"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 ఫిబ్ర, 2012

ఏదో మీ దయ..వల్ల..

ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను..

కాయగూరలమ్మా ..కాయగూరలు..అని బండి తోస్తూ , అరుచుకుంటూ వెళుతున్న బండి అప్పారావు కనిపించాడు..
కాళ్ళు సగం కనిపిస్తూ ,ఓ నిక్కరు, పైన రంగు తెలియని ఓ బనీను , బండి నిండా కూరలు, తినని వాళ్లకి అంటు  లేకుండా, ఓ మూల కి పేర్చిన గుడ్లు, అన్ని కూరలు, బంగాళా దుంప రంగు లో ఉన్నాయి. ఊరి మీద దుమ్ము అంతా,పైన చేరింది మరి.

ఏమిటి అప్పారావు? ఎలా ఉన్నావు? అని పలకరించేను..

కాబేజీ అంతా మొహం చేసుకుని, ఏదో నమ్మా ..మీ దయ వల్ల, బాగానే ఉన్నాను.

నాన్న తో పాటు, నోట్లో ఓ కారట్ నములుకుంటూ, డాడీ, అంటూ పిలుస్తూ, ఆరేళ్ళ అబ్బాయిలా కనిపించే ,పదేళ్ళ అబ్బాయి.. మేడ మీద అమ్మగార్లు ,కిందకి రావడానికి బద్దకించో, పని హడావిడి లోనో, ఈ కూరలు ఇవ్వు, అప్పారావూ, అని నోటి తో ఒక లిస్టు పైకి చదివితే, అప్పారావు కొడుకు ,ఒక హెల్పెర్ లాగ, కూరలు అన్ని, ఒక చిన్న బుట్ట లో, వేసుకుని ,పైకి పరిగేట్టేవాడు. 

అబ్బ ,నీ పిల్లాడు, చాల చురుకు, అప్పారావు.. అని అందరూ మెచ్చుకోవడమే.

ఇంక ఆడవాళ్ళు అందరూ బండి చుట్టూ చేరి, లోకాభిరామాయణం మొదలు పెట్టేవారు. 

అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళందరూ, ఒక జట్టు, వారిలో వారికి ఎన్ని గొడవలు ఉన్నా, పక్కింటి, మూడంతస్తుల మేడ లో ఉన్న వారు ఒక జట్టు.

పక్కనే అయిదంతస్తుల అపార్ట్మెంట్ ల బిల్డింగ్ కట్టి, మాకు గాలి ,వెలుతురూ మూసేశారు ,అని వాళ్ళ బాధ.

మేమే కదా , పెద్ద ఇంట్లో, చెట్టు, చేమలు, వాకిలి డాబా , తో దర్జా గా ఉంటున్నాం అని ఆ ఇంట్లో ఆవిడా , ముఖమంతా బొట్టు తో, భారి గా ఉండేది, ఆవిడా, ఇంట్లో అద్దె కున్న వాళ్ళు సపరివారం గా వచ్చి,

అప్పరావూ, నాకు పావు కేజీ వంకాయలు, పుచ్చు ఒకటి ఉండకూడదు, పున్జీడు పచ్చిమిరపకాయలు,అని ఒకరు,

నాకు ముప్పావు కేజీ బీరకాయలు, మేం అంతా కూరలే ఎక్కువ తింటాం ,మా ఇంట్లో, అని మేడ మీద మూడో అంతస్తు ఆవిడ, కూరల అంతస్తు చూపించడం..అప్పారావూ, అందరిది అయిపోయాక నాకు రెండు కేజీలు దుంపలు తూకం వేయుమీ, అదే చేత్తో, ఓ కేజీ ఉల్లిపాయలు, ఓ డజను గుడ్లు అని కొద్దిగా గొంతు తగ్గించి, అటూ ,ఇటూ చూడడం..తినని వారి హావభావాలు కి నిరసనా గా ఓ చూపు..వేసి.

అమ్మాయి, మీ అక్క పెళ్లి కుదిరిందా? అని అడగ్గానే చెల్లి, ఏమోనండి ,మా అమ్మ నడిగి చెపుతాను, అని తుర్రుమంటే, హ్మం.. ఈ కాలం పిల్లలలు మహా గడుగ్గాయలు. అని నిట్టూర్చి, ఏమిటి అప్పారావు, రోజూ ఇవే కూరలు తెస్తావు? 


బీరకాయలండి, వంకాయలండి, టమాటా అండి, అని కూరగాయలండి అని ఒక ముక్తాయింపు తో ఒక్క అరుపు, ఇంక టీ. వి.ల ముందు కూర్చున్న ,పని హడావిడి లో ఉన్న అమ్మలకి ఒక్క పిలుపు గా గట్టిగ అరిచేవాడు.

నేను, అప్పట్లో చదువుకునే దాన్ని ఇంకా..అంటే రిసెర్చ్ స్కాలర్. ఇద్దరు పిల్లలు, వాళ్ళ హోం వర్క్, చేయించడం, టిఫిన్లు చేయడం అట్టే రాదు కదా, బ్రెడ్డు, పాలు, ఉడికించిన గుడ్డు, వీటితో గడిపేయడం..

