"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 జూన్, 2013

మీ పిల్లల కోసం , మీ కుటుంబం కోసం

నాన్న ఒక జ్ఞాపకమ్.. 
చీకట్లో ,చేతిలో ఒక సిగేరేట్ తో ఏమేమి 
ఆలోచిన్చేవరో ??
ఆరుగురు పిల్లలు, నలుగురు ఆడపిల్లలం 
నత్త నావా , రోజుకి నాలుగో ,ఆరో అన్నాలు వండి వార్చే అమ్మ ,
చిన్న ఉద్యోగం, చిన్న జీతం, కాని ఎప్పుడూ కళ్ళల్లో ఏదో కలల వెలుగు 
చదువు తాళం చెవి అన్ని కల ల ద్వారాలకి అని నమ్మకమ్.. 
ఎంత చదివితే అంత చదివించే నాన్న ఉన్నారని ధైర్యం .. మాకు . 

లోటు అంటే ఏమిటో తెలీదు , ఆకలి వేసి ,అమ్మా అన్నం అంటే ఏ వేళయినా పెట్టే అమ్మ, అన్నపూర్ణ ఇంట్లో .. 
అమ్మా అంటే ఏం కావాలి ? ఆకలి వేస్తోందా అంటూ పరుగున వచ్చే అమ్మ .. 
ఎలా తెచ్చేవారో, ఏం కష్ట పడే వారో? నెలాఖరు అయినా చెరగని చిరునవ్వే ,నాన్న ఆస్తి . 

మా చదువు ,మా స్నేహితులు ,మా కబుర్లు అన్ని తన సొంతం చేసుకున్న 
అమ్మ , నాన్న మా సంపద . 
దిగులు అంటే తెలియదు, కలిసి ఉండడం లో ఆనందం మాకు తెలుసు, 
ఇంటికి ఎవరు వచ్చినా , ముందు ఒక కప్పు కాఫీ , తరవాత అన్నం పడేసి వచ్చి కూర్చునే అమ్మా. 

పిల్లల్లో ఒక్కరై , మా స్నేహితులతో కబుర్లు , జోక్స్ , సమస్త ప్రపంచం లో కబుర్లు 
అందరిని మన వాళ్ళే అంటూ హత్తుకునే పెద్ద గుండె , 

ఎందుకో ,ఏమో ఆ సిగేరేట్ పొగ తో ఉక్కిరి బిక్కిరై, ఆనాడు మొరాయించింది , 
మరో ఆరు సార్లు పోరాడి గెలిచారు.. 
తెల్లవారు ఘామున ఏదో ఘడియ లో , మా పిల్లలని ,అమ్మ ని వదిలి ఎలా 
వెళ్ళ గలిగారో ? చాలా దిగులు పడి ఉంటారు , అయ్యో ఎలా ? అని.. 

ఎందుకో ,ఈ రోజు తండ్రి ని తలుచుకునే దినం అంటే కొండంత దిగులు వచ్చి కూర్చుంది గుండెల్లో .. 
మనవళ్ళు అంటే ఎంత ప్రేమో ? ఎంత అపురూపమో?

మా నాన్నగారి కి తగిన కూతుర్లం అని పేరు తెచుకునే ప్రయత్నమే ప్రతి రొజు.. 
మన వారిని మనం చూసుకోవాలి, అందరూ సౌఖ్యమ్ గా ఉండాలి ,
అనే ఆలోచనలు నిజం చేసుకుంటూ , నాన్నగారండి , అని ఇంత పొడుగ్గా పిలిచే వాళ్లం . .. 

ఏదో , తెలియని ఆశ ,అంతా చూస్తున్నారా ?పై నుంచి .. 
అనే ఆశిస్తూ .. ఒక దినం ,ఒక్క దినం కాదు, ఇది ప్రతి దినం జరిగే మథనం .. 

ఇలా ఎంత మందో ? మధ్యలో వెళ్ళిపోయినా నాన్నలు .. ఆ సిగేరేట్ చేతిలోది 
విసిరేయండి ..ఇదే నా విన్నపమ్.. మీ పిల్లల కోసం , మీ కుటుంబం కోసం 

1 జూన్, 2013

ఇదే మా పునాది రాయి ...

జీన్స్ మీద టీ  షర్ట్  
కాళ్ళకి రీబోక్ ,కళ్ళకి రేమాండ్ 
మల్టీప్లెక్స్ స్క్రీన్ కి చింపిన రెండు టికెట్స్ 
పాకెట్ లో, అమ్మ వండి వడ్డించే అన్నం ,చికిన్ కూరో 
వంకాయ కూరో , కడుపులోకి  చల్లగా పెరుగు తో సహా 
ఇంట్లో వెయిటింగ్ .. 

కాళ్ళకి బాటా , కళ్ళకి ఎదురెండ , 
చెప్పులు కుట్టే నాన్న, కుండలు తిప్పే అమ్మ 
గంజో , అంబలో ఒక పూట దొరికితే పండగ 
బడిలో వెనక బెంచి, హాస్టల్ లో పురుగులు 
అద్దిన అన్నం పళ్ళెం అంటేనే అసయ్యమ్. 

నీకేం రా ? నీకు సీట్లు రిసేర్వేడ్ , నీకేం ?
అంటూ అసూయ పడే పెద్ద కులం పిల్లలని 
చూసి అయోమయం ,ఎన్నో తరాలు అనుభవించిన 
తల ఎత్తని , వీధి లో నడవ నీయని, బానిస లంజా కొడుకు 
అనే బిరుదు కలిగిన మా మీదా అసూయ ?

అవడానికి యువకులమే ,కాని ప్రేమలకు దూరం దూరం 
మా కులం అమ్మాయే దొరికిందా అంటూ చమ్దాలు ఒలిచేముందు 
ఎవరు నా మీద వేసారో ? మొదటి ప్రేమ లేఖ అడగరేం? 
మా కూతుర్లు, అమ్మలు కోడళ్ళు ,కామందుల కాముకానికి బలి 
అయిన రోజు ఈ కులం ఏ మూలకి జారుకుందో ?

తరతరాల అన్యాయానికి మనం చేసే పరిహారం అంటే 
ఇంకా ఎన్నేళ్ళు? అరవై ఏళ్ళు చాలవా ? అనే చదువు కొన్న వారిని
చూస్తే ఏం చదివారు వీరు ? అని అనుమానం రాదా? 
చరిత్ర అంటే , ఎవరు రాసిన చరిత్ర చదివారు? 

ఆలయాల లోకి ప్రవేశం అంటూ హెడ్ లైన్స్ ,
పెద్ద కులం వారు కట్టిన ఊరి మధ్య గోడ పోలీసు ల మధ్య కూల్చివేత 
మరో రోజు వార్తా, పెద్ద కులం అమ్మాయిని ప్రేమించాడని మొత్తం 
కుటుంబం ,మొత్తం నిల్వునా నిప్పు పోసి తగలపెట్టారన్న వార్త 
కలిగించిందా నీలో అణువంత కలవరం? 

గోడలు, మనుషుల మధ్య గోడలు నిర్మించి, 
ఒక్క బీట కే అలజడి చెందుతున్న ఈ అగ్ర కులాల పెద్ద మనుషుల 
పెద్ద మనసుల వివరాలు నన్నడగండి . 

దున్నేవాడిదే భూమి అన్నారని , భూములు పంచేసుకున్న వైనం 
చిన్న కులం , కొండ కులం , అంటూ నకిలీలు పుట్టించి ,కబళించిన చిత్రం 
నువ్వు ఆఫీసరు అయ్యావు కదా ,ఇంకా ఎందుకు నీ కొడుక్కి ? రిసేర్వేషణ్ ?
అని అడిగే ముందు ఎన్ని తరాలు నువ్వు నిరంతరం గా అనుభవిన్చావో ?
ఒకసారి దుమ్ము దుల్పి గుర్తు చేయనా ? 

మట్టి ని నమ్మితే మట్టి కొట్టారు కంట్లో , మా భూములే కావాల్సివచ్చాయి 
 మీ పెద్ద పెద్ద నిర్మాణాలకి , మీ భూములు పోతాయి అంటే , ప్రాజెక్టులే మార్చేసారు ,రహదారినే అడ్డం తిప్పేరు, ఘనులు మీరు ఎంతకైనా తగురు . 

దళిత వాదం అంటే హేళన ,బురద చిమ్మడం, 
అంతులేని ఆశ చూపి లొంగ దీసుకోవడం 
మీ కుట్రలు మీ కుతంత్రాలు ఇంకానా ? 
అణువంత నిప్పు చాలదా అగ్ని లా కణ కణ మని మండడానికి ?
భగ భగ మని మండే కార్చిచ్చు కి ఇదే మరి ఆరంభం . 
దళిత ,పీడిత ,తాడిత వర్గాలాదే  ఇక రాజ్యాంగం ,
అధికారం  చెల్లు చీటీ కి ఇదే మీ తోలి సంతకం
ఖబదదార్ , ఖబడ్దార్, మా పిల్లల నవ సమాజం కి 
పిడికిలి బిగించి చేసే ప్రతి అడుగు 
ఇదే మా పునాది రాయి ... 












28 మే, 2013

టచ్ మీ నాట్ ...

ముట్టుకుంటే ముడుచుకు పోతుంది 
ఆత్తి పత్తి , టచ్ మీ నాట్ అంటారు,  
ముచ్చట పడి ముట్టుకంటే ,సిగ్గుతో 
బిడియం తో ఎర్రగా కంది పోతుంది 

మనకి కూడా అలా ముడుచుకు పోయే 
గుణం ఉంది కాని, మొరటు చేతులు 
ఎక్కడెక్కడో పాకి, అసహ్యం ని చిందిస్తాయి . 
నా ఒళ్లంతా ముళ్ళై పోతే బాగుండును 
వాడిని రక్కి, రక్తాలు కారించి, హింస కి 
అర్ధం  చూపిస్తాను , నేను గులాబి బాల నే 
కాదు, ముళ్ళ కవచం ధరించిన బాలను ,
నా ఒంటి మీద చూపు పడినా ఖబదదార్ 
అంటూ ఒక్క పిడికిలితో మట్టి ని కరిపిస్తా . 

నేను ఆకాశం లో సగాన్ని కాదు ,ఆకాశం ని 
నన్ను తాకితే తగిలేది విద్యుత్ ప్రవాహం 
నీ ఒళ్లంతా కాల్చి, మసి చేసే వేయి వోల్టుల షాక్ 
మాడి మసి అయితే నీ బూడిద కూడా నల్లటి మసి . 

ఎందుకింత చులకన ? ఎందుకింత పలచన ?
నువ్వు ఎక్కడినించి పుట్టావో, అదే నీ జన్మ స్థలం 
అదే నీ అమ్మ ,నీకెందుకు జన్మ నిచ్చనా ?అని 
పరితపించే క్షణం . . మృగం కూడా సిగ్గు పడి ఛి 
అని చీత్కారించే అధముడివి నీవు. మదమెక్కిన మగవాడా ! 

వావి లేదు, వరస లేదు, పచ్చి మొగ్గ, పసి కందు 
పాలు కారే బుగ్గలు, ఎలా చేయి వేస్తావు అసలు ?
నీ గుండెలో ప్రవహించేది రక్తం కాదురా ,
నీ సిరల లో ప్రవహించేది కుళ్ళుకాలువ కచడా 
ఎత్తి పోసి, తొక్కి పెట్టి, నిలువునా చంపినా 
మా కసి తీరదు, మా ఆవేశం రంగు చూసి ,
నీ కలలో కూడా భయపడాలి నువ్వు...

అత్తిపత్తి లా ఇంకేమాత్రం ముడుచుకోం మేం 
ముళ్ళ కవచం మా ఒళ్లంతా కాచుకో మరి 
నీ ఒంటి మీద పడే ప్రతి ముళ్ళ గుర్తు ఇంకా 
నీ జీవితాంతం ,నీ అమానుష సాక్షులు ... 






26 మే, 2013

సంకెళ్లం మేమే.. విముక్తి ప్రదాతలం మేమే!




మాతృధినం... మహిళా దినం అంటూ
మాకొద్దీ ప్రేరిత తద్దినాలు
మాతృమూర్తివంటూ పొగిడి
త్యాగమే గుణం అంటూ ఉబకేసి
ఒక ముద్ద తక్కువ తినే అమ్మవంటూ
తను వండిన వంటలోనే వాటా తగ్గించి
ఎంతకాలం ఈ మోసం
ఎవరు వేస్తున్నారీ గాలం?
కడుపున పుట్టిన కూతురినే
తక్కువగా ఎందుకు చూస్తానో
అత్తారింటి కోసమే కన్నానా ఈ పిల్లని
నాచేతే నీతుల పేర తలవంచమని చెప్పించడం
ఇంకానా...
కూతురు అందంగా తయారయి
బయటికి వెళ్లిన రోజు
నా కడుపులో జరిగే
అతలాకుతలానికి అంతం ఎప్పుడు?
కన్న కలలు చెదిరిపోయినా
కూతురి కలలని కూడా నేనే ఎందుకు చెరిపేస్తున్నట్లు?
ఎవరు చెప్పారు ఇలా చేయమని?
ఎవరు చేయిస్తున్నారీ అఘాయిత్యాలు?
అంతా నీ మంచికే అమ్మా అంటూ
నాచేత అనిపిస్తున్నారెవరు?
ఒక ఒప్పందం చేసుకున్నామా?
నాలాంటి మరికొంతమంది కలిసి
ఏ ఆడపిల్ల కలలూ నిజం కాకూడదని?
ఏమో, నిజమేనేమో...
ఊచల జైలుకి మేమే కాపలాదారులం ఇప్పుడు
మా కాళ్లకి, మా నోళ్లకి మేమే సంకెళ్ళం...
నువ్వు... నేను...
మనం ఈ కుట్ర అర్థం చేసుకున్న క్షణంలోనే...
అవును ఈ కుట్రని ఇంక ఛేదించాలి మనమే...
ఎప్పటికో, మరి ఎప్పటికో ఈ సంకెళ్ళు తెగేను?
సంకెళ్లు తెగడమంటే
స్వీయపక్షంగా శిక్ష పడాల్సిందే
సంకెళ్లు తెగడమంటే
ఆధిపత్య కనుసన్నలని
కటకటాల వెనుక కుక్కేయ్యాల్సిందే
అన్ని రకాల దినాలకి
తద్దినం పెట్టాల్సిందే!
- పి.వసంతలక్ష్మి
ఆదివారం ఆంధ్ర భూమి వార్తా పత్రిక లో ప్రచురించిన నా కవిత 

21 మే, 2013

ఓరగా వేసి ఉన్న తలుపులు

ఓరగా వేసి ఉన్న తలుపులు 
నాకు ఎప్పుడూ ఇష్టమే ,
ఓరగా తెరిచిన పుస్తకం 
పక్క వాడి పుస్తకం లో కథ 
ఊహించడం ఎంత బాగుంటుందో ?

నా మానాన నేను ఎత్తుగా ,
కిటికీ దగ్గర దొరికిన సీటు లో కూర్చుని, 
సుదూరం గా ఎగురుతున్న పక్షుల ఇళ్ళు 
ఎక్కడో ? ఎలా చేరుకుంటాయో ? ఏ వేళ కో 
అనే ఆలోచనల చిక్కు లో చిక్కుకుని ఉంటే 

ఓరగా తలుపులు మూసి, పల్చని తెరలు 
ఎగురుతూ, పచ్చని గోడల మీద ఏదో ఒక 
జంట ఫ్రేం లో గోడ మీద ఒక క్షణం లో ఎంత 
చూడగలనో అంతా చూసేను . 

ఇంక రాత్రి అంత కలలు ,ఆ ఇంట్లో ఎవరుంటారో?
సంతోషం గా ఉంటారా? గోడ మీద జంట ఎవరో?
పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయారా ?
ఎక్కడో కొట్టుకుంటూ ,చూడమ్మా తమ్ముడు అనే అక్క ఉందా?

ఓర గా వేసిన తలుపులు వెనక ఎన్ని కథలో 
నాకెంత ఇష్టమో ? నేను రాయని కథలు అన్ని ఇక్కడే 
నాకు చెప్పని కథలు ,ఈ తలుపులు పోనీ చెప్పకూడదూ 
నిర్దాక్షిణ్యం గా రాత్రి అయేసరికి మూసుకుంటాయి తలుపులు 
దానితో బాటు నా కథలు ,నిద్రపోతాయి .. 
ఓరగా తెరిచినా తలుపులు ,కథలు చెపితే ? ! ?


19 మే, 2013

నది

కరిగి పోయిన నాగరికత కోసం 
వెతుకుతూ నది పరుగులు ,
ఒక్కసారి వెనక్కి చూసి వద్దాం 
ఏవి ఆ సింధు ,హరప్పా నాగరికతలు ?
ఏవి ఆ మానవ సముదాయాలుమిగిల్చిన
నది ఒడ్డున ఆనవాలు ?


సముద్రాలు నదిని మింగి అంతా 
కన్నీటి సముద్రాలు చేశాయా ?
ఉప్పు పాతరలు కడుపులో దాచుకుని 
సముద్రం, నీటి మేఘాలు పైకి పంపితే 
మానవ నాగరికత లో మానవత్వం 
ఆవిరి అయిపోయి, ఆమ్లాలను వదులుతున్నారు .. 

పసి మొగ్గలని చిదిమే పూల బేరగాళ్ళు 
విచ్చలివిడిగా బజారు లో పూల బేరాలు ఆడుతున్నారు 
పువ్వు అయతే చాలు నలిపేయాలని ఉత్సాహం 
చప్పట్లు కొడుతూ ఉత్తేజపరిచే నర సమూహాలు .. 
నరమాంసం రుచి చూసిన మృగానికేనా ,
ఆకలి తీరితే జాలి కలుగుతుంది, ఈ నరుల తీరే వేరు . 

నాగరికత నదుల వెంట వెలిసిందిట , 
నది మొహం చాటేసింది , ఈ రోజు 
నరుడు వదిలేసిన నానా చెత్త ,రొచ్చు 
భరిస్తాను కాని, ఈ రొచ్చు మానవుడి నా పక్క వద్దు 
అంటూ ,నది రోజు రోజు కి చిక్కి సల్యం అయిపోతోంది . 
నది నాగరికత అడుగు జాడలు కోసం వడి వడి గా 
ఎటు ప్రవహిస్తోంది? తనలోకి తనే ,అంతే మరి ,మరో దారి లేదు .. 



16 మే, 2013

ప్యూపా దశ

కవిత్వం రాయాలి అని కూర్చుంటే 
చీమలు నడుస్తున్నట్టు అక్షరాలు 
పరుచుకున్నాయి, పంచదార ని 
మోసుకెళుతున్న చీమల్లగా ,
అర్ధం, పరమార్ధం పెద్దగా లేదు . 

తీయగా ఉండాలా? కొంచం ఉప్పగా 
కన్నీళ్ళు చిలకరించాలా ?
కాసిన్ని వక్కపలుకులు పంటి కింద 
కఠినం గా పదాలు అల్లేయనా ? 

కుదురుగా కూర్చుంటే కదా పదాలు 
మస్తిష్కం లో కుదురుకుంటాయి ,
ఎప్పుడూ పరుగులే ,అటు ఇటు 
ఎటు వెళ్ళాలి అని ఆలోచనలు 
పాదరసం లా జారిపొతూ , కూర్చుంటే 
స్థిమితం గా అమ్మో జీవితం , దాటి పోతుంది . 
ఎండమావి వెంట పరుగులు పెడుతూ 
ఇదే కదా జీవితం అనుకోవడం  ... 

నేను చినప్పుడు సీతాకోక చిలుకల వెంట 
పరుగులు తీసేదాన్ని, రంగులు ఒక్కొక్కటి 
నేనే ధరించాను ఇప్పుడు .. 
రోజుకో రంగు ముచ్చటగా ,ఎప్పటికప్పుడు రంగు 
కొత్త కొత్త గా , నా పై చిలకరించుకుని , ప్రకృతి కెంత 
దగ్గరో అనుకుంటూ మభ్య పెట్టుకుని ,నేనుమళ్లీ 
నా గొంగళి పురుగు దశ లోకి హాయిగా గూడు కట్టుకుంటూ 

ఇంక ప్యూపా దశ లో హాయిగా కుదురుగా కూర్చుని 
కవిత్వం రాస్తాను ,ఉండండి , ఉందండి ..