"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 నవం, 2010

మట్టి ప్రమిదల లో దీపాలు వెలిగిద్దాం ,దీపావళి చేసుకుందాం.



దీపావళి వచ్చింది,దీపాల పండుగ వచ్చింది, రాష్ట్రం అంతా తడిసి ముద్ద అయింది, వరస వర్షాలు తో, ఈ దీపాల వెలుగు అందరికి నిజమైన పండగే అవుతుంది. 
మన చిన్నప్పడి పండుగ గుర్తు రాకుండా ఎలా ఉంటుంది? ఈ సందర్భం  లో ??మేం ఆరుగురం పిల్లలం ఇంట్లో. వంద రూపాయలు పెడితే ఆరు బుట్టల నిండా  సామాన్లు వచ్చేవి, ఇంక అవి ఎండ బెట్టడం అనే కార్యక్రమం మొదలు అయేది, ఎవరి బుట్టల్లో సామాన్లు వాళ్ళు, (తాటాకు బుట్ట),బయట ఎండ లో పెట్టడం, తమ్ముళ్ళు అయితే, వాటి పని అప్పుడే పట్టే వాళ్ళు, మా వాటా సామాన్లు ,వాళ్ళు పట్టు కు వెళ్ళి పోకుండా కూడా చూడడం మా అమ్మాయిలకు ఎక్స్ట్రా  పని. 
ఈ సందర్భం లో జరిగే రామ రావణ యుద్ధం -మగ పిల్లలికి, ఆడ పిల్లలికి- మధ్య సంధి కుదిర్చే సరికి, దీపావళి ముందే వీపు మీద టపాకులు మోగేవి..ఇంట్లో. చిన్న గానే లెండి, ఎప్పుడూ దెబ్బలు ఎరగం.. ఇంత మంది ని ఎలా పెంచారో, మా అమ్మ -నాన్న లు, ఓపిక లో నోబెల్ ప్రైజ్ ఉంటే ఇవ్వలిసిందే వీరికి అనుకుంటాం.
ఇంకా ఎన్ని ముచ్చటలో, ఆడ పిల్లలికి కొత్త గవున్లు, మగ పిల్లలికి, ఏముంటాయి ఎప్పుడు అవే చొక్కాలు, లాగులు, అదే నిక్కర్లు, గౌను  కి మాచింగ్ గా గాజులు  , రిబ్బన్లు, చేతిలో ఓ పది రూపాయలు పెట్టుకుని రవి కంగన్ హాల్ అనే కొట్టు చుట్టూ. సూర్యుడు చుట్టూ భూమి అన్నట్టు తిరిగే వాళ్ళం.. మార్చి, మార్చి, బేరం ఆడి, ఆడి, అన్ని రెడీ చేసు కుంటూ, మేం అంటే ఆడ పిల్లలం, నలుగురు అక్క చెల్లల్లం, ఇంక మా తమ్ముడు, పూనకం వచ్చినట్టు, పిచికలు, మతాబాలు, సిసింద్రీలు అంటూ సీమ టపాకాయ లాగ ఎగిరి పడుతూ, ఎప్పుడు చేయి కాల్చుకుని వస్తాడో అని అమ్మ ఒక బర్నోల్ మందు చేతిలో పెట్టుకుని రెడీ గా ఉండేది.
నాకు పిచికలు చేతిలో పట్టుకుని, అవి చేతిలో ఒక పుల్ ఇస్తాయి, అప్పుడు వదలాలి అని నేర్పాడు, మా తమ్ముడు. చిన్న మట్టి ఉండల్లో, కూరిన మందు,ఈ పిచికలు. సిసింద్రీలు , తాట్రేకు టపాకాయలు, చేతి లో పట్టుకుని పేల్చడం ఒక సాహస కార్యం. పది, పదిహేను రోజుల ముందు నుండి ఈ హడావిడి అంతా మొదలు అయేది, ఏదో బడి అని ఉండేది కాని, చదువు కి ఎగనామమే ఈ పది రోజులు.
మతాబాలు, చిచ్చు బుడ్లు ఇంట్లో కట్టాలా? మందు సామాన్లు పెద్ద బజారు నుంచి కొనుక్కుని రావాలా?  పేపర్లు అన్ని చింపి, మతాబ కర్రలు తయారు చేయాలా? మైదా తో వాటిని అతికించడానికి ఓ పేస్టు తయారు చేయాలా? అమ్మ కి విసుగు, పిల్లలికి పండుగ.. ఈ దీపావళి పండుగ,
ప్రతి ఇల్లు ఓ కుటీర పరిశ్రమ కేంద్రం  లాగ తయారు అయేది మొత్తానికి, నాన్నగారు ముందు విసుక్కున్న ఏమిటి ఈ సంత? ఇంట్లో అని.. చివరాఖరికి, అలాకాదురా, ఇంక కొంచెం సురేకారం దట్టించు, ఇంకా చిట  పట లాడాలి, అని లుంగి పైకి ఎత్తి, దిగి పోయేవారు. 
ఆడ పిల్లలం మాకు, మా అలంకరణ మీదే దృష్టి అంతా..ఎవరి గోల వారిదే, అమ్మ కేమో, ఏం చేయాలి, తేలికగా అయిపోయే స్వీట్ ఏమిటి? అని ..ఆలోచన, ఇంత మందికి చెయ్యాలంటే మరి, కేజీ ల లెక్కనే కదా!!
నరక చతుర్దశి వచ్చేసింది.. అమ్మయ్య, ఇవాళ కూడా ఓ కొత్త గౌను వేసు కోవచ్చు. తలంటి పోసుకుని, అమ్మ వీధిలో కొన్న ప్రమిదలని- మట్టివి- నీళ్ళల్లో నానా బెట్టడం ఒక పని, ఇంకా ఎండ పెట్టిన వన్ని, సరిగ్గా ఎండేయో లేదో చూసుకుని, మర్చి పోకుండా ఇంట్లో తెచ్చి పెట్టడం, వీధిలో పొద్దున్నే ముగ్గు పెట్టడం,  మర్నాటికి, అంతా అమిర్చి పెట్టడం తోచినప్పుడు, అమ్మ కేక లేస్తే వెళ్ళి సాయం చేయడం, ఏమిటో ఒకటే హడావిడి, పండుగ హడావిడి.
వచ్చేసింది, అమ్మ దీపావళి ఈరోజే అంటూ తమ్ముడు పొద్దున్నే లేచి , ఓ బాంబ్ పేల్చి స్వాగతం.. ముందు స్నానం చేయరా అంటూ అమ్మ వెంట పడడమే గాని, ఆడ పిల్లలం ముందు మా హక్కు , స్నానం కి అని  క్యు కడితే ,ఏ పది గంటలకో వాళ్లకి చాన్స్ వచ్చేది. ఇప్పటి లాగ గది కి ఓ బాత్ రూం కాదు కదా, ఇంటిల్లి పాదికి ఒకటే బాత్ రూం..ఆ రోజుల్లో. ఆ చిన్నప్పుడు.. రోజుల్లో, ఇది ఉంది, ఇది లేదు అని స్పృహే లేని ఆ రోజుల్లో..
మనం ఉన్నాం, అక్క, తమ్ముడు, చెల్లెళ్ళు, నాన్న-అమ్మ ఉన్నారు, ఇంకేమిటి లోటు మాకు? పండుగ పండుగ కి కొత్త గవున్లు ఉన్నాయి, మాచింగ్ గాజులు , రిబ్బన్లు ఉన్నాయి, బడి ఉంది, ఆటలు ఉన్నాయి, వేసవి సెలవులు -ఆటలు ఉన్నాయి, కబుర్లు, స్నేహితురాళ్ళ  తో కబుర్లు ,ఎప్పటికి తరగని సిరులు లాగ కబుర్లు ఉన్నాయి, ఇంకేమి లోటు మాకు..
మట్టి దీపాలు వెలిగించి, దేవుడు దగ్గర ఒక దీపం తో అవి వెలిగించడం , ఎక్కడి నించో, ఒక ఆముదం చెట్టు కొమ్మ తెచ్చి, దానిని గుమ్మం గుమ్మం కి కొట్టి, దిబ్బు  దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే దీపావళి అని పాడే వాళ్ళం.. అలాగ చేస్తే, చేతులు కాలవం అని ఏదో నమ్మకం.
ఆ వెలిగించిన దీపాలు, జాగ్రత్తగా తెచ్చి గోడల మీద వరసగా పెట్టడంకి అందరు పోటి పడే వాళ్ళం. నాన్న గారు కోసం ఎదురు చూడ్డం, ఆయన జూట్ మిల్ లో నర్లు  చేసే లక్ష్మి పూజ ,అయేక ఇంటికి స్వీట్స్ డబ్బా పట్టుకుని వచ్చేవారు, ఇంక మొదలు, మా హడావిడి..
ముందు మతాబాలు, కాకర పువ్వత్తులు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, అయేక ఇంట్లో కి వెళ్ళి పాము బిళ్ళలు, అవి నల్లగా విరుచు కు పడి పోతే ,ఎంత ఆనందమో..
ఇంక వీధిలో తరవాత చెవులు దద్దరిల్లేటట్టు టపాకాయలు, సీమ టపాకాయలు, సిసింద్రీలు, ఇంకా పెద్ద వాళ్ళు తార జువ్వలు, లక్ష్మి ఆటం బాంబులు, పోటి పడి కాల్చే వాళ్ళు.. మగ పిల్లలు, ఆరోజు తోక లేని హనుమంతు ల్లగా గెంతులు వేసే వారు.
సిసింద్రీలు అన్నిటి కన్నా డేంజెర్.. అవి ఏ మార్గం లో దూసుకుని వెళతాయో, అంతు బట్టదు ఎవరికి, ఎవరు తీగల మీద బట్టలు మర్చి పోయారో, వారి ఇంటికే వెతుక్కుంటూ వెళుతుంది, సిసింద్రి. గొడవ గొడవ తరువాత.. 
నాగుల చవితి కి కూడా దాచుకోవాలి రా అని అమ్మ ఒక పక్క అరుస్తూ ఉంటుంది, ఈ లోపల తాటాకు బుట్ట కూడా బోర్లించి అన్టించేస్తాం. అమ్మ తెలివి తక్కువా? ముందే గుప్పెడు తీసి దాస్తుంది. 
అమ్మయ్య ఎవరి చేతులు కాల్చు కోకుండా అయింది ఏ ఏడు దీపావళి అని అమ్మ నిట్టూర్చి, పదండి, చేతులు కడుక్కోండి, స్వీట్ తినండి, ముందు అంటుండే కాని, అప్పటికే అందరి కడుపు నిండి పోయింది, ఇంక ఏం తింటాం?
ఇంట్లోకి వెళ్ళి లెక్క చూసుకుంటే మగ పిల్లల తలలు మిసింగ్.. మా వీధిలో అయింది దీపావళి, పక్క వీధి లో ఏం జరుగుతుందో అని చూడ్డానికి పారి పోయారు ఇద్దరు, నెమ్మదిగా.. ఏ పన్నెండో, అవుతుంది.. పూర్తి గా దీపావళి పండుగ రోజు ని వీధి చివర వరకు, పంపించి రావాలి కదా మరి, మళ్లీ సంవత్సరం వరకు రాదు కదా ఈ సంతోష పర్వ దినం? దీపాల పండుగ దినం.
ఇప్పుడు దీపావళి కి వస్తున్నాయి చైనా లక్ష్మి , చైనా వినాయకుడు ఫోటోలు, చైనా టపాకాయలు, చైనా ఎలెక్ట్రిక్ దీపాలు, ఆన్ లైన్ లో అమ్మ దీపావళి విషెస్ అని శుభాకాంక్షలు   దూరం నుంచి చెప్పడం, నెట్ లో ఆర్డర్ చేసిన స్వీట్స్, పేరు తెలియని స్వీట్స్, చప్పుడు చేయకండి, ప్రపంచం లు ఇన్ని అణుబాంబు లున్నాయి, అవేమి కాదు ట, ఈరోజు పేల్చే టపాకాయ లతోనే ,ప్రపంచానికి ముప్పుట, ఇంక ఈ దోమలు, అవి చస్తాయి అని కాల్చే మతాబాల వల్ల ఇంకో పర్యావరణ ముప్పుట. ఇన్నేళ్ళు గా లేనిది, ఈ ఒక్క రోజు కి ఏమవుతుందో..
మన పండుగ, మన ఇష్టం  అని గట్టిగా ఎవరు అనరు, మనం చాల మర్యాదస్తులం. అందులో వెస్ట్ అనబడే వారు ఏం చెప్పినా మనకి వేదం.. మనకి ఉన్నాయి వేదాలు వినండి అర్రా ..అంటే అబ్బా చాదస్తం..అంటాం. 
మన పండుగలు మనం మనసార హాయిగాచేసుకుందాం, మట్టి దీపాలు వెలిగించుదాం .. వేల, వేల ఏళ్ళుగా మన కుమ్మరి వాళ్ళు, మట్టి కుండలు, అవి చేసుకుని బతుకుతున్నారు, కనీసం ఈ రోజు అయినా మట్టి ప్రమిదలు కొందాం. బేరం ఆడ కుండా.. కొందాం..
మన భాష, మన పండుగలు, మన కళలు, మన సంస్కృతీ.. ని కాపాడుదాం..దీపావళి పండుగ ని చక్కగా చేసుకుందాం.. రండి.. ప్రమిదలు వెలిగించండి, మన ఆశల ప్రమిదలు.. మన సంస్కృతీ సంపద లివే..ఇవే.. ఇవే..

4 కామెంట్‌లు:

  1. బాగుందండీ. చక్కగా వ్రాసారు. మేమెప్పుడూ మట్టి ప్రమిదలే వాడతాము. మొదటినుంచీ అలవాటది.
    శ్రీవాసుకి

    రిప్లయితొలగించండి
  2. భలే బాగుందండీ, మీ దీపావళి టపా...నా చిన్నతనాన్ని గుర్తు చేసింది...నేను పండక్కి ఇంటికి వెళ్ళటం కుదరదు..అందుకే ఇక్కడే దీపావళి, ప్రతి ఏడూ...ఓపిగ్గా మేడ మీద, మెట్ల మీద అంతా దీపాలు పెడతా..మట్టి ప్రమిదల్లోనే అండీ..క్యాండిల్స్ నాట్ ఎలోడ్..ః)....ప్రతి సంవత్సరం కనీసం నాలుగు డజన్లు కొంటా...ఇవ్వాళకూడా వెళ్ళి కొనుక్కురావాలి....ఏవైనా రెండు రకాల స్వీట్స్ చేస్తా..లక్ష్మీపూజ..తర్వాత ఫ్రెండ్స్ అంతా వస్తారు(స్వీట్ కోసం లెండీ)...ః)...చక్కగా కాసిన్ని తాటాకు బాంబులు, చిచ్చుబుడ్లు కాలుస్తాం..అదన్నమాట నా దీపావళి..అమ్మో..త్వరగా వెళ్ళి సామాన్లు అన్నీ కొనుక్కు రావాలి...ఉంటానండీ...ః))...రేపు మీరు పండగ ఎలా చేసుకున్నారో మాకూ చెప్పాలి మరి....ః)

    రిప్లయితొలగించండి
  3. థాంక్స్ అండీ, లక్ష్మి గారు, వాసుకి గారు, కౌటిల్య గారు..
    మీ దీపావళి పండుగ ని గుర్తు చేసిన నా పోస్ట్ చదివి నందుకు..ఒక మాట రాసినందుకు..
    మట్టి ప్రమిదల వాడకం బాగా తగ్గింది అని, చైనా నుంచి అతి చీప్ గాసరుకులు దిగుబడి అవుతున్నాయి అని ఇవాళే చదివాను, మనసు లో దిగులు ఇలా బయట పడింది.. ఇంకా మట్టి ప్రమిదలు వాడే వారు పెరగాలని, ఆశిస్తూ..

    రిప్లయితొలగించండి