"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

13 సెప్టెం, 2011

వలస పక్షులు


రమేష్ తన సీట్ నంబరు చూసుకుని కూర్చోబోతున్నాడు. 
"బాబయా ! చూడండి,ఇదీ నేను ఎక్కడ కూర్చోవాలో ?," అంటూ ఓ కంఠం వినిపించింది. వెనక్కి తిరిగాడు. ఒక నడివయసు స్త్రీ ,ఒక మూట లాంటి సంచి పట్టుకుని తన వెనకే నిలుచుని ఉంది.


అమ్మో, తన ప్రక్కనే ఈవిడ, లోపల కిటికీ సీటు కూడా, తను ఆ ప్రక్కనే కూర్చోవాలి, మధ్య సీటులో ఇరుకుగా , కొద్దిగా అసహనంగా అనిపించింది. తప్పదు కదా ..
"ఇక్కడే." అని తెలుగులో చెప్పగానే ఆవిడ మొహం వికసించింది.


హమ్మయ్య అన్నట్టు నిట్టూర్చి ," ఈ సంచి కాస్త పై అరలో పెట్టండి బాబయా ! "
తప్పుతుందా అన్నట్టు చేతిలోకి తీసుకుని తన విలువయిన లాప్ టాప్ సంచి.. ఛ..ఛ అదే బాగ్ ప్రక్కనే పెట్టాడు. ఈ సంచి కూడా.
హైదరాబాద్ నుంచి కువైట్ వెళ్ళే విమానం అది.గల్ఫ్ కి వెళ్ళే డైరెక్ట్ విమానం అది.రమేష్ ఆవిడకి లోపల సీటు చూపించి ,తనూ ప్రక్కనే కూర్చున్నాడు. తెలుగు వాళ్ళే అని తెలియడంతో ఆవిడ ఇంకాస్త చనువుగా మాట్లాడుతుంది కాబోలు.అసలే ,తను తన చికాకులో తను ఉన్నాడు.


"మొదటి సారి బాబయా! ఈ విమానం ఎక్కడం, ఇలా మా ఊరు వదిలి వెళ్ళడం కూడా.." అదిగో అప్పుడే మొదలుపెట్టింది ఈవిడ..అనుకుంటూ రమేష్ లోలోపల విసుక్కున్నాడు
పావుగంటలో అందరూ ఎక్కి,సర్దుకోవడం అయింది. ఎయిర్ హోస్టెస్ టపటప మని పైన అరల తలుపులు మూసాక , ఎదురుగా  ఉన్న చిన్న టీవి తెఱ మీద ఇంకొక ఆవిడ వచ్చి బెల్ట్ పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు    చెప్పడం  మొదలు పెట్టింది. "ఏంటయా? ఏం చెపుతోంది పిల్ల ? ఆ టీ వి లో ?" అని ప్రక్కనుంచి ప్రశ్న ,అమాయకం గా.


బాబోయ్ ఇదేదో నా సహనానికి పరీక్షే అనుకుని మనసులో ,పైకి మటుకు ఓపిక గా కనిపిస్తూ, ఆవిడకి మళ్లీ తెలుగు లో చెప్పాడు.తలుపులు మూసి,నెమ్మదిగా విమానం కదలడం మొదలు అయింది.


అమ్మోయ్ కదులుతోంది !! అని చిన్న కేక పెట్టి, కిటికీ లోంచి చూస్తూ ,"అమ్మాయ్! జాగ్రత్త అమ్మా! చంటాడు జాగ్రత్త ,"అంటూ పైట తో కళ్ళు తుడుచుకుంటూ చేతులూపుతోంది.


రమేష్ ఈసారి ఎటో చూస్తూ ,ఈవిడ నా ప్రక్కనే కూర్చోవాలా?అని నిట్టూరుస్తూ ,ఒక్కసారి శోభ ,పిల్లలని తలుచోకోగానే ,అనుకోకుండా ,అతని కళ్ళూ చెమర్చాయి.


ఈ ఫ్లైట్ బయలు దేరే సమయం ,మరీ అటూ ఇటూ కాని అపరాత్రి సమయం ,మళ్లీ ఒక్కరే వెనక్కి వెళ్ళాలి ,చంటి వాడు బబ్లూ లేచి ఏడుపు మొదలు పెడితే ,ఈ శంషాబాద్ అంతా మారు మోగుతుంది. వాడు మరీ నాన్న కూచి. నన్ను వదలడు ఒక్క నిముషం కూడా,ఇంట్లో ఉన్న కాస్సేపు.


తనే రావద్దు అన్నాడు. వాళ్ళని ఎయిర్ పోర్ట్ కి. శోభ వస్తాననే అంది, పిల్లలని ఇంట్లో వదిలి పెట్టి, కానీ తను ఒప్పుకోలేదు.


ఈ రోజు నుంచి శోభ ఒక్కర్తి అన్నీ తానై చూసుకోవాలి. అమ్మాయి స్వాతి నాలుగో తరగతి చదువుతోంది, బబ్లూ అంటే సౌరభ్ మరీ చిన్న వాడు,మూడో ఏడు నడుస్తోంది. వీళ్ళని వదిలి, తను కూడా మొదటిసారి గల్ఫ్ వెళుతున్నాడు.


శోభ కి అస్సలు ఇష్థం లేదు, కానీ తనే ఒప్పించాడు.నాకు వచ్చే లక్ష రూపాయల జీతం తో ఎప్పటికి మా ఇంటి మీదున్న అప్పు తీరేనూ,అమ్మో ఇంకా ఎంత ఖర్చుందో ముందు ముందు.


పిల్లల స్కూలు ఫీసు వేలల్లో,ఇంటి మీద అప్పు, అదే మూడు బెడ్ రూం ల ఫ్లాట్ తెసుకున్నాం, అది తడిసి మోపడై నలభై లక్షలయింది. నెల నెలా ముప్ఫై వేలు, కట్టాలి,బ్యాంకు కి.మనం తిన్నా తినక పోయినా,ఇది కాక కారు మీద అప్పు,ఇంకా ఆరు నెలలు కట్టాలి.


ఏంటో ఉద్యోగం వచ్చినపుడు లక్ష రూపాయల జీతం అంటే ఏమిటో అనుకున్నాను, చాల పెద్ద జీతం అని. పెళ్లి అయింది.పిల్లలు పుట్టారు, ఇద్దరు ..జీతం పెరిగింది, ఈ పది ఏళ్ళల్లో, ఖర్చు కూడా అలాగే పెరిగింది. కట్టింగ్ లు పోను, చేతికి వచ్చే జీతం తో గడవడం ఎంత కష్టం గా ఉందో?


కంపెనీ లో అందరూ గల్ఫ్ కి వెళ్ళిపోతున్నారు ,ఆఖరికి తను కూడా అందరి మార్గం పట్టాడు. జీతం రెండున్నర లక్షలు,కానీ పన్నుల బాధ లేదు, తను వీలైనంత త్వరగా ఇంటి మీద అప్పు తీర్చేసి, వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ,ఈ లోపల శోభ ,పిల్లలు ఒక్కరూ ఉండాలి.

చూడాలి,అంతా బాగుంటే వాళ్ళనే అక్కడికి రమ్మన వచ్చు, కానీ ఎంతో ముచ్చట పడి కట్టుకున్న ఫ్లాట్, అద్దె కి ఇచ్చేయడమా? అమ్మో ! మనం అనుభవించకుండా ఎవరో ,ఆ ఇంట్లో ఉండడమా?


ఏదో అద్దె యింట్లో ఉన్నా సరి పోయేది, ఇప్పుడు ఈ ఇంటి కోసం, ఇంటినీ, ఇల్లాలు ని, పిల్లలని వదిలి ,ఇలా దేశం వదిలి వెళ్ళాల్సి వస్తోంది, వెంట పడి అప్పులిచ్చిన బ్యాంకు లని తిట్టుకున్నాడు కాసేపు.
ఏమిటో అంతా చికాకు గా ఉంది.
"బాబయా"!ప్రక్కన ఆవిడ పలకరింపు. ఈసారి విసుగు మొహం మీద కనిపించేలా చూసాడు, అటు.
అటు చూసే సరికి, ఆవిడ కళ్ళ లోంచి నీళ్ళు కారిపోతున్నాయి.
"బాబయా, నేను వెళ్ళ లేను, నా వల్ల కాదు, నా మనవడు నన్ను వదిలి పెట్టి ఉండలేదు," అంటూ ఏడుస్తోంది
నాకు కొంచం జాలి వేసింది, " ఏడవకండి" అన్నాడు. ఇంకేం మాట్లాడాలో అర్ధం కాలేదు.
ఆడవాళ్ళు ఇంత ఫ్రీ గా ఎలా ఏడుస్తారో? అని లోపల కొంచం అసూయగా ..అనుకున్నాడు.నేను అలా ఏడవలేను కదా బయటకి..

కళ్ళు తుడుచుకుంటూ ఆవిడ," బాబయా! మాది తణుకు దగ్గర చిన్న పల్లెటూరు, హై వే రోడ్డు మీద టిఫినీ దుకాణం అదే ఓటలు నడిపే వాళ్ళం, రోజుకీ అయిదారు వందలు మిగివేవి, ఖరుసు పోను..మా ఆయనకి తాగుడు మాప్పేరు, ఊరులో ఆసామీలు , కుల్లుబోతోల్లు ,కొత్త ఓటలు వచ్చి ,బిగినేస్స్ పడిపోయింది, అలవాట్లు మటుకు మిగిలేయి. నష్టాల్లో ఓటలు మూత పడింది.
పదారేల్లకే కూతురి పెళ్లి సేసాం, అల్లుడు కి కూలి పని,పట్నం లో,ఆడికీ ఒళ్ళు బలిసి ,మందు కి అలవాటు పడ్డాడు. మావా అల్లుళ్ళు కల్సి ఇద్దరూ తాగడ, తన్దనాలాడ్డం ,ఒళ్ళు గుల్ల చేసుకుంటే ,బాగు చేయించాను. ఆసుపత్రి కి తీసుకెళ్ళి, మనవడు కూడా పుట్టేసాడు.


మా తోటికోడలు గల్ఫ్ కి పనికత్తె గా వెళ్ళి ,డబ్బు పంపిస్తోంది.ఇక్కడి మొగోల్లకి ఇంక మా ఆయన ,అల్లుడు, నన్ను కూడా వెళ్ళమని పోరు మొదలు పెట్టారు. మా ఆయన సుస్తీకి ,ఆసుపత్రి ఖరుసుకి, అప్పు చేసాం..భూవి, పుట్రా, ఏమి మిగల్లేదు, ఈ మగోల్లు సరిగ్గా ఉంటే, సక్కగా మేం తల్లీ కూతుళ్ళు ,ఎలాగో ఆలాగు బతికేస్తాం, ఈ అప్పు తీర్చాల, నా టికెట్ తీయడానికి , ఖరుసు ఇంకో లచ్చ అయింది..


ఈ అప్పులన్నీ నేను తీర్చాల ఉప్పుడు. పిల్ల ఇంకా సిన్నది, మనవడు ఇంకా తల్లీ కొంగు వదలడు. అందర్నీ వదిలి, నేను ఇలా ఎలుతున్నాను, ఏమిటో ఈ బతుకులు? బాబయా??"

అంటూ కన్నీళ్ళతో తన కథ అంతా నాలుగు ముక్కల్లో చెప్పింది ఆమె.

నా గొంతు లో ఏదో అడ్డం పడింది. రెండు లక్షల అప్పు తెర్చడానికి ఆవిడ, రెండు లక్షల జీతం ఇస్తున్న ఉద్యోగం వదిలి నేను, ఈ దూర దేశాలకి బయలు దేరాం..బహుదూరపు బాటసారులం.


సహచరులే లేని ఒంటరి ప్రయాణం.


వలస పక్షులు కూడా ఏవో దూర తీరాల్ నుండి, అనుకూల వాతావరణం వెతుకుతూ వలస వస్తాయి, కానీ తిరిగి వెళ్ళిపోతాయి అవి, కాలం అనుకూలించ గానే..


కానీ మేమో??ఎప్పటికైనా వెళ్లగలమా?
స్టాప్..స్టాప్..వెనక్కి తిప్పండి.. ఈ ఫ్లైట్ ..నా శోభ,నా పిల్లల దగ్గరకి వెళ్ళాలి నేను .. అని అరవాలని ఉంది.
విమానం రెక్కలు విప్పుకుని, ఆకాశంలో ఎత్తుకి ఎగురుతూ, మబ్బుల్లోకి మాయమయింది.











.












4 సెప్టెం, 2011

మా ఇంట్లో వినాయక చవతి ..పండుగ

టి .వి లలో ఇదిగో వచ్చింది వినాయక చవతి ,అదిగో వచ్చేస్తోంది అని కౌంట్ డౌన్ చేస్తూ, పర్యావరణ కి హాని కలిగించని విగ్రహాలు ఎలా తయారు చేయాలో అని వివరిస్తూ, పిల్లలు కూడా సులువు గా తయారు చేయుచ్చు గా ..ఈ దేవుడు బొమ్మలని.ఒక పెద్ద పొట్ట, రెండు పెద్ద చెవులు,ఒక్కటే ఒక్క దంతం, నవ్వు పుట్టించేలా ఒక ముఖం ,ఒక మట్టి ముద్ద తో నైన చేయ వచ్చు. నాకు చిన్నప్పటి పాల వెల్లి,వేలాడ దీసిన మొక్క జొన్న కండెలు, వెలగ పండులు, బత్తాయి పండులు, అన్నీ గుర్తు వచ్చాయి. ఇక్కడ ఈ దేశం లో అవేమీ దొరకవు కదా...
ఈ రోజే ..వినాయక చవతి వచ్చేసింది. రాత్రి అనుకుంటూనే పడు కున్నాను..కాని,లేచే సరికి ఉదయం..ఏడు.
అవును..ఏడు గంటలయింది....

పండుగ రోజు కూడా ఇలాగేనా?? అనే అంతరాత్మ వాయిస్ ఓవర్ ను,ఒక్క మాట లైట్ తీసుకో అనే హైదరాబాదీ స్టైల్ లో పక్కకి పెట్టి, అన్నీ పనులు ఫాస్ట్ ఫార్వర్డ్ లో ..నాలుగు స్టవ్ ల మీద నాలుగు గిన్నెలు, మూకుడ్లు పడేసి, కూకెర్ విసెల్, గ్రయ్దర్ బర్ర్ మనే శబ్దాల మధ్య నేను గిర గిర తిరుగుతూ, ఒక పాయసం, (తెల్లనిది),ఒక పులిహోర,(పసుపు రంగు), ఒక ఉండ్రాళ్ళ నైవేద్యం, రెండు రకాలు అందులో, కొబ్బరి ,బెల్లం పాకం తో కూరింది ఒకటి, అవి లేని, మామూలు ఉండ్రాళ్ళు, ఒక టమాటో పచ్చడి, అన్నం..ఇవి చేసి, మరో పక్క దేవుడి గది లో ...
తమల పాకులు దొరకవు, పాల వెల్లి లేదు, పర్యావరణం కి హాని చేసే, చేయని విగ్రహాలు కూడా లేవు, ఇష్తం గా కొనుక్కున్న కొన్ని లేపాక్షి వినాయకుడి బొమ్మలు ఉన్నాయి.

విఘ్నం కలగకుండా చేసే పూజ కి ఇవి విఘ్నాలు కాదు కదా..లైట్ తీసుకో..బాక్ గ్రౌండ్ లో..అను కుంటూ,ఒక ఆకు పచ్చ పళ్ళెం లో, చిన్న పసుపు వినాయకుడి ని చేసి, పొద్దున్నే తెప్పించిన పువ్వులు,పత్రీ,ఇవి మటుకు దొరికాయి, మదీనా జిందాబాద్..ప్రమిదలు లో నూనె పోసి, వత్తులు వేసి, అరటి పళ్ళు దగ్గర పెట్టుకుని, వినాయకుడి బొమ్మలు చుట్టూ పువ్వులు అలంకరించి, ఇంకా ఏమిటి ఆలస్యం,ఉండ్రాళ్ళు ఎప్పుడు నైవేద్యం పెడతారు అనే వినాయకుడు ని మరి విసిగించ కుండా, మొదలు పెట్టాం పూజ.

ఎన్ని రకాలు గా వర్ణించారో,ఈ గణాధిపతి ని అను కుంటూ,చందన వాళ్ళు ఇచ్చిన పూజ పుస్తకం చదువుతూ ఉంటె,ఈ పేర్లు కనిపించాయి..మాచి పత్రం,బృహతి పత్రం,బిల్వ పత్రం,దూర్వ యుగ్మం,తులసి పత్రం,చూత పత్రం,కర వీర పత్రం,విష్ణు క్రాంత పత్రం, దాడిమి పత్రం,దేవదారు పత్రం, మరువక పత్రం,సింధు వార పత్రం,జాతి పత్రం,గండకి పత్రం,సామీ పత్రం,అశ్వత పత్రం,అర్జున పత్రం,అర్క పత్రం ...పూజ యామి..అంటూ..
అంటే,ఈ గజ కర్ణ యనుడు కి ఎంత పర్యావరణ స్పృహ ఉండేదో..అనుకున్నాం.

ఈ పత్రాలు,ఈ మొక్కలు,ఈ చెట్లు, వాటిని ఆశ్రయించి బతికే, మృగాలు, పక్షులు,పిపీలకాలు, ఈ వనం ని నమ్ముకున్న వానరులు,నరులు, ఆకులూ అలములకి జీవం అందించే మేఘాలు, శ్రవణం,భద్రపదాలు అంటే వర్షాలే కదా, అంతా సవ్యం గా, పర్యావరణం సమ తుల్యం గా ఉన్నట్టే కదా.

ఒక గజం ముఖం తో, ఒక మూషికం వాహనం గా , మనకి వనం కి,అదే అడవి కి ఉన్న సంబంధం ని ఎత్తి చెపుతున్నట్టు లేదూ.ఇంత మెసేజ్ ని అందించే ..చిన్ని గణేశ ను పూజించు కుంటే..
కొంచం జ్ఞానం సంపాదించినట్టు, ఒక వెలుగు మొహం లో.అది హారతి ఇచ్చన కర్పూరం వెలుగే..
కథ చదివే వరకూ, బుద్ధిగా ఉన్న మనసు, మూడు ప్రదక్షణ లు పూర్తీ చేసే సరికి, ప్రసాదం మీదికి వెళ్ళి పోయింది.

కొబ్బరి కాయ ఫ్రిజ్ లో ఉందని, ఇంకా పుస్తకం లో రాసిన పూజ సామగ్రి, అన్నిసమ కూర్చు కో లేదని ,దీపం లో నెయ్యి వేయాలని, ఇలాగ చాల గుర్తు వచ్చాయి...

ఈ సారికి, ఈ తప్పులు మన్నించమని, లెంపలు గట్టిగ వేసుకుని, మళ్లీ వచ్చే సంవత్సరం చక్కగా చేస్తాను పూజ,అనుకుంటూ,అయినా..పర్యావరణం సమ తుల్యం గా ఉండేలా చూసుకుంటే ..అంత కన్నా గొప్ప పూజ ఉంటుందా??

ఒక పని ప్రారంభించే ముందు , మనసులో ఒక ఉద్విగ్నత ,ఒక సందేహం, ఒక బెదురూ దట్టని మేఘాలు లాగ కమ్ము కుంటాయి, అవిఘ్నం కలిగించ కూడదని ఒక మూర్తి ని మనసులో ప్రతిష్టించు కుంటాం.
కోరుకుంటాం, అదే ఈ పూజ..

ఈ సారికి మా ఇంట్లో వినాయక చవతి పండుగ కబుర్లు..కథ ఇది..

27 ఆగ, 2011

నిద్ర పోతున్న వారిని లేప గలం,నిద్ర నటిస్తున్న వాళ్ళని ???

          నా స్నేహితురాలు రమణి తన ఇంట్లో, సాయంత్రాలు, ఒక చిన్న బడి నడుపుతోంది, తన మాటల్లో, ఏడో తరగతి చదువుతున్న అమ్మాయి, తెలుగు అక్షరాలు కూడా రాయలేక పోతోంది, చదవ లేక పోతోంది. ఏడో తరగతి, మన పిల్లలు ఈపాటికి ఐ ఐ టి  కాన్సెప్ట్ కోచింగ్ అంటూ డిగ్రీ వారు చదివే పుస్తకాలు చదివి పడేస్తూంటారు.

ఎక్కడ ఉంది తేడా? అంతరం?? వారు చదివేది ప్రభుత్వ బడులలో, మన పిల్లలు చదివేది, వేలకి వేలు కట్టే ప్రైవేటు స్కూళ్ళ లో ప్రభుత్వ బడులని నిర్వీర్య పరిచే ప్రైవేటు స్కూల్స్ కి ఎడపెడా గుర్తింపు లు మంజూరు చేస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయులను అనేక ఇతర పనులకు ఉపయోగించుకుంటూ, కనీస అవసరాలు అయిన ఒక బోర్డు, ఒక టెక్స్ట్ బుక్,   మంచి నీరు కుళాయి, ఒక మరుగు సౌకర్యం, ఆడపిల్లలకి వేరుగా, ఇంకా ఒక మధ్యాన్న భోజనం, ఒక చక్కని చదువు వాతావరణం, ఇవేమీ ఉండవు. ఆకలి తో వస్తారు పిల్లలు, గోల గోల గా అరుపులు కేకలు, టీచరు  ఉంటే ఉంటారు, లేక పోతే లేదు..ఇలాంటి పరిస్థితి లలో చదువు ప్రాముఖ్యం అంతంత మాత్రమే!
ప్రభుత్వ బడులు ని బాగుపరచడం తక్షణ కర్తవ్యమ్ కాగా, పిల్లలని ప్రైవేటు బడులలోకి పంపడమే, ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు రిక్షా లాగే కార్మికుడు కూడా అప్పు చేసి అయినా ప్రైవేటు బడి లోనే తన పిల్లలని పంపుతున్నాడు. నాలుగు అక్షరాలూ అయిన వస్తాయి అని, తన లాగ కష్టపడ కూడదు అని.

ఏవో పథకాలు పేరు చెప్పి (ఏదో ఒకటి కాదు లెండి, ఒక్క పేరే) కొన్ని ప్రైవేటు వ్యక్తుల ఖజానా నింపడమే ధ్యేయం గా ఫీజు రీమ్బుర్సేమేంట్ అనే ఒక స్కీం మంజూరు అయింది. దాని వల్ల పేద పిల్లలు కూడా చదువు కోగలరు అని అంటున్నారు. కాని, అసలు పునాది లేకుండా భవనం కట్టినట్టు, అక్షరం ముక్క రాకపోయినా పెద్ద చదువులు ఎలా చదువు తారు? ప్రభుత్వ బడులు ని మెరుగు పరిచి, ఉపాధ్య్యయులకు   ప్రోత్సహాకాలు  ఇచ్చి, పిల్లలకి,  పోషకాలుతో కూడిన మధ్యాన్నభోజనాలుపెట్టించి, ఉపాధ్యాయుల్ని బాధ్యులని చేస్తూ , మార్గ దర్శకాలు రచించి, ప్రాధమిక విద్య కి 
అత్యంత ప్రాముఖ్యత  ఇస్తూ , ఎన్నో ఎన్నెన్నో చేయాలి.
నిర్భంద ప్రాధమిక విద్య అనే చట్టం వచ్చింది..ట..మనకి సరిపడా ఉపాధాయులు ఉన్నారా ? అసలు??
ఉన్న బడులని మూసేయకుండా వాటిని చక్కగా నడిపిస్తే చాలు.
మన ప్రభుత్వాలు ఈ విషయాలు తెలియకా??
అందుకే అన్నాను,నిద్ర పోతున్న వారిని లేప గలం,నిద్ర నటిస్తున్న వాళ్ళని లేప గలమా??
ప్రాధమిక విద్య అందరి ప్రాధమిక హక్కు..నేటి బాలలే, రేపటి పౌరులు అని ఊరికినే నినదించడం కాదు, అందు కోసం..నాలుగు అడుగులు ముందుకు వేయాలి,ముందు ఒక్క అడుగు తో మొదలు పెట్టాలి.
వీధి, వీధి కి ఒక సార దుకాణం కాదు ఒక బడి కావాలి.
ఆడుతూ, పాడుతూ,పిల్లలు చదువు ని ఆనందం గా ఆస్వాదించాలి.
చదువు అంటే మార్కులు కాదు, చదువే..అని నమ్మే బడులు..రావాలి.
చదువు కే ఓటు అన్న వారికే నా వోట్ ..
చదువు పిల్లల ప్రాధమిక హాక్కు..కలిసి సాధించుదాం.కదలి రండి. ఇది నా శత బ్లాగ్ టపా.లో విన్నపం.
రమణి..నా స్నేహితురాలి కి ఇది అంకితం,మాటల్లో కాదు ,చేతల్లో చూపిస్తున్న నా స్నేహితురాలు. 

25 ఆగ, 2011

కాగితం మీద కాకుండా ,నిజం గా అబివృద్ధి చెందిన దేశం

నిన్నే ఒక వార్త చదివాను, గల్ఫ్ లో పని చేసే వారికి , వారిని ప్రలోభ పరిచి, బ్యాంకు లు, వారికి  క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారుట..ఇంక వాళ్ళు ఆ కార్డులు తో విపరీతం గా ఖర్చు పెడుతూ, స్వదేశం లో ఉన్న పిల్లల చదువులకూ , వారికి చక్కని భవిష్యత్తు ఇవ్వాలని, వారికి వేలు ,లక్షలూ పంపిస్తూ, చివరకు వారు ఇక్కడ జైలు పాలు అవుతున్నారుట..ఏవేవో ఆశలు తో, కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి తప్పించాలని, కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయాలని, లేదా కుటుంబ పెద్ద అనారోగ్యానికి అయే అప్పులు తీర్చడం కోసమో, ఆడ వారే ఇక్కడకి రావడం ఎక్కువ అయిపొయింది.

నేను చదివిన వార్త ఫిలిప్పీన్స్ దేశాస్తులకి సంబంధించినది. మన దేశం కి కూడా ఇది వర్తిస్తుంది. మన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ,ఇలాంటి ఎందఱో స్త్రీలు కనిపిస్తారు. ఇమ్మిగ్రేషన్ ఫోరం నింపమని అడుగు తారు. కనీసం సంతకం కూడా పెట్ట లేని వారు, ఇక్కడికి ఏ పని చేయడానికి వస్తారో ఊహించ వచ్చు..
ఇక్కడ దేశస్తులకు, వారి ఇంట్లో ఇంటి పని చేయడానికో, వారి పిల్లల పని చేయడాని కో, ఒక చిన్న గది ఇస్తారు, ఇరవై నాలుగు గంటలు, వారి పిలుపులకి తయారు గా ఉండాలి.అదృష్టం బాగుంటే, మంచి గా చూసుకునే యజమానులు దొరుకు తారు..లేదా..వారి బాధ ,వ్యధ, గుండెలు పిండేస్తాయి. ఎందుకు ఇంత దూరం వస్తారు, అయిన వారందిరిని వదులు కుని, అని అడిగితే,ఉన్న ఊరులో ఇలాంటి పనులు చేయలేం కదా అంటారు,పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోలేక అంటారు.

స్త్రీలు,ఇంటికే పరిమితం, ఇదే మన సంస్కృతి, అంటూ చెప్పే కబుర్లు ఏమయాయో,దేశాంతరాలు పంపించి, ఆ ధనం తో, ఇంటిని నడిపే మగ వారు ని నేడు చూస్తున్నాం..ఇంక ఆడ దక్షత లేని ,ఆ కుటుంబాలు ,ఎలా నడుస్తాయో ఊహించలేం. మగవారికి ఒక తోడూ,మన ప్రభుత్వం వారు దయ గా పోసే సారా..అ తరువాత వచ్చే రోగాలు, రోష్టులు ఇంకో కథ, వ్యధ..ఇక్కడ ఒళ్ళు గుల్ల చేసుకుని కష్ట పడే స్త్రీ కి మిగిలేది, దూరం అయిపోయిన కుటుంబ సభ్యుల ,తరగని కోరికల  చిట్టా..ఒక అంతు లేని కథ ..కథ నాయిక లా ఒక ఒంటరి జీవితం.
మన దేశ ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి.. ఇలాంటి పనులకు యింక వీసాలు ఇవ్వకూడదు. ఏజెంట్లు వేసే వల లో పడి పోతున్న స్త్రీలకూ, ఒక వెసులుబాటు కల్పించాలి.ఎయిర్ పోర్ట్ ల లో,మన దేశ అధికారులు,ఇలాంటి స్త్రీలను గుర్తించి, వారిని హెచ్చరించాలి, వారికీ ఒక భద్రత , ఒక ఉపాధి పధకం సూచించాలి. ఇవి ,వింటే, మన దేశం లో ఇలాంటివి జరగవు అంటారు.కాని,ఇక్కడ మన దేశ పరువు తాకట్టు పెట్టినట్టు అని పిస్తుంది. ఒకరి ఇంట్లో పని చేయడం తప్పు కాదు,కాని, కట్టు బానిస ల లాగ,ఒక పేద దేశ స్త్రీలను మేము పోషిస్తున్నాం అన్నట్టు భావించే ఒక ధనిక దేశం కుటుంబానికి పని చేయడం..మన దేశం ఇంత గొప్ప ,అంత పవిత్రం అని చెప్పుకునే వాళ్ళం, సిగ్గు తో తల వంచుకునేల ఉంటాయి..ఇక్కడ స్త్రీల కథలు.

కొన్ని దేశాల ప్రభుత్వాలు ఇలాంటి పనులకి, తమ దేశస్తులను పంపించటం లేదు. మన పొరుగు దేశాలు కొన్నిఇలాంటి  నిర్ణయాలు తీసుకున్నాయి. మన దేశం మటుకు ,మాటల్లో చెప్పుకునే గొప్పలు, చేతల్లో చూపించటం లేదు.

పాస్ పోర్ట్, సివిల్ ఐ .డి .లు ఎవరి చేతిలోనో ఉంటాయి.సంవత్స రానికి , కొంత సొమ్ము ,వారికి కట్టాల్సిందే. వీళ్ళు కష్ట పడి సంపా దించిన దాంట్లో ,ఎవరికో వాటా..ఇది కాక ఇంటికి పంపించాలి, ఇక్కడ వీళ్ళు ఏదో లక్షలు సంపాదిస్తున్నారు అని, వారి భ్రమ.ఆ భ్రమ ని నిజం చేయడానికి ,ఇక్కడ వీరు పడే కష్టం, నిద్ర లేని రాత్రులు ,లో కార్చిన కన్నీరు, ఇవి దేవుడు కే తెలుసు.

మూడేళ్ళకో, అయిదేళ్లకో, లేదా యింక     కొంత మంది ఏ పదేళ్లకో..వెల్ల గలుగుతారు..వారి దేశానికి.చిన్న పిల్లలు, పెద్ద వారు అయి పోతారు, పిల్లలికి పెళ్ళిళ్ళు అయి పోతాయి,మనవళ్లు, మనవరాళ్ళు పుడతారు, అన్ని ఫోన్ ల లోనే వింటారు,ఊహించు కుంటారు. ఏవో ఫోటోలు చూస్తారు, ఏవో కబుర్లు తెలుసు కుంటారు.

అబ్సెంటీ మెంబెర్ అంటే కనిపించని ఇంటి సభ్యులు ..అన్న మాట వీళ్ళు..వందల్లో కాదు, వేలల్లో ఉన్నారు.మన దేశం ఎందుకు వీరికి కాస్తంత భద్రత, ఉనికి, చేయాలి అనుకునే వారికి పని, ఎందుకు చూపించేలేక పోతోంది? ఈ చదువు లేని వాళ్ళు యింక ఎందుకు ఉన్నారు? మన విద్య వ్యవస్థ ,అందరికి ఎందుకు విద్య అందించ లేక పోతోంది?

ఎప్పటికి మనం ,కాగితం మీద కాకుండా ,నిజం గా అబివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోగలం గర్వం గా??

మూడేళ్ళ  తరువాత ,తన దేశం వెళ్లి, మూడు నెలలు ఉండి, పెళ్లి చేసుకుని, నవ వధువు ని వదిలి మళ్లీ ఈ దేశం వచ్చి , ఫోన్ లో మాట్లాడుతూ, సొమ్ము పంపిస్తూ,సంసారం చేసే ఒక ఎక్ష్ పాట్ .వ్యథ ,కథ కాదు..నిజం..

ఇలాంటి ఎందఱో ,కథలు వింటే, మనం ఎంత అదృష్ట వంతులమో ,ఎప్పుడు కావాలి అంటే, అప్పుడు మా ఊరు వెళ్లి పోగలను నేను, అయినా ఏదో లోటు ..నాకు అని ఊహించు కుంటూ బాధ పడే.. నేను ఎంత మూర్ఖురాలిని..

మన దేశం ..సస్య శ్యామలాం..అని పాడు కోవడమే కాదు, నిజం గా సమృద్ధి గా, ఆకలి తెలియని దేశం అవుతుందని ఆశించడం అత్యశా???

భారతీయులు అందరు, పని వారు గా ,పర దేశం వెళ్ళే వారికి, మన దేశం లోనే పని దొరికే శుభ దినం కోసం పని చేయాలి. ఆకలి తో అలమ్టించని ప్రజా నీకం తో బలమైన దేశం గా అవతరించాలి , అని చేతులు కలిపి నడవాలి. రెప రెప లాడే మన జాతీయ పతాకం నీడలో, ఒక్క కన్నీరు చుక్క కూడా పడ కూడదు..

పర దేశం లో ఉంటూ , ఇక్కడ పని చేసే ఆడ వారిని చూస్తూ, ఏమి చేయ లేక , మన దేశం లో ప్రజలే కదా వీరు కూడా ,అయిన ఇంత అంతరం ఎలా ఏర్పడింది? అని ఎన్నో జవాబు లేని ప్రశ్నల కి జవాబు వెతుకు తూ..ఈ పోస్ట్.

24 ఆగ, 2011

అమ్మ కి వందనం తో..

అమ్మా !! ఆకలి!!! ఇదిగో టూ మినిట్స్ ..అంటూ మాగ్గి నూడ్లేస్ వండే అమ్మ..అమ్మా ... దాహం అంటే ఫ్రిడ్జ్ లోంచి కూల్ డ్రింక్ ఇచ్చే అమ్మ,స్కూల్ లో పోటీ పడుతూ చదవ డానికి ఇంకేదో డ్రింక్ కలిపే  అమ్మలు, మనం  టీ వి లో చూస్తున్నాం రోజూ..మా చిన్నప్పుడి రోజులు గుర్తు వచ్చేయి..

మూడు పూటలా అన్నం తినే బడికి  కాని కాలేజ్కి కాని ,వెళ్ళే వాళ్ళం.అమ్మ ఇంట్లో ఒకటో కృష్ణుడు,మూడో కృష్ణుడు, లాగ నాలుగు అయిదు అన్నాలు వండి వార్చి,వేడి వేడి గా అందరికి పెట్టేది.ముందు ఉదయాన్నే గ్లాస్సుడు కాఫీ తాగి, చదువుకుని లేచి, బడికి వెళ్ళే  వేళ కి,ఒకటో అన్నం రెడీ అయేది.అందులో కి ఒక కొత్తిమీర కారం లాంటి రుచికర మైన appetiserlu ఉండేవి,ఇంక బడి కి  ఒక పెద్ద కారేజి వచ్చేది.అందులో నలుగురం ..మా అక్క చెల్లెళ్ళకు ..సరి పడ అన్నాలు,కూరలు,చిన్న గిన్నె లో నెయ్యి తో సహా నాలుగు కంచాలు ,సమస్తం..ఉండేవి.ఇంటికి చేరేసరికి మళ్లీ గ్లాస్సుడు కాఫీ,మళ్లీ ఏదో టిఫిన్ ,మళ్లీ రాత్రి కి అన్నం..మొత్తానికి అన్న ప్రాణులం మేం.. మా ఏలూరు అక్క చెల్లెళ్ళం ..అందుకే,మొదట్లో ఎవరైనా భోజనం లో చపాతీలో ,పూరిలో పెడితే, శుభ్రం గా కడుపు నిండి పోయినా ఏక కంఠం తో ,ఇంక ఏమిటి కావాలి అంటే, అన్నం అని ముక్త కంఠం తో అరిచే వాళ్ళం.అన్నం ప్రాణులం..ఇప్పుడు,బరువు తగ్గాలని,ఆరోగ్యం అని,ఒకటో రెండో పుల్కాలు,హుహ్,ఒక్క చుక్క నూనె చుక్క కూడా అంటని కాల్చిన పుల్కాలు, ఇంక ఏదో గడ్డి ..ఆకులూ అలమలు..హుహ్..ఏమిటో ఈ కర్మ..ఇప్పుడు పిల్లలు తినే పిడ్జాలు, బర్గేర్లు, మాగ్గి నూడ్లేస్, తాగే కూల్ డ్రింకులు చూస్తోంటే,రేపు వీళ్ళు ఏం తింటారు? మనమే ఇలా బరువు అనుకుంటూ అవస్థ పడుతున్నాం కదా..వీళ్ళ గతి ఏమిటి?

అన్ని ఫాస్ట్ ..ఫుడ్ కూడా ఫాస్ట్ ఏనట ? ఫ్రిజ్ లో నుంచి తీయడం ,వేడి చేయడం..ఇంక మన జంతికలు,చేగోడీలు, పప్పుండలు, పకోడీలు, బొబ్బట్లు,బూరెలు, పులిహోరలు, చక్ర పొంగళ్ళు,ఏమి పోతాయి?అన్నట్టు మా ఇంట్లో నాలుగు రకాల జంతికల గొట్టాలు ఉన్నాయి, కాని, ఏదీ ఇప్పటివరకు వాడ లేదు,మరి మాలతి చందూర్ అన్ని కేజీ లెక్కన కొలతలు ఇచ్చారు, అంత తినే వాళ్ళు మన ఇంట్లో లేరు, అమ్మో చెయ్యి నొప్పి పెట్టదూ , అని ఇంకో కారణం వెతికి ఇప్పటి వరకూ ,ఈ స్వగృహ నో,బెజవాడ వారినో,నమ్ము కున్నాను. మా పిల్లలికి కనీసం ఆ రుచులు తెలుసు, కాని ముందు ముందు..ఎలాగో?
జంతికలు, చేగోడీలు కిఎవరైనా పేటెంట్ తీసు కున్నారా?లేక పోతే ఉండండి ఉండండి.. నేను లైన్ లో ఉన్నాను.

కొన్ని లక్షల అన్నాలు వండిన అమ్మకి జోహార్..అన్నం కి సరి మరి ఇంకేది రాదు..భుక్తాయాసం వచ్చే పెళ్లి భోయనం చేసినా సరే, ఇంట్లో పెరుగు వేసిన ,ఆవ కాయో ,మాగాయో నంచుకుని తినే అన్నం రుచే వేరు.
 సమస్త అన్నం ప్రానుల్లారా ఏకం కండి,పోయేదేమీ లేదు మన కి, వచ్చేది,ఓ చిన్న బోజ్జే..
అమ్మ కి వందనం తో..అన్నం రుచి మప్పిన అమ్మకి వందనం ..తో..శిరస్సు వంచి..(పొట్ట వల్ల నడుం వంగదు కాని,తల వంచగలను) ..

31 డిసెం, 2010

మన ముందు తరానికి, ఒక ఎడారి కాదు, ఒక పూదోట నిద్దాం....

ఇదేంటి అప్పుడే ఒక దశాబ్దం గడిచి పోయిందా? ఈ ఇరవై ఒక్క శతాబ్దం లో? ఇలా పరుగులు పెడుతోందేమిటి కాలం..
ఉందిలే మంచి కాలం ముందు ముందు నా..అంటూ శ్రీ శ్రీ గారు ఎంత ఆశ తో రాసారో?కానీ ఇదేమిటి, మంచి అనేది, భూతద్దం తో వెతక వలసిన సూక్ష్మ మైన పదార్ధం అయిపొయింది. మన పిల్లలకు మనం అందిస్తున్న ఈ ప్రపంచం ఎందుకిలా వెల వెల బోతోంది? సూర్యోదయాలు అవుతున్నాయి, కాని, దట్టమైన మబ్బులు పట్టిన ఆకాశం లో. వసంతాలు వస్తున్నాయి, కానీ, రంగులు అద్దుకుని , హరిత పల్లవం గా కాదు. ఏవో కలుషిత గాలులు, రంగులని ,కాంతులని రాత్రికి రాత్రి, దగా చేసి, దోచేస్తున్నాయి. గ్రీష్మ తాపం ఇంక , నదులని ,సెలఏరులని,  పీల్చేసి, ఇంకా, ఇంకా, చాలదు, అన్నట్టు, చండ ప్రచండం గా సూర్యుడు మూడో కన్ను తెరిచి నట్టు, భగ భగ మని మండి పడుతున్నాడు. వర్ష రుతువు, నేనేమి తక్కువా?అన్నట్టు, నింగి, నేల ఏకం చేస్తూ, ఆకాశం భోరున ఏడుస్తున్నట్టు, నదులని పొంగించి, కడలి అలలు తో చెలగాటాలు ఆడించి, పొలాలు, పంటలు, వరద నీటిలో ముంచి, నా తో పెట్టుకుంటారా? అంటూ, సవాల్ చేస్తున్నది.
ఇంక హిమ వంతుడి వంతు. ప్రకృతి అంతా పోటీ పడి, మానవుల మీద ఆధిపత్యం చూపుతున్నాయా అన్నట్టుంది. విమానాశ్రయాలు, నగరాలు, రైళ్ళు, రహ దారులు, ఇంత ఎత్తు మంచు తో నిండి, ఏదీ మీ ప్రతాపం చూపండి ఇప్పుడు అంటూ సవాల్ విసురుతున్నాయి.
అంతా మనం చేసుకున్నదే. నువ్వు భూమి నుండి తీసుకున్నది ఇవ్వగలి గితేనే తీసుకో, అన్న ప్ర ప్రధమ ధర్మం మరచి, మన ఇష్టం వచ్చినట్టు, ఏక దృష్టి తో, మన స్వార్ధం కోసం, మన స్వ ప్రయోజనాలు కోసం, ఎవరి ఇష్థం వచ్చినట్టు, వారు భూమిని, ఎడ పెడా... చెరిచాం, నిస్సిగ్గుగా.. చెరిచాం. ఆ దుష్ఫలితాలు నేడు చూస్తున్నాం. 
ప్రభుత్వం దే బాధ్యత. అని ఎవరి నో నిందిస్తాం. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే కదా ,మనలని పాలిస్తున్నాయి. అడవిలు , సముద్ర తీరాలు, కొండలు, కోనలు, దేనిని వదలం. మన గొయ్యి మనమే తవ్వుకుంటూ, ఎక్కడికి వచ్చాం.. మనం.. రెండు వేల పదకొండు అనే నూతన సంవత్సర సంరభానికి ఆహ్వానం పలక డానికి.
ప్రశాంత ఉషోదయాలు, లేత  ఎండలు, మామిడి పళ్ళ వేసవులు, మల్లెపూల గుబాళింపులు,  తీగ లాగా, జల్లు, జల్లున కురిసే, వర్షాలు, ఒక్క గొడుగు కింద ఇద్దరం నడుస్తూ, తడిసే, చిలిపి వర్ష రాత్రులు, పిల్ల కాలువలు లో పరుగులు తీసే కాగితపు  పడవలు, ఆకాశం లో అంద మైన హరివిల్లులు, దాని మీద నడవాలని రహస్య కోరికలు, వానా వానా వల్లప్ప అంటూ ముద్దుగా టప టప లాడిస్తూ చేతులు, ఆడుకునే ముద్దు గారే పిల్లలు, సాయంత్రం వర్షానికి , చేదోడు, వేడి వేడి పకోడీలు, చెలి చెంత, ఈ ముసురు లో ఒక సినిమా ఓ, ఒక పుస్తకమో, ఒక కబుర్ల కోలాహలమో, ఇంక చలి, చిన చిన్న గా మొదలు అయి, ఒక వెచ్చని ఎండ, తో కరిగి, భోగి మంట లకు జడిసి, సంక్రాంతి  సంబరాల తో కరిగి, ఇంటింటా ముత్యాల ముగ్గులు తో మెరిపించి, అంద మైన చలి కాలం, బద్ధకపు పొద్దు చలి కాలం, మళ్లీ, వసంతం ,చివుర్లు చిగిరించి, రంగుల ,కాంతుల పుష్పాలతో కను విందు చేసే వసంతం.. ఈ కాలాలు కావాలి నాకు. 
అంతే కాని, ఇలా నిస్తేజం గా, నిట్టురుస్తూ, మధ్య లో విలపిస్తూ, ఆక్రోశిస్తూ, అంతలో ప్రచండ రూపం చూపించే.. ఈ కాలం నాకు వద్దు. 
ఈ శతాబ్దం చివరకు మనం ఏం మిగులుస్తాం, మన పిల్లలికి, పిల్లల పిల్లలకి, అంటే, కనిపించే ఎడారి దృశ్యం నన్ను భయ పెడుతోంది, 
ఈ దశాబ్ది, చివరి రోజు , గుమ్మం లో నిల్చున్న నాకు, మలి  దశాబ్దం లో అడుగు పెట్టాలంటే...ఒక ఆలోచన, ఒక కలవరం, ఒక  కలవరపాటు.
వెనక్కి తిరిగి వెళిపోవాలి, అనే కోరిక ని చంపుకుని, ఈ దశాబ్దం , వసుధ కి అంకితం అని ఒట్టు పెట్టుకుని, నువ్వు తిరిగి ఇవ్వలేని దానిని ,ఖర్చు పెట్టకు అనే మంత్రం జపం చేస్తూ, మాటలు చేతలు ఒక్కటి అయ్యే రోజుల కోసం , భూమిని పరి రక్షించే ప్రభుత్వం కే నా పవిత్ర మైన ఓటు, ఈసారి, అందు కోసం ఉద్యమిస్తాం, ఉద్యమాలకి చేయూత  నిస్తాం,  అని ఇలా, ఏవేవో చెప్పి, మనసుకి, నెమ్మదిగా అడుగు వేస్తున్నాను. 
ముందు ఒక మొక్క నాటు, అని బుద్ధి హెచ్చరించింది  . ఇదే నా నూతన దశాబ్ది నిర్ణయం .. ఇంకేమి కాదు.. భూభారం తగ్గించే ప్రయత్నం, లో భాగం గా ఓ ప్పది కేజీలు తగ్గడం కూడా  ఉంది, కాని, అది ఒక రహస్య నిర్ణయం. 
ఇంక మీరు ఏం చేసుకున్న, చేసు కోక పోయినా భూమి ని ఒక పచ్చ రంగులో అలంకరించే ప్రయత్నం మటుకు చేయండి, ప్లీస్..
మన ముందు తరానికి, ఒక ఎడారి కాదు, ఒక పూదోట నిద్దాం..మీరేమంటారు  ?

9 డిసెం, 2010

అనుకోని సెలవు.. లు.

మొన్న అనుకోకుండా ఒక రోజు సెలవు దొరికింది మాకు, ఈ దేశం కొత్త సంవత్సరం.. పండుగ ట. హిజ్ర అంటారు. ఆరోజు ఎంత సంతోషమో? అనుకోకుండా ఇలాగ సెలవు వస్తే.. అంతే  పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తు వచ్చాయి.
మేం ఎం ఎస్ సీ,చదువు కున్నప్పటి మాట ఆంధ్ర  యూనివెర్సిటీ లో, అంటే ఒక ముప్ఫై ఏళ్ల క్రితం మాట. ఏలూరు నుండి  వచ్చిన వాళ్ళం అందరు ఒక పెద్ద గ్రూపు గా తిరిగే వాళ్ళం. వేరే వేరే డిపార్టుమెంటు లు అయినా సరే, హాస్టల్ లో అందరం ఒకే జట్టు. ఇలాగ క్లాస్సులు మొదలు అయాయో లేదో, యూనివెర్సిటీ లో గొడవలు మొదలు అయాయి.
ఆ రోజుల్లో కూడా గొడవలా ? అనే వారికి నాకు ఒక విజ్ఞాపన గుర్తు వస్తోంది, కోడలు అడుగుతోంది, అత్తగారిని, మీది ప్రేమ వివాహమా? అని ఆశ్చర్యం గా.. ప్రేమ ఏదో ఒక తరం వారి సొత్తు అయినట్టు, మనకి ఎప్పుడో లైలా మజ్ను, ఇంక మాట్లాడితే రుక్మిణి కల్యాణం కూడా ఉంది, మన పురాణాల్లో, ప్రేమించు కోవడం అది పెద్దలు ఒప్పుకోవడం అనేది అనాదిగా ఉంది. మనకి..సరే ఇది పిట్ట కథ అసలు కథలో.
తరగతులు బంద్.. బాగానే ఉంది, హాస్టల్ లో టైం కి టిఫిన్ లాగించేసి, బీచ్ రోడ్ మీద పడే వాళ్ళం. ఆర్కే బీచ్ పార్క్, క్వాలిటీ ఐస్ క్రీమ్ అమ్మే వారు కాబట్టి, క్వాలిటీ బీచ్ పార్క్ అని   కూడా అనేవారు, అక్కడ కూర్చుని, సముద్రం వేపు చూస్తూ ,విరిగి పడే అలలు, అలుపు లేకుండా గంటలు, గంటలు చూసే వాళ్ళం. అలలు కే అలపు వచ్చేది, ఏమిటి ఈ అమ్మాయిలు ఎంత సేపు ఇక్కడ కూర్చుంటారు, వీరికి ఇంకేమి పని లేదా అని. మాకు ఇంకేమి పని లేదు కదా..అలలు కి పోటి కూడా పెట్టే వాళ్ళం. ఏ అల అయితే మధ్యలో విరిగి పోకుండా ఎంత పొడుగ్గా వస్తుందో? లేదా ఎంత ఎత్తుకి   ఎగిరి విరిగి పడుతుందో?  అబ్బే ఇదేం పోటీ అనే గుంటూర్ వాళ్ళు కూడా కాసేపు అక్కడ కూర్చునే సరికి  ఇదిగో ఎంత పెద్ద కెరటమో? ఎక్కడ విరిగి పోలేదు, ఇదే అన్నిటికన్నా పెద్దది..అని అరుచు కుంటూ, సముద్రుడి కి మా నవ్వులు, కేరింతలు ప్రైజ్ లు గా ఇచ్చి, ఆకలి తో మాడిపోతుంటే, మళ్లీ మా హాస్టల్ వేపు నడిచే వాళ్ళం. హాస్టల్ మెట్లు దిగితే బీచ్ రోడ్. ఇంత అందమైన హాస్టల్ ఇంక ఎక్కడ ఉండదు. మన ఇంట్లో వాళ్ల  అందిరిని వదిలి వచ్చాం   అని  దిగులు    మరిపించ డానికి సముద్ర ఘోష మనసుకి ఊరటగా తోడూ గా ఉండేది. 
ఇంకా ఆ గొడవలు పెద్దవి అయి, హాస్టల్ మూసేశారు. ఇంటికి వెళ్ళి పొమ్మన్నారు. మాకు ఏమి పెద్ద సంతోషం వేయ లేదు, అప్పటికే, విశాఖ బీచ్ ని వదిలి, అంటే మా స్వేచ్చ ,స్వాతంత్రం, వదిలి, ఇంటికి, అదీ ఏలూరు లాంటి చిన్న కాలువలు ఉన్న ఊరు కి వెళ్ళా లంటే..అమ్మో ఎంత బాధో, అందులో స్నేహితురాళ్ళ సాంగత్యం వదిలి వెళ్ళడం.. 
ఏదో ఒక సంచి లో, నాలుగు చీరలు పడేసుకుని, పోలో మని స్టేషను కి వెళ్ళి, గోదావరి రైలు ఎక్కి కూర్చున్నాం. పద్నాలుగు రూపాయిల నలభై పైసలు టికెట్ ఖరీదు. ఏలూరుకి టికెట్ ఖరీదు, సరిగ్గా రెండు పదులు ఇరవై ఉన్నాయి పర్సు లో, తుని లో పకోడీ  లు, రాజ మండ్రి లో ఒక  కాఫీ తిని, తాగి, ఏలూరు స్తేషున్ నుంచి రిక్షా నాలుగో ,ఐదో రూపాయలకి బేరం ఆడి, ఇంటికి   వచ్చి, అమ్మా రిక్షా వాడికి డబ్బులు ఇవ్వు అమ్మా అంటే, నోరు తెరిచారు అందరు,  మొన్నే కదా వెళ్లావు, ఎం ఎస్ సీ అంటూ, తిరిగు టపా లో వచ్చేసావు ఏమిటి? అని.
అను కోకుండా వచ్చిన సెలవుల కథ ఇది. అలాగ మా మొదటి సంవత్సరం అంతా సెలవలే.. ఇంకొకసారి, మాకు మరునాడు సెమెస్టర్ ఎండ్ పరీక్ష. రోజూ కలుసుకుని కబుర్లు చెప్పుకునే ,నేను మా స్నేహితురాలు, నేను, రాత్రి రెండు వరకు, ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ, రేపు పరీక్ష ఎలాగైనా ఆగి పోవాలి, ఏదైనా సెలవు రావాలి, అని మిగిలిన రాత్రి అంతా ప్రార్ధించు కుంటూ, గట్టిగా మర్నాడు సెలవు వస్తుంది అని ఎందుకో నమ్మాం, కొంత మంది మా లాంటి క్లాస్స్ మేట్స్(మగ ) కూడా అధికారులని కల్సి ,సెలవుల మర్నాడే పరీక్ష పెట్టడం అమానుషం అని, పరీక్ష ఎలాగైనా ఆపేయాలని, చాలా ప్రయత్నించారు పాపం. కాని, ఎందుకో, అప్పుడు అధికారులు ఒప్పుకోలేదు, మామూలుగా నలుగురు కలిసి  అర్ధ రాత్రి, రిజిస్త్రార్   ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి, పరీక్షలు రాయం మేం రేపు అంటే ఒప్పుకునే వారు. చాల మంచి వాళ్ళే.. స్టూడెంట్స్ తో గొడవలు ఎందుకు అనుకునే వారు.  కాని ఆ రోజు ఒప్పుకోలేదు.
అలాగ రాని సెలవు వల్ల మేం  సప్ప్లేమేంట్ రాయాల్సి వచ్చింది. 
ఇంకా స్కూల్ లో కూడా ఇలాగే స్కూల్ కి సెలవు ఇస్తే.. ఎవరో పోయారానో, ఏదో కారణం ఉండేది, ఇంక ఆ రోజు పొందే ఆనందం   అంతా ఇంతా కాదు. కాలం మనకి ఒక రోజు బహుమతి గా ఇచ్చిందేమో మన మీద ప్రేమతో అని పించేది.ఎంత చిక్కని ఆనందమో అది.
రోజూ బీచ్ రోడ్ పక్కనే కార్లో పరుగులు పెడతాను ఇప్పుడు. పక్కనే సముద్రం.. ఆశగా చూస్తూ ఉంటుంది, నేను గుర్తు ఉన్నానా ? అని ?మీ కబుర్లు, రహస్యాలు నాకు తెలుసులే అంటుంది. మొహం తిప్పుకుని, ఏవో సంపాదించాలి, ఏవో ఇల్లు కట్టుకోవాలి, నగలు కొనుక్కోవాలి, అంటూ, ఏమిటో? ఎక్కడికో ఈ పరుగులు? 
అలాగే  ఏ సీ చైర్ కార్ లో కూర్చుని, పర్సు లో వంద రూపాయిల నోట్లు, తునో, రాజ మండ్రో  , తెలీదు, ఆ రంగు అద్దాల కిటికీ ల నుంచి, ఇంట్లో నుంచి తెచ్చు కున్నా చపాతి, కూర, ఫ్లాస్క్ లో కాఫీ ,బయటవి కొని  తినాలంటే భయం,  ఏలూరు ఊరు కూడా రైలు లోంచే చూడడం, ఏ హైదరాబాద్ కో ప్రయాణం, అక్కడి నుంచి ఇంకా ఎత్తున విమానాల్లో ప్రయాణం దూర దేశాలకి, ఎంత సుఖమయం ప్రయాణం ఇప్పుడు, కాని సంతోషం కలిగించని ప్రయాణాలు ఇప్పుడు.
ఇంఫ్లేషన్   అంటారు, అంటే, ఇప్పుడు మనం చాలా డబ్బులు పెట్టినా దాని విలువ తగ్గి పోతుంది అని. మునుపు మనం ఇంకా ఎక్కువ కొన గలిగే వాళ్ళం ఇదే విలువ కి అని ఒక అర్ధం, అలాగ జీవితం లో కూడా ఇంఫ్లేషన్  వచ్చింది. మన చిన్నప్పుడు, హాయిగా అనుభవించే ఎన్నో క్షణాలు ఇప్పుడు అనుభ వించ లేక పోతున్నాం. ఇప్పుడు దేనికి లోటు లేదు, కాని, ఏదో  కనిపించని లోటు. ఇది అని చెప్పలేం. ఎవరికి వారికే  తెలుసు..
ఒక్క  అనుకోని సెలవు రోజు వచ్చి తీరుబడి గా కూర్చుంటే, తెలుస్తుంది. ఉరుకులు ,పరుగులు, జీవితం లో, ఒక ఆదివారం కూడా ఒక పని రోజు లాగే గడిచి పోతుంది, ఆ రోజు కి సరిపడా పనులు కనిపిస్తూ ఉంటాయి.
అలాగ కాదు, ఒక్క రోజు, సెలవు రాదు, కాని మనమే సెలవు తీసుకుని, అను కోకుండా ఒక రోజు, సెలవు పెట్టి, హాయిగా , ఒంటరి గానో, జంట గానో, కార్లు అవి పక్క పెట్టి, ఓ బస్సు ఎక్కి,  ఒక చివర నుంచి మరో చివర వరకు, ఊరు అంతా చూస్తూ, మనసుకి బాగా నచ్చిన పని చేస్తూ, ఆకలి, దప్పులు మర్చి పోయేలా, హాయిగా ఊరు అంతా మందే అనుకుని తిరగడం ..అబ్బ ఎంత బాగుంటుంది. పుల్ల ఐస్ క్రీమ్ తిన్నట్టు.  మామిడికాయ ముక్కల మీద ఉప్పు అద్ది తిన్నట్టు, నిప్పుల మీద కాల్చిన మొక్క జొన్నలు తిన్నట్టు, సముద్రం ఒడ్డున  ఇసక తో పిచుక గూళ్ళు కట్టినట్టు, నది లో నీళు దోసేళ్ళు తో తాగినట్టు.. చాలా, చాల బాగుంటుంది.
మాకు అనుకోకుండా సెలవు వచ్చింది.. మేం ఏం చేసాం ఆ రోజు.. అదే మరి.. చెప్పని ,రాయని  పోస్ట్.