"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

31 డిసెం, 2010

మన ముందు తరానికి, ఒక ఎడారి కాదు, ఒక పూదోట నిద్దాం....

ఇదేంటి అప్పుడే ఒక దశాబ్దం గడిచి పోయిందా? ఈ ఇరవై ఒక్క శతాబ్దం లో? ఇలా పరుగులు పెడుతోందేమిటి కాలం..
ఉందిలే మంచి కాలం ముందు ముందు నా..అంటూ శ్రీ శ్రీ గారు ఎంత ఆశ తో రాసారో?కానీ ఇదేమిటి, మంచి అనేది, భూతద్దం తో వెతక వలసిన సూక్ష్మ మైన పదార్ధం అయిపొయింది. మన పిల్లలకు మనం అందిస్తున్న ఈ ప్రపంచం ఎందుకిలా వెల వెల బోతోంది? సూర్యోదయాలు అవుతున్నాయి, కాని, దట్టమైన మబ్బులు పట్టిన ఆకాశం లో. వసంతాలు వస్తున్నాయి, కానీ, రంగులు అద్దుకుని , హరిత పల్లవం గా కాదు. ఏవో కలుషిత గాలులు, రంగులని ,కాంతులని రాత్రికి రాత్రి, దగా చేసి, దోచేస్తున్నాయి. గ్రీష్మ తాపం ఇంక , నదులని ,సెలఏరులని,  పీల్చేసి, ఇంకా, ఇంకా, చాలదు, అన్నట్టు, చండ ప్రచండం గా సూర్యుడు మూడో కన్ను తెరిచి నట్టు, భగ భగ మని మండి పడుతున్నాడు. వర్ష రుతువు, నేనేమి తక్కువా?అన్నట్టు, నింగి, నేల ఏకం చేస్తూ, ఆకాశం భోరున ఏడుస్తున్నట్టు, నదులని పొంగించి, కడలి అలలు తో చెలగాటాలు ఆడించి, పొలాలు, పంటలు, వరద నీటిలో ముంచి, నా తో పెట్టుకుంటారా? అంటూ, సవాల్ చేస్తున్నది.
ఇంక హిమ వంతుడి వంతు. ప్రకృతి అంతా పోటీ పడి, మానవుల మీద ఆధిపత్యం చూపుతున్నాయా అన్నట్టుంది. విమానాశ్రయాలు, నగరాలు, రైళ్ళు, రహ దారులు, ఇంత ఎత్తు మంచు తో నిండి, ఏదీ మీ ప్రతాపం చూపండి ఇప్పుడు అంటూ సవాల్ విసురుతున్నాయి.
అంతా మనం చేసుకున్నదే. నువ్వు భూమి నుండి తీసుకున్నది ఇవ్వగలి గితేనే తీసుకో, అన్న ప్ర ప్రధమ ధర్మం మరచి, మన ఇష్టం వచ్చినట్టు, ఏక దృష్టి తో, మన స్వార్ధం కోసం, మన స్వ ప్రయోజనాలు కోసం, ఎవరి ఇష్థం వచ్చినట్టు, వారు భూమిని, ఎడ పెడా... చెరిచాం, నిస్సిగ్గుగా.. చెరిచాం. ఆ దుష్ఫలితాలు నేడు చూస్తున్నాం. 
ప్రభుత్వం దే బాధ్యత. అని ఎవరి నో నిందిస్తాం. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే కదా ,మనలని పాలిస్తున్నాయి. అడవిలు , సముద్ర తీరాలు, కొండలు, కోనలు, దేనిని వదలం. మన గొయ్యి మనమే తవ్వుకుంటూ, ఎక్కడికి వచ్చాం.. మనం.. రెండు వేల పదకొండు అనే నూతన సంవత్సర సంరభానికి ఆహ్వానం పలక డానికి.
ప్రశాంత ఉషోదయాలు, లేత  ఎండలు, మామిడి పళ్ళ వేసవులు, మల్లెపూల గుబాళింపులు,  తీగ లాగా, జల్లు, జల్లున కురిసే, వర్షాలు, ఒక్క గొడుగు కింద ఇద్దరం నడుస్తూ, తడిసే, చిలిపి వర్ష రాత్రులు, పిల్ల కాలువలు లో పరుగులు తీసే కాగితపు  పడవలు, ఆకాశం లో అంద మైన హరివిల్లులు, దాని మీద నడవాలని రహస్య కోరికలు, వానా వానా వల్లప్ప అంటూ ముద్దుగా టప టప లాడిస్తూ చేతులు, ఆడుకునే ముద్దు గారే పిల్లలు, సాయంత్రం వర్షానికి , చేదోడు, వేడి వేడి పకోడీలు, చెలి చెంత, ఈ ముసురు లో ఒక సినిమా ఓ, ఒక పుస్తకమో, ఒక కబుర్ల కోలాహలమో, ఇంక చలి, చిన చిన్న గా మొదలు అయి, ఒక వెచ్చని ఎండ, తో కరిగి, భోగి మంట లకు జడిసి, సంక్రాంతి  సంబరాల తో కరిగి, ఇంటింటా ముత్యాల ముగ్గులు తో మెరిపించి, అంద మైన చలి కాలం, బద్ధకపు పొద్దు చలి కాలం, మళ్లీ, వసంతం ,చివుర్లు చిగిరించి, రంగుల ,కాంతుల పుష్పాలతో కను విందు చేసే వసంతం.. ఈ కాలాలు కావాలి నాకు. 
అంతే కాని, ఇలా నిస్తేజం గా, నిట్టురుస్తూ, మధ్య లో విలపిస్తూ, ఆక్రోశిస్తూ, అంతలో ప్రచండ రూపం చూపించే.. ఈ కాలం నాకు వద్దు. 
ఈ శతాబ్దం చివరకు మనం ఏం మిగులుస్తాం, మన పిల్లలికి, పిల్లల పిల్లలకి, అంటే, కనిపించే ఎడారి దృశ్యం నన్ను భయ పెడుతోంది, 
ఈ దశాబ్ది, చివరి రోజు , గుమ్మం లో నిల్చున్న నాకు, మలి  దశాబ్దం లో అడుగు పెట్టాలంటే...ఒక ఆలోచన, ఒక కలవరం, ఒక  కలవరపాటు.
వెనక్కి తిరిగి వెళిపోవాలి, అనే కోరిక ని చంపుకుని, ఈ దశాబ్దం , వసుధ కి అంకితం అని ఒట్టు పెట్టుకుని, నువ్వు తిరిగి ఇవ్వలేని దానిని ,ఖర్చు పెట్టకు అనే మంత్రం జపం చేస్తూ, మాటలు చేతలు ఒక్కటి అయ్యే రోజుల కోసం , భూమిని పరి రక్షించే ప్రభుత్వం కే నా పవిత్ర మైన ఓటు, ఈసారి, అందు కోసం ఉద్యమిస్తాం, ఉద్యమాలకి చేయూత  నిస్తాం,  అని ఇలా, ఏవేవో చెప్పి, మనసుకి, నెమ్మదిగా అడుగు వేస్తున్నాను. 
ముందు ఒక మొక్క నాటు, అని బుద్ధి హెచ్చరించింది  . ఇదే నా నూతన దశాబ్ది నిర్ణయం .. ఇంకేమి కాదు.. భూభారం తగ్గించే ప్రయత్నం, లో భాగం గా ఓ ప్పది కేజీలు తగ్గడం కూడా  ఉంది, కాని, అది ఒక రహస్య నిర్ణయం. 
ఇంక మీరు ఏం చేసుకున్న, చేసు కోక పోయినా భూమి ని ఒక పచ్చ రంగులో అలంకరించే ప్రయత్నం మటుకు చేయండి, ప్లీస్..
మన ముందు తరానికి, ఒక ఎడారి కాదు, ఒక పూదోట నిద్దాం..మీరేమంటారు  ?

2 కామెంట్‌లు:

  1. నిజమే వసంత గారు భూమి మీద కొన్ని లక్షల జీవ రాసులు ఉన్నాయి కానీ వాటిలో భూమాతని దోస్తున్నది కలుషితం చేస్తున్నది మనుషులే అండి ......భూమి నుండి ఇవ్వగలిగితేనే తీసుకో ..చాల బాగా రాసారు ....

    రిప్లయితొలగించండి
  2. లక్ష్మీ శైలజా !
    నా పోస్ట్ నచ్చినందుకు చాలా సంతోషం ..
    ధన్యవాదాలు శైలజా !
    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి