జరిగితే జ్వరం అంత సుఖం లేదని..అంటారు.ఇరవై ఏళ్ళ క్రితం, మా అబ్బాయి కి టైఫాయిడ్ వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పుడు, పిల్లల డాక్టర్ గారు, ఇంత పవర్ ఫుల్ మందులు ఇస్తున్నాం , అన్ని పెట్టేయండి, పప్పు అన్నం తో సహా..అందులో ఉండే ప్రోటీన్ ముఖ్యం అంటే, నేను ఒక మూడు గిన్నెల కారేజ్ లో పప్పు అన్నం ,కూర అన్నం, ఇంకా చారు అన్నం మూడూ జాగ్రత్తగా తెస్తే మా అమ్మ ససే మీరా టైఫోయిడ్ వచ్చిన పిల్లాడికి పప్పు అన్నమా అరగదే అంటూ పెట్ట నివ్వలేదు..
అలా ఇంకా వెనక్కి వెళితే ఆరుగురం పిల్లలం ఎప్పుడయినా జ్వరాలు అవి వస్తాయి, కదా , స్కూల్ మానడానికి వచ్చే కడుపు నొప్పుల లా ఉత్తిత్తి జబ్బులు కాకుండా ఓ రోజు ఎవరికో వచ్చేది జ్వరం.
రావడమే వంద , నూట రెండు. ఇంక హాయిగా ముందు స్నానం బంద్..మా ఇంట్లో వాళ్ళందరకి స్నానాలు అవి అంతగా ఒంటికి సరిపడవు. అందుకే నాకు బీనా దేవి కథ " అతి సర్వత్ర వర్జేయత్" లో లాగా, ర్రాయి మీద నిల్చుని, పై నుంచి కిందకి ఊరికినే నీళ్ళు కింద పోసే సీన్ భలే ఇష్టం..
ఇంకో హాయి స్కూల్ కి వెళ్లక్కర్లేదు..,
అంతే అంత వరకే ఆ హాయి , రోజూ, సూర్యుడు ఉదయించడం ,తప్పి పోతుందేమో గాని, మా ఇంట్లో, పెద్ద గిన్నెడు ,కాఫీ డికాషను మటుకు, అటు సూర్యుడు ఇటు పొడిచే సరికి, కమ్మటి వాసన తో పొయ్యి పై కి ఎక్కాల్సిందే, ఏదో పళ్ళు తోమేం అనిపించుకుని, (ఇది కూడా దేవుడు ఇచ్చిన వేలు బ్రష్ తో నే) తలా ఒక గ్లాసూ పట్టుకుని క్యూ కట్టే వాళ్ళం.
అందరం ఉఫ్ ,ఉఫ్ మని కాఫీ స్వర్గం లో ఉంటే, పాపం ఈ జ్వరం వచ్చిన మా తమ్ముడు మటుకు ( ఎక్కువ తమ్ముడి కే ఈ జ్వరం స్కూల్ జ్వరం ) మటుకు తెల్లని పాలు లో పంచదార కలపిన ఉత్తి పాలు..అప్పుడు ఏ బోర్న్ విటాలు అవి లేవు మరి తాగాల్సిందే , జ్వరం రూల్ నెంబర్ ఒకటో, రెండో ,
పదో..
అక్క..అక్కా..కొంచం కాఫీ అంటూ వెంట పడితే ఆ తెల్లని పాల లో, ఈ నల్లని కాఫీ చుక్కలు రెండంటే రెండు వేస్తే..హమ్మయ్య అని గొంతు దిగేవి.
మేం అందరం గబా గబా స్కూల్ కి తయారు అయి వెళ్లి పోయే వాళ్ళం జ్వరం తగ్గాలంటే లంఖణం పరమ ఒషుధం అని రెండు తియ్యని హోమియోపతి మాత్రలు నోట్లో వేసి, అమ్మ పనిలో పడిపోయేది.
ఇంక ఇంట్లో ఉన్నవాళ్ళకి ఒకటే బోర్ , స్కూల్ లేదు, దెబలాడుకోడానికి ,కొట్టు కోడానికి, అక్క చెల్లెళ్ళు ,తమ్ముడు లేరు, ఇంక అమ్మని సాధించడమే సాధించడం..
అందరం వచ్చి, ఆకళ్ళు తో అన్నాలు తింటూ ఉంటే, వాడికి మటుకు నెయ్యి తో కాల్చిన బ్రెడ్, పంచదార జల్లి. ఇచ్చేది అమ్మ
మాకేమో నోరు ఊరిపోయేది,బ్రెడ్, పంచదార రుచికి వాడేమో, వికారం గా మొహం పెట్టి, అక్కా..కొంచం ఆ బంగాళా దుంప కూర పెట్టు..అని చేయి చాపే వాడు.
ఇంక అమ్మ వంటిట్లోకి వెళ్లి నప్పుడు, మేం మెల్లిగా బార్టర్ చేసుకునే వాళ్ళం వాడి చేతిలో ఒక అన్నం ముద్దా, మా చేతిలో ఒక బ్రెడ్ ముక్క..
నాలుగో రోజూ , మా తమ్ముడి కి పెట్టే, ఒక కారప్పొడి అన్నం నెయ్యి, చారు అన్నం ఎంత రుచో? అది ఆ జ్వరం తగ్గిన నోటికి, స్వర్గం ముందు ఆమడ దూరం లో నిల్చున్నట్టే.
నాకు అయితే స్కూల్ పోతుందని భయం తో జ్వరం తెచ్చుకునే దాన్ని కాను, చాల బుద్ధి మంతురాలిని మరి. టీచెర్ 'స పెట్ ఎప్పుడూ..
కాని, ఇప్పుడో, ఎంత జ్వరం అయినా అన్ని తినేయొచ్చు అంటారు. జ్వర లక్షణాలు అన్ని ఉంటాయి, దెర్మోమేటర్ .అయిదు నిముషాలు నోట్లో కొరికేసినా ఒక్క డిగ్రీ పెరగదు . నేను అయితే వేడి నీళ్ళల్లో ముంచి ,ఇది పని చేస్తోందా లేదా అని చూస్తాను.
నేను, డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆయన గబ గబా రాసి ఇచ్చేసిన మందు చీటీ పట్టుకుని, ఆయన అటు తిరిగి సొరుగు లో మనం ఇచ్చిన నోటు పడేసుకుని ఆ రోజు కలెక్షన్ తనివి తీరా చూసు కోనీకుండా ,
డైట్ ఏమిటండి ?అని అడిగితే పిచ్చి దానిని చూసినట్టు,ఇంత అమాయకులా మీరు ,ఏమైనా తినేయ వచ్చు ఆంటిబయోటిక్ కదండీ ,మీరు బలం గా అన్ని తినాలి అనేసరికి..
అయ్యో, లంఖణం మందు చెప్పే డాక్టర్లు ఏమయిపోయారు? అని ఆలోచిస్తూ ఆయన చెప్పిన మందులన్నీ కొని, ఒక సొరుగు లో పడేసి, ఇంకా మూడ్రోజులు చూద్దాం అనుకుంటాను.
క్రోసిన్ తో తగ్గిపోయే జ్వరాలే అన్ని, కాని, పాపం డాక్టర్లు, మందుల షాపుల వాళ్లకి, మనం పూర్వ జన్మ లో ఉన్న బాకీ తీరుస్తే గానీ, మనకి రుణ విముక్తి అవదు అని అలా మందులు మురగ పెడుతూ ఉంటాను.
ఇంతకీ, ఏదో ,ఒక పూట ఆ కారోప్పొడి అన్నం ఏదో, ఇంత నెయ్యి చుక్క వేసుకుని లాగించేయా వచ్చు కదా..
అంటే, అబ్బే, ఆ నాలుగో, ఐదో రోజుల లంఖణం..ఆ పీక్కు పోయిన నాలుక కి ఆ కారం తగలడం అది ఒక సుఖమే..
అందుకే జరిగితే జ్వరం అంత సుఖం లేదు..ఇవాళో, రేపో, మిరియాల చారు పెట్టుకుని హమ్మ్ఒక పట్టు పట్టాల్సిందే.ఏమిటో ,జ్వరాలు కూడా రూపం మార్చేసుకున్నాయి కాబోలు ఇప్పుడు .
సరే, ఇంత చాలు ,ఏమో , కొంచం ఒళ్ళు వేడి గా ఉన్నట్టుండి ఉండండి మరి మా పని చేయని ధర్మ మేటర్ కి పని చెపుదాం.
చ..జ్వరం మీద బ్లాగ్స్ ఏమిటి? అంటున్నారు కాదు కాదు లంఖణాలు మీదే అని తప్పించు కున్నాను .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి