ్‌ ఉన్నారా ?? ఆశా దేవి .. నా జిడ్డు ముఖంలోకి చూస్తూ ...ఖర్మ ఖర్మ !!

ఉన్నారు ..రండి అంటూ .. లోపల కూర్చో బెట్టి ..మా గది లోని  బాత్రూంలోకి మాయం అయిపోయాను ..

ఈ విధం గా ..ఆ ఆదివారం  మా ఇంట్లో నాకే .. ఏం  చెప్ప మంటారండీ !! .. సిగ్గు సిగ్గు .

****

24 అక్టో, 2018

బాల్యం

ఇన్ని సంపెంగలు
గుప్పెట్లో పోసినట్టు
బాల్యం గుర్తు వస్తే..

పరుగులు ఆపకు.. ఆపితే
దొంగాట లో ఔట్ చేస్తారు
చిన్నప్పటి స్నేహితులు.

కరిగిపోయింది ఐస్ గడ్డ
పుల్ల మటుకు చేతిలో
జిల్ మనే అనుభూతి కోసమే.

అడుగులో అడుగులు వేస్తూ
వెళ్లినా స్కూల్ ఎంత దగ్గరో
ఎన్ని అడుగులు వేసినా ఎంత
దూరమో ఇప్పుడు.

హోంవర్క్ చేస్తే చాలు
ఆటలు ఆడుకోవచ్చు
ఎంత వర్క్ చేసినా
ఆటలు లేవేమిటి ?

సుదూర స్వప్నం సెలవులు
ఇప్పుడు సెలవంటే శిక్ష
ఎన్ని డబ్బులు ఒంపాలో
ఒక్క సెలవు కి.

పరుగులు తీసి కింద పడితే
చెక్కుకు పోయేది మోకాళ్ళ చిప్పలు
జీవితం బ్యాలన్స్ తప్పితే చిక్కులే చిక్కులు.

ఏడాది చివర పరీక్షలు
పాస్ అవుతే చాలు ప్రమోషన్
ఈ పరీక్షలు ఏమిటో చెప్పి రావు..

పాములు తప్పించుకుని
ఎక్కితే పంటే పాముల పటం ఆటలో
నిచ్చెనలు కూడా పాములే ఈ ఆటలో .

మూడు కాళ్ళ బండి లాగుతూ
నడక నేర్చుకున్నాను .
కర్ర సాయంతో ఇప్పుడు అదే ఆట.

బోసి నవ్వులు ఎంత ముద్దో
ఇప్పుడెందుకు అంత దైన్యం
నవ్వుకుంటూ నువ్వే
అప్పుడూ ఇప్పుడూ..

23 10 2018
వసంత లక్ష్మి.

11 సెప్టెం, 2018

నా జీవితం లో రెబెక్కా..

మా చిన్నబ్బాయి 12 త్  ఆ తరువాత   వివిధ రకాల ఎంట్రన్స్ పరీక్షలు రాయించి మే చివరలో మేం ఇద్దరం కువైట్ కి బయలుదేరాం.. మొట్టమొదటిసారి విదేశమ్ లో నివసించడానికి.మా అమ్మగారి కి ఓ పక్క బెంగ , మరో పక్క కుమార్ ఎక్కడుంటే నేనూ ఆ పక్కనే ఉండక తప్పదు అని నిశ్చింత ..అంతే కదా అమ్మ లకి.

ఇక చూడండి..నేనేదో అప్పుడే మొట్టమొదటి సారి అత్తారింటికి వెళుతున్నట్టు , కూర పొడి , చారు పొడి , సాంబారు పొడి , కంది గుండా అంటూ లెబెల్స్ రాసి మరీ పొట్లాలు కట్టేసి ఇచ్చింది..తానే స్వయంగా తయారు చేసి..నేనేమో ఇక్కడ ఏం దొరుకుతాయో తెలియదు అని ఓ మిక్సీ ..ప్రీతి మిక్సీ కొని , ఇంకా ఏవో నా సొంత సరంజామా తో ఎక్సట్రా లగేజ్  బిల్ కట్టి , బిక్కు బిక్కు మంటూ బయలుదేరాను. బయటకి మటుకు గంభీరంగా మొహం పెట్టి.

2006 మే.. అంటే ఎంత గొప్ప సంవత్సరం.మా సిల్వర్ జూబిలీ ఏడాది..ఆ 25 ఏళ్ళల్లో మేం 15 ఏళ్ళు ఏమో కలిసి ఉండి ఉంటాం..మిగిలిన సమయం అంతా షిప్ లో ఇంజనీరు గా..

పిల్లల చదువులు నేను చూసుకుంటూ , ఉద్యోగాలు జీతాలు తాను చూసుకుంటూ 25 ఏళ్ళు దిగ్విజయం గా పూర్తి చేసిన ఏడాది అది..ఆ మెమరిస్ అన్నీ ఓ ఆల్బమ్ గా స్వయం గా నేనే తయారు చేసి తీసుకు వచ్చాను.అప్పటికి కోలేజ్ లు అవీ ఏమి లేవు.అంతా హాండ్ మేడ్ కోలేజ్.

వీసా రాత కోతలు ముగించుకుని బయటకి వచ్చేసరికి అక్కడ తను ఎదురు చూస్తూ..సంతోషంతో గిర్రున తిరిగిన నీళ్ల వెచ్చదనం ఇప్పటికీ గుర్తే నాకు.

దారి అంతా ఎడారి , మధ్యలో కట్టిన ఇసుక రంగు ఇళ్ళు..విశాలమైన రోడ్లు..కార్లు తప్ప మరింకే వాహనం కనపడని వైనం.అబ్బురంగా చూస్తూ కూర్చున్నాం.

ఇంటికి చేరాం.ఇంతెత్తున సీలింగ్..విశాలమైన చప్పుడు చేయని లిఫ్ట్.బిల్డింగ్ లో ఏ సి చల్లదనం అన్నీ కొత్తే.

ఇంట్లో సామాన్లు చేర్చి ఆ రోజుకి రెస్ట్ కదా..భోజనం మనింట్లో పని చేసే "   బీటా  " చేసింది ..అంటే..అదిగో అప్పుడే మొట్టమొదట బీటా పేరు విన్నాను.
తను శ్రీ లంకన్ ఆవిడ.. లుంగీ లాంటి స్కర్ట్ , పైన ఓ టాప్ వేసుకుని వచ్చేది.ఆవిడే నా పాలిట రెబెక్కా..

మీలో కొందరైనా రెబెక్కా నవల చదివి ఉంటారు కదా..ఆ నవల లో ఆమె కనిపించదు..కానీ ఆమె ప్రభావం ఆమె నివసించిన ఇంట్లో అందరి మీదా కనిపిస్తూ ఉంటుంది..అందరూ రెబెక్కా ఇలా..ఆమె ఇంత గొప్పగా అంటూ ..తరవాత వచ్చిన రెండో భార్య జీవితం నరకం చేస్తూ ఉంటారు..ఆ కథ మరొకసారి..😊😊

నేను వెళ్లే సరికి ఇల్లు మహా శుభ్రం గా ఉంది.వంటిల్లు మరీ నూ..కౌంటర్ లు అవే గట్టుల మీద ఒక్క సామాను లేదు.అన్నీ వాటి వాటి స్థానం లో పెట్టేసి ఉన్నాయి..

నేను కొంచెం బిక్క మొహంతో ఉన్నాను కదా , మర్నాడు తను ఇల్లు , వంటిల్లు అప్పచెప్పేసి నాకు ఆఫీసు కి వెళ్లి పోయాడు..రెబెక్కా తరవాత ఇంటికి వచ్చిన రెండో ఆమె లాగే నేను లో లోపల భయపడి పోతూ, అమ్మో ఇల్లు ఇంత నీట్ గా సర్దుకొక పోతే ఆ బీటా ఏమనుకుంటుందో..ఎడ్డే మొహం అనుకోదు.. అని నాకు నేనే ఆలోచించేసుకుని , అన్నాలు టిఫిన్లు తినేసి , ప్లేట్స్ గ్లాసులు అన్నీ కడిగేసి , తుడిచేసి మళ్ళీ అన్నీ అలామరలో సర్దేసి..
అమ్మయ్య అంటూ కూర్చున్నాను.

ఇలాగే ఓ 3, 4 నెలలు నడిచాక , ఓ రోజు ఇవన్నీ నువ్వెందుకు కడుగుతున్నావు..బీటా వచ్చి కడుగుతుంది కదా..అన్నాక..నాకు మెలకువ వచ్చినట్టు అయింది..అవునా..తాను కడుగుతుందా..అని నోరు తెరిచి మరీ ఆశ్చర్య పోయి...ఈ ఇంటికి నేను కూడా ఓనరమ్మ ని కదా అంటూ ఓ స్పృహ కలిగింది..

బీటా కి ఈ సంగతి ఏమీ పట్టేది కాదు..వచ్చేది , ఇల్లు క్లినింగ్ , వంటిల్లు క్లినింగ్ వంట అన్నీ చేసుకుని వెళ్లిపోయేది.
నా భాష తనకి అర్ధం కాదు అని నోరు మూసుకుని కూర్చునే దాన్ని..బట్లర్ ఇంగ్లీష్ లో తను కుమార్ బాగా మాట్లాడుకునే వారు..స్పెషల్ గా చూసేది.తన ఇష్టాలని..మంచిదే..పాపం.

అన్నిట్లో కొబ్బరి ఉండలసిందే..ఓ ఏడాది చేసి మానేసి శ్రీ లంక వెళ్లి పోయింది.

తానే ఆ ఇంటికి ఓనర్ అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించలేదు..కానీ స్థాన బలం ఏదో చేజిక్కించు కున్నట్టి నాకు అనిపించి..నన్ను నా ఇంటికి కొత్త దాన్ని చేసింది..తానే మా ఇంటి రెబెక్కా..
నిజానికి ఇదంతా ఓ కథ లా రాయొచ్చు..కానీ నాకు అంత ఓపిక లేదు మరి.

ఇది చదివి కుమార్ ఏమంటాడో..😊😊

ఏమన్నా..ఇప్పుడు భయం లేదు..నేనే ఓనరమ్మని మరి..😊😊

11 09 2018
కువైట్
వసంత లక్ష్మి .పి.

17 జన, 2018

యే మాయ చేసావే క్రీమూ ?

కారుని   పార్కింగ్ లోకి తిప్పి విసురుగా బ్రేక్ వేస్తూ ఆపేసరికి ,బంపర్కి తగిలికీచుమంది
అబ్బా ,నా కోపం అంతా ఈ నాలుగు చక్రాల వాహనం మీద చూపిస్తే ఎలా ? అసలు కారణమైన   వాసు మీద చూపించాలి కానీ ,’ అని  అనుకుంటూనే ..మళ్ళీ అనుకోకుండా కార్ డోర్ విసురుగా శబ్దం తో మూసుకోవడం జరిగి పోయింది .
చా!  ఈ రోజు నా మనసుకేదో అయింది  వెంటనే  కూల్ చేసుకోవాలిఅనుకుంటూ ఒకసారి హాండ్ బాగ్ తెరిచి  అద్దంలో  నా మొహం చూసుకున్నాను .
ఆఫీసు పనితో   అలసిపోయిన మొహం వాడిపోయి కనిపిస్తోంది .   నుదుటి మీద చర్మం కళా విహీనంగా  ఉండి కళ్ళ కింద నల్లటి వలయాలు చుట్టుకున్నాయి . నేనేనా ? అని ఉలిక్కిపడ్డాను . ఛ నా మీద నాకు తగ్గిపోయిన శ్రద్ధకు అద్దం పడుతోంది అద్దంలో నా రూపం . ఏది ఏమైనా కానియ్ ..ఇవాళ ఎలా అయినా ఆ
' ఓలే '  ప్రాడక్ట్ కొనేయాలి. వెయ్యి రూపాయిలట.  అయితే ఏమయింది?
యాభైవేలు సంపాదిస్తున్నాను . ఇంకా ఏమిటి ? వెనక ముందు  ఆలోచన?
సామాన్లు పడేసుకుని తోయడానికి బండి పట్టుకుని  షాపింగ్ మాల్లోకి ప్రవేసించాను . ఇదో పెద్ద   సూపర్ మార్కెట్ . ఏ టు జెడ్ అన్ని సరుకులు ఒక్క చోటే దొరుకుతాయి అని ఈ మధ్య ఇక్కడికే వస్తున్నాను.ఓ పైసా పోతే పోయింది ప్రాణంకి హాయిగా ఉంది .మరే వీధి చివర పచారీ కొట్టు ముఖం చూడక ఎన్నాళ్ళై పోయింది కదూ ? నాలో నేనే స్వగతంలా అనుకున్నాను . 
మళ్ళి వాసు గుర్తొచ్చాడు   ఆ వెనకే , మర్చిపోయిన కోపమూ  ముంచుకొచ్చింది
అయినా వాసుకి అసలు బుద్ది లేదు. చదువుకుని ఉద్యోగం చేస్తున్న భార్యని అర్ధం చేసుకోడం అస్సలు రాదు తనంటే అదో అలుసు కాబోలు. మునుపు షాపింగ్ అంతా కలిసే చేసేవారు. నువ్వునాలా కాదు చాలా బాగా  శ్రద్ధగా షాపింగ్ చేస్తావు  అసలు యే పని అయినా నీకు నువ్వే సాటి  అనుకో ..’ అంటూ , ఓ పొగడ్త నా మొహాన పడేసి  మెల్లమెల్ల గా అన్ని పనులు నా మీద వదిలేసాడు.
తనెంతో   తెలివైనది అనుకుందే కాని ,ఆ మాటల  వలలో  పడిపోయిన  అమాయకురాలు తనని  ఇదిగో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది .
ఇద్దరి పిల్లల చదువు ,స్కూల్ ఫీజ్  కట్టడం దగ్గర నించి ,వారి చదువులు ,ఆరోగ్యాలు ,అవసరమైతే  డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్ళడం ,ఇవి కాక ఉదయమే హడావిడిగా వంటలు, లంచ్ బాక్సలు అన్నీ నా పైనే . సహాయం తీసుకుందాం అంటే ,ఎప్పుడూ తన సమస్యలు చెప్పి బిజినస్ అంటే ఇలాగే ఉంటుంది ,మన మీద నమ్మకం కుదిరే వరకూ శ్రమించాలి , తప్పదు ,నీ జీతం నిలకడ గా ఉంది కాబట్టే  నేను ఈ రిస్క్ తీసుకోగలిగాను ,నా ఇంజనీరింగ్ ప్రతిభ అంతా మరెవరికో అమ్ముకోవడం ఎందుకు ? ఈ ఫాక్టరీని ఏ రేంజ్కి తీసుకు వెళతానొ చూస్తూ ఉండు అంటాడు . పైగా , ‘అనంతా ,నీ అనంత మైన ప్రేమతో నాకు శక్తి నివ్వవా ?’ అంటూ ,ఎలాగో నా కోపాన్ని మరిపిస్తాడు. అయినా అంతా  మన కోసమే కదా అంటూ ఉంటాడు ,నిజంగా నిజమేనా ?

నా జీతంతో ప్రస్తుతం ఇల్లు నడుస్తోంది , పిల్లల ఖర్చులు పెరిగి పోతున్నాయి , స్కూల్ కాక, పైన మరి కొన్ని ఎక్సట్రా  క్లాసులు వాటి ఫీజులు , మధ్యలో వచ్చే పుట్టినరోజు పార్టీలు , పండగలు ,కానుకలు ,ఔటింగ్స్ , అన్నిటికీ డబ్బు కావాలి ,ఎంత పొదుపుగా ఖర్చు పెట్టినా నెలకి యాభై వేలు హుష్ అంటూ ఎగిరిపోవడమే కనిపిస్తోంది ..

నా పర్సనల్ ఖర్చులన్నీ పక్కకి పెట్టేస్తున్నాను ,కొత్త డ్రెస్సులు కొని ఎన్ని నెలలు అయింది ?
వాసు  ఫాక్టరీకి ఆర్డర్లు రావడం ఎప్పుడు మొదలవుతుందో ?

ఇవే ఆలోచనలు .రక రకాలుగా డబ్బు సమస్యలు బుర్రని ఎలా తినేస్తాయో ? నా చేతులు యాంత్రికంగా కూరలు ,పళ్ళు ,బ్రెడ్ ,జామ్లు , పప్పులు , సర్ఫ్ పొడి ,విమ్ సోప్ ,ఇలా వేసుకుంటూ తోపుడు బండిలో కాస్మెటిక్స్ దగ్గరకి వచ్చి బ్రేక్ పడినట్టు ఆగిపోయాను ..
ఐశ్వర్యా రాయ్ ,కరిష్మా , తల్లులు అయిపోయిన స్టార్స్ ఇంకా ఎలా మెరిసి పోతున్నారో ,అంటూ ఈ ప్రాడక్ట్స్ చూపిస్తున్నారు ..
వయసు చేతితో తీసినట్టు తీసేస్తుందిట ,నిజమా ?
అనంతా ! నువ్వు ఇలా ఫూల్లా ఎప్పుడు అయిపోయావు ,ఆ ఆడ్స్ అన్ని ఫూల్స్ కి అని వాదిస్తావు కదా ,అందరితో.
 ఇందాక అద్దంలో కనిపించిన నా జిడ్డు ,అలసి పోయిన మొహం గుర్తు వచ్చి ,అక్కడ ఆగి, చేతి లోకి తీసుకుని సీసా మీద రాసి ఉన్న విషయం చదువుతున్నట్టు నటిస్తూ ,ఖరీదు ఎంతో అనుకుంటూ అటు ఇటు చూస్తున్నాను ..
హలో షాపింగ్ కేనా ? అంటూ పలకరింపు ,ఎంత సిల్లి ప్రశ్న అనుకుంటూ పక్కకి చూస్తే మా ఫ్లాట్స్ లో నే ఉండే సుమ కనిపించింది నవ్వుతూ. మీరో అన్నాను ,ఆవిడ నవ్వేసింది ..

సుమా అని పిలుస్తూ భర్త రమేష్ వచ్చి ,నమస్తే అండీ అంటూ ఒక మాట నా వేపు వేసి , ఇంక చాలు సుమా ,ఇప్పటికే బండి నిండి పోయింది , ఇంక జాగా లేదు ,ఇవన్నీ సర్దేసరికి అవుతుంది నీకేం ? అలసి పోయాను షాపింగ్ తో అంటూ కూర్చుంటావు ..
అయినా ఆ బల్ల నిండా వంద రకాల క్రీములు ,పౌడర్లు ,పాక్ లు ,ఇంకా ఏమిటి కొంటావు ? పద పద ,అని తొందర పెడుతూ ,నా వేపు ఒకసారి చూసి బండి తోస్తూ ముందుకు నడిచాడు ..
సుమ నేను నిలబడి ఉన్నాం .
నా చేతిలో ఆ వయసు తగ్గించే క్రీమ్ సీసా వైపూ  నా వైపూ  చూస్తూ , “చూసారు కదా ,ఆయన మాటలు ధోరణి ? నాకు జాబ్ లేదు కదండీ మీలాగా  అందుకని , దేనికీ స్వతంత్రం ఉండదు  మీరు నాకొక సాయం చేయాలి. ఈ క్రీమ్ చాలా బాగా పని చేస్తుందిటండీ, నా ఫ్రెండు చెప్పింది .తను వాడింది .చాలా యంగ్ గా కనిపిస్తోంది ఇప్పుడు అంటూ..గొంతు తగ్గించి వెయ్యి రూపాయలు అండీ ,నాకు తెలుసు ,మీరు నా తరఫున ఒకటి తీసుకోండి ,నేను తర్వాత మీ ఇంటికి వచ్చి ,డబ్బులిచ్చి తీసుకుంటాను  ,మగ వాళ్ళు ఇలా ఏదో అంటూ ఉంటారు ,వాళ్ళ కోసం ఐతే షేవింగ్ క్రీములు ,పెర్ఫూమ్ లు కొనుక్కోరా ? ఆక్స్ లు అవి అంటూ నవ్వింది ..
నాకూ నవ్వు వచ్చింది ,పాపం ఆ ఆడ్లో లాగా ఆడవారు వచ్చి మీద పడిపోతారు అని నిజంగా నమ్ముతారా మగ వారు ? ఎంత మూర్ఖులు ?
సుమ నా ద్రష్టి లో మోడల్ మదర్ . ఎంత బాగా చేస్తుందో వంటలు ? పుట్టిన రోజులు కేకులు అవీ నా పిల్లలకి నేను అవన్నీ సొంతంగా ఎప్పటికీ చేయలేను నాకు అంత సమయమే ఉండదు మరి ..

ఇదేమిటి ? ఇలా అడిగింది ? నేనూ ఒకటి తీసుకోనా ? కార్ట్ లో రెండు వేసాను , మెల్ల గా బట్టర్ , ఎగ్స్ తీసుకుంటూ ఒక వరస లో నిల్చున్నాను ,రమేష్ తో సుమ ఏదో వాదిస్తూ కనిపించింది , ఇప్పటికే ఈ నెల చాలా ఖర్చు అనే మాటలు గాలిలో తేలి నా వేపు వచ్చాయి ..
సుమ తల పక్కకి తిప్పుకుని ,కళ్ళు తుడుచుకున్నట్టు అనిపించిది , అయ్యో ,ఇదేమిటి ఈ క్రీమ్ ఏదో చాలా ఘర్షణకి కారణం అయినట్టుందే ..

నా బిల్లింగ్ అవుతోంది , నా ముందున్నడిస్ప్లే మీద మొత్తం ఎంత అయిందో కనిపిస్తోంది , నా గుండె గొంతు లోకి వచ్చింది ,ఎలా పెరిగి పోయాయి అన్నిటి ఖరీదులు ? ఏది మానేయడం ? పిల్లలకే లోటూ ఉండకూడదు కదా , తిండి విషయంలో పొదుపు అన్న మాటే లేదు ,వాసు కూడా ఎప్పుడూ అదే అంటాడు , పిల్లలంటే ఎంత ప్రేమ తనకి ?

ఓలే క్రీమ్ సుమ కోసం ఒక్కటి ఉంచి ,రెండోది తీసి ,పక్కన పెట్టి ,అమ్మయ్యా అని నిట్టూర్చాను ..
వెయ్యి తగ్గినా తగ్గినట్టే కదా , తన పర్సు లోంచి ఖర్చు పెడితే సుమ కి కూడా తెలిసేది ఏది అవసరమైన ఖర్చో ,ఏది కాదో !

నా చదువు కి సార్ధకత నా ఉద్యోగం అని ఒప్పించి నన్ను ప్రోత్సాహపరిచి , ఉద్యోగానికి పంపించిన వాసు మీద ఒక్కసారి ప్రేమ పొంగి పొర్లింది ..
ఇంటికి వెళ్లి ముఖం చల్ల నీళ్ళతో కడుక్కుంటే ఈ జిడ్డు పోయి ,నా మొహం ఫ్రెష్ గా అయిపోతుంది .ఏ క్రీమ్ అక్కర్లేదు నాకు అనుకుంటూ ,ఉత్సాహం గా బండి తోసుకుంటూ ,కారు వద్దకు వచ్చేసాను .
https://mail.google.com/mail/u/0/images/cleardot.gif