నిన్నే ఒక వార్త చదివాను, గల్ఫ్ లో పని చేసే వారికి , వారిని ప్రలోభ పరిచి, బ్యాంకు లు, వారికి క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారుట..ఇంక వాళ్ళు ఆ కార్డులు తో విపరీతం గా ఖర్చు పెడుతూ, స్వదేశం లో ఉన్న పిల్లల చదువులకూ , వారికి చక్కని భవిష్యత్తు ఇవ్వాలని, వారికి వేలు ,లక్షలూ పంపిస్తూ, చివరకు వారు ఇక్కడ జైలు పాలు అవుతున్నారుట..ఏవేవో ఆశలు తో, కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి తప్పించాలని, కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయాలని, లేదా కుటుంబ పెద్ద అనారోగ్యానికి అయే అప్పులు తీర్చడం కోసమో, ఆడ వారే ఇక్కడకి రావడం ఎక్కువ అయిపొయింది.
నేను చదివిన వార్త ఫిలిప్పీన్స్ దేశాస్తులకి సంబంధించినది. మన దేశం కి కూడా ఇది వర్తిస్తుంది. మన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ,ఇలాంటి ఎందఱో స్త్రీలు కనిపిస్తారు. ఇమ్మిగ్రేషన్ ఫోరం నింపమని అడుగు తారు. కనీసం సంతకం కూడా పెట్ట లేని వారు, ఇక్కడికి ఏ పని చేయడానికి వస్తారో ఊహించ వచ్చు..
ఇక్కడ దేశస్తులకు, వారి ఇంట్లో ఇంటి పని చేయడానికో, వారి పిల్లల పని చేయడాని కో, ఒక చిన్న గది ఇస్తారు, ఇరవై నాలుగు గంటలు, వారి పిలుపులకి తయారు గా ఉండాలి.అదృష్టం బాగుంటే, మంచి గా చూసుకునే యజమానులు దొరుకు తారు..లేదా..వారి బాధ ,వ్యధ, గుండెలు పిండేస్తాయి. ఎందుకు ఇంత దూరం వస్తారు, అయిన వారందిరిని వదులు కుని, అని అడిగితే,ఉన్న ఊరులో ఇలాంటి పనులు చేయలేం కదా అంటారు,పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోలేక అంటారు.
స్త్రీలు,ఇంటికే పరిమితం, ఇదే మన సంస్కృతి, అంటూ చెప్పే కబుర్లు ఏమయాయో,దేశాంతరాలు పంపించి, ఆ ధనం తో, ఇంటిని నడిపే మగ వారు ని నేడు చూస్తున్నాం..ఇంక ఆడ దక్షత లేని ,ఆ కుటుంబాలు ,ఎలా నడుస్తాయో ఊహించలేం. మగవారికి ఒక తోడూ,మన ప్రభుత్వం వారు దయ గా పోసే సారా..అ తరువాత వచ్చే రోగాలు, రోష్టులు ఇంకో కథ, వ్యధ..ఇక్కడ ఒళ్ళు గుల్ల చేసుకుని కష్ట పడే స్త్రీ కి మిగిలేది, దూరం అయిపోయిన కుటుంబ సభ్యుల ,తరగని కోరికల చిట్టా..ఒక అంతు లేని కథ ..కథ నాయిక లా ఒక ఒంటరి జీవితం.
మన దేశ ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి.. ఇలాంటి పనులకు యింక వీసాలు ఇవ్వకూడదు. ఏజెంట్లు వేసే వల లో పడి పోతున్న స్త్రీలకూ, ఒక వెసులుబాటు కల్పించాలి.ఎయిర్ పోర్ట్ ల లో,మన దేశ అధికారులు,ఇలాంటి స్త్రీలను గుర్తించి, వారిని హెచ్చరించాలి, వారికీ ఒక భద్రత , ఒక ఉపాధి పధకం సూచించాలి. ఇవి ,వింటే, మన దేశం లో ఇలాంటివి జరగవు అంటారు.కాని,ఇక్కడ మన దేశ పరువు తాకట్టు పెట్టినట్టు అని పిస్తుంది. ఒకరి ఇంట్లో పని చేయడం తప్పు కాదు,కాని, కట్టు బానిస ల లాగ,ఒక పేద దేశ స్త్రీలను మేము పోషిస్తున్నాం అన్నట్టు భావించే ఒక ధనిక దేశం కుటుంబానికి పని చేయడం..మన దేశం ఇంత గొప్ప ,అంత పవిత్రం అని చెప్పుకునే వాళ్ళం, సిగ్గు తో తల వంచుకునేల ఉంటాయి..ఇక్కడ స్త్రీల కథలు.
కొన్ని దేశాల ప్రభుత్వాలు ఇలాంటి పనులకి, తమ దేశస్తులను పంపించటం లేదు. మన పొరుగు దేశాలు కొన్నిఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. మన దేశం మటుకు ,మాటల్లో చెప్పుకునే గొప్పలు, చేతల్లో చూపించటం లేదు.
పాస్ పోర్ట్, సివిల్ ఐ .డి .లు ఎవరి చేతిలోనో ఉంటాయి.సంవత్స రానికి , కొంత సొమ్ము ,వారికి కట్టాల్సిందే. వీళ్ళు కష్ట పడి సంపా దించిన దాంట్లో ,ఎవరికో వాటా..ఇది కాక ఇంటికి పంపించాలి, ఇక్కడ వీళ్ళు ఏదో లక్షలు సంపాదిస్తున్నారు అని, వారి భ్రమ.ఆ భ్రమ ని నిజం చేయడానికి ,ఇక్కడ వీరు పడే కష్టం, నిద్ర లేని రాత్రులు ,లో కార్చిన కన్నీరు, ఇవి దేవుడు కే తెలుసు.
మూడేళ్ళకో, అయిదేళ్లకో, లేదా యింక కొంత మంది ఏ పదేళ్లకో..వెల్ల గలుగుతారు..వారి దేశానికి.చిన్న పిల్లలు, పెద్ద వారు అయి పోతారు, పిల్లలికి పెళ్ళిళ్ళు అయి పోతాయి,మనవళ్లు, మనవరాళ్ళు పుడతారు, అన్ని ఫోన్ ల లోనే వింటారు,ఊహించు కుంటారు. ఏవో ఫోటోలు చూస్తారు, ఏవో కబుర్లు తెలుసు కుంటారు.
అబ్సెంటీ మెంబెర్ అంటే కనిపించని ఇంటి సభ్యులు ..అన్న మాట వీళ్ళు..వందల్లో కాదు, వేలల్లో ఉన్నారు.మన దేశం ఎందుకు వీరికి కాస్తంత భద్రత, ఉనికి, చేయాలి అనుకునే వారికి పని, ఎందుకు చూపించేలేక పోతోంది? ఈ చదువు లేని వాళ్ళు యింక ఎందుకు ఉన్నారు? మన విద్య వ్యవస్థ ,అందరికి ఎందుకు విద్య అందించ లేక పోతోంది?
ఎప్పటికి మనం ,కాగితం మీద కాకుండా ,నిజం గా అబివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోగలం గర్వం గా??
మూడేళ్ళ తరువాత ,తన దేశం వెళ్లి, మూడు నెలలు ఉండి, పెళ్లి చేసుకుని, నవ వధువు ని వదిలి మళ్లీ ఈ దేశం వచ్చి , ఫోన్ లో మాట్లాడుతూ, సొమ్ము పంపిస్తూ,సంసారం చేసే ఒక ఎక్ష్ పాట్ .వ్యథ ,కథ కాదు..నిజం..
ఇలాంటి ఎందఱో ,కథలు వింటే, మనం ఎంత అదృష్ట వంతులమో ,ఎప్పుడు కావాలి అంటే, అప్పుడు మా ఊరు వెళ్లి పోగలను నేను, అయినా ఏదో లోటు ..నాకు అని ఊహించు కుంటూ బాధ పడే.. నేను ఎంత మూర్ఖురాలిని..
మన దేశం ..సస్య శ్యామలాం..అని పాడు కోవడమే కాదు, నిజం గా సమృద్ధి గా, ఆకలి తెలియని దేశం అవుతుందని ఆశించడం అత్యశా???
భారతీయులు అందరు, పని వారు గా ,పర దేశం వెళ్ళే వారికి, మన దేశం లోనే పని దొరికే శుభ దినం కోసం పని చేయాలి. ఆకలి తో అలమ్టించని ప్రజా నీకం తో బలమైన దేశం గా అవతరించాలి , అని చేతులు కలిపి నడవాలి. రెప రెప లాడే మన జాతీయ పతాకం నీడలో, ఒక్క కన్నీరు చుక్క కూడా పడ కూడదు..
పర దేశం లో ఉంటూ , ఇక్కడ పని చేసే ఆడ వారిని చూస్తూ, ఏమి చేయ లేక , మన దేశం లో ప్రజలే కదా వీరు కూడా ,అయిన ఇంత అంతరం ఎలా ఏర్పడింది? అని ఎన్నో జవాబు లేని ప్రశ్నల కి జవాబు వెతుకు తూ..ఈ పోస్ట్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి