"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

2 ఏప్రి, 2013

జన జీవన స్రవంతి ....


ఇంకా ఉన్నాయి.. చాలా ఉన్నాయి .. అఫీసియల్ కాలనీ ముచ్చట్లు . చిన్నతనం ,బాల్యం అంటే నే అమాయకత్వం , స్వచ్చమయిన మనసులు, కలుపుగోలు మాటలు, పెనవేసుకున్న బాంధవ్యాలు .. 

మనం పెరుగుతూ ఉంటే ,కొన్ని బంధాలు విడి పోయి, మనం దూరం అయిపోతాం ... కాని, బాల్యం ఎడారి లో కనిపించే ఎండమావి లాంటిది, బాగా అలిసి పోయాం , ఈ జీవనబాట లో అనిపించి నప్పుడు ,ఒక్కసారి ఈ ఎండమావి లోకి వెనక్కి నడిచి , తొంగి చూస్తే మనసుకి ఎంత హాయో ?? 


మా శారదా బాల విహార్ లో తరగతి లో మంచి పిల్లలు , అల్లరి చేయని పిల్లలకి ఒక బహుమానం అని చెప్పి ఒక చార్ట్ ,తయారు చేసి పెట్టేరు , అందులో ప్రతిరోజూ మన మంచి ప్రవర్తన కి ఒక ఎర్ర గుర్తు ,అల్లరి , మాట వినక పోవడం కి ఒక నల్ల ఇంటు పెట్టే వారు. 

ఎవరికి ఎక్కువ ఎర్ర గుర్తులు వస్తే ,వారికే ఆ బహుమానం, నేను చాలా బుద్దిగా ఉండి ,చాల సార్లు గెలుచు కున్నాను. 

తర్వాత ఏలూరు లో కూడా తెరిసా హై  స్కూల్ లో కూడా అంతే ,ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ,అంతే కాదు స్కూల్ గెట్ తెరిచే టైం కి నేను ఉండాల్సిందే , విశాలమయిన ఆ స్కూల్ లో మొదట అడుగు నాదే అన్న మాట . 

ఒక నల్ల బోర్డు మీద థోట్ ఫర్ టు డే  అని రాసే బాధ్యత నాదే , అయితే ఇంకా చిన్న పిల్లనే కదా, నాకు అంత గొప్ప గొప్ప పదాలు , వాక్యాలు ఎక్కడ వచ్చు ? ,అందుకే మా ఇంటికి వచ్చే ఇండియన్ ఎక్ష్ ప్రెస్ , వార్త పత్రిక లో ఎడిటోరియల్ రాసే మధ్య పేజ్ లో రోజూ ఒక థాట్ ఫర్ టుడే , ఉండేది, నా పని ఆ విషయం ,ఒక నోట్ బుక్ లో రాసుకుని, అది తిరిగి ,ఆ బ్లాక్ బోర్ద్ మీద రాయడం, అది కూదా రంగు రంగుల చాక్ పీసు ల తో, క్లాస్ రూం లో బ్లాక్ బోర్డ్ మీద ఒక మూల ఆ రోజు డేట్ , వారం , రాయడం కూడా నా పనే . 

హమ్ ... ఏమిటో ఈ అరవ చాకిరి , ఎవరు నన్ను చేయమని నాకు చెప్పిన గుర్తు లేదు, ఏమో చెప్పారేమో , కూడా గుర్తు లేదు , యువర్స్  
ఒబీడియాన్ట్లీ  అంటారు ,అలా ఉండే దాన్ని. 

మేం ఎనిమిదో తరగతి లో ఉండగా మద్రాస్ , తిరుపతి, విహార యాత్ర కి వెళ్లాం, మహాబలిపురం ,జూ, మరో ముఖ్య మయిన పెరంబుర్ కోచ్ ఫాక్టరీ ,చూసాం . తిరుపతి కూడా వెళ్ళాం . 

తిరిగి వచ్చి మా నిర్మల టీచర్ అడిగినట్టు మద్రాసు యాత్ర మీద  పెద్ద వ్యాసం రాసి ,అసెంబ్లీ లో చదివేసిన రోజు మారు మోగిన చప్పట్లు , ఎంత మధురమైన జ్ఞాపకమో ... 

పదో తరగతి , పరీక్షల కోసం కష్టపడి చదువుతూ ఉండగా , ప్రశ్నా పత్రాలు లీక్ అయాయి అంటే ,ముందే బయటకి వచ్చెసాయి.  నాకు ఎంత ,కోపం ,చికాకు ఏడుపు వచ్చాయో . మనం కష్ట పడి ,  చదివి మంచి మార్కులు సంపాదించడం ఒక గొప్ప ఘనకార్యం కాని, ఇలా ప్రశ్నా పత్రం ముందు పెట్టుకుని చదవడం ఎంత బాధో ? స్కూల్ ఫస్ట్  వచ్చింది అన్న సంతోషం అంతా పోయింది ,ఈ ఘటన తో , ఎవరో ఒక మంత్రి కొడుకు కోసం మొత్తం పేపర్లు లీక్ అయాయని ,తెలిసి ఈ చదువు ,ఈ పరీక్షలు ఎంత అబద్ధమో అనిపించింది .. 

టీ వి చానెల్స్ లో ,చూచి రాస్తున్నారు పదో తరగతి  పిల్లలు అంటూ చూపించి నప్పుడు అదే గుర్తు  వస్తుంది , ఏమీ కొంపలు మునగవు , ఈ విద్యార్ధులు , చూసి రాస్తే , మన చదువులు ఎంత విలువలు నేర్పిస్తున్నారో అర్ధం అయి, బాధ కలుగుతుంది , అయినా కొంత ఆలోచించి రాసే ప్రశ్నలు ఇచ్చి టెక్స్ట్ బుక్స్ చూసి రాసే విధానం ఉండాలి ,చదువు అంటే గుడ్డిగా జవాబులు బట్టి పట్టడం కాదు ఆలోచన, విచక్షణ , మెరుగు అయిన జ్ఞానమ్.. ఇది చదువు .. అంటే .. ఒక సర్టిఫికేట్ .. కాదు. 

పరీక్ష లు నిజం గా ఎంత ఫార్సో ,అర్ధం అయాక  ,  ఎప్పుడు ఎలా మొదలయిందో తెలియదు కాని ఈ పరీక్షలు ,ఈ వ్యవస్థ ఎంత వ్యర్ధమో ,ఎంత నిరర్ధకమో అని తోచింది 

అయినా పదహారేళ్ళకి , వ్యవస్థ మీద విరుచుకు పడని వారు ఉన్నారు అంటే , వారిలో ఏదో లోపం ఉన్నట్టే ,  అమ్మ చెప్పే జాగ్రత్తలు , నాన్న అడిగే రాత్రి ఎన్ని గంటలకి వచ్చావు ? అనే ప్రశ్నలు విసుగు కోపం ఎందుకు తెప్పిస్తాయి అంటే అంతా , ఆ వయసు మహిమే . 

ఎర్రెర్రని పుస్తకాలు,  కార్ల్ మార్క్స్ పేరు, రష్యా లో విప్లవం ,గోర్కి అమ్మ పుస్తకం మావో చెప్పిన సాంస్కృతిక విప్లవమ్.. ఇవి మా మధ్య  మాట్లాడుకునే విషయాలు అయిపొయాయి. 

పార్టి ,అంటూ పనులున్నాయి అంటూ, ఎక్కడెక్కడికో వెళ్లి వస్తే , లేచి అన్నం వడ్డించే అమ్మ ఉన్న ఇల్లు మాది. అంటే వసంత కి తను ఏం చేస్తోందో తనకి తెలుసు ,అడిగితె విసుక్కుంటుంది , అంతే కాని జవాబు చెప్పదు ,అని వారి నమ్మకం మరి. 

అలానే  కాలేజ్ కి వచేసాం ఎంత విప్లవం, ఈ వ్యవస్థ మారాలి అంటూ స్లొగన్స్ చెప్పినా తీరా పరీక్షల సమయం కి గబ గబా చదివేసుకుని , ఫస్ట్ మార్కులు తెచ్చు కోవడం ఒక ఆనవాయితి అయిపొయిన్ది. 

అంటే , నా చిన్నప్పటి నించి బాగా చదువుకోవాలి అని బుర్రలో నాటుకుపోయింది , అన్న మాట.. నేను చెప్పిన అశాస్త్రీయ విద్యా విధానం మారాలి , అనే మాట లు విని ,ఇద్దరు స్నేహితురాళ్ళు నిజం గా చదువు కి దూరం అయారు కాని ,నేను మటుకు ఎం ఎస్ సి వరకు చదివెసుకున్నాను. 

చాల సిగ్గు పడ్డాను ఏమిటి ఇలా నేను ? చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని, కాని, నా మనసు చెప్పినట్టు చేయడం , నేను సిగ్గు పడకుండా చేయడం ... దానినే పిరికితనం అన్నా సరే , నాకు నేనయినా నిజాయితీ గా ఉండాలి కదా , చదువు అంటే ఉండే ప్రేమ , తపన.. చదువు మాననీయకుండా చేసింది . 

మా బంగారం అని పిలుచుకునే స్నేహితురాలు , గోడ మీద అశాస్త్రీయ విద్యా విధానం మారాలి అనే స్లోగన్ చూసి, అదేంటి ? వసంతా మనం స్చైన్స్ చదువుతున్నాం కదా, వద్దు అంటారేమిటి ?? అనేసి ,నన్ను నిజం గా నవ్వించింది ,ఆ పూట .. మన స్లొగన్స్ అలాగే ఉంటాయి , అదేమీ భాషో కాని. 

పూట పూట కి పార్టి, కార్య కలాపాలు  అంటూనే ఎం ఎస్ సి వరకు చదివి, మా అమ్మ ,నాన్న గార్ల బెంగ తీర్చాను అదే ఏడాది పెళ్లి కి కూడా రెడి అయిపోయి, ఇంకా పూర్తిగా జన జీవన స్రవంతి లో కలిసి పోయాను అని చెప్పి, మా అమ్మ , చాల ఏళ్ళ తరవాత , కంటి నిండా నిద్ర పోయి ఉంటుంది .... 

శారదా బాల విహార్ లో మంచి ప్రవర్తన కి చార్ట్ మీద వేసిన ఎర్రని గుర్తులు ఇప్పటికి నేను ఎన్ని సంపాదించుకుని ఉంటానో ? అని మనసులో ఇంకా లెక్కలు వేస్తూనే ఉన్నాను. .. బాల్యం ఎప్పటికి మనలని వీడదు , మనం ఏదో పెద్ద వారం అయిపొయామ్.. అని అంతా భ్రమ.. భ్రాంతి .. 

ఇది ఇలా ఇప్పటికి కొన్ని జ్ఞాపకాలు.. సశేషం .. 









28 మార్చి, 2013

కవిత్వం ట...

కవిత్వం ట , నాలో ఎప్పుడు ఎలా పుట్టిందో చెప్పలేను 
నా చిన్నప్పుడు నాకు చాలా బాధ వస్తే ఒక పుస్తకం పట్టుకు ని చదువుకుంటూ కూర్చుంటే ,ఆ బాధ అంతా ఆ పుస్తకాల పుటలలో ఎప్పుడో ,ఎక్కడికో పారిపోయేది . 
ఓహో పుస్తకం కి ఇంత  మహత్యం ఉందా అని ఆ మాయ లో పడి పొయాను. 

రైలు ముందుకి పరుగెడు తూంటే , కిటికీ బయట కనిపించే చెట్లు పొలాలు ఆ రైలు కట్ట పక్క నిలుచుని చెయ్యి ఊపుతున్న ఆ పిల్లాడు ... నిజం గా వెనక్కి పరుగెత్తరు అని బుద్ధి చెపుతున్నా ,ఊహ మటుకు ,వెనక్కి ఎక్కడి కి ఏ ప్రపంచం లోకి మాయం అయిపోతారు ? అని ఆలోచనలే కవిత్వమ్. 

శ్రీ శ్రీ రాసిన మరో ప్రపంచం ఉంది ఉంటుంది అని గట్టిగా నమ్మి ఏదో ఒక జెండా పట్టుకుని ,ఎర్రెర్రని జెండా నచ్చింది అప్పట్లో , మాతో పాటూ ఈ ప్రపంచం ఎందుకు కదిలి రాదు మేము ఇంత గట్టిగా నినాదాలు ఇస్తున్నామే 
అని నిర్ఘాంత పోయి , అసలేం కావాలి ఈ సమాజం కి అని ఆలోచనలే కవిత్వమ్. 

చలం పుస్తకాలు చదివి ఆ మాయ లో, ఆ ప్రేమ మాయ లో పడి , అబ్బ ఈ పువ్వు ఎంత బాగుందో ? ఈ పిట్ట భలే పాట పాడుతోందే అని ,ప్రకృతి మాయ ఒక్కటే నిజం, మిగిలినదంతా మాయ,అని గట్టిగా నమ్మి , జీవితం అంతా ప్రేమ ,అదొక్కటే నిజం అని కళ్ళు తెరచి కలలు కనడమే ..కవిత్వమ్.

కుటుంబం , వారి సంక్షేమం ,వారి మంచి చెడ్డలు కి అంకితం అయిపోయే సరికి బాహ్య ప్రపంచం తో సంబంధం ఏదయినా మిగిలింది అంటే ,నా గురించి నేను వేసుకున్న ప్రశ్నలే కవిత్వమ్. 

ప్రపంచం బాధ నాది , అన్న శ్రీ శ్రీ ఇష్టమే నా బాధ ప్రపంచం ది అన్న దేవులపల్లి కూడా ఇష్టమే, పలుకు ,పదం లో నాట్యం , సంగీతం అన్ని కళలు చూపించే కవిత్వం అంటే కవిత్వమ్. 

మనం బయట ఉన్న లక్ష లాది మంది తో ఒక్క సారి ,ఒకే సారి వారధి వేయాలంటే , పదాలు అనే వంతెన ఒక్కటే మార్గం ,అనే మెలకువే కవిత్వం . 

మన చేతనా , మన స్పృహ ,మన ఆలోచన, మన వివేకం మన విచక్షణ , మన  ప్రేమ ,మన బాధ, మన లో మనం చేసే సంభాషణలు కవిత్వమ్. 

నువ్వు నిన్ను బయట పడేసుకుని లోపల అంతా శూన్యం ఆవరించు కోవడం , అది ఒక బాధో ఒక సంతోషమో ,తెలియని స్థితి లో వేలాడడం కవిత్వమ్. 

నిన్ను నువ్వు పోగొట్టుకుంటూ ఏదో పొందావని భ్రమ పడడం కవిత్వమ్. 

నీ శ్వాస నిన్ను బ్రతికిస్తుంది .. 
నీ పదం నిన్ను బతక నిస్తుంది .
నీ కవిత్వం నీకు రూపం పోస్తుంది . 
ఒక గ్లాసు లోపోస్తే గ్లాసు రూపం . 
ఒక సరస్సు లో ఒంపితే దాహం తీర్చే జలం .. 
ఒక నది లో కలసిందా ,ఇక పయనం సంద్రం వరకు .. 
జలం కి ఉన్న ప్రవహించే గుణం కవిత్వం కి ఉంది .. 

నా పదాల ఝరి  నన్ను ఏ తీరానికి తీరుస్తుందో .. 
నా కవిత్వం నన్ను ఏ ఒడ్డున తెచ్చి పడేస్తుందో 
నా కవిత్వం మరి ఎవరిని తాకి , ఎవరి పయనం లో కలుస్తుందో 
అలా ఊహిస్తూ ,పయనిస్తూ నిరంతరం ..ఈ పయనమే కవిత్వమ్. 







27 మార్చి, 2013

నిరంతరం పయనం .. నాది ..

మెత్తగా సీతాకోక చిలక నాపై 
వాలింది, నేను చాలా ఏళ్ల నించి 
ఇలాగే ,కదలక, మెదలక 
కొమ్మలు వేస్తూ, ఆకులు రాలుస్తూ 
తల పై ఆలోచనల పూలు పుష్పిస్తూ.. 

నా చుట్టూ , ఎండాకాలం వేడి 
నా చుట్టూ భుగ భుగ మంటలు 
నా చుట్టూ సముద్రపు వెర్రి అలలు 
నా చుట్టూ అశాంతి ,అలజడి . 

నా మనసు మటుకు మానస సరోవరం లా 
స్థిరం గా అలలు కలలు కంటూ 
నిరంతరం సరిహద్దుల 
చెలియలి గట్టు కి తల ఒగ్గి 
పైకి ప్రశాంత తటాకం మరిపిస్తుంది . 

నా లోపల కమలాలు ,
నా లోపల తామర పూలు 
నా మనసు తటాకం లో 
పైకి మటుకు కాక్టస్ మొహం 

సముద్రాల వైశాల్యం ,లోతు 
కోసం తపిస్తాను, నాలుగు 
వేపులా బంధించిన చిన్న 
మడుగు , నా మనసు ..ఎలా ?

మనసు చేసే గారడి తో 
ప్రతి క్షణం ఆకాశం అంత ఎత్తు 
ఎగిరి , పాతాళం అంత లోతు 
కి పడిపోతూ , త్రిశంకు స్వర్గం 
మధ్యే మార్గం గా మజిలి నాది . 

మనసు అంటే అదేమీ పదార్ధమా ?
కానే కాదు, కొన్ని జీవించే క్షణాల 
స్పర్శ , కొన్ని క్షణాల విలవిల లు 
మరి కొన్ని విరామ చిహ్నాల 
కలగలపు రంగుల కాన్వాస్ ..అది . 

నేను శ్వాసించే ,ఊహించే 
మనసు మజిలి వేపు 
నిరంతరం పయనం నాది . 
నిరంతరం శోధన నాది. 

















26 మార్చి, 2013

అఫిసియల్ కాలని లో మరి కొన్ని జ్ఞాపకాలు, అప్పటి పేర్లు కొన్ని

మా అఫిసియల్ కాలని రెండో వీధిలో ఉండే వారు, వారి పిల్లలు ఎప్పుడయినా ,ఎక్కడయినా కనిపిస్తే నా మొహం ఎంత వికసిస్తుందో చూసి తీరవలసిందే .. 

ఆ రెండో వీధిలో వైద్యులు ఎక్కువ మంది ఉండే వారు. 
అందులో స్కిన్ స్పెషలిస్ట్ సత్యనారాయణ గారు ఒకరు, వాళ్ళ అబ్బాయి కూడా స్కిన్ స్పెషలిస్ట్ ఏ .. నాకు జూనియరు మా శారదా బాల విహార్ లో , ఇప్పటికి కనిపిస్తూ ఉంటాడు , మా ఏలూరు అమ్మాయినే చేసుకున్నాడు ,అది నాకు ఇంకా నచ్చింది . 

గోపాల రావు గారు అని మరో డాక్టరు గారు ఉండే వారు. . ముగ్గురు ఆడ పిల్లలనుకుంటాను . ఆ పక్క ఇంట్లో ఒక ముస్లిం కుటుంబం ఉండేది , పిల్ల పాప ల తో, కళ కళ లాడుతూ ఉండేది వారిల్లు . 

వీధి చివర గోలి క్లినిక్ ఉండేది , మరో డాక్టరు గారి పిల్లలు ఇద్దరూ, ఒక చర్మ వ్యాధి  వల్ల పూర్తిగా తెల్లగా పాలి పోయి ఉండేవారు( అల్బినో ), మా స్కూల్ లోనే చదివే వారు. కారు ఉన్న ఒకే ఒక కుటుంబం ఆ వీధిలో . 

వీధి చివర , కొప్పచ్చి కృష్ణ మూర్తి గారుండే వారు. మంచి వైద్యులు అని పేరు ఆయనకు , చేయి పట్టుకుని నాడి చూసి, రోగం చెప్పే అప్పటి తరం వైద్యులు ఆయన. వారిది నెల్లూరు ,ఒక రకమయిన యాస ఉండేది, నాకు తమాషాగా అనిపించేది. వాళ్ళ అమ్మాయి, అబ్బాయి ఇద్దరు నా స్కూలే , భలే చలాకి గా ఉండే వారు. 

మా వీధి లో వైద్య విద్య చదివే పిల్లలు కూడా ఉండే వారు. టోటల్ గా కే జి హెచ్ కి దగ్గర గా ఉన్నందుకు , వైద్య వైవిధ్యం తో నిండి ఉండేది మా రెండో వీధి. 

మరొక ముఖ్య మయిన ఇల్లు గురించి చెప్పాలి. ఆ ఇంటి పేరు సూర్యోదయ నివాస్. వారి డాబా అంతా చిన్న సైజు హాస్టల్ లా ఉండేది . ఎంత మంది విద్యార్దులు అక్కడ చదువుకున్నారో చెప్పలెను. 

ఆ ఇంటి ఆయన ,సరిగంచు పంచ కట్టుకుని, భార్య కి బోద కాలు మెల్లగా నడిచేది, ఇద్దరూ సాయంత్రం అయిదు అయేసరికి , బయలు దేరి, వసంత బాల విహార లో పురాణ కాలక్షేపం కి వెళ్ళే వారు. 

ఆ దృశ్యం నాకు ఇంకా కళ్ళకి కట్టినట్టు కనపడుతోంది . 

ఆ ఇంటికి ,ఎదురుగా ఉన్న మా చెరుకుపల్లి వారింటికి చాల సంబంధ బాంధవ్యాలు ఎర్పడ్డాయి .. అంటే పక్కింటి అమ్మాయి ,సినిమా లో లాగ ప్రేమసంబంధాలు . వారి అబ్బాయి, మా చిన్నాన్న మంచి స్నేహితులు , క్లాస్ మేట్స్ . మా కొత్తమ్మ గారి ఇంట్లో అద్దె కుండే ఒక బాల ని ఇష్టపడి , పెళ్లి చేసుకున్నాడు , సూర్యోదయ వారి ఇంటి అబ్బాయి పంతులు .. ( ఇప్పుడు లేరు ) . 

స్నేహితుని అడుగు జడల లో నడిచి, పంతులు కి చెల్లలి వరస అయిన ఒక అందమయిన ప్రేమజ ని ,పెళ్లి చేసుకున్నాడు మా ఇంటి ప్రసాదు. ( ఈయన కూడా లేరు ఇప్పుడు ). 

అప్పుడు ఇలాంటి పెళ్ళిళ్ళు కి కొంచం అభ్యంతరాలు ఉండేవి, ఏవో శాఖా బేధాలు లాంటి చిన్న చిన్న కారణాలు , మాకు అవేమి తెలియవు కాని, చాల ఉత్సుకత నిండి పోయేది ఆ కథలు వింటూ ఉంటే ,మా పిల్లల్లో .. 

మేము పెద్ద వారం అయాక , మా అమ్ముమ్మ ఇంట్లో ఉండే ,మా మావయ్య కూతురిని  ప్రేమించి చేసుకున్నాడు , ఆ సూర్యోదయ ఇంటి మనవడు , 
ఆ ఇంటి పునాదుల లో కొంచం ప్రేమ ఘాటు వేసి కట్టించేరు ఏమో , అప్పటి పెద్దలు. అనుకునే వారమ్. మెము. 

ఆ వీధి లోకి వెళితే ఇలాంటి ఎన్నో జ్ఞాపకాల పరిమళాలు ఘుప్పన మది అంతా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి . మా ఇళ్ళ మధ్య ఒక సంపంగె చెట్టు ఇల్లు ఉండేది, మీకు తెలుసా ? సంపంగె పూలు చెట్టు కి పూస్తాయి ,ఏదో ఇలాంటి ,అలాంటి మొక్క కి కాదు. 

నేను చెట్లు ఎక్కడం లో స్పెషలిస్ట్ , ఆ చెట్టు ఎక్కి, ఆకుల మధ్య దాకున్న పువ్వుల ని   వెతికి వెతికి కోసి, ముందు రోజే మొగ్గలు కోసి, నీటి లో వేసే వాళ్ళం ,అయితే పాములు ఉంటాయని భయ పెట్టి, మానిపించేరు ,చెట్టు ఎక్కడం , ఆ పక్క ఇల్లు గన్నేరు చెట్టు ఇల్లు, మా కొత్తమ్మ గారి ఇల్లు. 

కొత్తమ్మ ఆమె పేరు కాదు, ఆ ఇంటికి కొత్తమ్మ గా ,అంటే రెండో భార్య గా వచ్చింది, ఆయన పోయేరు, కానీ, పిల్లలని అందరిని సమానం గా పెంచింది, ఎవరికయినా చెపితే కాని తెలిసేది కాదు. ఆడపిల్లలు అంటే మా అత్తలిద్దరూ ఆవిడ పిల్లలు కారు అన్న విషయం మాకు చాల కాలం తెలియదు. ఆవిడ అసలు పేరు సుభద్రమ్మ .. 

కొత్తమ్మ గారిల్లు అంటే చెరుకుపల్లి వారి సత్రమ్. వచ్చే వారు, పోయే వారు, ఎందఱో వచ్చి చదువు కుంటూ అక్కడే పెరిగి పెద్ద వారయారు, ప్రతాప్, అందులో నాకు తెలిసిన పేరు . 

ఆ ఇంట్లో అద్దె కుండే దేశ రాజు వారిది పెద్ద  కుటుంబం .. వారి అమ్మాయి గిరిజ నా నేస్తం , అందరి కన్నా పెద్ద రావు జీ ఒక పెద్ద అంటే హై కోర్టు జడ్గే గా రిటైర్ అయారు. 

ఆ వీధి ,వీధి అంతా ఒకే కుటుంబం గా ఉండే వారు, అందరూ మా చుట్టాలే అనుకునే వాళ్ళం , మా  పిల్లలు. 
తోట ఇంటి వారు ఉండే వారు, వారు నాయుళ్ళు అని మాకు తెలియదు, వారి పిల్లలూ మేము చాల బాగా కలిసి పోయి ఉండే వారం , వాళ్ళింట్లో ఒక అమ్మాయి, మా అత్తకి బెస్ట్ ఫ్రెండ్ . 

ఆయన ఎక్కడో బొంబాయి లో ఉద్యోగం ,పెద్ద ఉద్యోగం చేసే వారు, హటాత్తుగా గుండె పోటు తో ,చనిపోతే ,వారి కుటుంబం అంత ఎంత  అల్లల్లాడి పోయారో , నాకు ఒక బాధకర జ్ఞాపకమ్. అప్పుడు అందరివి పెద్ద కుటుంబాలు , ఆరుగురో , ఇంకా ఎక్కువో ఉండే వారు పిల్లలు. 

ఇప్పుడు ఇద్దరు పిల్లలని పెంచ డానికే కిందా మీద పడి పొతున్నామ్. అప్పుడు ఏమో మరి అవలీలగా పెంచేసే వారు.  ఆశ్చర్యమే .. 

నాకు ఇష్ట మయిన మరో జ్ఞాపకం , ఇప్పుడు మంచి పేరున్న వైద్యురాలు ,శశి ప్రభ ,అప్పుడు విద్యార్ది, వైద్య విద్యార్ధి . పొడవుగా ,అందం గా, వెనక పెద్ద జడ ఊగుతూ ,ఆవిడ మా వీధిలో నడుస్తూ ఉంటే , ఎంత మంది కుర్రాళ్ళ మనసులు చిందర వందర అయిపోయాయో ,కాని,నాకు మటుకు ఎలాగయినా డాక్టర్ అవాలని కోరిక ,ఆవిడని చూసేక కలిగింది .. అయితే కొంచం లో తప్పిపొయిన్ది. 

ఆ రెండు ఎంట్రన్స్ ల  కథ, మా గుంటూర్ ఎంసెట్ కోచింగ్ ,అది మరో పెద్ద కథ. మరో సారి. 














25 మార్చి, 2013

అఫీసియల్ కాలని కబుర్లు , మరి కొన్ని.. 1

రెండు ముఖ్యమయిన సంఘటనలు అంటే ప్రమాదాలు గురించి చెప్పాలి,ఆ రెండు దుర్ఘటనలు గుర్తు వస్తే, టైం అంటారు, దాని మీద నాకు నమ్మకం ఎక్కువవుతూ ఉంటుంది.   
మొదటిది, నా వల్లే జరిగంది, అంటే నా నిర్లక్ష్యం వలెనే, ఇంకా చెప్పాలంటే నా పుస్తకాల పిచ్చి వల్ల.. 
ఆ రాత్రి, మా అమ్మ అక్కడే ,మా ఇంట్లో ఉన్నారు, ఆఖరి చెల్లెలు , చిన్నది, నెలల పిల్ల , లేదా ఏడాది ఉంటుందేమో ? అందరూ భోజనాలు చేయడానికి వంటిట్లో కి వెళ్లి, చెల్లి ని చూస్తూ ఉండు అని చెప్పి భోజనాలు చేయాడానికి వెళ్లారు . 
నేను పుస్తకం చేతికి దొరికింది ఒకటి పట్టుకుని , అది చదువుతూ తన్మయత్వం లో పరిసరాలు మర్చి పొయాను. మా చెల్లి ,పాక్కుంటూ వెళ్లి, మంచం కిందకి దూరింది, మర్చి పోయాను ,చెప్పానో లేదో , అప్పుడు మంచాలు అంటే పట్టే మంచాలే , వాటి ని గట్టిగా పట్టి లు లాగి, సరి చేయడం ఒక పని, నేను కూడా నా చెయ్యి పట్టి కింద పడి నలగ కుండా , పట్టాలు లాగి టైట్ చేసే పని లో నా వంతు సాయం  చేసే దాన్ని. మా మామ్మ గారు చేసే వారు ఈ పని ,చిన్న పిల్లల  ఉత్సాహం లో నేను సాయం  చేసే దాన్ని, మిగిలిన వారు తప్పించుకునే వారు, మరి. 
అయినా ఆ మంచాలు కూడా పెద్ద వారికే, మిగిలిన పిల్లలం, అందరం, నేల మీద పరుపులు పరుచుకుని వరసగా ,పడుకోవడమే . 
ఇంతకీ ,అసలు కథ కి వస్తే , మా చెల్లి అలా పాక్కుంటూ ,వెళ్లి ఎక్కడో మూల పడి ఉన్న ఒక నూనె సీసా మూత, అంటే రేకు మూతలుంటాయి కదా ,అది ఏదో ఆట వస్తువు అనుకుని, చక్కగా నోట్లో పెట్టుకుంది . 
మన పెద్ద వాళ్లకి కనిపించని, ఇలాంటి మూతలు, చిన్న చిన్న చింత పిక్కలు, ఏవో పనికిరానివాన్ని ,ఇష్టం గా నోట్లో పెట్టుకుని చప్పరించడం పిల్లల హక్కు. 
పెద్దలకి ,పిల్లలకి అదే తేడా మరి.  విచక్షణ , ఆ జ్ఞానం ఇంకా రాని పెద్ద వాళ్ళు మనకి తారస పడుతూ ఉంటారు లెండి, అది వేరే విషయం . 
మూత  నోట్లో పెట్టుకున్న మా చెల్లెలు , ఈ లోపల ఊపిరి ఆడక, నీలం గా మారిపోయింది .. ఆ గురక లాంటి చప్పుడు కి తెలివి వచ్చి నేను , మంచం కింద నించి మా చెల్లి ని లాగి, తన పరిస్థితి చూసి , బెంబేలెత్తి అమ్మా ,అత్తా అంటూ ఒక్క గావు కేక పెట్టి , అందరిని పిలిచాను. 
అన్నం తింటున్న చేతి తో మా అమ్మ వాళ్ళు వచ్చి, నా వీపు మీద ఒకటేసేరేమో కూడా, చూస్తూ ఉండమంటే ఇలాగా ? అని. 
మా ఎదురింట్లో ఉన్న స్కిన్ స్పెషలిస్ట్  డాక్టర్ గారి దగ్గరకి పరుగెత్తేరు. ఆయన నేను ఇక్కడ ఏమి చేయలేను, అలా తల కిందులు గా పట్టుకుని కే జి హెచ్ ఎమెర్జెన్సి  కి తీసుకువెళ్ళండి , అని హడావిడి పెట్టేరు . 
అప్పటికే నీలం గా మారి పోతోంది తను. 
ప్రతాప్ అని మా ఇంకో మామ్మ ఇంట్లో చదువు కోడానికి వచ్చిన ఒక బంధువు  చాల పొడవుగా, బలం గా ఉండే వారు, అతను వచ్చి దేవుడి లా అంటుంది అమ్మ .. అలా లుంగీ మీదే , పిల్లని తల కిందుల గా పట్టుకుని, ఆ మూత మింగకుండా  జాగ్రత్తగా , అది సరిగ్గా విండ్ ఫైప్ కి అడ్డం పడింది మరి, అప్పుడు ఏ బండి లు లేవు, అలాగే నడుచుకుంటూ కే జి హెచ్ కి పరుగు పెట్టారు . 
సమయానికి ఈ ఎన్ టి సర్జన్ సినిమా కి వెళ్ళారు ట , ఎంత టెన్షన్ చూడండి, మరి అప్పుడు ఇలా నిముష నిముషాని మోగే సెల్ ఫొన్స్ లేవు . మొత్తానికి అతనికి కబురు అందింది, ఎలాగో , టైం .. అంటే ఇదేనేమో .. 
వచ్చి రావడం తోనే గొంతు కి అడ్డం పడ్డ ఆ మూత తీయడానికి ,పాప నోరు ని తెరిపించి, ఆ మూత ఎలా తీసారో ఎంత కష్ట పడ్డారో , డాక్టరు గారికి ఎన్ని వందనాలు పెట్టాలో! మా అమ్మ కూడా మూడ్రోజులు హాస్పిటల్ లో ఉండిపోయింది .  గొంతు వాచిపోయిన మా చెల్లెలు కి నెల రోజులు పట్టి నట్టుంది మళ్లీ మామూలు గొంతు రావడానికి. ఆ వాపు, పుండు తగ్గి  మళ్లీ మామూలుగా పాలు అవి తాగడానికి . ఆ వీధి వీధి అంతా ఎంత బాధ పడ్డారో, ఆ రోజు.  తిరిగి వచ్చిన మా చెల్లి మూత పాప అని పేరు తెచ్చుకుంది . 
ఇప్పుడు మేమంతా గర్వ పడే పెద్ద సైంటిస్ట్ . .. ఆ మూత పాప. 
సంగీతం మా ఇంటా వంటా లేదు కాబట్టి సరిపోయింది, లేక పోతే గొంతు మటుకు ,చాలా కాలం వరకు బొంగురు గా ఉండేది మా చెల్లి కి ... 
ఇంకా రెండో సంఘటన, కూడా ఏక్సిడెంట్ .. ఈసారి మా నాన్నగారికి , మా రెండో చెల్లి కి. 
ఇద్దరూ చిట్టివలస నిండి వచ్చేరు, బస్సు స్టాండ్ నించి  రిక్షా ఎక్కి ,మా వీధి లోకి వచ్చేరు. చెప్పేను కదా మా వీధి ,చాల అప్ , మా ఇల్లు డౌన్ లో ఉండేది రిక్షా కి బ్రేక్ లు పని చేయలేదు కాబోలు, మా ఇల్లు ఇక్కడే ఆపు ,అంటున్నా అతను ఆపలేక పోయాడు ట . స్పీడ్ గా వెళ్లి, ఆ వీధి చివర మలుపులో బోల్తా కొట్టి ఆగిపోయింది . మా చెల్లి ,ఎర్రగా జుట్టు కూడా ఎర్ర జుట్టే, బొమ్మలా  ఉండేది , తను మటుకు ఎగిరి పక్కన పొడి పొడి గా ఉన్న ఒక లోతు  లేని కాలవ లో పడిపోయింది . 
తనకేమి అవలేదు, ఒకట్రెండు చోట్ల గీరుకు పోవడం తప్ప. మా నాన్న గారికి మటుకు కాలికి ఫ్రాక్చర్  అయింది . చాలా పెద్ద దే , కాలి ఎముక విరిగి పోయింది . వెంటనే కే జి హెచ్ కి తీసుకు వెళ్లేరు , ఆ వెళ్ళడం ,వెళ్ళడం, ఆరు నెలలు ,అవును ఆరు నెలలు ఆసుపత్రి లో ఉండిపోయారు ,ఆర్తో పెడిక్ వార్డు అందులో ,మగ వారికి వేరే వార్దు. మా చిన్నాన్నలే పడుకునేవారు, సాయం గా. కే జి హెచ్ లో ఇచ్చే రొట్టె ,పాలు , మా అందరికి గుర్తే ,పిల్లలకి సరదా ఆ రొట్టె తినడం ,పెద్ద వారికి వికారం ,నచ్చేది కాదు. మరి ఇప్పుడు ఇస్తున్నారో ? లేదో ? మంచి డాక్టర్లు ఉండే వారు, ఇలా ప్రైవేట్ గా చూడడం అది ఉన్నట్టు లేదు , అప్పట్లో . మంచి మందులు లేవో ఏమో మరి, చాల కాలం పట్టింది, విరిగిన ఎముక అతుక్కోడానికి .  మూడు నెలలు ఏమో సెలవు మీద జీతం ఇస్తారు, మిగిలిన నెలలు మరి జీతం లేని సెలవే . 
మొత్తం ఒక ఏడాది పట్టింది, కాలు నయం అయి, మా నాన్నగారి తిరిగి జూట్ మిల్ లో ఉద్యోగానికి వెళ్ళడానికి . అయితే అప్పుడు ఉమ్మడి  కుటుంబ వ్యవస్థ ఒకరికి ఒకరు సాయం గా, పెద్ద గా ఆస్తులు అవి లేకపోయినా మన ఇంట్లో వారికి మనమే ఆస్తి అన్నట్టు ఉండేవి ఆ ప్రేమానుబంధాలు . 
మా అమ్మ చాల కష్టాలు పడింది కాని, ఎప్పుడూ ఎవరిని ఏమి నిందించడం , ఎవరిని పల్లెత్తు మాట అనడం చూసిన గుర్తు లేదు . ఉన్న దాంట్లోనే హాయిగా ఎలా గడిపామో ? అప్పుడు . 
వసతులు లేని ఇళ్ళు , చిన్న చిన్న ఇళ్ళు , అర కొర వనరులు , కాని కొండంత ప్రేమ ని పంచే కుటుంబ సభ్యులు.. అదే మరి మన పాత తరం. 
ఇలాంటి పునాదుల మీద గడిచింది మా బాల్యం , నా ఉద్దేశం అందరి కి ఇంచుమించు ఇలాంటి జ్ఞాపకాలే ఉంటాయి . . మీకూ ఉండే ఉంటాయి కదా.. 




























23 మార్చి, 2013

నిద్ర ఎంత సుఖం ...

ఆకాశం లో హరి విల్లు లు 
ఉన్నాయని విన్నానే ?
ఏవి? మబ్బులు మేడలు 
కడతాయని ,కల కన్నానే 
ఏవి లేవే?

అమ్మ చెప్పిన కథలు 
ఇక్కడే ఎక్కడో ఉండాలే 
రాక్షసుడి తో రాజ కుమారుడు 
పోరాడిన కథలు ..

ఆ రోజు డిల్లి నడి రోడ్డు 
మీద చూసాను ,రాక్షసత్వం అంటే 
ఏమిటో? ఏ రాజ కుమారుడు 
రాలేదే , ఊరు నిదరోయిందా ?

ఊరు కాదు మనిషే నిదుర 
పోయాడు, మత్తు లో పడేసే 
పెను నిద్దుర, పోతే పోనీ 
మానం పోతే పోనీ , ప్రాణం పోతే పోనీ ..

నా నిద్దుర ,నా పెను నిదుర 
నా మొద్దు నిద్ర, నా రాక్హస నిదుర 
నా కల లో మెలకువ నిద్ర ని 
నేను కావలించుకునే ఉంటాను . 

జీవిత కాలం సరిపోదు ఈ 
పెను నిదుర వైభోగం కి 
జీవిత కాలం సరిపోదు 
ఇంకా నేను ఒక్క క్షణం అయినా 
జీవించనే లేదు.. 

పురుగు పుట్రా , పిట్ట ,రెట్ట 
అడవి లో గాండ్రింపు ,
ఉరిమే మేఘం, కురిసే జల్లు 
అన్ని కల లో రోజు చూస్తూనే ఉన్నాను 

ఊపిరి ఆడుతున్నట్టు, 
కనుగుడ్డు లోపల కదిలి, 
తల నిద్ర లో అటు ఇటు ఊపి 
పెను ఆవలింత లతో ,నేను 
బ్రతికే ఉన్నాను.. కాని నిద్ర లో 

మానం, ఆడపిల్ల మానమా ?
రోడ్డు మీదా ? ఇలాంటి ఎన్నో 
కలలు నేను రోజూ కంటాను ,
ఈ మాత్రానికేనా ? నన్ను లేపి 
కూర్చో బెట్టారు , అబ్బ నిద్ర వస్తోంది 
పడుకోనివ్వండి ,కంటి నిండా .. 
హా హా .. నిద్ర ఎంత సుఖం .. 



21 మార్చి, 2013

అఫీసియల్ కాలని -- .నా చదువు

అఫీసియల్ కాలని రెండో వీధిలో మరో పేజి ..నా చదువు . 

నాన్న గారికి చిట్టివలస లో ఉద్యోగం , అది మరి పల్లెటూరు , ఇక్కడ చదువు బాగుంటుంది అని, మా తాత గారింట్లో , పెట్టి చదివించాలని ,నిర్ణయం అయింది. అత్త, చిన్నాన్నలు ఇద్దరు , మామ్మ ,తాత గారు .. మా ఇంట్లో సభ్యులమ్. ఉదయం పొయ్యి మీద వంట, కాఫీ లకి, సాయంత్రం బొగ్గు కుంపటి, అది కాగితాలు కింద పెట్టి నిప్పు అంటించాలి, ఆ నిప్పు కి బొగ్గు అంటుకుని , కణ కణ లాడి ,వేడి ఎక్కేసరికి ... ఒక్క రోజు గ్యాస్ లేకపోతే మనం వేసే చిందులు తలచుకుంటే , ఎలా వండే వారో ,ఇంతమందికి . 
వీరు కాక ,ఆసుపత్రి పని మీద వచ్చి ,నెల నెలలు ఉండి పోయే చుట్టాలు ,పక్కాలు. వంటింట్లో ఒక అటక ఉండేది, అక్కడ మూతికి వాసన చుట్టి , పెద్ద పెద్ద జాడీలు ఉండేవి, అందులో మా తూర్పు వాళ్ళ స్పెషల్ ,ఎండావకాయ , మాగాయ మొదలైనవి , విడిగా, మడి గా పెట్టి ఉండేవి . 

దగ్గరలో వసంత బాల విహార్ అని ఒక బడి ఉంది, సాయంత్రం అదే ఆవరణ లో ప్రతి రోజు పురాణ కాలక్షేపం అయేది.  అయితే అప్పుడే కొత్తగా రామకృష్ణ మిషన్ వారు ,శారదా బాల విహార్ అని ఒక స్కూలు ,అది అంతా ఆంగ్ల మాధ్యమం అని, ఇదయితే మన వసంత కి బాగుంటుంది అని నిర్ణయించి , మా చిన్నన్న నిచ్చి నన్ను పంపించేరు . 

అప్పటికే ఆరేళ్ళు వచ్చి, తెలుగు అక్షరాలన్నీ ఆంధ్ర పత్రిక లో గుర్తు పెట్టి, కూలిన గోడలు , అవి చదవడం మొదలు పెట్టి ఉన్నాను. 

అయితే నా పేరు, చాట భారతం లాగ ఏదో ,బారసాల నాడు సరదాగా బియ్యం లో రాసిన చాంతాడంత పేరు , రాసేశారు  , మా చిన్నాన్న. ఆ పేరే ఉండి పోయింది , ఇలా విదేశి ప్రయాణాలు చేస్తానని, ఇమిగ్రెశను వారిచ్చే పేపర్ లో  ఉన్న గళ్ళు కి నా పేరు సరిపోదు అని అప్పుడు ఊహించలేదు మరి మా చిన్నాన్న. 

శారదా బాల విహార మొదట్లో కలెక్టర్ ఆఫీసు ఆవరణ లో  టెమ్పరరి గా నాలుగు గదులు వేసి మొదలు పెట్టేరు. 

స్వామిజి అనే వారం అందరం ,కాషాయం దుస్తులలో ,ఎప్పుడూ నవ్వుతూ , పసి పిల్లాడి నవ్వులా ఉండేది .. ఆయన భోలా నవ్వు, ఆయనే సూత్రధారి ,ఆ విద్యాలయం ఆయన కన్నకలల కి రూపం . 

కమల టీచేర్ మా హెచెమ్  .ఆవిడ ఎదురు పడితే అందరికి కాళ్ళ లలో వణుకు . అప్పుడు తెలియదు కాని, ఐ సి ఎస్ అంటే అప్పుడు కేంబ్రిజ్ సిలబస్ చెప్పేవారు మాకు. మొదటి తరగతి కే పెద్ద కట్ట పుస్తకాలు చూసి, హడలి పోయారు ,మా ఇంట్లో వాళ్ళు . 

నేను చిన్న పిల్లని ,ఇవన్ని చదవ లేనని, వాళ్ళ గట్టి నమ్మకం , కాని నాకయితే ఎప్పుడెపుడు చదివేస్తానా ?? అని ఊరికే తాపత్రయం. 

పెద్ద దూరం కాదు కాని, అప్  డౌన్స్ వల్ల దూరం అనిపించేది, అందులో చిన్న పిల్లని. 

మా వీధిలో, ఇంకా కృష్ణ నగర్ లో ఉన్న కొంత మంది పిల్ల లకి కలిపి ,ఒక గుర్రం బండి మాట్లాడేరు . అది పెట్టె బండి, అంటే రెండు చిన్న మెట్లు ఉంటాయి, అవి ఎక్కి, లోపల ఒక పెట్టె లా ఉంటుంది, అటు ఇటు రెండు చెక్క బెంచీలు. మనం ఎక్కి తలుపు మూసేయాలి . అటు .ఇటు ,రెండు చిన్న కిటికీ లు కూడా ఉండేవి, గాలి రావడానికి. మా పిల్లలకి ఎంత సరదా వో . . 

కృష్ణ నగర్ వీధిలో తిరుగుతున్నప్పుడు ,ఓ వీధి మూల ఇంట్లో , కాగితం పూల చెట్టుఉండేది ..  అది చేతిలో పట్టుకుని ,నాలుగు పూలు కోయడం, అలా చేతులు గీరుకు పోవడం , కాగితం పూలకి ముళ్ళు ఉంటాయి అని బాగా తెల్సింది .. అప్పుడే . 

మరు ఏడాది ,కొత్తగా కట్టిన తన సొంత భవనం లోకి మారి పోయింది మా స్కూల్ .. పక్కనే వివేకానంద హాల్ కట్టేరు, అందులో అసెంబ్లీ , సాయంత్రాలు ఏవయినా కార్యక్రమాలు జరిగేవి . 

ఒక సారి ఇప్పుడు లా సన్స్ బే కాలని లో ఉన్న శాంతి ఆశ్రమం కి పిక్ నిక్ కి తీసుకు వెళ్ళేరు, 10 నంబరు బస్సు ఎక్కి , యూనివర్సిటీ దగ్గర, అదే లాస్ట్ స్టాప్, అక్కడ నిండి 2 నంబరు బస్సు ఎక్కి, చిన వాల్తేరు లో దిగి, అక్కడ నించి, అంతా చిట్టడివి లా పిచ్చి మొక్కలు, గడ్డి, మధ్యలో చిన్న కాలి దారి, అందరూ భయ పడుతూ ఉంటె, నెమ్మదిగా, అర్భకం గా ఉండే నేను ,ముందు దారి తీశాను, అక్కడ సరుగుడు చెట్ల మధ్య నించి నీలి ఆకాశం దిగి వచ్చినట్టు ,సముద్రం చూసి, మొదటి సారి, మా బీచ్ కాకుండా, ఆ ..ఇక్కడ కూడా ఉంటుందా ? సముద్రం, మన ఊరు చుట్టూ ఉంటుందా ఏమిటి? అని చాల సంతోషించి , సముద్రం ఇంత విశాలమయినదా ? అని తెగ గెంతిన గుర్తు. 

చెట్లు మధ్య చాల ఆటలు ఆడుకుని, మా క్యారేజ్ లో అన్నాలు తినేసి, సాయంత్రం ఇంటికి బయలుదేరాం . 

ఆ ఆటల్లో, నా కాలికి తుమ్మ ముల్లు  గుచ్చుకుంది . చాల బాధ, ఎర్రగా కందిపోయి ఎంత బాధ పెట్టిందో? 

నా స్టీల్   క్యారేజు పోయింది ,  అంతే  సంతోషం ఆవిరి అయిపొయింది, ఇబ్బందులు తెలియకుండా పెంచినా, అది ఖరీదయినది అని, అది పోతే ఇంట్లో చాల తిడతారు అని ,ముందే ఏడవడం మొదలు పెట్టేను . 

అదేమిటో ,నా మీద ఎంత నమ్మకం ,ప్రేమో మా వాళ్లకి, పిల్లలని ,వాళ్ళ క్యారేజ్ లను సరిగ్గా చూసుకోరా ? అంటూ టీచర్లనే తిట్టేరు, మా ఇంట్లో  వాళ్ళందరూ .. 

నేను ఏ ముహూర్తం లో పుట్టానో కానీ, అన్ని వేపులా ప్రేమ , లాలన , అదృష్ట జాతకురాలిని అని చెప్పుకొవచ్చు. 

మా అమ్ముమ్మ కి అక్క అయిన ఇంకో అమ్ముమ్మ నాకు రెండు గిన్నెల స్టీలు క్యారేజు , కొని ఇచ్చింది, నేను బాగా చదువుకుంటున్నాను అని.. 

ఇప్పటికి ఆ క్యారేజు , మా అమ్మ దగ్గర ఉంది . పెద్ద వాళ్ళ ఆశీస్సులు నా పై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. 

గుర్రబండి యోగం ఒకట్రెండు ఏళ్ళ తో ముగిసింది . 
స్కూల్ దగ్గర అయింది, అంటే నేను పెద్ద దాని అయాను అన్నమాట . 
కలెక్టర్ ఆఫీసు కూడలి లో ఒక రోజు మా ఇంటి దగ్గరే ఉండే మా స్నేహితుల కుటుంబం లో ధన లక్ష్మి , ఆవిడ అప్పటికే కాలేజ్, కనపడే సరికి , ఉత్సాహం పట్ట లేక ధన లక్ష్మి అక్కా అంటూ ఒక గావు కేక పెట్టాను, ఇంటికి రాగానే నాకు క్లాసు పీకేసారు. 

ఎంత బాగా గుర్తుండి పోయింది, ఆడవారి ని పేరు పెట్టి, గట్టిగా,అందులో రోడ్డు మీద పిలవ కూడదు అని. కొన్ని పాఠాలు ఎందుకో అలా గుర్తుండి పొతాయి. 


మూడో తరగతి లో అనుకుంటా ,నోరు ఎత్తకుండా ,బుద్దిగా , చక్కగా , మంచి అమ్మాయి గా ఉన్నందుకు నాకు ఒక బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ ఇచ్చేరు , ఎంత బోరింగ్ కదా మంచి స్టూడెంట్ లైఫ్ .. 

ఎప్పుడయినా ఇలాంటి బుద్దిమంతుల పిల్లలు చెడి పోతారా ? అంటే సమాజం దృష్టి లో, అంటే రెబెల్ అయిపోతారా  అంటే .. సమాధానం . అవును. 

మా అమ్మకి నిద్ర పట్టని రాత్రుళ్ళు ,అది నా వల్లే అంటే నమ్ముతారా ? 
నమ్మండి . మరి ...చెపుతాను ,అన్ని చెపుతాను .. చెప్పాలనే నా తాపత్రయం అంతా .. మరో పోస్ట్ ,మరో కథ.