"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 జన, 2020

కొన్ని వాస్తవాలు



రాత్రి అయిందని చీకటి
చెప్పక ముందే ఆశల
రెక్కలు ముడుచుకు పోవడంతో
తెలిసింది..
రెక్కలు విప్పి ఆకాశంలో
ఎగరడానికి వెలుతురెందుకు
అని అమాయకంగా ప్రశ్నించకు..
ఆశలు మడిచి జేబులో పెట్టుకోడానికి
ఏవో కారణాలు కావాలిగా..

జిపిఎస్ చూసుకుంటూ చేసే
ప్రయాణంలో మిస్ అయినట్టే తెలియదు
మైలు రాళ్ళని..
ఋతువులు మారాయి అని
ఫేస్ బుక్ స్టేటస్ చెప్పింది.

కోకీలమ్మ సిగ్నేచర్ ట్యూన్
నా మొబైల్ కాలింగ్ లో
కొమ్మ కొమ్మకీ లేత ఆకులు
నా బెడ్ రూమ్ గోడ పై స్టిక్కర్ లో

ఎంత విశాలమో ఈ కాంక్రీట్ రోడ్లు
ఈ ఇరుకు మనుషులేం చేస్తున్నారు ఇక్కడ
అమెరికా యూరోప్ దేశాలకి వంతెనలు వేస్తాం
పక్కింట్లో వాడి ఊసు మనకేల ??

చిన్న చిన్న పిల్లలకు
పెద్ద పెద్ద జైళ్లు , అల్లరి చేస్తే
బడిలో పడేస్తాం అనే మాట లో
ఇంత నిజం ఉందని తెలియదు అప్పుడు.

వాస్తు చూసి కట్టిన ఇల్లే
ధారాళంగా వెలుతురు , ధనం
వచ్చి పడ్డాయి..పిల్లలేరి అంటే
మొబైల్ లో బొమ్మ చూపిస్తారేంటి ??

సముద్రం ఏదో ఒడ్డున
భూమిని కలుస్తుందని నమ్మాను
ఎన్ని ప్రయాణాలు చేసినా
క్షితిజ రేఖని కలవలేదే...

కలకీ వాస్తవానకి మధ్య
ఇంత పెద్ద అగడ్త ఉందని ఎవరూ
ఎందుకు చెప్పలేదు..
వాస్తవమే కల అని ఒప్పించుకునే
సరికి ఇంత సమయం పట్టింది..