"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 సెప్టెం, 2011

జనావాసం లో ద్వీపాలు.

 వినూత్న అలసటతో నిట్టూర్చింది . ఒకటా రెండా ఆరేడు నెలల నుంచి ఈ ఫ్లాట్ ని అలంకరించడానికి ఎంత శ్రమ పడింది? పాలు ఒలికినట్టు కనిపించే తెల్లని పాలరాయి నేల , మచ్చ లేని తెల్లని పాల రాయి కోసం ఊరంతా తిరిగి, ఎక్కడా నచ్చక , చివరికి, రాజస్థాన్ నించి తెప్పించింది , స్వయంగా మాట్లాడి వారితో. అలాగే, వంటింట్లో నల్లని గ్రనైట్ వేయించింది. కిటికీలకి గాజు తలుపులు, అన్నీ సూపర్ క్వాలిటీ. లక్షలు, లక్షలు ఖర్చు అయాయి. కానీ  చివరకి ఇల్లంతా చూసుకుంటే ఎంత అందంగా ఉందొ? అని మురిసిపోయింది . 

కిచెన్లో లేటెస్ట్ అల్మారా లు, నాలుగు పొయ్యిల స్టవ్. పెద్ద  బీరువా అంత ఫ్రిజ్, అంతా  తను  అనుకున్నట్టే ..భాస్కర్ ,పిల్లలు సంతోషించేరు.  కానీ " ఇంత శ్రమ ఎందుకు ? ఇంత చక్కని ఇల్లు ఇలాగే మెరుస్తూ ఉంటుందా ఎల్లకాలం ?  దీనినిలాగే మెరిపిస్తూ ఉంచాలంటే , నువ్వు ఎంత కష్ట పడాలో? ఎందుకు నీ  శ్రమ ,కాలం ఇలా ఇంటి మీద పెడతావు? ఇంకేదైనా ఉపయోగపడే పని చేసుకో, నీకు ఇష్టమైన కథలు రాసుకో, పుస్తకాలు చదువుకోవచ్చు కదా  " అన్నాడు భాస్కర్.

" అన్నీ చేస్తాను, కాని ఇది నా కల, నా డ్రీమ్ ,భాస్కర్ నీకు తెలుసుగా "  అంటే ఏం చెప్పలేక పోయాడు.
వెతికి వెతికి మంచి బిల్డర్ని చూసుకుని ,   విడివిడిగా ఇళ్లు  ఉండే   గేటెడ్ ఆవరణలో ఇల్లు ఎంచుకున్నారు. చుట్టూ ప్రహరి గోడ, ఎవరి ఇల్లు వారిదే, ఫ్లాట్స్ లాగ కాదు, ఇంటి చుట్టూ తోట, సాయంత్రం నడవడానికి చక్కని పార్క్, మధ్యలో ఆకు పచ్చని లాన్స్    ఎంత బాగుందో?

నెల, నెల కట్ట వలసిన ఈ ఏం ఐ ,యాభై వేలు, అయితేనేం, మెల్లగా తీరుస్తాం. ఇంత మంచి డ్రీం హౌస్ ఫ్రీ గా రాదు కదా..వినూత్నకి సంతోషం కట్టలు తెగి పొంగింది ..గృహ ప్రవేశం నాడు, అందరు మెచ్చుకుని, ఎంత బాగుంది వినూత్న మీ ఇల్లు ..నీ పేరు లాగే, మీ ఇల్లు కూడా నూతనం గా ,వినుత్నం గా ఉంది, నీదే క్రెడిట్ అంతా..అంటుంటే ద్రిష్టి తగులు తుందేమో, అని నమ్మకాలు లేక పోయినా ,ఏదో భయంగా కూడా అనిపించింది.
మెల్లగా కొత్త ఇంట్లో కొత్త వాతావరణంలో అందరూ అలవాటు పడుతున్నారు.

ఉదయం నుంచి, ఇల్లంతా దులిపి, తుడిచి, వంట చేసి అలసి పోయింది. సాయంత్రం నాలుగు అయింది. ఇంకా బబ్లూ, పింకి రాలేదేమిటి స్కూల్ నుంచి అని కంగారుపడుతోంది వినూత్న .ఈ కొత్త ఇల్లు , స్కూల్ కి చాల దూరం అయిపోయింది, బస్సులో వెళుతున్నారు . మునుపయితే, దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు.

ఇంతలో గేట్ దగ్గర నుంచి ఫోన్. ఫోన్ తీసింది , బబ్లూ " అమ్మా! కొత్త వాచ్ మాన్ అమ్మా, నువ్వు ఫోన్లొ చెపితే కాని, మమ్మల్ని లోపలి రానివ్వడుట..అబ్బ ఏమిటమ్మా బోర్ పాత ఇల్లే బాగుండేది " అంటూ విసుక్కున్నాడు . వాడి ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు మరి. చిన్నపిల్లలు ఇంతలో సర్దు కుంటారు ,ఫర్వా లేదు అని సర్ది చెప్పుకుంటూ.. వాచ్ మాన్.. మా పిల్లలే..వదులు లోపలి ..అని గట్టిగ చెప్పింది. " సరే అమ్మా.. సారీ అమ్మా, మా జాగ్రత్త లో మేం ఉండాలి కదా" అన్నాడు .

కొత్త ఉత్సాహం తగ్గి , వారం అయేసరికి, పని మనిషి లేకపోతే కష్టం అనిపించింది, ఇంటెడు పని చేయడం. వాచ్ మాన్కి చెపితే లక్ష్మిని తీసుకువచ్చాడు. నెమ్మదిగా బాగానే ఉంది. హమ్మయ్య..

ఇదిగో మరి, ఈ పనులు అన్ని చేయాలి, గిన్నెలు తోమడం, ఇల్లు తడి గుడ్డ తో వత్తడం, దానికి ముందు ఇల్లు డస్టింగ్ చేయాలి, అంటే, ఈ సోఫాలు ,అలమారాలు, అన్ని పొడి గుడ్డ తో తుడవాలి, బట్టలు మషిన్  నించి తీసి అరేయాలి , మొక్కలుకి నీళ్ళు పోయాలి..జీతం..ఎనిమిది వందలు..కుదరదు అమ్మా..అమ్మో, వెయ్యే..సరే, మరి నాగాలు పెట్టకు..అని అపురూపమైన తన ఇంటిని ,ఈమె  చేతిలో పెడుతున్నాను. అని గిల గిల లాడిపోయింది వినూత్న . నాకైతే నా ఇల్లు అని నాకు ప్రాణం, ఈమె  ఒక ఇంటి పని కని పెట్టి ,దగ్గరుండి చేయుంచుకోవాలి.
అని మనసులో అనుకుంది.

లక్ష్మి పనిమంతురాలే, చక్కగా ఇబ్బంది పెట్టకుండా పని చేస్తోంది. ఫర్వాలేదు.
రోజూ సాయంత్రం, పిల్లలిని ఆడు కోమని పంపించి, తను కూడా వాకింగ్ చేస్తోంది. ఈ ఇళ్ళ చుట్టూ ,ఒక్కసారి నడిస్తే చాలు, అరమైలు నడిచినట్టు లెక్క అనుకుంటూ.

ఇళ్ళకి వెనక ఓ  గేట్ ఉంది, అది ఎప్పుడూ మూసే ఉంటుంది. ఎవరైనా అటు వేపు నుంచి వస్తే, ఒక గంట  ఉంటుంది, అది కొడితే వాచ్ మాన్ వచ్చి తలుపు తీస్తాడు. అటు నించి వెళితే ,చిన్న బజారు వస్తుంది, కూరలు అవి దొరుకు తాయి. అక్కడ, ఫ్రెష్ గా..వారానికి ఒక్కసారి వెళ్లి కొనుక్కుని వస్తూంతుంది 

ఈ రోజూ అటు వెళుతూంటే, ఓ నాలుగు పాకలు కనిపించాయి. అవి ఎంత దారుణం గా ఉన్నాయి అంటే, మధ్యలో ఒక మురుగు గుంట, చుట్టూ నాలుగు పోలితీన్ షీట్స్ కప్పిన అట్ట పెట్టె లాంటి గోడలు, సగం బట్టలు తో ,ముక్కు తుడుచు కుంటూ చంటి పిల్లలు..

అబ్బ,ఇదేంటి ,మా స్వర్గం లాంటి ఇళ్ళ పక్కన ఈ నరకం..చ..ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి తప్పవు కాబోలు, బాబోయ్ ,ఇలాగే వదిలేస్తే ,కాన్సెర్ లాగ పెరిగి, ఒక పెద్ద స్లమ్ తయారు అవుతుంది , ఊరుకుంటే లాభం లేదు అని కంగారు పడింది వినూత్న .

తరువాత నెల రోజులు వినూత్న చేయని ప్రయత్నం లేదు. రోటరీలో తెలిసిన పెద్దల ద్వారా, మున్సిపాలిటీకి అర్జీ పెట్టించి, ఈ స్లమ్స్ఇక్కడ నుంచి తీసేయాలి ,కావాలంటే వేరే చోట ,చిన్న ఇల్లు ఇవ్వండి..అంతే గాని, ఎన్నో లక్షలు వెచ్చించి కట్టుకున్న ఈ స్వర్గం లాంటి మా ఇళ్ళ ముందు ,ఇలా దిష్టి పిడతల్లగా ఈ పాకలు, ఇవి ముదిరి ,మా ఇళ్ళ విలువ పడిపోకముందే, తీయించండి అని గొడవ చేసి, మొత్తానికి అక్కడ నుంచి తీయించారు..మున్సిపాలిటీ.

అమ్మయ్య , ఒక మంచి పని చేసాను అని సంతృప్తి పడింది.

మర్నాడు ఉదయం పది అయింది ఇంకా రాలేదు లక్ష్మి. ఇదేమిటి? రోజూ ఎనిమిది కల్లా వచ్చేదే, పదకొండు అయింది ఇంకా రాలేదు , నాగాలు పెట్టడం మొదలు అయింది , లోకువ అయిపోయాను, ఈ లక్ష్మికి అని కంగారు పడుతూ ఇంటర్ కమ్ ఫోన్లో, లక్ష్మిని తీసుకువచ్చిన వాచ్మాన్ కి ఫోన్ చేసింది, వినూత్న .

ఏమైంది లక్ష్మి ఇంకా రాలేదు, ఈ వేళ?

అమ్మా ! వెనక గేట్ దగ్గర వాళ్ళు వేసుకున్న పాకలు, కూల్చేశారు కదా అమ్మా , పిల్లలతో ,ఊరు బయట ఎక్కడో ఇల్లు ఇస్తారంట, అక్కడ ఎలా ఉంటుంది? ఉన్న సామాన్లు పట్టుకుని, ఇంకో కాలని  వెతుక్కుంటూ వెళ్లి పోయిందండి అమ్మా ! వాళ్ళ ఊర్లో కూడా పొలం పనులు లేక ఇలా వచ్చిండమ్మా ,మా ఊరే , మొగుడు లేడు ,ఇంటి పనులు చేసుకుని ,ఇద్దరు పిల్లల్ని పోషిస్తోంది. ఇల్లు దూరం అయింది కదా అమ్మా ఇప్పుడు మరి వస్తుందో లేదో??

హుహ్ నిట్టూర్చింది వినూత్న  నా స్వర్గం లాంటి ఇల్లు తుడిచి, అద్దంలాగా మెరిపించే లక్ష్మి కి నరకం లాంటి ఇల్లు కూడా లేకుండా చేసేనా? భాస్కర్ ఏమంటాడో? ఏమిటి నేను ఇలా తయారు అయ్యాను, ఇంత స్వార్ధం గా..

నా ఇల్లు ఒక్కటే స్వర్గం , అదే మా కాలోనీ పేరు , అయితే చాలా??

నా చుట్టూ ఉన్న నరకం నుంచి ఎంత దూరం పారి పోగలను..

హుహ్,ఇంకో పని మనిషి దొరికే వరకు, నేనే చీపురు పట్టుకోవాలి , తప్పదు, పద పద వినుత్నా , 
అబ్బ ఈ దేశం ఎప్పుడు బాగు పడుతుందో? ఏమో? అంటూ నిట్టూర్చింది , వినూత్న.


18 సెప్టెం, 2011

ఐదో నెంబర్ ఫ్లాట్

సునీత ఆటో దిగి  ఆటో వాడికి డబ్బులిచ్చి, సంచులు మోసుకుంటూ పైకి వెళుతోంది. రెండో అంతస్తు లో ఉంది ఆమె ఫ్లాట్. సంచులు ఒకటో అంతస్తుకి చేరేసరికే బరువు అయిపోయాయి. కూరలు, కరాచివాలాలో పిల్లలికి కావాల్సిన తినుబండారాలు, ఇంకా ఏవో డబ్బాలు, పాకెట్స్, ఒక నెల రోజులకి సరిపడా..కాని ఏదో ఒకటి మర్చిపోవడం, మళ్లీ, మళ్లీ, వెళ్ళడం ఆమెకు  అలవాటే.

అమ్మాయ్ ..షాపింగ్ చేసి వస్తున్నావా? పిల్లలికేనా?? ఇంకా ఏం కొన్నావు? బాబోయ్ ..ఈవిడని తప్పించుకోవడం చాల కష్టం  ఎప్పుడు కనిపించినా ఇలాగే అడుగుతుంది. పల్లెటూరు బుద్ధులు.."ఆ..ఎప్పుడూ ఉండేవే ..కొత్తగా ఏం లేవండి. " ,ఆవిడ రా అమ్మా అని పిలుస్తుంది.

కాని, సునీత  ఎప్పటికప్పుడు ఆవిడకీ  నాకూ కామన్గా కబుర్లు ఏముంటాయి..తరువాత వస్తాను అండీ అని  తప్పించుకుంటుంది.మనసులో అయ్యో పాపం అనిపించినా.. వయసులో వ్యత్యాసం, ఏదో పల్లెటూరు చాదస్తం అని కొంత విసుగు . 

చేతిలో సంచులు బరువు అనిపించినా ఎక్కడా ఆగకుండా తన  ఫ్లాట్ లోకి వెళ్లి, అమ్మయ్య అని నిట్టూర్చి ,కూరలు తీసి ప్లాస్టిక్ సంచుల్లో సర్ది, సరుకులు అల్మారాలలో సర్ది, ఊపిరి పీల్చుకుంది సునీత . కాఫీ తాగుతూ, ఇంక పిల్లలు వచ్చేవరకు విశ్రాంతి , అని టీ వి ఆన్ చేసి వార్తలు వింటూ కూర్చుంది . 

ఇంతలో, కింద నించి, ఏవో ఏడుపులు వినిపించాయి, ఎవరైనా పిల్లలు దెబ్బలు తగిలించు కున్నారా? ఎవరి పిల్లలో అని ఆందోళనతో కిందికి దిగుతూండగా ఏడుపులు ఐదో నెంబర్ నుంచే బంగారమ్మ గారి ఫ్లాట్ నుంచి అని తెలిసింది . 

ఆయన,అంటే బంగారమ్మ గారి భర్త రాజు గారు, బంధువులతో కలిసి ఉత్తరదేశ యాత్ర  వెళ్లి పది రోజులు అవుతోంది.  " నా మందులు, గొడవలతో నేను రాలేను "  అని ఈవిడ ఇంట్లో ఉండిపోయారు అని  వాచ్ మాన్ చెప్పిన మాట గుర్తు వచ్చింది సునీత 
కి .  అప్పటికే  నలుగురైదుగురు చేరారు. సునీతకేమీ  అర్ధం  కాలేదు , ఎదురింటి పంకజం చెప్పింది, రాజు గారు, ఉత్తర కాశిలో గుండె పోటుతో మరణించారని. అయ్యో ! 

ఒక గంటలో కావాల్సిన వారందరూ వచ్చేసారు., " నాకు చివరి చూపు ప్రాప్తం లేదు "  అంటూ, అక్కడే అన్ని చేసేయమని బంగారమ్మగారు చెప్పడంతో అన్ని కార్యక్రమాలు అక్కడే చేసి వచ్చారు బంధువులు పదో రోజుకి.
ఈ పది రోజులు వచ్చేపోయేవారి హడావిడితో  ఐదో నంబర్ ఫ్లాట్ సందడిగా ఉండడం   పద మూడో రోజుకి అందరు వెళ్లి పోవడం గమనించిన సునీత  ఈవిడకిక ఒంటరితనమే అనుకుని బాధపడింది . 

బంగారమ్మగారు మటుకు తన ఇంట్లో నుంచి తను ఎక్కడికి కదలనని చేప్పేసారుట పిల్లలతో.
కొడుకులు, కూతుళ్ళు, ఎంత బ్రతిమాలినా ఆవిడ పంతం పట్టినట్టు ఒక్కటే మాట, "నేను నా ఇంట్లో ఉంటాను, రాజు గారి పెన్షను  వస్తుంది.నేను ఎవరి మీద ఆధార పడను " అని. ఈ వివరాలన్నీ  వాచ్ మానో ఎవరో ఒకరు  సునీత చెవిన వేస్తూ ఉండేవారు . 

నెల రోజులు ఇట్టె గడిచిపోయాయి , సునీత సంచులు మోసుకుని వస్తూ, ఐదో నెంబర్ ఫ్లాట్ బెల్ కొట్టింది , తనంతట తనే ఆశ్చర్యంగా .. 

తలుపులు తీసారు బంగారమ్మ .టీ. వి. పెట్టుకుని తెలుగు సినిమా చూస్తున్నారు. అంతకు  ముందు ఎప్పుడూ ఇంగ్లీష్ వార్తలు వినిపించేవి వాళ్ళింట్లో.

" ఎలా ఉన్నారండి? ఏమైనా కావాలి అంటే  చెప్పెండి, "  " ఎలాగు  వెళుతూ ఉంటాను కదా  " అంటూ సునీత మొదటిసారి మాటలు కలిపింది ,ఆత్మీయంగా . 

" మీకు ఒక్కరూ బోర్ కొట్టటం లేదా? ఎలా ఉన్నారు?  అంకుల్  లేకుండా "  ??అంటూ ఆగి పోయింది ,సందిగ్ధంగా . 

 " ఫర్వాలేదమ్మా నిజం చెప్పాలంటే, ఆయన ఏదో ఊరు వెళ్లినట్టుంది కానీ, ఆయన లేరు అని పించటం లేదు  నాకు . నాకు పద్నాలుగేళ్లకే పెళ్లి అయింది. ఆయనికి ఇరవై అయిదు..నాకేమో చిన్న పిల్ల సరదాలు, ఆయనకేమో ఉద్యోగం వ్యాపకాలు తప్ప ఏమి పట్టదు.
నాకు తెలుగు సినిమాలు, పాటలు ఎంత ఇష్టమో? ఆయనికి చికాకు, ఏముంది ఆ పాటలలో ..ఆ సినిమాలన్ని ఒక్కలాగే ఉంటాయి, హాయిగా ఇంగ్లీష్ సినిమాలు చూడు అనే వారు. కేబల్  కనక్షన్  కూడా లేదు, ఈయన ఉద్యోగ విరమణ తరువాత ఇంట్లోనే ఉండి నన్ను కాల్చుకు తిన్నారనుకో , "  అంటూ పైట కొంగుతో కళ్ళు ఒత్తుకున్నారామె . 
"ఆయనికిష్టమైన కూరలే వండాలి, పక్కింటికి వెళ్లి కబుర్లు చెప్పకూడదు, ఫోన్ బిల్ మూడు వందలు దాటకూడదు, ఇలాగ ఈయన పని చేసే కాలేజ్ లో కుర్రాళ్ళుని అదుపులోపెట్టినట్టే  నన్ను కూడా, అడక్కు అమ్మా ,నాకెంతో ఇష్టమైన కూరలు వండుకుని తిని ఎంతకాలం అయిందో? నాకు నిన్ను చూస్తే ముచ్చట గా ఉండేది , నీ కిష్టమైనవన్ని నువ్వలా కొనుక్కుని రావడం చూస్తూ ఉంటే " సునీత చున్నితో కంట తడి అద్దుకుంది. 

" ఇప్పుడు నాకు డబ్బులకు లోటు లేదు, కొడుకు దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వండి పెట్టింది నేను తినాలి, వాళ్ళ టైములు అవీ నాకు సరిపడవు. నాకు ఇప్పుడు ఏ లోటూ లేదు.
యాభై ఏళ్ళ తరువాత నా బ్రతుకు నేను బ్రతకడానికి నాకు స్వేచ్చ  వచ్చింది. ఇది వదులు కోలేను. పెద్ద పెద్ద మాటలు నాకు రావు గాని, నాకు స్వతంత్రం వచ్చింది. నా బతుకు నేను నా ఇష్టం తో హాయిగా బతుకు తాను." 
కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ లేచింది సునీత . 

ఆవిడ పల్లెటూరని ఏదో చిన్న చూపు కాని ఎంత పెద్ద మనసో !  ఎంత చక్కని మాట చెప్పారో.. ఒకరిని ఒకరు నొప్పించ కుండా, ఒప్పించు కుంటూ, పరస్పరం ప్రేమతో మెలగాలి , కాని అధికారంతో కాదు అని.
సంచులు మోసుకుంటూ, సునీత ఐదో నెంబర్ ఫ్లాట్ దగ్గర ఆగి పలకరిస్తుంది ,ఇప్పుడు . 




కార్పోరేట్ విష సంస్కృతి..

 ఇవాళే కూడలి లో ఈ విషయం విన్నాను. చిన్నారి గీత ప్రియ. ,ఎడబాటు తట్టుకోలేక, పాప తల్లి తండ్రులు, ఆదిలక్ష్మి-లెనిన్ గార్లు ఆత్మ హత్య ప్రయత్నం చేసారు అని,ఇది ,నిజం గా గుండెలు పిండేసే సత్యం.
లెనిన్ గారు పోయారని, ఆది లక్ష్మి గారు కోలుకుంటున్నారు అని.

ఒక స్కూల్ కూడా నడిపే వీరు,ఈ కార్పోరేట్ కాలేజ్ లో ఎందుకు జాయిన్ చేసారు మీ పాపని.? ఈ కాలేజ్ లు వల్ల జరిగే నష్టాలు ,మనం చూస్తూనే ఉన్నాం. వారికి చదువు కన్నా ముందు ఒక పోటి తత్త్వం మప్పుతారు. మొదటి నెల లోనే, పరీక్సలు పెట్టి, వందకి వంద మార్కులు వచ్చిన వారి నందరిని, ఒక సేక్షున్ లో వేస్తారు.ఇంక వారికే బాగా చెప్పే మాస్టర్లు,మిగిలిన వారిని పరీక్షలు పెట్టి, మార్కులు చూపించి, మీరు ఎందుకు పనికి రారు అని వారిలో ఆత్మ న్యూనత పెరిగేలా,ఆత్మ విశ్వాసం కోల్పోయేలా ,పదే పదే ,ఒకే విషయాన్ని చెపుతూ, ఎవరేజ్ గా చదివే పిల్లలిని బాగా చదివిస్తారనే కదా ,ఈ కాలేజ్ లలో ,వేలకి వేలు ఫీజు కట్టి జాయిన్ చేస్తారు.

వీల్లందిరిని విడిగా ఒక సేక్షున్ లో పడేసి, చదువు చెప్పడం మానేసి, పరీక్షలు తో చంపుతారు. అని తెలుసు,కాని, ఇలా నిజం  గా చంపేస్తారా ? నాకు కళ్ళ లలో నుంచి నీళ్ళు కారి పోతున్నాయి.
విద్య ని అందించ వలసిన ప్రభుత్వాలు ఇలా ,చదువు కొట్లు, అంగడి లు, ఖరీదు కు కొనే చదువు కొట్టాలు పెట్టడానికి అనుమతులు ఎందుకు ఇస్తారు? విద్య ప్రాధమిక హక్కు, అనేది కేవలం కాగితం మీద రాత లేన?

మధ్య తరగతి పిల్లలికి, చదువే ఆధారం..ఒక ఆధారం ఇచ్చే చదువు, ఒక ఇంజినీరింగ్ చదువే అన్నం పెడుతుందని, లక్షల్లో జీతాలు వస్తాయి అని, విదేశాల్లో ఉన్నత విద్య చదివి, ఇంకా బాగా పైకి రాగలం అని నమ్మి, ఎన్నో ఆశలతో ,ఈ కార్పోరేట్ కాలేజ్ లో జాయిన్ అవుతారు.

వారిని అనలేం,పిల్లలు బాగా  పైకి రావాలని ,వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు.
ఈ కార్పోరేట్ దగా నించి విముక్తి లేదా? ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లు ఎందుకు సరి పదా లేవు? ఎందుకు ,మంచి మాస్టర్లు ని వేసు కోరు? విద్య లోనే ఇంత అవినీతి.

చీడ పట్టేసింది, ఈ విద్య వృక్షం కి, ఈ విష ఫలాలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం,

బలవంత మరణాలు, తల్లి తండ్రులకి పుత్ర శోకం మిగల్చడం, లేదా,  బుర్రలు వేడి ఎక్కే బలవంతపు చదువు ల నుండి విరామం కోసం, బైకుల మీద ,అతి వేగం తో నడిపి, ప్రాణాలు కోల్పోడం, లేదా కాళ్లు చేతులు విరగూట్టుకోవడం, లేదా పనికి మాలిన నెట్ విషాని ,తలకి ఎక్కించుకుని, అమ్మాయిలను ఏడిపించడం లాంటి రాక్షస ప్రవ్రుత్తి తో, ఒక పనికి మాలిన జాతి ని తయారు చేసే వికృత కోర్ప్రేట్ సంస్థలు కి ఎవరు చరమ గీతం..పాడుతారో?

ఎవరి బాధ్యతో?? ప్రభుత్వం.. ఒక నిద్ర పోతున్న ఎద్దు..దానిని ఎవరు అంకుశం తో పోడుస్తారో?

ఎవరికీ వారు, ఇలా చేతులు ముడుచు కుని, దేవుడా? అని ఇలా ప్రాణాలు పోతున్న గీత ప్రియ లను, వారి అమ్మ నాన్న లని చూస్తూ , చేతులు ముడుచుకుని, కళ్ళు మూసుకుని, మనం ఇలా సిగ్గు లేకుండా గడపాల్సిందే..

యథా రాజా తదా ప్రజా..

లెనిన్, గీత ప్రియ ఆత్మ లకి శాంతి కలగాలని,

చదువు  ఒక నరకం కాదు, అని వెలుగు నిచ్చే చదువు ఒకటి ఉన్నదని ,ఆ లోకం లోనైనా తెలుస్తుందని, భార మైన మనసు తో, ఈ టపా ఆమె కి అంకితం.

15 సెప్టెం, 2011

ఇది కూడా ఒక ....దీనికి పేరు ఉంది ట.

నేను ఎప్పుడో ఒక్కసారి చూస్తే చాలు గుర్తు పెట్టుకుని, మళ్లీ ఆ ఇంటికి, రెండో సారి ,చక చక బండి నడుపుకుంటూ వెళ్లి పోగలను, నేనే నడపాలి స్కూటర్ అయిన కార్ అయినా.అంటే ఏవో కొండ గుర్తులు పెట్టుకుంటాను, ఇదిగో ఇక్కడ ఓ కొట్టుంది,ఇక్కడ ఓ ఇస్త్రి బండి ఉంది, ఈ మూల ఈ గుడి ఉంది..ఇలా అన్న మాట. అదిగో పక్క నుంచి ఏవో అభ్యంతర కేకలు వినబడుతున్నాయి. మొన్న యేర్పాల్ లో మా మావయ్య కొడుకు ఇంటికి ఇలాగే అన్నావు, అర గంట తిరిగాం అక్కడికి అక్కడే, సరే నేనేం చెయ్యను, అది ఒక కొత్తగా వస్తున్నా కాలనీ, అన్ని కొండ గుర్తులు మారి పోయాయి మరి.

అదే ఎవరో నడుపుతూంటే పక్కన కూర్చుని, గుర్తులు చెప్పమంటే, అంటే..నా పక్కన కూర్చునేది తరచుగా ఒక్కరే, పద, పద, ఇదే రోడ్ ,చక్కగా వచ్చాం ఇక్కడి వరకు,ఇంక ఒక సందు లోకి తిరగాలి, ఇటు తిరుగు, ఇటు, ఇటు, అంటూ ఉండగానే,అటు తిప్పేసాడు...అయ్యో అయ్యయ్యో, ఇటు కాదు అటు, అన్నానా?అని కెవ్వు కెవ్వు అని కేకలు.
నేను రోడ్ చూస్తూ నడుపుతున్ననా కార్, నువ్వు ఇటు అంటే నాకేం తెలుస్తుంది,లెఫ్ట్, రైట్ ,చెప్పవచ్చు కదా..అదిగో మరి అక్కడే వస్తుంది తంటా..నాకు లెఫ్ట్ అంటే వాచ్ పెట్టుకునే చెయ్యి,ఇంకోటి కుడి.అది కూడా పూర్తిగా నా కళ్ళ ముందు పెట్టుకుని చెయ్యి,వాచ్ చూసుకుని, లెఫ్ట్ అని ధ్రువీకరించుకుని ..హు ..అప్పుడే చెప్పగలను లెఫ్ట్ ..లెఫ్ట్ అని,ఇదంతా కనీసం క్షణం లో వెయ్యో వంతులో జరగ దానికి నేనేమి ,యండమూరి నవల లో హీరో ని కాదు కదా..అందుకే నేను, ఒక సంకేత భాష కని పెట్టేసా...నాకు దగ్గరగా ,నా వేపు ఉండే మలుపు, "ఇటు" ,మరో వేపు ఉన్న మలుపే, "అటు."..

ఇంత చిన్న విషయం అర్ధం చేసుకోరూ, ఈ మగవాళ్ళు. అన్నిటికి ఒకటే నస..

కాని, నేను ఎప్పుడు మర్చి పోను.,ఒకసారి చూసిన ఇల్లు...మరి..సరిగ్గా ఫాలో అవాలి ,నా సంకేతాల భాష,
ఇంక హైదరాబాద్ లో, మనకి కావాల్సిన వారు ,ఒకరు, విజయవాడ కి కూసింత దూరం లో ఉంటే, ఇంకొకరు, బెంగుళూరు కో,ముంబై కో వెల్ల వలసిన దారి లో ఎక్కడో ఉంటారు. సరే ,మరి ఉన్న నాలుగు రోజుల్లో అందరిని చూసి, పలకరించి రావాలి కదా, ఈ కాల్ టాక్సీ లు వచ్చాక ,భలే సులువు అయింది.
సరే,  అంబర్ పేట్ నుంచి అత్తా పూర్ వెళ్ళాలి. టాక్సీ కి ఫోన్ చేస్తాను.
అంబర్పేట్ నుంచి ..భయ్యా..ఇదొకటి నేర్చుకున్నాను...సరే, ఎక్కడ, అదే, పెట్రోల్ బంక్ పక్కనే, అపార్ట్ మెంట్స్..సరే, లేఫ్ట?  రైట్ ఆ ..ఏమిటి లెఫ్ట్? అదే రోడ్ కి,

ఊ, శ్రీ రమణ దగ్గర తిరిగేయాలి..నేను..అదే లెఫ్ట్ ఆ? రైట్ కా?

హు..హు..పెట్రోల్ బంక్ అని చెప్పాను కదా..

నువ్వు ఎటు నించి వస్తావు భయ్యా??

ఎలాగో ఒకలాగా టాపిక్ మార్చేయాలి, పోలిస్ లైన్స్ ఉన్నాయా? అక్కడే

అదే. లెఫ్ట్ ఆ.. రైట్ కా??

అబ్బ..బ్రహ్మానందం కామెడి లాగుందే..అన్నిటికి ఒక్కటే ప్రశ్నే అడుగుతాడేమిటి??ఈ భయ్యా..ఇలా లాభం లేదని, తమిళనాడు లో మనం ఎలా చదువు రాని వాళ్ళ లాగ, పక్కనే ఉన్న తంబి ని ఈ బస్సు ఎక్కడికి వెళుతుంది?అని అడుగుతామో ----అన్ని తమిళం లో రాసి ఉంటాయి మరి----పక్కనే ఉన్న వారికి ఫోన్ ఇచ్చేసి,నువ్వే చెప్పు అని, భయ్యా కి ఇంకా నా అటు-ఇటు సంకేతాల భాష రాదు కదా.

ఇంక అత్తాపూర్ వెళ్ళాలి, ఎలా రావాలే అంటే, 143 పిల్లర్ దగ్గర తిరిగి,అక్కడినుంచి, లోపలి వచ్చి,రైట్ కి తిరగాలి,అలా కాదే,అక్కడ ఉన్న షాప్స్ చెప్పు, కొండ గుర్తులు చెప్పు, ఊ ,అయితే, నారాయణ కాలేజ్ దగ్గర ప్లేసేంట్ పార్క్ బోర్డ్ ఉంటుంది, లోపలి వస్తే, ఒక పార్క్ ఉంటుంది, ఇలా చెపితే ఏముంది, నేల మీద కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు ,మీ ఇంటికి ఓ గంటలో వచ్చేస్తాను.

సరే, నిశ్చింతగా కూర్చున్నాను టాక్సీ లో, అదిగో లోపలి వచ్చేసాం, భయ్యా..ఎటు వెళ్ళాలి మాడం?  అటు కాదు ఇటు,అని నాలుక కరచుకుని, లెఫ్ట్ ,రైట్ చెప్పాల్సిందే అనుకుంటూ, చెయ్యి చూసుకున్నాను...రెండు చేతులకి గాజులు. ఎంతో ఇష్ట పడి కొనుక్కున్నాను కదా అని రెండు చేతులకి తలో అర డజాను మాచింగ్ గాజులు ఎక్కించాను..ఇంక చెప్పాల్సింది, ఏముంది, అన్నం తినే  ఏక్షన్ రిప్లే చేసుకుని, చేతికి .అది రైట్ ,మరోటి .లెఫ్ట్..అని ధ్రువీకరించి, లెఫ్ట్ తిరుగు అని చెప్ప దానికి, సెకన్లలో, వెయ్యో వంతు కాదు, వెయ్యి సెకన్లు అయినట్టుంది.సరిగ్గా గంటన్నర కి చేరాం.. మరి.

ఇంకొకటి గమనించాను,నేను, ఈ ఆటో భయ్యాలు, ఎటు పక్క ,తిరుగుతారో, ఆ  దేముడు కే తెలియాలి,సడన్ గా "అటు" తిప్పేస్తారు..సీదా గా వెలుతున్నవాళ్ళు. ఏమిటి? సిగ్నల్ చూపించవా? అని వెనక నుంచి ఎవరో అరుస్తాడు.ఆటో భయ్యా ఒక చిన్న చిటికెన వేలు, బయట పెట్టాడు. అంటే ....అటు తిరుగు తున్నానే కదా అర్ధం. వీళ్ళ సంకేతాల భాష ఇది అన్న మాట.

ఇంతకీ..ఇదంతా ,నా ఒక్కర్దానికేనేమో అనుకునే దాన్ని.

ఈ మధ్య హిందూ పేపర్ లో చదివాను. ఈ  అవస్థ కు directionally challenged అని ఒక పేరు కూడా ఉందిట.

అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాల మంది ఉన్నారన్నమాట.

పోనీలే చిన్న గా తీరిపోయింది, అసలు పెద్ద మెదడు షేమమే లెండి.

నా లాంటి వారు ,ఇంకా ఎవరైనా ఉంటే, వారందిరికి అంకితం..అటు-ఇటు అనే భాష తెల్సిన వాళ్ళందరం ఏకం అవుదాం..ఇటు రండి..ఇటు..ఇటు..అటు కాదు.




14 సెప్టెం, 2011

రిమోట్ మీ చేతిలోకి తీసుకోండి...

అన్నాచెల్లెళ్ళు,పెళ్లి పందిరి, కన్య దానం, చంద్ర ముఖి, ఈ పేరులు వింటే మనకి ఏవో పాత సినిమా పేర్లు గుర్తు వస్తాయి. ఈ పేరుల మీద ఇప్పుడు వస్తున్న టీ వి సీరియల్ సు చూస్తే..మనం ఎక్కడికి వెళుతున్నాం? ముందుకా? ఇంకో యుగం వెనక్కా అని అనుమానం వస్తుంది.
చిన్న పిల్లలికి పెళ్లి చేయడం, ఆ సమస్యలు, ఇప్పుడు    అవి అవసరమా? మనకి. ఎప్పుడో వందేళ్ళ క్రితమే, వీరేశలింగం గారి  దయ వల్ల, ఆడపిల్లలు కి ఇప్పుడు, కనీసం ఇరవై ఏళ్ళ వరకు చదువులు చెప్పిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ,వెనక్కి వెళ్లి  చిన్నారి పెళ్లి కూతురు అని, కడవల కొద్ది, ఏడుపులు కన్నీళ్లు, ఇవి సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని ఆలోచించరా? ఎప్పుడో, నాలుగు వందల ఎపిసోడెస్ తరువాత ,ఎవరో మారుతారు, ఈ లోపల ,జరగవలసిన హాని జరగదా??

ఈ సీరియల్స్ లో విలన్లు అన్నిట్లో ఆడవారే..ఇంతింత బొట్టులు పెట్టుకుని, చూడ డానికే,భయంకరం గా ఉంటారు. స్త్రీలని కించ పరిచేలా ఉన్నాయి. ఈ పాత్రలు. వారికి ఇంకేమి పని లేనట్లు, ఎప్పుడూ ఏవో కుట్రలు ,కుతంత్రాలు రచిస్తూ ఉంటారు. నిజ జీవితం లో,ఎవరైనా మనకి ఇలా కనిపించారా? ఎక్కడైనా?
ప్రతి మనిషి లోనూ, మంచి- చెడు, పడుగు పేకల్లగా కలిపి ఉంటాయి. అందరి లో నూ ఏవో బలహీనతలు ఉంటాయి.ఈ రోజుల్లో స్త్రీలు, ఇంట, బయట,భర్త కి చేదోడు వాదోడుగా ,సహకరిస్తూ, పిల్లల చదువులు, వారి పెంపకం, అప్పుడప్పుడు వచ్చే చుట్టాలు, స్నేహితులు, చేతికి వచ్చే జీతాలకి, నెలకి అయ్యే ఖర్చులు కి సమన్వయము చేస్తూ, అనారోగ్య సమస్యలు వస్తే, వాటికి సమయం వెచ్చిస్తూ, కుటుంబం లో ఎవరికీ బాగో లేక పోయినా, తల్ల డిల్లి పోయి, డాక్టర్ ల చుట్టూ తిరుగుతూ, సవ్య సాచి లాగ, కుటుంబానికి ఒక ముఖ్య కేంద్రం గా, అంతా తానై, నడిపిస్తున్నారు.

అలాంటి స్త్రీలని కించ పరిచేలా ,ఉంటునాయి ..ఈ పాత్రలు. ఎంత సేపు, ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళను ,కుట్రలు  కుతంత్రాలు తో ,రాచి రంపాన పెట్టడం, ఇంట్లో నే ఇన్నేసి నగలు దింపేసుకుని, ఫుల్ మేకప్ తో, పట్టు చీరలు తో, రాత్రి కూడా అదే వేషం, ఒక అర్ధం, ఒక పరమార్ధం లేని ఈ సీరియల్స్ ని ఎలా ,ఎందుకు చూస్తున్నారో, నాకైతే అర్ధం కావటం లేదు.

చిన్నప్పుడు, అదే, కాలేజే లో అందరికి స్నేహాలు ఉంటాయి. ప్రేమలు, పెళ్లి వరకు అనుకోవడాలు ఉంటాయి.కాని, అనుకున్నవన్నీ జరగవు కదా, ఏ పదేళ్ళ తరువాతో కలుసుకుంటారు, ఇదిగో మా ఆయన, నా పిల్లలు, మీ ఆవిడా ఏది? అని పరిచయాలు చేసుకుంటారు. సరదా గా కాసేపు మాట్లాడుకుంటారు. ఇవన్ని ఎ ఎక్ష్హిబిశున్ లోనో జరుగుతాయి..మర్నాడే పిల్లాడి పరీక్ష సంగతి గుర్తు వస్తుంది..తరువాత కలుసుకుందాం, అని ఫోన్ నమ్బెర్లు పుచ్చుకుని, ఎవరి దారిన వారు చక్కా పోతారు.

ఇదే టీ వి సీరియల్ లో అయితే లాగి, లాగి, చాంతాడంత, ఏళ్ళు, ఏళ్ళు, నడిపిస్తారు, ఇంకా వివాహేతర సంబంధాలు, కుట్రలు, హత్యలు వరకు వెళ్ళిపోతుంది...నిజ జీవితం లో ఎప్పటికి ఇలా జరగవు అని నా నమ్మకం.

సమాజం లో చాల మంచే ఉంది. కొద్దిగా చెడు కూడా ఉంటుంది, కాని, దానినే పట్టుకుని, పెద్దది, చేసి, చూపిస్తోంటే, ఇదే నిజామా? మన లాగ మంచి వారికి చోటే లేదా ? అని అనుమానం తో అసహనం పెరిగి  పోతుంది.

ఉడాన్,హమ్ లాగ్, బునియాద్, అమ్ముమ్మ  . కం లాంటి మంచి సీరియల్స్ చూసి ఎంత హాయిగా ఆనందించాం,ఒకప్పుడు. ఎన్ని కథలు లేవు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కథలు ఒక స్క్రీన్ ప్లే అవసరం లేని దృశ్య కావ్యాలు.అమరావతి కథలు, టీ వి లో వచ్చాయి.,మళ్లీ ,మళ్లీ చూడాలని పిస్తుంది.

చలం , కొడవటిగంటి, బినా దేవి, మాలతీ చందూర్ లాంటి, మహా మహులు ఎందఱో రాసిన కథలు, నవలలు ఉన్నాయి. జనం చూస్తున్నారు, అంటే, ఎప్పుడు, చెడే ఆకర్షనీయం గా ఉంటుంది.
మన ప్రభుత్వమే, సారా తాగండి అంటూ సబ్సిడీలు ఇచ్చి  మరి తాగిస్తున్నారు.మరి ఇంక మీడియా ,ఒక వ్యాపార సంస్థ అయిపొయింది.ప్రజల, మంచి, క్షేమం, వాటికి అక్కర లేదు.

పోటీ తత్త్వం పెరిగి, ఒకరిని మించి మరి ఒకరు, కనీ విని ఎరుగని కథలని కల్పించి, వీక్షకుల తెలివి ని అపహాస్యం చేస్తున్నారు.ఇంక ..
ఈ రియాలిటీ షో ల గురించి ఎంత తక్కువ చెపితే అంతా మేలు.

సభ్య సమాజం ని ,తల కిందలు చేసి, పిల్లలని, టీ వి తెర పైకి లాగి, ఒక హద్దు- పద్దు లేని దృశ్య సమాహారాన్ని, మన కళ్ళ ముందే ఆవిష్కరిస్తూ ఉంటె,మనం శాబాష్ అని చప్పట్లు కొడుతున్నాం.ఇంత కంటే ఎం రాసినా , నేను నా పరిమితులు దాటినట్టు అవుతుంది.

ఇంక అర్ధ రాత్రి వచ్చే మాంత్రికుల, నాగ దేవత మహిమలు అంటూ వచ్చే ఈ సీరియల్స్ ప్రజల లో ఎన్ని మూఢ నమ్మకాలు ,పెంచి పోషిస్తున్నాయో, ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇప్పటికి, పల్లెటూర్ల లో, సరి అయిన ఆరోగ్య వసతులు లేక ,అనారోగ్యం చేస్తే, పూజలు, పూనకాలు, మందు పెట్టడాలు అంటూ, చిల్లర మోస గాళ్ళకి బలి అవుతున్నారు. ఈ మధ్యే ,అనుమానం తో కొట్టి చంపేసిన వార్తలు వింటున్నాం.
ఇవే వార్తలని మళ్లీ, అర్ధ రాత్రి, నేరాలు, ఘోరాలు అని చూపిస్తారు. మూఢ నమ్మకాలు,ఒక చెడు గాలి లాగా వ్యాపిస్తున్నాయి. టీ వి. ఒక పవర్ ఫుల్ మీడియా.

చూస్తున్నారు కాబట్టి, చూపిస్తున్నాం, అంటూ, నెపాలు వెతుక్కోవడం కాదు.
స్త్రీలు..మీరు .ఈ సీరియల్ కి బానిసలు కాకండి.మాకు ఇలాంటి విష సంస్కృతీ వద్దు అని చెప్పండి.

అందం,హుందాతనం,దయ,నేర్పరితనం,చదువు-సంస్కారం,స్నేహం, ప్రేమ , అన్నిటి చక్కని మిశ్రమం ..స్త్రీ.
కుళ్ళు,కుట్ర,కుతంత్రం,ఈర్ష్య, ద్వేషం, కఠినం, కుసంస్కారం...ఇవి మేం కాదు..అని
నిరూపించేలా మంచి కథ ,మంచి విలువలు ఉన్న సీరియల్స్ నే తీయమని చెప్పండి.
ఇంక ఏ వి చూపించినా, రిమోట్ మీ చేతిలోకి తీసుకోండి...

సమస్త ప్రపంచం కి చిన్న బిందువు అయిన మీ కుటుంబం కి కేంద్రం మీరే. మీ చేతిలోనే రిమోట్ ఉందని ఇంక నిరూపించండి మరి.

కొస మెరుపు.
యాద్రుచికం గా ఇప్పుడే,కూడలి లో ఒక పోస్ట్ చదివాను.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో పాత్రలు  ,పరిచయం చేస్తూ, ఆమె రాసిన దానిని బట్టి, పేరు లో ఉన్న ట్టు మరి అంత మూర్ఖం గా లేదని ,బాగుందని ,రాసారు.

అది ఒక్కటి ,మినహాయింపు. చాల సీరియల్స్ చాల దారుణం గా ఉంటున్నయనే నా నమ్మకం.

13 సెప్టెం, 2011

పొగ

తూరుపు ఇంకా తెల్లవారలేదు, తొలి సూర్య కిరణం ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నది,   ఈ ఊరు ,ఈ భూమి  తాక డానికి, ఊరు అంత గాఢ నిదుర లో ఉన్న వేళ, నరసయ్య , అతని భార్య రమణమ్మ లేచి, ఉదయం టిఫిన్ కి తయారీ మొదలు పెట్టేరు. రమణమ్మ రోటి లో పిండి రుబ్బుతూ , వాణీ,వాణీ, లే అమ్మా తెల్లవారు తోంది, ఆరింటి నుండి, వచ్చి పడి పోతారు. జనం,ఊపిరి సలపదు.లేచి,కాస్తంత మొహం కడుక్కుని,చే సాయం కి రా అమ్మా ..అంటూ సన్నగా ,సన సన్నగా నొక్కుతోంది, చిన్న పిల్ల, బడి కి పోవల్సిన పిల్ల ,ఇంకా పరికిణీల్లో తిరుగుతూ, కిల కిల మని ఆడుతూ, పాడుతూ తిరగ వలసిన పిల్ల..అంతా ఖర్మ కాక పోతే ఇలా అయ్యేదే ?

తమకంటూ ఒక చిన్న ఇల్లు, ఓ ఎకరం మడి చెక్క పెద్దలు ఇచ్చింది ఉండేది, అప్పు చేసి బావి తవ్వుకున్నాం, పంట చేతికి వచ్చేది, కూరగాయలు పండించి, కోళ్ళు పెంచి, ఇంట్లో అందరు తల ఒక పని చేస్తూ, అప్పులు నెత్తిన ఉన్న,మా ఇంట్లో మేమే మా కూడు తింటూ, హాయిగానే ఉండే వాళ్ళం.

ఇదిగో, అయిదేళ్లయింది.. మా ఊరికి ఈ అలుమినియం ఫ్యాక్టరీ పెట్టి, అబ్బాయి కి ఉద్యోగం, చదువు కి బడి, ఆసుపత్రి అని, ఏవేవో ఆశలు పెట్టి ,మా భూమి, అయిదు లక్షలు ఖరీదు ఇచ్చి పుచ్చుకున్నారు.

ఇదిగో వచ్చే, అదిగో పాయె,అన్నట్టు చేతి లోనుంచి నీళ్ళు లాగ పోయింది, అబ్బాయి చదువు చాలదు అన్నారు, బడి కి ఫీజు కట్టాలి అన్నారు, ఆసుపత్రి, అందులో పని చేసే వారికే అన్నారు. మాయ లా ,అంత మాయ లాగ అయిపొయింది.

ఏడకి పోతాం? ఉన్న ఊరు, కన్న తల్లి అన్నారు కదా, పంచాయితి పెద్దలు తో మొర పెట్టుకుంటే, ఈ టిఫిన్ హోటల్ పెట్టుకోమన్నారు. అకడ, ఇక్కడ అప్పు చేసి, ఇది మొదలు పెట్టేం. అబ్బాయి మటుకు పట్నం లో చదువు కుంటున్నాడు, ఇంక ఆడ పిల్ల చేతి కింద పనికి అని చదువు మన్పించెం..ఏడిచింది..నేను ఏడ్చాను.. 
ఏం చేస్తాం? ఏదో ఒక లాగ అబ్బాయి చదువు అయి అందు కుంటే, ...

పని లోకి వెళ్ళే వాళ్ళంతా టిఫిన్లు, టీ లు ఇక్కడే ..అన్నం ,కాస్తంత అధరువులు తో భోజనాలు ఇక్కడే,శుచి ,శుబ్రం గా చేస్తున్నాం కదా, ఇక్కడికే వస్తున్నారు.

నరసయ్య పొయ్యి వెలిగించి, పాలు ఎక్కించాడు, ఒక పక్క టీ డికాషను, మరో పొయ్యి మీద ఇడ్లి పాత్ర ఎక్కించి, చట్నే రుబ్బుతోంది. వాణీ లేచి, పల్లెలు, గ్లాస్సులు ,కడిగే పనిలో ఉంది.
ఫ్యాక్టరీ గోడ కి అనుకునే నాలుగు రాటలు పాతి, ఓ రేకు, దాని మీద ఓ ప్లాస్టిక్ షీటూ వేసి, నాలుగు బల్లలు, అటు, ఇటు వేసి, నరసయ్య హోటల్ అని పేరు లేక పోయినా అందరూ చెప్పుకుంటారు.

ఎప్పటి కప్పుడు ,కాష్ ఇచ్చేవాలు ఎంత మంది, మావా, అత్తా అంటూ, రేపు , మాపు అంటారు.
హుష్..ఎప్పటికి మా కష్టాలు తీరత యో?

మావా..స్త్రొంగ్ టీయా..ఒక్క ప్లేట్ ఇడ్డేన, మజ్యననికి ఏం వండు తావు అత్తో? అంటూ ఒక పక్క పలకరింపులు, చేతిలో రూపాయి పెట్టరు, ఎలా నడుపుతాం..ఏమిటో..ఇలాగ..

వాణీ ,పెద్ద పిల్ల అయితే, ఎలా? పెళ్లి ఎలా చేస్తాం?

ఫ్యాక్టరీ గోడ ,గేటు కి కొంచెం దూరం లోనే మా హోటల్. ఆ పక్కనే సైకిల్ స్టాండ్..దారి లో కాబట్టే, అందరూ తొంగి చూసి, ఓ టీ అయినా తాగి వెళతారు.

పదకొండు ..మధ్యాన్నం..ఎండ మండు తోంది.  ఓ గంట వెసులుబాటు.

పొయ్యి మంట తగ్గించి, బల్లలు సర్డుతున్నాం.

ప్యాంటు, చొక్కా లో ఆఫిసుర్ బాబులు నలుగురు వచ్చారు.

టీ అడుగు తారా? అయ్యో పొయ్యి ఇప్పుడే తగ్గించాం..పాలు కూడా లేవు.

నరసయ్య .బల్ల తుడిచి, కూర్చోండి ..బాబూ అన్నాడు.

ఊ ..ఊ కూర్చో డానికి రాలేదు , నీ పేరేమిటి?

నరసయ్య ..బాబయ్య.. ఈ ఫ్యాక్టరీ కి మా భూములు ఇచ్చాం అయ్యా,,పంచాయతి సారూ గారు కూడా ఒప్పేరు అయ్యా, ఈ హోటల్. అప్పు చేసి పెట్టేం, బ్యాంకు కాదు అయ్యా..అంటూ చెప్పుకు పోతున్నాడు.

ఊ సరే, సరే, ఏమిటి, ఈ పొగ,ఈ పొయ్యి, ఏమిటి ఈ కాలుష్యం? మా పని వాళ్ళ ఆరోగ్యం కి హాని కదా ఈ పొగలు, ఈ శుభ్రం లేని పళ్ళేలు, గ్లాస్సులు? ఎన్ని రోజులకి కడుగు తారో?

ఊ.తియ్యండి..ఈ హోటల్ ఇక్కడ తీయండి. వాతావరణ కాలుష్యం ఆపే సంస్థ నుండి వచ్చాం,

ఎవరిని అడిగి పెడతారో? ఛి, బుద్ధి లేదు, ఈ పల్లెటూరు జనానికి.

ఇదిగో ,నోటిసు.. వారం రోజుల్లో నువ్వు ఈ కొట్టు ఎత్తేయాలి.

లేక పోతే నీ మీద చర్యలు తప్పవు..అంటూ వెళ్ళిపోయారు.

నరసయ్య, రమణమ్మ ,నిర్ఘాంత పోయి,

ఫ్యాక్టరీ నుంచి వస్తున్న పొగ , రింగులు రింగులు గా తిరిగి.. తమ మీదకి భూతం లా చుట్టూ కున్నట్టు తోచింది.

ఆరిపోయిన పొయ్యి నుంచి లేచిన చిన్న పొగ వల్లేనేమో, కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి.


గమ్యం


                                                                 
నేను ఒక దారిలో నడుస్తున్నాను,
అలసట లేని, గమ్యం లేని దారి అది.
ఎటు చూసినా ఒక బూడిద రంగు ఆకాశం
వెన్నంటి వస్తుంది, రంగులే లేని తెఱ అది.
పూవులు పొడిగా , ఎప్పుడో వికసించి,ఇప్పుడు
రేకలు రాలుస్తున్నాయి.
ఎందుకో వెను తిరిగి చూస్తే, ఒక నీడ , ఒక ఆకారం
నన్ను కవ్విస్తూ ఉంటుంది.
ముందుకు రాదు, వెలుగు లోకి,
ఏదో గొణుగుతూ ,నలుగుతూ , ఏమిటో
దాని బాధ.

అడుగులు పరుగులు తీస్తున్న,
ముందుకు పోను, అక్కడే ఉంటాను,
ట్రెడ్ మిల్ మీద నడక లా
ఒక్క గజం నెల కూడా ముందుకి కదలదు,
ఒక్క వీసం బరువు కూడా తగ్గను
అయిన ఎందుకో పరుగులు తీస్తూ ఉంటాను.
ఆకాశం అందుకోవాలని, ఇంద్ర ధనుస్సు మీద
నడవాలని , ఏమి కోరికలు లేవు.

అచ్చంగా నన్ను నేను చూసుకోవాలని
ఎప్పుడో నేల మీద వదలిన గుర్తులు
కోసం వెదుకుతున్నాను.
ఇల్లు అలుకుతూ పేరు మరచిన ఈగ లాగా,
నా కోసం వెదుకుతున్నాను.
పిచ్చిదానా, పోయిన చోటే వెదకాలని
తెలియని అమాయకురాలివా నువ్వు.
నా గమ్యం నన్ను వెక్కిరిస్తోంది
నన్ను కవ్విస్తోంది.

నిన్ను నువ్వు ఒక గిఫ్ట్ లాగా,
ఎంటర్ అవాలి ఇంకో జీవితం లోకి  అని చదివాను.
నేను ఒక బహుమతినా? ఎవరికీ?
భూమి మీద భారం నా?
పచ్చ గా ,ఇన్ని ఆకులు పూయించ క పోయిన
ఫరవా లేదు, చంపేయకు..
అని నన్ను నేను దండించు కున్నాను,

దాని బదులు, ఇన్ని నీళ్ళు పోయా వచ్చుగా
అని ఎవరో అన్నారు, నీడే గొణిగింది
ఇలా అడుగులు వెయ్యి నీలో నీలోకి.
కదలని పరుగులు కాదు, కదిలించే పరుగులు
తీయి, యోగ, మెడిటేషన్ , నేర్పాయా ?
నిన్ను నీలో చూసుకోవడం? ఇలా ఎంత అయిన
రాయగలను, మీరు, పారిపోయే అంత వరకు....
 
నాలో నేను,నాతొ నేను..