"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

31 మార్చి, 2019

అమ్మదనం



వంటింట్లో గట్టు మీద
కుదురుగా చట్టు మీద
సద్దుకుని కూర్చున్న
మట్టి కుండ అమ్మ ..

దాహం వేసినప్పుడు
గ్లాసు ముంచుకుని
నీళ్లు తాగడమే తెలుసు..
ఎప్పుడూ నిండుగా నీళ్లు
నింపి ఎలా ఉంటాయి
అని ఆలోచన లేని పిల్లలం మనం.

ఆకులతో గుబురుగా
నిండిన చెట్టు పై వచ్చి వాలే
వలస పక్షులం మనం ..
పట్టణాలు , దేశాలు వలస
వెళ్లిన వాళ్ళం..
ఆకు రాలు కాలం ఒకటి
ఉంటుందని చెట్టుకి
తెలిసినా తెలియనట్టు
చరించే పిల్లలం మనం..
అమ్మ ఎప్పుడూ నిండుగా
గల గల లాడుతూ ఉంటుంది
అని భ్రమిసే అమాయకులం మనం.

నది కూడా అంతే..
నీళ్లు ప్రవహిస్తున్నంత కాలం
పరవళ్లు తొక్కుతూ ఆడుకుంటాం
పాడుకుంటాం ఒడ్డునే ..
నది ఒట్టి పోయిన రోజునే
వలస వెళ్లిపోతాం..
ఆకుపచ్చని తోటలు
వెతుక్కుంటూ ..

పిల్లలమే కదా మన పిల్లలే కదా
అని ఎంత కాలం ఓర్చుకుంటుంది అమ్మ..
చూస్తూ ఉందాం..
చూస్తూ ఉంటుంది అమ్మ..

31 03 2018
వసంత లక్ష్మి
కువైట్.

27 మార్చి, 2019

మరి కొన్ని మాటలు.

అన్నీపూల మొక్కలే
కాదు ,ముళ్ళ మొక్కలూ ఉన్నాయి
నీకు తెలియదూ ,నీ మనసు !!

నాజూకు తీగెకి
పందిరి కట్టావు
మనసు నేల అలా !! 

చంద్ర కాంతలకి తెలుసు
సూర్య కాంతాలాకీ తెలుసు
వేళా పాళా .. మనసే !!

కొత్త మొలకలు
లేచాయి , ఎవరు వేసిన విత్తులో
మనసు తడిగా ఉంచు ఎప్పుడూ !!

నింగీ నేలా ఊసులు
విన్నావు , ఎదురుగా
మరో మనిషి  ??

జాజి పందిరి రాల్చింది
నాలుగు జాజులు నేల తల్లికి
మరి నువ్వో ?!

సముద్రంలో కెరటాలు
చేరేది ఈ తీరమే అని నమ్మకు
మనిషి మనిషి ఎన్ని తీరులో !!

నిన్నటి ఆవేశం లో రాసినవే ..
ఇవాళటికి దాచాను ..
వసంత లక్ష్మి
కువైట్
27 - 03 - 2017 .

26 మార్చి, 2019

హైకూలు..

మొగ్గలు ఏమని
ప్రార్ధించాయో
పూలు గా వికసించడానికి..

గాలి ఏ ఊరులో
పుట్టిందో
మరిచిపోతూనే ఉంటుంది..

వెన్నెల చల్లగా
ఉండాలని ఎవరు
దీవించారో..

గజిబిజిగా
ఎవరో అక్షరాలు చల్లారు
ఆకాశం పలక పై.

చాలా దూరమే
ప్రయాణం చేసాం అనుకుని
నెమ్మదించాయి యేటి అలలు.

పూలు తొడిగిన చెట్టు
ఎంత వందనంగా ఉందో
రేపటికి రాలిపోతాయని తెలుసు..

చమేలి పూలు మల్లెల తో
పోటీ పడవు..
వాటి కి ఋతువు లతో పని లేదు.

చామంతి బంతి
పలకరించుకునే ఉంటాయి
హేమంతం లో..

సముద్రం ఒడ్డున
నేను లోతు
కొలుచుకుంటూ..

సంతోషం గాలిలో
ప్రయాణిస్తే
నీకూ అందుతుంది.

హమేషా నవ్వుతూ
ఉండాలని
తమాషాగా పూలు చెప్పాయి.

రైలు పట్టాల పై
ప్రయాణం
నేనా నువ్వా..చెట్టు పుట్టా..

వసంతలక్ష్మి  పి
కువైట్
ఇవాళ ఇలా అనిపించింది..

కొన్ని ఊసులు ..ఇవాళ.



సముద్రం ఇవాళ
కొత్త కథలు చెప్పాలని
నిర్ణయించుకుంది..
నెల బాలుడు వింటాడని..

ప్రపంచం మూలమూల లా
వసంతోత్సవం జరుపుకుంది
పూలు పూల భాషలో
మెత్తగా కబుర్లు పంపించుకుని
వికాశమేనా అని కుశలాలు
కనుక్కున్నాయి.

నది నిమ్మళంగా
గుప్పెడు గుప్పెడు పూలని
చెట్టు నుంచి రాలిన పూలని
ఏ దేవుడి మొక్కు తీర్చడానికో
మోసుకు వెళుతోంది  భక్తిగా..

ముళ్ల శిలువలు మోసే మొక్కలనీ
ఒదలదు వసంతం ,
చింపిరి బట్టల్లో పాప మోమున
విరిసిన నవ్వులా స్వచ్ఛంగా
మొలుస్తుంది.. పచ్చని పూవు..

తీరాలు రెండూ
ఎప్పటికీ కలుసుకోవు
అయినా ఈ తీరం కి ఆ తీరం
బంధువే..ఊసులు మోసే
పోస్ట్ మాన్ నదీ జలాలే..

2..మరి కొన్ని కబుర్లు..ఇవాళే..

ఋతువులు ఎలా
కబుర్లు పంపుకుంటాయో
వసంతం నెమ్మదించగానే
ధగధగమని ఎండ వెండి లా
మెరుస్తూ ,ఆకాశానికి తంతి
పంపిస్తుంది , మబ్బుల కొండలు
నింపుకొండి జలధారలుతో అని..

వర్షం హర్షాలు నింపుతూ
ధారలుగా కురుస్తుంది
నదీ నదాల అప్పు తీరుస్తూ
మట్టి తడిగా కోటి కోరికల
విత్తుల మొక్కులు
తీరుస్తుంది మొక్కలై.

ఆకు రాలు కాలం తప్పదని
మొక్క చెట్టు అయే క్రమం లోనే
తెలిసినా తన ధర్మం తప్పదు..
ఆకులు రాల్చి విరాగిని లాగా
తన వంతు మోక్షం కోసం
నిరీక్షిస్తుంది తపస్సు చేస్తూ..

గాలిలో తేమ కూడా గడ్డ కట్టే
హిమవంతుని కాలం ఇంతలో
నా వంతు ఇప్పుడు అంటూ
వజవజ వణికిస్తూ..
కాలాలు ముందే అనుకుని
పుట్టిన తోబొట్టువులు ఏమో..

కాలం , గమనం  అనే తల్లి తండ్రులకి.
అవును..అంతే నేమో..
అనంత కాల ప్రవాహం లో
ఎన్నెన్ని ఋతుచక్రాలు..ఎన్నెన్ని
సుఖదుఃఖాలు..
ఎన్నెన్ని కలలు వాస్తవాలు..
ఎన్నెన్ని యుద్దాలు ..మధ్యలో శాంతి కాలాలు..
అంతా కాలం చేసే భ్రమలు.

కాలం మహా మాయా జాలం..

వసంత లక్ష్మి
26 03 2018
కువైట్.

మాటల మూటలు..మరికొన్ని.



కొత్తగా కొనుక్కున్న
డ్రెస్ ఒక్క ఉతుక్కే
వెలిసిపోయినా
చున్నీ రంగుగా మెరుస్తున్నట్టు
పెళ్లి అయిన నూతన వధువు కి
అత్తగారింట్లో ఆరళ్ళు
బాధ పెడుతున్నా
కోరుకున్న వాడి చేతి అండ
ఎంత మురిపెం..

సొంత ఊరి మీద నుంచి
వీచే గాలి లో ఏదో గమ్మత్తు ఉంది
నన్ను ఇంకా చిన్న పిల్లలాగే
గుర్తించి పలకరిస్తుంది..
ఆ వీధి చివరే కదా కొంటె పిల్లాడు
పేరు పెట్టి పిలిచాడు..నా పేరు పెట్టి..
అంత దాకా తెలియనే తెలియదు
నా పేరు లో అంత సంగీతం ఉందని..

దాహం వేసినప్పుడు
చాద తో తోడుకునే
బావి నీళ్లు సాక్షిగా
నేను తోడి పోసుకునే
ఈ యాదులు ఎంత తీయనో..

చదువుకుంటే చాలు
ఈ పరీక్షలు గట్టెక్కితే చాలు
పెద్ద వాళ్ళం అయిపోతాం అని
ఎవరు చెప్పారో..కానీ..
ఎంత పెద్ద అవుతే అన్ని పెద్ద
పరీక్షలు , ప్రశ్నలే కానీ జవాబులు
లేని పరీక్షలు అని ఎవరూ ఎందుకు
చెప్పలేదు..నాకు.

పిల్లలు పుడితే తల్లి తండ్రి
అయిపోతాం అనుకునే అమాయకత్వం
అమ్మా నువ్వు చెప్పిన లెక్క కి ఇది కాదు
జవాబు అని కొడుకు సరి దిద్దినప్పుడే
తెలిసినా , రెక్కలు బాగా విదిలించుకుని
ఎగిరినప్పుడు తెలిసింది నేను ఇంకా
ఒకరికి కూతురినే అని..అమ్మని ఇంకా కాలేదు అని..

జీవితం ఎప్పుడూ నేర్చుకో అంటుంది
కాళ్ల ముందు అగధాలు తవ్వి
దారిలో ఎత్తుగా గోడలు కట్టి
చిన్నప్పుడు ఆడుకున్న తొక్కుడు బిళ్ళ
ఆటల అనుభవం గుర్తు ఉంది కదూ..

బాల్యం ఎప్పటికీ తరగని
ఐసు పుల్ల ..పుల్ల అప్పుడే
తగిలిందా..అయ్యో..ఐస్
రుచి గుర్తు తెచ్చుకుని నెమరువేసుకో
మరో మార్గమే లేదు..
పుల్ల పట్టుకో చేతిలో ..
అదే నీకు దొరికిన జీవితం రేస్లో ప్రయజ్..
అదే నీకు మిగిలే విలువైన కానుక..

జీవితం ఇచ్చేది పుచ్చుకో
ఎక్కువగా అడగక పోయినా
దేవుడి గుడిలో లైను లో
నిలిచుంటే నీకు దొరికే
ప్రసాదం లాగా..జీవితం నీకూ
ఏదో ఇస్తుంది..చాచిన చేతిలో
ఏదో తాయిలం పెడుతుంది.
జీవితం ..ఎంత దయగా ఇస్తుంది..

జీవితానికి  నువ్వు కూడా
ఏదైనా ఇవ్వు మరి..అప్పుడప్పుడు..
ఎప్పుడైనా..అప్పుడప్పుడు అయినా..

వసంత లక్ష్మి
కువైట్
26 03 2018.