"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 నవం, 2010

మట్టి ప్రమిదల లో దీపాలు వెలిగిద్దాం ,దీపావళి చేసుకుందాం.



దీపావళి వచ్చింది,దీపాల పండుగ వచ్చింది, రాష్ట్రం అంతా తడిసి ముద్ద అయింది, వరస వర్షాలు తో, ఈ దీపాల వెలుగు అందరికి నిజమైన పండగే అవుతుంది. 
మన చిన్నప్పడి పండుగ గుర్తు రాకుండా ఎలా ఉంటుంది? ఈ సందర్భం  లో ??మేం ఆరుగురం పిల్లలం ఇంట్లో. వంద రూపాయలు పెడితే ఆరు బుట్టల నిండా  సామాన్లు వచ్చేవి, ఇంక అవి ఎండ బెట్టడం అనే కార్యక్రమం మొదలు అయేది, ఎవరి బుట్టల్లో సామాన్లు వాళ్ళు, (తాటాకు బుట్ట),బయట ఎండ లో పెట్టడం, తమ్ముళ్ళు అయితే, వాటి పని అప్పుడే పట్టే వాళ్ళు, మా వాటా సామాన్లు ,వాళ్ళు పట్టు కు వెళ్ళి పోకుండా కూడా చూడడం మా అమ్మాయిలకు ఎక్స్ట్రా  పని. 
ఈ సందర్భం లో జరిగే రామ రావణ యుద్ధం -మగ పిల్లలికి, ఆడ పిల్లలికి- మధ్య సంధి కుదిర్చే సరికి, దీపావళి ముందే వీపు మీద టపాకులు మోగేవి..ఇంట్లో. చిన్న గానే లెండి, ఎప్పుడూ దెబ్బలు ఎరగం.. ఇంత మంది ని ఎలా పెంచారో, మా అమ్మ -నాన్న లు, ఓపిక లో నోబెల్ ప్రైజ్ ఉంటే ఇవ్వలిసిందే వీరికి అనుకుంటాం.
ఇంకా ఎన్ని ముచ్చటలో, ఆడ పిల్లలికి కొత్త గవున్లు, మగ పిల్లలికి, ఏముంటాయి ఎప్పుడు అవే చొక్కాలు, లాగులు, అదే నిక్కర్లు, గౌను  కి మాచింగ్ గా గాజులు  , రిబ్బన్లు, చేతిలో ఓ పది రూపాయలు పెట్టుకుని రవి కంగన్ హాల్ అనే కొట్టు చుట్టూ. సూర్యుడు చుట్టూ భూమి అన్నట్టు తిరిగే వాళ్ళం.. మార్చి, మార్చి, బేరం ఆడి, ఆడి, అన్ని రెడీ చేసు కుంటూ, మేం అంటే ఆడ పిల్లలం, నలుగురు అక్క చెల్లల్లం, ఇంక మా తమ్ముడు, పూనకం వచ్చినట్టు, పిచికలు, మతాబాలు, సిసింద్రీలు అంటూ సీమ టపాకాయ లాగ ఎగిరి పడుతూ, ఎప్పుడు చేయి కాల్చుకుని వస్తాడో అని అమ్మ ఒక బర్నోల్ మందు చేతిలో పెట్టుకుని రెడీ గా ఉండేది.
నాకు పిచికలు చేతిలో పట్టుకుని, అవి చేతిలో ఒక పుల్ ఇస్తాయి, అప్పుడు వదలాలి అని నేర్పాడు, మా తమ్ముడు. చిన్న మట్టి ఉండల్లో, కూరిన మందు,ఈ పిచికలు. సిసింద్రీలు , తాట్రేకు టపాకాయలు, చేతి లో పట్టుకుని పేల్చడం ఒక సాహస కార్యం. పది, పదిహేను రోజుల ముందు నుండి ఈ హడావిడి అంతా మొదలు అయేది, ఏదో బడి అని ఉండేది కాని, చదువు కి ఎగనామమే ఈ పది రోజులు.
మతాబాలు, చిచ్చు బుడ్లు ఇంట్లో కట్టాలా? మందు సామాన్లు పెద్ద బజారు నుంచి కొనుక్కుని రావాలా?  పేపర్లు అన్ని చింపి, మతాబ కర్రలు తయారు చేయాలా? మైదా తో వాటిని అతికించడానికి ఓ పేస్టు తయారు చేయాలా? అమ్మ కి విసుగు, పిల్లలికి పండుగ.. ఈ దీపావళి పండుగ,
ప్రతి ఇల్లు ఓ కుటీర పరిశ్రమ కేంద్రం  లాగ తయారు అయేది మొత్తానికి, నాన్నగారు ముందు విసుక్కున్న ఏమిటి ఈ సంత? ఇంట్లో అని.. చివరాఖరికి, అలాకాదురా, ఇంక కొంచెం సురేకారం దట్టించు, ఇంకా చిట  పట లాడాలి, అని లుంగి పైకి ఎత్తి, దిగి పోయేవారు. 
ఆడ పిల్లలం మాకు, మా అలంకరణ మీదే దృష్టి అంతా..ఎవరి గోల వారిదే, అమ్మ కేమో, ఏం చేయాలి, తేలికగా అయిపోయే స్వీట్ ఏమిటి? అని ..ఆలోచన, ఇంత మందికి చెయ్యాలంటే మరి, కేజీ ల లెక్కనే కదా!!
నరక చతుర్దశి వచ్చేసింది.. అమ్మయ్య, ఇవాళ కూడా ఓ కొత్త గౌను వేసు కోవచ్చు. తలంటి పోసుకుని, అమ్మ వీధిలో కొన్న ప్రమిదలని- మట్టివి- నీళ్ళల్లో నానా బెట్టడం ఒక పని, ఇంకా ఎండ పెట్టిన వన్ని, సరిగ్గా ఎండేయో లేదో చూసుకుని, మర్చి పోకుండా ఇంట్లో తెచ్చి పెట్టడం, వీధిలో పొద్దున్నే ముగ్గు పెట్టడం,  మర్నాటికి, అంతా అమిర్చి పెట్టడం తోచినప్పుడు, అమ్మ కేక లేస్తే వెళ్ళి సాయం చేయడం, ఏమిటో ఒకటే హడావిడి, పండుగ హడావిడి.
వచ్చేసింది, అమ్మ దీపావళి ఈరోజే అంటూ తమ్ముడు పొద్దున్నే లేచి , ఓ బాంబ్ పేల్చి స్వాగతం.. ముందు స్నానం చేయరా అంటూ అమ్మ వెంట పడడమే గాని, ఆడ పిల్లలం ముందు మా హక్కు , స్నానం కి అని  క్యు కడితే ,ఏ పది గంటలకో వాళ్లకి చాన్స్ వచ్చేది. ఇప్పటి లాగ గది కి ఓ బాత్ రూం కాదు కదా, ఇంటిల్లి పాదికి ఒకటే బాత్ రూం..ఆ రోజుల్లో. ఆ చిన్నప్పుడు.. రోజుల్లో, ఇది ఉంది, ఇది లేదు అని స్పృహే లేని ఆ రోజుల్లో..
మనం ఉన్నాం, అక్క, తమ్ముడు, చెల్లెళ్ళు, నాన్న-అమ్మ ఉన్నారు, ఇంకేమిటి లోటు మాకు? పండుగ పండుగ కి కొత్త గవున్లు ఉన్నాయి, మాచింగ్ గాజులు , రిబ్బన్లు ఉన్నాయి, బడి ఉంది, ఆటలు ఉన్నాయి, వేసవి సెలవులు -ఆటలు ఉన్నాయి, కబుర్లు, స్నేహితురాళ్ళ  తో కబుర్లు ,ఎప్పటికి తరగని సిరులు లాగ కబుర్లు ఉన్నాయి, ఇంకేమి లోటు మాకు..
మట్టి దీపాలు వెలిగించి, దేవుడు దగ్గర ఒక దీపం తో అవి వెలిగించడం , ఎక్కడి నించో, ఒక ఆముదం చెట్టు కొమ్మ తెచ్చి, దానిని గుమ్మం గుమ్మం కి కొట్టి, దిబ్బు  దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే దీపావళి అని పాడే వాళ్ళం.. అలాగ చేస్తే, చేతులు కాలవం అని ఏదో నమ్మకం.
ఆ వెలిగించిన దీపాలు, జాగ్రత్తగా తెచ్చి గోడల మీద వరసగా పెట్టడంకి అందరు పోటి పడే వాళ్ళం. నాన్న గారు కోసం ఎదురు చూడ్డం, ఆయన జూట్ మిల్ లో ఓనర్లు  చేసే లక్ష్మి పూజ ,అయేక ఇంటికి స్వీట్స్ డబ్బా పట్టుకుని వచ్చేవారు, ఇంక మొదలు, మా హడావిడి..
ముందు మతాబాలు, కాకర పువ్వత్తులు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, అయేక ఇంట్లో కి వెళ్ళి పాము బిళ్ళలు, అవి నల్లగా విరుచు కు పడి పోతే ,ఎంత ఆనందమో..
ఇంక వీధిలో తరవాత చెవులు దద్దరిల్లేటట్టు టపాకాయలు, సీమ టపాకాయలు, సిసింద్రీలు, ఇంకా పెద్ద వాళ్ళు తార జువ్వలు, లక్ష్మి ఆటం బాంబులు, పోటి పడి కాల్చే వాళ్ళు.. మగ పిల్లలు, ఆరోజు తోక లేని హనుమంతు ల్లగా గెంతులు వేసే వారు.
సిసింద్రీలు అన్నిటి కన్నా డేంజెర్.. అవి ఏ మార్గం లో దూసుకుని వెళతాయో, అంతు బట్టదు ఎవరికి, ఎవరు తీగల మీద బట్టలు మర్చి పోయారో, వారి ఇంటికే వెతుక్కుంటూ వెళుతుంది, సిసింద్రి. గొడవ గొడవ తరువాత.. 
నాగుల చవితి కి కూడా దాచుకోవాలి రా అని అమ్మ ఒక పక్క అరుస్తూ ఉంటుంది, ఈ లోపల తాటాకు బుట్ట కూడా బోర్లించి అన్టించేస్తాం. అమ్మ తెలివి తక్కువా? ముందే గుప్పెడు తీసి దాస్తుంది. 
అమ్మయ్య ఎవరి చేతులు కాల్చు కోకుండా అయింది ఏ ఏడు దీపావళి అని అమ్మ నిట్టూర్చి, పదండి, చేతులు కడుక్కోండి, స్వీట్ తినండి, ముందు అంటుండే కాని, అప్పటికే అందరి కడుపు నిండి పోయింది, ఇంక ఏం తింటాం?
ఇంట్లోకి వెళ్ళి లెక్క చూసుకుంటే మగ పిల్లల తలలు మిసింగ్.. మా వీధిలో అయింది దీపావళి, పక్క వీధి లో ఏం జరుగుతుందో అని చూడ్డానికి పారి పోయారు ఇద్దరు, నెమ్మదిగా.. ఏ పన్నెండో, అవుతుంది.. పూర్తి గా దీపావళి పండుగ రోజు ని వీధి చివర వరకు, పంపించి రావాలి కదా మరి, మళ్లీ సంవత్సరం వరకు రాదు కదా ఈ సంతోష పర్వ దినం? దీపాల పండుగ దినం.
ఇప్పుడు దీపావళి కి వస్తున్నాయి చైనా లక్ష్మి , చైనా వినాయకుడు ఫోటోలు, చైనా టపాకాయలు, చైనా ఎలెక్ట్రిక్ దీపాలు, ఆన్ లైన్ లో అమ్మ దీపావళి విషెస్ అని శుభాకాంక్షలు   దూరం నుంచి చెప్పడం, నెట్ లో ఆర్డర్ చేసిన స్వీట్స్, పేరు తెలియని స్వీట్స్, చప్పుడు చేయకండి, ప్రపంచం లు ఇన్ని అణుబాంబు లున్నాయి, అవేమి కాదు ట, ఈరోజు పేల్చే టపాకాయ లతోనే ,ప్రపంచానికి ముప్పుట, ఇంక ఈ దోమలు, అవి చస్తాయి అని కాల్చే మతాబాల వల్ల ఇంకో పర్యావరణ ముప్పుట. ఇన్నేళ్ళు గా లేనిది, ఈ ఒక్క రోజు కి ఏమవుతుందో..
మన పండుగ, మన ఇష్టం  అని గట్టిగా ఎవరు అనరు, మనం చాల మర్యాదస్తులం. అందులో వెస్ట్ అనబడే వారు ఏం చెప్పినా మనకి వేదం.. మనకి ఉన్నాయి వేదాలు వినండి అర్రా ..అంటే అబ్బా చాదస్తం..అంటాం. 
మన పండుగలు మనం మనసార హాయిగాచేసుకుందాం, మట్టి దీపాలు వెలిగించుదాం .. వేల, వేల ఏళ్ళుగా మన కుమ్మరి వాళ్ళు, మట్టి కుండలు, అవి చేసుకుని బతుకుతున్నారు, కనీసం ఈ రోజు అయినా మట్టి ప్రమిదలు కొందాం. బేరం ఆడ కుండా.. కొందాం..
మన భాష, మన పండుగలు, మన కళలు, మన సంస్కృతీ.. ని కాపాడుదాం..దీపావళి పండుగ ని చక్కగా చేసుకుందాం.. రండి.. ప్రమిదలు వెలిగించండి, మన ఆశల ప్రమిదలు.. మన సంస్కృతీ సంపద లివే..ఇవే.. ఇవే..

31 అక్టో, 2010

ఒక తరం ,రేపటి తరం , కి చక్కని పునాది వేద్దాం.. రండి.

ఈ దేశం లోనే కాదు, అన్ని గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న మానవ విలువల అతిక్రమణ గురించి హుమన్ వాచ్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ చదివాను, చాల బాధ, కలిగి ఆవేశం తో మనసు రగిలి పోతుంది. 
అయితే , మన రాష్ట్రం లో, కోర్పోరాటే కళాశాల లో జరుగుతున్న అందరం పట్టించుకోని , హింస గురించి ముందుగ రాయాలని  ఇది రాయడం మొదలు పెట్టాను.
ఎనిమిది, తొమ్మిది తరగతులు కి రాగానే,  రోజూ సాయంత్రం ఆడుకునే ఆటలు బంద్. దాని స్థానం లో  ఎక్ష్త్ర క్లాస్స్లు,  లేదా ట్యూషన్లు మొదలు, అప్పుడప్పుడే సాగుతున్న పిల్లవాడి కాళ్లు, చేతులు కట్టేసినట్టే. అది ఒక మెదడేనా? లేక ఒక యంత్రమా? ఇవి కాదు, ఇన్ని రక రకాల కష్టాలు ఎందుకు మనకి అను కునే తల్లిదండ్రులు, ఏకంగా ఉదయం నుంచి రాత్రి వరకు చదువులు చెప్పే ఒక జైలు లాంటి ఖార్ఖానా లో పడేస్తారు. 
ఒక సంవత్సరం పాటు నింపాదిగా చెప్పా వలసిన సిలబస్ ను, ఆరు నెలలో, నో ఇంక ముందు గానో పూర్తి చేసి, ఇంక ఆ తరువాత అంతా రివిషన్ పేరు తో, తోమించడం, చదువు అంటే నే వెగటు  పుట్టదూ? 
ఈ పిల్లలే, కట్టులు తెంచుకుని, విచ్చలవిడిగా ప్రవర్తించడం చూస్తాం, బయట. వారికి ఒక మానసిక వికాసం, ఒక విశ్రాంతి , ఒక  సంపూర్ణ వ్యక్తీ వికాసం ..ఇవేమీ ఉండవు. బాగా చదవడం, ఇంకా బాగా చదవడం, ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఇదేనా చదువు..అంటే.
నాకు తెల్సిన ఒక స్కూల్ లో, ఉదయమే అయిదు గంటలకి ,ఒక ఫోన్ వస్తుంది, స్కూల్ అధికారి నుంచి. ఆ పిల్లాడే అందు కోవాలి ఆ ఫోన్, నేను లేచే వున్నాను, చదువుతున్నాను అని వారికి హామీ అన్నమాట పిల్లాడి నుంచి. కలలే అపహరించే దొంగలు అన్న మాట గుర్తు వచ్చింది నాకు, కమ్మగా నిద్ర కూడా పోనివ్వరు, ఇదేమి బడి? ఇదేమి చదువు?

తల్లిదండ్రులు ఎందుకు ఇలాగ లొంగి పోతున్నారు? ఈ శిక్ష లా ఉండే విద్య కు?అంటే కంపిటేశున్ అంటారు. రెండు లక్షల పై చిలుకు ఇంజేనీరింగ్ సీట్లు, పిలిచి ఇస్తున్నారు, ఏమిటి ఈ పిచ్చి? ఏమిటి ఈ వెర్రి? 

నాతో చదివిన స్నేహితురాలు ఒక కార్పోరాట్ కళాశాల లో పని చేస్తోంది. ఉదయం ఆరు గంటల నుండి క్లాస్ ట. అక్కడే ఫలహారం, అక్కడే భోజనం, మొత్తం మీద ఒక గంట విశ్రాంతి, రాత్రి ఎనినిది వరకు బోధించాలి. సిలబస్ అంత ఎప్పుడో అయిపొయింది, మళ్లీ, మళ్లీ, రుబ్బి, రుబ్బి, పిల్లల మైండ్ లోకి ఎక్కించాలి. ఇన్ని గంటలు అధ్యాపకలు ఎలా అరుస్తారు? వీళ్ళు మనుషులే కదా? గొంతు మండడూ? మెదడు వేడి ఎక్కి, పిల్లలికి మెదడు వాపు వ్యాధి వస్తుందేమో అన్నాను, హాస్యం గా, కాని కడుపు మండి పోతోంది, నిజం గా ఇన్ని గంటలు పిల్లలు వింటారా? అంటే కళ్ళు పుస్తకం మీద ఉంటాయి ,ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. 
ఆదివారం అంటే మనకి హాలిడే ,జోలి డే..ఆ రోజు ఆలస్యం గా నిద్ర లేవడం మన జన్మ హక్కు అనుకుంటాం. మెల్లిగా  లేచి,  ఏ పూరిలో , దోసలో, టిఫిన్ తిని, అమ్మ ఇంక స్నానం చేయవే అని తిడు తూ ఉంటే, పత్రికో, పేపరో, ఫోనో, ఏదో పట్టుకుని వేలాడుతూ, అన్ని పనులు స్లో మోశున్ లో చేసే రోజు అది. 

కాని, ఈ కాలేజ్ లో కాదు. ఆ రోజు ఒక స్పెషుల్ పరీక్ష ఉంటుంది, ఆ వారం లో జరిగిన పాఠాలు మీద.  ఆ రోజు ఇంకా ఉదయమే లేచి, మళ్లీ ,మళ్లీ ఇంట్లో చదువుకుని వెళ్ళి పరీక్ష రాసి రావాలి. ఆదివారం కాలేజే నడిపే వారందిరిని ఒక టో,పడి రోజులో జైలు శిక్ష వేయాలి, నా ఉద్దేశం లో. 

పాఠాలు చెప్పే అధ్యాపకులు కి కూడా ఒక సెలవు రోజు ఉండ వద్దా? ఉదయం ఆరు నుంచి రాత్రి పది వరకు  కాలేజ్ లో నే గడిపితే, ఇంక వారు ఇంటికి వెళ్ళి, వారి పిల్లలను, కుటుంబం తోనూ ఎప్పుడు గడుపుతారు? 

ఇవి   అన్ని కూడా మానవ హక్కుల ఉల్లంఘనే అని పిస్తున్నది నాకు అయితే. ఆల్ ఇండియా లెవెల్  టెస్ట్ ల లో మనకే బోలెడు రాంకులు, వీటి కోసం ఈ మాత్రం కష్ట పడాల్సిందే  అంటారు  , కాని, ఒక లక్ష మండి రాస్తే ఒక వెయ్యి మంది   కి వస్తాయేమో ఈ రాంకులు.  ఈ కర్పోరాటే కళాశాలలు లేనప్పుడు కూడా వచ్చాయి మనకి రాంకులు. 

చదవాలి అనే ఆకాంక్ష, కొంత తెలివి తేటలు , కొంత నియమ నిబద్ధత , ఉండాలి ఆ పిల్లవాడికి, అంటే కాని బలవంతం గా కుక్కి, కుక్కి పెట్టే అన్నం ముద్ద  లాగ, మక్కి పెట్టించి చదువు చెపితే రాంకులు వస్తాయా?

సంస్కారం, ప్రపంచ జ్ఞానం, విజ్ఞానం , సమయస్ఫూర్తి, ఆటలు లో ఓటమి గెలుపుల సంయమనం,  అందరి తో కలిసి సామూహికం గా పని చేయడం,  పదిమంది లో ఒక్కడిగా మెలగడం, అవసరం అయినపుడు సారధ్యం  వహించే నాయకుడి లక్షణం. .. ఇవి నేర్పించేదే విద్య ,చదువు, అంతే కాని, ఒక్క మార్కు తగ్గిందని ప్రాణాలు తీసుకోవడాన్ని నేర్పించే పోటి చదువులు కాదు. 

పని గంటలు అని మనకి ఒక రూల్ ఉంది, దానిని పట్టించు కోరు, పిల్లలకి ఒక చదువు  సమయం అని తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు బడి వేళ లు ఉన్నాయి.  ఇవేమీ పట్టించు కోని ఈ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం పై అజమాయిషీ లేదా? 

అసలు ప్రభుత్వం ప్రాధమిక విద్య  ను పూర్తిగా పట్టించు కోవడం మానేసి, అంతా ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించింది. ఎంత చిన్న ఆదాయం ఉన్నవారు కూడా అప్పో సొప్పో చేసి, ఈ ప్రైవేట్ బడి లోనే పడేస్తున్నారు తమ పిల్లలిని. వేలకి వేలు ఫీజు. ఉనిఫోరములు, షులు, చదువు ఏం చెపుతారో, తక్కువ జీతాలకు పని చేసే టీచర్లు. ఇది మన విద్య రంగం పరిస్థితి.

వారిలో వారు అధికారం కోసం కుమ్ములాటలు, గ్రూపులు, అస్తవ్యస్త పాలన. ఎంతో ముఖ్యమైన విద్య కు అత్యంత తక్కువ ప్రణాళిక నిధులు. 

కనీస కర్తవ్యమ్ గా ముందు, ఈ కార్పోరేట్ కళాశాల లో పరిస్థితిని సమీక్షిన్ చాలి, రోజు లో పద్దెనిమిది గంటలు చెప్పడం, విద్యార్ధులను కూర్చో పెట్టడం, మానవ హక్కుల చట్టం కింద వీరిని  శిక్షించాలి, తల్లి తండ్రులూ, మేల్కోండి, వారి భారి విజ్ఞాపనలు చూసి, మోస పోకండి, లక్ష మంది లో కొన్ని వేల మంది కి వస్తాయి రాంకులు, అవీ బాగా చదివే కొంత మందికి, నేను  బి  కామ్ చదువుతాను నాన్న అంటే ఎందుకూ పనికి రావు అంటూ, ఎంజేనీరింగ్ లో పడేయకండి, అయిదేళ్ళు చదివినా పాస్ అవని విద్యార్ధులు కనిపిస్తున్నారు, ఎందుకు, వారికి ఆ చదువు మీద అభిరుచి లేదు, అందరు చదువుతున్నారు అని చదివించడం.. . మూస పధ్ధతి లో ఆలోచన ..

ఇకనైనా మేల్కోండి, పిల్లలు స్వభివ కం గా పెరగాలి, వారిని గైడ్ చేయండి, కాని, అణగదొక్కి, కొమ్ములు విరిచి కూర్చో పెట్టడానికి వాళ్ళు గిత్తలు కారు, గాలే చొరబడని, నాలుగు గోడల మధ్య ,రోజు లో పద్దెనిమిది గంటలు కూర్చో బెట్టి, చదువు, చదువు అని అంకుశం తో పొడుస్తూ ఉంటే, వాళ్ళే మరి తిరగ బడతారు. 

బయట సమాజం లో, ప్రేమించు అని వెంట పడే వాళ్ళు, ఆడ పిల్లలని వేధించే వాళ్ళు, తల్లిదండ్రులని ఆస్తి కోసం హింసించే వారు, ఇలాంటి రూపాలను తయారు చేస్తున్నాం, మన విద్య వ్యవస్థ ను  సమూలం గా తీర్చి దిద్దాలి, ముందు గా ఈ ప్రైవేట్ కాలేజ్ విష వ్యవస్థ ని వేళ్ళ తో పెరికి  వేసి, ఒక బాద్య త యుతమైన , ప్రభుత్వ ఆధీనం లో మెలిగే చక్కని శిక్ష బుద్ధులు నేర్పే విద్య సంస్థల నియామకానికి శ్రేకారం చుట్టాలి.
తల్లి దండ్రులు, విద్య వేత్తలు, ప్రణాళిక వేత్తలు,  అందరు కలిసి ,చర్చించి, మన పిల్లలే రేపటి పవ్రులు అనే ఆలోచనతో, చక్కని విద్య వవస్థ కి పునాదులు వేయాలి. 

పువ్వుల్లాగా సున్నితం గ పుట్టిన మన  పిల్లలను చదువు ల పేరిట బలవంతం గా నలిపి వేయకండి, పువ్వుల్లాగే వికసిస్తారు, వారు కూడా, చదువు ని ఆనందించాలి వారు,  భయ పడుతూ ,బెంగ పడుతూ, అసహ్యించుకుంటూ కాదు. 
ఒక తరం ,రేపటి తరం , కి చక్కని పునాది వేద్దాం.. రండి.






28 అక్టో, 2010

అటక మీద జ్ఞాపకాలు..

ఉత్తర భారత దేశం లో వారికి ఒక సంప్రదాయం ఉంది, దీపావళి ముందు సఫాయి అని ఇల్లు అంతా శుభ్రం  చేసుకుంటారు. వారం, పది రోజుల ముందు నుండి మొదలు పెట్టి, ఇల్లంతా మెరిసేలా శుభ్రం చేస్తారు, లక్ష్మి దేవి ని పూజిస్తారు కదా ఆ రోజు. మనకి అలాంటి అలవాటు లేక పోయిన, పండుగ లకి ఇల్లు కడగడం అది చేసే వారం, ఇప్పుడు ఫ్లాట్స్ లో అలాంటి సదుపాయమే లేదు, నీళ్ళు ఎక్కడికి పోవు కదా..
పండుగ కి కాక పోయినా ఏదో, ఒక రోజు ఇల్లు సర్దాలి అనే భూతం ప్రవేశిస్తుంది, అమావాస్యకో...ఎప్పుడో.. సంవత్సరానికి ఒక్క సారి. ఇంక భారీ ఎత్తున అటక తో మొదలు పెడతాను. 
అలాంటి ఒక రోజు..పిల్లలు స్కూల్స్ వదిలి నాలుగు ఐదు ఏళ్ళు అయినా అట్టలు వేసి, నీట్ గా ఉన్న టెక్స్ట్ బుక్స్, ఎప్పుడైనా అవసరం అవుతాయి, అయ్యేయస్ లాంటి పరీక్షలు కి ఇవే చదవాలి ట, అమ్మలు అందరికి  ఏజ్ బార్ అఏంత వరకు పిల్లలికి, ఇలాంటి రహస్య కోరికలు, ఆశలు ఉంటాయి, ఆ పుస్తకాలు, అటక దించి, ఎవరికైనా ఇచ్చేయాలి, అటక అంటే, మన అలమారాల పైన, తలపులు మూసేసి ఉండే, ఒకప్పటి ఖాళీ జాగా..ఇప్పుడు మనకి పనికిరాని అనేక వస్తువులతో  నిండి ఉంటుంది. సరే అని పుస్తకాలు దిమ్పాను, ఎన్నో జ్ఞాపకాలు, ఒక్కొక్క క్లాసు ఎలా పాస్  అవుతూ వచ్చారో, ఎంత గొప్ప గా ఉండేదో, మన పిల్లలు ఒక్కరే ఇంత ఘన కార్యం చేసేరు, అని, స్కూల్ కోసం చేసిన ప్రాజెక్ట్ వర్క్ లో భాగం గా గీసిన చార్టులు, ఏదో ఒక విషయం తీసుకుని , ఇంటికి వచ్చే మాగజీన్ నుంచి కట్  చేసి అంటించిన స్క్రాప్ బుక్లు ,పిల్లలికి మార్కులు మర్నాడే ,దాని అవసరం తీరి పోతుంది, కష్ట పడి చేసింది మనమే కదా, మురిపెం గా దాచడం, ఇదిగో ఇంక ఇప్పుడు దానికీ కళ్ళు తుడుచు కుంటూ వీడ్కోలు పమ్పవలసిన సమయం వచ్చింది.  
పిల్లలు వచ్చి రాని రాత తో రాసిన నాన్న ఎప్పుడు వస్తావు? అని రాసిన మొదటి ఉత్తరాలు, పుట్టిన రోజు గ్రీటింగ్ లు, విరిగి పోయిన విమానం బొమ్మ, ఎంత ఖరీదో, అది చూసి వాళ్ళ కళ్ళల్లో విరిసిన ఆనందం పువ్వులు ఎప్పటికి వాడి పోకుండా ఉండాలి అని కోరుకుంటూ , ఈ విమానం బొమ్మని ఇంక స్క్రాప్ చేయ వచ్చు, ఎన్ని రకాల బోర్డ్ గేమ్స్, అష్ట చెమ్మ అని, నేల మీద సుద్ద ముక్క తో గీసుకుని ఆడే వాళ్ళం మన చిన్నప్పుడు, అవే రాక రకాలు గా అట్ట ల మీద ,రంగు రంగు లాగా చేసి, ఎన్ని గేమ్స్ కని పెట్టారో. అవి కూడా ఇంక పడేయ వచ్చు, వీడియో , సెల్ ఫోనే, కంపూటర్ గేమ్స్ వచ్చాక ,చిన్న పిల్లలు కూడా అవే ఆడుతున్నారు, ఇప్పుడు ఇవి ఎవరు ఆడుతారు? మోనోపోలీ అని లండన్ లో ఉన్న అన్ని ప్రదేశాలు కొనేయడం, ఎంత బాగుండేదో, పేపర్ డబ్బులు, దాచు కోవడం, అప్పు చేయడం బ్యాంకు నుంచి, ఇది కూడా అదే దారి,  మా దగ్గర పేపర్లు కొనే పంచ కట్టుకుని, తలపాగా చుట్టుకునే అతను. పేరే తెలీదు, ఇన్నేళ్ళు గా అతనికి పిల్లలు ఉంటారుగా, ఇచ్చేయడమే..ఇంకా ఎప్పటివో, జూ లో జంతువుల బొమ్మలు, ఇవి దాస్తాను, ఎంత బాగున్నాయో, రంగులు పోకుండా, గృహ ప్రవేశం నాడు ఇచ్చిన రాక రకాల గోడ కి తగిలించేవి, ఏం చేయాలో తెలీదు, ఇన్నిఏళ్ళు అయింది, ఇంక మెల్లిగా వీటిని దిమ్పవచ్చు, క్షమించండి అని మనసులో దణ్ణం పెట్టుకుని , పాత, పాత, పసుపు రంగు లోకి వచ్చిన కాయితాల పత్రికలూ, ఎందుకు దాచానో  , ఉమెన్స్ ఏరా లు ట, ఇల్లు ఎలా  అలంకరించు కోవాలో, ఏవో స్వీట్స్, ఇంకా ఏవో చిట్కాలు, వీటి అవసరం ఇప్పుడు నాకు ఇంక ఉండ దనే అనుకుంటున్నాను ఈ యాభై పడి లో.
ఇల్లు మొహం నుంచి బయట పడాల్సిన సమయం కదా ఇంక. 
ఇదేమిటి, ఏదో  కవెర్ లో, ఫోటోలు, బ్లాకు అండ్  వైట్ ఫోటోలు, ఇక్కడ ఇలా పడి ఉన్నాయి ఏమిటి? ఎప్పుడో ఇంకో జన్మ లాగ ఉంది, మేం ఎం ఎస్ సి చదువు తున్నప్పుడు, వెళ్ళిన అరకు, భిమ్లి పిక్నిక్ ఫోటోలు, నేనే నా ఇంత సన్నం గా ఉన్నానో, నా ఫ్రెండ్స్, అందరు, అవే కదా బాధ్యతలు లేని, అందమైన , మధురమైన ,బంగారు రోజులు..(కవన శర్మ గారి నవల ఇదే పేరుతో ),ఏదో బాక్స్ కామెర తో తీసినవి, మొహాలు సరిగా కనిపించవు , అయిన ఎన్ని జ్ఞాపకాలు మోసుకుని ,దాచు కున్నాయి ఈ బ్లాకు అండ్ వైట్ ఫోటోలు, మన అందరికి మన పాత రోజులు ఇలాగే బ్లాకు అండ్ వైట్ రోజుల లాగే కని పిస్త్హాయి ఇప్పుడు. రంగుల రంగుల గా ఉండదు ఎప్పుడు, మన పూర్వ చరిత్ర, అందుకే కాబోలు సినిమా లో కూడా ఈశ్ట్ మాన్ కలోర్  సినెమా కాస్త ఫ్లాష్ బ్యాక్ చూపించాలంటే ఇలాగే బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తారు. 
ఫలించని ప్రేమలు, ఫలించిన ప్రేమలు, మిగిలిన స్నేహాలు, అల్లుకున్న బంధాలు, సుదూరాల్లో రాణిస్తున్న క్లాస్స్ మేట్స్ గా మిగిలిన మొహాలు, కొండలు, లోయలు, వెచ్చని చలి, పచ్చని ఆవ పూల కార్పెట్ వేసిన అరకు, నింగి నుంచి దూకే నీళ్ళ జల పాతం కింద తల పెట్టి , బుచ్చి బాబు కథ లాగ నిర్వికల్ప స్థితి, మైళ్లు, మైళ్లు, పరుగులు పెట్టడం, అంతా కలిసి ఒక యవ్వన కోలాహల సందడి, ఆకాశానికి ఆశల నిచ్చెనల వేసే ఒక మోహపు వయసు విచ్చలివిడి ఆకతాయితనం, ఇవే, ఇవే కదా నేను, మేం, ఇవి తప్పక ఉండ వలసిందే, జ్ఞాపకాల ఖజానా ఇవి, ఇది చాల విలువ కట్టలేని ఖజానా, ఇంకా ఈ ఉత్తరాల కట్ట కూడా దాస్తాను, అప్పుడే ఎంత సమయం గడిచి పోయింది.
జీవితం లోను..ఇలాగ సర్దడం లోను, ఇలాగ బరువు ఎక్కిపోయింది ఏమిటి మనసు అంతా, అటక మీద బరువు దించాను కాని, మనసు బరువు ??!!

ఇంకా చిన్న వాడి, స్కటింగ్ షూస్, విరిపోయిన బాట్లు, అందరు టెండూల్కర్ లు అవుతారనే ఆశ కదా మన కి, టెన్నిస్ రాకెట్లు, ఒకప్పడి హీరోల పోస్టర్లు, ద్రావిడ్ పోస్టర్ మటుకు మాకు ఎప్పటికి మారదు, ఎనో కార్డులు, పేక ముక్కలు, పెన్నులు,  కొమ్పస్స్ బాక్సులు, అబ్బ ఎప్పటివో, ఎందుకు దాచాను ఇవి, పిల్లలికి అవసరం అవుతాయేమో, అనా ?
పాత ని వదుల్చు కోలేని బలహీనతా? పిల్లలు పిల్లలు గానే ఉంటారని ఊహా? ఏమో.. అమ్మ మనసు లో ఏం ఉంటుందో? ఆమె కే తెలుసు.

ఇంకా ఈ షూ బాక్స్ లో  పాటల కాసేటే లు, చిరంజీవి సినెమా హిట్స్, రఫీ హిట్స్, లతా. ఘంటసాల.. ఎంతో కష్టపడి  రికార్డు కూడా చేయించాను, ఇప్పుడు అన్ని నెట్ లో దొరుకు తాయి, ఇవి కూడా ఇంక పడేయ వలసిన టైం వచ్చింది. 
పాతవి వదిలించుకో, ఇదే కదా ఇప్పటి మాట. ఇంకా ఇలాంటి అటకలు ప్రతి గది లోను ఉన్నాయి, పుస్తకాలు, పుస్తకాలు, పుస్తకాలు,ఎక్కడ చూసినా అవే, ప్రింట్ లో అక్షరం చూస్తె ఏదో వివసత్వం, చదివేయాలని ఆశ, కొని చదివేయాలని ఇంకో వెర్రి ఆశ, పుస్తకాలు ఏదైనా లైబ్రరీ కి ఇచ్చేయాలి ..
ఇంక వంటింటి అటక ఉంది..అది ఒక పెద్ద అఘాతం, ఒక ఫ్యామిలీ కి కావాల్సిన సామాన్లు ఉంటాయి అక్కడ, అది మొదలు పెడితే, ఇంట్లో యుద్ధాలు అయి పోతాయి, అసలు ఇన్ని ఎందుకు? ఎప్పుడు?? కొన్నావు అనే ప్రశ్నలతో..మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడు అవసరమా? 
శాంతి శాంతి..అటక సర్దడం కాదు గాని, కొంచం వేడి ,వేడి కోఫ్ఫీ తాగి ,పాతవి పడేయడం లో ఇంత బాధ , ఇంత శ్రమ ,ఇంత అతలా కుతలం ఉన్నాయి కాబట్టే, ఈ పనులు మనం అలాగ పోస్ట్ పోన్  చేస్తూ ఉంటాం, ఇలాంటి పనులు మగ వారు చేయ గలరా? 
ఒక చీపురు పట్టుకుని అన్ని తుడిచి వేయడానికి, అది అటకే గాని, ఎన్నో జ్ఞాపకాలు, కూడా..ఏమంటారు?

26 అక్టో, 2010

ప్రపంచమే తెరుచు కుంటుంది...

అమ్మలూ ..అమ్మమ్మలూ, నాయనమ్మలు తెరవండి తలుపులు, పట్టండి చిట్టెలుకని.. అదే విండోస్ లో కి లాగ్ ఇన్ అయి, మౌస్‌ పట్టి, కొత్త లోకం లోకి ప్రవేశించండి. ఇప్పుడు అందరి పిల్లలు, వారి పిల్లలు, అమెరికా లోనో లేదా గల్ఫ్ లోనో, ఉంటున్నారు. పిల్లలు గుర్తు వస్తున్నారు అంటూ కళ్ళు వత్తుకోడం   కాదు.. వెంటనే లాగ్ ఇన్ అయిపోయి, చాటింగ్ అంటే మాటలు ,పదాల్లో మాటలు మొదలు పెట్టండి, లేదా పిల్లలు ఫేసు బుక్ లో పెట్టే ఫోటోలు చూడండి. అంటే కాని, ఇల్లు ఖాళీ అయిపొయింది అని దిగులు తో ఇంట్లో వాళ్ళ మతి పోగట్టకండి .
ఎంతో కొంత చదువుకున్న  వాళ్ళు కూడా అదేదో బ్రహ్మ విద్య అన్నట్టు, నాకు కంపూటర్ అంటే ఏమిటో తెలీదు. నేను ఏమి నేర్చుకోలేదు అంటారు. పిల్లలు వారి అమ్మలకి, అమ్ముమ్మలకి, కొంచం ఈ బ్రహ్మ విద్య కానిది నేర్పించి వెళ్ళాలి. విదేశాలకి వెళ్ళే ముందు. మనం దానికీ ప్రోగ్రాంలు రాసి ఏమి నేర్పించ అక్కర్లేదు. 
పవర్ స్విచ్ ఆన్ చేసి, నెట్ మీద క్లిక్ చేసి, ఒక్కోసారి అది ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది.. ఏదో ఒక ఎక్ష్ప్లొరెర్ కాని, ఒక ఫైర్ ఫాక్స్ కాని పేజీ ఓపెన్ చేసి, మెయిల్ ఓపెన్ చేయడం  నేర్పించాలి.. నెట్ లో కొన్ని ముఖ్య మైన పేజెస్ ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపించాలి. ఇంట్లో మగ వారు కూడా, నీకేం వస్తుంది? నువ్వు ఏదో పాడు  చేస్తావు లాంటి మాటల తో ఆమెను నిరుత్సాహ పరచ కూడదు. 
నాన్న ల కన్నా అమ్మ లు ఎక్కువ మిస్ అవుతారు పిల్లలని, అస్తమాను ఫోన్‌ చేసి మాట్లాడండి అని విసిగించలేము , అలాంటప్పుడు ఒక మెయిల్ రాసి పెడితే, వాళ్ళు చూసుకుని , వారి కి వీలు అయినప్పుడు వారే ఫోన్‌ చేయడమో, లేదా మెయిల్ లో విషయం రాయడమో చేస్తారు. 
మాకు తెలిసిన రాజ్యం అత్తయ్య గారు, చినవాల్టర్ లో ఉండే మా అత్తయ్య గారి పిల్లలు నలుగురు అమెరికా లో ఉంటారు , ఎప్పుడో  పదేళ్ళ ముందు నుంచే ఆవిడ నెట్ ఉపయోగించడం నేర్చుకుని, టక టక మని వెబ్ కమెర కూడా ఆన్ చేసి  ఇక్కడ వారిని అక్కడ చూపించడం, వాళ్ళ ఇంట్లో జరిగే వ్రతాలు, పుట్టిన రోజుల పండగలు చూడ్డం చేస్తున్నారు ఆవిడ.అన్నిటికి  టికెట్లు కొనుక్కుని అక్కడికి పరుగెట్టలేరు కదా.  ఆవిడకి ఏ డిగ్రీ చదువులు లేవు కాని, ఏదైనా నేర్చు కోవాలి అన్న ఉత్సాహం ఉంది. ఎవరి మీద ఆధార పడకుండా ఆవిడే అన్నీ చూస్తున్నారు  నెట్ లో. ఫోటోలు చూపిస్తారు మనకి. ఎంత ముచ్చట గా ఉంటుందో? 
నాకు తెలిసిన వారు ఎందరో, నా వయసు వారే, కంపూటర్ విద్య నేర్చుకోలేదు అంటారు, ఏ విద్య అక్కర్లేదు అది ఒక మెషిన్, దానిని ఉపయోగించడం వస్తే చాలు, అంటే ఏమిటో  సందేహిస్తున్నారు. నా ఉద్దేశం  ఇంట్లో ఉండే ఆడవారికి ఈ విషయాలు బోధించే సంస్థలు, ఇంటికి వచ్చి క్లాసెస్ పెట్టి నేర్పిస్తాం అని ,నేర్పించడం మొదలు పెట్టాలి. 
ఎన్నో చేయ వచ్చు. స్నేహితులతో మాట్లాడుకోవడం, కథలు చదవడం ,సినిమా కథలు చదవొచ్చు, వార్త పత్రికల లో  వార్తలు  చదవడం , ఎన్నో చేయ వచ్చు. పిల్లలు ఇల్లు వదిలి, చదువు కోసమో, ఉద్యోగం కోసమో బయటకి వెళుతున్నారు.  పాస్ పోర్ట్ ,వీసా లాంటి వివరాలని మనంతట మనమే చూసుకోవచ్చు ఎవరి మీదా ఆధార పడకుండా.
ఒక్క సారి శూన్యం గా అనిపించి, ఏదో బాధ తో, బి . పి .లు, షుగర్ లు వచ్చి, మనకి ఏదో ఆరోగ్య బాధలు ఉన్నాయి అని విచారిస్తూ కూర్చునే రోజులు కావివి. మన ఆరోగ్యం కూడా మనమే బాగా చూసు కోవాలి, ఎక్కడి నుంచో పిల్లలు వచ్చి మనకి సేవలు చేయడానికీ ,వారికి వీలు పడదు, అని తెలుసు కోవాలి. ఉద్యోగ బాధ్యతలు పిల్లలు ఆడ పిల్లలు అయినా మగ పిల్లలు అయిన ఇప్పుడు ఒక్క లాగే ఉంటున్నాయి. 
ఇంక ఆడ పిల్లకి పెళ్లి అయి విదేశం లో ఉంటే, తప్పక అమ్మలు వెళ్ళాల్సిందే డెలివరీ సమయానికి. వారు పంపించే వీసా కాయితాలు, టికెట్ అన్నీ నెట్ నుంచే చూసు కోవచ్చు. అక్కడ వాతావరణం, ఆ ఊరు లో సదుపాయాలు అన్నీ మనం ఇక్కడ ఇంట్లో కూర్చునే చూడ వచ్చు. ఎంత పరిజ్ఞానం ఉంటే ఏ విషయం మీద అయినా అంతా మంచిది, ఈ రోజుల్లో. మన గది లోనే కూర్చుని, ప్రపంచం అంతా చుట్టి రావచ్చు.
ఇంకా వంటలు అవీ ఇష్టం ఉన్నవారు, లెక్క లేని అన్ని వంటల పేజీలు  చూడ వచ్చు, లేదా వారికి తెలిసిన వంటలు, ఇంక చిట్కాలు, ఏవైనా ఇలాగే ఒక బ్లాగ్ లో రాయ వచ్చు. 
నాకు బాగా నచ్చిన టి వి సీరియల్ అమ్మమ్మ.కామ్ లో అమ్మమ్మ ఇంటి నుంచే ఎంత ఉపయోగ పడే విషయాలు చెపుతో ఉంటుంది. మధ్య తరగతి, మామూలు మగవారి మనస్తత్వం కలిగిన భర్త, మూర్ఖం గా ముందు వ్యతిరేకించినా చివరకి ఎలా ఆవిడ గొప్పతనం అంగీకరిస్తాడో, చక్క గా చూపించారు. 
ఇంట్లో గృహిణి గా ఉంటూ, మనం ఏమి చేయలేం, ఏం నేర్చుకోలేదు అని విచారించడం మానేసి, ముందు ఈ ప్రపంచ కిటికీ ముందు కూర్చోండి. చేతిలో మౌస్‌ పట్టు కోండి. క్లిక్ చేయండి. ప్రపంచమే తెరుచు కుంటుంది. మీ ముందు రండి ఈరోజే, ఈ క్షణమే..
ఈ టపా రాసి మూడేళ్ళ యిందేమో , ఇప్పుడు ఇంకా ముందుకి వెళ్ళి పోయాం ..అంతా వాట్స్ అప్ ల కాలం ఇప్పుడు ..మరి ..అమ్మ లూ అమ్మమ్మలూ అందరూ వాట్స్ అప్‌ లే మరి ..
మొబైల్ శకం ఇది , దూరాలు తరిగిపోతున్న కాలం ఇది , మన కళ్ళ ముందే విభ్రాంతికర మార్పులు చూస్తున్నాం ..అనుభవిస్తున్నం ..మన తరం నిజం గా చాలా అదృష్ట వంతులం కదా ,ఎవరేమన్నా ..మొబైల్ జిందాబాద్ .

25 అక్టో, 2010

ఆకలి -ఆహారం- ఎవరు పేదవారు?

ఆకలి -ఆహారం- ఎవరు పేదవారు? ఈ విషయాలు చర్చించడానికి NAC అనే ఒక ఉన్నత అధికారుల సముదాయం.. కి ఎట్టకేలకు సమయం దొరికింది. సుప్రేం కోర్ట్ అనే ఉన్నత న్యాయ స్థానం ఈ మధ్యనే, ఎలుకలు తింటున్నాయి, వర్షం లో నాని పాడయి పోతున్నాయి మన తిండి గింజలు వృధా అయి పోతున్నాయి అనే వార్త కి స్పందించి, వెంటనే మూడు పూటలా భోజనం చేయని మన దేశ ప్రజలు కి ఉచితం గా నయానా పంచి పెట్టమని ,మన అలసత్వ ప్రభుత్వం కి చీవాట్లు వేసింది. మంత్రి వర్యులు, అంతర్జాతీయ క్రికెట్ అనే క్రీడ లో అతి ముఖ్య మైన విషయాలు చర్చిస్తూ, చాల బిజీ గా ఉన్నాం అన్నారు, ప్రధాన మంత్రి గారు , ఫైనాన్సు గురించి మాట్లాడారు, ఎవరు ఏమి అన్నా ,న్యాయ అధికారులు మళ్లీ, మళ్లీ ,ఇదే విషయం గుర్తు చేస్తే, మొత్తానికి ఎవరికి పంచాలి? ఎవరు నిజం గా బీద వారు? ఎవరు రోజుకి వచ్చే వంద రూపాయల కూలి తో , బియ్యం, పప్పు, కూరలు, ఇంకా బలం ఇచ్చే ఒక గుడ్డు, ఇంక పాలు, కొనుక్కోలేరు, ఎందుకు ఇలా నీరసం గా ఉంటారు? ఎందుకు పిల్లలని బడి కి పంపించరు,  ఎందుకు చిన్న పిల్లలు కి వచ్చే వ్యాధులు నుంచి కాపాడ లేరు? ఎందుకు? ఎందుకు?  
వారికి వచ్చే కూలి సరిపోదు అని మన లాంటి వాళ్లకి తెలుస్తుంది కాని , ఎక్కడో సెంటర్ అంటే ఢిల్లీ లో కూర్చునే వారికి ఎలా తెలుస్తుంది. మన ఇళ్ళల్లో పని చేసే పని వారు, ఏమి తినకుండా నే పనిలోకి వస్తారు అని తెలిసిన రోజు ,నేను ఆశ్చర్య పోయాను. జీతం అంతా ఏం చేస్తారు? ఇంట్లో అందరు సంపాదిస్తారు కదా? మన ఇంట్లో లాగ కాదు, ఒకరు సంపాదిస్తే నలుగురు తినడానికి.. అనుకున్నాను. కాని వారికి ఎప్పుడో ,ఏదో శుభా కార్యం కి చేసిన అప్పో, లేదా హాస్పిటల్ కి చేసిన అప్పో, ఇల్లు కట్టుకోవడం, అనదిక్కర స్థలం లో, ఎవరికో డబ్బు కట్టి, ఈ అప్పు వారిని కాన్సెర్ (క్షమించాలి ,ఈ పదం వాడినందుకు, ఇప్పుడు కాన్సెర్ కి మందు ఉంది, మునుపటి లాగ కాదు అని తలుసు, అలవాటు  గా పడి పోయే కొన్ని పదాలు ఇవి) లాగ పీడిస్తూ ఉంటుంది. నెల నెల, లేదా వారం వారం వారు కొంత డబ్బు కడుతూ ఉంటారు. మనకి పొద్దున్న లేస్తే, ఈ పూట బ్రేక్ ఫాస్ట్ కి ఏం వండాలి   , బోర్ కొట్టకుండా, రోజు కో రకం చేసి పెట్టాలి, ఇలాంటి సమస్యలు ఉంటాయి. వారికి ఈ రోజు బియ్యానికి పైసలు ఎవరు ఇస్తారు? ఇంట్లో అందరికి అన్నం కడుపు నిండుగా పెట్ట గలనా? రేశున్  కొట్టు మీద బియ్యం ఏ మూలకి  వస్తాయి. మన లాగ లెక్క గా తినరు కదా,  కంచం నిండుగా ఇంట్లో అందరికి అన్నం, ఏదో ఒక కూర వండాలి అంటే ఎంత చూసుకోవాలి? ఆ ఇంట్లో ఆవిడ? మనం ఇచ్చే జీతాలు , నెలకి ఒక సారి ఇస్తాం, నెల అంతా సరి పోతుంద? మన కి  కొంచం ,కొంచం అర్ధం అవుతాయి వారి కష్టాలు.
ఇంక   ఏ మాత్రం పనులు లేని ఒక మారు మూల పల్లెటూరు ఊహిస్తే, చేద్దాం అన్నా పని ఉండదు. పొలం పని చేద్దాం అంటే, కరువో, వరదలో, ఏదో ఒకటి పీడిస్తో, పనులే దొరకవు. ఇప్పుడు వంద రోజులు పని పధకం లో కొంత నయం అంటున్నారు  . 
ఈ నేపధ్యం లో ఎవరు? పేద వారు? ఎవరికి ఈ తిండి గింజలు పంచాలి అనే ఒక మహా సమస్య లో పడి పోయారు. ప్రభుత్వం వారు. 
ఈ మధ్యనే, అడవి లో దుంపలు తవ్వుకుని తినే వారి గురించి రాసారు. మూడు పూట్ల తిండి కోసం పల్లెలు వదిలి, రోజు కూలి చేస్తూ, పట్టణాల్లో, ఆకాశం కిందే పడుకునే  మైగ్రంట్ కూలీలు కని పించరా? మట్టి లో ఆడుకునే మన దేశ భావి పవురులు కని పించరా? 

మన  దేశం మన ఆకలి ఇన్దెక్ష్ ని చాల కింద కి చూపిస్తూ అవాస్తవాలు ని ప్రచారం చేస్తోంది అని అనేక సంస్థలు చెప్పేరు. ఎత్తైన భవనాలు , షాపింగ్ కాంప్లెక్స్ లు, పట్టణాలు లో అభివృద్ధి , రోజు రోజు కి పెరుగు తున్న సెన్సెక్స్ వీటి మెరుపుల  కాంతి వెనుక ఒక నీడ లాంటి చీకటి ఉంది. అది మన ప్రభుత్వం లో పెద్దలకి కనిపించదు. కళ్ళు తెరిస్తే కని పిస్తుంది.

 ఎందుకు అంత నిరాశ గా రాస్తారు? ఎంత అభివృద్ధి చెందింది మన దేశం దీని గురుంచి రాయ కూడదా? అంటారు కొందరు. మన దేశం లో అరవై శాతం ప్రజలు, ఆకలి తో నే కాళ్ళు మూడు చుకుని పడు కుంటున్నారు అని, చివరకు ఈ రోజు తేల్చారు. వీరినే BPL  అని ఆ గీత కింద ఉంటారు అని అంటారు  . 

పోనీ  ,ఇప్పటికైనా మేలు కున్నారు. వీరికి మూడు రూపాయలకి , గాని, ఇంక తక్కువకే ఆహార పదార్ధాలు సరఫరా చేస్తారు ట.  ఆచరణ లోకి తేవడానికి ఎన్ని రోజులు పడుతుందో కానీ, ఎప్పటి కప్పుడు, వీరికే సరిగ్గా అందు తున్నాయి అని చూసేందుకు కూడా ఇప్పుడే నియంత్రణ లు పెట్టాలి, మొన్నటి వరకు ఎలకలు తిన్నాయి ట, ఇంక వేరే పంది కొక్కులు లాంటి వ్యాపారస్తుల బారిన పడకుండా కాపాడాలి. 

మన దేశం లో, అన్నీ ఉంటాయి, పేపర్ మీద. కాని అంద వలసిన వారికి అందవు అవీ. కాని, దేశం ఇలాగ ఈసురో మని ఆకలి తో ,నీరసం గా మూలుగు తూ ఉంటే, ఒక్కరైనా అంటే ఇరవై శాతం అయితే ఫర్వ లేదు అన్నట్టు కాదు, ప్రతి ఒక్కరు, కడుపు నిండా తిన గలిగి ఉండాలి, ఇదే మన దేశ గొప్పతనానికి నిర్వచనం. ఈ కల నిజం చేయడానికి ,పూనుకోవాలి.

పంచవర్ష ప్రణాలికలు , బడ్జెట్ లు, ప్లానింగ్ కమీషన్లు, మంత్రి వర్గాలు, ప్రభుత్వ పథకాలు, అధికారులు అన్నీ, అందరు.. ఈ దిశా గా ఆలోచించాలి, అంటే గీటురాయి అంటారు, అలాగ, ఈ రోజు ఎంత మంది హాయిగా ,కడుపు నిండా తిన్నారు? ఎంత మంది ఆకలి తో ఉన్నారు? ఎందుకు? అని ఆలోచించే రోజు రావాలి.  ఆ రోజు దేశం నిజం గా అన్నపూర్ణ మన దేశం అని పాడు కునే రోజు.


24 అక్టో, 2010

విలక్షణ మైన ప్రేమ కథ ??

కళ జీవితం నుంచి పుడుతుంది అంటారు.  కొన్ని కథలు చదువుతూ, ఇలాంటివి కథల్లో నే జరుగుతాయి, నిజం గా జరుగు తాయా? అని పెదవి విరుస్తాం.  హిందూ పేపర్ లో ఈ వార్త  కథనం నన్ను చాల కదిలించింది.  మీతో పంచు కోవాలని రాస్తున్నాను. 
మనోహర్ దేవదాస్ గీసిన చిత్రాలు, మహేమా మరియు సీత కోక చిలుకలు.. అనేవి లక్షణ ఆర్ట్ గేలరీ లో ప్రదర్శింప  బడు తున్నాయి.  ఏమిటి వీటి ప్రాముఖ్యం అంటున్నారా?  ఇవి వేసిన మనోహర్ కి కళ్ళు కనిపించవు.  జీవిత సహా చారిణి మహేమ జ్ఞాపకాల తో వీటిని గీస్తున్నాడు మనోహర్. ఆమె ను ఎంతో ఇష్ట పడి, ఆమెను తన ప్రేమతో , గెలుచు కున్నాడు ట. ఎన్నో ప్రేమ లేఖలు రాశాడుట. తన జీవితం లోకి ఆమె వస్తే,  ఎంత  బాగుంటుందో,  తన ప్రపంచం లోకి ఆమె ఎన్ని రంగులు నిమ్పగాలదో అని  వర్ణిస్తూ, ప్రేమ లేఖలు రాసి ఆమె ను ఒప్పించి , ఆమె ను వివాహం చేసుకున్నాడు.
తొమ్మిది సంవత్సరాలు మధురమైన జీవితం గడిపాక ,ఒక రోజు వారి కార్ ఒక లారీ కి గుద్దుకుని ఆక్సిడెంట్ అయింది. ముప్పై రెండు ఏళ్ల మహేమా మెడ కింద నుంచి పక్ష వాతం తో లేవ లేని స్థితి లో ఉంది పోయింది.

చిన్న చిన్న కారణాలు, పెద్దవి చేసుకుని విడి పోయే దంపతులు ఇది చదివి తీర వలసిందే.. 

మామూలు , శరీరాకృతి  కలిగిన మనోహర్, వ్యాయామం  చేసి తన చేతులను దృఢ పరచుకుని, కదల లేని తన భార్య ని తన చేతుల మీదు గా ఇంట్లో తిప్పేవాడుట  . కష్టాలు అన్నీ ఒక్క సారే   వస్తాయి అన్నట్టు ఇదే సమయం లో మనోహర్ కళ్ళకి ఏదో వ్యాధి వచ్చి అతనికి కళ్ళు కని పించడం మానేశాయి ట.
నాకే ఇన్ని కష్టాలు వస్తాయి అని బాధ పడుతూ, కన్నీళ్లు కారుస్తూ కూర్చో కుండా, వీరు    ఇరువురు, ఒకరి కోసం ఒకరు నిలిచి,  కథలు వ్రాస్తూ, చిత్రాలు గీస్తూ, వాటిని అమ్మగా వచ్చిన డబ్బు హాస్పిటల్ ల కు,  దాన సంస్థ లకు ఇచ్చేవారుట.

 "వైగై సూర్య అస్తమయం " అనే చిత్రం ఒక మరణ అవస్థ ను ప్రతి బిమ్బించే చక్కని చిత్రం.. లే లేత గులాబీ రంగు, నారింజ , వోఇలేట్  రంగుల  మబ్బులు , కుంగి పోతున్న సూర్యుడు , ఈ చిత్రం లో కనువిందు చేస్తాయి. 
ఇంకో క చిత్రం. పసుపు పచ్చని  నదిలో, ముగ్గురు నడుం వరకు మునిగి ఉన్న దృశ్యం ..అడవి ఆడ పడుచు , ఒక చిత్రం లో, ఎన్నో, ఎన్నెన్నో చిత్రాలు, అతని మదిలో జ్ఞాపకాల గని నుంచి తవ్వి, ఆ జ్ఞాపకాలకు రంగులు అద్ది, చూపే లేని తన కళ్ళతో ఒక దృశ్యం ను మనసు చక్షువు లతో ఆవిష్కరించాడు. 

 నమ్మలేని విషయం లాగ ఉంది కదూ.. తెలుపు లో ఏడు రంగులు ఉంటాయని విన్నాం, మనకి తెలుసు, నలుపు లోంచి కూడా ఇన్ని రంగులా?  తన సహచరిణి కూడా మరణించింది.. రెండు వేల ఎనిమిది లో..

అయినా ఆమె జ్ఞాపకాలతో అతను బొమ్మలు గీస్తునే ఉన్నాడు.  అతను ఆమె కు రాసిన ప్రేమ లేఖలు గుర్తు చేసుకుని, ఆ మాటలు, ఆ ప్రమాణాలు, ఆ ఊహలు, ఆ కలలు కి రూపం కలిపిస్తున్నాడు. 

ఎలా గీస్తారు? ఈయన ఎందుకు గీస్తారు? ఈయన అనే  ప్రశ్నలు ఉదయిస్తాయి.  అతని కి పోయింది దృష్టే కాని అతని లోని కళ దృష్టి కాదు అని ఒక సమాధానం. 

ఎలా? అంటే... త్రికోణ మితి అనే మాథ్స్ పరిజ్ఞానం , వందల్ కొద్ది  ఫోటోలు తీసి, ఆ వస్తువులకి , కళ్ళకి ఒక అరుదైన మందు చుక్కలు వేసుకుని, కను గుడ్లు పెద్దవి అవడానికి, + ముప్ఫై పవర్ ఉన్న కళ్ళ అద్దాలు, చాల ఎక్కువ లైట్ ఇచ్చే లైట్ వెలుతురూ లో, భూత అడ్డంలు వాడుతూ, చేతికి గ్లోవేస్ వేసుకుని,  ఈ వేడి కి చెమటలు పడితే, చిత్రం పాడు అవకుండా, ఇన్ని కష్టాలు పడుతూ, అతను చిత్ర్రాలు గీస్తున్నాడు. 

అతను గీసిన చిత్రం , మొత్తం స్వరూపం కూడా అతను చూడలేడు  . ఒక రూపాయి కాసంత మేర మాత్రమే, చూడ గలడు  .. అయినా అద్భుత  మైన చిత్రాలు, మనసు ని మైమర పించే చిత్రాలు గీస్తున్నాడు అతను. ప్రేమ భావన  కే రంగులు అద్దు తున్నట్టు,  తన లోనే నిలిచిన , ఆమె స్మృతులు కి రూపం ఇస్తూ,  కొనే వారికి , ఒక ప్రియ మైన జ్ఞాపకం కొనుక్కుని వెళుతున్న ఒక అనుభూతి. విలువ కట్టలేని ఒక చిత్రం.. ప్రతి చిత్రం..

ముప్ఫై మూడు పైన్టింగ్స్ లో మూడు మాత్రమే మిగిలి ఉన్నాయిట. లక్షణ ఆర్ట్ గాలెరి లో. ఇవి అమ్మగా వచ్చిన డబ్బు, శంకర్ నేత్రాలయ కీ, అరవింద్ కంటి ఆసుపత్రి కి వెలతాయిట.

ధన్యుడు మనోహర్ దేవదాస్ .. ధన్యు రాలు మహేమా.
ఇది నిజం గా ఒక విలక్షణ మయానా ఒక ప్రేమ కథ కదా?? 
 

20 అక్టో, 2010

ప్రపంచం మన చేతిలో..

ఇరవై ఏళ్ల క్రితం  ఫోన్ కోసం ఒక ఏడాది తపస్సు చేస్తే  అంటే ముందు అయిదు వేలు ధరావతు కట్టి  ఏమైంది మా ఫోన్ విషయం ,అంటే, అప్పుడేనా ఇంకా ఇన్ని వేల మంది మీ ముందు ఉన్నారు, అంటూ  మురిపించి, మురిపించి, చివరకు ఒక రోజు మేం ఊరులో లేని సమయం లో, ఓ ఫోన్ కేబుల్ కిటికిలోంచి పడేసారు, మా రెండో అబ్బాయి పుట్టిన కొన్ని నెలలకే, ఆ రోజు మా ఆనందం ఇంత అంతా అని కాదు. ఫోన్ ఉన్న కొంత మంది అదృష్ట వంతుల జాబితా లోకి మేమూ చేరాం..అదే ఆంగ్లం లో ప్రివేలేజేడ్ ఫ్యూ అంటారు.
ఇంక ఓ పది ఏళ్ళు ఏ మార్పులు లేవు, పొడవాటి లైన్ లో నిల్చుని ఫోన్‌ బిల్ కడుతూంటే, మీకు మేం ఎంత సేవ చేస్తున్నాం అంటూ డబ్బు తీసుకోవడం  అమ్మయ్య ఈ రోజు మనం ఎంత గొప్ప పని చేసాం, ఒక గంట లోనే బిల్ కట్టేశాం అంటూ నేను నేను అభినందించు కోవడం, ఇవి ఇప్పుడు ఏదో కల లాగ గుర్తు ఉంది.
రాజీవ్ గాంధీ టైం లో, శామ్ పిట్రోడా అనే ఓ టేక్నోక్రాట్ ఆధ్వర్యంలో మొదలయింది, మన సమాచార వ్యవస్థ ప్రయాణం.. ఒక దశాబ్దం లో ఎంత మార్పు, ఇప్పుడు వీధికి నాలుగు ఎస్ టీ డి కొట్లు, పల్లె పల్లె కూ ఫోన్‌ లైన్లు, అదే ఒక విప్లవం మన భారత దేశం లో అనుకుంటే, నవ శతాబ్దం లో అంటే రెండు వేలు ఏడాది నుంచి మన దేశం తన మార్కెట్ తలుపులు తెరిచింది, అంతే, మొబైల్ లేదా సెల్ ఫోన్‌ అనే సమాచార విప్లవం ఉదయించింది మన భారత్ దేశం లో, మన జీవితాలే మారి పోయాయి.
మనం ఇంట్లో లేక పోతే ఏదైనా ముఖ్య విషయం చెప్పాలి, అంటే  అవతలి వారు మనం ఇంటికి వచ్చే వరకు ఓపిక గా వేచి ఉండడమే . ఒకే ఒక ఫోన్‌ రింగ్ అయి, రింగ్ అయి ఓపిక పోయి, నీరసం వచ్చి ఊరుకునేది. మన కి ఏదో ఊరడింపు గా నెల కి, ఒక ఏభై రూపాయలు అదనం గా కట్టించు కుని ఒక కాలర్ గుర్తింపు సదుపాయం అంటూ పెట్టారు. మన సమాచార శాఖ వారు, ఏదీ చేసినా ఒక మెహర్బానీ ఏ వీరికి. వెంటనే ఆ సదుపాయం పెట్టించు కున్నాం . అయితే, ఈ సదుపాయం ఉన్నట్టే చాల మందికి తెలియదు, చాలా రహస్యం గా దాచుకునే వారు, ఇలాంటి సేవలు ..అందరికి అందుబాటు లో ఉంటే, వీరికి పని ఎక్కువ అవుతుందనో ఏమిటో? మరి.
ఇలాంటి సమయం లో ఈ మొబైల్ ఫోన్ అనే సదుపాయం  ఆకాశమే చేతిలో కి వచ్చినట్టు. ఏదో బయట పని లోకి, వెళ్ళే మగ వాళ్ళు కి ఒక ఆభరణం లాగ వచ్చింది మొదట్లో ఈ ఫోన్. జేబులోనో, బెల్ట్ కి నడుము దగ్గరో కట్టుకుని ఉండేది, సౌండ్ వస్తే, మాట వినబడదు, మన మాట వాళ్లకి వినబడదు, సెల్ కవరింగ్ లేదు అంటూ నడుచుకుంటూ , ఎక్కడికో వెళ్ళిపోవడం, దాని మీద బోళ్ళు జోక్స్..
టాటా వారే అనుకుంటా ముందు పోటిగా ప్రవేశించారు రంగం లోకి, అంతే సీను మారి పోయింది. పెను నిద్ర లోంచి ఆవులించుకుంటూ లేచారు. మన భారత దేశ సమాచార శాఖ వారు వారం రోజుల్లోనే ఫోన్ . మీ ఇంటికి వచ్చి అప్లికేస్సన్‌ తీసుకుంటాం అంటూ. నేను రెండు మూడు సార్లు నన్ను నేను, పక్క వాళ్ళని కూడా గిల్లి చూసాను, కలా? వైష్ణవ మాయా? అని..
ఇంట్లో లేక పోతే ఏ బొమ్మనో లోనో, చందనా లోనో, లేదా కరాచి వాల షాప్ లోనో ఉంటాను, నాకు ఎందుకు ఈ సెల్ ఫోన్ లు అవీ అని మొదట చాల వ్యతిరేకించాను. ఏదో అనుమానం మొగుడు లాగ (నా అనుభవం లో కాదు) వెంట వెంట వస్తున్నట్టు, మనం ఎక్కడ ఉంటే అక్కడికి పోన్ ఆ ? అదో మోత దండుగ, ఇప్పటికే భుజం లాగేస్తోంది ఈ హ్యాండ్ బాగ్ మోయలేక అనుకున్నాను. కాని, ప్రలోభంకి లొంగి పోయాను. అది ఒక ఫ్యాషను కదా మరి.
ఒక రోజు హైదరాబాద్ కి విజయవాడ మీదుగా బయలు దేరాను, ఉదయమే వెళ్ళే జన్మ భూమి లో టికెట్ కొనుక్కుని, ఏ సి చైర్ కార్ లో పెట్టె పెట్టి, మా వైజాగ్ స్టేషన్లో కొత్తగా పెట్టిన హోటల్ లో, వేడి వేడి ఇడ్లి తిని, వేడి కాఫ్ఫీ ,ఊదుకుంటూ తాగుతూంటే, రైలు కదిలిపోయింది. నా పెట్టె రైల్ లో, నేను ప్లాట్ ఫాం మీద.. దిక్కు తోచలేదు. వెంటనే స్టేషన్‌  మాస్టర్ కి రిపోర్ట్ చేశాను. అనకాపల్లి లో ఆగుతుంది, అక్కడ కాచ్ చేయండి అని ఒక సలహా ఇచ్చారు. అప్పుడు, ఒక అర గంట తేడా తో బయలు దేరే సింహాద్రి రైలు ఎక్కి, ఈ జన్మ భూమి రైలు ని చేసింగ్  మొదలు పెట్టాను. 
అప్పుడు నా బాగ్ లోని ఈ సెల్ ఫోన్ ,ఒక దేవత లాగ అని పించింది. వెంటనే తీసి, ఎడ పెడ రాజమండ్రి లో ఉన్న మా మరదలు కి, పెట్టె ఉందో లేదో కని పెట్టమని, ఒక ఫోన్, విజయవాడ లో ఉన్న మా మరిది కి ఇంకో ఫోన్ కాల్ కలిపి, నా కన్నా ముందు నా పెట్టె, ఇంకో రైలు లో వస్తోంది, ఎలాగో ఒక లాగు ,దాన్ని అంది పుచ్చు కోమని, చేసి,  ఇంట్లో ఒక ల్యాండ్ ఫోన్ ఉంటే ఏం ప్రయోజనం .ఇలాగ బాగ్ లో ఎప్పుడూ, నా వెంట ఉండే ఈ సెల్ యొక్క మహత్యం ఇంత అంతా అని కాదు. అని చాల ప్రత్యక్షం గా అనుభవం తో నేర్చుకున్నాను  సెల్ ఫోన్ యొక్క అవసరం.. మహత్యం పెట్టె దొరికింది లెండి.
ఇంక ఈ సెల్ ఫోన్ ఇంతై వటుడింతై అన్నట్టు పెరిగి, ఓహో ఎంత వింత అన్నట్టు చేతిలో అద్భుతాలు చూపిస్తోంది. ఫోన్ అంటే మాట్లాడు కోడానికి,టేప్ రికార్డర్ అంటే పాటలు విన డానికి, కేమెర  అంటే ఫోటోలు తీయడానికి ,కంపూటర్  అంటే , మెయిల్స్ అవీ చూసు కోవడం ,నెట్ లో ఏదైనా వెతుకోడానికి,  ఇలాగ వేటి అవసరం వాటికి, నాలుగైదు వస్తువులు కొనుక్కోవడం ఉండేది.
ఇప్పుడు అన్నీ కలిపి ఒకే ఒక బుల్లి, చేతిలో పట్టే అందమైన చిన్న యంత్రం.. సెల్ ఫోన్. అవురా? ఎంత మార్పు.. ? అని ముక్కు  మీద వేలు వేసుకోవాల్సి వస్తోంది.
మాట్లాడు కోడానికి, ఫోటోలు తీసు కోవడం, పాటలు వినడం, వీడియో కూడా తీయ వచ్చు , నెట్ కనెక్ట్  చేసుకుంటే, అదీ వై ఫై అనే కేబుల్ అక్కరలేని సుకర్యం ఉంటే, ఎక్కడైతే ఈ సదుపాయం ఉంటుందో, అక్కడ నుంచి మనం మెయిల్స్ పంపించ వచ్చు, మనకి ఏమైనా తెలుసు కోవాలి అంటే వెతుక్కోవచ్చు, ఇంకా జీ పి ఎస్  అనే సదుపాయం కూడా ఫోనే లో ఉంటే, ప్రపంచం లో ఎక్కడి కైనా మనం దారి చూసుకుంటూ క్షేమం గా వెళ్ళి పోవచ్చు, ఆపద లో ఉన్నాం అనుకుంటే ఒక కాల్ తో పోలీసులకి సమాచారం  ఇవ్వవచ్చు. ఇన్ని ఎందుకు ప్రపంచమే మన గుప్పెట్లో ఉంది.. అంటే అంత విషయమూ చేతిలో పట్టేంత చిన్నదిగా చేసి, రోజు రోజు కి ధర కూడా అందరికి  అందుబాటులోకి తెస్తున్నారు, పోటీ పడి మరీ. 
ఇంకా అంతేనా ఇంకా ఇవ్వాలో రేపో, మనం మాట్లాడే వాళ్ళ మొహాలు కూడా చూడ వచ్చు .నీవేనా నను తలచినది, అని తలుచు కాగానే వారినే చూడ వచ్చు మాయా బజారు లో పెట్టె లాగా అన్నమాట..
తపస్సు చేసి సంపాదించిన ల్యాండ్ ఫోన్‌ నుండి, చేతిలో పట్టే ఈ దివ్య మైన ఆల్ ఇన్ ఒన్..వరకు మన సమాచార వ్యవస్థ ప్రయాణం.. దూరాలను దగ్గర చేసే మహత్తర వరం.
దీని వెనక ఎందరో వైజ్ఞానికులు, అందరికీ వందనంలు.