"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

7 జూన్, 2020

కొన్ని మాటల పోగులు..

ఓ కవిత రాద్దాం అని
కిటికీ తలుపు తెరిచాను
వెన్నెల స్వేచ్ఛగా ప్రవహించి ..ఆడుకుంది.
కవిత్వంతో.

అక్షరాలు కన్నీళ్లతో తడిసి
ముద్దై పోయాయి అని ఆర వేసాను..
అవిరైపోయి పైకి ఎగిరి పోయాయి
వాన చుక్కలుగా వెనక్కి వచ్చాయి..

ఆకు ఆకు కీ మధ్య
దూరం ఎక్కడుంది..
గాలి ఊసులుతో
కలుపుతూ కథలు చెపుతూ ఉంటే..

పూవు పూవు కీ మధ్య
ఎన్ని ఒప్పందాలో.. రంగురంగులు
పంచుకుంటూ..ఊసులడుతాయి
అరమరికలు లేని అక్క చెల్లెల్లులా..

ఒడ్డున  ఇసుకలో  దాచుకుంది
సంద్రం తన తీపి గతాన్ని
ఎన్నిసార్లు తడిమి చూసుకున్నా
కన్నీటి ఉప్పు పోదేమి..

ఆకాశం లో నక్షత్రాలు
నా చిన్నప్పుడు లెక్కకి అందేవి
వంద లోపలే నిద్ర వచ్చేది మరి
కోట్లు కోట్లు కి ఎప్పుడు పెరిగి పోయాయి ??

19 మార్చి, 2020

మరి కొన్ని మాటల మూటలు..వసంతం అంటే
నూతనంగా తోట
అలంకరణే..

పద్మం చుట్టూ
తిరిగే తుమ్మెదకు
బురద  ఊసు ఏల

మబ్బులు వర్షం
నీటిని కూర్చుకుంటూ
ఏమాలోచిస్తాయో ,
ఏ ఊరుకి ఎంత ప్రాప్తమో అని ..

పువ్వు చెప్పే కథ
ఎంత రహస్యామో
చెవి ఒగ్గి వినే తుమ్మెదకే ఎరుక.

గాలి వీచడం
వెనక ఎవరి శ్రమో కానీ
చెట్టు చేమా మాత్రమే
తలలుపుతూ గుర్తిస్తాయి.

పిట్టా చెట్టుల
బంధం ఎంత గట్టిదో కానీ
పాట పాడి ఋణం తీరుస్తాయి.

గడ్డి పువ్వు నేల
తల్లితో కబుర్లు చెప్తూ
దూరం పెరిగిన వృక్షాల
ఊసు మరిచిపోతుంది.

ఆకాశం పలు రంగులు
పరుచుకుంటూ
అంతు లేని ప్రయాణపు
ప్రయాస మరిచిపోతుంది.

ఉదయించే సూర్యుడి
పయనం ఎంత దూరమో
ఎప్పుడూ కొలిచినట్టు లేదు
అస్తమయం తప్పదు అని నిశ్చింత .


5 ఫిబ్ర, 2020

హేమంతంబాదం చెట్టు
ఆశలన్నీ రాల్చేసుకుని
హేమంతంలో
చివురులు వేస్తూ మాఘంలో
చేయెత్తి నమస్కరించింది ..

తోట నిశ్శబ్దంగా
ప్రార్ధిస్తూ , కిరణాల
వెలుగులో మొగ్గలని
తడిమి చూసుకుంది..

ఏ రంగో ఏమిటో
అంటూ ఆదుర్దా లేని
మొగ్గలు ఇష్టంగా
రంగురంగుల్లో విరిసాయి ..

హేమంతం
బరువు బాధ్యతలు
దింపేసుకునే కాలం అయితే
వసంతం తలకెత్తుకునే కాలం.

పొందడం ,
పోగొట్టుకోవడం
తిరిగి ఆశలు పెంచుకోవడం
ప్రకృతి నేర్పే పాఠాలు..

ఇవాళ్టి పోగేసిన మాటలు.

05 02 2020

19 జన, 2020

కొన్ని వాస్తవాలురాత్రి అయిందని చీకటి
చెప్పక ముందే ఆశల
రెక్కలు ముడుచుకు పోవడంతో
తెలిసింది..
రెక్కలు విప్పి ఆకాశంలో
ఎగరడానికి వెలుతురెందుకు
అని అమాయకంగా ప్రశ్నించకు..
ఆశలు మడిచి జేబులో పెట్టుకోడానికి
ఏవో కారణాలు కావాలిగా..

జిపిఎస్ చూసుకుంటూ చేసే
ప్రయాణంలో మిస్ అయినట్టే తెలియదు
మైలు రాళ్ళని..
ఋతువులు మారాయి అని
ఫేస్ బుక్ స్టేటస్ చెప్పింది.

కోకీలమ్మ సిగ్నేచర్ ట్యూన్
నా మొబైల్ కాలింగ్ లో
కొమ్మ కొమ్మకీ లేత ఆకులు
నా బెడ్ రూమ్ గోడ పై స్టిక్కర్ లో

ఎంత విశాలమో ఈ కాంక్రీట్ రోడ్లు
ఈ ఇరుకు మనుషులేం చేస్తున్నారు ఇక్కడ
అమెరికా యూరోప్ దేశాలకి వంతెనలు వేస్తాం
పక్కింట్లో వాడి ఊసు మనకేల ??

చిన్న చిన్న పిల్లలకు
పెద్ద పెద్ద జైళ్లు , అల్లరి చేస్తే
బడిలో పడేస్తాం అనే మాట లో
ఇంత నిజం ఉందని తెలియదు అప్పుడు.

వాస్తు చూసి కట్టిన ఇల్లే
ధారాళంగా వెలుతురు , ధనం
వచ్చి పడ్డాయి..పిల్లలేరి అంటే
మొబైల్ లో బొమ్మ చూపిస్తారేంటి ??

సముద్రం ఏదో ఒడ్డున
భూమిని కలుస్తుందని నమ్మాను
ఎన్ని ప్రయాణాలు చేసినా
క్షితిజ రేఖని కలవలేదే...

కలకీ వాస్తవానకి మధ్య
ఇంత పెద్ద అగడ్త ఉందని ఎవరూ
ఎందుకు చెప్పలేదు..
వాస్తవమే కల అని ఒప్పించుకునే
సరికి ఇంత సమయం పట్టింది..


28 అక్టో, 2019

కొన్ని మాటలు ఇలా ..

సీతాకోక చిలుకలు
నా చుట్టూ గుండ్రంగా
తిరుగుతూ ఒక్కో రంగూ
రాల్చేసుకున్నాయి ..
నా కలలేమో ..అవి ..

ఆకాశం లో పక్షులు
వరుసగా వరుసలు కడుతూ
తూర్పు దిక్కున
సూర్యుడికి సందేశం మోస్తూ

కిరణాలు ఆకుల మధ్య నుంచి
జారి నేల మీద ముగ్గులు పరిచి
నేలమ్మకి జేజేలు పలుకుతూ
వినమ్రంగా ..

ఆకాశం కొన్ని రంగులు
దాచుకుంది , రహస్యంగా
సాయం సంధ్య కై
పరిచి విస్మయ పరచాలని ..

తోటలో పూలు రంగు హంగుగా
వెల్లి విరిసి ..
మోహనంగా ఎదురు చూస్తూ
ఆ మధుర గాయం కోసం .

అలలు అలలు గా
ఎగిసి పడుతూ , ఎన్ని యుగాలుగా
అలసి పోయినా , తీరాలు
అందవూ , ప్రాప్తమూ పొందవు .

పసి పిల్ల నవ్వులా
ఎగిసిపడ్డ నవ్వు
ఎదిగిన బిడ్డలో
కలిసి మురిసిపోయింది ..

పన్నీరు చల్లితే
గాలి సుమధురం అవుతుందా ?
పెదవుల స్పర్శ తగలాలి కానీ
వెదురు వేణువు అవదూ ...

అన్ని మతాలూ చేర్చేవి
ఆ స్వర్గ ధామ గుమ్మం వరకే
నీకుందా మరి ఆ తాళం చెవి
వెతుక్కో ఇప్పుడే !

జీవన  దారి లో పారేసుకున్న
సంపదలు మణి మాణిక్యాలూ
దొరికేను ఆ తోట లో .
నీ మనసు పూసే ఆ తోటలో ..

మైమరిపించే కోకిల గానం
వినిపించే తోట లోకి వచ్చావా ?
నువ్వేం తెచ్చావు ?
సవిరించుకున్న నీ గుండెని తెచ్చావా ?

వెను వెంటనే
వెను తిరిగి పారిపోయే నీ
పీడ కలని ఈ రేవులో పాతేయ్
ఇక్కడ ఈ పాపాల రేవులో .. మరి మొలవదు .

దయ్యమూ దేవుడూ
కలిసి నివసించే ఆ అంతకరణలో
ఎన్నెన్ని గులాబీలూ ,ఎన్ని ముళ్ళూ ..
అన్నీ ఒక్క చెట్టుకే ..

30 సెప్టెం, 2019

ఇవాళ్టి కబుర్లు ఇవి

ఏవో కొన్ని మాటలు..ఇలా..

ఎన్నాళ్ళయిందో
కలుసుకుని అంటూ
హోరున ఒకటే కబుర్లు
సముద్రం , మబ్బులు..

సూర్యుడిని కప్పేస్తూ
మబ్బు నాదెంత భాగ్యమో
అంటూ మురిసింది
కడ్డీ అంచు వెండి జరీ చూసుకుని.

వాన జలతారు కుప్పలు
ఏరుకుందామని , పాపాయి
పరికిణీ అంచులు ఎత్తి పట్టింది
అమ్మ  కేకలేస్తూ తిట్టింది ..
ఇంతలోనే తానూ పాపగా కలిసింది.

వాన రాక కై చెట్లు
మూగగా ఎన్నాళ్ళు
ప్రార్ధించాయో కానీ
గలగలా నీటి బొట్లు
అర్ఘ్యం ఇచ్చాయి ..

మా ఇంటి ముందు
బాదం చెట్లు
ఆకాశానికి మెట్లు
వేస్తున్నాయి.

సన్నజాజి సంపెంగ
హాస్యాలు ఆడుకున్నాయిట
నువ్వెంత నాజూకు అంటే
నువ్వెంత ఘాటు అంటూ ..

ఇవాళ్టి కబుర్లు ఇవి.

వైజాగ్
30 09 2019 .

29 జులై, 2019

అద్దె ఇల్లు ఖాళీ చేసారువిరిగిన కుర్చీ చేయి  ఒక్క మేకు
మటుకు వేలాడుతూ ఒకప్పటి
మోచేతి ఆసరా అని ఘోషిస్తూ ,ఒక మూల ..

ఎంత దుమ్ము ఎత్తి పోసిందో
ఊడిపోయిన పుల్లలతో
కట్టు ఊడిపోయి , నీరసంగా మూలుగుతూ ఒక మూల ..

గోడ మీద మోసిన ఏసు క్రీస్తో ,శంకర మహాదేవుడో
పటాన్ని , నలుపలకల తెల్లని ఖాళీ పైన ఒక మేకు
దేవుళ్ళూ ఇల్లు ఖాళీ చేస్తున్నారు .

పిల్లల అడుగుజాడలు దుమ్ములో
పికాసో చిత్రం లాగా గజిబిజిగా , కొత్త ఇంటి ఉత్సాహం తో
పిల్లల అరుపులు ఖాళీ గోడలకి కొట్టుకుని , వాయిద్యం లేని శివమణి

అంతా హేల గోల , ఉత్సాహపు కోలాహల వేళ
అమ్మా నాన్నల ఆట కి మరో కొత్త నెలవు దొరికింది
కూలీల అలసట వెనక కూడబెట్టిన సామాన్ల సాంద్రత

ఏ గృహమేగినా ఏముంది ?
చివరాఖరి గృహంకి వీడ్కోలు తప్పదు కదా !
నువ్వెంత మోసుకు వెళతావో అని తమాషాగా చూస్తున్నా ,తమాషా !