"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

26 మార్చి, 2015

ఉగాది

కోయిల కూ కూ స్వరాల రింగ్ టోన్‌ సవిరించుకున్నా ..
ఈ బే లో వేప పువ్వు ఆర్డరు పెట్టాను ..
అదంత ఎందుకు శ్రమ అంటే ఏకం ..గా హోల్ మొత్తం గా
ఉగాది పచ్చడి ఎక్స్ప్రెస్ గా దిగుమతి చేసుకున్నా ..
మామిడి ఆకులు ఎందుకు ? మళ్ళీ మళ్ళీ తగిలించడం వాడిపోవడం ..
గుమ్మానికి వేలాడ దీసిన ప్లాస్టిక్ వాటి మీద కాసిని నీళ్ళూ జల్లా ..ఫ్రెష్ గా .
ఇంకా ఏమిటి ?
ఆ ! మరిచి పోయా ..మొబైల్ లో ఉన్న చుట్టాలు - పక్కాలు ..
హితులు స్నేహితులు ..స్నేహితుల గా ఒకప్పుడు ఉన్న వారూ
ఇప్పుడు సైలెంట్ గా మోగే వారూ ..
అందరికీ మూకుమ్మడి ఎసెమ్మెస్ పంపించా ..
మన్మధ నామ ఉగాది శుభాకాంక్షలు అని ..
బాంక్ లోన్‌ వారికి కూడా వెళ్ళీ పోయి దొరికారూ అంటూ
తిరుగు ఎసెమ్మెస్ ..ఇంకా యూ టీ ఐ వారూ , కోటక్ ఫైనాంసూ మొదలైన వారు
ఖుషీ ఖుషీ గా రిప్లై పలకరింపులు ..
అమ్మా ! ఇంత అమాయకమైతే ఎలా ? అన్నిటికీ అలా హోల్ సేల్ గా పంపిస్తే ఎలా ?
అంటూ తల పట్టుకుని .ఉ గాది నాడు పరువు రెక్టిఫై కార్యక్రమం లో పడ్డారు పిల్లలు ..
ఇంతలో ఓ చుట్టం ..మాకు మొబైల్ లేదని వెక్కిరింపా ? ఏదో ఓ మాట కోసం
అప్పు పుచ్చుకున్న మొబైల్ కి ఎస్సెమ్మెస్ పంపావుట అమ్మాయ్ ! అంటూ
అక్షింతలు ..కళ్ళూ తుడుచుకుంటూ మొబైల్ కొనుక్కోడానికి వెళ్ళీందిట ..
ఔరా ! ఎంత పని జరిగిందీ ..
ఇంతలో మరో దూర శ్రవణ పిలుపు ..అమ్మాయ్ ..ఒక్క సారి అదేదో నెట్ కాల్
చేయ వచ్చుట కదే ఏడాది కి ఒక్కసారి ..ఇదిగో మా మనవడు కలిపాడు నిన్ను ..
అంటూ ..వ్హాట్స్ అప్ ? అంటే చాలదు ట ..నిండూ గా నోరారా ? హాపీ పండగ అంటూ చెప్పలిట
ఏదో ఒక్క పండగ ? ఏడాదికి ..అయ్యో అంత సౌలభ్యమా ? మామ్మా !
ఉగాది అయిందా ? ఇంతలో శుభ్మ అని శ్రీరామ నవమి ..ఆ తరవాత మరొకటి ..
ఎన్నని చెప్పను ..? నాకు ఒక్క చిట్కా తోచింది ..
ఇది భలే స్టార్ట్ అప్ ఇడియా ..తధ్యం ..మీ అన్ని పండగలకి మీ తరఫున
మీ లిస్ట్ లో ఉన్న బంధు మిత్ర సపరివారం అందరికీ మేమే శుభాకాంక్షలు చెపుతాం ..
అంటూ ఓ కంపనీ మొదలు పెడతాను .. మన కి అతి ముఖ్యమైన వారికి ఓ స్టార్ చుక్క
పెడతాం అన్న మాట .. వారికి ఓ నాలుగు మాటలు ఎక్కువ పడతాయి అన్న మాట ..
ఇది జీవితాంతం సేవ ? ఐతే ఇంత ..
ఏడాది కి ఐతే ఇంత ..
భలే భలే ..నాకే ఎందుకు ఇంత గొప్ప గొప్ప ఐడియాలు ..
వడియాలు కాదండీ ఐడియాలు వచ్చేస్తాయో ..
ఇంకేముందీ ? బిల్ గేట్స్ కి పోటీ యే ..
ఉగాది పుణ్య మాని ..ఎన్ని కలలు కన్నాను ?
నా ఇంటి ముందు ఏవో ఎడారి పిచుకలు తిరుగుతున్నాయి
డిస్టంట్ కజింస్ ట కోయిల ల కి.. హలో చెప్పమంటున్నాయి ..
ఇదిగో అలా పిట్టలని వాటినీ పలకరించడం కాదు ..నాకు ఏం పెడతావు ?
సాయంత్రం ..అదే రాత్రి కి ? ఇంకేముంది పగలు మిగిలినవే ..
ఉగాది అని మారుతుందా ? ఏమిటి లెఫ్ట్ ఓవెర్లు మనకి మామూలే కదా
క్రితం ఉగాది రాసిన ఉగాది కవిత కి కాస్త పేరు మార్చి
పెట్టు చాలా దా ? అని అనలేదూ మీరు ..
హన్నా ! ఏడాదికి ఒక్కసారి వచ్చే ఉగాది కి ఒక్క కవితైనా రాయక పోతే
నా పరువేం కాను ? రచయిత్రి . కవయిత్రి అని ఎంత మంది పారిపోయినా కానీ
పట్టు వదలకుండా నా మానాం నేను రాసుకుంటున్నానా లేదా ?
నా చిన్న పొట్ట కి శ్రీరాం రక్ష అన్నట్టు
నా బ్లాగ్ పొట్ట లో చేయి పెడితే నే కుట్టనా ?
అదీ ఇదీ సరిపోలేదా ? ఏమో ..అసలే రన్నింగ్ రేస్ లో
వెనక పడి పోయాను అని ఉక్రోషం ..అదే ఉగాది కవిత రాసే పని లో
ఇంక నాకు మతి చెదరక ముందే ..
ఆలస్యం గా ఒక్కో కోయిల మరి కూస్తూ ఉంటుంది ..
స్వీకరించండి మరి ..
అందరికీ ..మితృలందరికీ
మన్మధ నామ ఉగాది శుభాకాంక్షలు ..
హమ్మయా ..పని అయిపోయింది ..ఇప్పటికి ..ఈ ఘడియకి ..
ఇంక పెన్ను మూసి ...వస్తావా ?
ఆ వచ్చే వచ్చే ..ఇదిగో ..

ఒంటరి స్తంభాలు

ఒంటరి స్తంభాలు అవి
దినమంతా దిగులుగా
నలు దిక్కులా నిరామయం గా
దిక్కుల కాపలా కాస్తూ
సాయం సంధ్య తో చీకట్లు
చిరు చిరు గా ప్రవేశించ గానే
ఈ స్తంభాలు జీవం పోసుకుంటాయి
వేయి కాదు లక్షల కళ్ళు విచ్చుకుంటాయి ..
సుదూరం గా ఉన్న ఓడలు
ఊపిరి పోసుకుని ఒడ్డు కి చేరతాయి
పిల్లాడి చేతిలో బాటరీ లైటు లా
గుండ్రం గా తిరుగుతూ
తొలి సూర్య కిరణాలు సోకగానే
శాపం పొందిన రాకుమారి లా
వెలుగు ఆపేసుకుని ..
ఉదయం నిద్ర కి ఉపక్రమిస్తుంది
సముద్రం విరుచుకు పడి
అలల లా తేలిపోతూ ,
నేల ని తాకే ఒడ్డున ..
ఓ కిరణం కూడా తాకితే ..
ఈ దీప స్తంభం అమర్చిందే ..
ఎత్తుగా కొండ పై నిలుచుని
తన చుట్టూ వెలిగే మిణూగురు లాంటి
నేల దీపాలని గమనిస్తూ విస్తు పోతూ
యారాడ కొండైనా .. ద్వీపం అయినా
ఏదో ఓ ఒంటరి ప్రదేశమే తన ఉనికి
సముద్రం లోతు పాతులు దీర్ఘం గా
తన సూటి అయిన చూపుతో కొలుస్తూ ..
యారాడ కొండ పై మా ఊరి
దీప స్తంభం ..కొండ శిఖరాగ్రం పై
చెట్టు చివరాఖరి కొమ్మ పై పిట్ట
కూర్చున్నట్టు .. అలఓకగా నిలుచుని
కన్ను కొడుతూ ఉంటుంది ..రాత్రి కి .
ఆ దీప స్తంభం తో మాకెన్ని
జ్నాపకాలు ..ఎవరు ఆప్తులు వచ్చినా
పదండి మా విశాఖ చూపిస్తాం అని
ఆ కొండ ఎక్కించడం ..దానికి ముందు
సముద్రం చానల్ ఓ లాంచ్ లో ..
నలుపు తెలుపు ..డాల్ఫింస్ నోస్
లైట్ హౌస్ అని తన పేరు రాసుకుని ,
దీపం సమ్మె లా పవిత్రం గా ఎవరి
జోలి తగలకుండా కొండ చివరి వాలు పై
ఆని , రాజుగారి ఒంటి స్తంభం మేడ లా
తపస్సు చేసుకుంటున్న ముని కి
తపోభంగం కలిగినట్టు ..
కిల కిల మంటూ అప్పుడప్పుడు జనం
లోపల ఉన్న గుండ్రని మెట్లు ఎక్కి ,
ఇంకా పై పైకి ఒక నిచ్చెన లాంటిది ఎక్కి
చివరాఖరుకి ..ఆ తల పై చేరి తలుపు
తీసి అడుగు పెడితే ,కొడుతుంది
ఉప్పెన లాంటి గాలి ..జీవిత కాలం లో
కూడబెట్టిన కల్మషాన్ని అంతా కడిగేస్తూ
అబ్బ ఏం గాలి ? రివ్వు రివ్వున గాలి
రెక్కలు ఎగర గొట్టేస్తూ , చాచి చూడు
పక్షి లా ఎగర గలుగుతావేమో అని పిస్తూ ..
జాగ్రత్తగా దువ్వి ముడి వేసిన తల అంతా
చిందర వందర చేస్తూ స్వేచ్చ అంటే ఇదే కాదూ
అని చిరునవ్వులు మొలకెత్తిస్తూ
ఇదే నా గమ్యం ..ఇదే ప్రపంచం చివర .
ఇదే మరి నా తిరుగు రాని గమ్యం అని
అని రూఢిగా ప్రకటిస్తూ ..ఆ గుండ్రని
వెలుతురు దిమ్మ చుట్టూ , తిరగడం ..
ప్రద్క్షిణం ని గుర్తు చేస్తూ ..
ప్రపంచం నుంచి పారి పోవాలని
అనిపించిందా ? ఇక్కడికి రా ! అంటూ
దీవించింది ..ఆ కిరణాల కిరణ్మయుడు ..
శాంతి దొరికింది , జీవిత కాలం కి సరిపడా ..
దీప స్తంభం ఎక్కడ చూసినా ..
అవి సుందరమైన ద్వీపాలే ..
లేదా ఎత్తైన శిఖరాగ్రాలు ..
ప్రపంచం లో ఉన్న అన్ని లైట్ హౌస్ లని
చూడాలి అని ఓ తీర్థ యాత్ర కల
ఎప్పటికి తీరుతుందో ?
ఆఖరున ..ఈ లైట్ హౌస్ లు ..
శాంతి అశాంతి ..ప్రశాంత త ..కల్లోలం ..
మనసులో స్థిరత్వం ..కాసింత చిత్త చాంచల్యం ..
పిచ్చి వెర్రి ..మామూలు మనిషిత్వం ..
వీటన్నిటికి మధ్య ఓ సరిహద్దు గీత లా
నిలబడి నట్టు ..నాకు ఎపుడూ ..తోస్తుంది ..
వేదాంతం ..అంటూ ఎక్కడొ లేదు ..
నీ మధ్యే నీలోనే ఉన్నాను ..ఇలా
నిట్ట నిలువుగా నీ మెదడు పొరల లో
ఎన్ని ఎన్నెన్ని కథలు , కబుర్లు చెపుతుందో
ఈ వెలుతురు కిరణాల స్తంభం ..
వింటారా మరి ?

4 మార్చి, 2015

సముద్రం

సముద్రం కథలు చెప్పి చెప్పి
అలసిపోయిన అమ్మ లాగా ..
తేలి పోతూ ..
అల ల పై నెమ్మదిస్తొంది ..
తీరం ఎప్పటిలాగానే
స్థిరం గా
పానుపు లా
పొడి పొడి ఇసక తో ..
దొంగాట ఆడుకుంటూ
అలా దొర్లిపోయాడు
సూర్యుడు ఎక్కడికి పోతాడు ?
రేపటికి దిగ్మండలం మీదకి రాడూ
ధీమా తో సముద్రం ..
ఆకలి పక్షులో
ఆడు కునే పిట్టలో
నీలి నీటి పై వేటాడుతూ
తుర్రు మంటూ ,
పగటి చుక్క ల్లా ..
ఉత్తరాన ఉత్తరాలు
అందించాలి అంటూ
పరుగులు తీసేం
మబ్బు తునకలు ..
తునక లు తునకలు గా
పీచు మిఠాయి లా
విడి పోతూ ..
అంతా ఆట ట ..
అంటున్నట్టు ..
చిన్న పిల్లల ఆట అన్నట్టు
నత్త లు చెదురు మెదురవుతూ ..
ఇలా ఈ ఒడ్డున కూర్చుని
ఈ సృష్టి సౌందర్యం
ఒక్క సారీ చూడరా ? అని
బెంగ గా సముద్రం వాపోతూ ..
నా ఇల్లు నా కుటుంబం ,
నా జీతం , నా జీవనం అంటూ
వాహనాల లో పరుగులు
అంటూ నరులు వానరుల నుంచి
వచ్చిన నరులు ..
అంతే కదా ..మన జీవనం
సుదూర స్వప్నాల కై
అవిశ్రాంత పయనాలు
నయనాలు తెరిచి మరీ
ఒక్క క్షణం ఆగితే ..
అలా ఆగితే ..ఆగిపోతామేమో ..
నాగరికత వెలిసిపోతుంది ..
జన జీవనం మరి ఏమవుతుందో ..
సముద్రం మటుకు ..
నాగరికత ని కలిపేసుకుంటూ
అలా ..నిరంతరం ..
ఇలా తరం తరం ..

21 జన, 2015

నదీ ప్రవాహం ..నరుడి కి పాఠాలే

విశాఖ నుంచి ముంబాయ్ విమానం లో ప్రయాణిస్తూ ..
కిటికీ సీట్ లో కూర్చుని ..చూసాను ...
ఒక నది వంకలు తిరుగుతూ ప్రయాణం చేస్తూ కనిపించింది ..
నది ఎంత సజీవం గా కనిపించిందో ,
నిరంతరం నది అలా ప్రవహిస్తూ ఉంది ..
ఎక్కడా ఆగ లేదు ,ఎక్కడా అలుపన్నది లేదు ..
చిన్న చిన్న పిల్ల నదులు వచ్చి కలుస్తున్నాయి ..
భూమి వాలు , భూమి తీరు ని బట్టి నదీ ప్రవాహం
తన తీరు ని మార్చుకుంటూ నడుస్తోంది ..
ఎన్నెన్ని మలుపులో .. భూమి ని సారవంతం చేయాలని
అన్న ధృఢ నిశ్చయం తో పయనం అవుతున్న నదీమ తల్లికి
ఎన్ని వందనాలు అర్పించాలో ..
మనం వ్యర్ధాలు , కాలుష్యాలు కలిపేసి
ఎంత అన్యాయం గా ప్రవర్తిస్తున్నాం ?
నది నన్ను ఎప్పుడూ ఉత్తేజ పరుస్తుంది ..
మన నాగరికత లన్నీ నది ఒడ్డునే ట ..
అవును మనకి జలం ,ప్రాణం తో సమానం ..
జలం ,గాలి ,భూమి లేకుండా మనం మన గలమా ?
నది లో ఎంత స్వాభావికత ?
తన కి తోచిన మార్గం లో తనే నిశ్చయించుకున్న మార్గం లో
గమ్యాలు మార్చుకుంటూ పయనాలు చేస్తుంది ..
పిల్ల కాలువలని తన లో కలుకుంటుంది ..
ఏ అభ్యంతరాలు లేవు ,ఏ సంకోచాలు లేకుండా ..
స్నేహ పూర్వకం గా ..
మర్యాదగా , చేతులు చాచి స్వాగతిస్తూ ..
తన లో కలిపేసుకునే నది ,తల్లి కాదూ ..
ఈ సహజ ప్రవర్తన లో నది తల మానికం ..
ఒడ్డులని ఒరుసుకుంటూ ,
ఆ గమనం లో భూమిని సుసంపన్నం చేస్తూ ..
పచ్చదనం కి ఊపిర్లు పోస్తూ ..
అడవులకి కీకారణ్యాలకి తన చెమ్మ ని అందిస్తూ ,
నది ఎంత సహజం గా ప్రవహిస్తుంది ..
నది గమనం లో కట్టిన ఆ డామ్‌ చూడండి
ఆ వెనకే అనూహ్య మైన పెద్ద సరస్సు చూసారా ?
ఏదీ ఆ వడి ,ఆ పరుగులు ? ఆ సహజ నడకలు ?
అంతవరకూ ఒక స్త్రీ కి సహజం గా లభించే ప్రేమ లా !
వివాహం అనే వ్యవస్థ లో లభించే ఉక్కిరి బిక్కిరి ప్రేమ ,రక్షణ లా
లేదూ ,ఆ సరస్సు , నాలుగు ఒడ్డులని ఒరుస్తూ ..
అక్కడే ఆ గది లోనే ..
అంతా ఆ నాలుగు గోడల మధ్యనే , నీ ప్రేమ ,నీ అనురాగం అని
ఆమె ని , అమ్మ ని బంధించి నట్టూ ..
ఆ సరస్సు ..ఆ పెద్ద సరస్సు ..ఆ లోతైన సరస్సు ..
నది సహజ ఒడిదొడుకులు ఏవీ ?
పిట్ట పాడినట్టూ ,మయూరం ఆడినట్టూ ..
ఆకాశం నుంచి వాన కురిసినట్టూ
నది ప్రవాహం ..ఒయ్యారం గా ..ఏదీ
నది భూమికి అలంకారం ..
ఆమె తనకి తాను అందించుకున్న సింగారం ..
మానవ మాత్రులు కోసం కాదు సుమా !
నది ..నాగరికత పేరున నదీ ప్రవాహాలు
మార్చేసాం , ఆనకట్టలు కట్టేసాం ..
కాలుష్యాలు నింపేసాం ..జీవ ప్రాణుల ఉనికి
విస్మరించాం ..నదిలో ,ప్రవాహం లో పెరిగే జీవ
సంచారం ..మనకి ఎరుకేనా అసలు ?
అనంత ఘోష తో సముద్రం పిలిచే
పిలుపులకి నది స్పందిస్తూ ,ఉరకలు వేస్తూ
కలుస్తుంది ..ఆ మహా సంగమం
గగుర్పాటు కలిగించే సహజ సంగమం ..
ఈ అనంత ప్రయాణం ..ఎన్ని యుగాలుగా
సాగుతూ ..
పిపీలకం లాంటి మనం ...వినమ్రులై
నది ముందు సాష్టాంగ పడి ..
కోరాలి ...నదీమ తల్లీ మమ్మలని కరుణించు అని ..
దౌర్జన్యం తో , దుష్ట బుద్ధి తో
కొనసాగిస్తే ఈ ముందు చూపు లేని చర్యలు
మంద బుద్ది దుశ్చర్యలు ..తప్పదు మరి వినాశనం ..
మనిషీ ...రోదసి నీ జయించడానికి
బయలు దేరావు ..కాస్త నీ కాలు నేల మీద ఆంచి
ముందుకు వేయి నీ అడుగు ..
వామనుడి అవతారం లా అన్నీ
నీకే కావాలి అనుకుంటే ..
తప్పదు మరి ..
వినాశ కాలే విపరీత బుద్ధి అన్నారు కదా ..
నదీల ప్రవాహం ని అనుకరిస్తూ
సహజం గా బ్రతికే నరుల రూపాల ని
ఊహిస్తూ ...
ఈ రోజు ..ఈ ఆలోచనల ప్రవాహం ని
అక్షరీకరించా...
వసంత లక్ష్మి ..

పెద్ద పులుల సంఖ్య పెరిగింది ట

పెద్ద పులుల సంఖ్య పెరిగింది ట ..శుభం ..
ఇంక ఆడ శిసువుల సంఖ్య పెంచుదాం ..
ఇప్పటికే ఆడ పిల్లలని కొనుక్కుంటున్నారు ట ..వధువులు దొరకక .
భాష రాక పోయినా సరే ,కేవలం ..తమ కుటుంబాన్ని పెంచుకోడానికి వధువులని కొని పెళ్ళి ళ్ళు చేసుకుంటున్నారు ట ..
ఎంత దారుణం ? 
ఆడ పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత ముచ్చట గా ఉంటుంది అసలు ! 
దేవీ దేవతలని కొలిచే మన దేశంం లో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అంటే మనం ఎంత సిగ్గు పడాలి ..
పూజలు ,వ్రతాలు చేసే ఈ స్త్రీలేనా ? తమ లో పెరుగుతున్న నవ శిశువు ప్రాణా లని హరించేవారు? 
ఎందుకు ? మగ పిల్లలు ఆఖరి కర్మ క్రియలు చేస్తారు అని ..
లేదా ? వారు తమని ఆఖరి దశ లో చూసుకుంటారు అని ..
ఇంకా ఈ ఆలోచనలని మనం వదలటం లేదు ..ఏ ఇంట్లో చూసినా నాకైతే తల్లి తండ్రులని చూసేది ఆడ పిల్లలే అనిపిస్తోంది ..
స్త్రీలని నేను కించపరచను ..వారి ఆలోచనా దృక్పథం ని అంతటి తో కుదించి వేసేది ఈ సమాజమే ..అంటే మగవారే ..
వంటింట్లో వంటలు చేసే మగ వారిని చూపించి ,ఏదో స్త్రీల పెత్తనం వచ్చిందని నమ్మిస్తారు ..కాని అది నిజం కాదు ,అని మనకి తెలుసు ..ప్రతీ అడుగూ ,ఒక మగవాడు నిర్ధారిస్తాడు ..
నువ్వు చదువుకో ,నువ్వు ఉద్యోగం చేయి ..ఇంత మంది పిల్లలని కను ..లేదా కనకు ..ఇలా ముఖ్యమైన విషయాలన్నీ మగవారే నిర్ధారిస్తారు ..ఇది మన చుట్టూ జరిగేదే అని మనమూ ఇలా ప్రవర్తిస్తాం ..అంగీకరిస్తాం ..పెళ్ళి అయాక ,స్త్రీకి స్వాతంత్ర్యం మరీ ఒక అపురూప మైన విషయం లా అవుతుంది ..
ఇప్పుడిప్పుడు ఆడ పిల్లలు మేం పెళ్ళీ చేసుకోం ,చేసుకున్నా ,ఇలాంటి వారినే చేసుకుంటాం ..ఉద్యోగాలు మానం ..అంటూ షరతులు పెడుతూ ఉంటే ,బుగ్గలు నొక్కుకుని , ఇలా బరి తెగిస్తున్నారు అంటూ ..చిందులు వేస్తూ ..
వారిని భయ భ్రాంతులు చేయడానికి , అత్యాచారాలూ ,హింసా సాగిస్తున్నారు ..
ఆడ పిల్ల కి ఎన్ని రక్షణా చట్రాలో ..ఆమె ఉక్కిరిబిక్కిరి అయి ..ఎలా ప్రవర్తిస్తుందో ..చూస్తున్నారు కదా ..
ఆమె కి కావల్సినవి ..నగలూ ,చీరలూ కాదు ..గౌరవం .. సమ స్థాయి లో గౌరవం , అమె ఆలోచనా క్రమాన్ని అంగీకరించడం ..( నీకేం తెలుసు ? అని కొట్టి పడేయకుండా ) , సంఘం లో ఆమెకీ ఒక బాధ్యతా యుతమైన స్థితి ( ప్లేస్ ) కలిపించడం ..ఇవి నిర్విఘ్నం గా చాలా కాలం జరుగుతూ ఉంటే ,ఆమె కి ఒక సమ న్యాయం దొరికే అవకాశం ఉంది ..
ముందుగా మనం స్త్రీలు కూడా ఎంతో మారాలి ..
ఈ ప్రయాణం మొదలయింది ..ఇంకా కొనసాగుతూ ఉండాల్సిందే ..
తలుచుకుంటే పులుల సంఖ్య పెంచ గలిగాం ..
ఆడ పిల్లల సంఖ్య పెంచలేమా ??

19 సెప్టెం, 2014

'కౌగిలి 'ముక్తవరం పార్ధ సారధి..వ్రాసిన చిన్న నవల.
చదివితే మనసు కలత చెంది, ఈ వివాహ వ్యవస్థ ఒక మగవానికి ఎంత అండ గా ఉంటుందో ,ఒక స్త్రీ భార్య గా మారేక, చేసిన అనేక త్యాగాలు, మార్పులు ఆమె జీవితం లో ఎలా అతలాకుతలం చేస్తాయొ, ఇంకా ఆ పై, అమ్మ గా ఆమె శరీరం ఎలా శిధిలం అవుతుందో ,ఆవిడ చివరికి దీనం గా ఎలా ఒంటరి గా నిలబడతుందో.. అన్ని ఎవరొ మనకి విడమర్చి చెప్పినట్టు అర్ధం అవుతుంది.

మీకేం తక్కువ? అంటూ, చీరలు, నగలు, మొదలైన సుఖాలతో ఆమె నవ జీవితం లో ధుఖాన్ని, అసమానతలని కప్పి పుచ్చేలా ,ఈ సమాజం మగవానికి అండ గా నిలుస్తుందో మనకి కనువిప్పు అవుతుంది.

మనోరమ ,బాలు ఒకే ఆఫీసు లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. బాలు ఒక ఏడాది  ఆమె చుట్టూ తిరిగి, పెళ్ళి చేసుకుంటాడు . మనోరమ ఒక మధ్య తరగతి అమ్మాయి, ఒక చెల్లి, తమ్ముడు..తల్లి తండ్రులు ఆమె కుటుంబం.

విచిత్రమైన కుటుంబం, తండ్రి పెద్దగా ఇంటి గురించి పట్టించుకోడు, అందువల్లనేమో అందరూ బాధ్యతా రహితం గా తోస్తారు బాలు కి .
మాట్నీలు, రాత్రి అంతా పేకాటలు, ఎప్పుడు పడితే అప్పుడు కాఫీలు, ఈ వాతావరణం బాలు కి కొత్త .
బాలు వేసే లెక్కలు, పొదుపు ఖర్చులు, సమయ పాలన , ప్లానింగ్ ,మనోరమ కి కొత్త, ఆమె కి కొత్త, ఆమె కి ఫడవు.

పెళ్ళి కొత్త మోజు తీరేక, చిన్న చిన్నగా గొడవలు మొదలవుతాయి. మనోరమ జీతం లో అన్నీ కోతలే, ఎప్పుడు, ఎందుకు చేసావు ఇన్ని అప్పులు అన్న దానికి ఆమె దగార నుంచి సమాధానం ఉండదు.
ఆఫీసు కి అంత అలంకరణ ఎందుకు? అందరితో అంత చనువు ఎందుకు? అని బాలు కి కోపం, విసుగు.
అతనికి ఉద్యోగం లో పైకి రావాలని తీవ్రమైన కోరిక.

మనోరమ మీద కోపం తో కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించక ఆమె ని గర్భవతి ని చేస్తాడు.

రచయిత వాక్యం ఒక చోట..మనుషులు పరస్పరం వాడుకుంటారు.

ఒక పిల్లవాడు పుట్టేక, ఆమె మరింత చికాకు పడుతూ ఉంటుంది, తను తల్లినవడానికి మానసికం గా సిద్ధం కాలేదు
అని ఆమె బాధ. తల్లి అయేక ఆమె మరింత బాధ్యత గా ఉంటుంది అని బాలు ఆలోచన.
కలకత్తా లో ఏదో ట్రైనింగ్ అని చెప్పి నెల రోజులు, చంటి పిల్లాడితో వదిలి వెళ్ళిపోతాడు. తన ఉద్యోగం , పైకి వెళ్ళడం అతని ముఖ్యమైన విషయాలు జీవితం లో, భార్య, పిల్లాడు, కుటుంబం అన్నీ తరవాతే ..

మధ్యలో మరో అబార్షను , మనోరమ ఆరోగ్యం మరింత దిగ జారుతుంది.
అతను పట్టించుకోడు, మళ్ళి ఆమే ఇంటికి వస్తుంది.
మరో సారి గర్భం.. ఒక అనుకోని ఘటన తో ఎనిమిదో నెలలో పాప పుడుతుంది. ఆమె మెదడు కి దెబ్బ తగిలి, బుద్ధి మాంద్యం పిల్ల గా పుడుతుంది.

మనోరమ లో అప్పటి వరకు లేని మాతృత్వం పొంగి ,కూతురిని ఎలాగైనా నయం చేసుకోవాలని తాపత్రయ
పడుతూ ఉంటుంది. బాలు కౄరం  గా ఈ పిల్ల బ్రతకడం దండగ అంటూ ఉంటాదు. ఆమె కన్నీరు పెట్టుకుంటూ ,వైద్యం కి సాయం చేయమని బ్రతిమాలుకుంటుంది. ఆరోగ్యం పూర్తిగా పాడై పోయి, సన్నాగా పుల్ల లా తయారు అవుతుంది. అలాంటి ఆమె ని తన ఖర్మానికి తనను వదిలేసి, బొంబాయి కి బదిలీ అయిందని చెప్పి, కొడుకు ని తీసుకుని వెళ్ళిపోతాడు.
ఆమె ఉద్యోగం కి ఈ బదిలీ సౌకర్యం లేదు అని జవాబు, ఆమె అతనితో వస్తాను అంటే..

అక్కడితో నవల అయిపోతుంది.

కానీ ఆలొచనలు ముసురుకొని, ఏమిటి ఇంత అన్యాయమా? వివాహ వ్యవస్థ లో క్రౌర్యం  మనకి లీలగా అర్ధం
అవుతుంది. మగ వాని ఆరొగ్యం, మనసు, ఇంతగా చితికి పోవు, స్త్రీ మనసు నలిగినంత గా అతని కి బాధ లేదు అంతా సౌకర్యం గా ఉన్నంతవరకు అతనితో పేచీ లేదు. ఒంట్లో బాగో లేక పోయినా లేచి వంట చేసే స్త్రీ చాలా గొప్పదని మనకు నూరిపోసారు. అందుకే మనం అలా సాగుతూ ఉంటాం. దొంగ జబ్బులు అని వెటకారాలు, జబ్బు మనిషి ఎప్పుడూ మూలుగు తూ ఉంటావు అని ఆమె ని హేళన చేయడం.. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఆమె జబ్బులకి అసలు మందులు మాకులూ కూడా ఆలస్యం గానే కనుకొన్నారు అని..

రచయిత ఎక్కడా ఎవరి పాత్రని విమర్శించడు, అలా జరుగుతున్న సంఘటనలను చెప్పుకుంటూ పోతారు.

ఒకసారి బాలు  భార్యకి చెప్పి తన పై ఆఫీసరు ని భోజనానికి పిలుస్తాడు. ఆమె బయటకి వెళ్ళి ఇంటికి రాదు, విపరీతమైన కోపం తో ,తన ఉద్యోగం కోసం ఆమె ని వాడుకోవడానికి రాలేదు కాని, చక్కగా అలంకరించుకుని
,సహ ఉద్యోగులతో కులుకుతూ మాట్లాడుతుంది అనుకుంటాదు..
అంతే కదా.. ఒక స్త్రీ, ఎక్కడ ఎలా మసులుకోవాలో ,ఎలా అలంకరించుకోవాలో ,ఎవరి కోసమో అన్ని ఆమె కి చెపుతుంది ఈ సంఘం. మగ వారు చేసిన ఈ సంఘం. ఎంత అన్యాయం, ఎంత హింస ,కనపడని హింస.

నువ్వు సంఘం చెప్పు చేతల్లో ఉంటే అంతా శాంతి, ఒక్క అడుగు బయటకి పడినా రక రకాల పేర్లు, నీతులు
చెప్పడం..

ఆడవారిని కూడా ఈ కుట్ర  లో భాగం చేయడం.. వారి తెలివి కి నిదర్సనం.

స్త్రీ కి స్త్రీ యె శత్రువు అంటూ ,ఉసి గొలుపుతారు. దయచేసి ఆ మాయలో పడకండి. నేను ఈ నవల చాలా సార్లు చదివాను, నన్ను నేను తెలుసుకోవడానికి  ,నాకు చాలా ఉపయోగపడింది ఈ చిన్న నవల..

ముక్తవరం పార్ధసారధి  గారికి వందనాలు..

9 జులై, 2014

రెండు కవిత లు ..

స్టిల్ ఫోటో 

మనం ఇల్లు సద్దుకుందాం అనుకుంటూ ఉంటాం ..
ఇంతలో పిలుపు వస్తుంది ..
ఎక్కడ చదువుతున్నామో మడత పెట్టిన పుస్తకం అలా బోర్లించి .
అయ్యో పుస్తకం నలిగి పోతుంది ..ఐనా అలాగే చేస్తాం ..
అదే అలవాటు మరి ..
బీరువాలో ఒక కొత్త చీర ,ఇంకా అంచులు , జాకెట్టు కుట్టించలేదు
ఆఖాశం మీద చుక్కల్ల్లా గా ,ఎంత అందమైన పూలు చీర నిండా ,,
రేపటికి దాచుకున్నాను ..ఆ మంచి రోజు కోసం ..
ఆ పండగ కోసమే
అన్నీ అలాగే ఉంటాయి ..
నువ్వే ఉండవేమో ..
గుండె ఝల్లుమంది కదూ
లైఫ్ స్టిల్ ఫోటో ..
కదిలించి ,నడిపించి ,అనుభవించు ..ఇప్పుడే ..
ఈ క్షణమే ...
అవును ..ఈ క్షణ మే ..
స్టిల్ ఫోటో ..నువ్వు అయిపోక మునుపే ..


భోషాణం ..23-06-14


అదిగో ఆ మూల రంగం పెట్టె మటుకు నాది
కదపకు ..విప్పకు ...ఎప్పుడూ
నేనే ఎప్పుడో చూపిస్తాలే ..
మరో తరానికి చూపిస్తాలే ..
నా ఆశల సీతకోక చిలుకలు రంగులు వెలిసి
కన్నీటీ చుక్కలు ఎండి బుగ్గల పై ,చారికలు కట్టి
ప్రవహించని నది గడ్డ కట్టినట్టు , ఆ మూల ఎక్కడో
ఒంపేసి ఉంటాయి , జాగ్రత్త సుమీ ..
అక్కడక్కడ బోసి నవ్వులు ,కొంగు న వేలాడేసుకున్నవి
ముడి వేసాలే జాగ్రత్తగా .. అదిగో ఆ పచ్చ చీరకే ,ఆ కొంగే
నే తిన్న జీడి పాకం ,ఇంకా జిగురు గా అంటుకుంటూ ,
బాల్యం ని ఎప్పటికీ పారేసుకోను అని తెలియదా ?
నవ్వులు గోడల పై అతికించాను అరే ఇక్కడ
కొన్ని చేరాయే , ఈ భోషాణం లో ,ఎప్పుడు ఎగిరిపోయాయొ ,
వేళ్ళ సందు నుంచి జారి మరి ..
యవ్వనం ఎగరేసిన ఝండా రెప రెప లాడుతూ ఉండేది
ఇక్కడ ఒద్దికగా చుట్టుకుని ,చమ్మగా , చుట్లు చుట్లు గా
దాక్కుంది , భోషాణం గట్టి గా బంధించింది కదా ,
మరే ఒకటా రెండా ,ఎన్ని జీవిత క్షణాలని ,
జీవించక ముందు తర్వాత ,ఒక స్పెసిమెన్‌ లా తీసి దాచింది .
దీనినే టైం కాప్సూల్ అని అంటారుట ..
పాతి పెట్టండి , సీలు వేసి ,
ఎప్పటికీ , నీకూ నాకూ
ఒకటి మటుకు కాదు ..భోషాణం ..తీపి గుర్తులు దాచే భోషాణం ..