"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

1 ఏప్రి, 2012

శ్రీ రామ నవమి అంటే ...

మా ఏలూరు విజయ విహార్ సెంటర్ లో జరుపుకున్న శ్రీ రామ నవమి ..పండగ గుర్తు రాగానే, క్షత్రి భవాన్ సింగ్ రోడ్, నుండి , గ్లాసులు పట్టుకుని పరుగులు పెట్టడం గుర్తు వస్తుంది.
పానకం కోసం గ్లాసులు ఒకటో, రెండో, చేతులో పట్టుకుని, మా ఇంటి నించి ఆరుగురు పిల్లలం ,పరుగులే పరుగులు. ఒకసారి కాదు, మరో సారి, మరో సారి.
మూతులు తుడుచు కుంటూ, చేతిలో వడ పప్పు నాక్కుంటూ..
కమ్మని ఆ బాల్యం ఎంత తీపి?
ఎంతో రుచి, ఎంతో రుచి రా..
నీ నామం ఎంతో రుచి రా..
అని ఆ భక్త హనుమాన్ పాడినట్టు..బాల్యం ఎంత రుచి ..
చల చల్లని పందిర్లు ,వేసే వారు తాటాకులతో, ఆహా ..ఆ సువాసన ఎంత 
బాగుంటుంది? ఇంకా కొబ్బరి ఆకులు తెచ్చి, రాటలు కి కట్టేవారు. మేం పిల్లలం ,ఒక్కో ఆకూ పీకి, దానితో పి పీ అని ఊదుతూ, బూరలు తయారు చేయడం..
అదేదో, మా ఇంట్లో పెళ్లి లాగే, మాకు ఉన్న ట్రంకు పెట్టె తెరిచి, బట్టలు అన్ని చిందర వందర ,చేసి, అమ్మా..మొన్న సంక్రాంతి పండక్కి కొన్న కొత్త పరికిణి వేసుకున్తున్నానో, అని ఓ అరుపు అరిచి, మూడు నెలలకే పొట్టి అయిపోయిన ఆ పరికిణి ,ని కిందికి లాక్కుంటూ, అమ్మా, ఈ  ఫిల్టు లు 
తీయించాలి అమ్మా,అంటే..అదేమిటే, మొన్నే కదా కుట్టిన్చాం, ఇంతలోనే పొట్టి అయిపోయిందా?? మరీ చోద్యం..
అదేమిటో బట్టలు ఎప్పుడూ ,వాటంతట అవే పొట్టి అయిపోతూ ఉంటాయి....పాపం..ఆ నిముషానికి అవి, ప్రాణం పోసుకున్నట్టు..మనం పొడుగు అయ్యాం..అని ఎవ్వరూ అనరు, ఎందుకనో??
ఇందులో ఒక ఉప కథ..మా టైలోర్ దగ్గరికి వెళ్లి ,ఎంటాబ్బాయ్ ..ఇలా టైట్ గా కుట్టేసావు? ఆది ఇచ్చాను కదా అంటే, సరే, చూడండి ..అని 
కొలతలు ,ఆది కి తగ్గట్టు మచ్చు కి మచ్చు ఉండడం తో, ఏమిటో? వింత..ఈ జాకెట్టు ఇలా ,ముడుచు కు పోయింది అని బట్ట ని తిట్టడమే తప్ప, మన మారిన..అదేనండి, లావు అయిన విషయం..మటుకు చచ్చినా ఒప్పుకోక పోవడానికి కారణం..అదిగో..చిన్నప్పుడు ..పరికిణి పొట్టి అయిపొయింది..తో మొదలు అనుకుంటాను.
పరీక్షలు ఒక పక్క ముంచుకు వస్తూ ఉండేవి, ఇప్పటిలాగా కాదు, అప్పుడు ఏప్రిల్ లోనే పరీక్షలు, మే ,జూన్ ,రెండు నెలలు వేసవి సెలవులు.
ఇంట్లో వంట చేసుకుంటూ అమ్మ, ఈ పిల్ల పిశాచాలు ,మరీ ముద్దు ఎక్కువయితే, ఎక్కడ ఉన్నారో? అని వీధి లోకి ఓసారి , తొంగి చూసి, మళ్లీ పప్పు మాడి పోతోంది, అని లోపలి పరుగు పెట్టడం..
మేం రోజంతా మకాం అక్కడే, చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి ప్రతిష్టంచడం, వాటికీ అలంకారం చేయడం, ఆ వీధి లో ఉండే వాళ్ళం అంతా,అక్కడే, అబ్బాయిలు దొంగ పోలీసు ఆటలు, అమ్మాయిలు నాలుగు స్తంభాలాటలు, ఆడుకుంటూ ,పోలో మని అల్లరి చేస్తూంటే, అప్పటి కప్పుడు పెద్దలయిన కుర్రాళ్ళు పొండి, పొండి, అల్లరి మరీ మితి మీరి పోయింది అంటే..మేం 
అలాగే..ప్రసాదాలు ఇచ్చేయండి ..అని ముక్త కంఠం తో అరిస్తే..
ఊ ..ఎంతెంత ఇచ్చరేం చందాలు?
అని విసుర్లు, పోనీ లెండి, తప్పు, రా..ఇదిగో అమ్మాయిలూ ,ఈ పప్పు, బెల్లం తీసుకోండి అంటే..
ఉక్రోషం తో..పరుగు ..పరుగు న వెళ్లి, అమ్మా ఓ అర్ధ రూపాయి ఇవ్వవే ,అని ఊడ పెరుక్కుని, ఇగోండి..మా చెందా.అని గర్వం గా ,హుండీ లాంటి ..తెల్ల కాగితం కట్టిన డబ్బా హుండీ లో వేసి, ఊ  ..పెట్టండి, ప్రసాదం..అని హక్కు గా అడిగి మరీ, బాదం ఆకులో పెట్టిన పొంగలో, లేదా..పెసర పప్పు ,కొబ్బరి ముక్కలు , కలిపినా వడ పప్పో, వేసుకుని, మరీ ,మరీ, పరుగులు తీసి, అమ్మా ..ఆకలే అన్నం పెట్టు ..అనే వాళ్ళం..హ్మం..రాళ్ళు కరిగించుకునే 
రోజులు కదా ..బాల్యం..అంటే..
బందా కనక లింగేస్వర్రావు గారు అని గొప్ప కూచిపూడి కళాకారుడు ..మా ఏలూరు వారే, అతని నాట్యం..ఇంకా స్థానం గారి నాట్య  ప్రదర్సన, నాటకాలు, ఒక రోజు చింతామణి నాటకం ఉండేది, ఆ రోజు పిల్లలని ఇంట్లో ఏదో ఒంకన అట్టే పెట్టేసి, పెద్దలు వెళ్లి పోయేవారు, మా తమ్ముడు మటుకు వెంట పడే వాడు, మేం అందరం పడుకున్నాక, అని మాకు పొద్దున్నే తెలిసేది..
అవి అంతా గొప్ప వారి ప్రదర్శనల ని మాకు ,అప్పట్లో తెలియదు. శ్రీ రామ నవమి పండగ , అన గానే, ఓ పాంఫ్లెట్ వేసే వారు, అందులో తొమ్మిది రోజుల పూజ విశేషాలు, రాత్రి ,జరిగే వినోదాల విశేషాలు ఉండేవి, అవి చూపించే, చందాలు వసూలు చేసే వారు, రోజు కి ఒక వర్తక దంపతులో, లేదా ఆ వీధి స్థితి మంతులయిన మరో దంపుతులో కూర్చుని కల్యాణం చేసే వారు.
పందిరి కి రాట, వేయడం దగ్గర నించి, చూసే వాళ్ళం..
ఎప్పుడూ ,ఏవి పని లేకుండా తిరిగే ,కుర్రాళ్ళు కి ఇంకా హుషారు, ఓ గ్రామ ఫోన్ సెట్ అద్దెకి తెచ్చి, పొద్దున్నే నమో వెంకటేశా తో మొదలు పెట్టి, ఇంకా లవ కుశ  పాటలు, రామదాసు సినిమాలో పాటలు..వేసిందే వేయడం..
పెద్ద పరీక్షలికి చదువుకునే అక్క లు, అన్నయ్యలు, అబ్బ బ్బ.. ఏమిటి హోరు, అని విసుక్కుంటే, మేం మటుకు, పాటలు బట్టి పట్టి, నేర్చేసు కునే వాళ్ళం, లవ కుశ  లో అంతా పెద్ద పాత నోటి కి వచ్చేసేది..ఆ తొమ్మిది రోజుల్లో..
కొంత మంది , హుషారు ఎక్కువై, భక్తి పాటల మాటున ..కొన్ని హుషారు యుగళ గీతాలు కలి పేయాలని..ప్రయత్నిస్తే, ...హ్మ్మం..పెద్దలు..
ఆపండిరా ..రామ నవమి ఇది..అని హుంకరించి, వారి హుషారు మీద నీళ్ళు జల్లే వాళ్ళు.
ఇదే పెద్దలు, ఒక్క రోజు రాత్రి మటుకు ,వేసే రికార్డ్ డాన్సులు కి మటుకు తలలు ఊపుకుంటూ కూర్చుంటార ని ..ఎవరో అంటే విన్నట్టు గుర్తు.
అప్పుడు అలాగే ఉండేది, ఇలా ఆడు కుంటున్నట్టే ఉండడం..మధ్యలో ఓ చెవి అటు పడేసి, పెద్దల మాటలు వినేయడం..పూర్తి గా అర్ధం కాక పోయినా, అదేదో, ఒక పెద్ద విషయం అని మటుకు అర్ధం అయేది.
ఎందుకో మరీ, పెద్ద వాళ్ళం అయి పోవాలని ,తెలియని ఒక తొందర..!!!
ఊరు వాళ్ళందరూ కలవడం, పనులు పంచుకోవడం, భక్తి భావాలూ పెంచుకుంటూ, కళ్యాణాలు చేయించడం, రాత్రి కి వినోదాలు, తొమ్మిది రోజుల కార్యక్రమాలు విజయ వంతం  గా చేయించడం..ఇవన్ని మరీ, జీవితానికి పునాదులగా..వేసుకున్న గట్టి రాళ్ళు.
కాలమే మారిందో, మనుషులే మారారో? మాట ఒక్కటై ,నడిచే ఈ ఉత్సవాల లో మాట పట్టింపులు, అంతస్తులు తారతమ్యాలు, డబ్బు లెక్కలు, పంచు కోవడాలు, చిల్లర లెక్కలు..చిల్లర బుద్ధులు..అవి ఎక్కువై,కళ్యాణం తో మనుషులు కలవడం పోయి, గొడవలు పెరిగి పోయాయని ,ఎవరికీ వారే పెద్దలై పోయి, అంతా శ్రీరాముని కళ్యాణం మాటే మరిచి పోయారని..
వింటూ, కంటూ ఉంటే..చాల బాధ గా ఉంటుంది.
సమిష్టి గా చేసే పనులలో హాయే మరిచి పోయారా?
ఎవరికీ వారే, వారిదే సరి అయిన నిర్ణయం అనుకుంటే, ఇంక లోక కల్యాణం ఎక్కడ మిగిలింది?
రాముడా? ఇంకా నీ కళ్యాణం భద్రాచలం లో చేస్తున్నారంటే ..అంతా..ఆ భక్త రామదాసు గొప్పతనమే కదా??
ప్రభుత్వాలు ,మారినా మిల మిల లాడే ముత్యాల తలంబ్రాలు వస్తున్నాయి, పట్టు వస్త్రాలు వస్తున్నాయి..తానీషా అంతటి ప్రభువే , మొదలు పెట్టిన ఆచారం అని నమ్మే కదా? 
శ్రీ రామ నవమి అంటే మనకి మటుకు వడ పప్పు, పానకం..నాకు మటుకు, విజ విహార, సెంటర్ ,ఏలూరు లో తాగిన గ్లాస్సులు..గ్లాస్సుల పానకం, సమిష్టి కృషి లోని సంతోష హేల...అమాయక, నిష్పూచి బాల్యం..



















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి