"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

12 జన, 2013

సంక్రాతి పండగ....

తెలి తెలి మంచు బిందువులు 
నులి వెచ్చని సూర్య కిరణాల కి 
కరిగి పోతూ, ఒక వెండి మెరుపు 
కాంతి కాన్క గా సమర్పించాయి..

నిలువెల్లా మంచు దుప్పటి కప్పుకున్న 
ధరణి, కాంతి చిల్లుల మధ్య నించి తొంగి 
చూస్తోంది , నిజం గా నిద్ర లేచే సమయం 
ఆసన్నమయిందా ? అంటూ..

ఎర్రెర్రని ,కాంతి గోళం, మకర రాశి లో కి 
ప్రవేశం అట, అంటూ భూగోళం గిర గిర 
తిరుగుతూ చెప్పుకుంటోంది, అవునుట 
అంటూ చామంతులూ, బంతి పూల 
అమ్మలక్కలు విరబూసిన మొహాలతో 
కబుర్లు ఆడుకుంటున్నాయి ..వినబడ లేదా?

ఇంటికి చేరిన పంట, చెంత కి చేరిన చెలి 
వెచ్చని చలి , గోడ మీద అద్దిన గొబ్బెమ్మలు 
తెల్లవారితే భోగి అని హరిదాసు అరుపులు ,
ఇంటి లో చేరిన కంప ,రండి రండి వేయాలి 
భోగి మంట, కక్షలు ,కార్పణ్యాలు పిడకలు 
చేసి పడేయండి, కాస్త అసూయ, ద్వేషాలు 
దిష్టి తీసి పడేయండి, మంటల్లో కాలి పోయేలా 

చుక్కలు ,చుక్కలు ,చుక్కలు ,హ్మ్మం..
ఆకాశం కిందకి దిగిందా? కాదే 
మా ఇంటి ముందు రంగ వల్లులు 
పసుపు, ఎరుపు, తెలుపు, 
ఎన్ని కలలో ,అన్ని రంగులు..

షడ్రుచుల పిండి వంటలు, బావ ల 
పరాచకాలు, మరదళ్ల అల్లరి ఆట లు,
నాన్నల జీరాడే పంచల , హుందా తనం,
అమ్మ పట్టు చీర కొంగు హంగులు,
పిల్లల ఆశల లాగ ఎగిరే గాలి పటాలు 

అబ్బ బ్బ ..మా పల్లె టూరుల 
పండగ హడావిడి చూడాల్సిందే..
ఎక్కడెక్కడో పట్టణాల లో ,
ఉరుకులు పరుగుల హడావిడి 
ఉద్యోగాల కొలువులు చేసుకునే వారు,
దిన కూలి పనులో, ఇంటి పనులు 
చేసుకునే వారు కూడా ,మా ఊరు 
మా పండగ అంటూ ఇంటికి పరుగులు 
తీసే సంబరాల సమయం..ఈ పండగ.

మన సంస్కృతీ ,సంప్రదాయం అంటూ 
ఉన్నాయా అసలు అని ప్రశ్నించే వారికి 
చూపించండి ,పండగ సంబరాలు ..
సంక్రాతి పండగ తర తరాల గా 
అందరూ కల్సి చేసుకునే పండగే మరి..




8 జన, 2013

మిథునం, ఒక అందమయిన జీవన్ మాధుర్య కల...

భార్య సహాయము  తో కొన సాగే భవ సాగర తరణం..
నవరసమాన సమరసమాన సహకార మేలనం..
మిథునం..
ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం..
అరవై దాటిన ఆలు మగల అనురాగామ్రుత మధనం..
గృహస్త ధర్మం సగర్వం గా తానేగారేసిన జయ కేతనం..
మిథునం..
మిథునం ముందు చదివి, మా శ్రీ రమణే ..శ్రీ రమణే నా రాసేడు ??సారి రాసేరు అని హస్చర్య పడి పోయి, మీరూ చదివారా? మీరు చదివారా? అంటూ పుస్తకం వాయినాల వ్రతం ఒక్కటి ఆచరించి, తెలిసిన వారందరికీ ,ఇచ్చి చదివించి, మళ్లీ మరో సారి చదివేసి..అబ్బా...అంటూ మురిసి పోయి, ఇదేంటి ??అవును మర్చిపోయా ,తెలుగు వాడు కదా,అందుకే ఏమి అవార్డులు గట్రా రాలేదు ..అని నిట్టుర్చిన గుర్తు.
ఇది జరిగి ..ఎన్నేళ్ళు అయింది...చాలా చాలా..ఏళ్ళ క్రితం..

మళ్లీ ఇదిగో ఇప్పుడు విన్నాను..అంటే ఎన్నారై లు పూనుకున్నారని మన దాకా వస్తుందో లేదో ..అని ఏదో డౌటూ ..సినిమా తీసేరని ..భరణి దర్శకుడు అని...ఏవో మధ్య ,మధ్యలో కబుర్లు చెవిలో పడ్డాయి.

ఇదిగో వచ్చింది ట ..మన ఊరులోకే..మన విశాఖ కే ..ఒక ఆదివారం ,మధ్యాన్నం, నేను సినిమా లు చూడను, నేను తెలుగు సినిమాలు అస్సలే చూడను అని ఒట్టు పెట్టుకున్ననా సహచరుడిని ముందు బతిమాలి, తరవాత బెదిరించి, సెలవుల తర్వాత మొదటి రోజు బడి కి వెళుతున్న పిల్లాడిలా చేతులు కట్టుకుని, నా వెంటే బయలు దేరదీశాను..

మధ్య దారిలోనే, మాకు మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది..మా మరిది అంటే ..మహా సినిమా క్రిటిక్ నించి, తప్పకుండా చూడవలసిన చిత్రం ఇది, మీరు చూసి మరో వంద మందికి ,కూడా చెప్పండి, అనిన్ను ..దానితో ,కొంచం హుషారు గా పడ్డాయి అడుగులు.

నాకు గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి..ఈ సినిమా బాగో లేకపోతే నాకు పడే అక్షింతలు తలుచుకుంటూ..
అదేమిటో, ఆ సినిమా ఏదో నేనే తీసినట్టు, ఏమిటా రక్తాలు? ఏమిటా హింస? ఏమిటి  వాడా హీరో? ఆ .........రాయలేని పదాలు....ఆ హీరోయిన్  కి ఏమయింది..అంత చిన్న బట్టలు వేసుకుందేమిటి? అంతా నాదే తప్పు...అలా అక్షింతలు వేయించుకుని ,కొన్నాళ్ళ వరకు సినిమా వైరాగ్యం తెచ్చుకుంటాను నేను....అబ్బే..అదెన్ని  రోజులు...అర పూట..అంటున్నారా? అదే మరి, ఆంధ్రుల మై ఉండి ,సినిమాలు చూడక పోతే అవ్వా..ఎంత చిన్నతనం..మన పేరు కి..

ఇంతకి...సినిమా సంగతి కి వద్దాం..

ఏసుదాస్ గారి గాత్రం...లో పైన రాసిన పాట ప్రారంభం అయింది...హమ్మ యా, ఓపెనింగ్ బాగానే ఉంది..అని నేను  సీట్ వెనక్కి కూర్చుని స్థిమిత పడ్డాను.

ఒక పెద్ద తోట, అందులో ఒక పెంకుటిల్లు..అరె ఇదేమిటి ? నా కల లో ఇల్లు లా ఉందే ...అప్పాదాసు...ఓహో మన పాడుతా తీయగా బాలు ..అదేలెండి...మన కి తెలిసిన బాలు..

లక్ష్మి ..ఓహో జూలీ ...లో హీరోయిన్....అబ్బాబా..అంత వెనక్కి వెళ్ళకు ,పోనీ నిన్నే పెళ్ళాడుతా లో నాగ్ కి అమ్మా..ఆ.ఆవిడే..లక్ష్మి..అండి బాబూ.హుష్ అరవకు..అందరూ నిన్నే చూస్తున్నారు..

అదే మరి, సినిమా ల వార్తలు అబ్బ అని నొసలు చిట్లిస్తే ..ఇలాగె ఉంటుంది, బొత్తిగా సినిమా నోలేజ్ నిల్ ..మరి..

ఎన్నార్, ఎన్టీర్ ,శోభన్ బాబు కృష్ణ ,సావిత్రి, జమున..వీటి దగ్గరే ఆగి పోతే ఇలాగే ఉంటుంది మరి..హ్మ్మ్మం...

చెవిలో ఎజుకేషణ్ జరిగి పోతోంది, పక్క సీటే ..పారిపోవ డానికి లేదు..

ఉదయం సిగ్నేచర్ ట్యూన్ తో ఆల్ ఇండియా రేడియో ...లో ప్రసారాలు ప్రారంభం ..అని ఒక పిలుపు నిచ్చింది..అంతే.. తను వాళ్ళింట్లోమర్ఫీ ,కి మా ఇంట్లో ఫిలిప్స్ రేడియో కి నేను వెళ్లి పోయాం ..ఆఫలం గా..

చుట్టూ మొక్కలు, చెట్లు, ఒక నుయ్యి,మా ఇంట్లో కూడా ఉండేది, ఆ నూతి నించి చిన్న కాలవ లో నీళ్ళు,ఆ నీళ్ళు ఒక్కో చెట్టు మడి దగ్గరకి వెళ్లి నీళ్ళు గలా గలా చేరడం..చేరి ఆప్యాయం గా మొదలు ని తడమడం, ఒక ఆవు, దాని పాలు పిండడం, మాకు అట్టే అలవాటు లేదు, పుట్టినప్పటినించి పాకెట్ పాలే..పాలు పాకెట్లో పుడుతాయి అని చాల రోజులు నమ్మకం..

ఇంక ఒక చెట్టు మీద నించి ఒళ్ళంతా  మట్టి పోసుకున్న మన అప్ప దాసు కోతి లాగ అవును, అచ్చం కోతి లాగే లక్ష్మి అదే, మన బుచ్చి లక్ష్మి పాత్రలు ప్రవేశం..

నురగ పాల తో, కాఫీ ఎలా తయారు చేయాలో ,చక్కగా చూపించేరు..నాకు అంత పట్టింపు లేదు కాని, కాఫీ ఎలా తయారు చేయాలో అని రకరకాల థియరీలు కల నా సహచరుడి కి భలే కాఫీ పాట ..నేను ఏమయినా నేర్చుకున్నానా? అని ఒక పక్క చూసే ఉంటాడు..నేను చూడ కుండా..

మనం మటుకు ,ఆ తోటల మధ్య మేం ఉంటే ,సప్పోస్ ఉంటే ,ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ..ఒక్క వారం రోజులు హాలిడే ఫర్వ లేదు, కాని నెట్, లేని ఇంట్లో నేనా? నేవ్వేర్..అని మనసులో ..

ఇంక ఆ అప్ప దాసు కి వేరే పని ఏం లేదా? అలా భోజనాలు మీద భోజనాలు లాగించడం తప్ప..అమ్మో ఎలా కాల్చుకు తింటున్నాడో?
హ్మ్మం...లోపలే..లోలోపల.గోంగూర పచ్చడి- ప్రియ పచ్చడి, పనస పొట్టు  కూర..మా అమ్మకే రాదు, నేనేం చేయగలను? సిమ్పెల్ గా అన్నం వండి, పప్పు లో ఏదో కలగూర పప్పు, కొన్ని కూరలు ,చారు మటుకు ఇంగువ పోపు వేసి పెట్టడం వరకూ నేర్చుకున్నాను..

సరే సాంబారు, మజ్జిగ పులుసు, మొత్తానికి గట్టెక్కి ,నాకు పీహెచ్డి వచ్చినట్టే అని గెంతేను కదా..

అలా ఏదో సామాన్యం గా సంసారం ఈదేస్తూ ఉన్న  తరుణం లో ఇలా రుచులు, మహా రుచులు అంటూ నన్ను వంటింటి గట్టు కి కట్టివేసే కుట్ర ఏమయినా ఉందా? ఏమిటి ? అని కొంచం హెచ్చరిక తో కూర్చున్నాను..

ఒకటే ఆటలు, ఈ అప్ప దాసు, అబ్బ ఒక్క చోట కూర్చోడు , తోటంతా గెంతులు, విహారం, భార్య ని ఒక్క క్షణం కూర్చో నివ్వడు ,వంటింట్లో గుమ్మం మీద తల పెట్టి ఒక్క క్షణం నడుం వాలిస్తే ,చిన్న పిల్లాడిలా బెల్లం ముక్క కోసం డబ్బాలు మీద పడేసు కుంటున్నాడు ..

అమ్మో, నాకు దిగులు ..నేను మళ్లీ అమ్మ నవాలా? మరి నేను ??నన్ను
ఎవరు లాలిస్తారు? నేను ఎక్కడ చిన్న పిల్ల లాగ అలగాలి..??

ఇల్లు పీకి పందిరి వేస్తాడు, పేరంటం కి వెళితే కర్ర పుచ్చుకుని ,కాపలా కూర్చుంటాడు..మరి ఇంకెప్పుడూ నన్ను వదిలి వెళ్ళకు .అంటాడు, పసి పిల్లాడిలా మారాం చేస్తూ..

అమ్మో, నాకు కాలు నిలవదే ..ఎంత సేపు, ఊరు మీద పడి తిరగాలని ,స్నేహితురాల్లని చూస్తే ,ప్రాణం లేచి వచ్చేస్తుంది..మరి నేను ఎలా??

అయిదుగురు అబ్బాయిలు ..మామిడి ,జామ అరటి, పనస, చెట్లు కి పిల్లల పేర్లు..పెట్టుకుని, పిలుస్తూ ఉంటారు.

పిల్లలు అమెరికా లో, ప్రాణాలు ఒకరి మీద ఒకరు పెట్టుకుని ,వీరు ఇద్దరూ ఇక్కడ మన దేశం లో, వారధి ఒక ఫోన్, అదీ ,అటక ఎక్కిన్చేస్తాడు..

ఆవిడ ఏమంత తక్కువ తింది ?

పోపు డబ్బా లో మొబైల్ ఫోన్ దాచుకుని ,కుశలం అడుగుతూ ఉంటుంది..
పిల్లల ధ్యాస కూడా ఇక్కడే, రమ్మంటూ ఉంటారు, కాని వీళ్ళు అక్కడికి వెళ్లరు, ఓపిక లేదు, వారు ఇక్కడికి రారు, తీరిక లేదు..

అంతా గ్లోబల్ విలేజ్ ట ..

చక్కని బుజ్జి దూడ పుడుతుంది, బుజ్జి ముండ కి ఓ పేరు పెట్టుకుని ,అపురూపం గా పెంచుతూ ఉంటారు..

వీరే ఒక బాల్య దంపతులు లాగ గిల్లి కజ్జాలు, ఆడుతూ ఉంటారు ,వీరికి ఒక పసి దూడ ..ప్రేమిన్చేవారికి ,ప్రేమించుకోడానికి ఎన్నో కారణాలు..
ఆకో, పువ్వో, మొగ్గో, వానో, గోవో, లేగ దూడో ..హ్మ్మ్ ..ఏదో ఒకటి.
బయట నించి ఎవరో ఒకరు, ఈ పచ్చని తోటలో కాయలు కోసమో, పువ్వుల కోసమో, కళ్ళు తెరుచుకునిచూస్తూ ఉంటారు..పిల్లలో ,పెద్ద వాళ్ళో, అబ్బే తొంగి అయినా చూడ నివ్వడు ..కర్ర పట్టుకుని కూర్చుని కాపలా ఈయన.అప్ప దాసు..

అంటే బయట ప్రపంచం తో సంబంధం లేకుండా నా? 
అమ్మో, నేను ఉండగలనా? అయినా ఇదేమి నాకోసమా ? ఏమిటి ..సినిమా అంతే కదా అంటూ గుండె చిక్క పెట్టుకున్నాను..
లక్ష్మి కో చెల్లెలు కథ, వింటాం..మనం ఆవిడ మాల కడుతూ చెప్పిన కథ..ఏది, మరో పాత్రే రానివ్వరు వీరిద్దరి మధ్య..

అమ్మో నా చెల్లెళ్ళ ని చూడకుండా ఏళ్ళు, ఏళ్ళు ఉండగలనా? అబ్బే..బొత్తిగా ఇలా ఉందేమిటి? నీరసం..నాకు..

పిల్లల కంటాలు ..బ్యాక్ గ్రౌండ్ లో వారి మాటలు  వింటాం, మనవడి కార్టూన్ కథ చూస్తాం..

ఇంకో ప్రాణం కనపడదు..నాకు పిచ్చెక్కేలా ఉంది..ప్రపంచం లో ఇలా ఎవరి తో సంబంధం లేకుండా ,నేను ,తనే లోకం లా బ్రతక గలమా??

అమ్మో..నాకు మా అత్త గుర్తు వచ్చింది. మా ఊరులోనే మా  మావయ్య తను ఉంటారు..పిల్లలు ఇలాగే దూరం గా..మావయ్య కి ఎవరు ఉన్నా ,లేక పోయినా ఫరవాలేదు ,కాని తనకి మనుషులు కావాలి, ఎవరు వెళ్ళినా ,ఆప్యాయం గా చేయి పట్టుకని ,దగ్గరగా కూర్చో బెట్టుకుని, ఎప్పటివో ,పాత సంగతులు అన్ని గుర్తు చేస్తూ, తెచ్చు కుంటూ, ఒక కాఫీ అయినా తాగందే వెళ్ల నివ్వదు.

ఆడవారికి ఎక్కువ మనుషులు కావాలి, మాట్లాడాలి, పంచు కోవాలి, పెంచుకోవాలి ప్రేమలూ.ఆప్యాయతలూ ..

సోషల్ బీయింగ్ అంటారు ..ఆడవారు..ఎక్కువ అలా ఉంటారు..

భార్య భర్తల మధ్య , ఎంత ప్రేమలు  ఉన్నా సరే, బయట ప్రపంచం కూడా కావాలి, ఆడవారికి ..

పిల్లలు, మనవలు, కోడళ్ళు , బంధువులు అందరూ వచ్చి పోతూ ఉంటేనే ,ఇల్లు సందడి ,సందడి ..కదా..

ఇంకా అప్ప దాసు కి భార్య చెప్పే దాక్షారాం సమ్మంధం అంటే ఒళ్ళు మండి పోతూ ఉంటుంది..ఇన్నేళ్ళు అయినా తన కి మరో పోటీ ఉండేవారు అంటే ..ఒంటికి కారం రాసు కున్నట్టే.

ఆవిడకి అదో సరదా ..ఆయన ని ఏడిపించడం..ఆ తప్పిపోయిన సమ్మంధం పేరు చెప్పి..

పిల్లలు పెళ్లి పేరు చెప్పి వస్తాం అంటే, ఒళ్ళు విరుచుకుని ,ఎన్ని పిండి వంటలు చేస్తుందో .పాపం..అన్ని వెస్ట్ ..పెళ్లి అప్పటికి ఆగిపోతుంది.

ఇద్దరూ, తమ లోకం లో హాయిగానే ఉంటారు..
కాని, నాకే గుండె లో గాభరా పెరిగి పోతోంది.

బుచ్చి లక్ష్మి కి జ్వరం ..రాదూ మరి..అన్నేసి పనులు చేస్తూ కూర్చొంటే ..రోజంతా..

అంతకు ముందు, అప్ప దాసు భార్య కి చెప్పులు కుట్టడం, పరుపులు కి దూది ఏకడం, దగ్గర నించి అన్ని పనులు చేస్తూ కనిపిస్తాడు..

ఒక రకం గా వారిది ఒక ప్రపంచం..అందులో ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక భార్య ,ఒక భర్త, ఒక నారి, ఒక నరుడు, ఒక అర్ధ నారీశ్వర రూపం కలిగిన రూపం చరించే లోకం అది.

అందులో వారే పిల్లలు, వారే పెద్దలు, వారే ముదుసలి ప్రాణులు, వారే ఈ లోకాన పార్వతి పరమేశ్వరులు.

ఇది మన లాంటి మామూలు ప్రాణులు కి సాధ్యం అవునా??

ఇంటర్వెల్ లో కాఫీ కూడా అడగడం మర్చి పోయాను, ఈ బెంగ లో..

ఇవతల చూస్తే ,ఇన్నాళ్ళకి నాకు ఒక మంచి సినిమా చూపిస్తున్నావు అని ప్రశంసల జల్లు , నేను ఒక మూల బిక్క చచ్చి పోయి ఉన్నాను..

ఈ ఉత్సాహం తో ,నాకు ఏం కష్టం వస్తుందో?అని..

భార్య కి జ్వరం వస్తే, సేవలు చేస్తాడు, హ్మ్మం..చేయక తప్పుతుందా?

ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా? అని చీకట్లో నే మూతి తిప్పేను మూడు వంకలు..అసలే పాడుతా తీయగా లో ఏదో ఒక తాళం, స్రుతి అంటూ పిల్లల మనో భావాలు దెబ్బ తీస్తాడని, నాకు అదో కోపం ముందే ఉంది..

జాతకం లెక్కించి, ఆమె కి ప్రాణ గండం ఉందని భావించి, ఆమె కోరిక ప్రకారం లక్ష వత్తుల నోము జరిపిస్తాడు, పోనీ ,అప్పుడయినా నలుగురు ముత్తయిదవులు ని పిలిపిస్తాడా ? అది లేదు..ఏమిటో సంబడం..

ఆవిడ ప్రాణం ..జాతకాల లెక్క తప్పి, ప్రాణం పోసుకుంటుంది..

ఆయనే కుర్చీలో కూర్చుని ,అనాయాసం గా ప్రాణం వదిలిస్తాడు.

అంతే..మన హిందువుల లో భార్య ముందే పోవాలని కోరుకుంటుంది..కాని ఇక్కడ ఆమె, నేను లేక పోతే ,ఈయన ఎలా బతుకు తాడు? ఏ కోడలు వండి పెడుతుంది ,ఈయన రుచులు ? అని ఒక వంక బాధ పడినా, ఆయనే ముందు వెళ్లి పోవడమే ధర్మం అని ఓదార్పు పొందుతుంది.

నాకు మా మూడో నంబరు ఫ్లాట్ లో ఒకప్పుడు ఉండిన  భార్య భర్తలు గుర్తు వచ్చేరు, ఆవిడ ఎప్పుడూ అనేది, అందరూ, స్వార్ధం గా, ఏదో పసుపు కుంకుమలు అంటూ ఉంటారు, కాని, నేనే ముందు వెళిపోతే ,ఈయనకి ఇంత అన్నం ఎవరు పెడుతారు? కాలో ,చెయ్యో పడి పోతే ఎవరు చూస్తారు? అని ..అంటూ ఉండేవారు.

అల్లాగే జరిగింది కూడా చివరికి..

ఈ అర్ధ నారేస్వర అర్ధం లో ,నారి రూపమే చివరి వరకూ స్థైర్యం ,శక్తి కలిగిన రూపం అని నాకు తోచింది..

బయటకి వచ్చేకా మాటినీ తలనొప్పి, ఒక కాఫీ తో పోయినా, దేవుడా..ఇలాంటి భర్త నిజం గా ఉంటె ,నా దుంప తెమ్పే వాడు కదా అనుకుని, ఈ ఆదర్స నారి రూపం అతని మనసు నించి ఎలా తుడిపెయాలా ? అని రెండు రోజులు తీవ్రం గా ఆలోచించెను..

ఒక రాత్రి, నిద్ర మెలకువ కాని ఒక స్థితి లో అసలు విషయం అర్ధం అయింది.

ఈ మిధునం...ఒకరి కథ, ఒకరి కమామీషు కాదు, అందరూ ఇలా ఉండాలని కాదు..

ప్రతి దానికి ఒక వ్యాఖ్యానం, ఒక అర్ధం ,ఒక పరమార్ధం ఉంటాయి, స్నేహం అంటే ఇలా ఉండాలి, అని కొన్ని సినిమాలు వచ్చేయి..

అలాగ దాంపత్యం అంటే ఇలా ఉండాలి అని ,ఒక పరిపూర్ణ బంధం, అది, నువ్వు ..నేను అని కాక, మనం అని ఉండే బంధం..ఒకరికి నోచ్చితే ,మరొకరి కంట కన్నీరు కారుతుంది, ఒకరి సంతోషం మరొకరి మహా ఆనందం..ఒకరి కి ఆకలి, మరొకరి క్షుద్బాధ, ఒకరి అల్లరి, మరొకరి కి ముచ్చట, ఒకరి కాళ్ళ లలో ముళ్ళు, మరొకరి కంట్లో నీళ్ళు, ఒకరికి దాహం, మరొకరికి గొంతు ఎండి పోవడం..ఇలాగ తనువూ మనసు కలిసి పోయిన జంట మిదునాల కథ ఇది..

పుస్తకం చదివి ఊహించుకున్నదే కాని, ఎవరో అన్నట్టు, సాహిత్యం కి ఉన్న విలువ మహత్తరం..మనం ఊహాల్లో పండించుకుంటాం..ఆ ఊహ చిత్రం కి మరేది సాటి రాదు..

అయినా ఇది భరణి ..దర్శకుని గా మెప్పించిన దృశ్య కావ్యం..
మన తెలుగు రుచులు, తెలుగు భార్య భర్తల పిలుపులు, మన తెలుగు వంటలు, మన అమ్మ ,నాన్నల దాంపత్య జీవనం ఒక సారి చూపించిన సినిమా ఇది..

అంటే ,మనం ఇలాగే ఉండేవారం..నిదానం గా నడిచేవి రోజులు, జీవితం..నీళ్ళుఅంటే, ఇలా స్విచ్ వేస్తె వచ్చేవి కావు,  నూతి నించి తోడుకోవడం..ఎక్కడికయినా నడుచుకుని వెళ్ళేంత దూరం, అందరూ మనకి తెలిసిన వారే, మొహాలు, పేర్లు తో సహా..

రైల్లో ప్రయాణాలు, టికెట్ కోసం క్యూ లో నిల్చోవడం,ఎంత నెమ్మదిగా నడిచేది జీవితం..ఇప్పుడో ఉరుకులు ,పరుగులు..

ఎంత పరుగులు తీసినా ,ఏమిటో జీవన మాధుర్యం మటుకు ఒక్క ఇంచి కూడా పెరగదు..ఎందుకో??

అందుకే ఈ మిధునం నాకు నచ్చింది..నిజం గా నచ్చింది, బ్రాహ్మణ సినిమా అన్నా సరే, నచ్చింది..ఒక్కో క్షణమూ ఆస్వాదిస్తూ, ఒక్కో క్షణమూ, నీకోసం అంటూ, మన వాళ్ళు తపిస్తూ, ఒక్కో క్షణమూ ,సంతోషం జీవితం నూతి లోంచి తవ్వి ,తోడుకుంటూ..

అప్పాదాసు ,నూతి లోకి దూకి ,ఎన్నో వస్తువులు తీస్తాడు, కాకి పడేసిన నేతి గిన్నె, మిల్లి గరిట , భార్య కాలి పట్టా..

అది తోమి ఆమె కాలి కి అలంకరించే దృశ్యం నాకు చాలా చాల నచ్చింది..

మనం కూడా, ఎక్కడ పారేసుకున్నమో, మన జీవన మాధుర్యం అక్కడే వెదకాలి..నెట్ లో ను, మరో చోటా కాదు..

మిధునం ..ఒక్కోరిని ఒక్కో లాగ కదిలించ వచ్చు..ఒక్కోరికి ఒక్కో జీవన దృక్పథం ఉంటుంది, ఒక్కో ఆకాంక్ష ఉంటుంది..

ఎప్పటికయినా , మిథునం, ఒక అందమయిన జీవన్ మాధుర్య కల..కలే..మరి..








































6 జన, 2013

నా సాహిత్య ప్రస్తానం ..


నా సాహిత్య ప్రస్తానం ..ఇంకా బుడి బుడి అడుగులతో..పసితనం దాటిందా ? లేదా
అన్నట్టుంది..

రాయడం అనేది..నాకు ఊహ వచ్చినప్పుడు .చదవడం తో మొదలు అయింది అని చెప్పవచ్చు..

అక్షరాలూ దిద్ద గానే, పత్రిక ల లో వాటిని వెతుక్కోవడం మొదలు పెట్టాను.

పత్రిక ల లో సేరియాల్ చదవడం...బహుసా ,ఏ ఎనిమిది యేళ్ళ

నించో మొదలు అయింది..అలా చదవడం...అనే ప్రక్రియ నాతో పాటూ పెరుగుతూ వచ్చింది.

అక్షరం అంటే ప్రేమ కూడా పెరిగి, నేను కూడా పున్జీడు అక్షరాల విత్తనాలు
చల్లోచ్చు ,ఈ సాహితి వనం లో అని  ఆలోచన కలిగింది..

నాకు సంతోషం ,బాధ ఏమి కలిగినా అది అక్షరాల లోకి మార్పు చెందడం ,నాకు
తెలియకుండానే జరిగిన ప్రక్రియ..

అక్షర రూపం లో ఏవి ఉన్న చదవడం...ఆ అక్షరం..మనసు లో తిష్ట వేసుకుని, నన్ను
కదిలించడం..నాకు ఆనందం కలిగించడం..ఇవన్ని నేను గమనిన్చేసరికి..నాలో ఒక కవి
,రచయిత నాలో కూడా ఒకరు ఉన్నారని ..


ఊహు..నేను గమనించలేదు, కాని, పేజీలు  ,పేజీలు  నేను రాసిన ఉత్తరాలు అందుకున్న
నా స్నేహితులు గమనించారు..


ఉద్వేగం, కన్నీళ్లు, సంతోషం, ఆలోచన , ఉత్తేజం , నిస్తేజం..ఒక్కో సారి...ఈ
భావాలన్నీ నేను నా ఉత్తరాల లో ,ప్రకటించడం..ముందు నా స్నేహితురాళ్ళే
గమనిన్చేరు..


మా ఊరు, ఏలూరు అప్పుడు, రాజకీయ చైతన్యం తో, రాజుకున్న నిప్పు రవ్వ లాగ రవ రవ
లాడుతూ ఉండేది..మా ఏలూరు..


ఉద్యమాల పిలుపు లు ఏర్రేరగా ఆకర్శించేయి..


చదువు ఏమాత్రం నిర్లక్షం చేయ కుండానే..ఒక అడుగు అటు వేసాను..


అప్పుడు జనార్దనం అనే ఎంజేనీరింగ్ విద్యార్ధి ని ఎంకాంటర్ చేసి చంపేశారు, అతని
ని ఒకసారి కలవడం వల్ల ,విపరీతం గా దుఖం కలిగి, రాసిన నా కవిత ఇది.


                       జనం..(జనార్దనం )


ఆ రోజు ఉదయం ఉదయం కాలేదు

అస్తమయాన్ని ఆకాశం నిశబ్దం గా

చితికి పోయే పురిటి సూర్యుడ్ని

పొత్తి బట్ట తో ఎత్తుకొచ్చాడు మావాడు.


ిన బింబాన్ని పిండి గుండెల్లో నింపుకుని

వేడిని కరిగిస్తూ లోపల మెత్త బడిపోతూ

నెత్తిన పాలు పోస్తాదంటూ చల్లగా నిష్క్రమించాడు


నిష్క్రమణ -----ఈ గోళం వదిలి

కాంతి వేగం తో వెలుతున్నాడే మో అని ఆశ

అందుకే జన హృదయం కన్నీటిని కట్ట బెట్టి

ఎర్ర మందారం గుండెల కెత్తి

నంది వర్ధనం జనం హృదయం

శాంతి కపోతం ప్రాణం విడిచింది ..

ఎర్ర ముక్కు కోడిపెట్ట తోలి కేక గా అవతరించి

జనం ..జనం ..అంటూ తొలివేకువ కూసింది..


కాంతి వేగం తో వెళుతూ

తిరిగి వస్తున్నాడు మా వాడు ..

తిరిగి వస్తూంటాడు మా వాడు..


మరోటి..


నా యవ్వన వయసు లో రాసినది..



                                      వికృతి.


ఒంటరి దాన్నిని చిట్టడివి లో

ముట్టుకుంటే అడవి తీగె పామై కూర్చుంది

విరగ బూసిన పచ్చదనం నర నరాల అసహనం

వింత వింత పొదుగుల కి ఎదిగి కూర్చున్నాయి

మొదళ్ళు ..


తమ చుట్టూ నల్లదనం మింగేసు క్కూచున్నాయి

పలచని ఎడారి నా చుట్టూ చిక్కగా

మేటేసిన తెల్ల రజను ఆడ దాని గుండెల్లా

ఇసిక తుఫాను హోరుల్తో కళ్ళ లలో ఆర్తనాదం

మొదలు లేని చెట్టు లా నాలోనే దిగబడింది.


చలిని గడ్డ కట్టించే మంచు

మమ్మీ లా కూరుకు పోయి ,పాత సున్దర్యం

కిలుము పట్టిన గుండె నాడులు

కాళ్ళు సాగని మంచు తీగెలు ,నర నరాల

పిరికి మంచు ,కరిగించే సూర్య రస్మి కి


వేయి జనాల మంద 'మతి 'అడ్డు

ఉషోదయం నవోదయం

గుండెల్లో పీచు పీచు మాటలు

గుడ్డి మాటలు, మూగ కళ్ళు లా అంతా

తిక మక .....మక తిక..తిక్క

-----------------------------------------------------------------------------

అంతలోనే వెలిగి ఆరిపోయింది..

నాలో విప్లవ దీపం..

అయ్యో .ఎందుకు ఇలా

అలా అని, నాలో లేని

ఆవేశాలు , నేను ప్రదరసించ లేను..

అది నాలో నిజాయితే యో తెలియదు..

తప్పించు కోవడమో తెలియదు..


పై చదువులు, ఆంధ్ర యూనివర్సిటీ లో..తర్వాత పెళ్లి..ఇంకా ఆ పై పిల్లలు, వారి
చదువులు...ఇవి ముఖ్యం అయిపోయాయి..నేను వెనక బడ్డాను...ఆమె, అమ్మ ...పైకి
వచ్చాయి..


మళ్లీ చాల రోజులకి...లేదా ఏళ్ళకి ..కువైట్ లో నాకు నన్ను నేను కనుక్కునేందుకు
సమయం దొరికింది..


మళ్లీ రాయడం మొదలు పెట్టాను...బ్లాగ్స్ లో నా కథలు, కవితలు, నా భావాలు అన్ని
పొందు పరచడం, పేస్ బుక్ ద్వారా..పది మందికి పరిచయడం పెరగడం,, జగతిధాత్రి గారు,
ఒక కవిత ప్రచురించడం..బాగున్నాయి అని ఎవరయినా మెచ్చు కోవడం..


అన్ని ఈమధ్య కాలం లోనే..ఈ రోజు ఇలా మీముందు నిల్చున్నాను అంటే..

అంతా నెట్ కాల మహత్యం అని చెప్పా వచ్చు..


ఇంకా ఈ ప్రస్థానం కి మొదలు ఇది..

ఏ తీరం చేరుతుందో ..చూడాలి మరి..


మీ వసంత లక్ష్మి ..


మొన్న ఆ మధ్య ,విశాఖ సహృదయ సాహితి సమావేశం లో జరిగిన సభ లో నా ప్రసంగం..నా కవిత లు కొన్ని కూడా చదివాను ఇక్కడ..నా సాహిత్య ప్రస్థానం అంటూ ఇంకా ఏమి మొదలు అవలేదు..ఇది ఇంకా నా తోలి అడుగు మాత్రమే ..వీటినే మెచ్చ్కుని ,అంతు లేని ఆత్మ విశ్వాసాన్ని కలిగించిన ప్రతి ఒక్క సహృదయుని కి నా నమస్సుమాంజలి..ధన్యవాదాలు...ఇంకా ఈ ప్రస్థానం సాగుతుందని ...నాకూ ఆశే..ఉంటాను మరి..

23 డిసెం, 2012

ఏ ముక్కలు కావాలో ...మీకు.

ఒక తల లోపల ఒక మెదడు..
అవసరం లేదు..మేమున్నాం 
మీకు ఆలోచనలు నింపడానికి 
ఒక మొహం..కళ్ళు, 
అందం గా ఉంటే చాలు పద్మా ల్లగా 
మా తప్పులు, మా ఒప్పులు గా 
చూస్తే చాలు..
ఇంకా మొహం కూడా చంద్ర బింబం..
మేమ్ ఆసిడ్ లు అవి పోయడానికి 
బ్లేడ్ తో చేక్కేయడానికి..
చేతులు తామర తూడు లాగా 
బలహీనం గా...మా చేతి ఆధారం గా 
బతక డానికి, ఇంకా కాళ్ళు ...
ఎప్పుడూ వెనక్కి నడవ డానికి 
గుర్తు గా ...పాదాలు కాస్త ముడుచుకుని ..

అంగ అంగాలు కోసి ,మీకు ఒక 
ప్రసాదం లా నైవేద్యం చేయాలి..
ఇదిగో, ఇవి పడేస్తున్నాం..ఇవే కదా..
మీకు కావాల్సిన అంగాలు..
కుక్క నోటికి మాంసం ముద్దల్లాగా..
మీరు కొరుక్కు తినడానికి..
ఛి, ఫో .అన్నా..మా వెనకే  వస్తారేం..
మీకు కావాల్సిన ముక్కలు వేసాం  కదా.

మా మానాన మమ్మల్ని వదిలేయండి..
ఏలుకున్నది చాలు, పోషించినది చాలు..
మాకు వండు కోడాలు వచ్చు,
మా కాళ్ళ మీద మేము నిలబడడమూ వచ్చు..
మహా ప్రభో, మీకో దణ్ణం..అన్నా వదలరు..

రోజు ., ఇంత వండి పెట్టడానికి ,
ఇంత కాఫీ నీళ్ళు పోయడానికి..
మేమే కావాలి..కాని, పెత్తనం మటుకు 
మీదే ..ఎందుకు సహిస్తున్నామో ..
మీకు తెలుసా అసలు..

మా అంతరంగాలు లోకి తొంగి 
చూస్తే తెలుస్తుంది..కసువు ఊడ్చి 
మూల పెట్టినట్టు, మీరు ఎలా పడి 
ఉంటారో ,ఒక మూల..

అందరూ ఒక్కటి కాదు..అని మూలుగు 
అవును చిత్ర హింసలు, పలు రకాలు..
ప్రేమ పేరుతో మరింత చిత్రం అవి..
సృష్టి కార్యం కోసమేనా ? ఇన్ని తొడుగులు?

ఎంత జుగుప్స కలిగించినా , స్త్రీ 
ఎందుకు ఇలా లొంగి ఉంటుందో..
మీకు అర్ధం అయిన రోజు..
చచ్చి మళ్లీ పుడుతారు..

నాలోనూ ఇంత క్రోధం, ఇంత చిద్రం 
అయిందని మనసు, ఇవాళే తెలిసింది..
ఆబల అంటూ, మాంసం ముద్ద చేసేరు
అని ఆర్తనాదం విన్న ఈ క్షణమే, నా 
మనసు ,నా శరీరం ముక్కలు ముక్కలు 

గా విడిపోయింది..ఏ ముక్క కావాలో 
ఏరుకోండి..ఏ ముక్క కావాలో ఏలుకోండి..
ముక్కలు ముక్కలు అయిన ఈ శరీరం 
లో ఏ ముక్కలు కావాలో ...మీకు..

12 డిసెం, 2012

విసాపట్నం బీచ్ రోడ్..



ఎన్ని సార్లు నడిచామో? గుంటలు, గొప్పులు తో అధ్వానం గా ఉండేది, ఒకప్పుడు..యునివేర్సిటీ కి 

సెలవు ప్రకటిస్తే ,ఇలా చిన వాల్తేరు డౌన్ లోకి నడుచు కుంటూ వచ్చి, పుస్తకాలు గుండె కి హత్తుకుని, 

బీచ్ గట్టు ల మీద ,రాణు ల్లగా నడుచుకుంటూ, ఆ సముద్రం అలల ని శాసించాలి అన్నట్టు ,గర్వం గా 

చూసుకుంటూ, హాస్టల్ వరకూ నడిచే యవ్వన శక్తులు గుర్తు..

అలల మీద కలల నడక ...లా మా నడక అప్పుడు..అక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు...మధ్యలో, 

మబ్బు లలో మిరిసే మెరుపు ల లాగ ...నవ్వులు..ఎందుకో తెలియదు...అలా నవ్వుతూ ఉండే 

వాళ్ళం..అది యవ్వన ప్రభ..

పెళ్లి, పిల్లలు..ఒక కుదురు, ఒక బరువు..

ఇంకా అడుగులు కొలుస్తూ, ఏమిటా పెళ్లి నడకలు? అన్నట్టు నడక మంద గించింది..

సముద్రం ఇప్పుడు పక పకా నవ్వుతోంది, ఏవి నీ నవ్వులు? ఆ ఉరుకులు ఆ పరుగులు అని..

ఆ డాల్ఫిన్స్ నోసే అనే యారాడ కొండ...మటుకు ఎప్పుడూ ఒక్క లాగే, నిండు గా, కుదురు గా..

సముద్రం ని ఒక కంట కనిపెట్టు ..అని ఎప్పుడో ఎవరో ,పురమాయించేరు.. ఆ మాట కే కట్టుబడి, 

కదలక, చెదరక, బెదరక..అల్లా నిల్చుంది పోయింది..

తుఫానులు, సునామీలు వస్తాయి, వెళతాయి..నాకేం భయం? అని ధీమా గా నిలుచుంది..

ధీమా ఇస్తూ..

మా విసాపట్నం వాసులకి..

అడుగు లో అడుగు లు కొలుచు కుంటూ..

ఈ రోజు ...మా నడకలు..

పేవ్ మెంట్ మీద ప్రతి రాయి..పలకరిస్తుంది ...ఏమయినా తగ్గేవా? ఇన్నేళ్ళ నించి నడుస్తున్నావు? 

అంటూ..

మూతి విరిచి..ఊహూ అంటూ ,నవ్వుకుంటూ నడుస్తాను..

ఆ పలకరింపులు ,ఆ మూతి విరుపులు ఎంత ముచ్చటో నాకు..

ఇంకా మా బీచ్ రోడ్ మీద అడుగు అడుగు కి, ఎందఱో మహానుభావులు..అందరికి వందనాలు..కొందరి 

విగ్రహాలు నిల బెట్టేరు..ముందుగా మా వీధి చివరే, రాచకొండ ,కథల మాస్టారు, టీవిగా బుషార్ట్ , పాంటు 

లో నిల్చుని, వచ్చే పోయే వాళ్ళ కథల ,కమామీషూ కనుక్కుంటూ ఉంటారు..

హుష్..ఏమిటా ఆ అలల హోరు, ఒక్కసారి ఆపండి, మా రాజమ్మ నవ్వు ,విందాం..అన్నట్టు..చిరాకు 

పడతారు..

సారా, సారో కథలు ఎవరు వినిపిస్తారో? మరి..రాత్రి అయితే, జగమంతా ,నిరీవం గా నిద్రిస్తున్న వేల 

,ఒక్కసారి, ఒళ్ళు విదిల్చుకుని, ఓ పెగ్గు బిగించి, కథలు చేపుతారేమేరేమో అని ఒక వెర్రి ఆశ 

నాకు,మాకు..నమో నమహా..

ఇంకా మరో ప్రపంచం పిలిచింది అని వెళ్లి పోయిన శ్రీ శ్రీ, గారు, మన అమర గాయకుడు ఘంట సాల 

గారు, హరికథ పిత మహుడు, ఆది భట్ల గారు, ఇంకా ఎంత మందో...

అలా ,కదలక నిల్చుని, సాగర ఘోష ,గానా బజానా ని ఆనదిస్తూ, మా వీసా పట్నం జనాలని హుషారు 

చేస్తూ ఉంటారు..ఈ కవులు, కథకులు, ఉద్దండులు..

ఇంకా ,ఓ తిమింగలం వచ్చి ,సరదాగా ,పడుకున్నట్టు, ఇసక లో, కురుసవా ముసెఉం ..జలాంతర్గామి 

...భలే ఉంటుంది..

ఇంకా అంతేనా ? అంటే...ఇంకా చాల ఉన్నాయి..

జ్ఞాపకాలు పరిమలాలు ...గుప్పున సైకెల్ మీద కుర్రాడు మల్లెపూల ,సన్నజాజి పూల దండలు అంటూ మోర ల లెక్కన టోకున అమ్మేస్తూ ఉంటాడు..

చట ఫట్ , అంటూ హుషారు గా మర మారాల మురీ మిక్స్ తింటే, స్వర్గం కి అంచున ,నిల్చున్నట్టే .

.ఇంకా పక్కన ఎవరో ఉండాలి కూడా.ఆ ఆనందం రెట్టింపు అవుతుంది..

ఉండింది ఒక రోజు జల జల అంటూ, వర్షం జల్లు కురిస్తే, ఓ చోకోలేట్ ఐస్ క్రీం బార్ , చేతిలో ఉంటె..

స్వర్గపు టంచులు దాటేసి నట్టే..

ఇంకా ఇంతేనా ? అంటూ పెదవి విరిచేయ కండి..అప్పుడే..

అలల కబుర్లు కి ఏమాత్రం తగ్గ కుండా..చూసారా...ఆ బస్సు నిండా అమ్మాయిలు, అబ్బాయిల కబుర్ల 

అట్టహాసం..

ఇంకా.. పిల్లల కి బెలూన్ల సందడి, ముసలి వాళ్లకి, కబుర్ల సందడి..

అబ్బా ఎన్నో, ఎన్నేన్నో ..మా బీచ్ రోడ్ తిరణాల సందడి..

ఉంటాను మరి, సాయంత్రం అవుతే, సూర్యుడు అస్తమిస్తే..

అప్పుడు నేను ఉద్యమిస్తా..నా ఆది దాస షూస్ కట్టుకుని..

ఉంటాను మరి.. 

8 డిసెం, 2012

మాచ్ ఫిక్సింగ్ ...

2000 సంవత్సరం లో, నేను నా సహచరుడు కలిసి ఎల్ ఎల్ బి చదవాలని నిశ్చయించుకున్నాం..అప్పుడు యునివర్సిటీ లో వీ సి ,సింహాద్రి గారు , అట్టేన్దంస్ విషయం లో చాల కఠినం అని పేరు ఉండేది, అందు వల్ల ఎం బి ఎం కళాశాల లో జేరాం..ప్రవేశ పరీక్ష అవి రాసి..
ఇంక మూడేళ్ళు నేను ,ఒక చిన్న పిల్ల లాగ, పుస్తకాలు హృదయానికి హత్తుకుని,ఎంతో ఇష్టం గా ,ఒక్క క్లాస్స్ మిస్ అవకుండా, పరిక్షల ముందు నైట్ అవుట్ లు కూడా చేస్తూ, మళ్లీ కాలేజ్ గర్ల్ అవతారం ఎత్తేను..నాతో పాటు నా క్లాస్ మేట్ ..గా మా ఆయన..
మొదటి రోజు, మా తరగతి పిల్లలు లేచి నిలుచున్నారు..మా ఇద్దరినీ చూసి, మేం లెక్చరర్ అనుకుని...\
మొహమాటం గా మేం బెంచి మీద కూర్చునే సరికి గొల్లున నవ్వులు..అందరూ చిన్న ,చిన్న పిల్లలు, అందులో అయిదేళ్ళు లా చదివే వారు ,మరి చిన్న పిల్ల లాగ ఉంటారు..
అందరి పేర్లు తెలిసాయి, మమ్మల్ని ఎలా పిలవాలో అని ఇబ్బంది పడుతూ ఉంటా..ఉన్నాయి గా మనలని ఇలాంటి సమయం లో ఆదుకోడానికి 'ఆం టి' ,'అంకల్ '...
క్లాస్స్ లు కి రారు, బయట నిల్చుని కబుర్లు చెప్పుకుంటారు, భవిష్యత్తు గురించి చింతే లేదు, చాల మంది, ఎలమంచలి ,తుని ఊళ్ళ నించి కారేజి లు కట్టుకుని, అదే లెండి చిన్న డబ్బాల్ల లో ఉదయం రైలు లో వస్తారు..ఇక్కడికి..

ఇంత శ్రమ పడి వచ్చిన వారు, క్లాస్స్ కి ఎందుకు రారు? అని మాకు ఆశ్చర్యం ..అసలు క్లాస్స్ లో ఎలా కూర్చుంటారు ? మీరు అని వారికి తిరిగి ఆశ్చర్యం..ఎందుకర్రా .అలా అక్కడే తిరుగుతారు, ఆ గోడల మీద కూర్చుని, అంటే..అదేమిటి? మేం ఎంజాయ్ చేయడానికే కదా ఆంటి ,అసలు కాలేజ్ కి వచ్చేదే అందుకు..అన్నారు..

మాకు ఇదంతా ఒక షాక్ ట్రీట్మెంట్..నడి వయసు లో లా చదివి డిగ్రీ సంపాదించి ఏదో సాధించుదాం అని మేము..
యవ్వనం లో, కొండలు డీ కొట్టి ,పిండి చేసే హుషారు లో ఉన్నవారికి ,రేపటి గురించి చింతే లేదు..అంతా నిశ్చింత ...అమ్మ ,నాన్న ల అండ ఉందిగా వారికి..మేమే అమ్మ నాన్నలం మరి..

మధ్య మధ్య లో, సహచరుడు షిప్ ఎక్కి ఉద్యోగం చేయడానికి వెళ్లి పోయేవాడు, నేను ఒక్కర్తిని, ఒక్క క్లాస్స్ కూడా మిస్ అవకుండా, వారు చెప్పిన వన్ని ,రాసుకుని, ఇంటికి వచ్చి, టెక్స్ట్ బుక్స్ చదివి, నోట్స్ తయారు చేసుకుంటూ, పరీక్ష పత్రాలు పాతవి సంపాదించి ,వాటికి జవాబులు రాస్తూ, అబ్బ ఎంత శ్రద్ధ గా చదివే దాన్నో..మా అబ్బాయి ,హడలి పోయే వాడు నా చదువు చూసి, అమ్మా ఇలా చదివేస్తే ఎలా..అని..

ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల మూడేళ్ళు గడిచి పోయాయి..మధ్యలో పిక్నిక్ కి కూడా వెళ్లేం , యారాడ కొండ దిగి అక్కడ ఉన్న రిసార్ట్ లో, మా ఆడ పిల్లలని అందరిని, దగరలో ఉన్న ఒక కొండ ఎక్కిన్చేసాను..అబ్బాయిలు అవురా అనుకునేలా..

ఇదంతా..అసలు కథ కి ఉపోద్ఘాతమే..అంటే నమ్ముతారా..

మాకు ఇంక మూడేళ్ళు ,అవక ముందే, అప్పటి ప్రిన్సిపాల్ ఒకామె ,గీతం కాలేజ్ కి వెళ్లి పోయారు..మేం అందరం కలిసి ,ఆవిడకి ఒక ఫేర్ వెల్ పార్టీ కూడా ఇచ్చెం..

ఆ కాలేజ్ పెట్టినప్పటి నించి ఆవిడే ప్రిన్సిపాల్..గా పని చేస్తున్నారు..
అవినాభావ సంబంధం ఏర్పడింది..ఆవిడ ని అందరూ. పొగడ్తల తో ముంచెత్తారు. ఆవిడ సమాధానం ఇస్తూ, చెప్పిన ఈ నిజం గా జరిగిన కథ మీ అందరికి చెప్పాలనే ..నా ఉద్దేశం..

ఎన్ బి ఎం కాలేజ్ ,మహారాణి పేట లో, సరిగా సముద్రం కి కూత వేటు దూరం లో ఉంది, కాస్త నాలుగు అడుగులు వేసి, రోడ్డు దిగితే, సముద్రం ఊసులు చెపుతూ రా రమ్మని పిలుస్తుంది, (మా ఇల్లు కూడా పెద్ద దూరం కాదు..)

అయిదేళ్ళు లా చదివిన వారు, మరీ , స్నేహితులు అయిపోతారు, అక్కడ..అలాగే ,ఒక శైలజ ఒక ప్రకాశం..మరి స్నేహితులు అయిపోయారు..

స్నేహం ,ప్రేమ గా మార డానికి ఎంత సమయం కావాలి? అందులో ఎదురు గా ఇలాంటి ఎన్నో,ఎన్నెన్నో ప్రేమికుల కథ ల సాక్షి సముద్రం..ఎదురు గా పెట్టుకుని..

ప్రకాశం ఒక మధ్య తరగతి , కుటుంబ నేపధ్యం..శైలజ కొంత పెద్ద కుటుంబం కి చెందిన పిల్ల. ఇద్దరూ, క్లాస్స్ ఎగ్గొట్టి, నూన్ షో లు, సముద్రం ఒడ్డు షికార్లు, ఇంటికి వెళ్లి,ఎప్పుడెప్పుడు మళ్లీ కలుసుకుంటామా  అని ఎదురు చూడడం..అన్ని అలాగే అచ్చం అన్ని ప్రేమ కథ ల లాగే జరుగు తున్నాయి..

ఇద్దరూ, మళ్లీ అఖండ మయిన తెలివి గల వారు, పోటి పడి చదివే వారుట. శైలజ ,ప్రకాశం ఇద్దరూ, ఎప్పుడూ ఫస్టే లేదా సేకండూ..
పంచు కోవడమే..ఆ పై రెండు ప్లేసెస్..

ప్రకాశం కి తండ్రి లేదు, తల్లి ఎలాగో చిన్న ఉద్యోగం చేస్తూ ,చదివి స్తోంది, పెద్ద ప్లీడరు అయి, తన ని ఉద్దరిస్తాడని ఆమె ఎదురు చూస్తోంది, ఒక చెల్లెలు, చిన్న తరగతి లో చదువు.

శైలజ ది పెద్ద కుటుంబమే, అన్న లాయరు, తండ్రి కూడా , అందరూ లాయర్ల కుటుంబం అది.

కాలేజ్ లో అందరికి తెలిసింది, ఇంట్లో కూడా తెలిసింది, వీరి ప్రేమ వ్యవహారం..ప్రకాశం ,కుటుంబ నేపధ్యం తెలిసి, శైలజ ఇంట్లో పెద్ద వారు, వద్దు, కాదు కూడదు అన్నారుట ..

ఇంకా చదువు అవాలి, ఆ పై కదా పెళ్లి అవి, ఈ లోపల వారే ఊరుకుంటారు, అని శైలజ మటుకు అధైర్య పడక , ప్రకాశం కి కూడా ధైర్యం చెపుతూ ,ఇద్దరూ, పరీక్షలకి తయారు అవుతున్నారు.

ఇంతలో ప్రకాశం కి అస్వస్థత ...పరీక్షలు చేయిస్తే తెలిసింది, ఒక సమస్య..గుండె లో ఉంది..ఇంకా ఎక్కువ కాలం బతకడు అని..

ఇలాంటి పరీక్షలకి ఏం సమాధానం ఉంటుంది?

ఏ పుస్తకం లో ఉంటుంది జవాబు? 

ఎందుకు అలా ఒక యువకుడి, జీవితం, ప్రేమ, మధ్యలో నిర్దాక్షిణ్యం గా తుంచి వేయ బడతాయి..

ఈ పరీక్ష పత్రం, ఎవరు తయారు చేస్తారు..? చాల కఠినుడు కదా? శైలజ ధైర్యం చెప్పింది, పరీక్షలు రాసారు..ఫలితాలు వచ్చేయి, ఇద్దరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయారు..

నువ్వు నీ దారి, చూసుకో, అంటూ ప్రకాశం, ఎంతో చెప్పాడు..శైలజ మొండి పిల్ల వినలేదు..

పెళ్లి, అయినా, ప్రేమ అయినా, చావు అయిన, జీవితం అయినా ఏదయినా నీతోనే అంది..

కాలేజ్ లో పెద్దలు, స్నేహితులు సమక్షం లో తాళి కట్టేడు ప్రకాశం..

ఇద్దరూ కాపరం మొదలు పెట్టారు..

అయేదేదో ..అవుతుంది..అంటూ..ఇద్దరూ, తమ ప్రేమ పొదరిల్లు ని అందం గా గూడు కట్టుకుని నివసించారు..
వైద్యాలు, పరీక్షలు, మందులు, మాకులు ..ఒక పక్క..వారి ప్రేమ జీవనం మరో పక్క, ప్రకాశం కి తన ప్రేమ పునరాజ్జేవం పోసింది, శైలజ..

అయినా ఒక్కోసారి, కొన్ని పరీక్ష పత్రాలు మరి కఠినం ..అందులో ఎంత కష్ట పడ్డ ..ఫెయిల్ అవుతారు..
ఈ జీవన సమరం పరిక్ష లో ప్రకాశం ఫెయిల్ యిపోయాడు.
మాచ్ ఫిక్సింగ్ అయిపొయింది..ఎప్పుడో ,ఎక్కడో..
ఫౌల్ గేం ..ఆడతారు ఎవరో..

ప్రకాశం , ఒక్క ఏడాది మటుకు ,వారి ప్రేమ పొదరిల్లు కి జీవం పోసి, తను మటుకు మధ్యలో ..ఉంటాను నేస్తం..అంటూ వెళ్ళిపోయాడు..

వింటున్న మాకు, కన్నీళ్ళు కారి పోయాయి..
ఉన్నారు శైలజ లాంటి వారు, ప్రేమ అంటే, వందేళ్ళు బతకడం ముఖ్యం కాదు, మూనాల్లు అయినా కలిసి   బతకాలి ,ప్రేమ ని పంచు కోవాలి, పెంచు కోవాలి, కలబోసు కోవాలి, అంటూ..కల ల ని నిజం చేసుకునే వారు..

మా క్లాస్స్ లో ఒక జంట పెళ్లి చేసుకున్నారు, ఒక జంట విడి పోయారు..

మా ప్రయాణం లో ఒక పదనిస ఈ లా చదువు..అందులో ఒక ప్రేమ గీతం ..ఈ కథ , ఈ నిజం ..ఈ నిజమయిన ప్రేమ కథ..

ఎన్ని సినిమాలు చూసినా ,ఎందుకు ప్రేమ కథలు విసుగు రావు..ఇదే ,ఆ ప్రేమ లో మహత్తు..
ఆ ప్రేమ లో మధురిమ..రెండు మనసుల ఏక స్పందన, ఏక రాగం..ఏక తాళం..అదే మరి ప్రేమ ..అంటే..

చంద్ర ముఖి లాంటి వారు ఉన్నారు..ఉంటారు, ఏమి కాని దేవా దాసు కోసం సమస్తం అర్పించి, మోడు లా బతికే వాళ్ళు ఉన్నారు..ఇవి చరిత్ర చెప్పే నిజాలు..
ఇది ఇవాల్టి నా కథ..ప్రకాశం..శైలజ ల కథ..

ఆమె ఎక్కడ ,ఎలా ఉంది అని అడక్కండి.. మరో ప్రేమ హృదయం లో గూడు కట్టుకునే ఉంటుంది..అని ఆశిన్చుదాం..











6 డిసెం, 2012

సావిత్రి..



మాకు ఊహ తెలిసి, చిలిపి ఊహలు ఉరకలు పరుగులు తీసే వేళ ,తెలుసు కొనవె చెల్లి అని సుద్దులు చెప్పింది...ఓహో అనుకున్నాం..
స్నేహం తో కూడిన ప్రేమ నేర్చుకున్నాం..వెన్నెల లోని వికాసమే ఇది ఈ స్నేహం ,ఈ ప్రేమ..అని..
విరహం ...ఇంత మధురమా? అని సావిత్రి పాటలు పాడు కుంటూ.. అనుభావించెం..
నీవు లేక వీణ..నిదుర లేదన్నది..అని పాటలు కాదు ..నిజం..అని కూడా తెలుసు కున్నాం..
మబ్బు లో ఏముంది? అంటూ..ఆకాసం లో కి చూస్తూ..పరవసించెం..
నీవేనా నను పిలచినది అంటూ ...ఆశ గా అడిగెం..
అన్ని మాకు సావిత్రి ,మహా నటి ..నించి నేర్చుకున్నవే..
జెమిని ట ..ఎంత మోసం..ఈ మగ వారు ఇంతే..
ఎందుకు అంత మొహం లో పడి పోయింది..అయ్యో...ఎంత గా వాడుకుని వదిలేసాడు.
ఇంత నిష్కల్మషం అయిన ,ఆ సుందర వదనం ని పట్టుకున్న నీలి చాయలు.ఏ కర్కశ
హృదయం కల మగవాడు? ఇంత మధురమయిన ప్రేమ ని పంచింది..తిరిగి అంత విషం పంచేడే ..ప్రేమ ఇంత విషమా ??
అని వగచెం..
మంచం మీద కోమా లో ఉందని తెలిసి కన్నీళ్లు ఆపుకోలేక పోయాం..
మన ఇంటికి తెచ్చి ,బాగా సేవలు చేదాం..బతికించుకుందాం..అని ఆశ పడ్డాం..
అంతా భ్రాంతియేనా ? దేవదాసు లో పార్వతి లాగ...ప్రేమ అపజయం ,పొంది, ఎంత విరిగి పోయిందో ..ఆమె మనసు..చిన్న ,చంటి పాప లాంటి మనసు..
మనసు లో ఎంత వెన్నెల లు పూయించ కోక పోతే అంతే చల్ల గా నవ్వ గలదు?
అంత మధురం గా ,మధుర వాణి గా జీవించింది...ఆ నవ్వులు ఇంకా చెవిలో..లొట్టి పిట్ట అంటూ నవ్వులు...భోల భోలా నవ్వులు..ఆమె కే సొంతం..
సావిత్రి అజరామరం..
మన ప్రేమ అంత కలిపి కురిపించి స్వర్గం లో ఆమె కి ఈ రోజు ,నిండు పున్నమి కావాలి..అందరూ ..ఈమె అందం చూసి..అచ్చెరువు పొంది...రంభ ,ఊర్వసి ,మేనక లు తల దించుకోవాలి..
అయ్యో...ఎంత చిన్న వయసు లో నే...
సావిత్రి మన హృదయాల లో పదిలం..
మన కి ప్రేమ ,సంతోషం..ఉప్పొంగి నప్పుడు ..ఆమె పాటలే తలుచు కుంటాం..
వింటాం..చూస్తాం.she is immortal..in our hearts..
ఒక వంక కన్నీరు ఆమె కోసం, మరో కంట సంతోషం ..ఆమె కోసమే.
సావిత్రి...ఇదే నా అర్పణ..