"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 అక్టో, 2019

కొన్ని మాటలు ఇలా ..

సీతాకోక చిలుకలు
నా చుట్టూ గుండ్రంగా
తిరుగుతూ ఒక్కో రంగూ
రాల్చేసుకున్నాయి ..
నా కలలేమో ..అవి ..

ఆకాశం లో పక్షులు
వరుసగా వరుసలు కడుతూ
తూర్పు దిక్కున
సూర్యుడికి సందేశం మోస్తూ

కిరణాలు ఆకుల మధ్య నుంచి
జారి నేల మీద ముగ్గులు పరిచి
నేలమ్మకి జేజేలు పలుకుతూ
వినమ్రంగా ..

ఆకాశం కొన్ని రంగులు
దాచుకుంది , రహస్యంగా
సాయం సంధ్య కై
పరిచి విస్మయ పరచాలని ..

తోటలో పూలు రంగు హంగుగా
వెల్లి విరిసి ..
మోహనంగా ఎదురు చూస్తూ
ఆ మధుర గాయం కోసం .

అలలు అలలు గా
ఎగిసి పడుతూ , ఎన్ని యుగాలుగా
అలసి పోయినా , తీరాలు
అందవూ , ప్రాప్తమూ పొందవు .

పసి పిల్ల నవ్వులా
ఎగిసిపడ్డ నవ్వు
ఎదిగిన బిడ్డలో
కలిసి మురిసిపోయింది ..

పన్నీరు చల్లితే
గాలి సుమధురం అవుతుందా ?
పెదవుల స్పర్శ తగలాలి కానీ
వెదురు వేణువు అవదూ ...

అన్ని మతాలూ చేర్చేవి
ఆ స్వర్గ ధామ గుమ్మం వరకే
నీకుందా మరి ఆ తాళం చెవి
వెతుక్కో ఇప్పుడే !

జీవన  దారి లో పారేసుకున్న
సంపదలు మణి మాణిక్యాలూ
దొరికేను ఆ తోట లో .
నీ మనసు పూసే ఆ తోటలో ..

మైమరిపించే కోకిల గానం
వినిపించే తోట లోకి వచ్చావా ?
నువ్వేం తెచ్చావు ?
సవిరించుకున్న నీ గుండెని తెచ్చావా ?

వెను వెంటనే
వెను తిరిగి పారిపోయే నీ
పీడ కలని ఈ రేవులో పాతేయ్
ఇక్కడ ఈ పాపాల రేవులో .. మరి మొలవదు .

దయ్యమూ దేవుడూ
కలిసి నివసించే ఆ అంతకరణలో
ఎన్నెన్ని గులాబీలూ ,ఎన్ని ముళ్ళూ ..
అన్నీ ఒక్క చెట్టుకే ..

30 సెప్టెం, 2019

ఇవాళ్టి కబుర్లు ఇవి

ఏవో కొన్ని మాటలు..ఇలా..

ఎన్నాళ్ళయిందో
కలుసుకుని అంటూ
హోరున ఒకటే కబుర్లు
సముద్రం , మబ్బులు..

సూర్యుడిని కప్పేస్తూ
మబ్బు నాదెంత భాగ్యమో
అంటూ మురిసింది
కడ్డీ అంచు వెండి జరీ చూసుకుని.

వాన జలతారు కుప్పలు
ఏరుకుందామని , పాపాయి
పరికిణీ అంచులు ఎత్తి పట్టింది
అమ్మ  కేకలేస్తూ తిట్టింది ..
ఇంతలోనే తానూ పాపగా కలిసింది.

వాన రాక కై చెట్లు
మూగగా ఎన్నాళ్ళు
ప్రార్ధించాయో కానీ
గలగలా నీటి బొట్లు
అర్ఘ్యం ఇచ్చాయి ..

మా ఇంటి ముందు
బాదం చెట్లు
ఆకాశానికి మెట్లు
వేస్తున్నాయి.

సన్నజాజి సంపెంగ
హాస్యాలు ఆడుకున్నాయిట
నువ్వెంత నాజూకు అంటే
నువ్వెంత ఘాటు అంటూ ..

ఇవాళ్టి కబుర్లు ఇవి.

వైజాగ్
30 09 2019 .

29 జులై, 2019

అద్దె ఇల్లు ఖాళీ చేసారు



విరిగిన కుర్చీ చేయి  ఒక్క మేకు
మటుకు వేలాడుతూ ఒకప్పటి
మోచేతి ఆసరా అని ఘోషిస్తూ ,ఒక మూల ..

ఎంత దుమ్ము ఎత్తి పోసిందో
ఊడిపోయిన పుల్లలతో
కట్టు ఊడిపోయి , నీరసంగా మూలుగుతూ ఒక మూల ..

గోడ మీద మోసిన ఏసు క్రీస్తో ,శంకర మహాదేవుడో
పటాన్ని , నలుపలకల తెల్లని ఖాళీ పైన ఒక మేకు
దేవుళ్ళూ ఇల్లు ఖాళీ చేస్తున్నారు .

పిల్లల అడుగుజాడలు దుమ్ములో
పికాసో చిత్రం లాగా గజిబిజిగా , కొత్త ఇంటి ఉత్సాహం తో
పిల్లల అరుపులు ఖాళీ గోడలకి కొట్టుకుని , వాయిద్యం లేని శివమణి

అంతా హేల గోల , ఉత్సాహపు కోలాహల వేళ
అమ్మా నాన్నల ఆట కి మరో కొత్త నెలవు దొరికింది
కూలీల అలసట వెనక కూడబెట్టిన సామాన్ల సాంద్రత

ఏ గృహమేగినా ఏముంది ?
చివరాఖరి గృహంకి వీడ్కోలు తప్పదు కదా !
నువ్వెంత మోసుకు వెళతావో అని తమాషాగా చూస్తున్నా ,తమాషా !

16 జూన్, 2019

వాన వచ్చే ముందు..



నీలాకాశం మాయం అవుతుంది
ఎక్కడినుంచో వచ్చిన  నీటి మబ్బులు
నీలి రంగుని పీల్చి
దట్టమైన మబ్బు రంగులోకి
మారుస్తాయి
పల్చటి నీలి రంగు ప్రమేయమేమీ లేదు
పింజెలు గా తిరగాడిన మేఘాలూ
మరి మాయమయ్యాయి నిన్నటిలోకి
అప్రమేయ ఆనందమా ?
అంతు పట్టని ధుఖమా ?

వాన వచ్చే ముందు
పట్టే మబ్బులకేం తెలుసు
తను రాల్చే నీటి ధారలు
ఏ రైతు కంటి కన్నీరు కారణమో
ఏ పసిపిల్ల కేరింతలకో
ఏ నవ వధూవరుల ముసిముసి నవ్వులకో
ఏ గృహిణి పరుగులో ,
ఏ మనిషి అంతరంగం ఆల్చిప్ప లో
మేలిమి ముత్యమో ? ఆ చినుకు ప్రయాణం
ఎవరికి ఎరుక ?

వాన వచ్చే ముందు
పట్టిన ముసురు ఒక్క గాలి దుమారం
ముందు వీగిపోవచ్చు
నిన్నటి వాగ్విదాం ,ఇవాళ్టి చిరు పలకరింపుతో
కొట్టుకుపోయినట్టు
వాన ఎక్కడ ఎలా కురుస్తుందో
ఎందుకో ఎవరికీ అర్ధం కాని ఒక పెద్ద మిస్టరీ
కన్నీరు ఆడవారికే ఎందుకు ? అన్నది కూడా

చెట్లూ వాగులూ  పిపీలకాదులూ
ప్రార్ధిస్తాయా ? వాన కోసం
ఏమో పూలు పూయించి
చిరు కెరటాలు కదిలించి
అటు ఇటూ కదిలే అతి చిన్న ప్రాణులు
ఏ కార్యాచరణమైనా పూజే కదా
త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరించే కార్యం ఏదైనా

వానలు అందుకే అడగని వరాలు
మనం కోరితే వచ్చాయని మురిసిపోకు
మనం ఏం వ్రతాలు ఆచరించామని ?
వాన వచ్చే ముందు
మబ్బు కీ తెలియదు ,ఏ ప్రాంతం ఏ భాష ? అని
వాన వచ్చే ముందు ..
మబ్బులు మబ్బులు మబ్బులు
గుంపులు గానే వస్తాయి .
చినుకు చినుకు చినుకు్లుగా
విడిపోతాయి ,
మానవ సమూహం లో వ్యక్తి ప్రతీకలా
వాన వచ్చే ముందు
నువ్వు నువ్వు గా ఎదురు రా !
వాన వచ్చే ముందు ..
నువ్వు నువ్వుగా తడిసి ముద్దై పోడానికి తయారుకా
కన్నీరు అంతా బయటకి ఒంపేస్తే
ఆఖరున మిగిలేది తడి కనుల ప్రశాంతత
ఆ అనుభవం మటుకు నీకు నీవు ఎప్పుడూ
దూరం చేసుకోకు ..

వాన వచ్చే ముందు
నువ్వు ఏం చేస్తున్నావు ?
సమాయత్తం అవుతున్నావా ??
వాన వచ్చే సూచనలు వస్తున్నాయి మరి .

వసంత లక్ష్మి .

7 ఏప్రి, 2019

దేవుడి రూపం



తూరుపు గాలి
ఏం చెప్పిందో మరి
పడమటకి తిరిగి
వెళ్లవలసిన చెమ్మగాలి
వెనుతిరిగి ముచ్చట్లు
ఆడింది  భూమితో
తొలకర్లు ..

చిగుళ్లు వేసేందుకు
సమాయత్తం అయిన ఎండు
కొమ్మలు ,బిత్తరపోయి
తటాలున  పూలుగా
మార్చేసాయి , ఆకులనే.
రంగు హంగుల
అలంకరణ ఏ విభుడి కోసమో..

చినుకు చినుకు
చెప్పే చిటుకు చిటుకు
కబుర్ల కోసమే మోడులు
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని
ఆకాశం వైపు ప్రార్ధిస్తూ
ఆకులు అల్లాడిస్తాయి
పూల విందు లంచం
అర్పించుకుంటామంటూ ..

వసంతం కేమంత  తొందర
ఆగి ఆగి నెమరు వేసుకుంటూ
నిరుడి ఆగమన సవ్వడి
ఏమేమి కొత్త కబుర్లు
ఏమిటో ఈ తోట , ఈ త్రోవ
మునుపు నడిచిన జాడలేవి
అంత హెళ్ళు పళ్ళు కాయలు
ఇచ్చిన ఆ చెట్ల రూపేనా
అంటూ విసవిసలాడుతూ
పేదరాలి గుమ్మం తొక్కే
ఐశ్వర్యంలా ధగధగలాడుతూ
అడుగు పెట్టింది , విలాసంగా.

వసంతం ప్రతి ఏడూ
రాక తప్పదని తెలిసినా
ఆ తోట ప్రార్థనలు ఆపదు
రిక్త హస్తాలతో
చేసేది ఏముంది ప్రార్ధనే కదా,
నిండుగా బరువుతో
కిందకి ఒంగినప్పుడు ఖాళీ
ఎక్కడ చేతికి , జోడించేందుకు ..
అర్ధం చేసుకుంటాడు కనుకనే
దేవుడయ్యాడు.

తోట తోట కు
దేవుడి రూపం వేరే అనే
తలుస్తుంది , జామ చెట్టు
కొలిచే దేవుడు పెద్ద జామ ఆకారమే
అరటి కొబ్బరి సపోటా
రూపాలు రంగులు వేరు వేరు కాదా
వసంతం ఏ రూపంలో ఉంటుంది
ఎవరి ఊహకి వారే కర్తలు
తన ధర్మం తాను తప్పదు
అదే ప్రకృతి ధర్మం.

ఇదే దేవుడి రూపం .

07 14 2019
కువైట్

4 ఏప్రి, 2019

ఈ పాట..నా నోట..



పాట ఒక హృదయాన్ని
మీటే వరకూ ఉత్త లల్లాయి పదమే
పాట ఎన్ని ఊళ్ళు దాటినా
అలసిపోదు ఎందుకో !!

కోయిల కంఠంకి ఎవరు తేనె అద్దారు ?
హంస కి ఠీవి, నెమలి కి నాట్యం
నేర్పినవారు , నా కేమి నేర్పించారో
అని రోజూ వెతుకులాటే !!

సంగీతం అంటే నాకు
పగళ్ళు రాత్రుళ్ళు గా మారడమే
ఆకాశం నలుపు రంగు పూసుకునే
ప్రతీ నిముషమూ ఓ స్వర రాగమే !!
వెన్నెల కురిపించే ప్రతీ రాత్రీ
జుగల్బందీ నా కళ్ళ ముందు !!

నీ చుట్టూ చేరి మోగే
అనవసర మోతలు ఒక్కసారి కట్టేయ్
నిశ్శబ్దంలో అలా తపస్సు చేస్తే
నీకు నీ పాట వినిపిస్తుంది .

సంగీతానికీ ,శబ్దానికీ
మృత్యువు లేదు ,కొండలు పాడే
మౌన రాగం ఎన్ని శతాబ్దాలు అయినా
ఒకటే తాళం వేస్తూ నిలబడి ఉంటుంది .

ఆకులు పాడే రాగ మధురిమలు
అమ్మ చెట్టుకి ఎంత ఇష్టమో
కదలక ,మెదలక ,స్థాణువుగా
వింటూ పూలను రాలుస్తూ ఉంటుంది  ...

వసంత లక్ష్మి
04 - 04 - 2017 .
కువైట్

31 మార్చి, 2019

అమ్మదనం



వంటింట్లో గట్టు మీద
కుదురుగా చట్టు మీద
సద్దుకుని కూర్చున్న
మట్టి కుండ అమ్మ ..

దాహం వేసినప్పుడు
గ్లాసు ముంచుకుని
నీళ్లు తాగడమే తెలుసు..
ఎప్పుడూ నిండుగా నీళ్లు
నింపి ఎలా ఉంటాయి
అని ఆలోచన లేని పిల్లలం మనం.

ఆకులతో గుబురుగా
నిండిన చెట్టు పై వచ్చి వాలే
వలస పక్షులం మనం ..
పట్టణాలు , దేశాలు వలస
వెళ్లిన వాళ్ళం..
ఆకు రాలు కాలం ఒకటి
ఉంటుందని చెట్టుకి
తెలిసినా తెలియనట్టు
చరించే పిల్లలం మనం..
అమ్మ ఎప్పుడూ నిండుగా
గల గల లాడుతూ ఉంటుంది
అని భ్రమిసే అమాయకులం మనం.

నది కూడా అంతే..
నీళ్లు ప్రవహిస్తున్నంత కాలం
పరవళ్లు తొక్కుతూ ఆడుకుంటాం
పాడుకుంటాం ఒడ్డునే ..
నది ఒట్టి పోయిన రోజునే
వలస వెళ్లిపోతాం..
ఆకుపచ్చని తోటలు
వెతుక్కుంటూ ..

పిల్లలమే కదా మన పిల్లలే కదా
అని ఎంత కాలం ఓర్చుకుంటుంది అమ్మ..
చూస్తూ ఉందాం..
చూస్తూ ఉంటుంది అమ్మ..

31 03 2018
వసంత లక్ష్మి
కువైట్.

27 మార్చి, 2019

మరి కొన్ని మాటలు.

అన్నీపూల మొక్కలే
కాదు ,ముళ్ళ మొక్కలూ ఉన్నాయి
నీకు తెలియదూ ,నీ మనసు !!

నాజూకు తీగెకి
పందిరి కట్టావు
మనసు నేల అలా !! 

చంద్ర కాంతలకి తెలుసు
సూర్య కాంతాలాకీ తెలుసు
వేళా పాళా .. మనసే !!

కొత్త మొలకలు
లేచాయి , ఎవరు వేసిన విత్తులో
మనసు తడిగా ఉంచు ఎప్పుడూ !!

నింగీ నేలా ఊసులు
విన్నావు , ఎదురుగా
మరో మనిషి  ??

జాజి పందిరి రాల్చింది
నాలుగు జాజులు నేల తల్లికి
మరి నువ్వో ?!

సముద్రంలో కెరటాలు
చేరేది ఈ తీరమే అని నమ్మకు
మనిషి మనిషి ఎన్ని తీరులో !!

నిన్నటి ఆవేశం లో రాసినవే ..
ఇవాళటికి దాచాను ..
వసంత లక్ష్మి
కువైట్
27 - 03 - 2017 .

26 మార్చి, 2019

హైకూలు..

మొగ్గలు ఏమని
ప్రార్ధించాయో
పూలు గా వికసించడానికి..

గాలి ఏ ఊరులో
పుట్టిందో
మరిచిపోతూనే ఉంటుంది..

వెన్నెల చల్లగా
ఉండాలని ఎవరు
దీవించారో..

గజిబిజిగా
ఎవరో అక్షరాలు చల్లారు
ఆకాశం పలక పై.

చాలా దూరమే
ప్రయాణం చేసాం అనుకుని
నెమ్మదించాయి యేటి అలలు.

పూలు తొడిగిన చెట్టు
ఎంత వందనంగా ఉందో
రేపటికి రాలిపోతాయని తెలుసు..

చమేలి పూలు మల్లెల తో
పోటీ పడవు..
వాటి కి ఋతువు లతో పని లేదు.

చామంతి బంతి
పలకరించుకునే ఉంటాయి
హేమంతం లో..

సముద్రం ఒడ్డున
నేను లోతు
కొలుచుకుంటూ..

సంతోషం గాలిలో
ప్రయాణిస్తే
నీకూ అందుతుంది.

హమేషా నవ్వుతూ
ఉండాలని
తమాషాగా పూలు చెప్పాయి.

రైలు పట్టాల పై
ప్రయాణం
నేనా నువ్వా..చెట్టు పుట్టా..

వసంతలక్ష్మి  పి
కువైట్
ఇవాళ ఇలా అనిపించింది..

కొన్ని ఊసులు ..ఇవాళ.



సముద్రం ఇవాళ
కొత్త కథలు చెప్పాలని
నిర్ణయించుకుంది..
నెల బాలుడు వింటాడని..

ప్రపంచం మూలమూల లా
వసంతోత్సవం జరుపుకుంది
పూలు పూల భాషలో
మెత్తగా కబుర్లు పంపించుకుని
వికాశమేనా అని కుశలాలు
కనుక్కున్నాయి.

నది నిమ్మళంగా
గుప్పెడు గుప్పెడు పూలని
చెట్టు నుంచి రాలిన పూలని
ఏ దేవుడి మొక్కు తీర్చడానికో
మోసుకు వెళుతోంది  భక్తిగా..

ముళ్ల శిలువలు మోసే మొక్కలనీ
ఒదలదు వసంతం ,
చింపిరి బట్టల్లో పాప మోమున
విరిసిన నవ్వులా స్వచ్ఛంగా
మొలుస్తుంది.. పచ్చని పూవు..

తీరాలు రెండూ
ఎప్పటికీ కలుసుకోవు
అయినా ఈ తీరం కి ఆ తీరం
బంధువే..ఊసులు మోసే
పోస్ట్ మాన్ నదీ జలాలే..

2..మరి కొన్ని కబుర్లు..ఇవాళే..

ఋతువులు ఎలా
కబుర్లు పంపుకుంటాయో
వసంతం నెమ్మదించగానే
ధగధగమని ఎండ వెండి లా
మెరుస్తూ ,ఆకాశానికి తంతి
పంపిస్తుంది , మబ్బుల కొండలు
నింపుకొండి జలధారలుతో అని..

వర్షం హర్షాలు నింపుతూ
ధారలుగా కురుస్తుంది
నదీ నదాల అప్పు తీరుస్తూ
మట్టి తడిగా కోటి కోరికల
విత్తుల మొక్కులు
తీరుస్తుంది మొక్కలై.

ఆకు రాలు కాలం తప్పదని
మొక్క చెట్టు అయే క్రమం లోనే
తెలిసినా తన ధర్మం తప్పదు..
ఆకులు రాల్చి విరాగిని లాగా
తన వంతు మోక్షం కోసం
నిరీక్షిస్తుంది తపస్సు చేస్తూ..

గాలిలో తేమ కూడా గడ్డ కట్టే
హిమవంతుని కాలం ఇంతలో
నా వంతు ఇప్పుడు అంటూ
వజవజ వణికిస్తూ..
కాలాలు ముందే అనుకుని
పుట్టిన తోబొట్టువులు ఏమో..

కాలం , గమనం  అనే తల్లి తండ్రులకి.
అవును..అంతే నేమో..
అనంత కాల ప్రవాహం లో
ఎన్నెన్ని ఋతుచక్రాలు..ఎన్నెన్ని
సుఖదుఃఖాలు..
ఎన్నెన్ని కలలు వాస్తవాలు..
ఎన్నెన్ని యుద్దాలు ..మధ్యలో శాంతి కాలాలు..
అంతా కాలం చేసే భ్రమలు.

కాలం మహా మాయా జాలం..

వసంత లక్ష్మి
26 03 2018
కువైట్.

మాటల మూటలు..మరికొన్ని.



కొత్తగా కొనుక్కున్న
డ్రెస్ ఒక్క ఉతుక్కే
వెలిసిపోయినా
చున్నీ రంగుగా మెరుస్తున్నట్టు
పెళ్లి అయిన నూతన వధువు కి
అత్తగారింట్లో ఆరళ్ళు
బాధ పెడుతున్నా
కోరుకున్న వాడి చేతి అండ
ఎంత మురిపెం..

సొంత ఊరి మీద నుంచి
వీచే గాలి లో ఏదో గమ్మత్తు ఉంది
నన్ను ఇంకా చిన్న పిల్లలాగే
గుర్తించి పలకరిస్తుంది..
ఆ వీధి చివరే కదా కొంటె పిల్లాడు
పేరు పెట్టి పిలిచాడు..నా పేరు పెట్టి..
అంత దాకా తెలియనే తెలియదు
నా పేరు లో అంత సంగీతం ఉందని..

దాహం వేసినప్పుడు
చాద తో తోడుకునే
బావి నీళ్లు సాక్షిగా
నేను తోడి పోసుకునే
ఈ యాదులు ఎంత తీయనో..

చదువుకుంటే చాలు
ఈ పరీక్షలు గట్టెక్కితే చాలు
పెద్ద వాళ్ళం అయిపోతాం అని
ఎవరు చెప్పారో..కానీ..
ఎంత పెద్ద అవుతే అన్ని పెద్ద
పరీక్షలు , ప్రశ్నలే కానీ జవాబులు
లేని పరీక్షలు అని ఎవరూ ఎందుకు
చెప్పలేదు..నాకు.

పిల్లలు పుడితే తల్లి తండ్రి
అయిపోతాం అనుకునే అమాయకత్వం
అమ్మా నువ్వు చెప్పిన లెక్క కి ఇది కాదు
జవాబు అని కొడుకు సరి దిద్దినప్పుడే
తెలిసినా , రెక్కలు బాగా విదిలించుకుని
ఎగిరినప్పుడు తెలిసింది నేను ఇంకా
ఒకరికి కూతురినే అని..అమ్మని ఇంకా కాలేదు అని..

జీవితం ఎప్పుడూ నేర్చుకో అంటుంది
కాళ్ల ముందు అగధాలు తవ్వి
దారిలో ఎత్తుగా గోడలు కట్టి
చిన్నప్పుడు ఆడుకున్న తొక్కుడు బిళ్ళ
ఆటల అనుభవం గుర్తు ఉంది కదూ..

బాల్యం ఎప్పటికీ తరగని
ఐసు పుల్ల ..పుల్ల అప్పుడే
తగిలిందా..అయ్యో..ఐస్
రుచి గుర్తు తెచ్చుకుని నెమరువేసుకో
మరో మార్గమే లేదు..
పుల్ల పట్టుకో చేతిలో ..
అదే నీకు దొరికిన జీవితం రేస్లో ప్రయజ్..
అదే నీకు మిగిలే విలువైన కానుక..

జీవితం ఇచ్చేది పుచ్చుకో
ఎక్కువగా అడగక పోయినా
దేవుడి గుడిలో లైను లో
నిలిచుంటే నీకు దొరికే
ప్రసాదం లాగా..జీవితం నీకూ
ఏదో ఇస్తుంది..చాచిన చేతిలో
ఏదో తాయిలం పెడుతుంది.
జీవితం ..ఎంత దయగా ఇస్తుంది..

జీవితానికి  నువ్వు కూడా
ఏదైనా ఇవ్వు మరి..అప్పుడప్పుడు..
ఎప్పుడైనా..అప్పుడప్పుడు అయినా..

వసంత లక్ష్మి
కువైట్
26 03 2018.

26 ఫిబ్ర, 2019

రంగు రంగులు



తెలుపా నలుపా
అంటూ రెండు
రంగులు చూపిస్తే
దిక్కులు చూస్తాను నేను

ఏవీ వాటి మధ్య
ఇంద్ర ధనుస్సుల రంగులు
పాపాయి నవ్వులు
పూలల్లో చిందులు

ఆకుల మధ్య
జల్లిడ పట్టిన
వెలుతురు కళ్ళాపులు
పచ్చదనం పురుడు
పోసుకోడానికి తహ తహ లాడుతున్న
భూమి  నెర్రల రంగులు

ఆ కొండల పై
ఆర బోసిన తుది కిరణం
సాక్షిగా చీకటి నలుపు
ఉదయపు తెలుపుకి
తలుపు అని తలుస్తాను .

సముద్రానికి రంగే లేదని
ఆ నింగి దయగా ఒంపిన
రంగే తనది చేసుకుంటుందని
రంగుల ఉనికి , ఆ క్షణానికి
అరువు ఇచ్చిన కోక అని
తెలుసా మరి సముద్రానికి .

ఒక్క రంగు సొంతం
చేసుకుని మిగిలిన రంగులని
ఒంపుకుంటానా ?
ఎప్పటికప్పుడు ఆ కాలానికి
తోచిన, నప్పిన రంగులు
నింపుకునే ప్రకృతే నాకూ ఆదర్శం .

తెలుపా నలుపా
అని నన్ను ఇబ్బంది పెట్టకండి మరి
ఎన్నడూ !

వసంత లక్ష్మి
కువైట్
26- 02 - 2016 .
చెట్టు కవిత్వం

చెట్టు కవిత్వం చెపుతూ ఉంటే విన్నాను
గల గల మని ఆకులూపుతూ
కల కల మని పక్షుల పాటల మోస్తూ
చెరిగి ఎండని జల్లుతూ ,
ముక్కలుముక్కలు గా ఆకాశంను
కత్తిరిస్తూ అచ్చం నా వచనా కవిత్వమల్లె

జల నాడిని పీలుస్తూ
జీవ నాడిని అందిస్తూ
పూలూ ,ఫలాలూ మోస్తూ
గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుని
నిటారుగా నిరంతరం
విను వీధితో కబుర్లాడుతూ
చెట్టు కవిత్వం చెపుతూ ఉంటే విన్నాను .

వాన చినుకునే ప్రేమిస్తుంది
విరహ వేదన అనుభవిస్తుంది
మబ్బు పట్టిన ఆకాశం
చూసి నిండు హర్షం ప్రకటిస్తుంది .
చినుకు చినుకు అందుకుని
ఇంకా తనివి తీరలేదు అని
తటపటాయిస్తుంది , చిరు గాలి
స్పర్శకే తాను చినుకై నర్తిస్తుంది ,
పదం పదం చిందులేసిన పద్యమే
గుర్తు వస్తుంది ..
చెట్టు కవిత్వం చెపుతూ ఉంటే విన్నాను .

నీడ దండిగా అల్లుతుంది
గొడుగు తానై అడ్డుతుంది
సేద తీర్చి కొంటె ఊసులు
చెవిలో అల్లరల్లరిగా ఊదుతుంది ..
ఆటవెలదో మరేదో పద్యమొకటి
నిండుగా నింపి సాగనంపుతుంది ,
చెట్టు కవిత్వం చెపుతూ ఉంటే విన్నాను .
చెట్టు కవిత్వం చెపుతూ ఈ మాట కూడా
చెప్పింది ..నాలుగు ఆకులు పుట్టించలేని
నీ కవిత్వం ఒక బీడు భూమి అని ..
చెట్టు కవిత్వం చెపుతూ ఉంటే విన్నాను
అవును విన్నాను .నేను .

వసంత లక్ష్మి
11 - 12 - 15 .
విశాఖ పట్నం .. మా ఇంట్లో ..

ఇవాళ్టి వాతావరణం ..

ఇవాళ్టి వాతావరణం ..

నిన్నటి నీలి రంగుని
తూచ్ అంటూ వెనక్కి తీసేసుకుంది ఆకాశం ..
పచ్చి కొట్టిన నేస్తం నుండి రంగు పెంసిలు
వెనక్కి లాకున్నట్టు ..
ఏవో పాత జ్ఞాపకాలు బాధిస్తున్నాయేమో
దిగులుగా మబ్బు రంగు కప్పుకుంది ఆకాశం
నీ దిగులు నాది కాదా అంటూ
సముద్రం కూడా పలచగా ధుఖ ముసుగు
ధరించి ,ప్రశాంతంగా తోడు నిలిచింది నింగికి

వాన ఏవో ముచ్చట్లు చెపుతోంది తీరికగా ..
ఎన్నాళ్ళయిందో కదా ..మనం కలిసి అని
తూర్పు దిక్కువో మరి ఉత్తరం దిక్కువో కథలు
వైనాలుగా వివరిస్తూ ,తమాషాగా చేతులు చాస్తోంది .
ఈ నింగి నేలా ముచ్చట్లు ఎప్పటికి తీరేను ?
అని సూర్య కాంతిని తలుచుకుంటూ
సంధ్య మేలి ముసుగు సవిరించుకుంటోంది ..

ప్రకృతి అంతా సమతుల్యంగా ..
ఆశావహంగా , నిర్మలంగా , నిస్సంకోచంగా ..
ఎంత బాగుందో ? మనం కూడా ......అలా ఉంటే ???

వసంత లక్ష్మి
03 - 11 -15
కువైట్