అయినా ఈ మూర్తి ఏమిటీ ? రోజూ ఫలానా వంట చేయమని చెప్పి వచ్చాను అంటాడు, అదేమిటి ? తనకి తోచినదేదో వండే స్వాతంత్ర్యం కూడా మూర్తి భార్య కి లేదా ఏమిటి ?
నాకు అన్నీ వింత గానే తోస్తాయి.
రోజుకొక ఆపిల్ తింటే వైద్యునికి దూరంగా ఉండవచ్చు అన్న సూక్తి నాకూ తెలుసు ,కానీ ఆ మాట పట్టుకుని ,రోజూ ఆపిల్ పండు తినమంటే విషం తినమన్నట్టు మొహం పెడతాను నేను .నాకు ఆ ఫలం చూడగానే తినాలి అని కోరిక కలగాలి ,కొనాలి, తినాలి అంతే కానీ ,అలా కొని పడేసి ,రోజూ ఏదో మందులా తినమంటే ,తినగలమా ?
మూర్తి అలా కాదు ,అతని ఆలోచన ఇలా ఉంటుంది ఏదో జబ్బు చేసి వైద్యుని దగ్గరకి వెళితే పరీక్షలు ,మందులు అంటూ ఎంత ఖర్చు పెట్టిస్తాడు ?మనం ముందే ఇలా ఖరీదైనా పళ్ళు ఫలాలు తింటూ ఉంటే మనం వైద్యుని వద్దకి వెళ్ళే పరిస్థితే రాదు కదా ? అంటాడు ..
ఇదేం ఆలోచన ? ఫలాలేవో ఇష్టంగా తినాలి అనిపిస్తే ,కొనుక్కుంటాం ,తింటాం ,అంతే కానీ వెనక ఇంత ఆలోచన చేసి కొంటామా !
ఏమో ,నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో ?
నాదే కొంచం తిక్క వ్యవహారం అందరూ ఇలాగే ఆరోగ్యం కోసమే కదా పళ్ళు తినేది అంటూ నన్ను నేను తప్పు పట్టుకున్నాను ..
నాకు అంత ముందు ప్లానింగ్ అదీ ఉండదు వంట విషయంలో కూడా ,ఆ రోజుకి ఏది సులువుగా వండగలను అనిపిస్తే ,అప్పటికది వండేసి ,అయింది అనిపిస్తాను .. భాస్కర్ కూడా ,ఏది వడ్డిస్తే కంచంలో అదే మహా భాగ్యం అన్నట్టు తింటాడు , పాపం ..
ఈ మూర్తి ఏమో ,రైతు బజారుకి వారంకి ఒక్కసారి వెళ్ళి , ఆ వారానికి సరిపడా కూరలు ,పళ్ళు ఆకు కూరలుతో సహా తెచ్చి పడేస్తాడుట ,అదేమిటి ? మీ ఆవిడ రాదా ? తను కదా వండాల్సింది ?అని మాటల మధ్య ఒకసారి అడిగితే ,దానికి సమాధానంగా - " అబ్బబ్బ ! ఆ రైతు బజారులో జనమే జనం అండీ , ఆడవారిని తోసేస్తూ
రాసుకుంటూ ఎందుకు వచ్చిన కర్మ ? నేనున్నాగా !అయినా , నాకు తెలిసినంత బాగా మా సరోజ కి కూడా తెలియదండీ " ,అన్నాడు గొప్పగా.
నేను విస్తు పోయాను ,ఇలా కూడా ఉంటారా ? మగవారు అని .
భాస్కర్ని ఎప్పుడైనా, ‘ఇవాళ వండడానికి కూరలేవీ లేవు. నాకు బద్ధకంగా ఉంది ,అలా బండి వేసుకుని వెళ్ళి ,నాలుగు రకాల కూరలు తెచ్చి పడేయవా ? ఏదో ఒకటి వండుతాను ఈ పూటకి’ అని అడిగితే ..
” బాబోయ్! నాకు అలాంటి పనులు అప్పచెప్పకు, ఐనా మొన్నటి అనుభవం చాలదంటావా ? ” భాస్కర్ బాణం విసిరాడు .
“అది ఆర్నెల్ల కింద మాట .. ” ముసి ముసిగా నవ్వుతూ అన్నాను .
భాస్కర్ ఊరుకోలేదు . " ఉండు అలా మాట మర్చకు ,నేను వంకాయలు తెస్తే అన్నీ పుచ్చువి ,చచ్చువి అంటూ నువ్వు విసుక్కోలేదూ ?”
“…………………..”
” పోనీలే అంత బద్ధకం గా ఉంటే ఏమీ వండకు ,హోటళ్ళు ఉండేవి అందుకే కదా ,పద తయారు అవు ” అంటూ ఎలా మాయ చేస్తాడు ,అంతే కానీ కూరలు మటుకు కొని తీసుకు రాడు ..
కానీ మూర్తి అందుకు భిన్నంగా కనిపిస్తాడు
నా కన్నా ఐదారేళ్ళు పెద్దేమో మూర్తి అయినా ఏదో చాలా పెద్దవాడిలా మాట్లాడుతాడు ,నాకు తెలియని ప్రపంచం ఆయన మాటల్లో వింటూ , కంటూ ఉంటాను ..
‘పాపం సరోజ ‘ అని అప్పుడప్పుడు నిట్టురుస్తూ ఉంటాను .
మేమిద్దరం కలిసి ఒకే విభాగం లో రెండేళ్ళు నించి పని చేస్తున్నా ఎప్పుడూ వాళ్ళావడ్ని కలిసే సందర్భం రాలేదు ఎందుకో !
భోజనానికి వెళ్ళిఒక కునుకు కూడా తీసి వస్తాను అని చెప్పే మూర్తి ,పది మిముషాలలో హడవిడి గా వచ్చి ,సొరుగు తాళం తెరిచి ,"మా అలమారా తాళాలు మర్చి పోయాను " అంటూ మళ్ళి అంతే హడావిడి గా వెళ్ళి పోయి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు .
ఇంటి బీరువా తాళం చెవులు ,ఇంట్లో భార్య చేతికి ఇవ్వరా ?
నాకిది ప్రపంచ ఎనిమిదో వింత . మా బీరువా తాళం చెవులు ఏ దిండు కిందో ,నా బట్టల బీరువా లో బట్టల మధ్యో ఉంటాయి ..
అసలు తనంతట తాను బీరువా తాళం తెరవనే తెరవడు. పైగా -
"అవన్నీ నీ చీరలు ,నీ వస్తువులే కదా ,ఆ పేపర్లు అవీ నువ్వే ఎక్కడొ జాగ్రత్త చేస్తావు. నేనిప్పుడు
వెదికానంటే..అన్నీ కలిపేసానంటూ గోల పెడతావు. అదంతా నాకెందుకు ? నువ్వే తీసివ్వు ప్లీజ్ ” అంటూ బ్రతిమాలుకుంటాడు .
ఇలా ఆఫీసుకి ఇంటి బీరువా తాళాలు తెచ్చే మగవాళ్ళుంటారని కానీ, వాటినిలా ఇంత భద్రం గా దాచే మొగుళ్ళుంటారని కానీ.. ఇదిగో ఇప్పుడే మొట్ట మొదటిసారిగా చూస్తున్నా. చూసి నమ్మలేని దాన్నౌతున్నాను.
ఆ మర్నాడు తనే మరింత వివరణ ఇచ్చాడు.నేనేమీ అడగకుండానే ,
"మా ఆవిడ చేతికి రోజూ ఇరవై రూపాయలిస్తాను . ఏ గొంగూరకో , తోటకూరకో పనికొస్తుందని . అంతకు మించి ఆవిడకేం ఖర్చు ఉంటుంది చెప్పండి ? అన్నీ నేనే చూసుకుంటున్నాను కదా” అంటూ తనో పెద్ద ఘనవంతుడన్నట్టు నవ్వాడు .
ఈ మాటలు వినగానే నా మతిపోయింది.
నాకు వచ్చే జీతంలో నేను మా అమ్మగారికి కొంత పంపిస్తూ ఉంటాను.
బజారుకి వెళ్ళానంటే నన్నాకర్షించేవి ఎన్నుంటాయని ! కొత్త డిజైన్ చీరో ,రంగుపూల గాజులో, లేటెస్ట్ మోడల్ స్టీలు గిన్నో ,ఏదో ఒకటి కళ్ళబడక మానదు . ఆ వెంటే కొనుక్కుని రావడము నా కలవాటు.
ఇంటి కొచ్చా క , ‘ఇదిగో చూడు, నా సెలెక్షన్ ఎలా ఉందొ’ అంటూ ఉత్సాహంగా అడిగితే కూడా . ,కనీసం ‘ఎంత ' అని కూడా అడగడు. చూడకుండానే , ' బాగుంది ,బాగుంది’ అనే భాస్కర్ నా కళ్ళముందు గబుక్కున కనిపించాడు నవ్వుతూ.
ఇదే మా ప్రపంచం .అందరిదీ కూడా ఇంతేననుకుంటున్ననాకు మూర్తి ప్రపంచం చూసాక మనసు కలత బారింది. ఏదో నాకు తెలీని, అంతు పట్టని కొత్త ప్రపంచంలా తోచాడు.
బహుశా ,నేనెప్పుడూ ఇలాంటి వారిని అంతకు ముందు చూడకపోవడం వల్ల కావచ్చు .
మూర్తి లాంటి వారు ఉండే ప్రపంచం గురించి అవగాహన తెచ్చుకుంటూ , అలవాటు పడుతున్నాను ..
మూర్తి రెండ్రొజుల నించి ఆఫీసుకి రావటం లేదు ,ఎందుకా ? అని మధన పడుతున్నాను .
ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పని చేసుకునే వాళ్ళం కదా, ఆ మనిషి ప్రక్క సీట్లో లేకపోవడం లోటుగా తోచింది ..
అటెండర్ని అడిగితే ,ఆ అమ్మకి బాగో లేదటమ్మ అంటూ పూర్తి వివరణ లేని కబురు తెచ్చాడు.
వారి ఇల్లు నాకు తెలుసు . ఇంటికి వెళుతూ ,ఒక సారి తొంగి చూద్దాం అని నిర్ణయించుకుని స్థిమిత పడ్డాను .
ఆ సాయంత్రం ఒక అరగంట ముందే బయలుదేరాను ,చెప్పానో లేదో ,నేను అప్పుడు రీసెర్చ్ స్కాలర్ని ,మూర్తి నా సీనియర్ ..
అనుకున్నట్టే వెళ్ళాను పిలవని అతిథి లా ..
మూర్తి ఆశ్చర్యపోయి , కొంచం కంగారు గా ,"సరోజా! నేను చెపుతూ ఉంటానే , విమల అని , ఆవిడ వచ్చారు ” అని ఒక కేక వేసాడు ,ఆ మూడు గదుల ఇంట్లో ప్రతిధ్వనించేలా .
లోపలనించి సరోజ వచ్చింది . తలకి కట్టు కట్టుకుని , నీరసం గా కనిపించింది , నన్ను చూసి సన్నగా నవ్వుతూ .'నమస్తే 'అనబోయింది.
నేను హడలి పోతూ 'ఏమయిందండీ ? తలకి ఆ కట్టు ఏమిటి ?’ అని కంగారుగా అడిగాను ..
ఆవిడ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి ,నాకు చాలా బాధ అనిపించి, ఓదార్పు గా ఆమె చేయి పట్టుకున్నాను.
ఈ లోపు మూర్తి లుంగీ లోంచి పాంటులోకి మారి ,ఇప్పుడే వస్తాను అంటూ బండి తాళాలు తీసుకుని బయటకి నడిచాడు ..
అతన్ని వెళ్ళ నిచ్చి , “ఎవరైనా కొట్టారా "? అని అనుమానిస్తూ అడిగాను .
"అబ్బే కాదండి , మా ఆయన బంగారం ” అంటూ జరిగిన సంగతి చెప్పింది
రెండ్రోజుల క్రితం , స్నానానికని కి వెళ్ళి, బాత్రూం లోంచి తడి చీర చుట్టుకుని, బయటకి వచ్చిందిట. గచ్చు మీద తడి చూసుకోక కాలు వేసి జారి పడిందట. ఆ పడడం అధాటున మంచం అంచు తగిలి ,బొట బొటా రక్తం చిమ్మిందిట .
ఆవిడ చెప్పేదంతా నేను శ్రద్దగా వింటూ, ఆలోచిస్తున్నా. ఆమె ఇంకా చెబుతోంది .
“నాకు స్పృహ లేదు . ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను .”
ఆ రోజు మూర్తి వేరే పని మీద మరో ఆఫీసుకి వెళ్ళడం గుర్తుకొచ్చింది .
“అయ్యో ! ఎంత పని జరిగింది ? . పోనీ లేచి డాక్టరు దగ్గరకు వెళ్ళారా ?”
“అబ్బే లేదండి ,చిన్న దే కదా , పంచదార అద్దాను ,ఏం చేసినా రక్తం అలా ధారలుగా కారుతునే ఉంది ,ఈయన ఎక్కడ ఉన్నారో ,తెలీదు .”
“పోనీ మీ వారికి వెంటనే ఫోన్ చేయక పోయారా ?”
“నాకు ఫోన్ చేయడం రాదండి. ” అంది, అసహాయం గా .
చేతిలో పది రూపాయలు మించి ఉండని ఆవిడ పరిస్థితి తల్చుకుని నా గుండె గుభేల్ మంది.
ఈ లోగా మూర్తి ఒక కూల్ డ్రింక్ సీసా పట్టుకుని వచ్చి ,నా కళ్ళ -ముందే తన జేబు లోంచి ఫ్రిజ్ తాళం తెరిచి , అందులో ఒక పది నిముషాలు పెట్టి ,నేను వెళతాను అంటే ,అప్పుడు లేచి , స్టీలు గ్లాసులో డ్రింక్ పోసి ఇస్తూ అన్నాడు .
“విమల గారూ ! పెద్ద గండం గడిచిందండీ . ఈ దెబ్బతో ఇదిగో ఆ రోజు నించి సరోజ కి నేను వంద రూపాయలు ఇస్తున్నాను .” అంటూ గర్వంగా ఆమె వేపు చూస్తూ ఉంటే ,ఆమె మురిపెంగా నవ్వింది
సిప్ చేసిన కూల్ డ్రింక్ ,భగ భగమని మండి పోయినట్టు గొంతు దిగలేదు.
సరోజ చేతికిచ్చిన ఇరవైకి లెక్క చూపిస్తేనే కాని మరో ఇరవై ఇవ్వని మహానుభావుడితను. అలాటిది రోజుకో వంద ఇస్తాడా? ఆ మహా ఇల్లాలు ,పతి యే దేవుడు అనుకునే పాత కాలం మనిషి మరి , ఈయన చేతిలో పెట్టిన ఆ వంద రూపాయలని అలాగే దాచి పెడుతుందని నాకు తెలుసు .
ఇరవై ఏళ్ళు అయిందేమో , ఇది జరిగి. నా ప్రపంచం లో నేను అలాగే ఉన్నాను. ఏ మాత్రం మార్పు లేకుండా , సరోజ మూర్తిల దాంపత్యం దివ్యం గా ఉండి ఉంటుంది
అది వారి ప్రపంచం . ఒకే భూమి మీద ఇన్ని రకాల మనుషుల్లో ఎన్ని రకాల ప్రపంచాలూ!
ఎవరి ప్రపంచం వారిదే అయినా కొన్ని వింతగా ఉండడమే చిత్రం ,
నాకదే ఎప్పటికీ అర్ధం కాని వింత , ఒక వింత .
*******