"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

2 అక్టో, 2011

గౌరి

శారద ఇల్లంతా రెండోసారి సర్దింది. మంచాల క్రింద, సోఫాల మధ్య దుమ్ము దులుపుతూ  అన్యమస్కం గా వెతుకు తోంది. వెతుకుతున్నది వంద రూపాయల నోటు కోసం. తనకి బాగా గుర్తు. నిన్నే అయిదు వందల రూపాయల నోటు మార్చింది. కూరలకి, భాస్కర్ చేతి ఖర్చులకు ,చిల్లర ఖర్చు పోనూ వంద రూపాయల నోటు మిగిలింది.ఎప్పుడూ పెట్టే జాగా  ఖాళీ బిస్కెట్ల డబ్బా..అందు లోనే పడేసింది ఆ నోటు.
చిన్న మొత్తాలు  రోజూ వారీ ఖర్చుకి, ఆ డబ్బాలో పడేస్తుంది శారద బీరువా తాళాలు,గొడవ  లేకుండా,ఎదురుగా కనిపించేలా పెట్టుకుంటుంది.
ఇంట్లో ఎవరున్నారు?పాప, బాబు,భాస్కర్,తను..ఇంకా..గౌరి. గౌరి  పన్నెండు ,పద్నాలుగేళ్ళు వయసున్న పని పిల్ల. కానీ తను ఎప్పుడూ పనిపిల్లలాగ చూడలేదు, ఇంట్లో మనిషిలాగే చూసింది.
శారదకి అసలు అంత చిన్న పిల్లని పనిలో పెట్టుకోవడం ఇష్టం లేదు. గౌరి వాళ్ళ అమ్మ ,నరసమ్మ తనని ఎంతో బ్రతిమాలింది. అందరి పేద కుటుంబాల చరిత్రే.. ..తాగుడుతో ఒళ్ళు పాడు చేసుకున్న భర్త. గౌరి తరువాత ఇంకా ముగ్గురు పిల్లలు.అందరినీ నరసమ్మే పోషించాలి.
అయిదారు ఇళ్ళల్లో పని చేసుకుంటూ, వాళ్ళిచ్చే అన్నాలు, టిఫిన్లు, జాగ్రత్తగా మూట కట్టి, ఇంటికి తీసుకు వెళ్లి నలుగురి పిల్లల ఆకలి తీర్చి, వారి అవసరాలు కూడా చూడాలి.
అందరిలోకి పెద్దది గౌరి. వయసుకి చిన్నది అయినా, అమ్మ వెనక వెనక తిరుగుతూ చిట్టి ,చిట్టి చేతులతో సాయం చేస్తూ ఉండేది. చిన్న పిల్లలని ఇంట్లో  వదిలి పెట్టి రావడమే..పెద్దదవుతున్న గౌరిని కూడా ఎక్కడైనా ఇంట్లో పెట్టాల్సిందే..అని నరసమ్మ అనుకోగానే...
శారదమ్మగారు గుర్తు వచ్చారు, వాచ్ మాన్ ఎప్పుడూ చెపుతూ ఉంటాడు. ఆ అమ్మగారు చాల మంచోళ్ళు, అడగ్గానే అడ్వాన్స్ ఇస్తారు, ఒంట్లో బాలేదు అంటే మందు ఇస్తారు, ఒక్క పొల్లు మాట మాట్లాడరు, పిల్లలిని కూడా సక్కగా పెంచుతారు. అని.
నరసమ్మ పని చేసే ఇల్లు వేరే, ఉద్యోగం అదీ లేదు కదా అని, శారదే అన్ని పనులు చేసుకుంటుంది. చిన్న రెండు బెడ్ రూమ్ల ఫ్లాట్..పిల్లలు స్కూల్ కి వెళ్లి పోయాక చేసే పని ఏముంది అని.
నరసమ్మ కాళ్ళ వేళ్ళ బడి, బతిమాలి, బామాలి,పెద్ద పిల్ల, ఇంట్లో కూడా వదలలేను,  రోజులు ఎలా ఉన్నాయో, తెల్సుగాండి..మీ ఇంట్లో పెట్టుకోండి పనిలోకి..మెల్లిగా పనులు అందుకుంటుంది..జీతం మీ ఇష్టం ..అని ఒప్పించింది.
అలా గౌరి, శారద ఇంట్లోకి వచ్చింది.  పిల్లలు స్కూల్కి, భర్త ఆఫీస్ కి వెళ్ళాక, వంట పని ఓ గంటలో అయిపోతే, మధ్యాన్నం అంతా ఖాళీయే శారదకి. వెనక వెనక తిరుగుతూ ,పనుల్లో అందుకుంటోంది ఇప్పుడు గౌరి, వాళ్ళ అమ్మ వచ్చే వరకు, శారద్ ఇంట్లోనే కాలక్షేపం చేయాలి.
నెమ్మదిగా మంచి మాటలు చెపుతూ  గౌరికి చదువు చెప్పడం మొదలుపెట్టింది శారద.
అయిదారేళ్ళ వయసులో, అన్నాలు పెడతారని, రెండేళ్ళు మున్సిపల్ బడికి వెళ్ళానని , అ ,ఆ లు, అంకెలు పది వరకు వచ్చునని చెప్పింది.. గౌరి.
సరే, ఇంకేం..అని ఓ పలక బలపం ఇచ్చి, పాపతో చదువు మొదలు పెట్టించింది  శారద.
బలవంతపు భ్రాహ్మణార్ధంలా మొహం పెట్టి దిక్కులు చూస్తూ కూర్చునేది, పలక ఒళ్లో పెట్టుకుని,.
టీ .వి. అంటే ఎంత ఇష్టమో..సినిమాలు, పాటలు, ఇవి ఎంత సేపైనా చూసేది.
ఇలా కాదని, ఓ గంట చదివితే ,టీ వి. చూడనిస్తానని షరతు పెట్టి, చదువు రుచి చూపిస్తోంది .
తన పాప గౌనులు మరీ చిన్నవి అని, తన దగ్గర ఉన్న ఓ పాత సిల్క్ చీరతో ఒక లంగా జాకెట్టు కుట్టించి ఇచ్చింది. గౌరికి.
ఇంట్లో ఉంది, ఏమి చేయలేక పోతున్నాను అన్న బాధ నుండి ఈ విధం గా కొంత విముక్తి పొందుతోంది. గౌరి కి కూడా శారద అంటే చాల గురి ..ఆవిడా మాటే తలుస్తుంది ఇంట్లో కూడా..
 గాంధీ గారంటే శారద కి చాల ఇష్టం. ఆయన పద్ధతులు చాల వరకు పాటిస్తుంది. అందులో, ప్రతి పైసా లెక్క రాయడం ఒక్కటి, పుస్తకం లో. తన అక్కౌంట్ బుక్ తీసి , మరో సారి చూసుకుంది, లెక్క ఎక్కడ తప్ప లేదు, ఒక్క వంద..తక్కువ అవుతున్నాయి.
శారద ఆలోచనలోంచి తేరుకుంది,  ఛా .గౌరిని అనుమానించడమా ?
రేపు గౌరీ రాగానే ఒకసారి అడిగి చూడనా?? ఎలా అడగడం..చిన్న పిల్లని, వంద రూపాయలు కోసం దొంగ లాగ నిలదీయడమా ??
అలా అని, వదిలేయ లేను..సరే, రేపు మళ్లీ ఇల్లంతా వెతికి చూస్తాను..అని ఆ రోజుకి చికాకుగానే నిద్ర పోయింది.
అప్పటికీ  సాయంత్రం భాస్కర్ రాగానే అడిగింది, నువ్వు తీసావా? అని అబ్బే, నువ్వు, నా చేతికి ఇచ్చిందే, నేను బ్యాంకులో పని చేస్తున్నా నా  బ్యాంకర్ వి నువ్వే ఇంట్లో..పిల్లలిని అడిగింది.. అమ్మా..మాకెందుకు వంద రూపాయిలు మేమేం చేస్తాం? అన్నారు.
మర్నాడే  గౌరీ వచ్చింది పనిలోకి. అటు, ఇటూ తిరుగుతూ, యధాలాపంగా. గౌరీ, తుడిచేటప్పుడు, నీకు ఎక్కడైనా వంద రూపాయల నోటు కనిపిస్తుందేమో చూడు..అంది శారద.
గౌరీ  ఇల్లు తుడుస్తూ, అమ్మా..ఇదిగో "అమ్మా! దొరికింది..నోటు అంది.
శారద ఆశ్చర్యంతో, ఆనందంతో కళ్ళు విప్పి చూస్తోంది. నిజంగా! అంటూ వంద రూపాయల నోటు తీసుకుంది చేతిలోకి.. ఈ నోట్  తనదే అనిపించింది. ప్రత్యేకమైన గుర్తు ఏమి లేకపోయినా..
నాకు న్యాయంగా చెందింది కాబట్టే నాకు దొరికింది. అనుకుంది శారద తృప్తి గా..
ఇంతలోనే అనుమానం. నిన్న తను రెండో సారి, ఇల్లు అంతా తుడిచి చూసిందే..మంచాల కింద,సోఫాల మధ్య తనకు ఎందుకు కనిపించలేదు. ఏది ఏమైనా నా వంద నోటు నాకు దొరికింది, ఏదో సంపద దొరికినంత ఆనందంగా ఉంది.
"గౌరీ ! చాలా థాంక్స్..నీకు భలే దొరికిందే..నాకు,నిన్న ఎంత వెతికినా దొరక లేదు" అని మెచ్చుకుంటూ భుజం తట్టింది.
గౌరి  ఒక్క సారి, కళ్ళల్లో నీళ్ళతో భోరుమంది. చమించండమ్మా ! అంటూ..
నివ్వెరపోయింది శారద. 
"నిన్న నేనే తీసేనమ్మా . నా తెలుగు వాచకంలో పెట్టుకుని ,ఇంటికి తీసుకు వెళ్లాను.రేత్రి, పుస్తకం తీసేసరికి  నోటు కింద పడింది.  ఆ పేజీలో, మీరు చెప్పిన పాఠం..గాంధీ  ఓరి గురించి కనిపించింది. తప్పు సేయ రాదు..అని సెప్పేరు కదా గాంధీ తాత   నిజమే చెప్పేవోరు అని చెప్పేరు కదా అమ్మా".
ఇంకా బెక్కుతూ, ఏడుస్తూ, "మీరే నాకు తప్పు చేసావు గౌరీ  అంటున్నట్టు  అనిపించింది అమ్మా."
శారద కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తన చదువు వృధా పోలేదు. అన్న  ఆనందంతో ఆనంద భాష్పాలు అవి..
కానీ గౌరీ మాటలు..ఆ చివర మాటలు , .మళ్లీ ఆలోచనలో పడేశాయి.
మా తమ్ముడికి కూడా "మసాల దోసె, ఐస్ క్రీమ్...ఇప్పించాలి హోటల్లో.."
వారం రోజుల క్రితం, గౌరీని తీసుకుని వెళ్లి, హోటల్లో తమతో పాటూ  ఇప్పించడం గుర్తు వచ్చింది..
"అమ్మా ! నాక్కూడా కావాలి అక్కా అని ఏడ్చేడు అమ్మా నేను తిన్నానని చెప్పినప్పటి నుండి ఒకటే గొడవ ,ఏడుపు, అందుకే , అందుకే నమ్మా.."
అంటూ,కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, గౌరీ శారద కళ్ళల్లోకి చూస్తూ.
శారద నిట్టూర్చింది. తను గౌరీని తమతో సమానంగా చూస్తున్నాను అనుకుంది, కానీ, గౌరీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఎంత బాధపడిపోతున్నారో, అక్క అన్ని తింటోంది, చక్కగా ,తమకు ఏమి లేవు, అమ్మా తెచ్చే మిగిలిన అన్నాలు, టిఫిన్లు తప్ప..అని.
ఈ వ్యవస్థే ఇంతా??!!! ఒకరిని  ఏడిపించడమే అవుతుందా?
పది మంది అన్నమో అంటూంటే,  ఒక్కరికి పంచ భక్ష పరమాన్నాలు పెడితే సమస్య పెరుగుతుందా ?తరుగుతుందా?? తన తాహతుకి, ఇంత కన్నా తను ఏం చేయ గలదు?
తను గౌరీని తన ఇంట్లో వారితో సమానంగా చూడడం అనేది ఎంత సమస్య అయిందో??
అందరికీ సమానంగా ఎప్పటికి అవకాశాలు దొరుకుతాయి?అంత వరకు, నా లాంటి వాళ్ళు..అసహాయులేనా??
వంద రూపాయల నోటు దొరికిన సంతోషం అంతా ఆవిరి అయిపోయి, గౌరీని ఓదారుస్తూ  ఆలోచనలో పడింది శారద.














3 కామెంట్‌లు: