మల్లి..మా మల్లి..
చెంగు ,చెంగున గాలి లో తేలుతూ, అక్కా..అక్కా..
అంటూ పూల తోట ని ఇంట్లో కి మోసుకు వచ్చే..మల్లి..మా మల్లి.
మల్లెపూల మధ్యలో, మరువం నీకు ఇష్తం కదా అక్కా,
ఇదిగో, మరువం చివుర్లు, ఆండాళ్ అమ్మగారి, పెరట్లో తెమ్పుకొచ్చా..
గబ గబా మాల ఎలా అల్లా లో, ఒక్కసారి, మరొక్క సారి, నేర్పించు అక్కా.
నేను ఈ మాల కట్టి, మీకు సగం ,మా అమ్మ కి సగం..తెంపి ఇవ్వాల..
మా అమ్మ ఎవరింట్లో ఉందొ? మా మంచి అమ్మ..అక్కా..
నీకు తెలుసా..మా అమ్మ ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటుందో?
ఒక్క సారి, మల్లోక్క సారి, మా అమ్మ ని చూసి యిట్టె వచ్చేస్తా..
ఈ లోపల అక్కా..దారం తీసి ఉంచు.. ఈ పూలు ఒక్క కుప్ప వేస్తాను..
మా అమ్మ ఎంత చల్లగా నవ్వుతుందో..ఈ మల్లె ల్లాగా..
అమ్మ ఒంటి వాసన ఏమిటో ఈ మరువం లాగే,అచ్చంగా..ఒట్టు.
అక్కా..నువ్వు ఆ చేతిలో పని, అలా పక్క పెట్టు. నేను వస్తాను గా.
మా అమ్మని ఒక్క సారి, కళ్ళ నిండా చూసుకుని, ఏమిటో,
ఈ పొద్దేనా ..అమ్మ చల్ది అన్నం ముద్ద, ముద్దా పెట్టి, మల్లీ,
బడికేనా పోవు? ఇంటింటా నా ఎనకే తిరుగుతావు? ఎందుకే
నీకీ కష్తం..నేను ఉన్నానుగా నీకు..చదువు కుంటే ఈ బాధలు తప్పుతాయే,
అంటూ సుద్దులు చెప్పింది, నాకేటో అచ్చరాలు కన్నా అమ్మే ఇష్తం.
అయినా, అమ్మ ని విడిస్తే ఒక్క నిమిషమూ ,నాకు ఒక్క గంటే..అక్కా..
అమ్మ చీర కొంగు పట్టుకుని, ఎక్కడికైనా పోగలను నేను, అలసటే లేదు.
అయ్య , అంత మంచి అమ్మని ఎలా వేస్తాడో దెబ్బలు..గుభి,గుభీ మని,
నడుం వంచి, అమ్మ కళ్ళు తుడుచుకుని , వన్నం పెడుతుంది అక్కా ,అయ్యకి.
మీ నాన్న మంచోడే నే ..ఆ కంపు కొట్టే సారా దేనే తప్పు అంటుంది అక్కా ..అమ్మ.
అయ్య నడిపే ఆటో లోనే వస్తాము అక్కా..నేనూ అమ్మా పని లోకి.
తమ్ముడ్ని కూడా బడి లో దింపుతాడు, అయ్య కూడా మంచోడే అక్కా..
ఆ చుక్క పడనంత వరకూ అంటుంది మా అమ్మా కూడా.
అయినా నాకు మా అమ్మా అంటే నే ప్రేమ..చందమామ అంత చల్లని
అమ్మ అంటే ఎవరికీ ఇష్తం ఉండదు?అక్కా..నువ్వు చెప్పు.
మొన్న కస్తూరి అక్కా పెళ్ళికి ,అమ్మ నాకూ గోరింటాకు పెట్టింది,
ఆకు కోసుకు వచ్చి ,రుబ్బింది అమ్మే కదా, అర చేతిలో చందమామ,
చుట్టూ చక్కని చుక్కలు, గోళ్ళకి టోపీలు పెట్టింది అమ్మ..
పండిన నా చెయ్యి చూసి, నా చంద మామ ఎంత బాగా పండిందో
అంటూ ఎన్ని ముద్దులు పెట్టిందో మా అమ్మ..అమ్మ చెయ్యి ఎంత మంచిదో అక్కా ..
అమ్మ పెట్టిన గోరింటాకు అందరికి బాగా పండుతుంది అక్కా..
అమ్మ మనసు ఎంత మంచిదో కదా అక్కా..కస్తూరి అక్కా హాయిగా
పెళ్లి చేసుకు వెళ్లి పోయింది..కదా అక్కా..అమ్మకి నేను కూడా కస్తూరి లాగే,
హాయిగా ఉండాలని, నా చేతిలో ,పెళ్లి గోరింటాకు పెట్టాలని, మా
అమ్మ మనసులో ఏముందో నాకు తెలుసు అక్కా..నాకే తెలుసు అక్కా..
కొన్ని రోజుల తరువాత,
అక్కా..నాకు పెళ్లి ట....బావ తో అట అక్కా..అనకా పల్లి లో అక్కా..
అయ్య లాగే ఆటో యేస్తాట్ట..ఏటో నా కేమి సంతోషం గా లేదక్కా..
నేను అమ్మని ,మా అమ్మ ని చూడకుండా ఎలా ఉండను?
ఈ రాజమండ్రి గోదావరి నీళ్ళు ,ఎంత తియ్యగా ఉంటాయో? అమ్మ
మాట అంత తీపి, నోట్లో తీపి వేసినట్టు ఉంటుంది నాకు,
అమ్మ ..మల్లీ,మల్లీ అని ఒక కేక వేస్తే.. ఆ పక్కనే ఉన్నా నేను
ఉలకను, పలకను, మళ్లీ,మళ్లీ, అమ్మ మల్లీ,మల్లీ, అంటూ కేక
వేస్తే..గమ్మున ఉంటాను..అమ్మ పిలుపు కోసమే..అక్కా..
అర చేతిలో, ఎర్రగా పండిన చందమామ , నుదుట కల్యాణం బొట్టు,
మన గోదారి ,మలుపులు తిరిగినట్టు, వంపుల్లో ఒదిగిన పెళ్లి చీర,
నుదుట భాసికం, జడకి పాయ ,పాయ కి అల్లుకున్న మల్లెల ,మరువాల
కదంబ మాల, గాలి లో తేలుతూ నడిచే పాదాలకి పారాణి అందాలూ.
గుడి లో పెళ్ళికి అందరమూ బంధువులమే.
కొంగు ముడి వేసింది బావ తో, అమ్మ కొంగు విడిచి.
అబ్బా ఇంకా చిన్న పిల్లే, ఎందుకే గంగా..అంత అపురూపం గా
పెంచిన మల్లి ని, ఇలా పంపేస్తున్నవూ..అంటే..
అందుకే అమ్మా..మా మల్లి ,చిన్న పిల్లే అమ్మ ,ఎంత వయసొచ్చినా,
ఉత్త అమాయకం..అత్త కోడలు ని తీసుకు పోతాను అంది అమ్మా..
పుట్టగానే అనుకున్నాం కదా అమ్మా..మల్లి వారింటి పిల్లేనని..
ఇక్కడ ఉంటే నా కొంగు పట్టుకుని ,నా ఎంటే తిరుగుతోంది,
ఎప్పటి కైనా ,ఆ ఇంటి పిల్లే కదా అనే నేనూ ఎంత ముద్దు చేసెనో,
నా పాణం అమ్మా.. మల్లి.. మా మల్లి నవ్వుతూ , కిల కిల లాడితే,
నాకు పగలే ఎన్నెల కాసినట్టు ఉండేది. అమ్మా..అమ్మా..అంటూ
పిలుస్తే, నా నోట్లో పంచదార పోసినట్టుండేది. ఎంత చక్కని దో నమ్మా..
మా మల్లి. ఇయాల నుంచి మా ఇంట్లో అమవాసే నమ్మా..
అత్తారింట్లో ఇంకా ప్రతి రోజూ పున్నమే అమ్మా ఆరికి, మా మల్లి
అడుగు పెడుతోంది కదా..అంటూ కన్నీళ్ళు ఉప్పగా నోటికి
తగుల్తూ ఉంటే, తీయని గోదారి గట్టు నుంచి ఉప్పని సంద్రం నీళ్ళ
దరి అనకాపల్లి ఊరి కి, అత్తారింటికి సాగ నమ్పేరు.
మరి కొన్ని రోజుల తరవాత,
మా ఇంట్లో నే ఇప్పుడు పని చేస్తున్న గంగ, ఓ రోజు
అమ్మా..రెండ్రోజులు సెలవు కావాలి, మా మల్లి తల్లి
బెంగ తో కూడు తిండం లేదుట, నవ్వే లేదు ట..మొహం లో,
పొయ్యే వెలిగించడం రాదు మల్లికి, ఏం పనులు నేర్పించావమ్మ
అని ఆడ బొట్టే, గదుముతూ, కార్డు రాసింది అమ్మా..
మల్లెపూలు అల్లడం, అల్లం అల్లం అని తిరగడం, ఏవో పై పనులు
కి సాయం..అంతే నమ్మా, నేనింకేం నేర్పించాను, చిన్న పిల్ల నా మల్లికి,
నోట్లో ముద్దలు కలిపి పెడితే తినేది, చెయ్యి ఎంగిలి ఎందుకని నోట్లో
నే పెట్టేదాన్ని కదా అమ్మా..మా మల్లికి. అమ్మా..నీకో ముద్దా ,నాకో ముద్దా,
నువ్వూ తిను అమ్మా అంటూ, కబుర్ల తో నా కడుపు నింపేది,
ఒట్టు అమ్మా..మా మల్లి వెళ్ళేక, ఒక్క రోజు కూడా నాకు ఆకలే లేదు,
అన్నమే సయించదు, నువ్వు తిను అమ్మా అనే మల్లే గుర్తు వస్తుంది.
వెళ్లొస్తాను అమ్మా..మా మల్లి ని చూసి వస్తాను. ఉండు గంగా అని,
చేతిలో మల్లి ..మరువం కలిపినా పూ దండ బారెడు, మిగల మగ్గిన
మల్లి కిష్టమని , రాజమండ్రి జామ కాయలు నాలుగు పెట్టెను.
మూడో రోజున వచ్చీసారు, తల్లి.. కూతురు.. మల్లి అడుగు లో అడుగు
వేసుకుంటూ, గుమ్మం లో నిల్చుని అక్కా అంటూ నెమ్మదిగా
పిలేచేసరికి, తల పైకెత్తి చూసి, నిలువునా అవాక్కయాను..
ఎవరీ మబ్బులు కప్పేసిన చంద మామ లాగ ,నిట్టూర్పులు
తో నిండిన కోయిల పాట లాగా, వెల వెల బోతున్న గోరింటాకు చెయ్యి లాగ,
నవ్వు ,నవ్వు నిండిన ఆ చూడ చక్కని మొహం ఇలా ..ఏమిటి
కళ తప్పి, శృతి లేని పాట లాగ, ఇలా అప స్వరం మూర్తిభవించినట్టు ..
మల్లేనా? మా మల్లేనా?? కాలిపోయిన మల్లి పూల వాసన ,కడుపులో
తిప్పింది, లేచి చేయి పట్టుకుని ,నా మది లోకి, గది లోకి లాక్కున్నాను,ప్రేమగా.
ఏమిటిది మల్లీ, ఏమయింది నీకు? నువ్వింతగా మారి పోయావు?
ఎలా వున్నావు ? నువ్వు సంతోషం గా లేవా? అని నేను అడగని ప్రశ్న,
జవాబే వద్దు, వినలేవు నా చెవులు..
కనిపిస్తూనే ఉంది కదా ,అడగని ప్రశ్న కి జవాబు.
మల్లి కళ్ళల్లో నే దొరికాయి ఎన్నో సమాధానాలు. దానితో పాటూ
చెప్పలేని ..నన్ను నేను క్షమించు కోలేని అవ్యక్త బాధ..నేనేం
చెయ్యగలను? ఆప వలసినది కదా.. ఇంకా మొగ్గ గా ఉంది ఈ మల్లి,
వికసించ డానికి కొంత సమయం ఇవ్వండి గంగా అని చెప్పి ఉండ
వలసినది కదా..నాకెందుకు ? అనే చదువు కున్న స్త్రీ ల ముభావత కాదా?
అయ్యో, నా పిల్ల లాంటిదే కదా..
గంగా..ఇంక నీ మల్లి ని నీ దగ్గరే ఉంచు కో, నీకు బరువు కాదు, అని
చెప్పెను, ఈ సారి. కాదు అమ్మా..మీకు అర్ధం కాదు, మమ్మలిని
బతక నివ్వరు, కులం లో, అయినా ఎంత కాలం చిన్న పిల్ల,
ఇంతలో పెద్ద వాళ్ళ యిపోతారు, నా ఇల్లు, నా ఓడు, అంటారు కదా
అమ్మా..ఓ ఓరం రోజులుంచి, పని, పాట నేర్పి, నా చిట్టి తల్లిని
అత్త గారింట దింపి వస్తాం అమ్మా..మీరు రెండు రోజులు సర్దు కొండి..
అయ్యో, నేను రెండు రోజులు సర్దు కోవదమా??
మల్లి తన జీవితం అంతా సర్దు కొవాలే, ఆ పెద్ద బాధ ముందు,
నా చిన్న ,పని మనిషి రాని, ఇంటి పనుల బాధ ఒక బాధా..
గంగా..అంటూ నేను మనసులోనే కన్నీరు మున్నీరు అయ్యాను.
నాకే ఇలాగ ఉంటే, ఇంక తల్లి, మల్లి అమ్మ..గంగ ..మనసు గంగే కదా..
అనకా పల్లి కి మళ్లీ అంపకాలు అయ్యాయి, పాల ముంచిన చెయ్యి,
అత్త చేతిలో, బావ చేతిలో పెట్టి ,బండెడు భారం తో, తిరిగి వచ్చింది గంగా.
ఇంటికి తీసుకు వెళ్ళే అన్నం గిన్నెలు, ఆ మూలే ఉంటాయి,
ఇంట్లో పొయ్యి రాజేసిన మంటా లేదు, కొడుకు అమ్మా ఆకలే అంటే,
అయ్యో ..అక్కా తిందో లేదో, ఉండు ఇప్పుడే పడేస్తాను పొయ్యి మీద ఎసరు
అంటుంది, అక్కా లేదు కదా అంటే..కళ్ళల్లో ఉబికే గోదారి కి
విఫలం గా అడ్డు వేస్తుంది గంగ..ఏమిటో ఎందుకు చేసామో ఆ
పెళ్లి, అని వగస్తుంది, ఇంకా చిన్న పిల్లే కదా, అని మళ్లీ పదారేల్లు ,
చిన్న పిల్లేమిటి? అత్త కూడా అమ్మ కాదా? కడుపులో పెట్టుకోదా??
గంగ..మల్లి...నా కళ్ళ లలో, మదిలో ఇల్లు కట్టుకున్నారు.
ఉరమని పిడుగు లాగ ఓ రోజు.. ఓ దుర్దినం..
వచ్చింది ..ఈ వార్తా,,మా చిన్నారి, వెలుగు లాంటి మల్లి,
ఎందుకో ఇంక నాకు వెలుగే లేదు ఈ భూమి మీద అని తలంచి,
షికారుగా వెళ్లి, సముద్ర గర్భం లోకి, మళ్లీ అమ్మ గర్భం లోకే
వెళ్లి పోతున్నట్టు ..వెళ్లి పోయింది.
మల్లె పూవుల మరువం పువ్వుల కదంబం..ఇంక నా కంటికి,
ఎప్పటికి వాసన లేని కాగితం పువ్వులే..మల్లి ఎప్పటికి నాకు
కనిపించదు మళ్లీ.. ఇంక ఆ గంగ కడుపు లో శోకం ..ఆ గోదారికే
తెలుసు, వరద గోదారికే తెలుసు, ఉప్ప గా మారిన గోదారికే తెలుసు.
ఇదే మల్లి..మా మల్లి కథ.
అంకితం..ఎందఱో మల్లి లు ..ప్రతి రోజూ, ఇష్టం లేని, సుఖం లేని, స్వేచ్చ లేని వివాహ జీవితం లో ,దుఖం అనుభవిస్తున్నారు, ప్రాణాలే అంతం చేసుకుంటున్నారు.. అలాంటి వారు అందరికి ధైర్యం గా జీవితం , లో, నడవాలి ఒంటరి గా నైనా అని మళ్లీ,మళ్లీ, ప్రార్ధిస్తూ..ఈ కథ అంకితం. గంగ లాంటి తల్లులకి వందనం.
చాలా ఆర్థ్రంగా వుందండీ...నిజమే ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఇలా ఎంతో మంది మల్లిల జీవితాలను గంగపాలు జేస్తున్నాయి...ఆధునికత వేషధారణకు, అలవాట్లకే పరిమితమై, మనసు ఇంకా వికసించని కుటుంబాల వలన ఈ పాట్లు తప్పవు..మీ కథ బాగుంది...
రిప్లయితొలగించండిథాంక్స్ అండీ, కే క్యూబ్ వర్మ గారు, ఆర్ద్రత ని మనసు తో అందుకున్న మీకు నా ధన్య వాదాలు. ఇది జరుగుతున్న నిజం..మనసు కలచి వేసి, రాసిన కథ ఇది. ఇది కథ కాదు ..నిజమే..థాంక్స్ ఒన్స్ అగైన్.
రిప్లయితొలగించండివసంతం.
speechless andee....
రిప్లయితొలగించండిI am overwhelmed..Maddy..garu..Thank you once more for your Responses..
రిప్లయితొలగించండిVasantham.