"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

11 నవం, 2010

జ్ఞాపకాలు

నాలుగు గోడలు, ఎనిమిది తలుపులు
మధ్య ఉంటాయా?    తలపులు, గుర్తులు 
చిన్నప్పటి   , జ్ఞాపకాలు?
మొక్క చెట్టై,పండిన జామకాయలు
కోసం చిలకలు తో పోటి పడడం,
కింద పడి,చేతులు చెక్కుకు పోవడం,
తులసి కోట పక్కనే మామిడి చెట్టు 
ఎదిగి ,పెరట్లో, పైకి డాబా మీద కి 
ఒంగి కబుర్లు చెప్పడం -మేం వినడం,
సన్న జాజి తీగ తిన్నగా పాకి,సాగి,
చేతిలోకి పువ్వులు పూయించడం, సాయంత్రాలకి,

టప  టప మని కురిసే తొలకరి వాన
చినుకులకి,  లేచి, అర్ధ రాత్రి, డాబా ని 
వదిలి ,పరుపు చుట్టుకుని, క్రిందికి 
పరుగులు తీయడం, ఒక్క డేరా ఉంటే 
చాలు, ఎంత బాగుంటుంది, ఈ వాన లోనే 
పడుకోడానికి అని కలలు కనడం,
పెద్దవుతే  తప్పక ఓ డేరా( టెంట్) కొనుక్కుని,
ఈ వాన లోనే పడుకోవాలని అని ప్రమాణాలు 
చేసుకోవడం మనసులో...

ప్రక్కింటి పిల్లలు తో దాగుడు మూతలు 
తమ్ముడు, చెల్లెళ్ళు తో చీకటి గది ఆటలు,
మోకాలి చిప్ప పగిలి చెల్లి ఏడుపు,
తమ్ముడు బిక్క మొహం, నాన్న మందలింపులు,
బడిలో ఆటలో, ఆటల్లో బడో,
ఎంత హాయి అయిన బాల్యం !!!

మామ్మగారి చేయి పట్టుకుని ,పంట 
నూర్పులు దగ్గరుండి నూర్పించడం,
వరి కంకులు ,వరండా లో పిచుకులకి 
ఆహారం గా తగిలించి ,ఆహ్వానించడం, 
చూరు నుండి సంగీతం తో పలకరించే
వాన చినుకులని దోసేళ్ళతో ఆస్వాదించడం,

చిన్న మామ్మ, చిన్నాన్న, పెద నాన్న,
పెద్దమ్మ, పెద్దత్తో, చిన్నత్తో, ఎప్పుడూ
ఎవరో ఒకరు ఇంటి నిండుగా
పలకరించడం, నాన్న ఆఫీసు టేబుల్ 
చెప్పే కోర్టు కథలు,  వ్యాజ్యాలు వినడం,
ఎంత దూరమైనా చుట్టం నాన్న కి దగ్గర చుట్టమే,
చుట్టాలు అందరు  నాన్న సలహా వినడం...

సెలవుల్లో, తాత గారింటికి ,తాళాలు వేసిన
ట్రంకు పెట్టేలతో ,నాన్న పాసింజేర్ రైలు 
ఎక్కించడం, అమ్ముమ్మ గారింటికి, అదే 
సముద్ర తీరాన్న ఉన్న విశాఖ పట్నం కి,
అందరం తరలి వెళ్ళడం, రెండు నెలలకి,
మావయ్య ,అత్తల ఇంట్లో వేసవి, ఉక్క రోజులు..

వర్షా కాలం లో వరద నీరు 
ఇంట్లోకి పిలవని అతిథి లా వచ్చి
పలకరించి వెళ్ళడం ,ఇంట్లోనీళ్ళల్లో, 
మేం పడవలు వేసుకుంటే పెద్ద వాళ్ళు
గిన్నెలు, పుస్తకాలు సర్దు కోవడం,
తమ్మిలేరు లో  నీటి పండుగ...

ఒకటా ? రెండా?? పదా? పన్నెండా??
ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు.. గుర్తులు..
తలపులు, తీయని బాల్యం వి..
తీయ తీయని పటిక బెల్లం ఊరింపులు, 
నాలుగు గోడలు, ఏమిమిది తలుపులు,
ఉంటేనేం? లేక పోతేనేం??

ఈ ఇల్లు స్థానం లో, మరో మేడ వస్తేనేం?
ఎవరెవరో వచ్చి ఉంటేనేం? 
మీ బాల్యం, గుర్తులు, మీ మది నిండా 
ఎప్పటికి భద్రం, ఎప్పటికి, మరి ఎప్పటికి...

ఏలూరు  126/B......ఇంటిలో నా వాళ్ళ కోసం..







3 కామెంట్‌లు: