"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

23 ఏప్రి, 2013

పెను నిద్దుర ...

అర్ధరాత్రి నిద్దురలో మెలకువ 
వచ్చి కల ని సరి జేసుకున్నాను 
నా కల నేనే రచిస్తాను ,రోజూ 
మెలకువ లో తీరని కోరికల 
పట్టి ఒకటి తయారు చేసి, 
తల కింద పెట్టుకుని , కలత గా 
నిదుర పోతాను, కల ఒకటి 
వస్తుంది, నా కోరిక తీరిన కల 
ఇంతలో మెలకువ కూడా , 
ఇలా నా జీవితం మొత్తం 
నిదుర లోనే గడిచి పోతుంది . 

జీవించడం అలసట 
అనిపించి ,అప్పుడప్పుడు ఇలా 
కలత నిదురో, కలో తెలియని 
అయోమయం లోకి వెళ్లి 
అలసట తీర్చుకుంటాను . 

ఎందుకో ధైర్యం గా 
పులి నైనా ఎదుర్కుంటాను కాని ,
ఈ జీవిత వ్యాఘ్రం నన్ను తినేస్తూ 
నా ఎముకుల బోలు ని 
రాల్చేస్తూ కాల్చేస్తుంది నిలువునా .. 


ఇంక ఎప్పుడయినా ఆలోచిద్దాం 
ఎలా జీవించాలో ?
ముందు నన్ను ఆత్మరక్షణ 
చేసుకోనివ్వండి , 
నా వెనకకి పరుగుని ఆపకండి ,
దయచేసి .. 
నా పెను నిద్దుర లోకి 
నా ప్రయాణం ఆపకండి మరి .. 

20 ఏప్రి, 2013

నా నీలి ఆకాశం ..

అలసట గా అనిపించి 
అలవోకగా వెనక్కి వాలితే 
ఆకాశం పలకరించింది ,
నేను మర్చిపోయిన ఆకాశం . 

చిన్నప్పుడెప్పుడో ,
ఒక కల విత్తనం నాటాను ఈ 
నీలి ఆకాశం లోనే, ఇంక మొదలు 
ఏడు రంగుల హరివిల్లు కోసం 
ఎదురుచూపులు . 

ఆ మధ్యే ,ఎందుకో విసుగు 
చికాకు, నిప్పులు చిమ్మే ఎండలు 
అతివృష్టి తప్ప ,నెమ్మది గా 
కలలు ఆరబోసుకునే మునుపటి 
ఆకాశం ఏది? నా నీలి ఆకాశం .. 

నా మబ్బులు తుడిచిన పలక 
లాంటి నీలి ,నీలి ఆకాశం ,ఏ 
దొంగలు కాజేసారో ? కలలే రాని 
కమ్మటి నిద్ర , ఎవరు కాజేసారో ?

మళ్లీ , మళ్లీ ఎప్పుడో ఆ కల 
విత్తనం నాటే శుభ ఘడియ , 
అని అంతటా వెతుకుతూ ఉండగా 
ఏవో మనసు  గొళ్లేలు విడి విడిన 
సందడి , చీకటి మూలల వెలుగు 
కడిగేస్తూ, చిరు చిరు దివ్వెలు 
కన్నుల వెలిగిస్తూ, కన్నుల ముందే 
నీలి ఆకాశం ,హరివిల్లు కల ని 
సాకారం చేసుకుంటూ , కమ్మటి 
నిద్దురని కంటి నిండుగా కాచి పోసింది . 

అవును, నా ఆకాశం లో నా 
నిద్దుర ,నా కల తిరిగి దొరికాయి ,
ఒక్కసారి లోపలి చూసుకున్న 
ఆ నీలి రంగు వికాసం అంటుకుంటే
మరి పోదు , నీలి రంగు వికాసం కి 
పూస్తాయి ఏడు రంగుల హరివిల్లులు. 
నా నిద్దుర , నా కల ,నా ఆకాశం . 
మరెప్పుడూ నావే , ఎప్పుడూ ఇంకా నావే .. 


19 ఏప్రి, 2013

కథలు రాసే వాడి మొహం ...

కథలు రాసే వాడి మొహం 
అంటూ ఏమయినా ఉంటుందా? 
ఏమో ,కథలు రాసే వాడు ఎలా 
ఉంటాడు? అని ఆలోచనలో పడ్డాను . 

పొద్దున్నే నిద్ర లేచి అరచేయి లో 
లక్ష్మి ని చూసుకుని, కాఫీ అయిందా అంటూ 
ఒక్క అరుపు, బాత్రూం లో దూరిపోతూ 
అరిచి.. ఇంత లేట్ అయిందా ? నన్ను 
నిద్ర ఎందుకు లేపలేదు? అని ఒక 
సత్కారమ్ శాలువా భార్యకి కప్పి ,
ఒక్క కిక్ తో స్కూటర్ కి ప్రాణం పోసి 
గర్వం గా ,నా కథ కి ఈ మారు అయినా 
వెయ్యిన్నూట పదహార్లు ఇస్తారా ? 
ఆ ఎడిటర్ కి నా తడాఖా తెలియదు ,
నేను తలచుకుంటే, అంటూ ఊహల్లో 
ఎప్పుడు జేరుతాడో ఆఫీసు. 

అందరూ నంగిరి మొహాలే , కథల్రాసే 
ఫలానా ఆయన అని ఒక్కరూ 
పరిచయం చేయరు, అంతా నేనే 
చెప్పుకోవాలి, ప్రవర ఖర్మ.. 
ఫలానా కథల పొటి లో నాకు 
మూడో బహుమతి , ఏదో 
మతలబు జరిగే ఉంటుంది ,లేక పోతే 
అంత గొప్ప మానవీయ కథకి 
మూడో బహుమతా ? మరి తీసికట్టు గా 
ఈ మారయినా ప్రధమ బహుమతి కొట్టేసి 
శ్రీమతి కి ఒక బంగారు గాజుల జత . ఊహు, 
గాజులు రావు, బంగారం ధర కొండెక్కి 
కూర్చుంది, ఒక ముక్కు పుడక 
చ, అన్యాయం గా ఇంత చీపు ఊహలేం ?

ప్రభుత్వ ఆఫీసు లో జరిగే అన్ని 
లంచాల కార్యక్రమాలు ,చూసి చూసి, 
దళసరి అయిన చర్మం తో ఒడుపుగా 
సొరుగు నింపి, చిల్లర మహా లక్ష్మి 
ఎందుకు కాదనాలి? అంటూ ఒక చేత్తో 
ఆ చల్లని లచ్చిం దేవి కి ఒక నమస్కారం కొట్టి, 
కాస్త తీరుబడి గా వెనక్కి వాలి, రేపు 
మంచి  రోజు, శ్రీ అంటూ రాసుకుని, కథ 
రాసేయడం మొదలు పెట్టాలి, అల్లా 
మొదటి బహుమతి వచ్చిన ఫలానా 
రచయిత కన్నా ,గొప్ప ఎలిమెంట్ ఉండాలి 
నా కథ చదివి, కన్నీరు తో తడి అయిపోవాలి 
పాఠకులు, అవును మార్చే పోయాను 
ఆ రొమాంటిక్ కథల పోటి సంగతి, 
ఎక్కడా ,నా శ్రీమతి శ్రీలక్ష్మి తో రొమాన్స్ 
హు .. ఎవడితో చెప్పుకోను ?అలసి పోయాను 
అంటుంది, ఇంకేం ఉంది, నా కథలకి 
ఎక్కడ నించి వస్తుంది మరి? లవ్వు  ??


సాయంత్రం తీరుబడి గా వీధి వీధి 
తిరుగుతూ, కథల కోసం ఆబగా 
షుగర్ పేషంట్ మిఠాయి కొట్ల వేపు 
చూసినట్టు, ఈ చెప్పులు కుట్టే వాడు 
నాకు తెలిసి ఎన్నేల్లుగా ఇదే పని ,
వాడి కష్టాలు , కుటుంబం వివరాలు 
అడగనా పోనీ ? వద్దులే, ఇప్పటికే
చాల కథలే వచ్చాయి, మరో
మంచి కథా వస్తువు వెదకాలి, అలా 
ఒక్క సారి ,కనక మహా లక్ష్మి వారి 
మందు దుకాణం ముందు ఆపనా ?
ఇంట్లోకి తెస్తే కాళ్ళు విరగ్గోడుతుంది 
కాని, ఇక్కడే ఒక అర గ్లాసు పుచ్చుకుంటే 
కథ రాసే మూడ్ వస్తుందేమో ?

వీధి వీధి తిరిగినా ఎక్కడా ఒక్క కథ 
స్టొరీ పుట్టలేదు, ఏమిటి ,మన దేశం లో 
కొంప దీసి దారిద్ర్యం, మధ్య తరగతి 
మిథ్య విలువల కష్టాలు ఇంక లేవా 
ఏమిటి? అమ్మో, గోప్పోళ్ళ కథ ల లో 
స్టొరీ ఏముంటుంది? నాలాంటి రచయిత 
ఇంక మట్టి గొట్టుకుపొతాడు .. చా చా 
కథలే కరువయిన దేశం రా ఇది ,గొడ్డు 
పోయింది, స్కూటర్ స్టాండ్ వేసే లోపల 
భార్య శ్రీలక్ష్మి ,ఏమండి ,మన ఇంట్లో పని 
చేసే సత్తి ని మొగుడు చావ గొట్టాడుట ,
పాపం, పని లోకి రాలేనని కబురు పంపింది 
లుంగీ లో కి మారి ఏది ఒకసారి చెప్పు మళ్లీ ,
హమ్మయ్య కథలు రాసే మొహం ఇలా ఉంటుందా ?

ఏమో మరి.. 






11 ఏప్రి, 2013

ప్రకృతి కి వికృతి ..

తీయగా పాడు 
అంటూ కోయిలని 
శాసించలేవు.. 

చల్లగా వీచు 
అంటూ గాలిని 
ఆజ్ఞాపించలేవు 

ఆగిపో ,చలించడం 
ఆగిపో అంటూ 
నది నీరు ని 
కోరలేవు .. 

ఒక్కసారి మాయం 
అయిపో కాంతి ని 
తీసుకు పో  అంటూ 
వెన్నెల కి 
మసిబూయలేవు 

అలలు ను  ఆపు 
ఒక్కసారి అంటూ 
సాగరానికి 
అడ్డు కట్టు వేయలేవు . 

ప్రతి రోజు 
ఉదయించే సూర్యుడి ని 
ఏమయినా ఆపగలవా?
ఈ ఒక్క రోజు ఆగిపో 
అనేది అసంభవ క్రియ . 


ఈ ప్రకృతి సమస్తం 
తమ  శాశనం 
తాము రాసుకున్నాయి 
సమ తూకం లో 
తామే ఒక నిదర్సనం . 

ఎందుకో 
మనిషే ఒక అసమాపక క్రియ 
ఒక అసంపూర్ణ కథ 
ప్రకృతి కి వికృతి .. 
ఏనాడు ప్రకృతి కి
పర్యాయ పదం మనిషి 
అవుతాడో ఆ రోజే 
యుగాది .. 












10 ఏప్రి, 2013

మరో దారి లేదు. ...

అలల పై కవిత్వం రాయాలని 
నది ఒడ్డున కూర్చున్నా 
ప్రతి పదం నది లో నాని పోయింది 
ఇంకా ఏముంది ?
పొడిగా , దండిగా ఇంకా నీ 
మాటల పొట్లం లో వేడి గా 
ఏదయినా విప్పు, పరచు 
అంటూ నన్ను నిప్పులా రగిలిచింది . 

పూల మొగ్గల ముందు 
జాలిగా వాలాను, నాలుగు పదాల 
పుప్పొడి జోలి లో పడేయమని, 
నీరు పోసావా ? నారు పోసావా ?
అంటూ కళ్ళల్లో నీళ్ళు 
తెప్పించి, వెళ్లి నీ మాటల విత్తులు 
జల్లు ,ఎప్పుడో ఒకనాడు 
పదాల పంట పండొచ్చు ముచ్చటగా .. 
అంటూ తరిమి కొట్టింది , 
మట్టి వాసన చూసి రా పో అంటూ .. 

ఆకాశం వేపు ఆశగా చూసాను ,పైకి 
ఎర్రని ఎండ కి కళ్ళ కి చేయి అడ్డం పెట్టి 
ఒక్క మేఘం అయినా అటు వెళుతూ 
నాలుగు చుక్కల పదాల వర్షం 
నా పరచిన చీర కొంగు ని తడిపేస్తూ 
వర్షిస్తాడు అని, వడి వడి గా మేఘం మరో 
దేశాన్ని ముంచేయడానికి వెళుతూ 
చేయి ఖాళి లేదు, నువ్వొక కురిసే 
మబ్బువు కాలేవా , కాసింత కరుణ కురిపిస్తూ 
అంటూ అంత ఎండిన గుండెలేం ,మీవి 
తడి తడి గా ఉండడం నేర్చుకోండి అంటూ 
విసిరి కొట్టింది ,సుడి గాలితో కొట్టి . 

నా నేలా , నా భూమి ,నా ఆకాశం 
గుప్పెడయినా ఇంక సొంతం 
చేసుకోవాలి మరి.. 
ఇంక మరో దారి లేదు. . 
మరో దారి లేదు. 



'నేను'

'నేను' అనే నా ఉనికి ని 
నిలబెట్టే నా ఆంతర్యం 
నా వర్గ లక్షణం ,
నా చదువు ఇచ్చే గర్వం 
నా పుట్టుక ఇచ్చిన 
కుటుంబ నేపధ్యం ,
నేను నేర్చుకున్న 
నా అలవాట్లు , నా చుట్టూ 
నేను ఏర్పరుచుకున్న 
రక్షణ వలయం .. 
నించి విడి వడి .. 
' నేను ' ఏమిటో ??

ఉల్లిపాయ పొరల లాగ 
ఒక్కొక్కటి వలుస్తూ వెళితే 
ఏమి మిగుల్తుందో నాకు తెలుసు 
అతి చిన్న నేను అనే పదార్ధం 
చుట్టూ పేర్చిన పల్చని 
పొరలు , కాసిని కన్నీళ్ళు 
కాపలా తో, అవును నేను 
ఎన్ని వలయాల మధ్య 
కప్పబడి ఉన్నానో ? నాకు 
తెలుసు.. 

నేను అంటే 'నేను' గా ఎప్పుడు 
ఉన్నాను కనుక ?
శిశువుగా నోట్లో వేలు చప్పరిస్తూ 
అనంత మైన హాయి ని 
అనుభవించి నప్పుడే.. 
జ్ఞానం మడతలు మడతలు గా 
నా ఒంటి మీద పడి , నేను సిగ్గు 
అభినయించడం నేర్చుకున్న రోజు 
'నేను ' కోల్పోయిన రోజు అనుకుంటా .. 

'నేను' కోసం వెతుక్కుంటూ మరో 
ప్రయాణం ఎప్పుడూ వెనక అడుగే 
తెలిసిందంతా ముందు
వదిలించుకోవడం ఒక ప్రయాస 
( to get rid of the knowing 
and going back to unknowing )
అజ్ఞానం ని ఎందుకో ఈ రోజు 
ఆహ్వానిస్తున్నాను .. 
'నేను '..ఆవిష్కరించడం కోసం ... 


















9 ఏప్రి, 2013

ఈ క్షణం ..

అవును ఎంత నిజం 
ఈ క్షణం ,ఈ జీవిస్తున్న క్షణం 
ఒక్కటే నిజం .. 
నిన్న గడిచి పోయిన కాలం ,
పిడికిలి లోంచి జారిపోయిన ఇసుక 
ఇసుక ని పిండి తైలం తీయవచ్చేమో 
కాని నిన్న మటుకు రాలేదు . 

నిన్న ఒక పాఠం.. 
నిన్న ఒక చరిత్ర ,
నిన్న ఒక వగచాటు ,
నిన్న తీరి పోయిన కల . 
నిన్న కోలుకోలేని వ్యధ 
నిన్న ఎప్పటికి నిన్న గా 
నిన్ను పరమార్సిస్తుంది 
నేర్చుకున్నావా ? ఏమయినా 
నా నుంచి ? అని నిలదీస్తుంది . 
ఒక్కోసారి నిన్న ని చెరిపేయాలని 
ఒకటే ఆరాటం, నిన్న ని తుడిపేయాలని 
కసి , అసహనం తో పిడికిలి బిగించి 
నా జీవిత పుస్తకం లో ఈ నిన్న 
పుట లేకపోతే బాగుండును , అని 
ఆఖరికి కన్నీళ్ళు తో వేడుకున్నా 
కాలం ఎంత నిర్దయి.. 
నిన్నని నేను ఏమి చేయలేని తల్లి 
అని అసహాయం గా నిట్టూర్చి 
ఇదిగో ,కావాలంటే ,అంతగా 
ప్రాధేయ పడుతున్నావు కదా 
ఇదిగో నీకు కాన్క .. 

ఈ క్షణం .నీకు నా కానుక 
ఈ క్షణం నీది, ఎవరు కాదనలేరు 
ఈ సత్యాన్ని. ఈ క్షణం లో 
నువ్వు జీవించు, నీ కలల ని 
సాకారం చేసుకో , ఈ క్షణం పోనీ 
రేపటి కల కను, రేపటి కల కోసం 
ఈ క్షణం తపించు, కార్య సిద్ధి కై 
నడుం బిగించు ,ఈ క్షణం నీది 
ఇది ఎవ్వరు కాదనలేని సత్యం . 

కాలం నిర్దయి అని శపించకు ,
ఇదిగో నీ క్రోదానికి భయపడి కాదు సుమీ 
నీ మీద ప్రేమతో ..నీకు ఈ క్షణం ఇచ్చా 
నువ్వు , ఏం చేసుకుంటావో నీ ఇష్ఠం .. 
కాలం దయామయి , 
కాల చక్రం పాదాల కింద నలిగి పోయే 
ప్రతి క్షణం కి ఒక వరం .. కూడా ఉంది 
అదే మరపు , మరచి పొవడం , 
మరపు వరం పొందిన క్షణం మనకి 
అది వదిలి పెట్టి ,సాగిపోతుంది 
అనంత కాల చక్రం లో , ఈ క్షణం 
ఒక్కటే సత్యం .. సుందరం ..శివం .