"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

12 అక్టో, 2011

ఫేస్ బుక్

సరోజ నిద్ర లేచింది, నోట్లో బ్రష్ తో, వెళ్లి సిస్టం ఆన్ చేసింది. చక చక భార్గవ్ కి లంచ్ బాక్స్ ఇచ్చి, బై చెప్పేసి, ముందు మెయిల్ ఇన్ బాక్స్ చూసుకుని,ఫేస్ బుక్ లో ఎంటర్ అయింది.

అమ్మో, ఎన్ని మెస్సేజ్ లు ఉన్నాయో, అవి తను రాత్రి పడుకున్నాక ఎందఱో పెట్టిన లైక్స్, తను రాసిన పోస్ట్స్ మీద వచ్చిన కామెంట్స్.
వరసగా అన్ని చూసింది, అన్నిటికి ఒక లైక్ టిక్ చేస్తూ వెళ్ళింది..

అయ్యో ఇదేమిటి? సోమాలియా లో కరువు తో బాధ పడుతున్న పిల్లల ఫోటో,దీనికి లైక్ ఎందుకు పెట్టింది?

ఏమిటో?అలవాటు లో పొరపాటు. ఇప్పుడు దీనికి ఏం కామెంట్ రాయాలి? మనం ఇక్కడ ఒక కామెంట్ పెడితే, అక్కడ వారికి ఏమైనా కడుపు నిండుతుందా??

అక్టోబెర్ రెండు..అమ్మో ఎన్ని గాంధీ గారి మెస్సేజ్ లో..నేను అన్నిటికి లైక్ టిక్ చేస్తున్నాను..గాంధీ గారి మాటలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు?

ఇది సేఫ్ గా టిక్ పెట్టవచ్చు. మన దేశం లో ఉన్న ఆర్ధిక పరిస్థితి ని ఎక్కడో ఉన్న ఏదో బ్యాంకు ల కారణం ట..యు ఎస్ లో,పోనీలే ,మన దేశం లో ఉన్న నాయకుల వల్లనే అనుకునే దాన్ని ఇంత కాలం..

అబ్బ ,ఎంత నోలేజ్ పెరుగుతోంది నాకు??

ఇంతలో ఒక ఫ్రెండ్ ..అదే ఫేస్ బుక్ ఫ్రెండ్ ..నుంచి ఆహ్వానం ..నన్ను మీ లిస్టు లో పెట్టుకోండి అంటూ..నాకు ఆశ్చర్యం,ఇక్కడ ఏదో ఒక మూల కూర్చుని, బయట కాలే పెట్టకుండా ఇంట్లో కూర్చునే , అట్టే కష్ట పడకుండా, రోజు కి ఎంత మంది ఫ్రెండ్స్ ని సంపాదిస్తున్నాను.

ఇంత మంది తెలియని వాళ్ళు ఉంటారా? మా పిల్లలు మటుకు కనిపించరు.భార్గవ్ అన్నాడు..గట్టిగ నవ్వుతూ, అమ్మ లు ఉన్న చోట పిల్లలు ఎలా ఉంటారు? పారి పోయి ఉంటారు.

మొన్న ఏమయింది? చిన్నవాడు ప్రశాంత్ ..దుమారం లాగ వచ్చి,అమ్మా..అమ్మా..అంటూ అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు. ఏమిటి రా ఏమయింది? అమ్మ నువ్వు ఈ ఫేస్ బుక్ లో మెంబెర్ కాదు గానీ...
చిన్న బుచ్చుకున్న నా మొహం చూసి ,అది కాదు అమ్మా..అంటూ మెల్లిగా నువ్వు శాంత ఆంటి కి వాళ్ళ అబ్బాయి నవీన్ ఎవరితోనో రిలేషన్ షిప్ లో ఉన్నాడని చెప్పేవుట. నవీన్ పాపం ఒకటే గొడవ..వాళ్ళింట్లో పెద్ద గొడవ అయిపొయింది ట.

శాంత కి ఎంత చెప్పినా కంపూటర్ నాకు వద్దే బాబు, నా సేరియల్స్ మిస్ అయిపోతాను అంటుంది.సరే, నేను ఫేస్ బుక్ లో చూసిన విషయం ,ఏదో మాటల్లో చెప్పేసాను. తప్పేమిటి?

అంత భయ పడితే ఎలాగరా? ఇలా భయ పడుతూ ,అదేమీ రిలేషన్ రా??ఎవరా అమ్మాయి? క్లాస్ మేట్ ఏ కదా..వాడు ఇంట్లో వాళ్లకి చెప్పేస్తే పోలా?

ఆ పోతుంది..అంత పోతుంది..అమ్మా.వాడు ఇంకా ఎవరితోనో డిసైడ్ అవుతే కదా? వాడి దృష్టి లో ఉన్న ప్రియ, శ్రియ, రమ్య ల లో.ఎవరో..ఇంకా వాడికే తెలీదు..అమ్మా..ఫేస్ బుక్ కి ఓ పాలిసి ఉంది, అదేమిటంటే అందులో విషయాలు ,బయటకి చెప్పకూడదు.అందులోనూ పర్సనల్ విషయాలు అంటూ బోధించాడు నాకు ఫేస్ బుక్ జ్ఞానం.

అందుకేనా నువ్వు కూడా ఒక రోజు నా ఫ్రెండ్స్ లిస్టు లోంచి మాయం అయ్యావు అనుకున్నాను మనసులో, నేను వాడి ఫ్రెండ్స్ అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుని ,వాళ్ళ ని ఏవో ప్రశ్నలు , అడుగుతూ..మా ఇంటికి రండి అని కూడా ఆహ్వానిస్తున్నాను ..

పిల్లల ఫ్రెండ్స్ తో మనమూ ఫ్రెండ్షిప్ చేయాలని .నా సిద్ధాంతం ,వీళ్ళకి,అంటే ఈ తరం పిల్లలకి నచ్చదు..కాబోలు. అని నిట్టుర్చాను.

నా పిల్లల మీద మటుకు నాకు నమ్మకమే..అందరు అమ్మలూ ఇలాగే అనుకుంటారు ..అనేసాడు భార్గవ్.

పిల్లలు పెద్ద వాళ్ళయి పోయారు. ఇంట్లో పని తగ్గి పోయింది..మెయిల్స్ తో మొదలు పెట్టి, ఫేస్ బుక్ వరకూ ఎదిగాను.

ఏ పని చేస్తున్నా ,ఇంక.. నేను ఎన్ని మెసేజ్ లు మిస్ అవుతున్నానో, అని బెంగ. రోజు కి పెరిగి పోతున్న ఫ్రెండ్స్ లిస్టు..

నిజం గా, నాకు ఈ రోజు ఏదయినా అవసరం వస్తే, నాతో నిలిచే వాళ్ళు ఎవరు? ఇరవై ఏళ్ళ నుంచి నాతో కష్టం లో సుఖం లో పాలు పంచుకుంటున్న నా ఫ్రెండ్స్..కదా..

పింగ్ మని ఏదో ..పిలుపు..

ఏమండి ,శుభోదయం ,ఎలా ఉన్నారు?? ఏం చేస్తున్నారు? మీ పోస్ట్ బాగుంది, ఇంకా ఏమిటి కబుర్లు??

ఎంత బాగుంటుందో..వాళ్ళెవరో ,మొహం తెలీదు..పరిచయం లేదు, ముఖ ముఖి, మనం ఇక్కడ ఏం చాటింగ్ చేసుకున్నా ..మనని మొహం మీద ఎదురు పడి ,ఏమిటండి? ఆ రోజు అలా అన్నారు..అని అడిగే వాళ్ళు లేరు.

ఈ అదృశ్య ..కనిపించని ఫ్రెండ్స్..ఏమిటో..ఇది ఒక ఫాసినేషన్ ..అనుకుంటాను..

మధ్య మధ్య లో, దూరం గా ఉండే చెల్లెళ్ళు, స్నేహితులు కూడా పలకరిస్తున్నారు..మేము కూడా ఉన్నాం..నీ ప్రపంచం లో అంటూ.

షాప్ నుంచి తెచ్చిన సరుకులు బాగ్స్ ..అలమరా ల లో డబ్బాల లో సద్ద లేదు, కూర ఏం వండాలో, ఇంకా ఫ్రిజ్ తలుపు తెరిచి చూసి, డిసైడ్ చేయ లేదు, అవునూ ఏదో ఆకలి వేస్తున్నట్టుంది..

అయ్యో, టిఫిన్ ఏ ఇంకా తినలేదు.. అసలు ఉందా..నా కోసం చేసుకున్న టిఫిన్ ఏమైనా ఉందా అసలు? అని ఏదో పాట లాగ పాడుకుంటూ..

అతి కష్టం మీద ఫేస్ బుక్ ఫ్రెండ్ కి ..చాట్టింగ్ చేస్తున్న ఫ్రెండ్ కి బై చెప్పెను.
బాబోయ్ ఇంకా చాలు..పెరిగి పోతున్న బరువు, తరిగి పోతున్న ఇంటి పనులు, ఒంటరి తనం ని తరమడానికి..ఇంకేమైనా..వెదకాలి..

ఆ..పిల్లలికి చదువు చెప్పాలి, ఊ..ఇంకా..పుస్తకాలు మూల పడి ఉన్నాయి, చదివేయాలి, వేయి పడగలు, ఒక యోగి ఆత్మ కథ..పుస్తకాలు ఎప్పటి నుంచో నా టేబెల్ మీద ఎదురు చూస్తున్నాయి..చదవాలి, చదవాలి, ఎన్ని వందల పుస్తకాలూ ఉన్నాయి..ఎన్నో చేయాలి.

ఇంకా చాల చేయాలి..ముందు కాస్త ఏదైనా పడాలి..నిన్నటి ఫాస్ట్ రాత్రి నుంచి పొద్దున్న వరకు అయిన ఫాస్ట్, ఇంకా బ్రేక్ చేయలేదు..

అదే బ్రేక్ ఫాస్ట్..

ఊ..సరే..ఒక్కసారి, స్టేటస్ లో ఎన్ని మెసేజ్లు ఉన్నాయో చూసి..అమ్మో..
ఇది తప్పకుండా వ్యసనమే..

అయిదు నిముషాలకి ఒక సారి ఫేస్ బుక్ స్టేటస్ చూసే అలవాటు మీకు ఉందా?? ..రండి మనం అందరం ఒక గ్రూప్ ..కడదాం..రండి మరి..




11 అక్టో, 2011

ఆమె నించి అమ్మ

శరత్! ఊ ..
ఇదిగో.నా మాట వింటున్నావా..
ఊ .ఊ..
ఇదిగో ఆ పేపర్ పక్క పెట్టు కాసేపు.
ఊ..ఈ పేపర్ ఏం చేసింది..వింటున్నా.చెప్పు.

మనం ఈ రోజు సాయంత్రం సినిమా కి
వెళదామా? గొంతులో ఆశ , ఆర్ద్రత,
మొన్నేగా ?? వెళ్లాం..అదేదో..పేరు
గుర్తు లేదు.హుహ్.మొన్నా??

ఆరు నెలలు..అయింది, అప్పుడే
ఆ సినిమా టీ వి చానల్స్ లో
కూడా వేసేస్తున్నారు..మొన్నట..
ఊ..అందుకే..ఏకం గా ఇప్పుడే చూడొచ్చుకదా,

అనలే నేను..శరత్..తొంగి చూస్తూ
పేపర్ లోంచి, హుహ్.నీకు నేనంటే
ప్రేమ తగ్గి పోయింది, మగ వాళ్ళందరూ
అంతే అని అందరూ అంటే నే నమ్మలే..

రోజూ చూస్తున్నావు గా ,సగటున
నాలుగు సినిమాలు చానల్స్ లో,
అయినా ,మారింది నువ్వు, ఈ సినిమా
పిచ్చి ఏమిటి నీకు? ఒక్క సారి,గుర్తు

తెచ్చుకో, కాలేజ్ లో రోజూ సినిమా
ప్రోగ్రాం వేస్తె ,తిరగ్గొంటింది ఎవరంట..
సంధ్యా !! గుర్తు తెచ్చుకో?
ఏదో సెలవు రోజు హాయిగా ఇంట్లో

కూర్చున్దామంటే ,ఏమిటి ..నీ..
ఇన్ని మాటలు అనలేదు కాని, ఒకే
ఒక చూపు పేపర్ కిందకి దించి,
నాకు ఉక్రోషం తో కళ్ళు నిండి పోయాయి.

ఇవొకటి, పిలవకుండా వస్తాయి,
మరి ఇంత బేల నేమిటి?
అయినా అడగడం నాదే తప్పు,
అడిగి లేదు అనిపించు కొడం.

ఏమిటో ప్రేమ ఏ కిటికీ లోంచి
ఎగిరి పోయిందో? ఇన్నేళ్ళకి ,నేను
పాత బడి పోయానా? ఇంతేనా?
మొహం తీరి పోయిందా?

ఏమంత వయసాని?పిల్లలు
ఇంక చిన్న పిల్లలే, నేను అమ్మ
లాగా కనిపించి ,బోర్ గా ఉందా
నాతో రావడం? అతను మటుకు.

ఒకటో ఆరో ,వెండి మెరవటం లేదూ?
నా చేతిలో చేయి వేసి, నడవడమే
మహా భాగ్యం అనుకునే రోజులేవి?
ఏ గుమ్మం లోంచి ఎగిరి పోయాయి?

ప్రేమ అంత భ్రమ,మాయ..
ఆపిల్ ని కాటువేసే సర్పం
పేరే ప్రేమ, ఎంత పిచ్చి దాన్ని,
నా శరత్..నా ప్రేమికుడు ..

అని ఎంత మురిసి పోయాను,
ప్రభుదేవా లాగే ,ఎక్కడున్నా
వెతుక్కుని వస్తాడు నా కోసం
అని ఎంత భ్రమించాను,ప్రేమించాను?

కూర తరగడం అయిందా?
ఇవాళ స్పెషల్ ఏమిటి?
పిల్లల హోం వర్కులు
అయితే, రాత్రి కి త్వరగా

మంచం ఎక్కేయొచ్చు.
ఇంతేనా? రోజు కో కూర,
పూట కో ప్లేట్ భోజనం?
అయ్యో, ఇంతేనా ప్రేమ ,దోమా

అంటూ ఎంత మోస పోయెను,
ఈ రోజు   వంటలన్నీ ఉప్పు మాయం,
సముద్రం లోంచి పుట్టిన ఉప్పు తో
నా కన్నీళ్ళ ఉప్పు మరి కొంచం..


అయినా,సినిమా కోసమా?
చేతిలో చేయి వేసుకుని
పక్క పక్క కూర్చుని, చీకట్లో
పెద్ద బొమ్మ చూడాలని కదా?ఏమిటి.

ఆ మాత్రానికే హాల్ కి ఎందుకు,
ఇక్కడే లైట్స్ ఆపేసి, అలాగే
కూర్చుందాం రా..అంటూ కుళ్ళు
జోకులు ఒకటి..హుహ్..అంతే.

అమ్మా..అమ్మా..ఆకలి కాబోలు,
అవును మరి ఇప్పుడే గుర్తు
వస్తుంది అమ్మ,ఒక్క పావు
గంటలో అవుతుంది రా కన్నా..

అన్నీ నాన్న బుద్ధులే, అది
కాదు అమ్మ.ఆ ఇండియా మీద
స్పీచ్ నువ్వు రాసి ఇస్తే ,నేను
చదివి, రేపు అసెంబ్లీ లో చెప్పాలమ్మా..

ఇప్పుడా?నీకు గుర్తు వచ్చింది,
మరీ ఆటలు ఎక్కువ అయాయి,
నీకు?ఇప్పుడా? ఇంకెంత టైం ఏ
లేదు,ఇప్పుడా చెప్పడం..

సంధ్యా..ఇదిగో ఫోన్ ..ఎవరూ
సతీష్?ఏమిటి దూకుడు కి
నాలుగు టికెట్స్ ఉన్నాయా?
ఇది విన్నావా?పద,పద,సినిమా అన్నావు గా..

ఊ..దూకుడు లేదు మూకుడు లేదు,
మీ అబ్బాయి కి స్పీచ్ ట,నేను రాయాలి,
వాడు చదివి బట్టి పట్టాలి, ఇంక ఏం
సినిమా..అయినా నువ్వు ఎప్పుడూ

అంతే,నేను వద్దు అంటానని తెలిసే
చెప్తావు, నీకసలు నా మీద ప్రేమ
లేదు,దోమ ఉంది, నా కైతే, నీ మీద.
అంటూ తేలికగా మాట్లాడే శరత్ అంటే

ఏమిటో,మరీ నాకు ఇంకా ప్రేమే,
ఆమె నించి అమ్మ గా ఎప్పుడయనో,
నాకు తెలియదు, కాని శరత్, ఎలా
ఎప్పుడూ అతనే గా మిగిలాడు..ఎలాగో??














పథం

అది ఒక ఎగుడు దిగుడుల

ముళ్ళు, తుప్పలు తో

నిండిన గజి బిజీ ,వంకర

టింకర అడవి దారి,

మేకలు,గొర్రెలు నెమ్మదిగా

ఆకులు నెమర వేస్తూ,

చేతిలో చే కర్ర,భుజాన ఓ

తుండు ,కడుపులో ఆకలి,

నోటిలో రాగం, పైన ఆకాశమే,

నేస్తం గా చిన్న చిన్న అడుగుల్లో

అడుగులు వేసే బుడ్డోడ్లు మేకల

గొర్రెల దారి అది.

తరాలు మారాయి,

బుడ్డొడ్ల పిలకాయలు ఇప్పుడు

అదే దారిలో ...కూలి పనోళ్ళు..

నారు మడి లో కలుపు తీస్తో,

నాట్లు ఊడుస్తూ..మడి లో,

గొడ్ల, మేకల ,గొర్రెల దారి,

ఇప్పుడు నడి రోడ్డు, నలుపు

రంగు పూసిన తార్రోడ్డు అయింది.

పథం మారింది..మారనిది

ఆ కూలి ల బతుకులే..

ఉనికి

ఉదయం ఎనిమిది..పిల్లలని, భర్త శ్యాం ని స్కూల్ కి, ఆఫీసు కి పంపించే హడావిడి, అష్టావధానం ..చేస్తున్నట్టు నాలుగు చేతుల తో పని చేస్తున్నట్టు ..ఉంది శాంతి కి.
ట్రింగ్ ..ట్రింగ్..అని డోర్ బెల్ మోగింది.
అబ్బ,ఈ టైం లో తలుపు తీసి..మాట్లాడ డమా??
ఏమండి, మీరు చూడండి.
నేను బట్టలు వేసుకుంటున్నాను. నువ్వే చూడు.
"ఏమిటి? ఎవరూ.." అంటూ విసురు గా తలుపు తీశాను.
మా అపార్ట్ మెంట్ వాచ్ మాన్.నాయుడు.
శ్యాం..మా  అపార్ట్ మెంట్ వాసుల బాగోగులు చూసే సొసైటి కి సెక్రెటరీ.
"అదేమిటి నాయుడూ..ఈ టైం లో వచ్చావు?
సాయంత్రం సమయం లో రాకూడ దా? ఇప్పుడు చూస్తున్నావు గా ఎంత బిజీ ?"
"అయ్యగారికి ఒక విషయం చెప్పి వెళ్లాలని వచ్చాను ..ఈ శుక్రోరం మా ఊరు చీపురు పల్లి లో ఎలెక్షన్ల పండగండి. ఒక్క అయిదు వందలు బయాన ఇప్పిస్తే, మేం వెళ్లి ఓటు వేసి వస్తాం. ఈ విషయమే చెప్పాలని అయ్యగారికి, మళ్లీ  వస్తాను"..
"సరే నేను చెప్తాలే.." అని పంపించేసేను.
ఉదయం అందరిని పంపించి ఇల్లు సద్దు కుంటున్నాను.మళ్లీ డోర్ బెల్ ట్రింగ్..ట్రింగ్..తలుపు తీశాను.
నాయుడు భార్య నరసమ్మ.అచ్చమైన  తూర్పు కట్టు..అంటే చీర నే గట్టిగ ఒక చుట్టూ చుట్టి,కట్టు కుంటారు. రవిక అంటూ వేరే ఉండదు..మనిష్ మల్హోత్రా చూస్తే..ఏ ఐశ్వర్య రాయ్ కో డిజైన్ చేస్తాడేమో..అనుకుంటూ ఉంటాను.
గేట్ దగ్గర పని, ఇళ్ళల్లో పనులు అయ్యాక , నోట్లో ఒక చుట్ట పెట్టుకుని మహా దానందం అనుభవిస్తూ ఉంటుంది. కాన్సెర్ అంటూ, ఏవో చెప్పేను కాని, తల కెక్కదు  వాళ్లకి, నీకు ఎందుకు కంఠ శోష? అంటాడు శ్యాం.
"పని అయిందా అమ్మా"? అంటూ నేల మీద చతికల పడింది.
అంటే ఏదో పెద్ద కథే ..


"ఏం లేదు అమ్మా..మావు మా ఊరేలుతున్నాం కదా, మీరు ఆ బయాన ఇచ్చేటప్పుడు నాయుడు కి చెప్పండి కూంత. మా పొలం మీద అప్పు తీరాలంటే, నేనూ ఆ బిల్డింగ్ కూలి పనులు కి యేలితే తొరగా నాలుగు డబ్బులు ఎనకేసి , అప్పు తీర్చి భూమి సొంతం చేసుకో వచ్చు.
మా ఊర్లో నాయుడ్ల ఆడోల్లు ఇంట్లో పనులే చేసుకుంటారు, కాని పట్నం లో వొవరు సూత్తారు? ఏంటో నాయుడు సాదస్తం..ఇళ్ళల్లో పని సాలు ..చ ,ఊరులో తెలిస్తే కులపోల్లు ఏటంటారు? గమ్మునుండు..అని కసిరేస్తాడు అమ్మా..మీరే కూసింత చెప్పాలి.."

హు..నేను శ్యాం కి చెప్పడం, శ్యాం నాయుడు కి చెప్పడం..ఇన్ డైరెక్ట్ చానెల్స్ ఎన్నో..ఏమిటో ఈ నరసమ్మ పంతం..పోనీ తనే ఏదో చెప్పి ఒప్పించు కోవాలి, ఇంట్లో విషయాలు ,మనం ఏం చెప్తాం ? అన్నీ నీకే కావాలి ...శ్యాం నాకు చెప్పే పాఠం ..వినిపించింది నాకు అప్పుడే..

సాయంత్రాలు..పిల్లలతో కూర్చుని హోం వర్క్ లు చేయించడం, మధ్యలో వెళ్లి, స్టవ్ మీద పెట్టిన కూర చూడడం, ఇంట్లో విశ్రాంతి గా కూర్చుని, ఉదయం సమయం ఉండదని, ఇప్పుడు తీరుబడి గా హిందూ న్యూస్ పేపర్ చదువుతూ, " చూసావా, ఈ వార్త, "అంటూ శ్యాం చేసే వ్యాఖ్య లని, ముసి ముసి గా నవ్వుకుంటూ, వినడం, నేను చదివిన పేపర్ ఏ కదా..నాకు కొత్త గా ఏముంటుంది? హు..ఏ ఊర్వశి అవార్డులే ఇచ్చేయ వచ్చు, ఈ భర్త ల ఎగో తృప్తి పరచడానికి భార్య లు నటించే అమాయకత్వం నటనల కి,ఇది తెలియక కొందరు అమాయక స్త్రీలు , ఉత్తి పుణ్యానికి విడాకులు ,తెగతెంపులు అంటూ కోర్టుల గుమ్మం ఎక్కుతారు, అయినా ప్రేమ , నమ్మకం ,ఆప్యాయత లు పునాది గా ఉంది ..మా దాంపత్యం లో..

ఆఖరికి వచ్చే కూర అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే నాకు, కూర ముక్కలు అన్నీ, అతుక్కుని ఒక ..ఒకే రూపం,ముందుగా విడి విడి గా ఉన్న ముక్కలే కదా..దాంపత్యం కూడా ఇలాగే ..ఇలా ప్రతి దాంట్లో, నాకు ఏవో కొత్త కొత్త విషయాలు కనిపిస్తాయి..ప్రతి దాంట్లో నాలోని రచయిత్రి కి ఏదో ఉపమానం కనపడుతూ ఉంటుంది,నీకు మరీ ఆలోచనలు, ఊహలు ఎక్కువ....శ్యాం..ఇలా ప్రతి ఆలోచన కి మాట కి పక్క శ్యాం అనుకుంటూ ఉంటాను, ఎంత పిచ్చి దానివే శాంతా ..అని నాలో  నేనే..స్వగతం..

ఇలా పనులు ,ఊహలు, కలబోసి నేను వంటింట్లో పని చూసుకునే సమయం లో ఎప్పుడో నాయుడు రావడం, శ్యాం అయిదు వందలు ఇవ్వడం.నాయుడు .ఓ దణ్ణం పెట్టి వెళ్ళిపోవడం..అన్నీ జరిగి పోయాయి..
నరసమ్మ మాటలు గుర్తు వచ్చాయి..ఇంతలో భోజనాలు..నిద్ర, ఉదయం కి మళ్లీ పనులు..
మర్నాడే ఎలెక్షన్ రోజు, మా ఎం పి గా ఎవరు నిల్చున్నారో? వారి చరిత్ర ఏమిటి? అని మా స్నేహితులం అందరూ ఇవే మాటలు, శ్యాం ఆఫీసు లో కూడా ఇవే మాటలు ట. ఇద్దరి కి ఇద్దరే,రెండు పార్టీలు సమానం గానే దోచుకున్నాయి, ఇంకా ఇప్పుడు ఎవరికీ ఇవ్వాలి ఆ అవకాసం అనేది ఎన్నిక ద్వారా తేలుతుంది.
ప్చ్..ఇవా ఎలక్షన్లు అంటే..ఏమిటో ఈ పార్లమెంటరీ వ్యవస్థ మీదే నమ్మకం పోతోంది. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది..బిట్వీన్  డెవిల్ అండ్ డీప్ సీ..అని ఎందులో దూకడం??
మాకు మూడు రోజులు సెలవులు, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం..అరకు వెళ్లి వచ్చేద్దామా? అని తర్జన భర్జనలు.
సాయంత్రం నాలుగు కి, నాయుడు, పైకి వచ్చి తలుపు కొట్టి, గేట్ తాళాలు అవి అప్ప చెప్పాడు. బంధువుల అబ్బాయిని పెట్టేనని, మూడ్రోజులు సెలవు అని చెప్పి.వాళ్ళ .ఊరికి బయలు దేరారు. బాల్కనీ లోంచి కిందకి చూస్తున్నాను.

ఎప్పుడూ ఒక తుండు కట్టుకుని, పైన ఒక బనీను వేసుకుని, ఉదయమే  సూర్య నమస్కారం చేస్తూ, ఏవో మంత్రాలు చదువుతాడు కూడా, చెప్పుకుంటే సిగ్గు, నాకు ఒక్క మంత్రం కూడా నోటికి రాదు, పుస్తకం ముందు పెట్టుకోవాల్సిందే..నాయుడు ఇవాళ చక్కగా పంచ కట్టి, ఒక పై పంచ తల కి చుట్టి, పైన శుభ్రమైన చొక్కా ఒకటి వేసుకుని, సరి అంచుల చీర చుట్టి, భుజం మీదు గా..నాయుడి భార్య ,నాయుడు ,నరసమ్మ ..అచ్చం గా ఎంకి -నాయుడు బావ లా ఉన్నారు.
వాళ్ళ ఊరు సీపురుపల్లి కి కదిలారు..జంటగా.
మర్నాడే మేం అరకు ప్రయాణం ..పిల్లలతో, ఎన్నాళ్ళకో దొరికింది ఇలా మూడు రోజుల సెలవుల విందు..
అరకు అందాలు..బొర్రా గుహల సంభ్రమం, చాప రాయి జలపాతాల గల గల లలో మునిగి తేలి , అలసి సొలసి, ఆదివారం రాత్రి పది గంటలకి చేరాం ఇంటికి. మర్నాడే స్కూల్, ఆఫీసు ,అమ్మో ఎన్ని పనులో..
సోమవారం ..ఎలా ఉంటుందో ..అలాగే బద్ధకం గా ..తెల్లవారింది.
పిల్లలి ని స్కూల్ బస్సు ఎక్కించి ఇంటికి వస్తున్నాను.
నరసమ్మ తళ తళ లాడే స్టీల్ కారేజ్ పట్టుకుని, ఎదురయింది.
ఎక్కడికే? అప్రయత్నం గా అడిగాను.
"పనిలోకి..అమ్మా" ముసి ముసి గా నవ్వుతూ..
నాయుడు కి మేం ఏమి రికమండేషన్ చేయలేదే??
నా మొహం లో కనిపించే ప్రశ్న లకి సమాధానం గా..
" మాం సీపురు పల్లి ఎల్లి పోయినామా..ఓట్ల పండగ నాడు, నాయుడు నేను ఎల్ల బోతే, మా పేర్లే లేవంట ..ఊరంతా తిరిగేం..మీరు ఊరి విడిచి అయిదేళ్ళు పై అయింది గా..ఇంక ఈ ఊరు తో మీకు ఏం సమందం లేదనేసారు ..అమ్మా..నాయుడు అయితే కూలిపోయ్యాడు..మా ఊరే ఇది కదా..వ్యోవసాయం కుదరక ,అప్పులు ఎక్కువై ఇలా పట్నం కి పారోచ్చినాం..మా భూవి, ఇల్లు అన్నీ అక్కడనే కదా..ఈ పట్నం లో ఏం ఉంది మాకు? ఆ మెట్ల కింద కూసింత నీడ.."

"నా పేరే లేదు ట.నేను ఆ ఊరోడినే కాదంట. అంటూ తెగ ఏడుపే అమ్మా నాయుడైతే, రెండో రోజుకే వోచేసాం అమ్మా..మీరు లేరు కదా..మీకు తెలీదు.
నీ ఇష్టమే..సేసుకో ఆ కూలి పనులు..ఏవో? మనూరి నాయుడ్నే కాదన్నారు. ఇంక ఏటుంది ఈ పట్నం లో మన పరువు? నీ ఇష్టం ..నీ ఇష్టం..అంటూ"
"ఈ రోజే పని లోకి ఎల్తున్నా అమ్మా.."
అంటూ మెరుస్తున్న స్టీల్ కారేజ్ గర్వం గా పట్టుకుని ..
వెళుతున్న నరసమ్మ ని చూసిన నా మనసు లో..చిక్కు పడిన ఎన్నో ఆలోచనలు?
ఓటు కోసం మూడు గంటలు ప్రయాణం చేసి , ఓటు లేదని తెలిసి బాధ పడుతున్న ,నాయుడు , మేస్త్రి పనులకి బయలు దేరిన నరసమ్మ, మూడు రోజులు సెలవులు వచ్చాయని విహార యాత్ర వెళ్లి వచ్చిన మా కుటుంబం..పక్కనే ఓటు పెట్టుకుని, వేయని మా అలసత్వం..ఏమిటో ??ఎక్కడో ఏదో చిక్కు ముడి విడి పోతునట్టు ఉంది..మళ్లీ నా చదువు వల్ల వచ్చిన అహంకారం ..ఒప్పుకోదు..
ఎన్నికలు, ఓట్లు..ఎన్నుకోవడం..ఆలోచించాలి..మరింత ఆలోచించాలి..
అనుకుంటూ..మా మేడ మీద మా గూడు లోకి ప్రవేసించాను..మా పొదరిల్లు..పదిలమైన మా పొదరిల్లు.








9 అక్టో, 2011

నే మళ్లీ నది నవుతా...

రాతి యుగం లో ,

ఎప్పుడో, ఒక చెమ్మదనం,

దాగి ఓ కొండ రాయిలో.

కరిగింది ఒక నీరై ,కన్నీరై

నట్టు,బిందువుగా,

బిందువుల వరస,

ఒక ధార గా కారింది,

ఎత్తైన కొండల మీద నించి,

కొండల వరసల్లో, పెను రాళ్ళ నుంచి,

చల్లగా, చెమ్మగా, తనివి ..రాయి తనువూ

తాకుతూ, కాలం చెట్టు కి కాసిన

పండై..బిందు బిందు కలిసి

ఒక ఉధృతం ..ఒక సెలయేరు ,

గుంపులో ఆడ పిల్లల కబుర్ల

లాగా? గల గల మని గులక రాళ్ళతో

నే నా కిలకిలలు..మనసు అద్దం లో,

పరిశుభ్ర మైన ఆత్మ లాగ,

ప్రతిబింబించే స్వచ్చం..సెలయేరు..

అడుగులు తడబడుతూ,

పరికిణీ అంచుల ఒడ్డున అంచు

గట్టులు ,తో గుట్టులు విప్పుతూ,

సెలయేరు..యవ్వనం లో యువతీ

నీకేనా ఒంపులు ? అని పోటీ పడే

సెలయేరు, వెనక ముందు చూడని

మొహం లో పడింది, అవును,

ఇంతలోనే, కొండ అంచులు ,ఎక్కడా

అంతు చిక్కని ,ఒకటే ఎత్తు..

ఆలోచించే వ్యవదే లేదు..

సెలయేరు మొహం విడి,

కిందికి , అంత ఎత్తు నుంచి ఒకే

సారి కిందకి దూకింది..

సెలయేరు..జలపాతం అయి,

రాతి బండల మీద తల

కొట్టుకుని వెయ్యి ,పది వేల

బిందువులై చెదిరి పోయింది.

సెలయేరు ..జల పాతం..

గా యవ్వన ఘాడత లో .

ఆశల వినాశనం - అంతం

చూసి, చూడ నట్టు, మరి

కొన్ని చిందువులు తో కలిసి

నర్మ గర్భం గా నదీమ తల్లి

అయి ఇంక నిండు గా గట్టులు

రాసుకుంటూ, పచ్చని రంగు తో,

చెలిమి కడుతూ, నిండు గా ,

నిండు గర్భిణి లాగ ,జీవాల్ని

దాచుకుని, నడిచే అంచుల

మరి కొన్ని జీవాలకి జీవం

అందిస్తూ, తొణకక, బెదరక,

నిండుగా అమ్మ లాగే..

పైన మబ్బులు , దూర మైన

చెలిమి వార్తలు మోసుకోస్తాయి,

వర్షమై, నదీమ పులకరిస్తుంది,

హర్షం తో, మనసు నిండి, పొంగుతుంది,

దూరమే తెలియని పయనం,

అంది అందని దూర తీరాలు,

ఎలాగో ఆకర్షి స్తూ..రా రమ్మని..

ఏదో తీయని తనం కోల్పోతూ,

అయినా ఆగని ఆత్మ హత్య

సద్రుస్యం నీ పయనం..

అని ప్రకృతి శక్తులు

ఘోషిస్తున్నా.ఆపలేని

సాగర ఘోష గీతం..

ప్రతి జీవి కి ఇది తప్పదు..

అని నది నేర్చుకున్న జీవన

రహస్యం ..ఇప్పుడిప్పుడే

అవగతం అవుతున్న క్షణం..

ఇదిగో, అలల కెరటాల కోరికిల

పిలుపు, మృత్యువు లాగ

నెమ్మదిగా కబలించి,

తీయదనం..ఉప్పటి నీటి

మూట లో కలిసి..

కరిగి పోయి..నది ..ఓ నదీ

నీ ఉనికి కోల్పోయేవా??

సాగర సంగమం లో

మూర్చిల్లేవా??? ఏమో? ఏమో?

మళ్లీ..మళ్లీ, నేను జన్మించాలని,

నది గ పరుగులు తీయాలని,

ఎన్నో తీరని కోరికలు తో

మళ్లీ పుడతాను, ఈ వర్ష

రుతువు కే నే మళ్లీ

నది నవుతా..నే మళ్లీ

నది నవుతా..









వడ్డించిన విస్తరి..

పని అంతా ముగించి,చేతులు తుడుచు కుంటూ,తన కిష్ట మైన లాప్ టాప్ టేబెల్ దగ్గరి కి వెళ్లి, సిస్టం ఆన్ చేసింది శ్రీదేవి. ఈ మధ్యే నేర్చుకుంది, అనే కంటే పిల్లలు బలవంతం గా నేర్పేరు అని చెప్పవచ్చు.
జిమెయిల్ ఓపెన్ చేయగానే వసుధ కనిపించింది, ఆకు పచ్చ గా వెలుగుతూ,లైన్ లో ఉన్నానని సంకేతం గా..

ప్రాణం లేచి వచ్చింది.


"వసుధా..ఉన్నావా" అంటే.."చెప్పు .. కబుర్లు..ఖాళీ గానే ఉన్నాను."
ఏమిటి చెప్పడం..??అని కాసేపు అలిగి చిన్న పిల్లలాగ..ఎక్కువ బెట్టు చేస్తే మళ్లీ ఎప్పటికో కనిపించడం..అని "నీతో చాల చెప్పాలే "అంది..శ్రీవిద్య.
"పిల్లలు ఎలా ఉన్నారు? మీ అబ్బాయి శ్రీకర్ ఈ మధ్యే ఫోన్ చేసాడు, ఆంటీ,ఎలా ఉన్నారు అంటూ"
..
"శ్రీ విద్య ఎలా చదువు తోంది? తను కూడా ఎమ్మెస్ చేయడానికి ఇక్కడికే వస్తుందా??ఏమిటి తన ప్లాన్స్??"

అంతా నెట్ కబుర్లే..

"పిల్లలు బాగానే ఉన్నారులే..వాళ్ళ చదువులు అన్ని వాళ్ళ ఇష్టమే కదా.అంతా నిర్ణయించుకుని ,చివరికి చెపుతారు.."

"మనం డబ్బు లు కట్టే స్టేజ్ లో గుర్తు వస్తాం.."

"ఊ..మీకు డబ్బులకేం లోటు,శ్రీ రాం ది మంచి జాబ్ కదా.."

"అబ్బ..,నన్ను చెప్పనివ్వు..నా బాధ వేరే..వింటావా??చెప్పనిస్తావా??,"నువ్వు ఊరులో అందరి మనసు లో బాధలు కి మందు వేస్తావు..తను సైకియాత్రిస్ట్..ఈ చిన్ననాటి స్నేహితురాలి గోడు వినవా??"

"సరే.సరే..చెప్పు,ఖాళీ గానే ఉన్నాను లే, నైట్ డ్యూటీ ..ఇప్పుడే రౌండ్స్ అయాయి, కాసేపు కూర్చోడమే,ఇదిగో,చేతిలో కాఫీ కప్..ఇంక చెప్పు..మీ శ్రీ ఫ్యామిలీ కబుర్లు"

"ఏమిటే నీ జోక్స్..మా ఫ్యామిలీ అంతా శ్రీ తో ప్రారంభం అయే పేర్లే..అదీ తన సటైర్ ."

మా మావగారు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఉన్నారో చూసి,

" అది కాదు, వసూ..మా మావగారు మా దగ్గరే ఉన్నారు కదా, మా ఆడపడచు వాళ్ళు అమెరికా లోనే ఉన్నారు,వెస్ట్ కోస్ట్ లే..నీకూ తెలుసు కదా శారద వాళ్ళు,ఇంక మా దగ్గరే ఉండాలి..ఆయన ఇంకెక్కడికి వెళతారు?"

ఊపిరి పీల్చుకుంది, అదే ఇంత పెద్ద విషయాలు టైపు చేయడం కష్టమే ..ఇంక పూర్తిగా అలవాటు అవలేదు ..సగం ఇంగ్లీష్, సగం తెలుగు లో టైపింగ్ నడుస్తోంది.

"ఊ..చెప్పు..."

"ఏముందే..నాకు యాభై ఏళ్ళు నిండాయ? కాళ్ళు నొప్పులు,ఇంక వేరే బాధలు. పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు. ఇంక రెస్ట్ అనుకుంటే,ఇప్పుడు నా మీద పూర్తి బాధ్యత ..మా మావ గారు."

"ఆయన కి ఏవో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, శ్రీరాం బిజీ బిజీ ఎప్పుడూ,నేనే తీసుకు వెళ్ళాలి, హాస్పిటల్ కి, ఇంకా ఆయన కి రుచులు పిచ్చి,అది వండుతావా, ఈ పులుసు పెడతావా?అంటారు.ఏదో గబా గబా వంట చేసి నా ఫ్రెండ్స్ తో ఏదైనా సినిమా కి వెళ్ళాలంటే అవదు."

"నా కున్న ఫ్రెండ్స్ అందరూ ,ఇప్పుడు బాధ్యతల నుంచి ఫ్రీ అయిపోయేరు,సినిమా కి వెళదాం, హోటల్ కి లంచ్ కి వెళదాం అని ప్లాన్స్ వేస్తారు.."

నాకు ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లాడిలాగ..ఈయన..మా అత్తగారు పోయినప్పట్నించి మా దగ్గరే ఉంటున్నారు..శ్రీరాం కి ఏం చెప్పను?నా అవస్థలు.బాధ పడతాడు..నాకు తెలుసు ఆయనకి నాన్న ఇంట్లో ఉండడమే ఇష్తం. నాకూ పెద్ద బాధ అని కాదు, ఆయన పనులు ఆయన చేసుకుంటారు. ఏవో ఇలా చేయండి, అలా చేయండి అని సలహాలు ఇస్తారు.."

"నాకు ముఖ్యం గా నా స్వాతంత్రం పోయినట్టుంది. ఇరవై ఏళ్ళు పైన పిల్లల తో గడిచిందా? ఎక్కడికి వెళ్ళలేదు మేం ఇద్దరం కలిసి. శ్రీరాం ఏవైనా కాన్ఫే రెంస్ కి ఊర్లు ఎక్కడికి అయిన వెళ్ళిన..నాకు అయేది కాదు, ఎప్పుడూ ఏవో పిల్లల పరీక్షలో, ఏవో ఇబ్బందులు."

"ఇన్నాళ్ళకి , నాకు కొంచం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది. నాకు ఇప్పుడు ,ఇన్నాళ్ళు మిస్ అయినవన్నీ అనుభవించాలని , ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని, శ్రీరాం తో ఊర్లు అన్ని తిరగాలని కోరిక లు పట్టుకున్నాయి. అన్నిటికి మావయ్య గారే అడ్డం అని పిస్తోంది"

"నిజం చెప్పనా..నాకూ ,ఇప్పుడే అర్ధం అయింది, నా మనసులో  బాధ ఇది అని, చాల చికాకుగా, విసుగ్గా ఉంటున్నాను. ఒక పక్క శరీరం లో కలిగే మార్పులు, నీకు తెల్సుగా మనకి ఇవి తప్పవని, మరో పక్క యాభై ఏళ్ళు గడిచాయి, పిల్లలని చక్కగా పెంచడం తప్ప నేనేం చేసెను? ఏం అనుభవించాను?అని ఈ ఆలోచనల తో నా బరువు కూడా పెరిగి పోయింది."

"మీ నాన్న గారే ..నా సమస్య..అని ఎలా చెప్పను? ఆయన అడుగుతూనే ఉన్నారు? ఏమిటి నీ బాధ? శ్రీకర్ మీద బెంగా ?అని"

"వసూ..నేను మరీ అంతా చెడ్డ  దాన్ని కాదు, అలా అని మరీ అంతా మంచి దాన్ని కాదేమో? "

శ్రీదేవి కళ్ళల్లో, నీరు తిరిగాయి, ఇలా రాస్తూంటే.
" ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ నా బాధ ఇదే,పోనీ కొన్ని రోజులు ఆయన ని ఎక్కడయినా పెడదామన్నా ..ఎవరున్నారు ?అంత దగ్గర చుట్టాలు, ఈయన తమ్ముడు వాళ్ళు కూడా అమెరికా లో ఉన్నారు, శారద ఆడ పిల్ల, తన పిల్లలు ఇంకా చిన్న వాళ్ళు, అయినా ఈయన ఉండలేరు,అంతంత దూరంలో, ఇప్పుడు డెబ్భై ఏళ్ళు పై నున్నాయి ..ఏమిటో నే మా అత్తగారు అలా కాన్సెర్ తో అలా చటుక్కున పోయేరు, ఆవిడే ఉంటే, నాకింత బాధ్యత ఉండేది కాదు."
"వసూ ఉన్నావా? నా బాధ నీకే చెప్పగలను? పిల్లలికి ఇలాంటివి ఏం చెబుతాం?

" ఊ..ఊ.ఉన్నాను, వింటున్నాను, ఆలోచిస్తున్నాను..చెప్పు ఇంకా"
ఒకటి చెప్పు, శ్రీరాం అంటే నీకు ఎంత ఇష్టం?"

" అబ్బబ్బ.. అదేందుకే ఇప్పుడు..చాలా ,చాల ఇష్టం తెలుసు గా.."
"నిన్ను తను ఎప్పుడైనా బాధ పెట్టేడా??

"అబ్బే లేదే..నిజం గా పేరు కి తగ్గట్టు శ్రీరాముడే.."

"పిల్లలో? నీ మాట వింటారా..పెడ తోవ పెట్టేరా?"

"ఏమిటి వసూ,నీ ప్రశ్నలు..నా పిల్లలు ఎంత బుద్ధి మంతులో? చదువు లో ఎంత ఫస్తో.. ఇద్దరూ నీకూ తెలుసు గా"

" శ్రీ..నేను పని చేస్తున్న ఈ హాస్పిటల్ వృద్ధులది..ఇక్కడ ఎన్ని రకాల కథలు వింటామో? పిల్లలు వదిలేస్తారు, లేదా పేరెంట్స్ ఏ పిల్లలు ఎలా ఉన్నారో పట్టించు కోరు. కుటుంబ బాంధవ్యాలు ఎంత ముఖ్యమో..నా చుట్టూ ఉన్న పేషెంట్స్ ని చూస్తే తెలుస్తుంది."

"నీకు అన్ని ఉన్నాయి, ప్రేమించే భర్త, చక్కని పిల్లలు, ఇంకా కొన్ని ఏళ్ళు మిగిలి ఉన్న ఆ పెద్దాయన నీకు ఇప్పుడు ఆటంకం అని ఎందుకు అనుకుంటున్నావు?

"ఊ ! ఒక లాగ అనుకో, నీకు శ్రీరాం అంటే చాల ప్రేమ కదా, అతను నీకు ఇరవై అయిదేళ్ళకి కదా పరిచయం అయాడు, నీకు కాలేజ్ లో"

అవును మాది ప్రేమ వివాహమే..ఎవ్వరి వేపు నించి అభ్యంతరాలు లేవు..
"అయితే?"

"పూర్తిగా విను, నీకు పరిచయం ముందు గడిచిన పాతికేళ్ళు ,ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు..మీ మావ గారికి సేవ చేస్తూ..అంటే అప్పుడు నిండు నూరేళ్ళు ,నువ్వు శ్రీరాం తో గడిపినట్టు కదా"

" శ్రీ! నువ్వు చాల సున్నిత మైన దానివి, అందుకే ఇంత ఆలోచిస్తున్నావు..మీ మావ గారి గురించి, నువ్వు ఆయనతో మాట్లాడు, నేను బయటకి వెళ్ళాలి, ఇవాల్టికి మీకు సింపెల్ గా వంట వండి పెట్టేస్తాను ,టేబెల్ మీద, తినేయండి ,అని చెప్పు, అలాగే, నువ్వు ఊరు వెళ్ళాలి అంటే, ఒక పని వాడిని పెట్టు. వంటకి కూడా అలాగే ఎవరినో పెట్టు. మీ కసిన్  ఉంది కదా మీ ఊర్లో, తన హెల్ప్ తీసుకో, ఏదైనా అవసరం వస్తే తనకి ఫోన్ చేయమని చెప్పి, నువ్వు వెళ్ళొచ్చు. ఊరికి.."

"అంతా ప్లానింగ్ లో ఉంది, ఇది అంత పెద్ద సమస్య కాదు నువ్వు అనుకున్నంత."

"అయినా వడ్డించిన విస్తరి లో ,ఏదో ఒకటి నీకిష్టం లేని పదార్ధం ఒకటి ఉంటుంది?

" అన్నీ,మనకి ఇష్టమైనవే ఉండవు లైఫ్ లో,కొన్ని ఇబ్బందులు ఉంటాయి"
"ఇప్పుడు నువ్వున్న నీ ఆరోగ్య పరిస్థితి కూడా..నిన్ను వీక్ చేస్తోంది"
"ఈ వయసు లో అందరికీ వచ్చే సమస్యలే ఇవి. మనకి యాభై వచ్చి, పిల్లలు పెద్దవారయే సరికి, మన పేరెంట్స్ ..చిన్న పిల్లలు అవుతూ ఉంటారు, వృదాప్యం రెండో బాల్యం కదా"

"మనకేమో రెస్ట్ కావాలి, వారికేమో కేర్ కావాలి.."

"ఇది నీ ఒక్కరి సమస్యే కాదు, చాల మంది దే ఈ సమస్య..ముందు నువ్వు నీ శ్రీరాం తో నీ సమస్య ని చర్చించు. ఏదో కంప్లైంట్ చేస్తున్నట్టు కాకుండా..ఏ సమస్యకి అయినా పరిష్కారం ఉంటుంది,"
"తరువాత ముఖ్యమైన విషయం, ఇదేదో నీ ఒక్కర్తి బాధ్యత అనుకుని ,ఏదో భారం అనుకోకు, ఇంట్లో అందరిని ఇంవోల్వ్ చేయి. అందరి సహకారం తీసుకో..ముఖ్యం గా నీ శ్రీరాం కి చెప్పు..దాపరికం కాదు, ఓపెన్ గా ఉండు,అవసరం అయితే, మీ మావ గారితో కూడా చర్చించు..ఆయన ఇచ్చే పరిష్కార మార్గాలు కూడా ఆలోచించు, అంతే గానీ, ఇదేదో నా సమస్య అనుకుని బాధ పడి, నీ ఆరోగ్యం పాడు చేసుకోకు."

"ఆలోచించు,ప్రశాంతం గా ఆలోచించు, నువ్వు బాధ పడేంత విషయం లేదు, కానీ నీ బాధ నాకు అర్ధం అయింది..కూల్.."
" సరే, నా రౌండ్స్ కి టైం అయింది, మళ్లీ ఇంకో రోజు, బై మరి ఇవాల్టికి" ,అంటూ మాయమయింది.. స్క్రీన్ మీద ఆకు పచ్చ గుర్తు బదులు ఒక లైట్ పచ్చ రంగు డాట్ ..ఎంత సులభం అయిపోయిందో, ఇప్పుడు దూరం గా ఉన్న వారితో మాట్లాడడం..అంటూ లేచింది.

అమ్మా..అమ్మా..అంటూ శ్రీవిద్య..ఒక పెద్ద స్వీట్స్ బాక్స్ చేతిలో పట్టుకుని ,నాకు కూడా యు ఎస్ , లో సీట్ వచ్చింది అమ్మా..అంటూ..నేను అవాక్కయాను..అమ్మాయి కూడా వెళ్లి పోతుందా ?

ఇంకా టైం ఉందిలే..అనుకుంటూ ఏమిటి తెచ్చేవు?
అన్నీ రకాల స్వీట్స్ కలిపి ఉన్నాయి..అన్నీ నాకు ఇష్టమయినవే..ఒక్క మైసూర్ పాక్ తప్ప..హుహ్..

జీవితమే అంత ..ఒక పాకేజ్ ..ఇష్టమైనవి, ఇష్టం లేనివి..కల గలిపి ఉంటాయి, 
మా అమ్మాయి తెచ్చింది కదా ..అపురూపం గా అనిపించాయి.
అంతా మనసులోనే ఉంది..వసుధ కి థాంక్స్ చెప్పుకుంటూ, వంటింట్లో కి నడిచింది శ్రీదేవి, మనసు తేలిక అయి..తేలి పోతూ..








4 అక్టో, 2011

తిత్లీ...

తిత్లీ...తిత్లీ...అమ్మ కేకలు ..దూరం నుంచి..మున్నాకి పాలు పట్టేవా??
ఆ..ఆ..ఇప్పుడే అమ్మా..ఇదిగో..

చెయ్యంత..అంటే నా చెయ్యి కాదు,అమ్మ చెయ్యంత పూసిన సూర్య కాంతం పువ్వు,పచ్చగా విచ్చుకుని, సూర్యుడి మొహం లోకి చూస్తోంది.నేను ఒక్క క్షణం కూడా అలా చూడ లేనే..అంటూ..విస్మయం తో,ఆ పూమొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను..నాకు పువ్వులంటే ప్రాణం.

నా మొహం కూడా పువ్వు లా ఉంటుందని, అమ్మ అంటుంది, రాత్రి, నన్ను ముద్దు చేస్తూ.. తమ్ముడు మున్నా ఎలా ఉంటాడు? అంటే చందమామ లాగా అంటుంది..మా అమ్మ..

పచ్చ గా కనిపించే ఆ ఆవాల మడి లో దూరం గా అమ్మ ఎర్రని చీర లో వంగి పని చేస్తూ ఉంటే...ఎంత బాగుందో? నాన్న ఇంకా దూరం గా ఉండే అడవి లోకి వెళ్ళాడు.

కట్టెలు కొట్టి తేవాలి కదా..రాత్రి కి అమ్మ పొయ్యి అంటించి, కుండ లో అన్నం వండి, ఏదో కూర వండుతుంది..ఆ కూరలు కూడా..మా ఇంటి వెనక పెరడు లోనే పండుతాయి.

నాన్న ..అమ్మ చెయ్యి బంగారం..అంటాడు.

అమ్మో..మున్నా కి పాలు పట్టాలి..

మేం ఆరు నెలలు ,కష్ట పడి, పంట పండించి..బస్తా లోకి ఎక్కించే టైం కి,ఎక్కడి నుంచో వస్తాడు..మోటార్ సైకెల్ మీద మీసాలున్న ఓ పెద్ద మనిషి, అమ్మా..నాన్న ఒంగి ఒంగి దణ్ణాలు పెడతారు..

చేతిలో కొన్ని నోట్లు పెట్టి, బస్తాలు బండి లో కి ఎక్కించుకుని ..ఏమైనా కూరలు ఉన్నాయా..అని పెరట్లో కాసిన కూరలు కూడా చేసంచి లో వేసుకు వెళ్ళిపోతాడు..

అమ్మా నేను..ఒకరి మొహం లో ఒకరు చూసుకుంటాం...

ఎందుకమ్మా..మనం పండించెం కదా..అంటే..ఈ భూమి మనది కాదు తిత్లి అంటుంది..అమ్మా..

అన్నట్టు నేను చెప్పలేదు కదా.. మేం కోసి నది పక్కనే ..ఓ చిన్న ఊరు లో ఉన్నాం.

మా ఊరు అసలు ఇది కాదు..అని ఏవో కథలు చెప్తూ ఉంటుంది.అమ్మా..

ఇంతలో వర్షా కాలం..వచ్చింది.పొలం నిండా నీళ్ళు..అమ్మా.నాన్న కళ్ళల్లో కూడా నీళ్ళే..

మున్నా ఏడుస్తున్నాడు పాల కోసం..

నేను ఆకలి వేసినా ,అమ్మా ని అన్నం పెట్టమని అడగ లేదు,ఇంకా పొయ్యి అన్తించలేదు మరి..

రాత్రి అంతా వర్షం పడుతూనే ఉంది..ఒక్క రాత్రే కాదు, ఎన్నో రాత్రులు.
మైలు దూరం లో ఉండే కోసి నది, ఉప్పొంగి..రాత్రి..ఇంటి నిండా నీళ్ళు..

అమ్మా చేయి నే పట్టుకున్నాను..నాన్న మున్నా ని ఎత్తుకున్నాడు..నీళ్ళల్లో నడుస్తూ, తేలి పోతూ..చుట్టూ చీకటి, ఎప్పుడూ కోసి నది ఇలా ఉప్పొంగ లేదు, ఈ ఊరు చాల దూరం..అని నాన్న చెపుతున్నాడు..అమ్మా తో..మన దురదృష్టం..ఇక్కడ కూడా వెంటాడుతోంది. అన్నాడు..

నాన్న ,అమ్మా అసలు ఊరిలో కరువు వచ్చి, ఈ ఊరు వచ్చి..భూమి తీసుకుని, పంట వేస్తున్నారు..

ఎంత దూరం వెళ్ళామో..ఆ చీకట్లో..ఆ నీళ్ళల్లో..

అయ్యో..మున్నా..మున్నా..ఆ నీటి వరదలో తమ్ముడు..నీటి పాలయ్యాడు,ఎప్పుడో జారి పోయాడు, నాన్న భుజం మీద నుంచి.

నడిచి, నడిచి..ఒక ఊరు జేరాం..

మాలాంటి వారే..ఎంత మందో...

మోటర్ సైకెల్ ఆయన వచ్చి, కాయితాల మీద సంతకం పెట్టించుకుని, నాన్న చేతి లో రెండు వందల రూపాయల నోట్లు పెట్టి వెళ్లి పోయాడు.

అమ్మా అంది నాతొ..ప్రభుత్వం ఇచ్చే పరిహారం అన్ని అతనికే..మనకి కన్నిల్లే..మిగిలాయి అని.

ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళా లో అని ..దిగులుగా కూర్చున్నాం.

ఇంతలో దేవుడు లాగ..ఇంకో పెద్ద మనిషి వచ్చాడు..వ్యవసాయం చేస్తారా అని అడిగాడు. సరే అన్నాడు నాన్న..నాన్నకి వచ్చిన పని అదే కదా.

సరే అంటే,మూడు టికెట్లు చేతిలో పెట్టి, ఫలానా ఊరు వెళ్ళమని నాన్నకి, చెప్పి,కొంత డబ్బు కూడా ఇచ్చేడు.

రెండ్రోజులు రైలు లో ప్రయాణం చేసి, మేం ఉండాల్సిన ఊరు కి వచ్చాం..ఆ ఊర్లో మరో ఆయన వచ్చి..మా పొలం చూపించాడు..అంతా చెట్లు, రాళ్ళు..అవి కొట్టి..సాగు చేసుకోమన్నాడు.

నేనూ,అమ్మా..మాకు ఇచ్చిన చిన్న పాక చుట్టూ దడి కట్టుకుని, నేను పూల మొక్కలు అమ్మ కూర గాయల మొక్కలు వేసుకున్నాం.

నాన్న భూమి సాగు చేయడానికి,పగలు రాత్రి, కష్ట పడి..చెట్లు కొట్టి, రాళ్ళు పగల గొట్టి, నీరు మోసుకు వచ్చి, ఎలాగో,ఆరు నెలలకి ..ఒక దారి కి తీసుకు వచ్చాడు.

ఒక రోజు అమ్మ అంటోంది, నాన్న తో..

ఏమయ్యా..ఈ భూమి..ప్రభుత్వం ది ట..అర మైలు దూరం లో అంతా క్రూర మృగాలు,పులులుండే  అరణ్యం   ట..మనల్ని ఇక్కడ కూడా ఉండనివ్వరేమో?

అంతా ఆ పెద్ద మనిషే చూసుకుంటాడు..అతనే కదా మనని ఇక్కడ పెట్టేరు.
అంటే..అమ్మ నిట్టూర్చింది .

అమ్మ కి ఓపిక తగ్గింది,మున్న మీద బెంగ, దిగులు తో అనారోగ్యం.

నేను అడవి కి వెళ్లి, చిట్టి కొమ్మలు నరుక్కుని, తల మీద ఎక్కించుకుని, తెచ్చి పడేస్తాను.నేనే పొయ్యి కూడా అంటించి, అమ్మ కి సాయం చేస్తున్నాను.పెద్ద దాన్ని అయాను కదా..

అమ్మ బువ్వ వండుతుంది. అయ్య అలసి పోయి వచ్చి, అన్నం తిని పడుకుంటాడు..

ఒక రోజు..ఎండ చిట చిట పడు లాడు తోంది. ఏమిటో ఎక్కడా ఎండిన కంపే దొరక లేదు..అలా ..నడుచుకుంటూ, పిట్టలని చూస్తూ..అడవి లోపలి వెళ్ళిపోయాను.

ఒక పొద లో, పచ్చని చారలు.పొంచి ఉన్న పులి పంజా..నా మీద పడింది..ఆకలి గా ఉన్న పులి కి ఆహరం అయిపోతున్నాను.

రేపటి నుంచి, అమ్మకి ఎవరు తెస్తారు?అమ్మకి పొయ్యి లోకి కట్టెలు?

అమ్మ ఏమనుకుంటుందో?? ప్రకృతి..మనిషి పగ పెట్టేరు, మూగ జంతువుల కి  కూడా మా మీద ఇంత పగేమిటి..దేవుడా??అని ఏడుస్తుంది..

తిత్లీ ..మనసు లో ఆఖరి కోరిక..మా అమ్మ-నాన్నలకి ఈ సారైనా ,ప్రభుత్వం ఇచ్చే పరిహారం అందుతుందా??


ఎందఱో,భూమి లేని, భూ పుత్రుల కి అంకితం..