"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 అక్టో, 2015

జ్ఞాపకాల పెట్టె ..


వెనక్కి వెనక్కి చూస్తూ నడుస్తూ
ముందుకు కదిలాను ..
నా జ్ఞాపకాల నీడలు నా వెంట ఉన్నాయా లేవా అని ..
అవి భద్రంగా ఆభరణాల పెట్టెలో
చెల్లా చదరుగా పడేసిన నగల లాగా
కొంచం మెరుస్తూ , కొన్ని మెరవక పోయినా అలవాటుగా ధరించేవి
కొన్ని ఊరికే పడి ఉండేవి ..
ఎవరూ ఎత్తుకుపోలేరు ఈ సంపద నా నుంచి ..
అలా తీరుబడిగా వడి వడి నడకలలో
కొన్ని పారేసుకుందామని పయనిస్తాను
సాయంకాలపు నీడల్లాగా ..
దొంగల్లా నా వెంటే ..ఎప్పటికీ పారేసుకోలేను అవి .
కాలంకి ఇంక అప్పచెపుతాను ఆ పని
సవ్వడి చేయక , కాళ్ళ కింద నుండి జారే
సముద్రం ఒడ్డున నీటిలా ...
సల్లగా జారిపోతాయేమో అని ఆశ ..
నిగూఢంగా అడవిలో దట్టమైన
పిచ్చి మొక్కల్లాగా అల్లుకుని ,చిక్కుకుని కొన్ని ..
విడదీస్తూ దీస్తూ కాలం వేసే చిక్కులు మరి కొన్ని
కూడిస్తూ , ఎప్పటికీ ఎడ తెగక పారే ఏరు లా ఈ జ్ఞాపకాలు ..
సెలయేరులా పారుతూ , ఏ ఒడ్డుకీ చేరని ఏరు ..ఏరులూ ..
ఈ జ్ఞాపకాలు ..
ఎన్నని మోయను ? ఎన్నని పారేయను ?
శూన్యంగా మిగిలేవు సుమీ అని హెచ్చరికలు
యే ఒక్కటని ఎంచేను ? ఏవని చించేయను ?
కలశం నిండా తొణికిస లాడే నీరుతో ..
కదిలే నేను ..ఎప్పటికీ తొణకను ,బెణకను అని
ప్రమాణాలు చేస్తూ ..ఇలా ముందుకే మరి పయనాలు చేస్తూ
నిండు కుండ లా నేను ..
నిండు కుండలా నేను ..

10 సెప్టెం, 2015

సన్న జాజి తీగా !


సన్నజాజి తీగ డాబా పైకి
సన్నగా పాకి గుబురుగా ఎదిగింది
సాయంత్రానికి ప్రమాణం చేసినట్టు
సన్నజాజి మొగ్గలు మోసుకు వస్తుంది .
ఖాళీ పూల సజ్జను
సన్నజాజులతో నింపేయాలని
ఆత్రంతో , విచ్చిన పూలని
నిర్దాక్షిణ్యంగా తీవె నుంచి తెంపి
నా సజ్జ నింపుతూ
నిన్నటి ఏవో లాలసలు
తనువంతా పాకి ,అలసత్వం
తనువంతా నిండి
సంధ్యా దేవి
అలకలతో ఎర్రబడ్డ
ఆకాశం సాక్షిగా
పూలు కోస్తూ నేను .
విచ్చిన పూలా ?
విచ్చి విచ్చని మొగ్గలా ?
అన్న మీమాంసలూ
మొహమాటాలూ లేనే లేవు
నన్ను చూసి నవ్విన
పూలనే ఎంపిక చేసుకుంటూ
సజ్జ నింపుతూ , రాత్రి కి
సమాయత్తం అవుతున్న నేను
గాలి ఏవో ఊసులు
మోసుకు వస్తోంది
దూర దూర తీరాల గుబాళింపులు
అలవోకగా తన వెంట ..
మొన్నటి వర్షం మిగిల్చిన
వాన నీటి తో తడిసిన మట్టి వాసనో
తడిసిన మామిడి పూత
పచ్చి పరిమళమో మరి
అలసిన పొద్దు
రాత్రిలో విశ్రమించాలని
తొందరిస్తూ సమాయత్తం
అవుతున్నాది , ఆకాశం పక్క పై ..
పూలు తీవె నుండి విడివిడినా
ఇంకా ఫకాలున నవ్వుతూనే ఉన్నాయి
వియోగ విషాదానికి ఇంకా
సమయం రాలేదు .
పూలే భారమా ? అని సజ్జ
నిశ్శబ్దంగా మోస్తూ , నింపుకుంటోంది మొగ్గలు
ఇంక చాలు అని ఎప్పటికైనా నా మది
చెప్పేనా నాకు ? అని నిట్టూరుస్తూ నేను .
తీగె నంటుకుని పూసిన
పూలన్నీ దూసిన నా చేతి నిర్దయకి
ఏం శాపమో ! ఆలోచిస్తూ వెను తిరిగిన నాకు
దయగా ..కోసుకొమ్మని మరి కొన్ని
కోసుకొమ్మని ఆలస్యంగా విచ్చిన పూలు
పలకరించి ,ప్రకృతి ఎంత దయామయో
మరో సారి నిరూపించింది ..
సన్నజాజి మరునాటికి మొగ్గలు
సమాయత్తం చేసే పనిలో శ్రద్ధగా నిమగ్నమై ...
నా దయా ,నిర్దయలతో పని లేని ప్రకృతి .

కాందిశీకులు


  • అమ్మ ఒడి నుంచి జారాడేమో మరి
    పాలు కారు బుగ్గలని
    గరుకైన ఇసకలో తల ఆంచి
    నిదుర పోతున్నాడు ..శాశ్వతంగా ..
    మనకెందుకు లెండి ?
    మన జీతాలూ ,జీవితాలూ
    ఇవే పెద్ద సమస్యలు మనకి 
    శ్రీమంతుడు తరవాత మహేష్ బాబు
    సిన్మా పేరేమిటో ?

    మన ఇంటి ముందు చెత్త బుట్ట
    తీయించి పక్క ఇంటి ముందు
    పెట్టించేవరకు నిద్ర పోను అని శపధం చేసావు
    కుక్కలకి శాశ్వత నిద్రా ? కుటుంబ నియంత్రణా ?
    ఎన్ని సమస్యలు మనకి .

    అగ్ర రాజ్యాల చదరంగం లో
    పక్కన పడేసిన బంట్లు , తెలుపో నలుపో
    అన్నీ ఒక్క సారే ఇల్లే లేని కాందిశీకులు
    కాదు కాదు దేశమే లేని కాందిశీకులు
    అయిపోయారు .. మనకెందుకు ?
    అసలా సిరియా మాప్ లో ఎక్కడుందో ఇన్నాళ్ళూ
    మేమెరుగం ..అసలా దేశం ఉందా ?

    సరిహద్దులు గీసారు ,
    ఇదే నీ దేశం అన్నారు ..
    పట్నాలూ ,పల్లెటూర్లు మీ ఇష్టం అన్నారు
    ఫలానా వీధిలో నాలుగో నంబరు ఇల్లు నీది
    అన్నారు , పోస్ట్ మాన్‌ కూడా వచ్చేవాడు
    చిన్న ఇల్లు ,ఇంటి చుట్టూ గోడలు ,
    ఇంటికి చిన్న ద్వారాలూ ,కిటికీ లు
    ప్రపంచం అంతా కిటికీ లోంచి చూసే పసిదనం .

    ఓ నాడు మా గూడు
    భస్మీపటలం అయింది ,
    అల్లా ! అని మొర పెడుతూ
    నాలుగు మూటలు వీపున
    మోస్తూ ఎడారి దాటి ,ఈ
    ఓడ ఎక్కాం , సముద్రాన్ని దాటిస్తాను
    అని మాట ఇచ్చిన సరంగు ఏమయాడో

    ఓడ మునిగింది , పసి ప్రాణం నిద్రలోనే
    జల సమాధి అయి ,అలా ఒడ్డుకి ఒచ్చి పడ్డాడు
    అవును , మన ఇంట్లో పసి పిల్లాడిలాగే ఉన్నాడు ..
    అవే రెండు కళ్ళు ,రెండు కాళ్ళు ,రెండు చేతులూ
    మతం అని ఏమీ ప్రత్యేక అవయవం కనిపించలేదు .

    బంతి ని అటు వేసి ,ఇటు వేసి కోర్టు లో
    బంతాట ఆడినట్టూ , దేశాలు ఆడుకున్నాయి .
    మాకొద్దీ రెఫ్యూజీలు ..మాకొద్దీ ఓడ నిండా ప్రాణులు
    అంటూ సముద్ర పాలు చేసారు ..

    మీరు మొదలు పెట్టిన ఆట కదర్రా ఇది ,
    అని ఎవరూ కర్ర పట్టుకుని చెప్పేవారు లేరా ?
    శాంతి సంఘం కళ్ళూ ,ఊపిరి మూసుకుని
    మెడిటేషం చేస్తోందా ? మానవ ప్రాణాలు ..
    ఒక తిమింగలమో ఒక కోరల్‌ వృక్షమో పాటి
    చేయవా ?  ఏవీ శాంతి మంత్రం జపించే దొంగ పిల్లులు?
    కంట నీరు పెట్టి , ఏం లాభం ? 
    పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ? 
    హే భగవాన్‌ ! ఇంత మూగవై పోయావా ? 
    ఏ పేరుతో కొలుస్తారు అని ఎదురు చూస్తూ 
    మూగవాని వయ్యావా ?

    అభివృద్ధి చెందిన దేశాలుట
    వారి ప్రాణాలు మటుకు బాంకులకి
    తణఖా పెట్టారు , ఎన్ని శవాల మీద చిల్లర
    ఏరుకుంటే ఆ ప్రాణాలకి ఊపిర్లు వస్తాయో !

    సిరియా ... నీ ఎడారి ఇసకలే నయం ..
    ఈ సముద్ర ఒడ్డు న మటుకు ఇంక
    ఎదురు చూడ్కండి ..ఇక్కడ ఎవరూ
    మానవతావాదులు లేరు ,ఇక్కడ అందరూ
    దేశభక్తూలూ ,దేశ పౌరులూ అంతే ..
    సరిహద్దులు మధ్య బిగించుకున్న పౌర సమాజం .మాది ..
    మా తలుపులు మరి తట్టి , మాకు విసుగు
    తెప్పించకండి ..మీ చావు మీరు చావండి ..
    మీ చావు మీరు చావండి ..అంతే ..

26 ఆగ, 2015

జీవన యానం


సముద్రం చారలు చారలు గా
నీటిని పరుచుకుంటూ
తపస్సు చేస్తున్న మునిలా మౌనంగా
తనలో తను చూసుకుంటూ
ఆమడ దూరం నుంచి
ఏకాగ్రతతో ఆకలి తపస్సు చే్స్తున్న
సముద్ర పక్షి దృష్టికి మిల మిలా మెరుస్తున్న
మత్స్యం మటుకు కనిపించింది ..
ఒడ్డున నా మటుకు నేను
పొడి కాళ్ళని చూసుకుంటూ
సముద్రం లోతుని కొలిచే ప్రయత్నం చేస్తూ
వృధా దృక్కులు ప్రసరిస్తూ నేను
ఎవరి ఆశలు వారివి
ఎవరి కలలూ ఎవరి ఒడ్డులూ వారివే
ఈ సాగరం మనం ఎలా ఈదుతామో
మన ఇష్టమే , ఒడ్డునే నిలుచుని
దూర తీరాల ప్రయాణాలకి మనం
తెర చాపలు ఎత్తుకుంటూ ..
అపహాస్యం ఏమీ లేదు .. అంతా
ఎంత గాలికి అంత ప్రాప్తం ..
ఏ తీరానికి ఎవరు ప్రాప్తమో ,
ఎవరు కనగలరు ? జీవనయానం లో .

మనసు చేసే గారడీ

కొన్ని కుందేళ్ళు
నా చేతిలోకి
అలా వస్తాయి
మెత్తగా కూర్చుని
దువ్వించుకుంటూ
నాకసలు పెంపుడు
జంతువులంటే ఇష్టం లేదు
ఇల్లంతా వదిలే బొచ్చు అంటే
చాలా అసహ్యమూనూ
ఈ కుందెలెలాగో వచ్చి
కూర్చుంది ,ఒళ్ళో కూడా
కూర్చుని ముద్దు చేయించుకుంది
నాకిష్టం లేని పనులు నేను
కొన్ని ఎందుకు చేస్తానో ఎలా చేస్తానో !
అందరికీ నా కుందేలు చూపించాక
నేను కుందేలని మాయం చేసేయగలను .
అవును నాకు అన్ని విద్యలూ వచ్చు ..
లేని దాన్ని ఉన్నట్టూ
ఉన్న దాన్ని లేనట్టూ
నా బుర్రలో ఎన్ని మాజిక్ ట్రిక్కులో
నే నెంతమాయల మంత్ర గెత్తెనో .
ఇదిగో మీ ఒళ్ళో కుందేలు ,
మీరూ ముద్దు చేయండి ఇంక ..

జీవన యాత్ర

సుదూరంగా కొండలు విశ్రాంతిగా
దిగంతాల గీతల వేపు ఆర్తిగా తడుముతూ చూపులు
మైదానాల మధ్య చివుర్లూ , చెట్లూ గాలి వీవెన పంపిస్తూ
అలవోకగా నర్తించే చెరువు అలలకి చురుకుదనం అద్దుతూ
ఒడ్డు గతాల స్మృతులని నెమరు వేస్తూ ,
లంగరు వేసిన పడవల కథలకై అర్రులు చాస్తూ ..
వారిద్దరూ ఆదిమ మానవుల జంట
అనంత కాలం లో ఉత్తర దిక్కు తార చెప్పిన గుర్తుల
ఆధారంగా ఎప్పుడూ ఎరగని తీరాల రేవు కై
సముద్ర యానం అంత యాతనగా అలసి సొలసి పోతూ ..
యాత్ర ఫలితం పుణ్యమో పురుషార్ధమో కాదు
కేవలం తీరం కనుక్కోడమే ..
తీరాల వెంట పాద ముద్రలు వేస్తూ నాగరికత
అలుక్కుంటూ వెళ్ళడమే , ఎప్పుడో మళ్ళీ యాత్ర అనుభవం
మానవులని ఆకర్షించి దీపం పురుగులా నలిపేస్తూ ఉంటుంది .
అయినా తప్పదు ,ఒక యాత్ర ,ఒక తీరం ..
మానవ జాతి చరిత్ర సమస్తం యాత్రా ఫలితమే కదా ..
ఈరోజుకీ ఒడ్డున లంగరు వేద్దామా ! హ్మం ..

18 ఆగ, 2015

కవి హృదయం


కవి హృదయం అని ఒకటి 
ఉంటుందా ? అని నాకెప్పుడూ అనుమానం ..
మాటలని గుండె కవాటంలో బిగించి పెడతారా ?
వేళ్ళ చివర నృత్యాలని బంధించి పెడతారా ?
ఆకశాన ఒక మబ్బు విడిచి వెళుతుంది
ఒళ్ళో పిల్లాడిని లాలించినట్టు
ఊహలు పిలకలేసి మొలుస్తాయి ,చిట్టి చిట్టి
పిలకలు చుట్టూ పేర్చుకుని అరటి మొక్క లా
హరితం గా లేత పల్లవం గా ..
ఇంక మాటలు బొమ్మల కొలువు లో
బొమ్మలలాగా మెట్లు మెట్లుగా పరవడమే తరువాయి
కొన్ని తల లూపుతూ కొండ పల్లి బొమ్మ లా వచ్చి
కూర్చుంటాయి ,మరి కొన్ని మేత మేసే ఆవు బొమ్మలు
నడిచినట్టూ ఎటో వెళ్ళి పోతూ ఉంటాయి ..
పూల పరిమళమూ ఉండదు ,
వెన్నెల లేపనమూ ఉండదు ,
అన్నీ మనసు అద్దం మీద పరుచుకున్న
చిత్ర విచిత్రాలు , నాకే ఆశ్చర్యం ఏ దేశ
దిమ్మరులు ఈ పదాలు ఎలా వస్తాయి ? అని .
మందారాల మకరందాలు
మల్లెల సుపరిమళాలు పూయిస్తాను
నా ఇంటి ముందు పెరట్లో ,
నాకసలు పెరడే లేదు ,అయినా సరే ..
ఆకలి దప్పులు ఊసే తెలియదు
అక్షరాల అన్నం వడ్డిస్తూ ఉంటే
ఎవరి చేతి పుస్తకానికో
ఈ నల్లటి ఆవగింజల్లాంటి సేద్యం ?
కవితలా ? కథలా ? ఏమో
మబ్బులు వర్షం కురిపిస్తాయా ?
దేశాంతరం పారి పోతాయా ?
ఎవరికి తెలుసు ..
ఇవాళ పండగ అని పుష్పించదు
పూవు ,ఇవాళ పుష్పించిన పూవునే
నువ్వు ఏరి కో్రుతావు .. పూజకి
నీలో జన్మించిన అక్షరాలకి నువ్వు
కారణం కాదు , కాలాల శోధన లో
కనుగున్న ప్రహేళిక నీ రాతలు .
ఎవరికోసమో అని రాయవు ,
ఎవరి కోసమో కల గనవు ..
ఎవరో ఒకరు చదువుతారు అన్న స్పృహ
కల ముందు వచ్చే మెలకువ లాగా
పలచగా ఆవరించుకుని ,మేలి ముసుగు లో
నిన్ను ఆకర్షిస్తూ , అయోమయంకి గురి చేస్తూ
ఎన్నో ఎన్నెన్నో అక్షరాలు ..
రక్త ప్రవాహం లో ధమనుల మధ్య
ప్రవహిస్తూ అస్తిమత పరుస్తూ ఉంటాయి .
నీ ఆంతర్యం నిన్ను నిలవనీయదు
నీ మనసెప్పుడూ నీకు విరోధి లా
యుద్ధాలు జరుగు్తున్నా ,వెన్నెల చమక్కుల
మీదే రాస్తావు కవిత్వం , ఎందుకంటే నీవు
చీకటి రాత్రి ని నీలో దాచుకున్నావు ,
వెన్నెల కాంతి ని ఎప్పుడూ అరువు తెచ్చుకుంటూ ఉంటావు ..
నీ అక్షరాలు నిన్ను
ఆవహించే శాంతి
నిన్ను ప్రేరేపించే అశాంతి
నిన్ను నిలువునా దగ్ధ పరచే అగ్ని కీలా కాంతి
గ్రహాల మధ్య కాలంని కొలిచే కాలమాని
నీ అక్షరాలు కాంతి వేగం తో
నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ఒక
సముద్ర ద్వీపం లాగా విసిరేస్తాయి ..
వంతెనలు వారధులూ వేసుకుంటూ
ఆ అక్షర జాలం తో నే
నే తిరిగి తిరిగి వస్తూంటాను ..మీ ముందుకి
అక్షర దీప కాంతి వెలుతురులో దారి
వెతుకుతూ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను .