"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

30 ఏప్రి, 2013

అక్షరం

అక్షరమే అని ఊరుకోకు 
అక్షరమా అని పరిహసించకు 
అక్షరంతో చేస్తావా యుద్ధం ?
అని వెట కారం చేయకు . 

అక్షరం శాంతి, అక్షరం క్రాంతి 
అక్షరం పేలని బులెట్ 
అక్షరం నిబిడీకృత మిసైల్ 
అక్షరం పదునైన కత్తి . 

అక్షరం అజ్ఞానానికి అంతం 
చెప్పే అవకాశానికి నాంది 
అక్షరం వెలిగించే దీపం లో 
నలు దెసలా కాంతే కాంతి . 

అక్షరం అందరి హక్కు 
కాదు అది వ్యాపార సొత్తు. 
అక్షరం కాదు కబంధ 
హస్తాల సొంత సొత్తు. 

అక్షరం తెచ్చే జ్ఞానం 
తేవాలి విజ్ఞానం , అంతే కాని 
గోడ మీద తగిలించే ఉత్త 
కాగితం ఫోటో కాదు ,అక్షరం . 

కూడు ,గుడ్డ నీడ , ఈ మూడింటికి 
జత కూర్చండి నాలుగో పరమార్ధం . 
అక్షరం అనే అమృతాన్నిఅందరికి 
సమంగా పంచేద్దాం ,రండి రండి .

అసమానత , అన్యాయం ,
అధర్మం ,అనాగరికత అన్నిటి పై 
ఎక్కుపెట్టిన అస్త్రం అక్షరమ్. 
సంస్కారం తెచ్చి పెట్టె అక్షరమే ,అక్షరమ్. 

అక్షరం కి సలాం చేద్దాం ,
అక్షరాని కి నమస్తే అందాం 
అక్షరమా స్వాగతం అందాం 
అక్షరమే అండ దండ అందాం 
అక్షరానికి  నేను గులామ్. 
అక్షరానికి నేను ఆరాధన చేస్తా 
అక్షరం తో వారధులు వేస్తా 
అక్షరం తో నలుదెసల యానం చేస్తా 
అక్షరం తో కథలే చెబుతా 
అక్షరం తో పాటలే పాడుతా 
అక్షరం తో కదం తొక్కుతా 
అక్షరం తో పధం సాగుతా 
అక్షరమే నా పధం 
అక్షరమే నా గమ్యం 
అక్షరమే నా ధ్యేయం ,అక్షరమే మన ధ్యేయం . 



28 ఏప్రి, 2013

సుఖం ..దుఖం ..

మరపు అదృష్టమో 
కాదో ,వద్దు వద్దు అనుకున్నవి 
పదే పదే గుర్తు  చేస్తుంది . 
ఎంతటి గొప్ప అనుభూతి అయినా 
రేపటికి మసక బారుతుంది . 

వాడిన మల్లెపూలు ఎత్తి 
కిటికీ బయట విసిరేసినట్టు 
అనుభూతి విభూతి లా జలజల 
రాలిపడిపోతుంది మాపటికి .


పురాతన దుఖాలు మటుకు 
రేగి ,రేగి, పుండులా 
ఎప్పుడూ సలుపుతూ ఉంటాయి ,
దుఖం కి జీవిత కాలం అంత ఎక్కువేమిటో ? 

దుఖం వెనువెంటే నీడ లా 
సుఖం పక్క పక్క నే హితుడి లా 
సూర్య చంద్రులు లాగ ఒకరి మొహం ఒకరు చూడరు . 
నాకేమో రెండు కలిసిన  క్షితిజ రేఖ దగ్గర 
ఉండిపోవాలని చిరకాల కోరిక ,ఫలించేనా ? 

సుఖం అంటే ఏమిటో ఎలా తెలిసేను 
నీకు దుఖపు క్షణాలతో పోలికతో కదా 
సమ స్థితి అంటూ లేదు అంతా 
సాపేక్షం అమ్మా అంటూ నా కొడుకు చేసేడు ఉపదేశం . 

తరచి చూస్తే అదే కదా సత్యమ్  
అదే కదా సత్యం శివం సుందరం .  






26 ఏప్రి, 2013

నా పుస్తకాలు సర్దుకున్న ఈ రోజు నా మనసులో మాటలు

చలం  గారి ని నా పక్కనా 
అంటు అంటూ తొలిగాయి కొన్ని 
అయినా నేను మొండిగా 
నా హృదయం లోంచి పెకిలించి 
అక్కడ ఆ బీరువాలో అంటు వేసాను ,

ఏదో ఆశ ,ఆ సంస్కారం పిసరంత 
ఆ మిగిలిన కథకులకి అంటుకుంటుంది అని. 
రావి శాస్త్రి మన వాళ్ళేనా ? అంటూ 
చోటిచ్చాడు , కోకు ఏమంత 'చదువు ' కున్నావు ?
అంటూ కసిరాడు , సంఘం ని చదివావా ?
ఎప్పుడైనా ? అంటూ ఇంటర్వ్యూ చేసారు . 

దేవులపల్లి వచ్చావా చెలం ? ఎన్నాళ్ళయింది 
నిన్ను చూసి, మనం భావ కులం కవులం ట ,
అంటూ చిన్నగా వెక్కిరంతగా నవ్వేరు ,
చలం ఒక్క క్షణం ఆలోచించి , 'రమణాచలం '
అంటూ నిండుగా కొండై  'పొయారు' . 

కథ కి పీఠం వేసి కోర్చోబెట్టాలి 
ఎవరర్రా అంటూ నేను , నేనెవరు మధ్య లో ?
ఏమి లేదు నా బీరువా లో మరి ఇంతే జాగా 
నా తల లోకైతే ఎన్నయినా ఎక్కిస్తాను ,ఇక్కడ 
మరి అందరూ తోసుకుని తోసుకుని ఎక్కాల్సిందే బస్సు. 

వందేళ్ళ కథ, రెండు దశాబ్దాల కథలు, రావి శాస్త్రి కథలు 
బీనా దేవి' అతిసర్వత్ర  వర్జేయత్'  అంటూ హెచ్చరిస్తూనే ఉంది నన్ను 
అయినా కథ అంటే ఇంత పిచ్చి ఏమిటి ? నాకు 
కథ కంచికి తీసుకెళ్ళే వరకు తోడు గా ఉంటాను రమ్మీ అంటూ 
చిన్న పిల్లల ని సాకుతున్నట్టు ,చంక నెక్కించుకుంటాను . 

కొన్ని ఇంక చంకే దిగవు. విస్మృత యాత్రికుడు ని ఎప్పుడు 
అనగా మొదలు పెట్టాను, ఎన్ని యాత్రలు చేసాను ? 
హంపి నించి హరప్పా దాకా, కొన్నేళ్ళు గా నంచుకుంటూ 
ఎప్పటికి పూర్తవదు ,ఆ సారస్వత విందు . 

చివరకు మిగిలేది ? ఏమిటి ? అంటూ దయానిధి గడ్డి పరక తో 
అన్న మాటలు , హిమ జ్వాల లో ఎలా కనిపెట్టేను నేను ? 
ఒక చిన్న ,పెద్ద వ్యాసమో , ఏదో రాయవా ? అని ఎవరు అడిగారు
నా సొంత వాయిస్ ఓవర్ , కాని అలా వినిపించే శబ్దాలని నొక్కి నొక్కి 
చంపేయటం లో నేను మాస్టారీ కదా. మీకు తెలియదా ? 

అరకు లోయలో కూలిన శిఖరం, పొగ లేనిదే నిప్పు రాదు ,
నా గురించి కథ రాయవూ అంటూ కుముదం, 
అమృతం తాగిన మధుర స్త్రీ మూర్తి అమృత , 
యాస గా మాట్లాడే కోమలి, దయానిధి కనిపించని అమ్మ కోసం 
ఎన్ని రాత్రులు ఎదురు చూసానో పిచ్చిగా ,అవి నవల లో పాత్రలే అంటే 
నా మనసు అంగీకరించలేదు . అయినా ఆ కథ ల పేర్లే ఎంత కవిత్వమో ? 
బుచ్చిబాబు నా గురువా ? మొహమా ? గురుత్వా కర్శణా ? అంటే నేను 
పడిపోకుండా నిలబెట్టిన రచయితలు కదా, యవ్వన ఆకర్షణ లో నే 
'పడి ' పోకుండా నాకు అస్తిత్వం, బాలన్స్ , ఉనికి ఇచ్చి పుణ్యం కట్టుకున్న 
గొప్ప వారు ,వారే కదా.. 

పదండి ముందుకు ,పోదాం, పదండి తోసుకు పై పై కి అంటే 
ఎలా పరుగులు పెట్టేం ? శ్రీ శ్రీ ని కూడా మాతో సాయానికి రమ్మన్నామ్.. 
ఏమిటో ? చేతిలోంచి ఓఫ్ ఓఫ్ మంటూ పొగ పీలుస్తూ ఇదిగో వస్తాను అంటూ 
మరో ప్రపంచం లోకి మాయం అయిపొయారు. 

శ్రీ శ్రీ  మహా ప్రస్తానం ,పక్క, అమృతం కురిసిన రాత్రి, ఆ పక్కనే నండూరి 
ఎంకి పాటలు, ఇంకా రావోయి బంగారి మామా అంటూ బసవరాజు అప్పారావు ని, ఇంకా ముద్దుకృష్ణ వైతాళికులు , అన్ని కలగలిపి షో అంటూ 
పరిచేయనా పేక ముక్కలా పొందిగ్గా .. 

నువ్వు శాంతా ? నువ్వు శాస్త్రి వా అంటూ ? అడుగడుగు బేరీజు వేసుకుంటూ 
నా జీవిత సాగరం లో లైట్ హౌస్ అతడు -ఆమె పుస్తకాలు , 
ఉప్పల లక్ష్మణ రావు మాకు అత్యంత ఆప్తుడు అని ఇదిగో మా ఇంట్లో ఒక 
మెంబరు అని అందరికి పరిచయం చేసిన గుర్తులు ఇంకా చెరిగి పోలేదు . 

కొడవటిగంటి కుటుంబరావు ఇంత అరటి పండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పినా ఇంకా ఈ సంఘం దాని గతి తార్కికం నీకు వశం కాలేదా ? 
మనసు కోతి మరి, నీ చెప్పు చేతల్లో ఉంచుకో ,చేయి దారితే అంతా దగా దగా 
విజ్ఞానం ,నూరిపోసాడు, చెవి కేక్కితేనా ? తర్కం కి అందని ఈ ప్రేమ వశం ఎందుకయానో ? 

స్వీట్ హొమ్ రంగానాయకమ్మే నాకు ముద్దు, నా బుచ్చిబాబు నాకు ముద్దు. 
జానకి విముక్తి చెందింది కాని, నా తలకి ఏదో కొంచం భారం గా , ఏవో కళ్ళద్దాలు అడ్డం వస్తున్నాయి, కాస్త తీసి పక్కన పెట్టని .. అన్నిటిని చీల్చి చెండాడే ఆ వయసు ఉద్రిక్తత జారి , నిండు నది ఆ గంభీరం గా ఇప్పుడు పయనం మరి ఇది. 

ఇంకా ఎన్నో పేర్చాలి, కాస్త చోటివ్వండి ,అంటూ బతిమాలుకుంటున్నాను , 
అబ్బ ,వినరే . 
పెద్దిభొట్ల, శ్రీపాద, మధురాంతకం ,ఖదీర్ బాబు, కులాలు మతాలూ లేవు అన్ని కలిపేసేయ్ , ఇక్కడైనా సరే, సరే, 
నవీన్ ,గోపీచంద్ చైతన్య స్రవంతి పథం లో , ఎలా కొట్టుకుపోయాం, మనసు ,మేధా ఎలా చెప్పినా సరే, రాసెసెయ్ అంటూ పేజీలు  పేజీలు  నింపేయడం .. ఏదో పేరు పెట్టి ,అదో లైఫ్ .. 

ఇంకా నెవిల్ షూట్ , గ్రాహం గ్రీం హెమింగ్వే , మాం , పెర్రీ మసన్ ,షేర్లోక్ హొమెస్ , గ్రిషాం , చేతన్ భగత్,  దప్నే దు మరిఎర్ , ఫ్రెంచ్ కథకురాలు, ఇర్వింగ్ వాల్స్ లావు లావు పుస్తకాలు, సన్నని పుస్తకాలు మాకేక్కడా ? మా చోటు ఎక్కడ? అంటూ నన్ను నిల దీస్తున్నాయి. 

అన్నిటిని ఊరుకో పెడుతూ, అచ్చం అమ్మ లాగే , అందరికి స్థానం చూపిస్తాను అంటూ ప్రామిస్ చేస్తూ ... ఉండనా మరి ఇవాల్టికి . 








తుది ప్రయాణం...

ఒక మనిషి బ్రతకడానికి 
ఇన్ని వస్తువులు కావాలా ?
మనసులో సౌందర్యం కి 
బయట కనిపించే రంగులెన్ని ?

చిన్న ఆశ చాలు కదా ,గుప్పెడంత 
ఇంత పెద్ద గృహం కావాలా ?
మనిషి శాంతి గా బ్రతకడానికి .. 
ఆత్మ కి ఎంత చోటు కావాలో ? 

సర్వ అవయవాలు చాలు కదా 
ఆస్తి గా ? నయనాలే కోట్ల ఆస్తి , 
నలుగురికి ప్రదర్సన ,ఏదో ఒక 
ఎక్షిబిషన్ లాగ ? నిన్ను నువ్వే 
ప్రదర్శించు కోవడం ,ఒక నిత్య కృత్యం . 

కావలసినంత అంటే ఎంతో 
ఎవరైనా చెపుతారా ? మనం 
దూర ప్రయాణం కి ఎంత మోసుకు
వెళతామో , లెస్ లగేజ్ ,మోర్ కొమఫోర్ట్ 
అంటూనే ఉన్నారు. 

ఇవాల్టికి ,రేపటికి ,ఎల్లుండికి 
ఇంకా మరో తరానికి ఒక అంతు లేదు 
అలా ఎదిగి పోవడమే , చెట్టు చూడు 
తను మోసెంత వరకే ఎదుగుతుంది . 

చెట్టు లా ఎదిగేం కాని ,చెట్టుకి ఉన్నంత 
జ్ఞానం కూడా లేదు, అయినా ఈ రోజు 
ఈ పురిటి వైరాగ్యం ,నాకు తెలుసు 
ఈ నాటి తో సరి. 

రేపటి కోసం అప్పుడే కలలు ,
అప్పుడే వస్తువులు ,ఈ అనంత 
ప్రయాణం లో నన్ను కప్పెట్టే అన్ని 
వస్తువులు, ఎప్పుడో భారం అనిపించి 

ఆ తుది ప్రయాణం లో ,అన్ని ఒక్కొక్కటి 
జార్చేస్తాను, నా బరువు ఒక్కటి నాకు చాలు 
అనిపించే ఆ తుది ప్రయాణం కి 
మరికొన్ని మెట్లు తయారు చేస్తాను ఇదిగో ,
వస్తున్నా.. వస్తున్నా.. 





24 ఏప్రి, 2013

బొంత ...

అతుకుల బొంత ఒకటి తయారు చేస్తున్నాను 
నా చిన్నప్పటి ఒక రెండు జడల సన్న కాళ్ళ పిల్ల 
మల్లెపూలు కూడా నీకు బరువా ? పిల్లా అంటూ చేతి లోంచి 
నేలకి ఒరిగిన మల్లెపూలు ని దుమ్ము దులిపి, చెక్కుకు పోయిన 
నా మోకాలి చిప్పపై ఒఫ్ అంటూ ఊదిన తాతగారు ఒక 
మాసిపోతున్న తెలుపు నలుపు చిత్తరువు జ్ఞాపకం , 
ఇది ఒక మొదలు.. 

ఇంకా సూది దారం, తో గుచ్చి గుచ్చి, మెల్లగా బొంత కుట్టు 
మొదలుపెట్టాను, ఒక్కో కుట్టు కి ఒక జ్ఞాపకం వచ్చి ఒద్దికగా 
కూర్చుం టున్నాయి , బొంత ని అందం గా చేయాలని నా తాపత్రయమ్. 

పుస్తకాలు బరువుగా మేని ని ఒంచి, 
చదువు జీర్ణం చేసుకున్న పసితనం అది 
మరో ధ్యాస లేదు, మరో చనువు లేదు ,నాతో నేనే పరిచయం పెంచుకుంటూ 
మెల్లగా స్నేహం రుచి చూసి, ఆ మొహం లో పడి పోయాను గా 
ఆ జ్ఞాపకం ని మెత్తగా బొంత కుట్టు తో కుట్టేసా ..  

ఇంకా కొన్ని వైవిధ్యమైన ,రంగుల ,చిత్రాలు 
తళుక్కున మెరిస్తూ, నా అతుకుల బొంత లో జాగా కోసం పోటి పడు తున్నాయి. 
ఒక్కొక్కటి , నాణ్యం చూసి, అతకనా వద్దా అని ఆలోచించి 
కొన్ని బద్ధకించి కుట్టడం మానేసాను . 

స్నేహాల అతుకులు  మటుకు ఎటువంటి మొహమాటం లేకుండా నన్ను కుట్టేయ్ అంటూ 
నా బొంత లో చోటు సంపాదించుకున్నాయి. 
అబ్బా ఎంత వెచ్చ గా ఉందొ నా అతుకుల బొంత వాటేసుకుంటే .. 
స్నేహం నా చుట్టూ చేతులు వేసినట్టు .. 

ఏదో వయసులో చిట్టి చిట్టి ఆకర్షణలు ,మాయం అయి ,ఒక తీవ్రమయిన 
కాంక్ష,  ఇలాగే అతని తో జీవించాలని అదే ప్రేమ అన్నారు, 
ఆ తీయని జ్ఞాపకాల తోరణాలు చిక్కగా అల్లిబిల్లిగా నా బొంత లో మెరుపుల్లా .. చిట్టి చిట్టి చేతుల ,మెత్తని స్పర్శ ని మరో అందమయిన బట్ట గా కుట్టేసా 
నా అతుకుల బొంత లో, 

ఏమిటో ,ఒక రంగు ఒక బొమ్మ లేదు, అన్ని రకాల వస్త్రాలతో ,
వైవిధ్యం గా, ప్రకృతి గీసే బొమ్మ లాగా తయారయింది ,ఆఖరికి ,
కుట్లు కుట్లు గా ,అతికిన బొంత ,లో కుట్టేసాను నా గుర్తులు ,నా జ్ఞాపకాలు ,
ఇప్పుడు ఇక నా ఖాళీ జీవితం అంతా మడిచి పెట్టి, పారేయొచ్చు ,
లేదా ,గంధం అక్షితలు చల్లి పరిమళం గా దాచుకొవచ్చు. 

నా జీవితం అంతా ఇలా అల్లి ,ఇలా కుట్టి, ఇలా విడమర్చి పరిచేసా 
నా జీవితం అతుకుల బొంత లా లేదే ,ఆశ్చర్యం అంతా ఒకే ఆకాశం లా 
చుక్కలు, మబ్బులు, చందమామ ని మోసే ఆకాశం అయిపోయిందే , 
నా చుట్టూ ,నన్ను తాకుతూ ఇంక ఎప్పటికి నా బొంతే ఇది. నా సొంతం . 






నా నడక , నా బాట ..

నేను నడిచిన బాట 
మరీ అంత అంతు చిక్కని బాట 
ఏమి కాదు.. 
అయినా ఎప్పుడూ వెలుతురు లో 
చీకటి ఉన్నట్టు ఎప్పుడూ 
వెతుక్కోవడమే .. 
తడుముకోవడమే 
ఎందుకో ,ఎంత వెలుగు సరిపోదు 
చీకటి శుభ్రం గా నయం అనిపిస్తుంది 
వెలుతురు కి చెయ్యి అడ్డుపెట్టి 
చీకటి కోసం తడుము కోవడం లో 
ఏదో ఒక ఆనందం.. 
అలవాటు లో ఎంత సుఖమో ,
నన్నడుగు నేను చెపుతా 
అలవాటు లో ఉన్న శాంతి 
నువ్వు కొత్త దారి వెతుక్కోడం లో 
ఉండదు, ఎంత కష్టమైనా ,నష్టమైన 
నాది అయిన ఈ స్వర్గం నుంచి నేను 
కదలను మెదలను .. 

చీకటి లో ఒక సుఖం ,
నా మొహం లో రంగులు 
మరి కనిపించవు ,
తెల్లని చిరాకు, ఎర్రని క్రోధం 
నీలం శరీర రంగు అన్ని 
నల్లటి చీకట్లో ఒకటే 
అందుకే నల్లటి చీకటి 
నేను హత్తుకుంటాను ఇష్టం గా. 

కష్టమయినా అందుకే అలవాటు 
అయిన బాట లో నడకే నాకు ముద్దు 
మరో దారి చెబితే వద్దు.. 
జిగురు కన్నా గొప్పగా 
అంటుకుంటుంది ఈ అలవాటు జిగురు . 

నా నడక నా బాట .. 
నిర్విఘ్నం గా ఇన్నేళ్ళు సాగుతోంది ?
వెలుగు కోసం అంటే ,
నువ్వు ఎలా నవ్వుతావో నాకు తెలుసు 
చీకటి ని హత్తుకునే నువ్వు, 
చీకటి ని ఇష్టం గా హత్తుకునే నువ్వు.. 









23 ఏప్రి, 2013

పెను నిద్దుర ...

అర్ధరాత్రి నిద్దురలో మెలకువ 
వచ్చి కల ని సరి జేసుకున్నాను 
నా కల నేనే రచిస్తాను ,రోజూ 
మెలకువ లో తీరని కోరికల 
పట్టి ఒకటి తయారు చేసి, 
తల కింద పెట్టుకుని , కలత గా 
నిదుర పోతాను, కల ఒకటి 
వస్తుంది, నా కోరిక తీరిన కల 
ఇంతలో మెలకువ కూడా , 
ఇలా నా జీవితం మొత్తం 
నిదుర లోనే గడిచి పోతుంది . 

జీవించడం అలసట 
అనిపించి ,అప్పుడప్పుడు ఇలా 
కలత నిదురో, కలో తెలియని 
అయోమయం లోకి వెళ్లి 
అలసట తీర్చుకుంటాను . 

ఎందుకో ధైర్యం గా 
పులి నైనా ఎదుర్కుంటాను కాని ,
ఈ జీవిత వ్యాఘ్రం నన్ను తినేస్తూ 
నా ఎముకుల బోలు ని 
రాల్చేస్తూ కాల్చేస్తుంది నిలువునా .. 


ఇంక ఎప్పుడయినా ఆలోచిద్దాం 
ఎలా జీవించాలో ?
ముందు నన్ను ఆత్మరక్షణ 
చేసుకోనివ్వండి , 
నా వెనకకి పరుగుని ఆపకండి ,
దయచేసి .. 
నా పెను నిద్దుర లోకి 
నా ప్రయాణం ఆపకండి మరి ..