సాయంత్రాలు మబ్బులు
ఇళ్ళు వెతుక్కుంటూ
అటూ ఇటూ పరుగులు
పెడుతూ
మా ఇంటి ముందు
ఏదో ముచ్చట్లు గుర్తు
చేసుకుంటూ ఆగితే
నీకు కబురు పంపిస్తా
అంతా కుశలమే అని .
పూలు రంగు ముస్తాబు
కావిస్తూ గాలి హత్తుకుంటే
సన్నని పరిమళాలు కానుకగా
గాలికి వదిలితే
అదే నా సందేశం అనుకో
ఈరోజుకి సన్నజాజులు
ఎన్నిక చేసా నీ కోసం .
అలుపెరగని అలలు
తీరంతో చేసే సందడి
ఉల్లాసం ఉత్సాహం నింపింది
మనసులో ,ఆ తుప్పర
చల్లదనం నీ మేని కి గంధంగా
పూయనా మరి ఈ రాతిరికి
నక్షత్రాలు చీకటి ఆకాశంతో
చేసుకున్న బాసలూ ఊసులూ
తెల్లవారక ముందే
చేరేస్తాను నీ చెవికి
ఆ నీరవ నిశ్శబ్ద సంగీతం
నిన్ను తాకి రాగాలు పోతుంది
ప్రకృతి సమస్తం తల ఒగ్గి
వినయంగా అర్ధిస్తూ ఉంది
మనం ఇద్దరం కలిసి మమేకంగా
ఈ పొద్దుకి రంగులు అద్దాలని
సూర్యుడినో చంద్రుడినో
నీలోనే సమస్త విశ్వం విశ్రమిస్తూ
పరిభ్రమిస్తూ నన్ను విభ్రమపరుస్తూ
పిపీలకమైనా
మరి ఏ జీవం అయినా
నర్తించాల్సిందే
ఈ ఉదయపు సాయంత్రపు
నీడల తెర పై
ఆసక్తికరంగా
పరిభ్రమణ ఒక్క గ్రహాలకేనా ?
జీవ రాశిలన్నిటికీ కాదూ !
నమస్సులు సమస్త
విశ్వ పరిభ్రమణా శక్తులకు
తాండవం చేసేది ఒక్క శివుడేనా
నా మనహ్ తటాకం లో
మునకలు వేసే కోరికల నృత్యమూ
తాండవమే ..
మనిషి జీవిక
ప్రేమికగా రూపు
దిద్దుకుంటూ
మానస సరోవరంలో
కమలంలా
పురి విప్పుతూ
ఎన్నెన్ని విభ్రమలు
ఎన్నెన్ని విస్ఫోటనా
చిత్త భ్రమలూ
మరెన్ని తాపసీ
తరుణాలూ
దర్శించుకుంటుంది
మనిషీ ..మానసీ
తాపసీ , మానినీ
నీకు నా
ఆలింగనాలు ..
నా నీడ ని నేను
తాకిన ఈ క్షణంలో
నాకు నేను చేసుకున్న
ఆలింగనాలు ..
ఎంత గాఢమైన బందమో ఇది
ఇదే సత్యం అట
ఇదే మోహనమైన సత్యం
ఇదే సుందర చైతన్యం
ఇదే నన్ను నేను
ఆవిష్కరించుకున్న క్షణమూ
మరు జన్మమూ..
వసంత లక్ష్మి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి