"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

29 మే, 2014

మా విశాఖ - ఏలూరు ప్రయణం ,కార్‌ లో ..


శనివారం ,ఆదివారం రెండే రెండు రోజులు ..మాకు వీలు కుదిరిన రోజులు ,ఏలూరు వెళ్ళాలి ,మా ఇల్లు నిర్మాణం లో ఉన్న ఇల్లు ( ఫ్లాట్ లు ) చూసి రావాలి .
ఎప్పటి లాగే మేం బయలుదేరే రోజు చిన్నపాటి వర్షం తో స్వాగతం పలికింది . రాత్రి అంతా పెద్ద ఉరుములు మెరుపులు ,జడి వాన బెదిరింపులు ..ఉదయానికి ప్రశాంతం గా మబ్బుల తో నిండిన ఆకాశం ..మరీ ఎక్కువ కురవను లెండి ,మరి బయలుదేరండి ..అంటూ దీవించింది .
ఇంకేం ? ఎప్పుడూ లేనిది నేను కూడా నాలుగు గంటలకే లేచి ఇడ్లీ లు పడేసి అంటే ఇడ్లీ పాత్ర లో ,కొబ్బరి పచ్చడి కూడా చేసి ,ఇంట్లో ఉన్న బిస్కెట్ హల్దీరాం పాకెట్ కూడ పడేసాను, అదేమిటో ప్రయాణం లో పిచ్చి ఆకలి వేస్తుంది మాకు.  ఇంతేకాదండోయ్ ,స్టీలు ఫ్లాస్కు లో వేడి ఫిల్టర్ కాఫీ కూడా పోసేసాను, ఇంత బుద్ది నాకెప్పుడు వచ్చింది చెప్మా ?? అని నాకే హాశ్చర్యం వేసింది కానీ ఇదిగో మరీ అరవై దగ్గర పడుతోంది కానీ కొంచం బుద్ధి పడేద్దాం ఆ తింగరి బుర్ర లో అని ఎవరో పెద్దలు పాపం నిర్ణయించుకున్నారు కాబోలు ..ఎందుకో అందుకు. ఈ సారికి ఏ హోటలు దగ్గర ఆగుదాం అని దిక్కులు చూసే శ్రమ తప్పింది నాకు ..
ఉదయం ఆరున్నర కే బయలుదేరి పోయాం , వీధులన్నీ ఇంకా ఖాళీ గా ,ఉదయపు నడకల వారి తో , ప్రశాంతం గా ఎంత బాగుందో ..మా విశాఖ అనిపించింది ..

ఉక్కు పరిశ్రమ దాటేసాం అంటే విశాఖ దాటేసినట్టే, చిన్న చిరు జల్లు మాకు తోడు గా మాతో కూడా , ఎండ రానా మాననా అని తొంగి చూస్తూ సరేలే ఇంకాసేపు పడుకుందాం అని ముసుగు తన్నే పిల్లలా గా ( సిగ్గు ఎందుకు ,తల్లి కూడా అంతే అని చెప్పేయ్ ) బద్ధకం గా మబ్బుల చాటున దాకుందే మో !
ఆకు అలమలు కి పండగే ,మరి ,తలంటి పోసుకున్నట్టు , జల జలా తలలు కదుపుతూ ,చిరు జల్లుల కొసరు లు కురిపిస్తున్నాయి చెట్లు . నల్లని తారు రోడ్డు కూడా మెరిసి పోతోంది , అంచున ఎర్రటి మట్టి ,బుద్ధి గా కుదురుకుని ,మొదటి రోజు బడి కి వెళ్ళీన పిల్లాడి ,దువ్విన జుట్టు లాగ అణచి వేసి జర జర మని మాతో పాటూ పరుగులు పెడుతొంది .

కనుచూపు మేర పచ్చదనం .ఒక్క రంగు కాదు ,లేలేత పచ్చని పొలాలు దిగంతాల వరకు పరచుకుని కర్ర పట్టుకుని పెత్తనం చేసే నాన్న లాగ ,పెద్ద పెద్ద చెట్లు ,ఎత్తున, అలా అక్కడక్కడ నిలుచుని గంభీరంగా కాపలా కాస్తూ,ఇంకా ఎత్తు ఎదగని పొదలు వయ్యారం గా రంగురంగుల పూలు తలలొ అలంకరించుకుని ..

అనకాపల్లి దగ్గరకి వస్తోంది ,ఇంత ఎత్తున చెరకు పొలాలు , అరటి చెట్లు ఒంగి పోయి, కారు పరుగులు తీస్తూ ఉంటే నా కళ్ళు కిటికీ కి అంటించి మనసులో ఆ రంగుల ప్రకృతి చిత్రాలని నిరంతరం నా
కళ్ళ కమెరా ల తో చిత్రాలు తీసుకుంటూ ,నేను .

అన్నవరం వస్తున్నాది  అని ఎత్తైన కొండలు చెప్పాయి , ఆ కొండ దారి దాట గానే ,రెండు వేపులా అందం గా పేర్చి పెట్టి , పసుపు రంగులో మామిడి పళ్ళు ఎంత నోరు ఊరించాయో , వెనకే వరసగా మామిడి తోటలు ఒక్కో చెట్టు కి ఎన్ని కాయలో , ఆగుదామా ?అని అడిగే లోపల మా చల్తి కా నామ్‌ గాడీ ఎక్కడా ఆగదు అని ఘామ్మని వంద మైళ్ళ స్పీడ్ లో పరుగులు పెడుతున్న కారు ని ఆపమంటావా ? అని ఒక చూపు నా మాట ని బంధించింది .

అదేమిటో ,మామధ్య ఒక్కోసారి మాటలే అక్కరలేదు ,అలా అర్ధం అయిపోతూ ఉంటాయి అన్నమాట ..
మరి ముప్ఫై ఏళ్ళ పైన  సాహచర్యం కదా ..

రాజమండ్రి దగ్గర పడింది ,నేను నావిగేటర్‌ అంటే దారి చూపు మహిళ ని కదా , ఎక్కడైనా ఆగుదాం అని ఆకలి అని ఆత్మా రాముడి సంకేతాల తో ఆగాం ..ఒక చెట్టు కింద ,రోడ్డు ప్రక్కకి కార్‌ ఆపి .

చేతులు సానిటసెర్ తో కడిగేసుకుని ,అబ్బ ఎంత సంతోషమో ,పెద్ద గొప్ప పని చేసాం అని, చేతులు శుభ్రమా ? అదేమిటి అనే రోజులు పోయాయి కదా ,ఇడ్లీ లు శుభ్రం గా లాగించాం ..ఎందుకైన అని కారప్పొడి కూడా పడేసాను .మరీ దృష్టి తగులుతుందని ఒక్కటి మిగిల్చాం ,డబ్బా లో ,వేడి గా కాఫీ స్టీలు గ్లాసు లో ..అబ్బ ఎంత హాపి యో ,హోటల్ బాదర బంది లేదు అని .. కాసేపు కాలర్‌ ఎగరేశాను మరి ..నా గొప్ప నేనే చెప్పుకోవాలి కదా ,గుర్తించే  వారెవరు? ఇంట్లో ??

కడియం లో పూల గుత్తులు రా రమ్మని పిలిచాయి ,మల్లె మాలలు పిలిచాయి ..అబ్బే మా బండి ఎక్కడా ఆగదు .అంటూ వెళ్ళి పోతున్నాం ..చోదకుడి దృష్టి అంతా ముందు ఉన్న రహదారి మీదే ,హ్మం ..మల్లె పూల పరిమళాలు , అయ్యో ! కాసిని గుప్పెళ్ళతో లాక్కుని ,మనసు లో నింపుకున్నాను ..

నా పక్కన ఒక సైకెల్ మీద ఒక యువకుడు ,పొడవాటి , ఏడు అడుగులు అయినా ఉంటుంది ,చెట్టు కాండం అనుకుంటా ,భుజం మీద సరిగ్గా మధ్య లో ఆంచి ,రెండు చేతుల తో దర్జాగా ,పోస్ గా తొక్కుకుంటూ ,ఔరా ..అనిపించాడు .

రావుల పాలెం వస్తోంది ,రెండు గోదావరి పాయల వారధులు దాటేసాం  ,ట్రాఫిక్ వల్ల మా బండి స్లో అయింది . నాకు దిక్కులు చూడ్డానికి వీలు అయింది .

సెవెన్‌ సీటర్ ఆటో లో ,పసుపు రంగు పరికిణీలు కట్టుకుని ఎర్ర జాకెట్లు తొడుక్కుని ,బడి పిల్లలు చాలా మంది ఒకే ఆటో లో కనిపించారు ,అందరూ ఒక్క లాగే ముద్దుగా తయారు అయారు , మెడ లో మెరుస్తున్న గొలుసులు ,మడచిన ్రెండు జడలకి ,ఎర్రెర్రని రిబ్బన్లు ,ఎంత ముద్దు వచ్చారో ,అందరూ నోట్ పుస్తకాల లో ఏవో పాటలు అనుకుంటా ,కంఠతా పెడుతూ ,గాలి లో కి పాడుతున్నారు , పది మంది వరకు ఉంటారు ..

నాకైతే ఆగి ,వారి వెంట పడి పోయి ,ఆ పిల్లల నృత్యం చూసి రావాలని ఎంత కోరిక పుట్టింది ,ఇలా ఎన్నో ఆశల దీపాలు దారి పొడుగునా వెలిగించుకుంటాం మనం ..అవే మన జీవిత మార్గం ..

వారి నగలు గిల్టు వి కాని ,టాటా చెపితే వారి కళ్ళ ల్లో మెరిసిన నవ్వుల రంగులు మటుకు పూర్తిగా నిక్కచ్చి బంగారమే ..

మోటార్ సైకెల్స్ మీద చేతిలో ఒక చంటి పిల్లాడు ,భుజాన వేలాడుతున్న లేడేస్ బాగ్‌ , తల లో వేలాడుతున్న రెండు మూరల మల్లె మాల ,ముందు సేట్ పై మరో పాప ,ఇంత మంది ని బాధ్యత గా ఏదో గమ్యం చేరుస్తున్న భర్త ,ఎంత ముచ్చట గా ఉన్నారో , నానో కార్‌ లో ఈ ఆనందం వస్తుందా ? నాకు ఒక ప్రక్క ,ఆ భుజాన బాగ్ ,ఆ పిల్లాడు ,ఎలా బాలంస్ చేస్తుందని కంగారు ..ఆవిడ కేం .దర్జా గా వెల్ళి పోతుంది ,భార్యల కి భర్త ల మీద ఎంత నమ్మకం ? తమని క్షేమం గా చేరుస్తారు అని ..

మరొక చోట ,ఏదో దేవుడి పెళ్ళి ,అందరూ హడావిడిగా పట్టు చీరలు ,నగలు , పూలు తల లో మామూలే ,చెప్పాలా ,దేవుడి పెళ్ళి కి అందరూ పెద్ద లే అన్నట్టు ఊరు ఊరు అంతా ,తరలి వెళుతోంది .. మా బండి కాస్త మంద గమనం తో పెళ్ళి నడకలు నడిచింది ..

ఇంకెంత సమ్యం ? అంటూ మా మరిది ఫోన్లు ,ఇదిగో వచ్చె ..వచ్చేసాం ..

గూడెం వచ్చాం , మనసు మన సాహిత్యం స్నేహితురాలి ఇంటికి చేరి ,సాహిత్య సుమాల్ సౌరభాలు కాసిని మూట కట్టుకుంది ..బాబోయ్ ఇలా నచ్చిన చోటు కి పరుగులు తీసే మనసే లేక పోతే ఏమై పోయే వాళ్ళం ?? మనం ..అని సంతోషం ..
ఎంత అల్ప సంతోషులం ...పూల వాసన్లు మూట కట్టుకుని మురిసే ముదితలం కాదా .. కదా మనం ..

అలా తోడు గా వర్షం ఆగి ఆగి పడుతూనే ఉంది ..ఇంతలో అదిగో ఏలూరు ఆశ్రమ కాలేజ్  వచ్చేసింది ,ఊరులో నుంచి వెళదాం అనుకుంటూ ,పొరపాటున బై పాస్ రోడ్ ఎక్కేసాం .మరి ఇది దర్జాగా ,విశాలం గా ఉంది అడ్డ దారులేల ?అనుకుని ఎక్కి ,మొదటి ఎక్సిట్ తీసుకున్నాం ..ఆ దారి గోపన్న పాలెం  మీదుగా మా అశొక్ నగర్ దగ్గరి తంగెళమూడి వంతెన కే చేరింది ,అనుకోకుండా ఒక పావుగంట ముందుగా గమ్యం చేరి ,ఒంటి గంట మేం అనుకున్న సమయానికే ఇంటికి చేరాం ..

వెనక్కి వచ్చిన ప్రయాణం కథా కమామీషు ,మరో సారి ..మరి ఉండనా ??