"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

18 ఆగ, 2015

కవి హృదయం


కవి హృదయం అని ఒకటి 
ఉంటుందా ? అని నాకెప్పుడూ అనుమానం ..
మాటలని గుండె కవాటంలో బిగించి పెడతారా ?
వేళ్ళ చివర నృత్యాలని బంధించి పెడతారా ?
ఆకశాన ఒక మబ్బు విడిచి వెళుతుంది
ఒళ్ళో పిల్లాడిని లాలించినట్టు
ఊహలు పిలకలేసి మొలుస్తాయి ,చిట్టి చిట్టి
పిలకలు చుట్టూ పేర్చుకుని అరటి మొక్క లా
హరితం గా లేత పల్లవం గా ..
ఇంక మాటలు బొమ్మల కొలువు లో
బొమ్మలలాగా మెట్లు మెట్లుగా పరవడమే తరువాయి
కొన్ని తల లూపుతూ కొండ పల్లి బొమ్మ లా వచ్చి
కూర్చుంటాయి ,మరి కొన్ని మేత మేసే ఆవు బొమ్మలు
నడిచినట్టూ ఎటో వెళ్ళి పోతూ ఉంటాయి ..
పూల పరిమళమూ ఉండదు ,
వెన్నెల లేపనమూ ఉండదు ,
అన్నీ మనసు అద్దం మీద పరుచుకున్న
చిత్ర విచిత్రాలు , నాకే ఆశ్చర్యం ఏ దేశ
దిమ్మరులు ఈ పదాలు ఎలా వస్తాయి ? అని .
మందారాల మకరందాలు
మల్లెల సుపరిమళాలు పూయిస్తాను
నా ఇంటి ముందు పెరట్లో ,
నాకసలు పెరడే లేదు ,అయినా సరే ..
ఆకలి దప్పులు ఊసే తెలియదు
అక్షరాల అన్నం వడ్డిస్తూ ఉంటే
ఎవరి చేతి పుస్తకానికో
ఈ నల్లటి ఆవగింజల్లాంటి సేద్యం ?
కవితలా ? కథలా ? ఏమో
మబ్బులు వర్షం కురిపిస్తాయా ?
దేశాంతరం పారి పోతాయా ?
ఎవరికి తెలుసు ..
ఇవాళ పండగ అని పుష్పించదు
పూవు ,ఇవాళ పుష్పించిన పూవునే
నువ్వు ఏరి కో్రుతావు .. పూజకి
నీలో జన్మించిన అక్షరాలకి నువ్వు
కారణం కాదు , కాలాల శోధన లో
కనుగున్న ప్రహేళిక నీ రాతలు .
ఎవరికోసమో అని రాయవు ,
ఎవరి కోసమో కల గనవు ..
ఎవరో ఒకరు చదువుతారు అన్న స్పృహ
కల ముందు వచ్చే మెలకువ లాగా
పలచగా ఆవరించుకుని ,మేలి ముసుగు లో
నిన్ను ఆకర్షిస్తూ , అయోమయంకి గురి చేస్తూ
ఎన్నో ఎన్నెన్నో అక్షరాలు ..
రక్త ప్రవాహం లో ధమనుల మధ్య
ప్రవహిస్తూ అస్తిమత పరుస్తూ ఉంటాయి .
నీ ఆంతర్యం నిన్ను నిలవనీయదు
నీ మనసెప్పుడూ నీకు విరోధి లా
యుద్ధాలు జరుగు్తున్నా ,వెన్నెల చమక్కుల
మీదే రాస్తావు కవిత్వం , ఎందుకంటే నీవు
చీకటి రాత్రి ని నీలో దాచుకున్నావు ,
వెన్నెల కాంతి ని ఎప్పుడూ అరువు తెచ్చుకుంటూ ఉంటావు ..
నీ అక్షరాలు నిన్ను
ఆవహించే శాంతి
నిన్ను ప్రేరేపించే అశాంతి
నిన్ను నిలువునా దగ్ధ పరచే అగ్ని కీలా కాంతి
గ్రహాల మధ్య కాలంని కొలిచే కాలమాని
నీ అక్షరాలు కాంతి వేగం తో
నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ఒక
సముద్ర ద్వీపం లాగా విసిరేస్తాయి ..
వంతెనలు వారధులూ వేసుకుంటూ
ఆ అక్షర జాలం తో నే
నే తిరిగి తిరిగి వస్తూంటాను ..మీ ముందుకి
అక్షర దీప కాంతి వెలుతురులో దారి
వెతుకుతూ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను .

4 కామెంట్‌లు:

  1. ఎన్‌ ఎమ్‌ రావ్ బండి గారికి
    ధన్యవాదాలు .. నా కవి హృదయం నచ్చినందుకు సంతోషం .

    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి
  2. నీ మనసెప్పుడూ నీకు విరోధి లా
    యుద్ధాలు జరుగు్తున్నా ,వెన్నెల చమక్కుల
    మీదే రాస్తావు కవిత్వం , ఎందుకంటే నీవు
    చీకటి రాత్రి ని నీలో దాచుకున్నావు ,
    వెన్నెల కాంతి ని ఎప్పుడూ అరువు తెచ్చుకుంటూ ఉంటావు ..
    నీ అక్షరాలు నిన్ను
    ఆవహించే శాంతి
    నిన్ను ప్రేరేపించే అశాంతి
    కవిత్వం కవి లోపలి కల్లోలాల చిత్ర ణే

    రిప్లయితొలగించండి
  3. నీ మనసెప్పుడూ నీకు విరోధి లా
    యుద్ధాలు జరుగు్తున్నా ,వెన్నెల చమక్కుల
    మీదే రాస్తావు కవిత్వం , ఎందుకంటే నీవు
    చీకటి రాత్రి ని నీలో దాచుకున్నావు ,
    వెన్నెల కాంతి ని ఎప్పుడూ అరువు తెచ్చుకుంటూ ఉంటావు ..
    నీ అక్షరాలు నిన్ను
    ఆవహించే శాంతి
    నిన్ను ప్రేరేపించే అశాంతి
    కవిత్వం కవి లోపలి కల్లోలాల చిత్ర ణే

    రిప్లయితొలగించండి