"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

9 నవం, 2012

ప్రేమ అంటే ఏమిటి??

ప్రేమ అంటే ఏమిటి??

అని ప్రశ్నించాడు అతడు

ప్రేమ ఎన్ని రకాలు??

ప్రేమ ఒక్క సారే పుడుతుందా?

లేక మళ్ళీ మళ్ళీ నా?

నాకు ఈ విశ్వం అంతా ప్రేమే 

కనిపిస్తుంది..

మరి నువ్వు ఏ ప్రేమ


గురించి మాట్లాడు తున్నావో? 

గాలి ప్రేమ గా వీస్తుంది, అందరిని 

ఒక్క లాగే పలకరిస్తుంది..ప్రేమిస్తుంది.
.
వెలుతురు,వెన్నెల అందరికి 

ఒక్క లాగే ,కురిపిస్తాయి ప్రేమగా, 

భూమి ప్రతి రుతువు కి

వన్నె చిన్నెలతో, కనువిందు చేస్తూ 

ప్రేమిస్తుంది అందరిని ఒక్క లాగే

ఈ రుతువు ,ఈ రొజు, ఈ రాత్రి కి 

ఇక చాలు అని ఏనాడు..అనుకోవు..అవి,,

ప్రేమ ఒక భావన ,ఒక స్థితి ,ఒక అస్తిత్వ

కారకం..

మరి నువ్వు ఏ ప్రేమ గురించి 

మాట్లాడుతున్నావో

మౌనంగా అతడు కదలి పోయాడు 

ఒక్క సారి కళ్ళూ తెరచి చూడాలి మరి..

ప్రేమ కోసం

మూసిన కళ్ళు ని తెరచి.

1 నవం, 2012

ఒక సూర్యోదయం ,ఒక సూర్యాస్తమయం..ఇవ్వండి చాలు.

మాకు ఒక మామూలు, సూర్యోదయం..
ఇంకో సూర్యాస్తమయం..చాలు.
కాలం ఒక చక్రం ట..
రోజూ లాగే ఒక సూర్యోదయం ,ఒక 
సూర్యాస్తమయం..ఇవ్వండి చాలు.


వసంతాలు, కోకిలలు, ఆకు పచ్చని 
లేలేత చివుళ్ళు, కిచ కిచ పిచుకలు,
ఘుమ్మనే మల్లెపూలు, తీయ తీయని 
మామిడి పళ్ళు, చిక్కటి స్నేహాలు 


అన్ని కరువై పోయే రోజులు , వచ్చేసాయా?
పోస్ట్ అంటూ అరిచే పోస్ట్ మాన్ ,ఒక ఆత్మ 
బంధువు, ఆ రోజులిక రావా?
బాబూ ,ఆటలింక చాలు, చీకటి పడింది 
అని అమ్మ ముద్దు పిలుపులు ఇంక లేనట్టేనా?

ఇంట్లోనే అన్ని ఆటలు ,అసలు ఆట కి 
పీరియడ్ లేదు జీవితం లో, నేటి 
పిల్లలికి ,ఇంకేం ఆట పాటలు?
రోజు కి కొత్త ,కొత్త మొహాలు ఇంట్లో 
వచ్చి కూర్చుంటాయి ,తెరల మీద..

అమ్మ చెప్పే చదువు ఇంట్లో ది 
సరిపోదు ట .హోమ్ వర్క్ కూడా బడి 
లోనే ,మరి కొన్ని జీతాలు పోసి,
జీవం లేని పిల్లాడే ఇంటికి తిరిగి వచ్చేది..

అయినా ,ఫర్వాలేదు, మాకు లక్ష ల 
జీతాలు వస్తాయిట, పిల్లలు,
జీవ మాధుర్యం కోల్పోయేరు మీరు 
అంటే, అదేమంత విషయం..అన్నీ 

ఈ చిన్న పెట్టె ,లాప్ టాప్ లోనే 
దొరుకుతాయి అని నమ్మ పలుకుతారు..
సంగీతం, సినిమాలు, పుస్తకాలు,
ఆఖరికి స్నేహితులు కూడా..

పర్సు చేతిలో పట్టుకుని , కిట కిట లాడే 
బజారువీధుల లో ,బేరాలు ఆడుకుంటూ,
మధ్యలో పువ్వుల ,గాజులకొట్లు 
ఆకర్షణలు ..ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం..
మరి ఈ రిబ్బను రంగు కి చీర మాచింగ్ 
దొరకాలి గా..అదే పోనీ జాకెట్టు ..కి..

ఇప్పుడు అన్ని లాప్టాప్ నట..
బజారు కూడా ఈ చిన్న పెట్టె లోనట..
మరి ,ఆ బజారు హుషారు, అలసట,
ఆ జనాల మధ్య మజా..ఎలా??


మాకు ఒక మామూలు, సూర్యోదయం..
ఇంకో సూర్యాస్తమయం..చాలు.
కాలం ఒక చక్రం ట..
రోజూ లాగే ఒక సూర్యోదయం ,ఒక 
సూర్యాస్తమయం..ఇవ్వండి చాలు.

అందుకే ...












31 అక్టో, 2012

అక్షరం ఆయుధం


అక్షరం ఆయుధం అంటే ఏమిటో 

అనుకున్నాను, ఇది చెడు, అని 

రాసిన వెంటనే, అదిగో చూడు 

మాటల మెలికల గుచ్చడం..


అక్షరం లో ఒక ప్రయాణం ఉంది.

రాసిన వాని, మెదడు పొరల లో 

పుట్టిన ఒక ఆలోచన కాంతి వేగం 

తో చదువరి ని చేరుతూ ,తన 

గమ్యం చేరుకొని అక్కడ ఇంక 

తిష్ట వేస్తుంది..పిలవని అతిథి 

ఏమి కాదు, పిలిస్తే నే వచ్చింది..

మరి ఇంక గూడు కట్టుకుని 

నీ మెదడు ని చీల్చి, ఎంతో 

కొంత చిన్న భిన్నం చేస్తుంది..

అక్షరం ,అమరం..చావు లేనిది.


అక్షరం బాధ్యత , స్కూల్ 

మాస్టారు నేర్పించినప్పుడు 

నల్ల బల్ల మీద తెల్ల సుద్ద గీతలే,

చందమామ కథలో రాజకుమారిడి 

వైనాలు, రాక్షసుల క్రీడలు ,రాణి 

గారి అందాల ప్రేమ చూపించిన 

ఈ అక్షరమే, ఆరేడు భాగాలుగా 

విడిపోయి, సైన్సు, సోషలు, అంటూ 

విభజించింది..నా మెదడి పొరలను..

ఇంకా వార్త లలో అక్షరం ,ఒకటి 

నే చూసేది మరొకటి..

నేను ఇప్పుడు ఏం రాయాలి అన్నా 

ఒకటికి పది సార్లు ఆలోచించాలిట ...

వీరికి ,వారికి కోపాలు రాకూడదు,

అల్ల వారికి అలక, అన్ని వేపులా 

చూసుకుంటూ ,వేయాలి ట ,ఒక్కో 

అడుగు, ఒక్కో అక్షరం..ఒక్కో పదం..

అందుకే మరి అక్షరం ఒక బాధ్యత..


నా వేలి చివర అక్షరాలు , ఎదురు 

చూస్తూ ఉన్నాయి దూకడానికి 

కాగితం మీదకి, అయినా నేను 

బిగించి మెడకి గొలుసులు ఆపి 

ఉంచుతాను, గాలి వాటం ,

ఆ వాదం. ఈ వాదం..కుడి ,ఎడమ లు 

అన్ని బాగా చూసుకుని, అప్పుడు..

అప్పుడే వదులుతాను, మెడ కి 

కాలికి వేసిన గొలుసులు.


అక్షరం..అప్పుడప్పుడు ఎదురు 

తిరుగుతుంది, నేను నిస్సహాయత 

నటించి ,మళ్లీ నా దారి లోకి 

తెచ్చుకుంటాను..నా వేళ్ళ చివరే 

ఆడుకోనిస్తాను ...అక్షరం..



'తల్లి కడుపు చూస్తుంది - ఆలి జేబు చూస్తుంది'


'తల్లి కడుపు చూస్తుంది - ఆలి జేబు చూస్తుంది'


goes a Telugu Saying. Agree? ముఖ పత్రం లో ఒక పోస్ట్..

ఆడవారం అందరం,తలో చెయ్యి వేసి ఖండించాం ...

ఆ సందర్భం గా నేను రాసినవి ....



అవును ఆడ వారికి జేబు లు లేవు, బ్యాంకు అకౌంట్స్ లేవు, జీతాలు లేవు, భర్త ఇంటికి జీతం తెచ్చి 

ఇచ్చినా, ఇవ్వక పోయినా, ఎలాగో?? ఒక లాగ పిల్లలికి, భర్త  కి కూడా కూడు పెట్టాలి..ఎలా??

