"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

25 మార్చి, 2012

నేనింతే....నేనింతే...

"అమ్మా!!అమ్మా!!"
అని అరుచుకుంటూ హడావిడిగా లోపలి వచ్చేడు, మహి.
"అబ్బ..ఏమిటి రా ,ఆ హడావిడి? ఏమయింది? అంత రొప్పు తున్నావు? 
కూల్,కూల్.."
"అబ్బబ్బ అది కాదు అమ్మా..నా స్కూటర్ .".
"ఊ స్కూటర్ ,అమ్మో ఆక్సిదేంటా ??"
"కాదమ్మా విను, చిన వాల్టర్ రోడ్ లో వస్తూంటే.."
"ఊ ,వస్తూంటే? ఎవరయినా అడ్డు వచ్చి పడి పోయావా??" అప్పుడే గుండెలు దడ దడ లాడడం ,నాకే వినిపిస్తోంది.
"ఉండమ్మా! నన్ను చెప్పనీ"
నేను ట్యూషన్ క్లాసు నించి వస్తూంటే , వెళ్ళే ముందు దారి బాగానే ఉంది, వచ్చేటప్పటికి ..
"ఊ ,వచ్చేటప్పుడు". నేను .
"అమ్మ ..ఉండు నన్ను చెప్పనీ, వచ్చేటప్పటికి దారికి అడ్డం గా ఒక పందిరి వేసేసి, రోడ్డు మీద ఓ తాడు కట్టేసారమ్మా స్పీడ్ గా వస్తున్నానా? ఒక్క సారి బ్రేక్ వేసాను అమ్మా..అంతే , నలుగురు అబ్బాయిలు చుట్టుముటేసి, ఇటు దారి బంద్ ,ఇటు దారి లేదు, వెనక్కి వెళ్ళు అనేసరికి, నాకు "
" బాబోయ్ ,ఏం చేసావు రా? "
"ఉండమ్మా.. అసలే నాకు చికాకుగా ఉంది.. వాళ్ళ మీద..ఇలా అడ్డు తగలకు, పూర్తి గా  చెప్పనీ,
అయినా ఏమిటి రోడ్డు వాళ్ళ అబ్బ సొత్తా? "
"ఇదేమిటి రా బాబూ, చిరంజీవి సినిమా మాటలు మాట్లాడుతున్నావు.."
"అమ్మా.." "ఊ సరే, సరే..నువ్వు చెప్పు.".
అన్నాను, నోటి మీద వేలు వేసుకుని, ఒక పక్క మనసులో, చిరంజీవి సినిమా లో లాగే, పర్వతాలు పగిలి పోతున్నట్టు ,టెన్షన్ తో, నాకు 
చెమటలు పట్టేస్తున్నాయి  ..ఏమిటో ఏం అఘాయిత్యం చేసేదో వీడు? అని.
మహి అంటే మహిధర్..కి, తను తిట్టిన తిట్లు అన్నీగుర్తు వచ్చాయి అమ్మో అమ్మ కి తెలిస్తే, గుండె ఆగిపోతుంది, ఇంగ్లీష్ మీడియం లో చదివే నాకు ,ఇన్ని తెలుగు తిట్లు వచ్చు అని తెలిస్తే..
"ఏమయింది ? రా చెప్పు,"
"ఏం లేదమ్మా ..వాళ్ళతో తగువు పడ్డాను, నన్ను తోసేసి నా స్కూటర్ ,తీసేసుకుని, నన్ను వెళ్ళు ,వెళ్ళు అని పంపించేసారు   అమ్మా."..
"అయ్యో స్కూటర్ అక్కడే ఉందా?"
"ఎలాగరా ఇప్పుడు.. అయ్యో, నాన్న కూడా ఊరులో లేరు."
ఉండు అని చెప్పి, చిన వాల్తేర్ లో ఉన్న మా చుట్టాల వాళ్ళింటికి ఫోన్ చేసేను, ఎవరూ తీయలేదు, మా ఫ్రెండ్ సత్య ..ఊ వాళ్లకి అయితే లోకల్ పలుకబడి ఉంది, సత్య ఇంట్లో లేదుట , ఎలా ఇప్పుడు?
డోర్ బెల్ మోగింది..ఎవరూ? అని అరుస్తూ, విసుగ్గా తలుపు తీశాను.
హసీనా ,మా ఇంట్లో పని మనిషి ,కొడుకు  సలీం.
ఎప్పుడో ఒక రోజు మా ఇంటికి వచ్చేడు. 
గుర్తు పట్టేను, ఏమిటిరా ?" మీ అమ్మ ఎలా ఉంది?" ఊ.. రేపు పని లోకి రానని ,ఓ చెడ్డ కబురు మోసుకు వచ్చాడా?
"అమ్మ గారూ,"
వీళ్ళు మా కన్నా స్వచ్చమయిన తెలుగు మాట్లాడుతారు.. అనుకుంటూ..
" ఏం కబురు తెచ్చేవురా? మహి, ఇలా రా.. నువ్వు, నీ గది లోకి దూరి పోకు, నీ విషయం అంతా పూర్తిగా వినాలి నేను," అంటూ, ద్విపాత్ర అభినయనం లోకి దూరి పోయాను ,అమ్మ లకే సాధ్యం ఇది, మరి..ఇన్ని పాత్రలు ఒకేసారి పోషించడం..
"చిన బాబు స్కూటర్ తెచ్చి, కింద మన కార్ పక్కనే పెట్టెను, అమ్మ గారు..ఆ చిన వాల్తేరు ..అమ్మవారి పండక్కి మేం కరెంట్ పెడతాం కదా అమ్మగారు ,అంటే మా ఓనర్ పని, మేం చేస్తాం, బాబు ని చూసేను, అక్కడ , చిన బాబు ని చూసేను, బాబు వెళ్ళినాక ,నేను మంచి గా ,వారితో మాట్లాడి, మా అమ్మ పని చేసే ఇంట్లో బాబే, అని చెప్పి, తాళాలు లేవు కదా, తోసుకుని వచ్చి ,కింద సెల్లార్ లో పెట్టెను ..అమ్మ గారూ.."
"హమ్మయ్య ..చాల హ్యాపీ రా..ఒక పెద్ద బెంగ తీరింది. ఇప్పుడు ఆ స్కూటర్ ,ఎలా అనుకుని, అందరికి ఫోనులు చేస్తున్నాను.."
"ఉండు, ఇంద ,ఈ యాభై తీసుకో" అన్నాను, పర్స్ లోంచి తీస్తూ..
"ఒద్దమ్మా ,మా అమ్మ తిడతది, వస్తా అమ్మగారూ", అంటూ వెళ్లి పోయేడు.
మహి ..అని వెనక్కి తిరిగి చూస్తే,  అప్పటికే ,తన గది లోకి వెళ్లి తలుపు వేసుకుంటున్నాడు..
సమస్య తీరింది కదా..అని నేను ఇంకా బోళ్ళు పని ఉంది వంటిట్లో అని లోపలి వెళ్లి పోయాను.
మర్నాడు, హసీనా పని లోకి వచ్చి, మరింత వివరం గా వర్ణించి, చెప్పింది, తన కొడుకు చేసిన సాయం గురించి..
ఊ ..ఊ..అని పని లో పడి, నేను విని ఊరుకున్నాను.
నిన్నటి ఉత్కంట  తగ్గేసరికి,  ఇప్పుడు ఆ మాటలు వినడం..విసుగ్గానే ఉంది, అవును మరి మా వాడు, స్కూటర్ అక్కడ వదిలి వస్తే, దీని కొడుకు భద్రం గా తీసుకు రావడం ..మింగుడు పడోద్దూ  ..
ఏమిటో ఈ మనసు. ఇంత స్వార్ధం ..అని ఎవరో, నాతో అన్నట్టు అనిపించింది.
మా పనిమనిషి హాసిన ముస్లిం అయినా ,తనకే ,మన పద్ధతులు అవి బాగా తెలుసు.
వినాయక చవతి రోజు పూజ చేసి, మర్నాడే, గది సద్దేద్దాం అని ,దేవుడు ని తీయ బోతే, అదేమిటి అమ్మా? మూడో రోజు తీయాలి గదా..నిన్న కదిపి పెట్టేరా? అని అడిగేసరికి..
నాకు చిన్నతనం అనిపించింది, ఈ దేవుడు, పూజలు ఈ మధ్య కదా మొదలు పెట్టెను, పిల్లల కోసమని, వాళ్లకి పూజలు అవి అస్సలు తెలియకుండా పోతాయని ..
ఊరు దేవత ,కనక మహా లక్ష్మి, మార్గశిర మాసం లో రష్ గా ఉంటుందని, ఆ గుడికి  ఓ రోజు బయలదేరుతూంటే చెప్పింది హాసిన ఏ మరి.
నాకు ఏదయినా కష్టం వస్తే, వెంటనే ,మా వారు కి ఫోన్ చేస్తాను, లేక పోతే నా బెస్ట్ ఫ్రెండ్ సత్య కి..వాళ్ళిద్దరి సలహా ,లేనిదే ఏ పని చేయలేను.
ఇంట్లో  ఏ సమస్య వచ్చినా ,ముందు కంగారు పడి, తరువాత మెల్లగా ఏం చేయాలో అని తీవ్రం గా ఆలోచిస్తూ కూర్చుంటాను.
మొన్నటికి మొన్న ,వంటిట్లో గిన్నెలు తోముతోంది, వాళ్ళాయన ,వచ్చి బెల్ కొట్టేడు. 
చెయ్యి కడుక్కుని వెళ్లి పోయింది ,అంతే, ఆ గిన్నెలన్నీనేనే తోముకోవాల్సి వచ్చింది.
మర్నాడు, తీవ్రమయిన స్వరం తో, అని నేను అనుకున్నాను," ఏమిటే అలా వెళ్లి పోయావు..?"
అని అడిగితే, "మా ఇంటికి మా తోటికోడలు వచ్చింది , మా పిల్ల కి సంబంధం తెచ్చింది, మా ఆయనకి కాళ్ళు చేతులు ఆడవు, నేను ఇంట్లో లేక పోతే, అని ఉన్న పళాన నన్ను తోలుకు పోయాడు "
సరే, పోనీ ఇవాళ అయినా వచ్చేవు, అంతే చాలు..అని లొంగి పోయాను..
ఏమిటో, మా ఆయన మీదైనా ఎప్పుడయినా కోపం వస్తుంది కానీ, పని మనిషి మీద పొరపాటున కూడా రాదు...గిన్నెలు తోమే మహా పని నించి నన్ను తప్పించే .మహా మనిషి మరి..
మనం వాడిన గిన్నేలే,  తోమడం మొదలు పెడితే, ఒక పర్వతం లా అనిపిస్తాయి, కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే తక్కువ.
ఒక్కో రోజు, జీవితం అంటే విసుగు కలిగినప్పుడు మటుకు, చక చక అంట్లు తోమేసి, ఇల్లు ఊడ్చేసి, అబ్బ , ఎంత పని చేసేను ఈ వేళ,అనుకుంటే ఎంత బాగుంటుందో? ..హుహ్..ఆ రోజు, పున్నమి కో అమావాస కో ఎప్పుడో వస్తుంది..
కొన్ని రోజులు అయింది..
ఒక రోజు, మళ్లీ, వాళ్ళాయన వచ్చి బెల్ కొట్టేడు.
ఇదిగో, ఆ పనులు చేసి మరి వెళ్ళు హసీనా. . అని నేను ఒక వేపు అరుస్తూనే ఉన్నాను,
" అమ్మ గారు..మా అబ్బాయి సలీం తెలుసు కదా.. మనింటికి వచ్చేడు ,యాడ్ని, కౌన్సిలర్ గారింట్లో , గది లో పెట్టి తాళం పెట్టేరెంట.. వాళ్ళమ్మాయి గీతో ఏదో, ఆ అమ్మాయి ఎంట పడే డంత ..మా అబ్బాయి అట్టాంటి వోడు కాదు, ఆ అమ్మయే వెంట పడి ఉంటుంది, నేను మజ్జానం వొచ్చి కడుగుతా,అమ్మా ..ఏం అనకమ్మా,"
అంటూ వెళ్లి పోయింది.
సరే తప్పదు కదా, మిగిలిన పని అంత చేసుకున్నాను,
మజ్జాన్నం ..లేదు, సాయంత్రం లేదు..
మర్నాడే వచ్చింది. కోపం తో మొహం ఎర్రగా అయిపోతున్న, బయటకి ఒక్క మాట మాట్లాడ   లేదు.
మొహం లోనే కోపం అంతా చూపిస్తూ..
"హ్మం..ఇదేనా మజ్జాన్నం ?" అన్నాను.
"ఏం సెప్పమంటారు, ఇంటికి పరుగు పరుగు న పోయి, అప్పటి కప్పుడు ,మా యీది లో ఉన్న ఆడోల్లు ,మొగోళ్ళు ని బతిమాలి, బామాలి, కోన్సిలోర్ ఇంటికి పోయి, మా అబ్బాయి ని, విడిపించండి, అని కేకలు పెట్టి అరసినాం."
అమ్మో, అరిసార? అన్నాను..నేను అదే యాస లో మర్చిపోయి, గుండె మీద చేయి వేసుకుని.
మా మేనల్లుడు టీ వి. యాళ్ళకి డ్రైవరు ,ఓ ఫోన్ కొట్టేసరికి ,టీవీ 9 వాన్ ట, వచ్చి, మా గోల అంతా చూపించేసారు ట..ఇంకేముంది, కౌన్సిలర్ ,ఒచ్చి ,ప్రెమాన పూర్తిగా నాకేమి తెలీదు, అన్నాడు, ఈ లోగ వెనక ద్వారం గుండా 
సలీం ని యిడిపించారు ట  , వాడు, ముందు కు వచ్చి, అమ్మా..పదవే,చాలు, గొడవ చేసింది చాలు..అన్నాడు, "
అంతే.. అందరూ అరుచుకుంటూ ..క్షమాపణ అది ,ఇది అన్నారు..
మా బాబే, చాల్లే అమ్మా..పద..అంటూ అందరిని వెళ్ళండి ,అని తరిమేసాడు.
ఇంటికి వచ్చి, ఏమిట్రా ..అలా చేసేవు? టీ వి లో అంతా సుపిస్తారుట..అంటే..
ఇంకా ఒదేలేయ్ అమ్మా.. గీత మంచి పిల్ల, నేనంటే ఇష్టం అనుకుంటా, కరెంట్ పని మీద వెళితే తనే మాట్లాడింది. పోనీ ..అమ్మా ..అనేసాడు.
మా వీధి అంతా అదే మాట, కోనసేలోర్   మళ్లీ గెలవాల అంటే, మాతో పెట్టుకున్టాడా  ..మాది అంతా ఒకటే కట్టు కదా..మా ఓటు పడాల వద్దా?
" నీకెంత ధైర్యమే ?" అన్నాను..
హసీనా ముసి ముసి నవ్వుతో, మరి తప్పదు..అమ్మా..మా లాంటి వాళ్ళకి, ధైర్యం లేకపోతే బతగ్గలమా  ? ఇంత లోనే కళ్ళ ల్లో నీళ్ళు ..
"మా ఆయన కి ఆ తాగుడు జబ్బే లేక పోతే ,మేం శుభ్రం గా బతికే వాళ్ళం..కదా? ఈ ఆడ పిల్ల కి పెళ్లి చేయాల, ఇద్దరు కొడుకుల కి మంచి జీతం తెచ్చే పని కుదిర్చాల.".అంటూ..కళ్ళు తుడుచు కుంటూ పని లో పడింది.
నేను..నా నాలుగు గదుల ఇంట్లో   కూర్చుని, ఫోన్ ల మీద , ఫ్రెండ్స్ సలహాల మీద, సాయం మీద బతికేస్తాను..
ఎదురు పడి..జీవితం నిజం గా ఎదురు పడితే....ఏమవుతానో?
హసీనా వేపు ఆరాధన గా చూసిన నాకు, మళ్లీ ,మా ఇంట్లో పని మనిషి అని గుర్తు వచ్చి ,సర్దుకున్నాను..నేనెప్పుడూ ఇంతే.. వీర పలాయన వాదం
నేనింతే....నేనింతే, అని గొనుక్కున్నాను..నాలో నేను.. 





















   












   



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి