"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

6 మార్చి, 2012

మధూలిక

నేను అవాక్కయాను  ఈ వార్త విని,ఇది నిజమా? మధూలిక పెళ్ళా?
అదీ ఇంత తక్కువ సమయం లో, డిగ్రీ తీసుకుని ఎంత కాలం అయింది? మూడు నెలలు..హ్మ్మం..ఇది నిజం గ మూడో ప్రపంచ యుద్ధం కన్నా గొప్ప సంచలన వార్తే..


మేం ముగ్గురం, చిక్కని ,తీయని స్నేహితం రుచి చూస్తున్న చిన్ననాటి స్నేహితురాళ్ళం. మా ముగ్గురిలో మధూ , తెలివైనది, చదువు అంటే నిజమైన అభిరుచి, అసలు తన ప్రోద్భలం తోనే ,నేను, జ్యోతి ఏలూరు లో డిగ్రీ అవగానే ,విశాఖ లో పీ జీ చేయడానికి వచ్చాం.


డిగ్రీ అవగానే ,నేను జ్యోతి ,హమ్మయ్య..ఇంక చదువు అయిపొయింది..ఇంక ఇంట్లో కూర్చుని, హాయిగా పుస్తకాలు చదువుకుంటూ, సినిమాలు చూస్తూ    , అమ్మ దగ్గర..మంచి ,మంచి వంటలు నేర్చుకుంటూ..ఇంక వైవాహిక జీవితానికి తయారు అయి పోదాం..అనే సగటు ఆడ పిల్లలం..


నాకు గుర్తు ఉంది..రెండేళ్ళ క్రితం ,మా మధూ మాకు ఇచ్చిన ఉపన్యాసం.
" మీకు అసలు బుద్ధి ఉందా? అప్పుడే చదువు అయిపోయిందా? మీకు..ఇంట్లో కూర్చుంటారా? చదువు కి అసలు అంతం ఉందా? జ్యోతి, నీకయినా బుద్ధి లేదే? సరళ అంటే పోనీ, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి తెలుసు కదా? కాని, మీ నాన్న గారికి బ్యాంకు లో మంచి ఉద్యోగం..నువ్వు ఎంత వరకూ చదివితే అంత వరకూ చదివించ గలరు.."


"అసలు చదువు అంటే ఏమిటో? మీకు తెలుసా? చదువు ఎంత వికాసం ఇస్తుందే..చూడు మన పక్కింట్లో ఉండే వకుళ అక్క? పీ జి చేసింది, ఎంత ధైర్యం గా ఉంటుందో..విశాఖ పట్నం లో ఆంధ్ర యూనివెర్సిటి గురించి ఎంత చెప్పిందో? దూరం గా సముద్రం కనిపిస్తూ, కాంపస్ అంతా మొక్కలు, చెట్లు, తో పచ్చని వాతావరణం లో ,హాయిగా ప్రశాంతం గా ఉంటుందని,సరదా సరదా గా ఉంటుందని చెప్పా లేదూ.."


నేనూ ,జ్యోతి ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం..ఇంకా చదువా? క్లాసు లో ఆ పాఠాలు వినడం, పడి పడి , పరీక్షల ముందు చదివి, చదివినది మర్చి పోకుండా ,పరీక్ష పేపర్ మీద రాయడం, ఆ మూడు గంటల లో వ్రాసిన దాని బట్టి  ,మా మార్కులు, ఫలితాలు, ఇదేనా చదువు అంటే..మా కేమి అంత మోజుగా, సరదాగా లేదు, ఈ చదువులు చదవడం. ఏదో ఒక డిగ్రీ వస్తుంది, చాలదా? ఇంకా ఏమిటి?


ఇద్దరం అదే అడిగాం..దానికి మధూ చెప్పిన సమాధానం నాకు ఇంకా గుర్తు ఉంది.ప్రతి పదం ..మది లో చెక్కినట్టు...


" సరళా..జ్యోతీ..మీకు నేను చెప్పలేదే, నా చిన్నతనం లో, చాల అర కొర..సదుపాయాలతో ,మా మామ్మ , తాత గారి ఇంట్లో గడిచింది..మా మామ్మ ని ఆసుపత్రి లో వేసేరు, పక్ష వాతం ..వచ్చి పడి పోతే..
ఓ రోజు, నేను ఉదయమే..మామ్మకి సాయం పడుకున్న మా అమ్మగారికి ,కాఫీ పట్టుకెళుతున్నాను ఫ్లాస్క్ లో, ఉన్న ఒక జత చెప్పులు లో ,ఓ చెప్పు తెగి పోవడం తో, ఉత్తి కాళ్ళ తోనే నడుస్తున్నాను..ఇంతలో,నా పక్కనే ఓ కార్ ఆగింది, అందులో, మా క్లాసు మేట్ 'అమర్' వాళ్ళ అమ్మ గారు డాక్టర్ రమణి ఉన్నారు..నాకు ఆవిడ తెలుసు, నేను ఆవిడకి తెలియక పోవచ్చు..


"ఎక్కమ్మా కార్ లో, చిన్న పిల్లవి, నిన్ను దింపేస్తాం "..అని," ఎక్కడికి వెళ్ళాలి"  రాజేంద్ర ప్రసాద్ వార్డ్ కి అని చెప్పేను..


నన్ను దింపేస్తూ  "నువ్వు నాకు తెలుసు, మధూలిక కదా..బాగా చదువుతావు అని మా అమర్ ఎప్పుడూ చెపుతాడు..బాగా చదువుకో అమ్మా..మధూ..నువ్వు పెద్ద అయాక ఇలాగే కార్ లో తిరుగుతావు..చదువు వల్లే అన్ని వస్తాయి.." అంటూ నన్ను భుజం తట్టి, అక్కడ దింపేసి వెళ్లి పోయారు.వెళ్లి పోతూ ఆవిడ నా వట్టి కాళ్ళ వేపు చూసిన చూపు ,నన్ను వెంటాడుతూనే ఉంది.


ఆ రోజు నించి, చదువు అంటే అంటే నాకు పిచ్చి..చదువు కుంటే,మనం ఎంతో, ఎన్నో సాధించ వచ్చు..డిగ్రీ అంటే ఒక మెట్టు..మనం ఎక్కవలసిన మెట్లు ఇంకా చాల ఉన్నాయి, యూనివెర్సిటీ లో చదువు ఇంకా బాగుంటుంది..మనం ఎలాగో ఒక లాగా ఒప్పిద్దాం ,మన తల్లి తండ్రులని..


ఏమిటో,మధూ చెప్పిన ఆ ఉదంతం మమ్మలిని కూడా కదిలించింది. ఎప్పటిదో ,అయినా తన బాధ మా బాధ, తన కసి మా కసి చేసుకుని, ముగురం ,ఇంట్లో వాళ్ళని ఒప్పించి, ఫిజిక్స్ లో పీ జి చేయడానికి ,విశాఖ పట్నం వచ్చెం.


ఇక్కడ కూడా మంచి స్నేహితుల ని సంపదించేం  కానీ, మా స్నేహం..మటుకు గట్టిగ వేళ్ళు నుకుని ,వట వృక్షం లాగా అయిపొయింది.


ముగ్గురు మరాఠీలు అన్నా..త్రిమూర్తులు  స్త్రీ లింగం.. లో అన్నా..మేం ఒకటే ప్రాణం ,ఒకటే శరీరం అన్నట్టు..ఎలా తిరిగే వాళ్ళమో?


చూస్తుండ గానే మా ఉన్నత చదువులు కూడా అయిపోయి, ఇంక వెనక్కి వెళ్ళే సమయం వచ్చేసింది.


నేను కాలేజ్ లో లెక్చరర్ గా పని చేయాలని నిశ్చయం చేసుకున్నాను, మంచి లెక్చరర్ అని పేరు తెచ్చు కోవాలని ,మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను.


జ్యోతీ ,బ్యాంకు పరీక్షలు రాసి, వాళ్ళ నాన్న గారి లాగే..ఆఫీసర్ అవాలని నిర్ణయం తో,బ్యాంకు  పరీక్షలకి చదవడం   మొదలు పెట్టింది.


మేం ఇద్దరం ఏలూరు లో ఉన్నాం..


ఇంతలో ఈ కబురు.


మధూలిక పెద్దమ్మ పిల్లలు ,అక్కడ ఉండడం తో, వారితో కొంచం సమయం గడిపి వస్తాను ,తరువాత ఏం చేయాలో కూడా ఆలోచించాలి అని వైజాగ్ లోనే ఉండి పోయింది.


మధూలిక ఏలూరు వచ్చింది అని తెలుసుకుని, నేను జ్యోతీ, ఆవేశం గా తన మీదకి దాడి చేయడానికి బయలు దేరాం.


తను నవ్వుతూ ఎదురు వచ్చింది.


మీరు ఏమంటారో నాకు తెలుసు..


ఉండండి. అంటూ.. ఒక చిన్న కాగితం పట్టుకు వచ్చి చూపించింది.


అదీ ఒక అప్లికేషన్ ఫోరం లాగా ఉంది.


పేరు..మధూలిక,
చదువు..Msc ఇన్ ఫిజిక్స్.
తల్లి తండ్రులు...లక్ష్మి, నారాయణ .
ఇతర కుటుంబ సభ్యులు..ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు.
ఉద్యోగం...భార్య పదవి..


ఇలా ఉంది, దాని మీద, అవాక్కయాం..మధూ చెప్పడం మొదలు పెట్టింది .


నేను లైబ్రరీ లో కూర్చుని, జాబ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాలి, నాన్న గారికి ఇంక భారం కాకూడదు అని ,ఆలోచిస్తూ, వార్తా పత్రికలు తిరగేస్తూ కూర్చున్నాను.


నా పక్కనే..కూర్చున్న ఒక అందమయిన యువకుడు, చెయ్యి చాచి..
'మధూలిక'? అన్నాడు..అప్రయత్నం గా తిరిగి చూసాను,
'అమర్' అన్నాడు, చెయ్యి చాచి..


చిన్న నాటి క్లాసు మేట్..నేను ఎలా మర్చి పోతాను? అతని అమ్మగారు ,నా చదువు కి, నాలో కసి పెంచడానికి దోహదం అయారు కదా..


చిరునవ్వు తో "అమర్..చాల మారిపోయావు, నేనూ మారి ఉంటాను లే.."
అన్నాను.


"నేను నిన్ను రెండు మూడు సార్లు చూసాను, కాంపస్ లో,పలకరించుదాం అంటే   గోడ లాగ నిన్ను అంటి పెట్టుకుని నీ స్నేహితురాళ్ళు ఉండే వారు..నేను ఎమ్బియే చేసాను, ఉద్యోగం కూడా వచ్చింది.."


"బొంబాయి లో ఉద్యోగం ..మా అమ్మగారు నీకు గుర్తు ఉన్నారు కదా.నాన్న గారు పోయేరు, అమ్మ క్లినిక్ చూసుకుంటోంది ఇప్పుడు, అక్క అమల కి పెళ్లి అయిపొయింది.."


"నాకు ఎక్కువ సమయం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? "అని అడిగేడు..నేను స్టన్ అయిపోయేను..


వెంటనే, ఏమి ఆలోచన లేకుండా..సరే..అన్నాను..


నాకే ఆశ్చర్యం వేసింది..


అతని అమ్మ గారు గుర్తు వచ్చేరు..చదువు కుంటే..చాల బాగుంటుంది, జీవితం లో పైకి రావచ్చు అని చెప్పేరు..నాకు ఆ ఒక్క మాటే గుర్తు, నన్ను నడిపించింది ఆ మాటే, సరే, ఆవిడ కోడలు అవడమే ఒక వృత్తం పూర్తి అయినట్టు అనిపించింది.


అమర్ సంతోషం తో ఉబ్బి తబ్బిబ్బు అయాడు, నాకు నువ్వంటే చిన్నప్పటి నించి ఇష్టం, నీకు కూడా ఇష్టమేనా? అని ఆశ్చర్యం గా అడిగితే..


అవును..అని ధైర్యం గా అబద్ధం చెప్పేసాను..మీ అమ్మ గారు అంటే, అని మనసులో అనుకుని..


హా అని అరుస్తూ, ఈ కబురు అమ్మకి చెప్పాలి అని గెంతు కుంటూ అమర్ వెళ్లి పోయాక, నేను కూర్చుని, నాతో తెచ్చుకున్న తెల్ల కాగితం మీద ఇలా రాసుకున్నాను.


హు..మధూ, చదువు గొప్ప ఫలితాలు ఇస్తుంది, జీవితం లో పైకి వస్తావు అంటే, ఇదా..అని మీరు అంటారు..కానీ, నాకయితే, ఇలా ఒక మంచి కుటుంబం లో స్థిర పడడం కూడా..ఒక మంచి పరిణామమే..అనిపించింది..అందుకే ఇంకేమి ఆలోచించక ఒప్పేసుకున్నాను, అమర్ కి ఏం తక్కువ? ప్రేమ..అలాంటి వి, పెళ్లి అయాక ,అవే పుడతాయి..


అని ధైర్యం గా మాకు సమాధానం ఇచ్చి పెళ్లి చేసుకుంది మధూ ..


ఇదంతా జరిగి, ముప్ఫై ఏళ్ళు అయింది.


నేను లెక్చరర్ నించి ప్రిన్సిపాల్ అయాను., పెళ్లి మటుకు చేసుకోలేదు, ఎవరూ నచ్చక, తరువాత వయసు వచ్చి, నేను కోరుకున్నా ,నాకు ఎవరూ దొరకక.


జ్యోతీ పెళ్లి చేసుకుంది, బ్యాంకు ఆఫీసర్ కూడా అయింది, అతను ఒక ఆక్సిడెంట్ లో పోయేడు, ఇద్దరు పిల్లల ని చక్కగా పెంచింది.


మధ్యలో , సరిగ్గా చెప్పాలంటే, రెండు దశాబ్దాలు ,మేం కలుసు కోవడం అవనే లేదు,జ్యోతి హైదరాబాద్ లో ఉన్నది ,అని తెలుసు, మధూ, అమర్ తో, బొంబాయి, తరవాత అమెరికా ,వెళ్లిందని తెలిసింది, ఇద్దరు అబ్బయలు. తనకి, ఇలా ,ఏవో అర కొర సంగతులు తెలుస్తూనే ఉన్నాయి.


ఈ మధ్యే ,ఈ ఇంటర్ నెట్ మూలం గా మేం ముగ్గురం కలుసు కున్నాం.జ్యోతి ,కూతురి పెళ్లి కి తప్పకుండా వస్తాను ,అని చెప్పినట్టే మధూ వచ్చింది.


ఈ రోజు మేం ముగ్గురం కలుసుకున్నాం..


మధూ..మధూ ఏనా? లావుగా, నగలు నిండు గా వేసుకుని, పెద్ద పట్టు చీర లో, పెద్ద దాని లా ఉంది.


చేతులు పట్టుకుని అలా ఉండి పోయేం..కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, ముగ్గురికి..మధూ అంది..చదువు ని మీరు సార్ధకం చేసుకున్నారు.
నేను చాల సంతోషం గానే ఉన్నాను, కాని, ఏదో లోటు..ఉద్యోగం చేయడం కుదరలేదు, అమర్ ఉద్యోగ బాధ్యతలు తో ,ఎన్నో దేశాలు తిరిగేం.


మీరు ఇద్దరూ.చక్కగా స్థిర పడ్డారు...నా ఆలోచనే గొప్పది.. చదువే అలంకారం ,అని నిరూపించేరు,నా నగల అలంకారం .దిగదిడుపే..మీరు సాధించిన విజయాల ముందు ,అని మనస్ఫూర్తి గా అభినందించింది..


నువ్వు ప్రేరేపించిన విద్యే..మధూ..అని చేతులు విడవ కుండా పట్టుకున్నాను ..మమ్మల్ని ఈ రోజు ఈ స్థితి లో ఉంచింది..చదువు ఎప్పటికి చెరుపు చేయదే..నువ్వు సంతోషం గా ఉన్నావు కదా, అంతే చాలు..అంటూ కబుర్ల లో పడి పోయేం..ఒక వృత్తం పూర్తి అయింది..జీవిత చక్రం..లో వృత్తాలు అలా చుట్టుకుని పోతూ ఉంటాయి..అని ఆలోచన లతో, ముగ్గురం ..ఒకరి కళ్ళ లోకి ఒకరు చూసుకుంటూ, ఉండిపోయాం.


మధూలిక మా చదువులకి, మా భవిష్యత్తులకి, పునాది. మా చేతులు పట్టుకుని నడిపించిన స్నేహ మూర్తి..మధూలిక ని మేం ఎప్పటికి వదలలెం అనుకుంటూ ఈ క్షణం మరపు రానిది అని ఆస్వాదిస్తూ..మేం త్రిమూర్తులం..ముగ్గురు మరాఠీలమే ..ఎప్పటికి...మరి..అనుకుంటూ కదిలాం..





















2 కామెంట్‌లు:

  1. ఇది కథో వాస్తవమో తెలియదు కానీ నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయండీ...
    చదువు ప్రాముఖ్యత గురించి నా చిన్నప్పుడు నాకు చాలా మంది చెప్పారు......

    కానీ ఒక్క మాటే నా మనసులో నిలిచిపోయింది అదే నన్ను ఇంతవరకూ నడిపించింది

    "చిరిగిన చొక్కా వేసుకో మంచి పుస్తకం కొనుక్కో" అని ఎవరో అన్నారని నాకు ఒకరు చదువు ప్రాముఖ్యత గురించి వివరిస్తూ చెప్పిన మాట ఇది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాధవి,
      అవును, ఇది నిజం కొంత, కల్పన కొంత..చదువు అనే కిటికీ తెరిస్తేనే, ప్రపంచం అనే వీధి కనిపిస్తుంది,
      అని నేను కూడా నమ్ముతాను.
      మధూలిక చదువు విలువ తెలిసి కూడా, ఉద్యోగం కింద..భార్య అని రాసి వెళ్ళడం..
      మన దేశం లో, మన బుర్రలు, మనకి తెలియకుండానే ఇలా కండిషన్ అయిపొతాయో..
      అయినా ,సుఖం గానే గడిచి పోయింది కదా ,ఆమె జీవితం..ఏమిటో ,ఈ కథ ఎలా
      రాసాను అంటే, మనసు ఒకటి చెపితే, వాస్తవం ఒకటి చూసి, రాసిన కథ, ఇది,
      మిమ్మలిని కదిలించినందుకు..నాకు కళ్ళు చెమర్చాయి..సంతోషం తో..
      వసంతం.

      తొలగించండి