"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

7 ఫిబ్ర, 2013

నాకు రాజకీయాలు అంటే చిరాకు ...

ఆమె తన క్యూట్ ఇంటిలో బందీ 
ఈ పూల గుత్తి ఇలా అమర్చాలి 
ఈ సోఫా సెట్ ఇలాగే ,ఈ మూలే 
ఒక్క అంగుళం కదిలినా అంతా 
అపసవ్యం ..అసహనం..

పొద్దున్న హిందూ పేపర్ మధ్య 
బల్ల పై చక్కగా ..మడత నలగదు 
ఇల్లంతా ,అలా ఎగురుతూ ,నాకు 
నచ్చదు..నా ఇల్లు ఎంత క్యూట్ ..

నా పిల్లలు ఎంత క్యూట్ ..అల్లరి 
అంటే , ఏమిటమ్మా అంటారు..
కాళ్ళకి మట్టి అంటదు, బట్టలు 
నలగవు, చిరగవు..బుద్దిమంతులు ..

నాకు రాజకీయాలు అంటే చిరాకు 
ఏ పార్టీ అయినా ఒకటే నాకు ..
నా ఇంట్లో కి ఆ రాజకీయాలు 
తేకండి..నా ఇల్లు నా స్వర్గం..

నా స్నేహితులు అంతే , అంతా 
నా లాంటి వారే, ఏ వస్తువు కొన్నా 
దాని ఖరీదు బట్టే విలువ ..
ఆ మూలాన అమర్చిన పూల 

గుత్తి విలువ తెలుసా ? మీకు..
ఇంటి నిండా చెత్త పుస్తకాలు 
గుట్టలు ,గుట్టలు గా , నాకసలే 
ఇష్టం ఉండదు, కాఫీ బల్ల పుస్తకం 

ఒక్కటి చాలు ,వెయ్యో 
రెండు వేలో, మా ఇంట్లో పని 
చేసే మనిషి కూడా సినిమా 
స్టార్ లా అందం గా ఉంటుంది..

వంటిల్లు అసలు ఎప్పుడయినా 
వంట చేసాన? అన్నట్టు మెరిసి 
పోతూ ఉంటుంది, నాకంతే 
అంతా నీటు..క్లీను..

ఏమిటి ? గాస్ తెచ్చు కోడానికి 
ఆధార్ కార్డా ? ఆ లైన్ లో నేను 
ఇప్పుడు నిల్చోవాలా? అందరూ 
తప్పనిసరా? ఏమిటి ఈ కొత్త 

రూల్స్..అయినా ఎవరు పెట్టేరు 
ఇలాంటి పనికి రాని...పధకాలు..
ఎవరో..అదే నా రాజకీయాలు అంటే 
అవేనా ..మా ఇంట్లో కి రాజకీయాలు 

వద్దు అనుకున్నానే, ఇలా 
కిటికీ సందుల్లోంచి వంటిట్లోకి 
తోసుకుని వస్తున్నాయి ,పాడు 
రాజకీయాలు, నేను వద్దు అంటూనే 

ఉన్నాను, అయినా, నాకిష్టం లేదు 
అయినా ,ఏమిటి ,ఈ రాజకీయం 
ఇలా గాలి లా వ్యాపించి ,ఇలా 
నా ఇంటిని ,దుర్గంధమయం 

చేస్తోంది? ఇదిగో పని వాళ్ళు 
ఇలా వచ్చి, కొంచం డెట్టాల్ వేసి 
కడగండి, నా ఇల్లు ఒక స్వర్గం ,
నా ఇల్లు ఒక ద్వీపం..నన్ను ఏ 

శక్తి తాకలేదు, నన్ను ఏ రాజకీయం 
అంట లేదు, నేను ఇండియా లోనే 
మరో దేశాన్ని, నేను వేరు ,నా 
ప్రపంచం వేరు,అని చెప్పాలా..

తోసుకుని, తోసుకుని ,ఇలా 
రాజకీయం చేయకండి నా 
మాటలని..నా స్వర్గం లో 
ఇలా విషాలు చిమ్మకండి ..

నా ఇంటి ని ఇలాగే 
క్లీన్ గా, నీట్ గా, తళ తళ 
మెరవనీయండి, ఆ రాజకీయం 
మురికి నాకు అంటించకండి..

చెప్పాగా, మేము వేరు ..
ఈ దేశం లో మరో దేశం మేము..
మా చుట్టూ కంచెలు వేసుకున్నాం 
చూడ లేదా? ఇంక దణ్ణం పొండి ..

మా ఆకుపచ్చ లాన్స్ 
మీ కాళ్ళ తో తోక్కేయకండి..
పొండి ,రాజకీయాలు ఇక్కడ 
మా దగ్గరకి రాకండి..

నా  క్యూట్ ఇంటి ని 
నన్ను వదిలేయండి ప్లీస్..
మేం మా దారిన మేం పోతాం..
మా జోలి కి రాకండి..

అంటూ ఒక స్వీట్ అమ్మ 
వేడుకుంది..సరే, పదండి..
ఓట్లు వేసే మామూలు జనం 
వద్దకు, పదండి..రాజకీయాలు 
కావాలి ట ..వాళ్ళకి..వాళ్ళకే..




5 ఫిబ్ర, 2013

సామాజిక రుగ్మత ...

తెల్లగా మెరిసిపో ..
జుట్టు నల్లగా ,మెత్తగా 
కాళ్ళకి ఈ చెప్పులు 
ఒంటికి ఈ బట్టలు..

అమ్మ ,కూతురు
ఒక్క లాగే అందం గా
ఈ బూస్ట్ తాగితే
నీకు లైఫ్ బూస్ట్..

అమ్మాయి పెళ్ళికి
అబ్బాయి చదువుకి
దాచండి, డబ్బు మా
బ్యాంకు లో...

ఇల్లు కట్టుకో ఇలా
పది మంది నిన్ను
మెచ్చుకోవాలిగా ..
అంటూ ప్రతి నిత్యం

ఊదరగొట్టే ఈ
ప్రకటనలే ,చిన్న తెర
పై... మనపై ఆధిక్యం
చేయట్లేదూ ??

మార్కెట్ శక్తులు అంటే
ఇవే, ఇవే, నువ్వు ఎలా
బ్రతకాలో, ఎలా మెలగాలో
ఎలా మనాలో ఇల పై..

చెవిలో ఇల్లు కట్టుకుని
పోరుతూ ఉంటాయి..
ఏదో ఒక నాడు ,నువ్వు
ఫలానా సోపు కావాలని

అనక పోతావా? అనిపించక
పోతారా? బలమయిన
పాము ని ,చీమలు ఏం
చేయగలవు? ఒట్టి చీమలు..

వరస క్రమం తప్పకుండా
అదే క్రమం లో మనమూ
ఒక నాడు, ముందు వాడు
కొన్నదే ,అదే మన మంచి

అనుకుని కొంటాము..
మన బుద్ధి ,అదిగో అలా
గోడ మీద మేకు కి
తగిలించి వస్తాం ,ఇలా

బజారుకి, కావాల్సింది
పర్సులో ఒక నో టో ,కార్డో
కాని ,ఆలోచించి కొనే వాడు
కాదు..పదండి ,సామూహిక

బజారు చేద్దాం...మన జనం
మనం మంది..మనం పంది ..
అని ఎవరయినా అంటే..
అలాగే కానీయండి ,అంటాం..

మనం అందరం ఒకే
మొహం ధరించి ,ఒకరిని
చూసి ఒకరం..నువ్వింతే
అంటే నువ్వింతే అనుకుంటూ

సామూహిక జోక్ అంటూ
మన మీద మనమే జోక్
అంటూ భలే నవ్వుకుంటాం..
మనం అంతే ,మనం ఒక

సామాజిక రుగ్మత అంటే
అదేదో, పెద్ద జబ్బేమి కాదు..
ఇలాగే ,నవ్వుకుంటూ ఉంటామే
అదే..అదే..అదే..హ్మ్మ్ ..అదే ..

4 ఫిబ్ర, 2013

నిర్భయ..

అడుగులు ముందుకే 
చూపులే వెనక్కి..
ఆ అబ్బాయి ఎవడో?
ఆ వెనక నున్న అంకల్ 
కి అదేం బుద్ది ,అలా 
ఇకలిస్తాడు ..చున్ని 
పక్కకి తోలిగిందా ??

హు,ఇవాళ జీన్స్ షర్టు 
కదా, అయినా ఏదో 
మర్చిపోయినట్టు ..
ఎప్పుడూ ఆడ పిల్లని 
చూడలేదా? ఏమిటా 
చూపులు, రెండు చక్రాలు 
గా చేసి, నా చెస్ట్ మీదకి 
విసిరి ,కోసేస్తున్నాడు ..
వెధవ చూపులతో..

అమ్మ పాలు తాగలేదా 
అయినా నేను కూడా 
ఎందుకు అలా పట్టించు 
కోవడం, నా దారి న నేను 
పోతాను, అదిగో నా బస్సు..

అమ్మో ,బస్సు ఫుల్ 
ఇవాళ కూడా నిల్చునే 
తప్పదు, పుస్తకాల సంచి 
గుండెకి హత్తుకుని, 
పాకెట్లో నించి పది 
రూపాయల కాగితం 
ఇచ్చినారాయణ   కాలేజ్ 
అంటూ టికెట్ కోసం చేయి 
చాపితే, ఒక అయిదు రూపాయల 
బిళ్ళ చేతిలో పెట్టి, చెయ్యి 
నిమిరాడు, యాభై ఏళ్ళ 
నడి వయసు కండక్టరు..

చేతి మీద ఆసిడ్ పోసినట్టు 
మండింది, ఒక చూపు 
తీక్షణం గా వాడి వీపు ని 
తాకి, జారి పోయింది..
సిగ్గు లేని వాడికి ,చూపుల 
తిట్లు పడతాయా? వీడికి 
నా అంత కూతురు ఉంటుంది..

ఇంకా కళాశాల లో చెవులు 
మూసుకుని , సిగ్గు శరం 
మానం ,అవమానం ,మూట 
కట్టి సముద్రం లో పడేసి 
రావాల్సిందే...అయినా ఆ 
మలైకా , ఆ పడుకొనే అలా 
అందాలు పార పోస్తారు..
ఇంకా ఎందుకు మాలాంటి 
అమ్మాయిల మీద కూడా 
ఆ ఎంగిలి చూపులు?

అవి అందని దూరం 
అందాలు, ఇవి ఎదురుగా 
కనిపించే కమ్మని అందాలు 
అన్నాడు ఒకడు..
చూపులతో నే ఎంత 
తాగుతారో? సిగేరెట్టు ఆఖరి 
దమ్ము వరకు పీల్చినట్టు..

ఒళ్లంతా చిర చిర..ఏదో పుండు 
సలిపినట్టు బాధ..నా మానం 
ఎవరో దోచినట్టే..ఈ చూపుల 
స్పర్శ ఎంత చీదరో? అమ్మా..
నన్నెందుకు కన్నావమ్మా?

అమీబా , హైడ్రా ...తల 
లో ఆలోచనల హైడ్రా ..
అమీబా లో మారిపోతున్న 
అసహనం..రూపం..
ఈ శరీరం నాదేనా? నా సొంతమేనా?
ఏదో అరువు శరీరం ,అనిపిస్తోంది..

ఈ బరువు, ఈ బాధ, యే 
మూల నించి ఎక్కడికి 
పాకుతుందో..ఎక్కడ పడగ 
ఎత్తుతుందో? మధ్యలో ఈ 
నెలసరి బాధ ,ఒకటి, 
తునక తునకలు చేస్తూ,
ఎవరికీ అర్ధం అవుతుంది, 
ఈ చిరునవ్వు వెనక ,
కడుపు ని తిప్పేసే బాధ..

చూపులు, చూపులు 
తూట్లు పొడిచే చూపులు..
ముందుకి ఒంగి, ఉండలా 
చుట్టుకు పోవాలి అనిపిస్తుంది 
ఏమిటా గూని నడకా అనే 
అమ్మ కి తెలియదా? ఎందుకో?

ఇంటికి చేరే సరికి నిర్భయ 
కళ్ళు మూసింది, నిర్దయ 
లోకం నించి వెళ్ళిపోయింది 
నిర్ద్వందం గా ఛీ కొట్టి ,
విసిగి పోయి వెళ్ళిపోయింది.
అని వార్త..

నేను ..నేను...ఒక 
కన్ను మూయని నిర్భయ నే 
ఇంకా నేను నా సమరం 
కొనసాగిస్తున్నాను ...ప్రతి దినం 
నా ఒళ్ళు జ్వలిస్తూ, నశించి 
నిముషం ,నిముషం కొంచం కొంచం 
నిర్భయ గా జీవిస్తున్న నన్ను 
చూసారా ? మీరు..చూడండి ..











2 ఫిబ్ర, 2013

మరే..అలవాటు పడిపోతాం ట

ఒక సారి కట్టి విడిచిన కొత్త 
చీర, మడతలు పెడుతూ 
అబ్బ ,నలిగి పోయిందే 
అంటూ విసుగ్గా మొహం 
పెట్టి ,బీరువాలో పడేసాను..

కాలి కి చెప్పు ,సరే సరి, 
వాడుతూ ఉండండి, మీ 
పాదం కి సరిగ్గా సరి పోతుంది 
అంటూ ,అంటకట్టేడు, నేను 
చూసుకోవద్దూ, ఇప్పుడు 
కరుస్తున్నాయి,సరే చూద్దాం 
అని ఒక మూల దాచేను..

నిన్నటి ,గుబాళింపు మల్లె 
మాలేనా? అసహ్యం గా ఎలా 
ఉందో ? దారం ఒక్కటే వేలాడుతూ 
నాలుగు మాసిన పువ్వులు..
ఒక్క రాత్రేనా మల్లె జీవిత కాలం..
హు..నిట్టూర్పు .నా జీవితం  లాగే..

ఏమిటో ? ఎందుకో ? ఇలాగే 
ఉంటోంది, ప్రేమించి చేసుకున్న 
కాపురం, ఎవరి పోరు లేదు,
మాలో ను, పోట్లాటలు లేవు..
పెద్దగా, అంటే నాకు నీలం 
రంగు పెద్ద ఇష్టం లేదు అనగానే 
నేను లోపలి వెళ్లి చీర మార్చేస్తా మరి ..

నాకు గళ్ళ షర్టు భలే ఇష్టం 
అంటే అతను వేసుకున్న లేత 
గోధుమ రంగు షర్టు కేసి చూసి 
దీనికేం బాగానే ఉంది గా అంటూ
పద ,పద అంటూ నాకిష్టం లేని 
హిందీ సినిమా కి వెల్తామ్ .

ఏముంది ఆ తెలుగు సినిమాల్లో 
అంటూ క్రిటిక్ అయిపోతాడు..
ఏముందో, ఏమిటో మరి ఎందుకో 
నాకు తెలుగు సినిమాలే ఇష్టం..

నాకు ఇవాళ ఇంట్లో తినాలని లేదు..
పద ,పద మని తొందర పెట్టేడు.
ఇంట్లో వండిన వన్నీ ,రేపటికి సద్దె 
నాకు నీరసం గా ఉంది, బయట 
నించి ఏమయినా తెండి అంటే,
రోజూ బజారు తిండి, అందుకే 
ఆరోగ్యాలు ఇలా తగలడ్డాయి 
అంటూ రుసరుసలు..

నా నీరసం పైకి ఎగిరి పోయి,
వంటిట్లో గిన్నెల మోత ,
తిరగమోత తప్పదు నాకు..
మనసులో నలత కి పేరే లేదు..

అమ్మో ,ఇంకా వందేళ్ళు కాపరమా ?
నీరసం అప్పుడే, నలిగిపోయిన చీర 
నయితే ఒక మూల పడేసాను..
కరిచే చెప్పు ని అటక ఎక్కించెను..
ఇంకా మల్లె మాల అయితే ఊడ్చిన 
కసవు లోకి చేరింది..ఈ పెళ్లి 

మంత్రం ని ఏం చేయాలి?
నిత్య నూతనం గా ఉండాలి ట ..
దీవెనెలు గుర్తు వచ్చాయి..
చప్పట్లు కయినా దాంపత్యానికయినా 
ముచ్చటగా రెండు చేతులు, 
రెండు మనసులు ఉండాలి కదా..

ఒక్క చేత్తో చప్పట్లు కొట్టినట్టు 
ఈ వోటి సంసారం కుండ లో 
తియ్యని నీళ్ళు ఎలా వస్తాయి?
అతలాకుతలం గా కుతకుత లాడింది 
మనసు, తెలియని బాధ తో 
నీరసించింది మనసు..

సంసారలన్నీ  ఇంతే అమ్మ 
తేల్చేసి చెప్పేసింది ,సినిమాల 
లాగ ఉండవే ,ఎప్పుడూ డ్యుఎట్ 
లో అవేవో ,పాడుకుంటూ ఉంటారా?
అవ్వ..సద్దుకుపోవాలి అంటూ 
అమ్మ గీతోపదేశం..

అదే ఆ సద్దుకు పోవడమే, 
ఆ సద్దుకు పోవడమే, ఎప్పుడూ 
నా వంతేనా ? అంటూ నొసలు 
చిట్లిస్తే .అదిగో అలా మొహం పెట్టకు 
అంటూ చివాట్లిసింది..

అదిగో అక్కడే మరి అమ్మ కి 
అతని కి తేడా? నా మనసులో 
పుట్టిన ,పుట్టబోయే ప్రతి 
ఆలోచన కి మాట రూపం ఇస్తుంది 
అమ్మ, మరి ఎందుకో? ఈయన 
మాటల్లో చెప్పినా అర్ధం చేసుకోడు?

మరి నేను ఇష్టపడ్డ అతనే గా?
నవ్వు వచ్చింది, వాడ గా వాడ గా 
పాదం కి సరిపోతాయి ,అని చెప్పుల 
షాప్ వాడు చెప్పినట్టు, కలిసి 
ఉండగా, ఉండగా,సరిపోతాడు 
నాకు అనుకున్నానా? నేను..
ఏమో ....అనుకున్నానేమో..
మూల పడేసిన చెప్పుల జత 
తిరిగి వాడడం మొదలు పెట్టింది..

అదో హాయి..ఆ కరవడమే ఒక 
హాయి..అంతే..ఎంతలో ..ఇంతలో 
చెప్పులు అలవాటు పడిపోతాయి ట ...
మరే..అలవాటు పడిపోతాం ట ..















1 ఫిబ్ర, 2013

ప్రేమలేఖ అంటే

సన్నజాజి తొడిమ కి తెలుసా 
తను మోసేది పరిమళం అని?
నిశి రాతిరి కి తెలుసా తను 
పూసేది నలుపు రంగు అని?

పుడమి ని తడిపే వాన చుక్క 
కి తెలుసా ,చుక్క చుక్క ..
పచ్చదనం కి ఊపిరి అని..
నల్ల ,నల్ల మబ్బులకేమి 
తెలుసు ,చమక్ చమక్ 
వెండి తీగలు మోస్తోందని..

మన్నించే మాట కి తెలుసా 
మన్నన  వెనువెంటే అని..
ప్రేమించే మనసుకి తెలుసా 
ప్రేమ కి కూడా ఒక మనసు 
ఉంటుందని, అప్పుడే ప్రేమ 
నిలిచే ఉంటుందని..

మాట ,మాట కి ఒక అర్ధం 
అలాగే ,మౌనం కి ఒక అర్ధం..
ఏ భాష అక్కరలేని మరో 
భాష..ఒక్క కంటి చూపు..
పెదవి ని దాటని ఒక 
చెలి చిరునవ్వు, పంటి 
కింద తొక్కిపెట్టిన చిరు 
చిరు హాసం..అదే మరి 
ఆమె భాష..అదే మరి నీకు 
ఆమె పంపే తోలి ప్రేమలేఖ..

కన్నులతో చెప్పిన 
పెదవులు పలకని తొలి 
ప్రేమ లేఖ ని అందుకున్న 
ఆమె వదనం లో నీకు 
అరచేతిలో చందమామ 
కనిపించిందా? అయితే 
సరే, కాసిన్ని తారలు కూడా 
తెంపి ఆమె నల్లని జడ నింపు..

ఆ వాలు జడ ఒక్కసారి 
విసిరితే ,నీ ఒళ్లేనే రాలుతాయి 
లే చుక్కలు, తారలు..
గోదావరి నది ఒమ్పులన్ని 
ఆమె మేని లో ఉన్నాయి నిజమే 
కాని, ఆమె కళ్ళ నిండి ఒక్క 
కన్నీరు చుక్క కారినా 
గోదావరి కి వరద ఒచ్చిన్నంత 
భీభత్సం , సరే మరి కాసుకో..

ప్రేమలేఖ అంటే ఏదో కాగితం 
కలం ,కాసింత పడి కట్టు 
పదాలు కాదబ్బాయ్..నీ 
మనసులో పూసిన ప్రతి 
సంతోషం ,ఆమె మనసులో 
ప్రతిఫలించాలి, ఆమె మనసులో 
నీ నవ్వే గుడిగంటలు కావాలి..

మాటలే అక్కర్లేని మనసు 
పుస్తకం లో రాయని మాటలు 
తోట పూయించే సన్నజాజి 
పరిమళం..తొడిమ కి తెలియని 
పరిమళం..పూవు కి ఎక్కడిదో?

అదే కదా ప్రేమతో ప్రేమ 
ని పూయించడం..ప్రేమ ప్రేమ ని 
ప్రేమించడం..మనసు ని 
పరిమళం తో నింపడం..






31 జన, 2013

నాకూ ఒక కల ఉంది.

ఎక్కడ నీ ఆత్మ స్వేచ్చా గానం 
పాడుతుందో ,అక్కడ 
అక్కడ జీవించాలి అని 
ఎవరు అన్నారు?

ఇక్కడ స్వేచ్చ అంటే గొలుసులు 
మతం పేరున ఒకటి 
కులం పేరున ఒకటి,
లైంగిక వివక్ష అంటూ మరొకటి 

ఇన్ని గొలుసులు కాళ్ళకి 
మెడ కి , అలంకారం అంటూ 
నమ్మించి వేసారు..
అసలు ఊపిరి ,మాట 

ఆడకుండా వేసిన గొలుసు 
ఒకటి ఉంది,కనపడుండా 
ఈ మాట ,అనకు,
ఈ పాట పాడకు ,
ఈ సినిమా చూడకు..
ఈ సినిమా తీయకు..

కుడి ,ఎడమ ఎటు 
తిప్పి చూసినా నల్లటి 
గోడ ఒకటి కనపడుతుంది 
నువ్వు ఏమి రాసినా 
ఆ గోడ పీల్చుకుంటూ 

నల్లటి విషాన్ని నీపై 
కక్కుతుంది, అదే మరి 
పెద్ద గోడ, పెద్ద దిక్కు 
పెద్దలకి పెద్దమ్మ దిక్కు..

మతం ,కులం ,ఇంకా 
ఎన్ని గోడలు కట్టినా 
స్వాగతం, విడి పోయి 
బతుకుదాం..మనం 

ఇదే మన గీతం ఇప్పుడు 
మతాలుగా ,కులాలు గా 
విడిపోయి చుట్టూ ,బలమయిన 
దుర్భేధ్యమయిన గోడలు 

కట్టుకుందాం ,మనకింకేమి 
పోయేదు లేదు, ఒక్క జీవం తప్ప..
సత్యం ,శివం ,సుందరం ..
ఎవరు వారు? ఏ కులం వారు?

అని అడిగే కూడలి లో 
నిస్సిగ్గుగా నిల్చుని ఉన్నాం..
ఆలోచన , కారుణ్యం 
ఎండిపోయిన నదులు ..

మన పాప భూమిలో ఇప్పుడు 
ఇంకా పెద్ద గా కోల్పోయేది 
ఏమి లేదు, రండి..రండి,
విడి విడి గా ఎవరి ద్వీపం 

వారు నిర్మించుకుందాం..
ఎవరి పాము పుట్టలు వారు 
పెరట్లో ,పాలు పోసి పెంచే 
విష సర్పాలు ఈ సంకెళ్ళు 

నాకూ ఒక్క స్వప్నం ఉంది..
నాకూ ఒక కల ఉంది,
ఈ సంకెళ్ళు ఖణేల్ ఖణేల్ 
మని విడిపోయినట్టు 

ఈ గొలుసులు తెగి పడి 
ఆ దారిలో పువ్వులు 
పూసినట్టు, ఆ నదులు 
ఇంకిన చారల లో తల్లి 

పాలు లాంటి కరుణ ఉబికి 
ప్రవహించినట్టు, మనుషులు 
చేతులు చేతులు కట్టుకుని 
మానవత్వం రన్ ల రన్నింగ్ 

చేస్తున్నట్ట్టు..నాకూ ఒక కల ఉంది..
నాకూ ఒక స్వప్నం ఉంది..
రేపటి ఒక వేకువ కోసం..ఈనాడు 
కనే ఈ కల ..కల్లేనా ...కలా..ఎలా??








30 జన, 2013

చెట్టే నా ఆదర్శం ..చెట్టే..

నేను అలా నడుచుకుంటూ 
ఊరు చివర కి చేరా,నాగరికత అంచున ,అడవి 
దారి మొదలయ్యే చోటు..

జర జరా జారుతున్న రోడ్డు కటూ ,ఇటూ ,అమ్మ 
ఆశీర్వాదం లా దట్టం గా అలుముకున్న చెట్లు..

ఆకాశానికి ,భూమికి మధ్య పచ్చని జాబులు 
నిరంతరం ఏవో ఊసులు పంచుకుంటూ ఉంటాయి మరి..

చిక్కటి చీకటి అజ్ఞానం లా పరుచుకుంది, అమావాస్య కాబోలు.
ఆకులు సడి సన్నగిల్లి, ఆఖరి పిట్ట ఊసులూ ఆగిపోయాయి..
నగరం నాకు ఒంటరితనం పంచింది, ఈ చెట్టు ఊసులు 
నేర్పుతోంది..విను ,విను నేను పంపే సందేశం విను 
ఆకాశం నీలి రంగు ని తుంపి పువ్వుల్లా ,నా జడ లో తురుముకుంటాను, 

అప్పుడప్పుడు చందమామ పువ్వు ,చల్లగా చామంతి లా పూస్తుంది
నా కొమ్మల మధ్య, ప్రతి ఉదయం ఎర్రని బంతి నా ఆకుల మధ్య 
చిక్కుకుని, బాగున్నావా అంటూ పలకరించి సరే మరి అని 
సెలవు తీసుకుంటుంది సాయంత్రానికి , అపురూప స్నేహం మాది,
ఎప్పుడూ ఏమీ ఆశించడు ..నిత్యం అదే పలకరింపు 
నాన్న లా భుజం తడుతూ..నేను ఎప్పుడూ ఒంటరి అనుకోను..

కింద నేల ,ఎక్కెడెక్కడి చేమ తెచ్చి నా గొంతు లో పోస్తుంది 
అచ్చం అమ్మ పోసే పాలు లా అనుక్షణం నా క్షేమమే ,తలుస్తూ..
నేను మెల్ల మెల్ల గా సేద తీరేను.చెట్టు ,అనాది గా చెపుతున్న 
అనగనగా కథలు ,చెవిలో ప్రియం గా వినబడుతూ ..
తటాలున ఎందుకో పైకి చూసేను, ఆకాశం చెట్టు కి 
పూసిన తారలు కనిపించాయి,ఎంత అందమో ,కాని ఎంత దూరమో 
అనుకునే లోపల, చెట్టు దయగా నాకు చూపించింది ,తనలోని 
ఆకాశం ని, ఒళ్లంతా మిణుగుర్లు ధరించింది ,ఒక్కసారి నాకు 
గగుర్పాటు , అమ్మో, ఆకాశమే నా చేతికి అందే దూరం లో 
మిణుగుర్లు మిల మిలా మెరుస్తూ ఫకాలున నవ్వుతున్నట్టు తోచింది..

వెర్రి మానవుడా , అని. కూర్చున్న కొమ్మ నే నరుక్కునే పిచ్చి వాడా?
అని పక పకా నవ్వుతున్నాయి..అదిగో ,చెట్టు ,ఆకులు ,మిణుగుర్లు ...

నేను నా నాగరికత వేపు..వెనక్కి అడుగులు ...ముందుకా 
ఈ అడుగులు నిజం గా ?వెనక్కా? చెట్టు స్థిరం గా అక్కడే..

చెట్టు స్థిరం గా అక్కడే..నాకు సందేశం ..నాకు  ఊరట..
నాకు ఆదేశం , నాకు ఆశీర్వాదం  చెట్టే నా ఆదర్శం ..చెట్టే..