అందుకే జేబు లో చెయ్యి పెడుతుంది...ఒక్కోసారి, ఒక బీడీ ముక్కో, ఒక సినిమా టికెట్ ముక్కో, 

ఇంకేదో కూడా కనిపించ వచ్చు.



అయినా, ఆశ, ఇంట్లో వాళ్ళ అమ్మా ఆకలి అంటారు...నాన్న తెచ్చి ఇచ్చాడా? అని అడగరు..

అందుకే జేబు లో చెయ్యి..

స్కూల్ ఫీజు కి ఆఖరి రోజు, కరెంట్ బిల్ కి ఆఖరి రోజు..

ఇవి ,తెలిసి ,తెలియనట్టు నటించే భర్త, ఎక్కడ పుట్టిస్తావో? నేనే కదా, నిన్ను, మిమ్మలిని అందరిని 

పోషించే మగ మహా రాజు ని..

నన్ను నమ్ముకో, నన్ను వేడుకో, నన్ను బ్రతిమాలు...అని ఊరిస్తాడు..

విసిగే, వేసరి, పెడుతుంది అలి, జేబు లో చేయి..

విసిగి వేసరి, ఒక అట్లా కాడ తిరగేస్తే. ఆమె గయ్యాళి..

చెప్పనా, నాకు గయ్యాళి అంటే భలే ఆరాధన,

గట్టిగ నిలబడి, నంగిరి కార్చకుండా, ఖని ఖని మని మాట్లాడే గయ్యాళి 

భార్య అంటే నాకు భలే అడ్మిరేశాను..


అవును ఆడ వారే ,స్త్రీలే.. అన్నిటికి బాధ్యులు..

తరగతి లో మార్కులు తక్కువ వస్తే,పిల్లలికి 

బడి ఎగ్గొట్టి బల దూరు తిరుగుతున్న కొడుకు,

కూతురు  ప్రేమ లో పడినా,

పప్పు లో ఉప్పు ఎక్కువయినా, 

భర్త కి అనారోగ్యం చేసినా,

ఆఖరికి ఇంట్లో కరెంట్ పోయినా..

అన్నిటికి ఇంట్లో భార్యే...కారణం..

ఏం ,ఏం చేస్తావు ఇంట్లో? కూర్చుని,

ఆ దిక్కుమాలిన సేరియల్స్ చూడదమేగా?

పిల్లలకి చదువు చెప్ప లేవూ ఆ మాత్రం..

అందుకే , మీకు డిగ్రీ ఉన్న, బుర్ర లో మాటర్ శూన్యం..

కొడుకి ని అదుపులో పెట్ట లేవూ?

ఒక్క రోజు రుచిగా చేసి పెట్టావా వంట?

ఏమిటో ,నా ఖర్మ, కట్నం కోసం ఆత్రపడి, 

నేను నిన్ను కట్టుకున్నాను, కాని, ఏనాడూ 

సుఖ పడలేదు నేను..

భర్త...బాధ కి అంతే లేదు..

చివరికి ఒక రోజు ...

అనుకున్నత పని అయింది,

భార్య పరమ పదించింది...పాపం..

అతడు ఒక్కడూ, ఎలా ఉంటాడు?

పిల్లలని ఎవరు చూస్తారు?

ఇల్లు ఎలా నడుపు కొస్తాడు?

ఈ పనులన్నీ ఆవిడా ఉంటె, 

చేసే పనులే మరి..

అయినా ఇంటికి కాపలా గా 

మరో భార్య కావాల్సి వస్తుంది, పాపం 

మగవాడు కదా...

భార్య ఉంటే ఏం పనులు 

చేసేదో ...అప్పుడే తెలిసింది మరి..

మరో భార్య కావాల్సిన రోజు న..




సమాజం అంటే...భర్తలే కదా 

వారు రాసిన రూల్స్ 

సమాజం గీసిన లక్ష్మణ రేఖలు 

భార్యలకి...అవును...

గీయని గీతాల మధ్య ఆమె 

ఒక బందీ , అటు చూడకు,

ఇటు నడవకు, ఇలా పైట వేసుకో,

అలా  విరగబడి నవ్వకు..

ఇలా పెంచు, పిల్లలని 

అలా చెప్పు కుర్రాడికి 

నువ్వు గొప్ప రా..

అని చెప్పు, చిన్నప్పుడే 

నువ్వు పెంచే పిల్లడే 

రేపు పెద్ద వాడయి...

అమ్మా ..నా పిల్లలకి 

నువ్వు జీతం లేని ఆయావి 

అని మెచ్చుకునేలా ,అమ్మ 

మురిసి పోయేలా.


ఆడ వారి గురించి 

ఎంత రాసినా నా ఆక్రోశం..

నా ఆవేదన...అవి అక్షరాలే 

అవి శర ఘాతాలయిన 

రోజు, అవి గుచ్చుకున్న రోజు..

అవి మార్పు కి శ్రీకారం 

అని చూసిన రోజు...

ఇంక నేనూ విరమిస్తాను..

విశ్రాంతి తీసుకుంటాను..














30 అక్టో, 2012

అస్తిత్వం

తర తరాల కాలాలకి ప్రత్యక్ష సాక్షి ,ఆ కొండ.
అంతా రాళ్ళే, నునుపుగా, జారుగా,గర్వం గా, సవాలు గా నిలుస్తాయి..
అనంత కాలాలకి ప్రతీకగా..

ఆ కొండల్లో ఒక రాయి,ప్రకృతి ఆదమరచి చెక్కిన శిల్పం లో ఒక చిన్న అపశ్రుతి.

ఆ రాయి అంతా రాతి గుండె కాదు, అందులో ఓ చెమ్మ ,ఓ తడి, ఓ పులకరింత ...

ఆ బిందువులే కోట్ల  చిందువులై బయటకి ఉరికాయి, ఇంక ఆ రాతి గుండెలో ఇమడ లేక...

ఓ చిన్న  ధార గా, పిల్ల చేష్ట గా  ఉరికింది...

అనంత ఆకాశం ,పచ్చని భూమి స్వాగతం పలికాయి.

నడకలు ,నాట్యాలు, నేర్చింది ఆ చిన్న పాయ.

వద్దన్నా ,వినక అమ్మ ఒడి వీడి ,పరుగులు తీసింది. ఈ విశ్వమంతా నాదే, 

నాదే అంటూ..దిక్కులు చూస్తూ, ఒక దారి అంటూ లేక ,కనిపించిన 

బండ లన్ని స్పృశిస్తూ ,కడిగేస్తూ ,విలాసం గా పరుగులు తీసింది.

ఒడ్డు ,ఒడుపు లేని నడకలు ,తుళ్ళింతలు ..

ఇంతలో ,అదాటున ఒక మలుపులో మరో చిన్నవాడే వచ్చి కలిసాడు .

బలమయిన ఆ హోరులో ,ఆ నడక లో, ఆ టీవి లో ఒదిగి పోయింది.

కలసిపోయింది..కలసిన క్షణమే తెలియని ఉత్కంట ...అంతా ఏదో 

అయిపొయింది. నడకలు నెమ్మదించాయి.

ఆ ఐక్య ధార మరింత సొగసు గా ,ఊసులు చెప్పుకుంటూ ,బండలు ,కొండలు 

వదిలి ,విశాలమయిన మైదానం లోకి ప్రవహించాయి..

ఏక స్రవంతి , ఏక నదిలా ఏక ప్రాణం లాగ..

ఆ నడక, అ సొగసులు ఆ గలగలలు ,ఆ మెరుపులు ,ఆ లోతులు ఆ 

తొనికింతలు చూడ తరమా??

ఏదో పేరు పెట్టారు ..జనం కొలిచారు..మైమరిచారు..మైదానాలు దాటి అంతా 

సులువే అని మైమరిచి ఉన్న వేళ ,ఓ పెద్ద అగాధం..

ఓ కొండ చివర ఆ నడక ...ఒక్కసారి ,ఓ పెను వేగపు జోరులో తోయ్యబడింది.

ఇంకా చేతులు పట్టుకునే ఉరికాయి ఆ పాయలు ..నది గా కలసిన ఆ 

పాయలు..

చెవులు చిల్లులు పడే హోరు, అగాధం, కఠిన శిలల మీద తల బాదుకోవడం 

అంతా ఆత్మ హత్యా సదృశం లా లేదూ?

కాని, జీవం ఉన్న ఆ అనంత మయిన నది మళ్లీ కలిసింది ...పాయలు గా 

వీడింది, మళ్లీ కలిసింది ....

ఇవే నా ఆఖరి చూపులు తండ్రి, తల్లి, అని దీవించి పంపింది నదీమ తల్లి..

తన లోంచి విడి పడ్డ పిల్ల కాలువ ల ని..

మరింత ఒడి గా ,వడి గా పరుగులు తీసింది..నది..

ఎక్కడికో !! ఈ ప్రయాణం..ఏదీ నా అస్తిత్వం ఎక్కడ ఉంది? ఎక్కడని 

వెతుక్కోను ...పరుగులే నా అస్తిత్వం..చైతన్యమే నా అస్తిత్వం.. నాలో జీవం 

ఉన్న వరకూ ఈ పరుగులే, ఈ నడకలే ,ఈ ఊసులే, ఈ ఒడ్డుల నిగ్రహింపులే 

ఈ బుజ్జగింపు లే నా అస్తిత్వం...

అదిగో, ఆ పచ్చని చేలు, నా కరుణ చూపు లోంచి పుట్టినవే..

ఇదిగో ఈ వెచ్చని రైతు ఇల్లు ,ఆ కలకలలు, నా ఆశీర్వచనమే ...

యిదే నా అస్తిత్వం..నేనే ఓ జీవ నదిని ,ఓ చైతన్య స్రవంతి ని, ఓ నిండు 

కోరికల తరుణీ ని, ఓ కోటి ఆశల వధువుని..నేనే ,నేనే ,నేనే ....అంటూ 

మురుస్తున్న వేళ ...

పుట్టిన అమ్మ ఒడికి ఎంత దూరమో? ఎంత పయనమో??వెనక్కి చూడనైనా 

లేదు ,అంతా ముందు కే ...అంతా ముందుకే ..ఈ ప్రస్తానం..

ఏదో తెలియని బెంగ, అదిగో చీకట్లు, అదిగో ఆ ఉప్పు గాలి, అదిగో ఆ 

చెమ్మదనం ,అదిగో ఆ సాగర గంభీర నాదం..ఏదో తెలియని శక్తి, నన్ను 

ఆవహిస్తోంది..నేను ,నా అస్తిత్వం అంటూ ప్రశ్నించే ,మురిపించే ,గర్వించే 

క్షణం కరిగి పోతోంది..ఏదో పెద్ద శక్తి నన్ను ఆహ్వానిస్తోంది... ఆవహిస్తోంది...

ఏదీ ? ఆ శక్తి ప్రకృతి శక్తా? పరమేశ్వర లయ నర్తనమా??

ఇది పుట్టుకా?? గిట్టుకా???

వ్యవధి లేదు.చిరు ,చిరు అలలు తో అమ్మాయి పారాణి పాదాల్లా చిందులు 

వేసే నన్ను ,గలగలా ,చిరు గంటల సవ్వడి లా సంభాషించే నన్ను ,వినయం 

తో ,వినమ్రం గా ఒడ్డుల మధ్య ప్రవహించే నన్ను ,ఏమిటో ఈ శక్తి ..??

రాక్షస అలలు ,గంభీర వినాశకర నినాదం ,ఒడ్డే లేని అనంత ప్రవాహం ,నన్ను 

కలుపు కోడానికి ట పిలుస్తోంది..ఇది సృష్టి కి అంతమా? సృష్టికి 

ఆరంభామా?? ఏమిటి నా పరిస్థితి ??

ఈ భయంకర ఆపద నన్ను ఆకర్షించి ఆకట్టుకుంటోంది ...

ఈ మృత్యు హేల నన్ను రమ్మని చిటికెలు వేస్తోంది.

అమ్మ ఒడి నుండి వద్దన్నా ,వినక ,అల్లరిగా దూకినందుకే నా ఈ శిక్ష ప్రభూ, 

చేతికి అందిన చెలికాని తో అడుగులు కలిపి దారి మల్లినందుకా ప్రభూ ఈ శిక్ష.

ఎర్రని ఎండలు కి భూమిలో ఇంకి,చల్లని వాన లతో మళ్లీ జీవం పోసుకుని ,నీ 

అధికారాన్ని కాదన్నందుకా ప్రభూ, ఈ శిక్ష..

ఎందుకు? ఎందుకు? ఎందుకు?

ఆ క్షణం ,ఆ ఉద్విగ్న క్షణం ,ఆ అస్తిత్వ క్షయ కారక క్షణం ...

అంతా ఒకటే ...ఒకటే అల..సాగర గర్భం లో నా తియ్యదనం ,నా కమ్మదనం ,

నా చిరు, చిరు నడకలు, తుళ్ళిం తలు అంతా, కలిసి, కరిగి, ఉప్పగా కన్నీళ్ళు 

గా మారిన వేళ -వెక్కి ,వెక్కి ఏడుస్తున్న నన్ను ,వెన్ను నిమిరిందెవరు ?

అదిగో ఆ కర్మ సాక్షి..

అంతా అయిపోలేదు..ఇంకా ఉంది..నువ్వు ఉన్నావు..నీ అస్తిత్వం ఉంది..

నీది నీదే ,నీ తియ్యదనం ఎక్కడికి పోదు..అదిగో చూడు, నా తీక్షనత కి నీరు 

ఆవిరి అయి,మళ్లీ జలజల వర్షం గా కురుస్తావు..

ఎదో ఒక అమృత ఘడియ లో ,మళ్లీ ఏ కరకు రాతి గుండె లో నో

ఇరుక్కుంటావు ..కాలాల అమరికను తిలకిస్తూ, ఓ క్షణం లో నువ్వు మళ్లీ 

ఉద్భావిస్తావు, యింకో అమ్మ ఒడి లో జన్మిస్తావు..

మళ్లీ ప్రారంభం..నీ నడక, నీ చైతన్యం ,నీ అలల స్రవంతి, ఆగని నృత్యహేల 

చిటికెల .చిరు సవ్వడి ల సంగీత జోల..

ఇదే నా ప్రమాణం , ఊరడించు ,అంటూ కర్మ సాక్షి 

ఆ నది లలామ కళ్ళు తుడిచింది..

అస్తిత్వమే ముఖ్యం...అన్నిటి కన్నా..నది మది లో ఆలోచన మెదిలింది ..ఆ 

క్షణం లో....ఇదే నా ,ఈ పయనమేనా నా అస్తిత్వం..నది మది ..తలచినది..

అవును...అంటూ ఆఖరి బొట్టు ,కరిగి పోతూ, పలికింది..సాగర గర్భం...లో...

















25 అక్టో, 2012

నా మదిలో భావాలకి ఒక రూపం..


శ్రమించి ఒక్క 
ఆకు పుట్టించలేవు 
మరి ఎందుకు 
చెట్టు ని నరికేస్తావు?

ఉషస్సు లో వాడి.
వేడి, 
వెన్నెల లో కూడా 
వేడే ?ఏమో ...

పూసిన ప్రతి పువ్వు 
ఒక రంగు,
చిత్రకారుడి కుంచె 
అలసిపోయింది ...

పసిపాప నవ్వు 
అందం..
బోసి నవ్వు కదా 
మరి ఈ ముసలి 
నవ్వు ...ఎందుకు 
చేదు ? భారమా?

రెండే చేతులు 
ఎంత తవ్వినా 
వెలుగు సంపద 
కరిగిపోదు ..

మధ్యాన్నం నడి 
నెత్తిన సూరేడు 
బలం ,సాయం 
సంధ్య కే చిక్కి సగం..


ఎవరన్నారు?
తీయ తీయని పలుకులు 
నీవని? ఓహో ...
ప్రేమ ఒక్కటే చాలు 
బతికేందుకు అన్న రోజే 
ఆకలి ,అన్నం...
ఎంత కఠినం నీ పలుకు..

విరహం వేదన 
ఒక నాడు,
కంటి నిండా 
నిద్ర కరువు 
నిదుర పొనీవు..
అలసిన భర్త..


సిమ్మాచలం కొండ 
మీద సంపంగె కే 
ఎందుకంత ఘాటు?
నృసింహస్వామి 
క్రోధం కాసింత 
దగ్గర మరి...


గోదావరి బ్రిడ్జి 
మీద రైలు 
ధనా ధన్ ..
గుండె కూడా 
అదే ..ధనా ధన్ 


తీయని బాధ ఏమిటో?
ఈ తీపి వెనక 
పంటి బాధ చెప్పింది..

నలుగురు చాలు ట 
నీ తుది మజిలీ కి 
ఒక్కరు రారు కదా 
తోడుగా నా వెంట..

ఋతువు కి 
ఒక గొంతు ఉంటుంది..
అదిగో కు హు..కు హు 
ఇదిగో వసంతం..
అదిగో ఘన ఘన 
మెరుపులు,ఉరుములు 
ఇదిగో వర్ష ఋతువు..
అదిగో ఆకు రాలు 
శబ్దం..నిశబ్దం..
అదే మరి హేమంతం..
ఇదిగో చండ ప్రచండ 
సూర్యుని ప్రతాపం..
అదిగో గ్రీష్మం..
అదిగో అస్సు అస్సు అని 
విరహ వేదన ..
ఇదిగో ప్రేమ చివుర్లు 
వేసిన కాలం..