కూరలు కొనాలి ,అని ఓ సంచి పట్టుకు వచ్చి, తాత్సారం చేస్తూ నిల్చునే దాన్ని. ఏం కొనాలో, ఆనపకాయ, కొంటే ఎలా వండితే బాగుంటుంది అని ,మనసులో ఓ రిహార్సల్, పోనీ, అరటికాయో? అమ్మో చెక్కు తీస్తూంటే ,చెయ్యి అంతా ,ఎలా అంటుకుంటుందో? సరే వంకాయలు కోనేద్దాం, దుంపలు ఎలాగు ఉంటాయి, టమాటాలు పప్పు లోకి, చారు లోకి, ఇంకా ఏమిటి కావాలి?

అని నాటకం లో, సైడ్ పోర్షన్  నించి ప్రోమ్టింగ్ కోసం ,ఎదురు చూసే సంభాషణలు మరిచిపోయిన నటి లాగా పక్కన దిగులు గా నిలుచునే దాన్ని.
ఫిజిక్స్ లో ఏ సూత్రం అడిగినా టక్ మని చెప్పేయగలను కాని, ఆవ పెట్టి ఆనపకాయ కూర, అమ్మ చేసినట్టు ఎప్పటికయినా నేను చేయ గలనా? అని వంట దిగులు మొహం మీద కంమేసేది ..తరచుగా..

అప్పారావు బండి చూసినప్పుడల్లా ,ఇదే ఫార్స్. పోపుల డబ్బాలో ఏమేమి సరుకులు పెట్టాలో కూడా తెలియని రిసెర్చ్ స్కాలర్ ని నేను మరి ,అప్పుడు.

ఆ మేడ ఇంటి ఆవిడా..ఎప్పుడూ.

అప్పరావూ ,ఇంతింత ధరలు చెపుతావు. మేడలు కట్టేస్తావా? అని హాస్యాలు ఆడేది, 

అమ్మా..ఈ డబ్బులతోనే, మేడలు కట్టేయడమా?? అమ్మ మీకు తెలియదా? ధరలు ఆకాశానికి ఎలా అంటుకున్తున్నాయో? అనేవాడు.

పిల్లలని చదివించు అప్పారావు, అన్తూడే దాన్ని.

ఏదో నమ్మా..సర్కారు బడి లో చదువు చెప్పరు, ప్రైవేట్ బడులు ఫీసులు ,మాకు అందుబాటులో లేవు అని అంటే, నాకు చాల బాధ కలిగేది.

ఈ వీధి లో చిన్న ఫ్లాట్ వదిలి మేము  మరో కోలోనీ లోకి ,ఇంకా పెద్ద ఫ్లాట్, మూడు బెడ్రూమ్లు ,ఉన్న ఫ్లాట్ లోకి మారిపోయాం.

తరువాత కొన్నేళ్ళు  ఇటు  రావడం పడ లేదు.

ఈ కాలనీ తో పరిచయమే పోయింది.. అందరూ కొత్త వాళ్ళు వచ్చేరు.

పెద్ద మేడ ఆవిడా ఇల్లు అమ్మేసుకున్నారని, తరువాత ఆవిడా పోయేరని, మా ఫ్లాట్స్ కొంత మంది కూడా పోవడమో, ఊరు విడిచి పెట్టి వెళ్లి పోవడమో, చేతులు మారి, ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చేరు అని వార్తలు అయితే తెలుస్తూనే ఉన్నాయి.

మా ఫ్లాట్ లో, మా అమ్మగారిని పెట్టడం తో మళ్లీ, ఈ వీధి లోకి రావడం మొదలు పెట్టెను.

ఇదిగో, అలాగా, అప్పారావు మళ్లీ కనిపించాడు.

నాకు ఇప్పుడు, నల భీమ పాకం కాకపోయినా ,వంటలు బాగానే వచ్చు. పిల్లలు ఇద్దరు, చదువులు పూర్తీ చేసి, ఇంకా పై చదువులు కోసం బయట దేశం లో ఒక్కరు, చెన్నై లో ఒకరూ, ఉన్నారు ఇప్పుడు.

మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అప్పారావు అంటే..

డిగ్రీ చదివాడు అమ్మాగారు, మీదయ వల్ల..అన్నాడు.

హమ్..నా దయ ఎందుకో ..చదివాడు లే పాపం డిగ్రీ, మంచిదే అనుకున్నాను.

పాప కి పెళ్లి చేసాం, సిమ్మాచలం దగ్గర కూరల వ్యాపారం , అని సంతోషం గా చెప్పేడు. అబ్బాయి, మోర్ షాప్ లో పని చేస్తున్నాడు. నెలకి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు.. అన్నాడు అంత మొహం చేసుకుని.

ఇంతేనా? పదిహేను ,ఇరవై, ఏళ్లల్లో, అప్పారావు జీవితం ఇంత మారింది. చాల సంతృప్తి గా కూడా ఉన్నాడు.

మేమే ఇంకా ,ఏదో ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, చుట్టూ తోట పెంచుకోవాలి, అంటూ పెద్ద ,పెద్ద కోరికల తో ఏమిటో, తృప్తి లేకుండా..నలిగి పోతున్నాం.

ఎవరు ధనవంతులో?? కూరలు అమ్ముకుంటూ, ఎన్నేళ్ళు అయినా, పెద్ద మార్పు లేక పోయినా ,హ్యాపీ గా కనిపించే అప్పారావా??

ఇంకా సంపాదించాలి, కోట్లు వెనకేయాలి.. అని కింద మీద పడుతున్న మేమా??

మోర్ లో ఉద్యోగం..హ్మం..ఎంత సంతోషం గా ఉన్నాడు.. 

చదువు ఇంకా చదవాలని, పెద్ద పెద్ద జీతాలు ఇచ్చే ఉజ్యోగాలు చేయాలని ,ఎందుకు వీళ్ళకి అనిపించదు..

స్లం డాగ్ మిల్లయానేర్ లో చూపించినట్టు పేదరికం మన దేశం లో ఇంకా ఉంది అని నేను, లేదు అని తను, వాదించుకోవడం గుర్తు వచ్చింది.

చిన్న చదువులు, చిన్న ఉద్యోగాలు, ఇప్పటికి ఇవే..

మరో తరం అయినా ,పై చదువులు, పెద్ద ఉద్యోగాలు చేయ గలుగుతారా??   

ఎప్పటికైనా వీరు బాగు పడుతార   ? 

ఏమో ?? ఇంకా ఇరవై, ముప్ఫై ఏళ్ళ కి అయినా మార్పు వస్తుందా? అనుకుంటూ ' మీ దయ అమ్మా' అనే అప్పారావులు లేని రోజు వస్తుందా? 

అయినా 'నా దయ ఏమిటి? ' అనుకుంటూ..

నెమ్మదిగా నడుచుకుంటూ , మా ఫ్లాట్ లోకి వెళ్ళేను.















6 కామెంట్‌లు:

  1. ఇంకొంచం వివరం గా రాస్తే ,బాగుండేది కదండీ..అయిన నా చిన్న కథ చదివి, మీ అభిప్రాయం రాసినందుకు ధన్య వాదాలు మాష్టారు..
    వసంతం.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా రాశారు.....
    అప్పారావులు లేని రోజులు వస్తునే ఉన్నయండీ......
    కానీ మీ అదృష్టం మీరు ఇంకా ఆ రోజుల్ని చూడటం లేదంతే.....

    ఎన్ని రోజుల తర్వాత రాసారు...
    మొదట్లో రోజుకి ఒకసారి... తర్వాత్తర్వాత అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసేదాన్ని మీ బ్లాగు...
    ఓపెన్ చేస్తూనే 'పుస్తకంపై అట్ట ఓ ఆకర్షణ' అనుకునేదాన్ని.... అంతలా బట్టీయం అయ్యిందంటే నమ్మండి....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Madhavi ధన్యోత్స్మి..
      నేను అలాగే ఒకసారి, ఆ పేజ్ లోకి వెళ్ళి, ఎందుకు రాయటం లేదబ్బా ? ఈవిడ అనుకుని, నేనే కదా అని మళ్లీ సర్దుకుని, ఇల్లు అలుక్కుంటూ పేరు మర్చిపోయిన ఈగ లాగ ఫీల్ అయిపోయి, హ్మం..అని బాధపడి పోయే దాన్ని..
      ఏమిటో? నా రచనల పుట్టిల్లు, నాకు కువైట్ అయిపొయింది, కడుపు నిండా తిని, కబుర్లు చెప్పుకోవడం, స్నేహితులతో, ఇక్కడ, మా ఒయిజగ్ లో, కడుపు లో చల్ల కదలకుండా కూర్చోవడం..ఇల్లు సర్దుకోవడం.అని వంక పెట్టి, అడక్కండి..
      ఇంతమంది అభిమానులు ఎదురు చూస్తున్నారంటే, నాకు సంతోషం తో ఓ నాలుగు కేజీలు బరువు ఎక్కువ పెరిగినట్టుంది.
      ఇంక పై, చక్కగా ,బుద్ధి గా రాస్తూ ఉంటాను లెండి,
      వసంతం.

      తొలగించండి
  3. మీరు కడుపు నిండా తిని కబుర్లు చెప్పుకోవడం మంచిదే............
    కాకపొతే ఆ కబుర్లని మాతో పంచుకోకపొతేనే వస్తుంది తంటా..... మా లాంటి వారి కోసం క్రమం తప్పక రాస్తాను అన్నారు కదా ఇకనేం..... మీ కబుర్లే మాకు కానుకలు... బ్లాగు పూరేకలు... వసంతపు జల్లులు....

    రిప్లయితొలగించండి
  4. Madhavi,

    కువైట్ వచ్చాక రాయడం మొదలు పెట్టేను, మరి చూసారా? మాధవి..
    మీ అమూల్యమయిన అభిప్రాయం..నా పోస్ట్ కి అలంకారమే కాదు,
    మనసు కి ఆహ్లాదము కూడా..
    వసంతం.

    రిప్లయితొలగించండి