"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

9 జులై, 2012

మన విశాఖ అందాలు..


నీలి ఆకాశం ,సంద్రం లో తొంగి చూస్తూంటుంది.
ఉదయమే సూర్య బింబం ,విశాఖ నుదుటి 
బొట్టు లాగా ,ఉదయిస్తుంది,
ప్రతి అలా, సముద్రపు నీటి బొట్టు ,
కిల కిల నవ్వుతూ, తుళ్ళుతూ 
కబుర్లు మొదలు పెడ్తుంది, విశాఖ 
ప్రజలతో, హోరు మని ..
నాన్న లాగ ,గంభీరం గా
భుజం మీద చేయి వేస్తూ, ఎప్పటికి 
అలాగే నిల్చుంటాయి, తూరుపు కనుమలు 
గర్వం గా, అభిజాత్యం గా..
ఎంత ఎత్తో, ఆ ఎత్తు మీదే ఒక తలమానికం 
ఏడిచే పిల్లలకి ఆట వస్తువు లాగ
గుండ్రం గా తిరుగుతూలైట్ హౌస్
ఓడలకి మార్గ దర్శకత్వం ,
విశాఖ ప్రజలకి, రాత్రి ఓదార్పు, ఈ కిరణాలు.
ఒక కొండ మీద సాగర దుర్గమ్మ,
మరో కొండ పై నరసింహ స్వామి ఉగ్రం గా
నగరానికి రక్షణ గా నిలిచారు.
జగదాంబ, అక్కయ్యపాలెం,
నక్కవాని పాలెం, మద్దెల పాలెం
మువ్వలవాని పాలెం, మధుర వాడ,
సీతమ్మ దార, మాధవ ధారా, 
సిమ్మాచలం, గోపాల పట్నం,
జోడుగుళ్ల పాలెం, కంచర పాలెం,
సిరిపురం, ఇసక తోట, నక్కవాని పాలెం,
రామనగర్, మహారాణి పేట, పెద జాలరి పేట
చినజలరి పేట, పెద వాల్తేరు, చిన వాల్తేరు..
ఇంత అందమయిన పాట లో పల్లవి 
లాగ ఉన్నవి ,మా ఊరు లో పేట ల పేర్లు,
ఎంత తెలుగు తనమో, ఎంత బాగున్నాయో
కైలస గిరి ,పై వెలిసిన పార్క్, వుడా పార్క్,
అందమయిన అమ్మాయి ,పొడవయిన 
జడ లాగ ,నల్లగా మెరుస్తూ బీచ్ రోడ్,
రోడ్ కి ఒక వేపు అనంత సాగరం,
మరో పక్క ,అనంత జీవితాన్ని 
కాచి వడ బోసిన పెద్దలు, మహా కవులు,
రచయితలు, నాయకులు, మా తూర్పు 
వారివి తో సహా, మరి కొన్ని విగ్రహాలు,
నిమ్మళం గా చూస్తూ, పరుగులు తీసే 
జన వాహిని కి బాసట గా, మరో కేంద్రం 
అంటే జుక్త్షణ్ లో, మన కందరికీ 
దేశమంటే మనుషులోయ్ అని చెప్పి,
కన్యాశుల్కం అనే అజరామర గ్రంధాని 
ఇచ్చిన గురజాడ వారు, కుర్చీ వేసుకుని 
కూర్చుని, పిల్లలూ నెమ్మది, నెమ్మది, 
ఏమిటి ఫాస్ట్ బతుకులు అన్నట్టు 
కోర్చుంటారు, మనింటి పెద్ద లాగ.
బీచ్ రోడ్ మీదే ఒక పడుకున్న 
తిమింగలం లాగ ,ఒదిగి ఉంటుంది 
సబ్ మరినే మ్యుసియం , ఎంత బాగుంటుందో
లోపల, మా విశాఖ జ్ఞాపకాల ని దాచి బెట్టిన
నరో మ్యుసేయం , బీచ్ రోడ్ మీద క్రిశునుడి 
ఇస్కాన్ గుడి, ఇంక ముందు కి వెళితే
ఎర్ర మట్టి దిబ్బలు, యుగ యుగాల రహస్యాలు 
ని దాచుకుని, భీమ్లి బీచ్ అందాలూ లో
చలం ,సురీస్ మూర్చ పోయి , కథలు రాసేరు,
నివసిన్చేరు, బొర్రా గుహలు అరకు ,మరి
ఇంక అడగకు ,ఆ అందాలు, ఈ విశాఖ నించే 
ప్రయాణం మొదలు..
తూర్పు తీరాన వెలిసిన మణి హారం ,విశాఖ..
అందుకే మరి ,విశాఖ అందరికి ముచ్చట.
నా విశాఖ కాదు, మా విశాఖ, మనందరి విశాఖ..
అందరికి స్వాగతం, ఈ అందాల ,సుందర నగరానికి,
ఇంకా అటు, బెల్లం తీపి అనకాపల్లి, స్టీల్ ప్లాంట్
మర్చిపోయేను, ఇటు మహారాజుల విజయనగరం 
అబ్బా,,ఎన్నెన్నో ..మణి హారం విశాఖ, మా విశాఖ లో..
అందరికి స్వాగతం మరి, మీ అందరికి స్వాగతం 
విశాఖ అందాలలో సేద తీరండి , ఆస్వాదించండి..

28 జూన్, 2012

రామ్ భరోసా

నేను కువైట్ వచ్చిన కొన్ని రోజులకే, మా ఇంట్లో పనికి కుదిరాడు, రామ్ భరోసా ..బంగ్లా దేశం అతనిది. కాని హిందువే అని విని ఆశ్చర్య పోయాను. మా ఇంట్లోని కిటికీ ,తలుపులు అన్ని గాజు తో చేసినవి, చూడ డానికి ఎంతో అందం గా ఉంటాయి, బయట సముద్రం, ఆకాశం నీలం గా ఇంట్లో నించే చూడడం..మరి ఎంత అందమో ,ఎంత అదృష్టమో కదా..

కాని, వాటికి మురికి పట్టి, మసక బారితే తెలిసింది, అవి తుడుచుకువడం ఎంత కష్టమో? మామూలు ఇంటి పనులే కష్టం అనుకునే సమయం లో ఈ ఎక్ష్త్ర పనులు ఎవరు చేస్తారు? అని తల పట్టుకుని కూర్చున్న సమయం లో వచ్చాడు దేవుడు లాగ..

అద్దాల మీద మురికి అంతా తుడిచేసి, మిల మిలా మెరిపించిన రోజునా ,మా ఇంట్లో , నేను హిందువు నే కదా ,మీ దేవుడు కి ఒక మందిరం చేస్తాను ,అన్నప్పుడు మా మనసులో స్థానం సంపాదించుకున్నాడు.

అన్నట్టే, దేర్మోకోల్ అనే తేలిక గా, తెల్లగా ఉండే  అట్టలతో, చక్కని ఒక మందిరం తయారు చేసి , ఒక చిన్న బల్ల మీద పెట్టిన మా దేవుల్లకి ,ఓ ఇల్లు ,అదే ఒక మందిరం కుదిర్చాడు.

అసలే, నాకు కొత్త ,ఈ పూజలు,దేవుళ్ళు అవి, మునుపు అలవాటు లేదు, ఇప్పుడిప్పుడే కొత్త గా నేర్చుకుంటున్నాను, అందం గా ఉన్నాయని, చిన్న పాత్రలు, ఒక గంట, దేవుడికి నా మీద దృష్టి మరలచాలంటే ఇది ఉండాల్సిందే అని కొన్నాను. అసలే కొత్త భక్తురాలిని.

మాడం ! ఈ మందిరానికి ఎన్ని మెట్లు పెట్టాలి అని క్లిష్టమయిన  పశ్న లు అడిగి ,నన్ను ఇబ్బంది పెట్టి, నా తెల్ల మొహం చూసి గ్రహించి , ఏడు లేదా తొమ్మిది అని తనే చెప్పి, నన్ను రక్షించి, చక్కగా కుదురుగా కూర్చుని , మందిరం తయారు చేసి ,ఆ రోజు నించి ,తనకి అదే ఒక మందిరం, గుడి గా చేసుకున్నాడు.

మాట్లాడ్డం అంతా హిందీ లోనే, కాని అది బెంగాలి లాగే వినిపించేది, హిందీ ఏ సరిగా రాని  నేను, ఈ భాష ని అర్ధం చేసుకోడానికి ,ఒక అనువాదకుడు కావాల్సి వచ్చేసి, ఇంకెవరు??ఇంట్లో ఉన్న మరో ప్రాణం..

వారానికి మూడు సార్లు వచ్చి, ఒక్కో పని, ఒక రోజు కిటికీలు, గుమ్మాలు అంటే అన్ని గాజువి తుడవడం, ఇంకో రోజు బాత్రూమ్లు ,మరో రోజు ఇల్లంతా తుడవడం, తన పనేదో తాను చేసుకుంటూ ..మా ప్రాణానికి హాయిగా ఇల్లంతా అద్దం లా మెరుస్తూందంటే..అతని చేయే అని..మేమూ అతని ని మర్యాదగా చూడడం వల్లనో ,ఏమో ,ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది మాతో .

వాళ్ళ ఊరులో ,ఉద్యోగాలు దొరకని పరిస్థితులు , ఉన్న ఊరు వదిలి, పొట్ట చేత బట్టుకుని ,ఉద్యోగాల కోసం వలస వచ్చే అందరి కథ, వ్యథ ఒక్కటే కదా అనిపించేది, మాకు..

పని అంతా ,అయిపోయేక కూర్చుని అతను ,తన కుటుంబం గురించి చెపుతూ ఉండేవాడు. అమ్మ, ఒక చెల్లి, ఒక నాన్న, అందరిలాంటి కుటుంబమే, నాన్న అంటే ఎందుకో పడదు, అమ్మ అంటే ఇష్టమే, భారత దేశం అయినా, మన పొరుగు దేశం అయినా ,అందరి కథలు ఒకటే..

పండని భూములు, పెరిగినాప్పులు, చదివిన చిన్న చదువులు, రాని  ఉద్యోగాలు, కుటుంబ బాధ్య తలు ,అన్ని నెత్తిన వేసుకుని,ఈ కువైట్ దేశం వచ్చేడు అతను.

కంపనీ లో జీతం కి తోడుగా ,ఇలా ఇంటిలో కూడా పనులు చేస్తూ. తన జీవితానికి ఒక్కో మెట్టు సమకూర్చు కుంటున్నాడు. ఒక్కో పైసాకూడ బెట్టుకున్తున్నాడు.

మేం ఇండియా వచ్చి ,ఒక నెల రోజులు సెలవు తీసుకుని ఉన్నప్పుడు, కువైట్ నించి వచ్చే ఏకైక ఫోన్ ఈ రాం భరోసా నించే? ఎలా ఉన్నారు? అన్న ఒక్క మాటే. మళ్లీ  ఎప్పుడు వెనక్కి వస్తున్నారు ? అన్న రెండో మాటే, మాకు కొండన్తబలం ..ఇచ్చేది అంటే అబద్ధం కాదు.

మేం ఏటా రెండు సార్లు అయినా ఇండియా వచ్చి వెళతాం. తిరిగి వచ్చిన ప్రతి సారి, మళ్లీ ఎప్పుడు వెనక్కి వెళతాం అని ఒక డేట్ అనుకుంటే కాని తృప్తి ఉండదు, ఇంక ఆ రోజు కోసం ఎదురు చూడడమే ..

అలాంటిది, ఈ రామ్ భరోసా వచ్చి మూడేళ్ళు యిది ట ,ఇప్పటికి ,కొంత నిలబడి ఉద్యోగం లో ,తన దేశం వెళ్ళే ఆలోచన చేస్తున్నాడు. మాట లో, నడక లో చురుకు, పని లో బద్ధ కం, అవును మరి, తన ఊరు, తన కుటుంబం గుర్తు వస్తే చేతులు పట్టు తప్పి, పనే మందగిస్తోంది.

ఒక రోజు , కొంత మొహమాటం గా, ఒక ఫోటో చూపించాడు, తన మొబైల్ ఫోన్ లో, తనకి కాబోయే భార్య అని. చిన్న పిల్ల లాగ ఉండే అనుకున్నాం.. అయినా అతనికి నచ్చింది, మేమూ సంతోషించాం.

ఇదంతా , ఇంకా ఆరునెలలు ప్రయాణం సమయం ముందు, నేను ఈ లోపల ఒక సారి మా ఊరు వెళ్ళడం అయింది, మేం ఇద్దరం అనుకున్నాం, ఏదయినా కొనాలి ఈసారి కానుక గా అని, ఈ లోపలే అతను మాకు సిగ్గు గా ఒక లెంగ ,చొలి డ్రెస్ ,మంచి ఎరుపు రంగు లో, టి వి ల లో చూపించే లాంటిది కావలి ,తన  కాబోయే భార్య కోసం అని చెప్పేసరికి, మా పని సులభం అయిపొయింది అనుకున్నాం..

నేను అతను చెప్పినట్టుగానే, ఒక ఎరుపు రంగు డ్రెస్ కొనుక్కుని వచ్చాను, చూసి సంతోషించేడు.

మీ దగ్గరే పెట్టండి, నేను ఊరు వెళ్ళే టప్పుడు  తీసుకు వెళతాను అంటే సరే అని బీరువా లో దాచి పెట్టెను .

జనవరి నెల వచ్చింది,  మళ్లీ  నా ప్రయాణం దగ్గర పడి , బీరువా సద్దు తొంటే ,ఈ డ్రెస్ కనిపించింది, అదేంటి ,ఏమయింది ఇతని ప్రయాణం ? అని ఆరా తీసేం .

దిగులు మొహం తో, వాయిదా పడిందని చెప్పేడు, కంపెనీ లో ఏవో సమస్యలు, ఇలాంటి చిన్న వారి మీదే కదా వ్పెద్ద వారి ప్రతాపం.

మొత్తానికి, నేను ఆ డ్రెస్ కొన్న ఏడాదికి ,అతఃను టికెట్ కొనుక్కుని, తన దేశానికి బయలు దేరాడు.  వెళ్ళే ముందు మా కాళ్ళ కి దణ్ణం పెట్టేసరికి, ఈ పెద్దరికానికి మేం మురిసిపోయాం..

అతను వెళ్ళాక కానీ, మాకు అతని లోటు తెలిసి రాలేదు.  మసక బారిన గాజు గోడలు, మురికి ఓడుతున్న బాల్కనీలు ,హ్మ్మం.. చేతిలో చీపుర్లు, తుడిచే గుడ్డలు..రూపమే మారిపోయింది ..

ఎప్పుడు వస్తాడా?ఇతను వెనక్కి అని ఎదురు చూపులు మావి.

హాయిగా ,తన ఇంటి వారితో కరువు తీరా మాట్లడుకుంటూ , పెళ్లి చేసుకుని, భార్య తో సరదాగా, అంతలోనే దిగులు గా అవును మరి వెనక్కి వెళ్లి పోవాలి, ఉద్యోగం సద్యోగం ఉంటేనే కదా, పెళ్లి, సంసారం..ఒక నెల పొడిగించు కున్నాడు సెలవు, అయినా కొత్త పెళ్లి కూతురు ని వదిలి, రావలసిందే ఎప్పటికయినా ,అనుకుంటూ దిగులు గానే కువైట్ దేశం కి వచ్చేడు, మూడు నెలల సెలవు తరువాత.

ఈ దేశం లో ,భార్య పిల్లలని తీసుకు రావంటే, ఒక లెక్క అంటే ,ఇంత జీతం దాటి ఉండాలి అని రూల్, అదేమీ రూల్ జీతాన్ని బట్టే సంసారాలు చేస్తారా? ఏమిటి ? అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యం ,గా చాలా బాధ గా ఉంటుంది.


 మా అద్దాల గోడలు మళ్లీ మెరుస్తూ ఉన్నాయి..


కొన్ని రోజులు , చాల దిగులు గా కనిపించేడు, ఇంతలోనే ,ఒక సంతోషం ..అతని భార్య గర్భవతి అని ఒక వార్త ఎంత వెలుగు నిచ్చిందో ..హుషారు గా , భలే ఉన్నాడు ..అనుకున్నాం మేం ఇదరం.

మందిరం కట్టిచ్చినా ఆ దేవుడు కి కనికరం లేదా? గర్భం నిలవ లేదు, అనే చేదు  వార్త ని ఎలా మింగాడో? పాపం శంకరుడు లాగా, దుఖం ,గొంతు లో దాచుకుని, ఎంత బాధ పడ్డాడో?

ఎర్రని పెళ్లి దుస్తుల లో , రూపాలి అతని భార్య పేరు, ఆమె ఫోటో ఒక్కటే అతని కి అండ  గా నిలిచి ఉంటుంది, ఫోన్లు మాట్లాడుకుంటూ ,ఆమె ని ఓదారుస్తూ, తనని తానూ ఓదార్చు కుంటూ..రోజులు ,నెలలు గా గడిచి పోయాయి.

ఈసారి, ఉద్యోగం లో నిలదొక్కుకున్నాడు కాబట్టి, త్వరగానే సెలవు సంపాదించుకున్నాడు.

పెళ్లి అయిన ఏడాదికి , తన దేశం బయలు దేరి వెళ్ళాడు, మా  ఆశీస్సులు  త్తేసుకోవడం మర్చి పోలేదు, ఈ సారి, మాకు గొంతులో ఏదో బాధ ఉండ లాగ..ఎంత అలవాటు అయిపోయదో, మా ఇంట్లో.

అలాగని, పెద్ద గా మాటలు అవి ఉండవు, నెమ్మదిగా తలుపు తాళం తో తీసుకుని, వచ్చి ,పిల్లి లాగా అడుగుల చప్పుడే వినపడదు, తన పని తానూ చేసుకు వెళ్ళిపోతాడు.

పని అంతా అయాక, తను ప్రతిష్టించు కున్న ఆ దేవుడి మందిరం ముందు, మోకాళ్ళు  మీద నిల్ల్చుని, బెంగాలి లో దేవి  స్తుతి ,చదివి, దణ్ణం పెట్టుకుని , ఒక అగర బత్తి వెలిగించి. మదిరం ముందున్న చిన్న పళ్ళెం లో ఒక నాణెం కూడా హుండీ లో వేసినట్టు వేసి, వెళతాడు.

అతని పని అయిపోయిందని ,మాకు ఆ అగర బత్తి సువాసనే తెలుపుతుంది.

సెలవు రెండు నెలలు. పెళ్లి కూడా చేసుకున్నాడు, ఖర్చులు ఎక్కువే ఉంటాయి, ఇంట్లో నేను ఒక ఉదాహరణ కదా, అని అలోచించి, రాను పోను టికెట్ కొని పెట్టేం, ఇదేదో మా గొప్ప తనం కాదు, ఇంట్లో మనిషి అనిపించినా మా రామ్ భరోసా మంచి తనమే అనుకుంటాం..మేం..


రెండు నెలలు, కొత్త గా పెళ్లి అయి, వదిలి వచ్చి, మళ్లీ ఏడాదికి సంసారం..రెండు నెలలు, మూడు నెలలు గా పొడిగింప బడ్డాయి. వదల లేక , బాధ పడుతు కువైట్ కి తిరుగు ప్రయాణం.

ఏమిటో ఈ థర్డ్ వరల్డ్ దేశాలు ట  మనవి..

ఇది మన దేశాల దుస్థితి ..మన దేశ ప్రజలకి మనం ఉద్యోగాలు చూపించాలేం ..ఏవో మధ్య ప్రాచ్య దేశాలు, పెట్రోల్ ,ఆయిల్ తో డబ్బు లు సంపాదించి ,మన బీద దేశాల ప్రజలకి ఉద్యోగాలు చూపిస్తారు, జీతాలు చాల తక్కువ, కాని, ఇవి కూడా దొరకవు, వాళ్ళ దేశాల లో, మన రూపాయల్లో మార్చుకుంటే, చాలా ఎక్కువే అనిపిస్తుంది, కాని కుటుంబానికి దూరం గా ఉండాలి. ఇది ఇక్కడ పని చేసే చిన్న ఉద్యోగస్తుల జీవితం ఎంత కష్టమో ? ఎంత వేదనో?

నాకు ఒక తేలికయిన దక్క  కాటన్ చీర, బహుమతి ..మొహమాటమ గా అనిపించింది, అయినా నిండు మనసు తో ఇచ్చేడు కదా అని, తీసుకున్నాను. కొన్ని బెంగాలి స్వీట్స్..

అన్యమస్కం గా పని, ఏమి టో అతని బాధ మాకు తెలుసు, కాని, ఏమి చేయలేం..ఏం  చేయగలం?

అతను ఎదురు చూస్తున్న కబురు ఏమిటో మాకు అర్ధం అయింది, తను తండ్రి ,అవుతాడు, కుటుంబం పెద్దది అవుతుంది అన్న ఆశ , ఒక చిన్న ఆశ, భార్య గర్భవతి అయింది అన్న ఒక్క వార్త కోసమే..

అతని ఎదురు చూపులు.. వచ్చి, ఒక నెల అయిపొయింది, అయినా అతని ఆశ చావలేదు..

ఇంకా ఆశే లేదు, అప్పుడే మూడు నెలలు దాటింది.. మళ్లీ  అతను తన దేశం ఎప్పుడు వెళతాడో?

నాకు ఎదురుగా ఉన్న ఈ రామ్ భరోసా  బాధ అర్ధం అవుతోంది, కాని నా హృదయానికి బలం గా తాకేవి, రూపాలి కార్చే  కన్నీళ్ళే ....దేశాల అంతరం ఉంది కాని ఒక ఆడదాని కన్నీళ్లు ఒక  ఆడదానికే అర్ధం అవుతాయి..

ఈ దేశాల అంతరాల సంసారం....ముచ్చట్లు ..వెతలు..ఇలాగే ఉంటాయి..గుండెలు పిందేస్తూ..

ఇది ఒక్క రామ్ భరోసా కథే అనుకుంటున్నారా? ఇంకా ఎంత మంది వో..





















19 జూన్, 2012

నాన్న

             
రాత్రి అవుతూండగా ఇంటికి చేరి ,సైకెల్ స్టాండ్ వేసి, ఓ చేతి సంచి తీసి, అరిగిపోయిన చెప్పులు వసారా లో వదిలి, నెమ్మదిగా ,పిల్లి లాగ వచ్చేడు, తలుపులు తీసిన చప్పుడు కి పిల్లలు ఎక్కడ లేస్తారో? అనుకుంటూ గురుమూర్తి.
వచ్చారా? అంటూ భార్య ఎదురు అవలేదు, నాన్నా ,నాన్నా! అంటూ పిల్లలు చుట్టూ ముట్టలేదు.
పిల్లలు అంటే ఇద్దరు, కవల పిల్లలు, ఇద్దరి పుట్టిన రోజు ఒక్క రోజే, ఒక కిరణా కొట్టు లో గుమస్తా ఉద్యోగం. వచ్చేది, మూడు వేల జీతం. ఎలా సర్డుకుందాం అన్నా, సరి పోదు,చాలి చాలని దుప్పటి తో ఇటు తలో, అటు కాల్లో కప్పుకో గలిగే లాంటి జేవితం..వారిది.
పిల్లలు ఎదురు చూస్తారు,అని తెలుసు, పుట్టిన రోజు కి కొత్త బట్టలు లేవు కదా, కనీసం ఒక స్వీట్ అయినా తినిపించాలని తాపత్రయం పడి, షావుకారు ని ఒక వంద రూపాయిలు అప్పు అడిగేడు, జీతంలోంచి కోసుకో మని. 
వెకిలిగా ఒక నవ్వు నవ్వి, నీ జీతం లో ఇంకా ఏం కటింగ్ చేయను?
ఇప్పటికే చాల వాడుకున్నావు.. అని ఊరుకున్నాడు.
గురుమూర్తి కి ఒక్కసారి జీవితం అంటే విరక్తి పుట్టింది. ఏమిటి బతుకు?
కుక్క బతుకు..రోడ్డు మీద కుక్క అయినా నయం..పెంచలేని వాడికి పిల్లలెందుకు?
ఆలోచిస్తూ, షావుకారు చూడకుండా ఎలక లకి కొన్న మందు, ఓ పొట్లం సంచి లో పదేసుకున్నాడు. దారిలో బండి వాడి దగ్గర అరువు పెట్టి, ఓ పావు కేజీ స్వీట్ కొని, దానిలో మందు కలిపి తెచ్చాడు, అందరూ కలిపి తినేసి, చాద్దాం ,ఈ పుట్టిన రోజు నాడే చావు కూడా ,భలే గమ్మత్తు గా ఉంటుంది అని ఉన్మత్తం గా నవ్వుకుంటూ..
పిల్లలేరి ? అని తొంగి చూస్తే, హాయిగా నిద్రోతున్నారు, మూతి కి అంటిన కేకు మరకలు ఇంకా వాసన వస్తున్నాయి.
ఏమిటి ఆశ్చర్యం? అని తొంగి చూస్తే, జడలో చిన్న మల్లె పూవు మాల తో భార్య ,తెల్లని చీర లో నిదుర పోతోంది,చిన్న బల్ల మీద ఒక కేక్ ముక్క, నాలుగు పకోడీలు, ఒక గ్లాసులో ఏదో డ్రింక్..
గుండె ఘుభేల్ మంది, వీళ్ళు కానీ నా మనసులో మాట తెలుసుకున్నట్టు ముందే???
తలుపు చిన్నగా చప్పుడు చేసేడు, భార్య కదిలి ,లేస్తుందేమో అని, 
మీరు నిద్రపోండి గమ్మున, పిల్లలు ఇప్పుడే నిద్ర పోయేరు, నాకు తెలుసు ,మీరిలాగే చేస్తారని..
గురుమూర్తి ,ఆబగా ప్లేట్ లో పెట్టినవి తినేసి, గ్లాసులోది తాగేసి, అవే బట్టల తో ,మంచం ఎక్కి భార్య పక్కన చేర బోయి, ఎందుకో ,ఏమో కాస్త దూరం గానే పడుకున్నాడు.ఇంక రేపటి గురించి దిగులు లేదు.హమ్మయ్య అని నిశ్చింత గా..
కల లో ఇంటి ఓనరు, నాలుగు ఉంగరా ల వెళ్ళ తో కనిపించేడు.అయితేనేం..హాయిగా నిద్ర పోయేడు ఇన్నాళ్ళకి.

16 ఏప్రి, 2012

కలలు నిజం అయిన వేళ

అర్పణ భారత దేశానికి బయలు దేరే విమానం లో కూర్చుని..
ఎప్పుడెప్పుడా ? ఇరవై సంవత్సరాల క్రితం దూర మయిన తన మాతృ   దేశం ఎప్పుడెప్పుడు చూస్తానా? అని గంటలు, నిముషాలు లెక్క పెట్టు కుంటోంది.
అమ్మ ఎందుకో తన దేశం గురించి ఎప్పుడూ చెప్పదు..అమ్మా..ఇండియా కి వెళదామా? అంటే..సెలవులలో, ఫ్లోరిడా బీచ్ అంటుంది, లేక పోతే లండన్ బ్రిడ్జ్ అంటుంది..

ప్రపంచం లో అన్ని దేశాలు తిరిగినట్టే ఉంది..ఒక్క ఇండియా తప్ప.నాన్న..హు..నాన్న ఒక ముని..మాట్లాడడు..వైద్యాలు చేస్తారు అందరికి,కాని, మా ఇంటికి మటుకు ఎప్పుడూ అశాంతి రోగం..

ఒక పెద్ద భవనం కట్టేరు, అన్న చైనా కి వెళ్లి పోయాడు..ఏదో నేర్చు కుంటాను అని వంక పెట్టి, నా డిగ్రీ కూడా అయింది..ఇంక ఉద్యోగం లో చేరాలి.

మూడు నెలల గడువు తీసుకుని, నా దేశం చూసి రావాలని ప్రయాణం అయాను.ఆఖరి నిముషం లో చెప్పేను, అమ్మ కి. ఫలానా హెల్ప్ గ్రూప్ లో, పల్లెటూర్ల లో సేఫ్ వాటర్ ప్రాజెక్ట్ లో ఫీల్డ్ వర్క్ చేసి ,వివరాలు సేకరించాలని.

మాకు చిన్నప్పటి నించి, సంఘ సేవ చేయడం అలవాటే..మా స్కూల్స్ లోవాటికి మార్కులు కూడా ఇస్తారు.

అమ్మ కోపం గా చూసి, నాకు చెప్ప లేదేం? అంది.

నువ్వు వద్దు అంటావు కదా అమ్మ..గొడవ ఎందుకు ? అని..

నాన్న కి తెలుసా? ఊ ..అని అస్పష్టం గా పలికి ,నాన్నకి ముందు నించి తెలుసు అంటే, ఎంత గొడవో?

అయినా ,ఎన్ని సంవత్సరాలు అయిందో, ఇద్దరి మధ్య మాటలు లేవు. అమెరికా లో అయితే ,ఇంత పడక పోతే విడి పోతారు.

చిన్న తనం లో ,స్నేహితులు ,స్కూల్, సెలవులు , వడి వడి గా నడిచే జీవితం లో లోటు తెలియ లేదు.

కాలేజ్ కి వెళ్ళేను..సెలవుల్లో ఇంటికి రావాలంటే..ఎంత బాధో?
శూన్యం గా ఇల్లు..మాటలు లేని ఇల్లు..మాకు ఎవరూ చుట్టాలు, బంధువు లు లేరా? ఎవరూ రారేమిటి? ఒక ఫోన్ అయినా చేయ రేమిటి?

అమ్మమ్మ పోయిందని ఒక వార్త ఎప్పుడో వచ్చింది..
అంతే..తాతగార్లు ముందే లేరు.

నాన్న గది లోకి .వెళ్లి తలుపు వేసుకుని, ఎందుకు బాధ పడతాడు?
అన్నీ ప్రశ్నలే..



"మా కోసమేనా? కల్సి ఉన్నారు" అంటే..

"ఊహు..మీ అమ్మ నన్ను ఇష్ట పడి చేసుకుంది.."

"నేను వదలలేను..ఆమె ని.".నాన్న సమాధానం.


ఆలోచనల మధ్య, నిద్ర పోయి లేచేసరికి ,విమానం ఢిల్లీ లో ఆగింది.

ఢిల్లీ లో విమానం  మారి అక్కడ నించి హైదరాబాద్ విమాన శ్రయం లో దిగేను..

తన ప్రాజెక్ట్ గ్రూప్ , నించి ఒకరు వచ్చి స్వాగతం పలికేరు.

ప్యాంటు ,షర్టు , ఏమయినా ఇబ్బందా? అనుకుంది కాని, చాల మంది అమ్మాయిలే జీన్స్ ,టీ షర్టు లో కనిపించేరు.

ముందే ఒక కుటుంబం తో ఒప్పందం చేసుకుంది, నెట్ ద్వారా..వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండ డానికి.

ఇద్దరే ఉంటారుట.వారి సొంత ఇంట్లో .శాంత, నరసింహం గారు ..పిల్లలు అమెరికా లో ఉన్నారు..వారు ఇలా విదేశీ అతిథులకి  ఆతిథ్యం ఇవ్వడానికి ,తమ పేర్లు నెట్ లో పెట్టేరు. 

అలా, నాకు తెలిసి, విద్యా  నగర్ లో ఉన్న వారింటికి వచ్చేను.

చాలా ఆప్యాయం గా ఆహ్వానం పలికి, అర్పణ..తెలుగు లో మాట్లాడ గల వా? అని అడిగేరు.

చక్కగా కాదు ,కానీ, కొంచం, కొంచం మాట్లాడుతాను, ఇంట్లో తెలుగే మాట్లాడుతాను, ఈ మధ్య అలవాటు పోయింది ,త్వరగానే మళ్లీ నేర్చు కుంటాను..అని సమాధానం చెప్పేసరికి..చాల సంతోషించేరు.

రెండు రోజులు ,హైదరాబాద్ లో  విశ్రామం..తరువాత నల్గొండ చుట్టూ పక్కల ఊర్లు, పల్లెటూర్లు తిరిగి, అక్కడ మంచి నీటి లో ఫ్లౌరిడ్ ఎక్కువ శాతం  ఉన్నట్టు తెలిసింది, వాటి వివరాలు సేకరించాలి.

అక్కడ అవసరాలని గుర్తించి, ,ప్రపంచం అంతా మంచి నీరు కోసం పాటు పడే ఒక   అమెరికా సంస్థ కి నేను రిపోర్ట్ చేయాలి.

ఆ పైన వారు ,తగిన సాయం చేయడానికి నిధులు విడుదల చేస్తారు.

"ఎంత దూరం నించి వచ్చావు అర్పణ ! ..ఎంత మంచి మనసు నీది..పక్కనే ఉన్న మా రాష్ట్రం  ఊరి లో కష్టాలు ,ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు."

"ఎక్కడో అమెరికా లో ఉన్న వారికీ మన దేశ ప్రజల మీద ఎందుకు అంత ప్రేమ?" శాంతమ్మ గారు ఆశ్చర్యం గా అడిగేరు.

నాకు ,ఎక్కడి నించి మొదలు పెట్టి చెప్పాలో తెలియలేదు," అమెరికా ఒక రిచ్ ..గొప్ప దేశం, అక్కడా పేద వాళ్ళుంటారు, ముఖ్యం గా నల్ల వారు."

"అక్కడ అవకాశాలు ఉపయోగించుకుని, అంతు లేని సంపదలు సంపాదించిన కొంత మంది , ఏదో చేయాలని, ప్రపంచం లో పేదరికం రూపుమాపాలని ,ఏవో ఉద్దేశాలు తో ,కొన్ని కార్యక్రమాలు మొదలు పెడతారు. బిల్ అండ్ మెల్లి గేట్స్,వార్రెన్ బుఫ్ఫే ,ఇలాంటి వాళ్ళే. అలాగే కొంత మంది ,తమ పేర్లు బయటకి రాకపోయినా , ప్రచార ఆర్భాటాలు లేకుండానే ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తూంటారు. మన భారతీయులు కూడా  ఉన్నారు ,మీరు నమ్ముతారా?"

"నేను ఉద్యోగం చేయబోయేది, అలాంటి ఒక మంచి పని చేసే ఒక ట్రస్ట్ లో"
అని చెప్పేసరికి ,శాంత గారు చాలా సంతోషించేరు..


"నీకు అంతా మంచే జరుగుతుంది అర్పణ ..నువ్వు చాలా మంచి పిల్లవి..అని నిండు మనసు తో నన్ను ఆశీర్వదించేరు."


ఇక్కడికి రావడానికి ఒక  కారణం..నా ఉద్యోగానికి  ఇది ఒక అనుభవం గా ఉపయోగ పడుతుందని..ఇంకొక ముఖ్య మైన..ఎవరికీ చెప్పని విషయం..నా వాళ్ళు, అంటే మా బంధువులని వెతకాలని..

రెండు వారాలు నల్గొండ చుట్టూ పక్కల అంత తిరిగేం., నా ప్రాజెక్ట్ కి ఇక్కడ ,హైదరాబాద్ లో  ఒక ఆఫీసు ఉంది, ఇద్దరు అబ్బాయిలు ,నాకు తోడూ గా వచ్చేరు, ఒక జీప్ ఇచ్చేరు.

వాళ్ళకి కూడా నేను అమెరికా నించి ఇక్కడికి రావడం..ఒక పెద్ద ఆశ్చర్యం.

పరిస్థితులు చాలా దారుణం గా ఉన్నాయి, మంచి నీళ్ళు అందించడం సరే, ముందు గా ,ఆ నీరు తాగి ,కాళ్ళు వంకర అయిపోయిన వారి కి ,సాయం అందాలి, అని అది కూడా రిపోర్ట్ లో రాసేను.

ఫోటోలు తీసేం, వివరాలు సేకరించెం ..మమ్మలిని చూసి, ఏదైనా ధన సహాయం చేస్తారా? అని అడిగేరు కొందరు. నాకు ఏం జవాబు ఇవ్వాలో అర్ధం అవలేదు.

హైదరాబాద్ లో చూడవలసిన ప్రదేశాలు ,అన్నీ చూపించేరు. శాంత గారు.

నేను వైజాగ్ వెళ్ళాలి అండి..అన్నాను..

"ఒక్కర్తివి? నీకు భయం లేదా?"
" అదేం లేదు, నాకు అలవాటే..ఆఫ్రికా అవి చూసి వచ్చేను సెలవులకి, ఒక్కర్తిని",అనేసరికి, ఎంత ఆత్మ విశ్వాసం తో ఉంటారో ,అక్కడి పిల్లలు..అని మెచ్చుకున్నారు.

ఏమో మరి, మాకు జాగ్రత్తలు చెపుతారు ,కాని భయాలు తెలియవు.

నాన్న కి మెయిల్ రాసి, నాన్న ఇంటి అడ్రస్ వైజాగ్  లో   తెలుసు కున్నాను.

అప్పుడే ఒక విషయం రాసేరు ..అప్పూ..నీకు ఒక అత్త ఉంది, అంటే తెలుసు గా, నా సొంత చెల్లెలు.

ఒకసారి ,ఎలా ఉన్నారో చూసి రా..అని..

 ఇంక ఒక్క నిముషం కూడా ఆగలేను అనిపించింది.

శాంత గారు జాగ్రత్తలు చెప్పేరు, విమానం లో ఎగిరి, వైజాగ్ లో వాలేను, టాక్సీ మాట్లాడుకుని, నాన్న చెప్పిన సీతమ్మ దార లో ఎనిమిదో వీధి లో, నాలుగో ఇల్లు..అక్కడ అన్నీ అపార్ట్మెంట్స్ కనిపించాయి.


అయినా ఆశ చావక, మెల్లిగా నడపమని, ఒక్కో ఇల్లు చూస్తూ వెళుతున్నాను.. 


నా కళ్ళకి, ఒక సంభ్రమం.. అర్పణ టవర్స్ అని పెద్ద ,పెద్ద అక్షరాలతో.నాకు ఎదురుగానే ఒక అయిదు అంతస్తుల భవనం..


అర్పణ ..నా పేరే..తప్పకుండా ఇది నా ఆత్మీయుల, బంధువుల కి సంబంధించినదే అయి ఉంటుంది.


ఉద్వేగం తో,నాతో తెచ్చుకున్న ఒకే ఒక బ్యాక్ ప్యాక్, భుజాన వేసుకుని, టాక్సీ దిగేను.


మా ఇంటి పేరు చెప్పేను, ఎవరు కావాలమ్మ? అన్న వాచ్ మాన్ కి
అత్త పేరేమిటి? ఊ..గుర్తు వచ్చింది.
శ్యామల ..శ్యామల గారు..అంటూ సందేహం గా అనేసరికి..


మాడం గారా? పెంట్ హౌస్ లో ఉంటారు అమ్మ..
పదండి నేను తీసుకు వెళతాను, బాగ్ ఇవ్వండి అన్నాడు.
ఫర్వాలేదు, నాకు అలవాటే..అని చనువు గా బాగ్ భుజాన్ వేసుకుని ముందుకు నడిచేను.


వాచ్ మాన్ ని ఏం అడగను? ఎవరెవరు ఉంటారు? నన్ను ఎలా ఆహ్వానిస్తారు? ఇన్నేళ్ళ ,తరువాత, నన్ను నేను ఎలా పరిచయం చేసు కోవాలి? లిఫ్ట్ ఐదో అంతస్తు చేరే లోపల, ఎన్నో  రకాల ఆలోచనల తో, నాకు ఒక్క సారి,కళ్ళ లలో నీళ్ళు తిరిగేయి.


ఐదో అంతస్తు తరువాత, ఒక పది మెట్లు..అవి ఎక్కి ఒక చిన్న వరండా , అందమయిన గ్రిల్ తలుపు. తలుపు పైకి అందం గా ఒక మనీ ప్లాంట్ పాకి ఉంది.


నాన్న..నాన్న కి ఎంత ప్రాణమో? మొక్కలు అంటే, ఇంటి నిండా పెంచుతున్న మొక్కలు, నాన్న చేతి చలవే..


వాచ్ మాన్ బెల్ నొక్కి, వినయం గా నిల్చున్నాడు.


మాకు ఇలాంటి మర్యాదలు ,అలవాటు లేదు..ఎవరి తాళం, వాళ్ళు తీసుకుని ,ఇంట్లో కి వెళ్ళడమే ఎవరి బరువు, సంచీలయినా ,సూట్ కేస్ లు అయినా ,ఎవరిదీ వారు మోసుకోవడమే. 


ఇక్కడ ఎంత మర్యాద గా ఉన్నారో? అనుకున్నాను..
 ఇంతలో..ఎవరూ అంటూ.. ఒక  స్త్రీ ,సింపుల్ గా ఎంత బాగున్నారో?
ఈవిడేనా? నా అత్త.


అమ్మా ! ఈ అమ్మగారు మీకోసం వచ్చేరు..అని, తన పని అయిపోయిందని, కిందకి వెళ్ళిపోయాడు.


థాంక్స్ ..అని చెప్పేను..నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.


నువ్వు..మీరు..అంటూ, తలుపు తెరిచి, నేను అత్తా, అర్పణ, అంటూ ,కళ్ళ లోంచి కారుతున్న నీళ్ళు ని తుడుచు కున్నాను, చేత్తో.


ఆ ..ఆశ్చర్యం తో మొహం విప్పారింది అత్త కి.నేను నమ్మలేక పోతున్నాను..
అంటూ, ఆప్యాయం గా దగ్గరికి తీసుకుని, బుగ్గ మీద ,చుంబించింది.


ఎంత హాయిగా ఉంది? ఆ స్పర్శే..


లోపలి వెళ్ళాం..నన్ను అలా చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకువెళ్ళి, అమ్మా! ఎవరు వచ్చేరో? చూడు..


ఆ..ఈ సారి నా మొహం విప్పారింది ఆనందం తో, నాయనమ్మ ఉన్నారా? నాన్న ఎందుకు ఎప్పుడూ చెప్పలేదు.


ఇంకా ఆ తరవాత రెండు గంటలు, నా జీవితం లో మర్చి పోలేని, మధుర మయిన గంటలు.


బంధువులు, ఆత్మీయులు కోసం పరి తపిస్తున్న నా మనసు లో మల్లెలు ,గులాబీలు ఒక్కసారే పూసినట్టు .వింత హాయి, శాంతి.


ఎన్నో ప్రశ్నలు..నేను వాళ్ళని అడగడం, వాళ్ళు నన్ను అడగడం..


ఎప్పుడో ఆరేళ్ళ ప్పుడు చూసారుట,నన్ను.
మళ్లీ, ఇన్నేళ్ళకి.


వద్దనా వినిపించు కోకుండా ,ముద్దలు కలిపి పెట్టేరు, అత్త ,నాయనమ్మ కలిసి.. 


రాత్రి అయేసరికి, నాకు ఒక బావ ఉన్నట్టు, బెంగుళూర్ లో  ఉద్యోగం చేస్తున్నట్టు, పేరు గోపాల్ అని, ఒక మరదలు కూడా ఉంది, పెళ్లి అయిందని ,ఈ మధ్యే, నా కన్నా ఒక్క ఏడాదే పెద్ద. ఆమె పేరు రత్న అని మావయ్య ,ఒక కాలేజ్ నడుపుతున్నారని, అత్త కూడా అదే కాలేజ్ లో పని చేస్తోందని ,తెలిసింది.


నా వివరాలు అన్ని కూడా, మళ్లీ ,మళ్లీ, అడిగి తెలుసు కున్నారు.


నా బ్యాక్ ప్యాక్ ఒక గది లో పెట్టేరు, ఇల్లు ఎంత నీట్ గా ,చాలా హాయిగా ఉంది, సొంత ఇంటికి వచ్చినట్టు.


రాత్రి హాయిగా పడుకున్నాను.
మర్నాడే , మళ్లీ కబుర్లు..దోశలు వేస్తూంటే..అత్త..అసలు ఎందుకు, మా నాన్న ..మీతో..అంటే, హుష్ ,అని నోటి మీద వేలు పెట్టి, తరవాత అంది.


మధ్యాన్నం భోజనం కూడా అయిపొయింది..


ఇంక నేను ఆగ లేక పోయాను.
నా గది లోకి లాక్కు వెళ్లి, 
ఇప్పుడు చెప్పాల్సిందే.అత్తా..అంటే,


అత్త..ఎందుకురా..ఇప్పుడు,అని, సరే, నీకు చెప్పాల్సిందే ఎలాగయినా..నా బాధ్యతా కూడా తీరి పోతుంది.


నీ బాధ్యతా?  అని ప్రశ్నార్ధకం నా మొహం లో.

బీరువా తెరిచి, నా చేతిలో ఏవో కాగితాలు పెట్టింది.
నాకు వివరం గా చెప్పు, ఇవన్ని నాకు తెలియదు, అని తిరిగి ఆ కాగితాలు ఆమె చేతికే ఇచ్చేశాను.

ఇవి, నీ పేరు మీద, నీ అన్న అపూర్వ్ పేరు మీద ఫ్లాట్ ఓనర్ లు గా పేపర్లు. షుమారు ఇరవై ఏళ్ళ, క్రితం, మేం చాలా కష్ట మైన పరిస్థితులు ఎదురుకుంటున్న సమయం లో, మీ నాన్న ఒక్కడూ ముందు ,వచ్చేడు, నాకు అమెరికా లో ఒక ఇల్లు ఉంది, నాకు ఇక్కడ ఇంటి తో పనేమీ ఉంటుంది, ఎలాగు అమ్మా నీ దగ్గరే ఉంది, మా దగ్గరికి రానంటోంది, నా వాటా, కూడా, ఈ ఇంటిలో ,నీ పేరు మీద రాసేస్తున్నాను, నువ్వు లోన్ తీసుకుని, మీ కాలేజ్ బాగుపడే వరకూ , ఇబ్బంది పడకుండా గడపండి..అనేసి, వద్దు అన్నా విన కుండా నా పేరు మీద ఈ ఇల్లు ,ఒకప్పుడు ,ఇది ఒక చిన్న ఇల్లు, చుట్టూ పెద్ద స్థలం, రాసి ఇచ్చేసాడు అన్నయ్య.
అంటే  పవర్ పట్టా ,రాసి ఇచ్చేసాడు, నా పేరు మీద.


మాకు అప్పుడు చాల అవసరం ,మీ మావయ్య ఏ కాలేజ్ లోనూ పని చేయలేక, తనే సొంతం గా కాలేజ్ పెట్టుకోవాలనే ఆలోచన లో ఉన్నారు. ఆ ఆస్థి పేపర్లు తనఖా పెట్టి, మేం ఒక చిన్న భవనం అద్దెకి తీసుకుని, సొంతం గా జూనియర్ కాలేజ్ మొదలు పెట్టేం. 


అ అ ..అంటే AA A square అంటారు అందరూ, అదే మా కాలేజ్ పేరు. మీ పేరుల మీదే..

ఏమయిందో ,తెలియదు, మీ అమ్మకి నచ్చలేదు..ఇలా ఇల్లు రాసి ఇచ్చేయడం అని తెలిసింది. ఏం గొడవలు పడ్డారో తెలీదు.
మీ నాన్న దగ్గర నించి ఫోన్ లు రావడం తగ్గి పోయాయి. మేం చేద్దాం అంటే,మీ ఫోన్ నంబెర్ లు  మారిపోయాయి, అనుకుంటాను.

మీ నాయనమ్మ కోసమయినా వస్తారేమో ,అని ఎదురు చూసాం..
మా కాలేజ్ కి మంచి పేరు వచ్చింది, కోచింగ్ కూడా మొదలు పెట్టం. ఎంసెట్ కి. ఇంకా తిరుగు లేకుండా.. ఈ ఊరు లోనే రెండు కాంపస్ లు నడుపుతున్నాం.

ఆ చిన్న ఇల్లు, ఎందుకని ఫ్లాట్స్ కట్ట డానికి ఇచ్చేసాం. మొత్తం ఇరవై ఫ్లాట్స్,అందులో రెండు ఫ్లాట్స్ మీ పిల్లల పేర్లు మీదే ఉన్నాయి, ఇదిగో ఈ పెంట్ హౌస్ కూడా,మీ నాన్న దే.

అంటే ,మీ నాయనమ్మ తన కొడుకు ఇంట్లో నే ఉంటోంది. మాకు రెండు ఫ్లాట్స్ వచ్చాయి.

అన్ని అద్దెకి ఇచ్చేసాం. మీ ఫ్లాట్స్ కి వచ్చిన అద్దెలు అన్ని, ఈ రెండు అకౌంట్స్ లో ఉన్నాయి, నా పేరు తో కలిసి ఉంటాయి..

పాస్ బుక్స్ ,నా చేతిలో పెట్టింది, చూడు అంటే, తెరిచి చూసేను, రెండిట్లో కలిపి యాభై లక్షలు వరకు ఉన్నాయి.
అమ్మో..నా చేతులు గుండెల మీదకి వెళ్ళాయి..అప్రయత్నం గా..

ఇంత డబ్బు నేనేం చేసుకోను?

నీ దగ్గరే ఉంచు అత్తా..
అని వెనక్కి ఇచ్చేసి, నాన్న కి మెయిల్ రాద్దామని, మెయిల్ తెరిచాను.
ఆశ్చర్యం..నాన్న దగ్గర నించే మెయిల్.

నీకు ఒక మంచి ,హ్యాపీ న్యూస్..అప్పు..
మీ అమ్మ నేను మళ్లీ,ఇన్నాళ్ళకి ఫ్రెండ్స్ అయిపోయాం. నాదే తప్పు, అని నేను ఒప్పుకున్నాను, కాదు ,నాదే తప్పు అని మీ అమ్మ అంది..
తప్పు లేమిటో..మా ఇద్దరికే తెలుసు.

ఇరవై ఏళ్ళు పట్టింది, ఈ మాట మేం బయటకి చెప్పు కోవడానికి..మా ఇద్దరి ఎగో లు అడ్డం అయాయి.

మీ పిల్లలు ,అనవసరం గా బాధ పడ్డారు, మా మొండి తనం తో. మేమిద్దరం కలిసి ఇండియా రావాలని కూడా అను కుంటున్నాం..ఇంకో పది రోజుల్లో..

మా ఇద్దరి మధ్య గొడవల కారణం అయిన ఒక విషయం గా, నేను మా అమ్మ ,నా తోబుట్టువు అందరికి దూరం అయిపోయాను. అదంతా ఒక పెద్ద కథ. నేను నిన్ను కలిసినప్పుడు వివరం గా చెప్పుతాను ..

..నువ్వు ఎక్కడ ఉన్నావు?

నీ సంఘ సేవ అయిందా? అత్త ని కలిసావా?

అన్ని వివరం గా రాయి. నాన్న .

నాకు సంతోషం తో ఒక్కసారి గట్టిగా అరవాలని అని పించింది.ఏమిటి ?ఒక్కసారే ఇన్ని మంచి వార్తలు.
అత్తా..అని అరుస్తూ..ఈ వార్త చెప్పేసరికి, అందరం ఒక్క సారి ,సంతోష సాగరం లో మునిగి పోయాం..హ్మం. జీవితం లో ఇంత కన్నా గొప్ప రోజు ఇంకొకటి లేదు, అనుకున్నాను.

అమ్మ ,నాన్న కలవడం మాట్లాడు కోవడం, మంచి రోజులన్నీ నావే, శాంత గారు దీవించడం గుర్తు వచ్చింది, వెంటనే ఆవిడతో కూడా నా సంతోషం పంచుకున్నాను.

హైదరాబాద్ వెళ్ళిన మావయ్య గారు కూడా వెనక్కి వచ్చేరు, వైజాగ్ కి, అందరం కల్సి ,వైజాగ్ అంత తిరిగి చూసేం.

ఇది నా డబ్బు ,అంటారు నాన్న కూడా, నాకు ఒక ఆలోచన వచ్చింది, అత్త ,మావయ్య లతో సంప్రదిన్చేను, నాన్న తో ఒక మాట చెప్పి, ఈ డబ్బు తో, నేను చూసిన ఆ కాళ్ళు ఒంగి పోయిన పిల్లల కోసం, ఒక ట్రస్ట్ పెట్టి, ఏదయినా సాయం చేస్తాను.

నేను చేస్తున్న ఉద్యోగం కూడా ఇలాంటిదే కదా..మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాలి, కదా..నా వంతు గా ,నా దేశం కోసం ఈ చిన్న ప్రయత్నం మొదలు పెడతాను.

మళ్లీ, నల్గొండ వెళ్ళాలి, ఇంకా కొన్ని వివరాలు సేకరించాలి, సహాయం అవసరం అయ్యే పిల్లల వివరాలు ,నేను కూడా సేకరించి, ఈ ట్రస్ట్ ద్వారా, వారికి సాయం చేస్తాను.

అవసరం అయితే వైద్యం, చదువు కి, వ్హీల్ చైర్ ల కి, సహాయం అందించాలి చాల పనులు కనిపిస్తున్నాయి.

అమ్మ ,నాన్న ఇంకో పది రోజుల్లో వస్తారు, తాజ్ మహల్ ,నేను ఒక్కర్తిని వెళ్లి చూడాలి అనుకున్నాను.. మన దేశం లో ఉన్న అద్భుతం కదా, ఇప్పుడు మేం ముగ్గురం కలిసి చూడ వచ్చు, వీలయితే   అన్నయ్య ని కూడా ఇక్కడికే రమ్మని చెప్పాలి, అవును..చెప్పాలి..

మేం నలుగురం ఊహు..అత్త,మావయ్య ,నాయనమ్మ ..నా కుటుంబం ఎంత పెద్దది అయిపోయిందో..ఒక్కసారి గా..ఈ మాతృ దేశ ప్రయాణం ,ఎంత సంతోష కరం గా మారింది..అని ఆలోచిస్తూ, ఆ రాత్రి తృప్తి గా నిదుర పోయింది అర్పణ.
కలలు నిజం అయిన వేళ ..ఆ రాత్రి.



















10 ఏప్రి, 2012

నా రాతలు ..మరి కొన్ని

అమ్మ పొట్టలో,
నే చేసిన తపస్సు
ఫలితం ,ఇంకా
దూరం గానే ఊరిస్తోంది.


వెయ్యి పిడికిళ్ళు 
బిగించినా , శబ్దం 
నిశ్శబ్దం..విప్లవం
గుండెల్లో నిద్ర పోతుంది.


నయాగార జలపాతం
కింద పెట్టిన నా తల 
ఇంకా నీళ్ళు ఓడుతూనే
తడి కలలు కంటోంది.


అమ్మ అంటే అన్నం..
నాన్న అంటే షికారు
భార్య అంటే ఖర్చు..
నేను..అంటే ఖాళీ..


ఇద్దరం ఒక్కటి  అని 
మురిసే లోపలే
ముగ్గురయ్యాం 
జీతమే?? నాలుగవలేదు..


ఆమె కన్న కలలు
మల్లె చెట్టు కింద
వాడిపోయిన 
పువ్వులు..


నిన్న నేడు గా
రూపు దిద్దు కుంటున్న క్షణం
కలలు ,మెలకువలు,
సఖ్య మయిన మైత్రి.


సూరీడు పొడిచాడు
ఉదయానికే నిన్న 
తిన్న అన్నం అరిగి పోయి,
ఆకలి కూడా నిద్ర లేచింది.


నిద్ర ఒక వరం
మెలకువ ఒక ఇజం 
క్షణ క్షణం కాలం
మింగుతుంది నిజం.


వయసు తెచ్చే 
వేడి కుదురు గా 
కరుగుతోంది చెలి 
కౌగిలి లో, వేడి కన్నా
చలే నయం..చెలి కి చెప్పకు.


టప టపా చినుకులు
తడిసి ముద్దై,
చూరు కింద చేరితే
తల నుండి కారిన కుళ్ళు నీళ్ళు.


సినిమా హాలు లో 
మురిసిన రంగులు
వెలిసి పోయిన పోస్టర్
రంగులు గోడ మీద బయట.


దుప్పటి కింద కన్న
కలలు కి ముసుగులు 
లేవు, చిల్లులు మటుకు
కలలో కూడా వదలవు.


ఆకలి ,నిద్ర ,కలలు
నిరంతరం నన్ను వదలని
నా ఆస్థి..ఆకలి ని
వదిలేసా, నన్ను వదలదేం ?


అమ్మాయి నవ్వు
పిచ్చెక్కించింది..
అబ్బాయి నవ్వేం
క్రోధాలు పెంచుతుంది?


విరిసిన పువ్వు
మనోహరం, నవ్వుకుంటూ
చెలి జడ లో నలిగి 
హబ్బ ప్రేమ వాసన..


అమ్మ,నాన్న ఆడుకుంటూ
పెద్దయాను,
ఎవరూ చెప్పలేదేం
రోజూ ఆడే ఆటలు ఇలా అని.


మబ్బు తరువాత  వాన
పిడుగు ముందు ఉరుము
అలక ముందు కారణం 
నియమాలు తప్పుతాయి.


చంటి పిల్లాడి నవ్వు 
ఎంత హాయి,ఏడుపే
అంత కర్ణ కటోరం
నేను కూడా అలా ఏడుస్తే..బాగుండును..


..













9 ఏప్రి, 2012

చంద్ర కళ

"పొట్టి  ! పొట్టి " ఎవరో గట్టిగ పిలుస్తున్నారు. చంద్ర కళ కి సిగ్గుగా ,చికాకు గా ఉంది..ఎన్ని సార్లు ,తన పేరు చెప్పినా ,ఇలాగే పిలుస్తారు.
తను గట్టిగ సమాధానం ఇవ్వ లేక కాదు..ఎందుకులే గొడవ ? అని..


" నేను ఇంటికి వెళ్ళాలి" అని అరిచింది, వెనక్కి తిరిగి చూసి.
"సారు పిలుస్తున్నారు.."..ఉమ అరిచింది.


ఇంక తప్పదు..అని వెను తిరిగింది.చంద్ర కళ.


రమేష్ సార్..అంటే మా పైన అధికారి. 
ఇంటికి త్వరగా వెళ్ళాలి, అయ్య ని ఆసుపత్రి కి తీసుకు వెళ్ళాలి, ఇంకా.ఎన్నో పనులు. వారానికి ఒక్క రోజు సెలవు, ఇలా ఎప్పుడయినా పని, త్వరగా చేసుకుని వెళ్ళాలి అనుకుంటే ఎన్ని ఆటంకాలో ..


మేమందరం brandix  అనే బట్టలు కుట్టే ,కంపనీ లో పని చేస్తున్నాం. రెడీ మేడ్ బట్టలు,ఇక్కడ కుట్టించి, పై దేశాలకు ఎగుమతి చేస్తారు.


వందల మంది, చుట్టూ పక్కల ఊరుల నించి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. నాకు నయం, ఊరికి దగ్గరే, అమ్మ ,అయ్యా ఇంట్లో ఉంటారు. తమ్ముడు ప్రభుత్వ బడి లో చదువుతున్నాడు.


వాడినయినా,బాగా చదివించాలని, మా ఇంట్లో ప్రయత్నం..


నేను ఎనిమిది వరకూ చదివాను, ఇదిగో, ఈ పని లో చేరాను. వారానికి రెండు వందలు, వస్తాయి. అవే పది వేలు, మాకు.


అద్దం లో చూసుకుంటే, నాకు నేను అందం గానే కనిపిస్తాను, కాని, పొట్టి గా ఉంటానని అందరూ పొట్టి, పొట్టి ,అని పిలవడం మొదలు పెట్టేరు.


నాకు గట్టిగా అరచి చెప్పాలని ఉంటుంది..నేను పొట్టి కాదు, నా పేరు చంద్రకళ అని..


అమ్మో, ఆ రామలక్ష్మి, నోరు ఎంత పెద్ద దో? తనకే మహా ఎక్కువ అనుభవం ఉంది ,అని..


రమేష్ సారు..పక్క నిలుచుని, ఎందుకు పిలిచారు? అన్నట్టు..కళ్ళెత్తి ప్రశ్నిస్తూ ,"మీకందరికీ ఊరులోకి వెళ్ళడానికి బస్సు వేసాం, మినీ బస్సు...


కాసేపాగితే..అందరి తో వెళ్లోచ్చని."


యునియన్ ఏవో అడిగింది ,అని తెలుసు, మాకేమి పట్టదు..మా పనేమిటో ..అంతే ..మాకు ఎక్కువ కోరికలు లేవు.కాని, ఒక్కోసారి, కుట్టిందే కుట్టి, ఆ మషీన్ మీద ,నాకయితే..విసుగు వస్తుంది..ఇంకా ఏవో కొత్త రకం గా కుట్ట వచ్చని ,ఏవో ఊహలు ఉంటాయి..కాని, మా పై అధికారి రత్నం అక్క,ఆవిడ అంటే అందరికి భయమే..పావు గంట కి ఓ సారి అరుస్తూ ఉంటుంది..


"అమ్మాయిలూ, పని చేయండి..పని..మాటలు వద్దు" అంటూ.
నేను అసలే మెతక..హు..పొట్టి..అనే పేరు..ఎవరు వింటారు ..నా కొత్త ఆలోచనలు, ఊహలు.


నేను ఇవాల్టికి వెళతాను,రేపటి నిండి బస్సు అంటూ గొణిగి ,నెమ్మదిగా బయట పడ్డాను.


రెడీ, రెడీ, అంటూ ఇంతలో ఓ మినీ బస్సు వచ్చి ,బయట ఆగింది..
అమ్మాయి గారు ..ఎక్కండి..ఎక్కండి..అచ్యుతాపురం..ఎలామంచాలి  ..చల్ చల్ ,మీకోసమే అమ్మాయి గారూ..మినీ బస్సు..ఎక్కండి..


అంటూ సందడి చేస్తున్నాడు..


హు..అమ్మాయిగారు.. నేను? 


డ్రయివరు నేనే, మూడు ట్రిప్పులు వేస్తాం..రండి..రండి..మీరే నా మొదటి కష్టమారు. రండి, రండి..అంటూ అతి చనువు..


సన్నగా, రివట లాగ,ఉన్నాడు, కుర్రాడు, చురుకే..చంద్రం అమ్మాయిగారు..నా పేరు..


అరే..నా పేరు చంద్రకళ అన్నాను..అప్రయత్నం గా..
భలే, భలే, మంచి పేరు..చంద్రుడి కళ ..అంటూ..నాలుక కరుచు కున్నాడు..


నాకేమిటో, ఒక్కసారి సిగ్గు ముంచుకు వచ్చింది.
నాకివాళ పని ఉంది, నేను నడిచి వెళ్లి పోతాను దగ్గరే..అంటూ దడ దడ లాడే గుండెతో..నడవడం మొదలు పెట్టాను..


రేపటినిండి ..ఎక్క వచ్చు..ఈ బస్సు..అని 
చూస్తూండగానే..ఒక వారం గడిచింది.


బిల బిల మంటూ, మేం అందరం బస్సు ఎక్కి మాటలు..
చంద్రం హుషారుగా బండి నడుపుతూంటే, చాల మంది అమ్మాయిల గుండెలు రెప రెప లాడేవి, నాకు తెలుసు.


 రైట్ ,రైట్..అంటూ చంద్రం బస్సు తెచ్చి ,కంపనీ ముందు ఆపేవాడు..
ఓ రోజు, నేను బయటకి రావడం ఆలస్యం అయింది..పద పద.అని అందరూ తొందర పెడుతున్నారు..


ఉండండి, ఉండండి..చంద్ర కళ అమ్మాయి గోరు రావాల అన్నాడు ట..


అందరూ పొట్టి, పొట్టి..అని అరిచేసారు..
చంద్రం విని నిర్ఘాంత పోయాడు ట.


చాస్..చంద్ర కళ..అన్నాడు ట మళ్లీ..ఒకటే నవ్వులు..అదే పొట్టి..అన్నారు ట..
చంద్రం చాల బాధపడి పోయి, ఏంటండి? అది..శుబ్రమయిన పేరు ఉండగా? అని గొనుక్కున్నాట్ట..


నా తోటి అమ్మాయి,  శోభ చెప్పింది.


బస్సు దిగి, ఇద్దరం నడుస్తూంటే, మా ఇల్లు ఒక్క వీధి లోనే, పొట్టి, ఆ డ్రైవరు కి నువ్వు అంటే ఇష్టమే..అంది..


నేను తల దించుకుని..చ అదేమిటే? తప్పు..ఇలా మాట్లాడకు.. అని అన్నానే, కాని, మనసులో గులాబీలు పూసినట్టు అనిపించింది.


నెల, రెండు నెలలు గడిచి పోయాయి..
రోజూ చేసే పనులే, ఇప్పుడు ఉత్సాహం గా చేస్తున్నాను..


చంద్రం..ఒక రోజు, బస్సు లో నేను ఒక్కర్తిని కూర్చుని ఉన్నప్పుడు, ఈ మధ్య ,ఇలాగే అవుతోంది, నేను గబా గబా నడుచుకుని వచ్చి , ముందే కూర్చుంటాను బస్సు లో, అందరి కన్నా.


"పొట్టి, పొట్టి, అంటూంటే మీరు ఎందుకు ఊరుకుంటారు? మంచి పేరు ఉంది కదా ..మీరు చెప్పండి..ఊరుకోకండి.."


అన్నాడు.." నా కేమిటో..భయం ..చమటలు పడతాయి, ఎదిరించి మాట్లాడాలి అంటే.." గట్టిగా ఊపిరి పీల్చి "నా పేరు అంటే నాకెంత ఇష్టమో? "


"ఇంకేమిటి? ఇవాళ నించి, నన్ను అలా పిలవకండి.. అని చెప్పండి.."


ఇంతలో, అందరూ వచ్చేసారు ..మా మాటలు ..ఆగిపోయాయి..


ఇలాగే, నన్ను పలకరించి, ఏదో ఒక మాట చెపుతూ ఉండే వాడు.


ఆరు నెలలు ఇట్టే,గడిచి పోయాయి..


ఆ రోజు, మా పెద్ద ఓనర్ కొడుకు, చిన్న ఆయన అచ్యుత్ ట పేరు, విదేశాల లో పెద్ద చదువులు చదివి వచ్చాట్ట.


ఆయన వస్తున్నాడు, మా పనులు అన్ని చూడడానికి..
ఇంకా పెద్దది చేస్తారు ట కంపనీ. ఇంకా పెద్ద ఆర్డర్లు రావాలి అని కోరుకోండి,మీకు జీతాలు కూడా పెరుగుతాయి..అని రమేష్ సారు..మా అందరికి ముందు రోజు నించి ,చెపుతూ ఉన్నారు.


అందరం మంచి బట్టలు వేసుకుని, బాగా తయారు అయ్యి వచ్చాం.


చిన్న ఓనర్ గారి ని మెప్పించాలని..అందరికి ఏదో ఆశ.


నేనూ అలాగే తయారు అయ్యాను మరి, అందరి లాగే.


ఉదయం .పది అయింది..మషిన్లు అన్ని..టక టక మని నిర్విరామం గా పని చేస్తున్నాయి. మాకందరికీ తానులు బట్ట ఇస్తారు, ఒక మోడల్ గవును ఉంటుంది, చిన్న పిల్లలకి డ్రెస్సులు, మేం కుట్టేవి..


అవి, అలాగే కుడతాం..అందరం అదే పని కాదు, ఒక వరస కట్ చేస్తారు, మరి కొంత మంది, కుడతారు..మరి కొంత మంది, గుండీలు, చిన్న ,చిన్న పువ్వులు అతికించడం చేస్తారు..విదేశాల లో పిల్లలు కదా..అన్ని చాల బాగా కుదరాలి, ఏదయినా తేడా వస్తే, అక్కడ ఊరుకోరు ట.


అందుకే నాణ్యమయిన బట్ట..అంత సరిగ్గా అమరాలి, ఏ తేడా లేకుండా..


మా ఊరులో ,వెలిసి పోయి, గుండీలు ఊడి పోయి, ఓ పిన్నీసు పెట్టుకుని ,గవును లు వేసుకుని తిరిగే  పిల్లలు గుర్తు వస్తారు నాకు, అప్పుడప్పుడు. మన దేశం లో పిల్లలికి నాణ్యత అక్కర లేదా? అని ఒక్కోసారి అనుకుంటాను ,నాలో నేను.


నేను ఇలాగే ఏవో ఆలోచనలో పడి పోతూంటాను..తల కిందకి వంచి ,గవును కుడుతున్నాను..


మాటల అలికిడి..తల పై  కెత్తాను..


రమేష్ సారు ,వెనక ఇంకా నడుస్తున్నారు.. అచ్యుత్ సారు, నా ముందే నిలుచుని ఉన్నారు.


నా మషీన్ పక్కనే .బల్ల మీద ,నేను మిగిలిన బట్ట ముక్కల తో కుట్టిన చిన్న గవును ఉంది, అది అతని చేతిలో ఉంది.


అమ్మో, తప్పు చేసేనా? మేం బయటకి ఒక్క సూది అయినా తీసుకు వెళ్ల కూడదు, అందుకే ,నేను ఖాళీ సమయం లో, నా ఊహ తో, ఈ డిసైన్ తో ,ఒక చక్కని గవును కుట్టాను ..


కాని, ఎవరికీ చూపించాను..?ఊరికే నా బల్ల మీద పడి ఉంది.


ఆహా ! ఎంత బాగుంది? ఎంత కొత్త దనం? ఒక్కటే రంగు, ఒక్కటే నమూనా..పిల్లలికి విసుగు రాదూ..


రమేష్, ఈ అమ్మాయి ఎవరు? అంటూ నా వేపు చూసి,


"నువ్వే కుట్టవా? నీ పేరేమిటి?"


అని అడిగేరు..


నేను స్మభ్రమం తో.."చంద్ర కళ" అమి చెప్పేను..


అచ్యుత్ గారు, భలే బాగుంది అమ్మా..అని మెచ్చుకుని ,నా భుజం తట్టి..
రమేష్..నీతో మాట్లాడాలి.. అంటూ నడిచేరు ముందుకి.


ఆకాశం అందుకున్నట్టే ఉంది..నా భుజం తట్టేరు .అంత మందిలో ..నా పేరు అడిగేరు.


ఒక వారం రోజుల లో, నాకు ఒక గది, విడిగా, అందులో నా పని కొత్త నమూనాలు తయారు చేయడం..అక్కడ చదువుకున్న అమ్మాయిలు ,ఉన్నా,నా అభిప్రాయం కూడా అడుగుతున్నారు..మరి ఓనర్ గారే మెచ్చుకున్నారు కదా..


ఎన్నో రోజుల నించి, నా మనసులో ఉన్న కొత్త ,కొత్త ఊహల కి రూపం వస్తోంది. నా కే నమ్మశక్యం గా లేదు.


బస్సు ఎక్కుతున్నాను..పొట్టి ..ఎవరో..పిలుస్తున్నారు..
చంద్ర కళ ,అలాగే పిలవండి.. అని ద్రుడం గా చెప్పేను..నేనే నా??


చంద్ర ,డ్రైవర్ కి ఎవరో చెప్పేరు, నన్ను ఇంకా ఆరాధన గా చూస్తున్నాడు ఇప్పుడు.


డ్రైవర్ లకి యునిఫోరం ఇస్తున్నారు..సంతకం పెట్టి ఇమ్మన్నారు ..ఫోరం..


చంద్ర సిగ్గు పడుతూ ,నా ముందు తల ఒంచుకుని, నాకు అక్షరం ముక్క రాదు, మీరే నింపండి..అన్నాడు..


నేను నిర్ఘాంత పోయాను..నాకు నా పేరు చంద్ర కళ అని గుర్తు చేసిన ఈ చంద్రానికి ,చదువే రాదు.


"నువ్వు, చదువుకోవాలి, చంద్రం..నా దగ్గరికి రా.. సెలవు రోజుల్లో చెపుతాను, సంతకం పెట్టడం రావాలి, లైసెన్సు ఎలా వచ్చింది నీకు? రోడ్ మీద బోర్డులు చదవాలి కదా..చాల అపాయం.."


ఒళ్ళు జలదరించింది..దారిలో అపాయం తలచుకుని..


నా మొహం లోకి ఒక్కసారి.చూసి," నాకు ఇప్పుడు చదువు వస్తుందా? ఆ అదే వస్తుంది, మీరు చెబితే, మా చంద్ర కళ టీచరమ్మ చెబితే?


అంటూ నవ్వేడు కళ్ళ తో..


మా కళ్ళు ఒక్కసారి కలుస్కుని విడి పోయాయి..


చంద్ర కళ ని నేను, ఇప్పుడు, నా పేరు చంద్ర కళా అనే పిలుస్తున్నారు అందరూ, అంతే చాలు నాకు..


ఎక్కడో , ఎప్పుడో చదివిన ఒక ఆంగ్ల కథ ఆధారం గా, నేను కల్పించిన కథ ఇది.























1 ఏప్రి, 2012

శ్రీ రామ నవమి అంటే ...

మా ఏలూరు విజయ విహార్ సెంటర్ లో జరుపుకున్న శ్రీ రామ నవమి ..పండగ గుర్తు రాగానే, క్షత్రి భవాన్ సింగ్ రోడ్, నుండి , గ్లాసులు పట్టుకుని పరుగులు పెట్టడం గుర్తు వస్తుంది.
పానకం కోసం గ్లాసులు ఒకటో, రెండో, చేతులో పట్టుకుని, మా ఇంటి నించి ఆరుగురు పిల్లలం ,పరుగులే పరుగులు. ఒకసారి కాదు, మరో సారి, మరో సారి.
మూతులు తుడుచు కుంటూ, చేతిలో వడ పప్పు నాక్కుంటూ..
కమ్మని ఆ బాల్యం ఎంత తీపి?
ఎంతో రుచి, ఎంతో రుచి రా..
నీ నామం ఎంతో రుచి రా..
అని ఆ భక్త హనుమాన్ పాడినట్టు..బాల్యం ఎంత రుచి ..
చల చల్లని పందిర్లు ,వేసే వారు తాటాకులతో, ఆహా ..ఆ సువాసన ఎంత 
బాగుంటుంది? ఇంకా కొబ్బరి ఆకులు తెచ్చి, రాటలు కి కట్టేవారు. మేం పిల్లలం ,ఒక్కో ఆకూ పీకి, దానితో పి పీ అని ఊదుతూ, బూరలు తయారు చేయడం..
అదేదో, మా ఇంట్లో పెళ్లి లాగే, మాకు ఉన్న ట్రంకు పెట్టె తెరిచి, బట్టలు అన్ని చిందర వందర ,చేసి, అమ్మా..మొన్న సంక్రాంతి పండక్కి కొన్న కొత్త పరికిణి వేసుకున్తున్నానో, అని ఓ అరుపు అరిచి, మూడు నెలలకే పొట్టి అయిపోయిన ఆ పరికిణి ,ని కిందికి లాక్కుంటూ, అమ్మా, ఈ  ఫిల్టు లు 
తీయించాలి అమ్మా,అంటే..అదేమిటే, మొన్నే కదా కుట్టిన్చాం, ఇంతలోనే పొట్టి అయిపోయిందా?? మరీ చోద్యం..
అదేమిటో బట్టలు ఎప్పుడూ ,వాటంతట అవే పొట్టి అయిపోతూ ఉంటాయి....పాపం..ఆ నిముషానికి అవి, ప్రాణం పోసుకున్నట్టు..మనం పొడుగు అయ్యాం..అని ఎవ్వరూ అనరు, ఎందుకనో??
ఇందులో ఒక ఉప కథ..మా టైలోర్ దగ్గరికి వెళ్లి ,ఎంటాబ్బాయ్ ..ఇలా టైట్ గా కుట్టేసావు? ఆది ఇచ్చాను కదా అంటే, సరే, చూడండి ..అని 
కొలతలు ,ఆది కి తగ్గట్టు మచ్చు కి మచ్చు ఉండడం తో, ఏమిటో? వింత..ఈ జాకెట్టు ఇలా ,ముడుచు కు పోయింది అని బట్ట ని తిట్టడమే తప్ప, మన మారిన..అదేనండి, లావు అయిన విషయం..మటుకు చచ్చినా ఒప్పుకోక పోవడానికి కారణం..అదిగో..చిన్నప్పుడు ..పరికిణి పొట్టి అయిపొయింది..తో మొదలు అనుకుంటాను.
పరీక్షలు ఒక పక్క ముంచుకు వస్తూ ఉండేవి, ఇప్పటిలాగా కాదు, అప్పుడు ఏప్రిల్ లోనే పరీక్షలు, మే ,జూన్ ,రెండు నెలలు వేసవి సెలవులు.
ఇంట్లో వంట చేసుకుంటూ అమ్మ, ఈ పిల్ల పిశాచాలు ,మరీ ముద్దు ఎక్కువయితే, ఎక్కడ ఉన్నారో? అని వీధి లోకి ఓసారి , తొంగి చూసి, మళ్లీ పప్పు మాడి పోతోంది, అని లోపలి పరుగు పెట్టడం..
మేం రోజంతా మకాం అక్కడే, చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి ప్రతిష్టంచడం, వాటికీ అలంకారం చేయడం, ఆ వీధి లో ఉండే వాళ్ళం అంతా,అక్కడే, అబ్బాయిలు దొంగ పోలీసు ఆటలు, అమ్మాయిలు నాలుగు స్తంభాలాటలు, ఆడుకుంటూ ,పోలో మని అల్లరి చేస్తూంటే, అప్పటి కప్పుడు పెద్దలయిన కుర్రాళ్ళు పొండి, పొండి, అల్లరి మరీ మితి మీరి పోయింది అంటే..మేం 
అలాగే..ప్రసాదాలు ఇచ్చేయండి ..అని ముక్త కంఠం తో అరిస్తే..
ఊ ..ఎంతెంత ఇచ్చరేం చందాలు?
అని విసుర్లు, పోనీ లెండి, తప్పు, రా..ఇదిగో అమ్మాయిలూ ,ఈ పప్పు, బెల్లం తీసుకోండి అంటే..
ఉక్రోషం తో..పరుగు ..పరుగు న వెళ్లి, అమ్మా ఓ అర్ధ రూపాయి ఇవ్వవే ,అని ఊడ పెరుక్కుని, ఇగోండి..మా చెందా.అని గర్వం గా ,హుండీ లాంటి ..తెల్ల కాగితం కట్టిన డబ్బా హుండీ లో వేసి, ఊ  ..పెట్టండి, ప్రసాదం..అని హక్కు గా అడిగి మరీ, బాదం ఆకులో పెట్టిన పొంగలో, లేదా..పెసర పప్పు ,కొబ్బరి ముక్కలు , కలిపినా వడ పప్పో, వేసుకుని, మరీ ,మరీ, పరుగులు తీసి, అమ్మా ..ఆకలే అన్నం పెట్టు ..అనే వాళ్ళం..హ్మం..రాళ్ళు కరిగించుకునే 
రోజులు కదా ..బాల్యం..అంటే..
బందా కనక లింగేస్వర్రావు గారు అని గొప్ప కూచిపూడి కళాకారుడు ..మా ఏలూరు వారే, అతని నాట్యం..ఇంకా స్థానం గారి నాట్య  ప్రదర్సన, నాటకాలు, ఒక రోజు చింతామణి నాటకం ఉండేది, ఆ రోజు పిల్లలని ఇంట్లో ఏదో ఒంకన అట్టే పెట్టేసి, పెద్దలు వెళ్లి పోయేవారు, మా తమ్ముడు మటుకు వెంట పడే వాడు, మేం అందరం పడుకున్నాక, అని మాకు పొద్దున్నే తెలిసేది..
అవి అంతా గొప్ప వారి ప్రదర్శనల ని మాకు ,అప్పట్లో తెలియదు. శ్రీ రామ నవమి పండగ , అన గానే, ఓ పాంఫ్లెట్ వేసే వారు, అందులో తొమ్మిది రోజుల పూజ విశేషాలు, రాత్రి ,జరిగే వినోదాల విశేషాలు ఉండేవి, అవి చూపించే, చందాలు వసూలు చేసే వారు, రోజు కి ఒక వర్తక దంపతులో, లేదా ఆ వీధి స్థితి మంతులయిన మరో దంపుతులో కూర్చుని కల్యాణం చేసే వారు.
పందిరి కి రాట, వేయడం దగ్గర నించి, చూసే వాళ్ళం..
ఎప్పుడూ ,ఏవి పని లేకుండా తిరిగే ,కుర్రాళ్ళు కి ఇంకా హుషారు, ఓ గ్రామ ఫోన్ సెట్ అద్దెకి తెచ్చి, పొద్దున్నే నమో వెంకటేశా తో మొదలు పెట్టి, ఇంకా లవ కుశ  పాటలు, రామదాసు సినిమాలో పాటలు..వేసిందే వేయడం..
పెద్ద పరీక్షలికి చదువుకునే అక్క లు, అన్నయ్యలు, అబ్బ బ్బ.. ఏమిటి హోరు, అని విసుక్కుంటే, మేం మటుకు, పాటలు బట్టి పట్టి, నేర్చేసు కునే వాళ్ళం, లవ కుశ  లో అంతా పెద్ద పాత నోటి కి వచ్చేసేది..ఆ తొమ్మిది రోజుల్లో..
కొంత మంది , హుషారు ఎక్కువై, భక్తి పాటల మాటున ..కొన్ని హుషారు యుగళ గీతాలు కలి పేయాలని..ప్రయత్నిస్తే, ...హ్మ్మం..పెద్దలు..
ఆపండిరా ..రామ నవమి ఇది..అని హుంకరించి, వారి హుషారు మీద నీళ్ళు జల్లే వాళ్ళు.
ఇదే పెద్దలు, ఒక్క రోజు రాత్రి మటుకు ,వేసే రికార్డ్ డాన్సులు కి మటుకు తలలు ఊపుకుంటూ కూర్చుంటార ని ..ఎవరో అంటే విన్నట్టు గుర్తు.
అప్పుడు అలాగే ఉండేది, ఇలా ఆడు కుంటున్నట్టే ఉండడం..మధ్యలో ఓ చెవి అటు పడేసి, పెద్దల మాటలు వినేయడం..పూర్తి గా అర్ధం కాక పోయినా, అదేదో, ఒక పెద్ద విషయం అని మటుకు అర్ధం అయేది.
ఎందుకో మరీ, పెద్ద వాళ్ళం అయి పోవాలని ,తెలియని ఒక తొందర..!!!
ఊరు వాళ్ళందరూ కలవడం, పనులు పంచుకోవడం, భక్తి భావాలూ పెంచుకుంటూ, కళ్యాణాలు చేయించడం, రాత్రి కి వినోదాలు, తొమ్మిది రోజుల కార్యక్రమాలు విజయ వంతం  గా చేయించడం..ఇవన్ని మరీ, జీవితానికి పునాదులగా..వేసుకున్న గట్టి రాళ్ళు.
కాలమే మారిందో, మనుషులే మారారో? మాట ఒక్కటై ,నడిచే ఈ ఉత్సవాల లో మాట పట్టింపులు, అంతస్తులు తారతమ్యాలు, డబ్బు లెక్కలు, పంచు కోవడాలు, చిల్లర లెక్కలు..చిల్లర బుద్ధులు..అవి ఎక్కువై,కళ్యాణం తో మనుషులు కలవడం పోయి, గొడవలు పెరిగి పోయాయని ,ఎవరికీ వారే పెద్దలై పోయి, అంతా శ్రీరాముని కళ్యాణం మాటే మరిచి పోయారని..
వింటూ, కంటూ ఉంటే..చాల బాధ గా ఉంటుంది.
సమిష్టి గా చేసే పనులలో హాయే మరిచి పోయారా?
ఎవరికీ వారే, వారిదే సరి అయిన నిర్ణయం అనుకుంటే, ఇంక లోక కల్యాణం ఎక్కడ మిగిలింది?
రాముడా? ఇంకా నీ కళ్యాణం భద్రాచలం లో చేస్తున్నారంటే ..అంతా..ఆ భక్త రామదాసు గొప్పతనమే కదా??
ప్రభుత్వాలు ,మారినా మిల మిల లాడే ముత్యాల తలంబ్రాలు వస్తున్నాయి, పట్టు వస్త్రాలు వస్తున్నాయి..తానీషా అంతటి ప్రభువే , మొదలు పెట్టిన ఆచారం అని నమ్మే కదా? 
శ్రీ రామ నవమి అంటే మనకి మటుకు వడ పప్పు, పానకం..నాకు మటుకు, విజ విహార, సెంటర్ ,ఏలూరు లో తాగిన గ్లాస్సులు..గ్లాస్సుల పానకం, సమిష్టి కృషి లోని సంతోష హేల...అమాయక, నిష్పూచి బాల్యం..