"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

18 జూన్, 2015

పరిభ్రమణ



సాయంత్రాలు మబ్బులు
ఇళ్ళు వెతుక్కుంటూ 
అటూ ఇటూ పరుగులు 
పెడుతూ 
మా ఇంటి ముందు 
ఏదో ముచ్చట్లు గుర్తు 
చేసుకుంటూ ఆగితే 
నీకు కబురు పంపిస్తా 
అంతా కుశలమే అని .

పూలు రంగు ముస్తాబు 
కావిస్తూ  గాలి హత్తుకుంటే 
సన్నని పరిమళాలు కానుకగా 
గాలికి వదిలితే 
అదే నా సందేశం అనుకో 
ఈరోజుకి సన్నజాజులు 
ఎన్నిక చేసా నీ కోసం .

అలుపెరగని అలలు 
తీరంతో చేసే సందడి 
ఉల్లాసం ఉత్సాహం నింపింది 
మనసులో ,ఆ తుప్పర 
చల్లదనం నీ మేని కి గంధంగా
పూయనా మరి ఈ రాతిరికి 

నక్షత్రాలు చీకటి ఆకాశంతో 
చేసుకున్న బాసలూ ఊసులూ 
తెల్లవారక ముందే 
చేరేస్తాను నీ చెవికి 
ఆ నీరవ నిశ్శబ్ద సంగీతం 
నిన్ను తాకి రాగాలు పోతుంది 

ప్రకృతి సమస్తం తల ఒగ్గి 
వినయంగా అర్ధిస్తూ ఉంది 
మనం ఇద్దరం కలిసి మమేకంగా 
ఈ పొద్దుకి రంగులు అద్దాలని 
సూర్యుడినో  చంద్రుడినో 
నీలోనే సమస్త విశ్వం విశ్రమిస్తూ 
పరిభ్రమిస్తూ నన్ను విభ్రమపరుస్తూ 

పిపీలకమైనా 
మరి ఏ జీవం అయినా 
నర్తించాల్సిందే 
ఈ ఉదయపు సాయంత్రపు 
నీడల తెర పై 
ఆసక్తికరంగా 
పరిభ్రమణ ఒక్క గ్రహాలకేనా ? 
జీవ రాశిలన్నిటికీ కాదూ ! 

నమస్సులు సమస్త 
విశ్వ పరిభ్రమణా శక్తులకు 
తాండవం చేసేది ఒక్క శివుడేనా 
నా మనహ్ తటాకం లో 
మునకలు వేసే కోరికల నృత్యమూ 
తాండవమే .. 

మనిషి జీవిక 
ప్రేమికగా రూపు 
దిద్దుకుంటూ 
మానస సరోవరంలో 
కమలంలా 
పురి విప్పుతూ 
ఎన్నెన్ని విభ్రమలు 
ఎన్నెన్ని విస్ఫోటనా 
చిత్త భ్రమలూ 
మరెన్ని తాపసీ 
తరుణాలూ 
దర్శించుకుంటుంది 

మనిషీ ..మానసీ 
తాపసీ , మానినీ 
నీకు నా 
ఆలింగనాలు ..
నా నీడ ని నేను 
తాకిన ఈ క్షణంలో 
నాకు నేను చేసుకున్న 
ఆలింగనాలు .. 
ఎంత గాఢమైన బందమో ఇది 
ఇదే సత్యం అట 
ఇదే మోహనమైన సత్యం 
ఇదే సుందర చైతన్యం 
ఇదే నన్ను నేను 
ఆవిష్కరించుకున్న క్షణమూ 
మరు జన్మమూ.. 


వసంత లక్ష్మి 

వాన వచ్చే ముందు ...


నీలాకాశం మాయం అవుతుంది
ఎక్కడినుంచో వచ్చిన నీటి మబ్బులు
నీలి రంగుని పీల్చి
దట్టమైన మబ్బు రంగులోకి
మారుస్తాయి
పల్చటి నీలి రంగు ప్రమేయమేమీ లేదు
పింజెలు గా తిరగాడిన మేఘాలూ
మరి మాయమయ్యాయి నిన్నటిలోకి
అప్రమేయ ఆనందమా ?
అంతు పట్టని ధుఖమా ?
వాన వచ్చే ముందు
పట్టే మబ్బులకేం తెలుసు
తను రాల్చే నీటి ధారలు
ఏ రైతు కంటి కన్నీరు కారణమో
ఏ పసిపిల్ల కేరింతలకో
ఏ నవ వధూవరుల ముసిముసి నవ్వులకో
ఏ గృహిణి పరుగులో ,
ఏ మనిషి అంతరంగం ఆల్చిప్ప లో
మేలిమి ముత్యమో ? ఆ చినుకు ప్రయాణం
ఎవరికి ఎరుక ?
వాన వచ్చే ముందు
పట్టిన ముసురు ఒక్క గాలి దుమారం
ముందు వీగిపోవచ్చు
నిన్నటి వాగ్విదాం ,ఇవాళ్టి చిరు పలకరింపుతో
కొట్టుకుపోయినట్టు
వాన ఎక్కడ ఎలా కురుస్తుందో
ఎందుకో ఎవరికీ అర్ధం కాని ఒక పెద్ద మిస్టరీ
కన్నీరు ఆడవారికే ఎందుకు ? అన్నది కూడా
చెట్లూ వాగులూ పిపీలకాదులూ
ప్రార్ధిస్తాయా ? వాన కోసం
ఏమో పూలు పూయించి
చిరు కెరటాలు కదిలించి
అటు ఇటూ కదిలే అతి చిన్న ప్రాణులు
ఏ కార్యాచరణమైనా పూజే కదా
త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరించే కార్యం ఏదైనా
వానలు అందుకే అడగని వరాలు
మనం కోరితే వచ్చాయని మురిసిపోకు
మనం ఏం వ్రతాలు ఆచరించామని ?
వాన వచ్చే ముందు
మబ్బు కీ తెలియదు ,ఏ ప్రాంతం ఏ భాష ? అని
వాన వచ్చే ముందు ..
మబ్బులు మబ్బులు మబ్బులు
గుంపులు గానే వస్తాయి .
చినుకు చినుకు చినుకు్లుగా
విడిపోతాయి ,
మానవ సమూహం లో వ్యక్తి ప్రతీకలా
వాన వచ్చే ముందు
నువ్వు నువ్వు గా ఎదురు రా !
వాన వచ్చే ముందు ..
నువ్వు నువ్వుగా తడిసి ముద్దై పోడానికి తయారుకా
కన్నీరు అంతా బయటకి ఒంపేస్తే
ఆఖరున మిగిలేది తడి కనుల ప్రశాంతత
ఆ అనుభవం మటుకు నీకు నీవు ఎప్పుడూ
దూరం చేసుకోకు ..
వాన వచ్చే ముందు
నువ్వు ఏం చేస్తున్నావు ?
సమాయత్తం అవుతున్నావా ??
వాన వచ్చే సూచనలు వస్తున్నాయి మరి .
వసంత లక్ష్మి .
16-06-15 .

17 జూన్, 2015

నా ప్రయాణం లోదృశ్య మాలిక

'లేడీ ' కి లేచిందే ప్రయాణం ట
స్నేహితురాలు అమెరికా నుంచి వచ్చాను
కలుద్దాం వసంతా అంటే సరే ..అని
ఇంట్లోంచి పారిపోయే హీరోయిన్‌ టైప్ లో
ఒక చిన్న భుజ సంచి లో చిన్నా చితకా సామానూ
చీరలూ గట్రా సద్దుకుని , వెళ్ళి వస్తానే చెల్లి అంటూ
రైలు స్టేషను కి ప్రయాణం అయి
రత్నాచల్ టికెట్ కొనుక్కుని ,ఎక్కి కూర్చున్నాను .
అది రెసెర్వేషనూ పెట్టె అని తెలిసినా ,తెలియనట్టు
అదో చిద్విలాస ధోరణి , అన్ని తెలిసినా తెలియనట్టూ
పైగా పై ముచ్చట ఏంటంటే ,ఎవరైనా వస్తూంటే ఇటు వేపు
మీకు రెసెర్వేషను ఉందా ? అని ఒక చూపు తో ఆపేయడం ..
అబ్బా బాల కృష్ణ రైలు ఆపేస్తే లేదు కానీ నేను మహా ఇలా
ప్రయాణీకుల్ని ఆపలేనా ? అని యత్నించి ..సఫలీకృతమయ్యాను ..
అంతే ,నా బలం నాకు తెలియదు ..నా నటనా బలం ..
అని తబ్బి ముబ్బై పోయాను అనుకోండి .
బయలుదేరాను , రైలు కూ అంది అంటూ
నిముషానికో పది పనికి మాలిన ఎసెమ్మెస్ లు
పంపిస్తూ ,అబ్బ ఎంత పచ్చ్దాదన మో అంటూ ఫోటోలు తీస్తూ ఉంటే
చార్జింగ్ ఇంఫ్లేషం లో రూపాయి విలువ లా అధపాతాళానికి పడ్పోయింది ..
అమ్మో అని దాని పీక నులిమి ఊపిరి ఆపేసి ,అన్ని క్రిమినల్ అలోచనలే
ఇంక వీధి బయటకి అంటే కిటికీ లోంచి నాకు కనిపించే
పచ్చని ప్రపంచం లోకి చూడ్డం మొదలుపెట్టాను ..
అనకాపల్లి దాటేసరికి పక్కన ఇద్దరు కూర్చున్నా ,నన్ను ఎవరూ ఇంక
కదపలేరు అని అనుకునేసరికి నిశ్చింత గా , జబర్దస్తి గా కూర్చున్నాను .
ప్రపంచాన్ని జయించిన మహ రాజుకి కూడా అంత సంతృప్తి ,గర్వం ఉండవేమో
సుమండీ ..
అనుకోని సుఖాలు సంపదలూ ఇవే ..అనుకోని ప్రయాణం లో నీకంటూ ఒక
సీటు దోరకడం ..
హడావిడి ప్రయాణమ్లో ,భోజనం మాట ,అంత కన్నా ముఖ్యం చేతికి ఒక పుస్తకం మాటా మర్చిపోయాను .
ఇంక నాకు కాలక్షేపం ..ఆ కిటికీ యే .
ఎప్పుడూ ,ఈ మధ్య ఏసీ ల లో ప్రయాణం కళ్ళకి గంతలు కట్టినట్టు ..
అవును అలాగే కదా జీవిస్తున్నాను ..మరి ..
కళ్ళూ విప్పార్చి , మనసు లో తలపులు కూడా బాహాటం గా తెరిచి పెట్టి
నా ముందు పరుగులు తిస్తున్న దృశ్య మాలిక లని చూస్తూ ఎంత హాయిని పొందానో
నేనో నలభై ఏళ్ళు వెనక్కి ప్రయాణం చేసి , చిన్న తనం లోకి వెళ్ళి పోయానా అనిపించింది
కొండలు నిశ్చలంగా ఎన్నాళ్ళ్ నుంచో అవే రూపు
ఏమీ మారలేదు , తూరుపు కనుమలు మాకు పెద్ద దిక్కులాగా
కంటి చూపు మేరా లేత పచ్చదనం లో పొలాలు
ఆరారా మధ్య మధ్యలో పొడవైన కొబ్బరి చెట్లు ఈత చెట్లు
తల పై కిరీటం ధరించిన మహ రాజుల్లాగా
ఎర్ర్రని పూల చెట్టు , ఆకాశానికి ఎత్తి హారతి ఇస్తున్నట్టు పూసింది
మరో చెట్టు ముకుళిత హస్తం తో దణ్ణం పెడుతున్నట్టు ,ఆకాశానికో ,ఆపై దేవుడికో
పూల వందనం చేస్తూ ,
ఎర్రటి నేల ని దున్ని చదును చేస్తున్న రైతు కూలీలు
ఒంటి పై ఒక్కటే వస్త్రం ..ధరించి
స్వేదం చిందించే వాడికి ఎన్ని వస్త్రాలు కావాలి ?
తడి మడి లో నీటి గదులు , విత్తుకి ఆయత్తం అవుతూ
తెల్ల నీటి కొంగలు ఆ నీటి మడుగులో కొంగ జపం చేస్తూ
పురుగూ పుట్రా , కోసమే ఆ ఒంటి కాల తపస్సు ..
ఇంతలో ఏదో మరో జంట కొంగ పిలుపు పై
ఘమ్మని లేచి రెక్కలు ఘాడించి ఒక్క ఉదుటున
ఆకాశంలోకి గెలుపు పరుగుల హడావిడీ ..
రైలు పెట్టె లో కి అలవోకగా దృష్టి జారిస్తే
కలగాపులగపు కోడి పెట్టలు అమ్మకానికి ఓ బుట్ట కింద
మూత పెట్టి కూర్చోబెట్టినట్టూ
అమ్మీ ,ఓ అత్తా ,పిల్లా , అంటూ పిలుపులతో హోరెత్తిస్తూ
నలిగిపోయిన కనకాంబర దండలు వేలాడుతూ ,
మధ్య మధ్యలో కుట్టిన మల్లెల దండలు మటుకు ఇంకా
తళ తళ లాడ్తూ ,పెళ్ళి కూతురి కళ్ళ ల్లా గా
ఆషాడ మాసానికి లాక్కుని వెళుతున్న కూతురా ?
చిన్న బెదురో , చిన్న బెంగో , ఆ చీర కొంగున దోపి
నాన్నలు అమ్మి భుజాన ఓ చేయి దన్నుగా ,
అన్నవరమ్లో పెళ్ళి జంటలు కూడిక గా , నలిగి పోయిన పట్టు చీరలు
మాయని పసుపు తాళి , మెడలో మెరుస్తూ ..
కూసింత సర్దుకో , ఇలా రా అలా జొరబడు అంటూ
కూరిమి నేర్పిస్తున్న రైలు పెట్టె
మధ్యలో మధ్యలో డబ్బా నిండా పప్పులు పోసి
అటూ ఇటూ కదిపి సద్దినట్టు , ఝట్కాయిస్తోంది ,
ఒకరి పై ఒకర్ని పడేస్తూ అదో తమాషా ...హమేషా
ఆగిన రైలు , కిందకి దిగిన జనం , హామ్మాయ్య
అని ఊపిరి పీల్చుకునే లోపు , నిండిన జనం ..
ఒక్క్ కాలు మీద సద్దుకోవయా రెండు కాళ్ళ మీద
నిలుచోడం ..ఈ ప్రభుత్వమ్లో ఓ షోకిలా దర్జా అన్నట్టు
గదమాయిస్తూ ..నేను నా సీటు లో మరింత నిండుగా సద్దుకున్నాను ..
ప్లాట్ఫార్మ్లు కదిలి పోతున్నాయి ..
జనాలు ని ఎక్కిస్తూ దింపేస్తూ .
ఆగని ప్లాట్ఫార్మ్లు ..అప్పుడే ఖాళీ అయిన విడిది ఇల్లులా
నిష్పూచిగా ,నిరామయంగా ..బద్ధకం గా ,కాస్త అల్సి సొలసి సేద తీరుతూ
చిన్న చిన్న ఊళ్ళు కదిలిపోయాయి
కాల గర్భం లోకా ? కాదు ..నా కనుచివర .వెంట
నర్సీపట్టణం రోడ్డు అని రాసి ఉన్న రైలు స్తేశ్హను ..
అదేమిటి ? రోడ్డు అని ఎందుకు ?
పిఠాపురం ..దేవులపల్లి గారు పుట్టిన దేవపురి
అన్నీ కదిలి వెల్ళి పోయాయి ..
నా ఊరు కాదు ఏదీ ..
'మా దేవుని మహా మందిరం 'అని హెడ్డింగ్ రాసి ఉన్నచిన్నగృహం
కింద వాక్యం లా సద్దుకున్న చిరు కుటుంబం రాజసంగా నులక మంచం పై పవ్వళించి
( నాకు నిజం గా కనిపించారు వీరు )
ఎంత సంతృప్తి ? ఆ ముఖాలలో ..
ఆకుపచ్చని పొలాలు
అప్పుడప్పుడు ముదురు ఆకుపచ్చ తోటలు గా
గోరింకలూ కోయిలలూ కీ మరి ఊళ్ళు అవి .
పొలాలు ధ్వంసించి ...ఎత్తైన కాలేజీ అంతస్తులు మరి కొన్ని చోట్ల
ఆ పిల్లలు కి పొలం దున్నడం అనే విద్య నేర్పిస్తే బాగుందును
ఆ భవనాలల లో అని ఒక ఆలోచన ..నన్ను కదిలించింది
ఏలూరు అని రాసి ఉన్న బోర్డు పలకరించింది
ఇంత చిన్న చూపా ? మా పై అంటూ
సిగ్గు తో తల దించుకుని ,ముభావంగా చేయి ఊపాను ..
విజయవాడ మరి నా గమ్యం కదా ఈ సారికి అని నచ్చ జెప్పుకుంటూ ..
సామల్ కోట లో నా సీటు అంటూ నా కోట ని
బద్దలు కొట్టడానికి ప్రయత్నలు జరిగాయి ట ..
అమ్మి కూసింత గట్టి ,అని లోపలే అనేసుకుని పాపం
నా ఊసు ఎత్తలేదు ..ఆహా ..ముఖ భంగిమ ఎంత ముఖ్యమో
దుర్గ గుడో ,గుణ దల గుడో
ఎత్తుగా కొండ పై దీపాల్ తోరణాలు
ముచట గా రా రమని పిలుస్తూ ..
అరగంట లేటు గా మొత్తnనకి
గమ్యం చేరింది ..
నా రైలు ..

15-06-15

16 మే, 2015

శ్రీ శ్రీ కి పోస్ట్ చేయని ఓ కవిత .

  • శ్రీ శ్రీ కి పోస్ట్ చేయని ఓ కవిత .

    పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ
    ప్రపంచం చివరికీ
    ఆకాశం గీసిన హద్దు వరకూ
    అర్రులు చాచి
    పయనించీ

    ఆ కొసన , ఆ అంచున
    ఓ మారు తొంగి చూసి
    వెను తిరిగి వద్దామని
    ఊహతో , వెనకకి చూస్తే

    పెద్ద గాలి దుమారం
    కళ్ళు గప్పి అంధుడ్ని చేసింది
    నా అడుగులోనే మరో అడుగు
    వేస్తూ అక్కడే గిర్రున తిరుగుతూ

    నే కనుగొన్నాను
    కులం ,మతం నా వెంట
    తోకల్లా ఎంత దూరం అయినా
    వస్తాయని
    తోకలు కత్తిరిస్తే , నే జంతువుని
    కోతి నుండి వచ్చిన మానవుడిని
    అయిపోతానని

    నాగరికత తెచ్చిన ఈ తోకలు మటుకు
    మోయాల్సిందే , రోదసీ నుంచి
    చూసినా అల్పమైన జంతువుల్లా
    ఏవో తోకలు మటుకు కనిపించాయిట

    సందేహం లేదు ,మన ఉనికి ఎంత దూరమైనా
    కనిపిస్తుంది .
    కనిపిస్తుంది మన చరిత్ర
    అంతా కనిపిస్తుంది
    ఎంత భారమైనా ఈ తోకలు
    మటుకు మోయండి , అపెండిసైటిస్ ని
    మోయటం లేదూ , నరుడు ..

    మరో ప్రపంచం నుంచి
    శ్రీ శ్రీ చూస్తున్నావుగా
    మా ఘనమైన మానవ చరిత్ర
    ఖణ ఖణ ల్ , సంకెళ్ళ సవ్వడి
    వినిపిస్తున్నాదా ? మరి
    జయంతులూ వర్ధంతులూ
    సవ్యంగా నే జరుపుతున్నాం

    ఈ ప్రపంచం అంతా శాంతి సౌబాగ్యాలు తో
    కళ కళ లాడుతోంది ? ఎవరీ శాంతి ??
    మంత్రి వర్యుల ఆరా !!
    అంతా క్షేమం ..క్షామాలూ వడగళ్ళూ
    మార్చి మార్చి వస్తూ ,పని లేని ప్రజలు
    మరి తల ఎత్తిచూడకుండా
    ఇక్కడ అంతా క్షామం ..అక్కడ క్షేమ మేనా ?

    శ్రీ శ్రీ ..మరో ప్రపంచం కబుర్లు
    అప్పుడప్పుడు వినిపిస్తూ ఉండు మీ
    మేము మటుకు ఆ దరిదాపులలో
    ఉండమని గీత మీద ప్రమాణం చేసి చెపుతున్నాం
    ఇంక నువ్వు నీ ప్రపంచం లో నిష్పూచీ గా దమ్ము లాగూతూ
    హాయిగా నిదురించు ..

    అసహాయత , నిరాశ నిండిన ఈ కవిత
    ని మటుకు ఎవరికీ అంకితం ఇవ్వను ..
    శ్రీ శ్రీ కి మటుకు అసలే కాదు ..

రాజేశ్వరి కి నివాళు లు

ఒకరు నెమ్మదిగా 
నిష్క్రమిస్తారు 
చడీ చప్పుడూ లేకుండా 
వారు చల్లిన విత్తనాలు 
మటుకు పుష్పించి 
నివాళులు అర్పిస్తూ 
ఆ రోజు తలలు 
వేలాడదీసాయి ,
జెండా అనవతమై నట్టు

మొక్క గా నో
చెట్టు గా నో బ్రతికనపుడు
అనామకులు .
రహదారిలో బాటసారులు
ఒక్కసారి ఆగి
నీడ మహత్తు ననుభవిస్తారు

ఈ రోజు
దారి పక్కన ఒరిగిన
చెట్టు కింద నీడ
మటుకు ఎవరో దొంగలించారు
ఎవరో వారెవరో ..

కాలం రక్కసి లా
కబళిస్తూ
ఆకలి తీరని కాలం కి
ఎంత మంది ని ఆహారం చేసాం ?
ఎన్ని నీడ నిచ్చే చెట్లు ?
ఎన్ని పూలు పూసే మొక్కలు ?
ఎన్ని రంగు రంగుల పూలు ?

ఎంత కనికరం లేనిదీ కాలం .
ఎంత కనికట్టూ ఈ కాలం ..
ఎంత మాయాజాలం ఈ కాలమే
నిన్నలనీ మొన్నలనీ మింగే కాల బిలం
అంచున చూపుతుంది రేపు ..

అస్తమించే సూర్యుడి కే
తెలుసు అస్తమయం తాత్కాలికం అని
ఈ కాలం మటుకు నిర్లిప్తం గా
తన పని తను చేస్తూ ..
అన్నిటికీ ఒక సమయం ఉంది అని
కాలమే ఆఖరుకి మనకి ఓదార్పు
మింగిన కాలమే ..
అంతే ..

మైదానం రాజేశ్వరి గురించి విని చదివి చలించి ..
ఈ నాలుగూ విత్తనాలు వెదజల్లుతూ
వసంత లక్ష్మి .

పూలు అమ్మే వాడు

పూలు అమ్మే వాడు
చెట్టు కింద పూలు అమ్మేవాడు
కూర్చుని
గులాబీ రెక్కల మీద
నీటి చుక్కలు జల్లుతూ 
అశాంతిగా
ఈ నాడు ఒక్క మరణమూ లేదా
ఈ గులాబీ దండల మదుపు
ఏట్లో పోసినట్టే ?
పెళ్ళి ళ్ళ సీసనూ కాదు
ఎవరూ దండ పెళ్ళిళ్ళు
చేసుకోరా ?
మల్లె పూల రాసులు
పక పక నవ్వుతూ
గుండె ల్లో గునపాలు గుచ్చుతూ
రాత్రికి పూదండ లు కొనే
మగ వారే కరువా ?
సాయి నాధుని వారమో
ఆంజనేయుని దినమో
పెద్ద మనుషుల సన్మానమో
ఏమి టీ రోజు మరీ
గొడ్డు పోయింది ?
పూలు అమ్మే వాడు
చేతికి పూల రంగు అంట లేదు
చెట్టు కింద
పూల పరిమళాలు మోస్తూ
ఎంత కాలం కూర్చుంటాడో ?
మరి ..ఆ పూలు అమ్మే వాడు .
చెట్టు నీడ ఉన్నంత వరకూ
ఉంటాడని నా నమ్మకం
ఊరికే నమ్మకం ..
హుద్ హుద్ తుఫాను కి
చెట్టు నేల ఒరిగింది
పూలు అమ్మే వాడి నీడ కూడా
పరిమళా లని నమ్ముకుని వాడు
ఇంకా పూలు అమ్ముకుంటూ నే ఉన్నాడు .
అవును వాడు ఇంకా పూలనే
నమ్ముకున్నాడు , అమ్ముకుంటూ ..

(ఎం వీ పీ కాలనీ ఉషోదయ సెంటెర్ లో
చెట్టు కూలింది ..
ఆ కూడలి లో పూలు అమ్ముకునే వారి ని
తలుచుకుంటూ )

26 మార్చి, 2015

ఉగాది

కోయిల కూ కూ స్వరాల రింగ్ టోన్‌ సవిరించుకున్నా ..
ఈ బే లో వేప పువ్వు ఆర్డరు పెట్టాను ..
అదంత ఎందుకు శ్రమ అంటే ఏకం ..గా హోల్ మొత్తం గా
ఉగాది పచ్చడి ఎక్స్ప్రెస్ గా దిగుమతి చేసుకున్నా ..
మామిడి ఆకులు ఎందుకు ? మళ్ళీ మళ్ళీ తగిలించడం వాడిపోవడం ..
గుమ్మానికి వేలాడ దీసిన ప్లాస్టిక్ వాటి మీద కాసిని నీళ్ళూ జల్లా ..ఫ్రెష్ గా .
ఇంకా ఏమిటి ?
ఆ ! మరిచి పోయా ..మొబైల్ లో ఉన్న చుట్టాలు - పక్కాలు ..
హితులు స్నేహితులు ..స్నేహితుల గా ఒకప్పుడు ఉన్న వారూ
ఇప్పుడు సైలెంట్ గా మోగే వారూ ..
అందరికీ మూకుమ్మడి ఎసెమ్మెస్ పంపించా ..
మన్మధ నామ ఉగాది శుభాకాంక్షలు అని ..
బాంక్ లోన్‌ వారికి కూడా వెళ్ళీ పోయి దొరికారూ అంటూ
తిరుగు ఎసెమ్మెస్ ..ఇంకా యూ టీ ఐ వారూ , కోటక్ ఫైనాంసూ మొదలైన వారు
ఖుషీ ఖుషీ గా రిప్లై పలకరింపులు ..
అమ్మా ! ఇంత అమాయకమైతే ఎలా ? అన్నిటికీ అలా హోల్ సేల్ గా పంపిస్తే ఎలా ?
అంటూ తల పట్టుకుని .ఉ గాది నాడు పరువు రెక్టిఫై కార్యక్రమం లో పడ్డారు పిల్లలు ..
ఇంతలో ఓ చుట్టం ..మాకు మొబైల్ లేదని వెక్కిరింపా ? ఏదో ఓ మాట కోసం
అప్పు పుచ్చుకున్న మొబైల్ కి ఎస్సెమ్మెస్ పంపావుట అమ్మాయ్ ! అంటూ
అక్షింతలు ..కళ్ళూ తుడుచుకుంటూ మొబైల్ కొనుక్కోడానికి వెళ్ళీందిట ..
ఔరా ! ఎంత పని జరిగిందీ ..
ఇంతలో మరో దూర శ్రవణ పిలుపు ..అమ్మాయ్ ..ఒక్క సారి అదేదో నెట్ కాల్
చేయ వచ్చుట కదే ఏడాది కి ఒక్కసారి ..ఇదిగో మా మనవడు కలిపాడు నిన్ను ..
అంటూ ..వ్హాట్స్ అప్ ? అంటే చాలదు ట ..నిండూ గా నోరారా ? హాపీ పండగ అంటూ చెప్పలిట
ఏదో ఒక్క పండగ ? ఏడాదికి ..అయ్యో అంత సౌలభ్యమా ? మామ్మా !
ఉగాది అయిందా ? ఇంతలో శుభ్మ అని శ్రీరామ నవమి ..ఆ తరవాత మరొకటి ..
ఎన్నని చెప్పను ..? నాకు ఒక్క చిట్కా తోచింది ..
ఇది భలే స్టార్ట్ అప్ ఇడియా ..తధ్యం ..మీ అన్ని పండగలకి మీ తరఫున
మీ లిస్ట్ లో ఉన్న బంధు మిత్ర సపరివారం అందరికీ మేమే శుభాకాంక్షలు చెపుతాం ..
అంటూ ఓ కంపనీ మొదలు పెడతాను .. మన కి అతి ముఖ్యమైన వారికి ఓ స్టార్ చుక్క
పెడతాం అన్న మాట .. వారికి ఓ నాలుగు మాటలు ఎక్కువ పడతాయి అన్న మాట ..
ఇది జీవితాంతం సేవ ? ఐతే ఇంత ..
ఏడాది కి ఐతే ఇంత ..
భలే భలే ..నాకే ఎందుకు ఇంత గొప్ప గొప్ప ఐడియాలు ..
వడియాలు కాదండీ ఐడియాలు వచ్చేస్తాయో ..
ఇంకేముందీ ? బిల్ గేట్స్ కి పోటీ యే ..
ఉగాది పుణ్య మాని ..ఎన్ని కలలు కన్నాను ?
నా ఇంటి ముందు ఏవో ఎడారి పిచుకలు తిరుగుతున్నాయి
డిస్టంట్ కజింస్ ట కోయిల ల కి.. హలో చెప్పమంటున్నాయి ..
ఇదిగో అలా పిట్టలని వాటినీ పలకరించడం కాదు ..నాకు ఏం పెడతావు ?
సాయంత్రం ..అదే రాత్రి కి ? ఇంకేముంది పగలు మిగిలినవే ..
ఉగాది అని మారుతుందా ? ఏమిటి లెఫ్ట్ ఓవెర్లు మనకి మామూలే కదా
క్రితం ఉగాది రాసిన ఉగాది కవిత కి కాస్త పేరు మార్చి
పెట్టు చాలా దా ? అని అనలేదూ మీరు ..
హన్నా ! ఏడాదికి ఒక్కసారి వచ్చే ఉగాది కి ఒక్క కవితైనా రాయక పోతే
నా పరువేం కాను ? రచయిత్రి . కవయిత్రి అని ఎంత మంది పారిపోయినా కానీ
పట్టు వదలకుండా నా మానాం నేను రాసుకుంటున్నానా లేదా ?
నా చిన్న పొట్ట కి శ్రీరాం రక్ష అన్నట్టు
నా బ్లాగ్ పొట్ట లో చేయి పెడితే నే కుట్టనా ?
అదీ ఇదీ సరిపోలేదా ? ఏమో ..అసలే రన్నింగ్ రేస్ లో
వెనక పడి పోయాను అని ఉక్రోషం ..అదే ఉగాది కవిత రాసే పని లో
ఇంక నాకు మతి చెదరక ముందే ..
ఆలస్యం గా ఒక్కో కోయిల మరి కూస్తూ ఉంటుంది ..
స్వీకరించండి మరి ..
అందరికీ ..మితృలందరికీ
మన్మధ నామ ఉగాది శుభాకాంక్షలు ..
హమ్మయా ..పని అయిపోయింది ..ఇప్పటికి ..ఈ ఘడియకి ..
ఇంక పెన్ను మూసి ...వస్తావా ?
ఆ వచ్చే వచ్చే ..ఇదిగో ..